మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

సాన్ జువాన్ మారణకాండ

మేం సాన్ జువాన్ హత్యాకాండ అనిపిలిచే మరో భయంకరమైన మారణకాండ 1967 జూన్ 24 వేకువ

జామున జరిగింది. అది మమ్మల్ని అకస్మాత్తుగా ముంచెత్తింది.

గని శిబిరమంతా సాన్ జువాన్ పండుగ రోజున మేం సంతోషంగా పేల్చే టపాకాయల చప్పుళ్ళతో, బాణసంచా చప్పుళ్ళతో మార్మోగి పోతుంది. ఈ డమడమల మధ్యనే సైన్యం వచ్చి కాల్పులు మొదలెట్టింది. మొదట జనం చాలా గందరగోళ పడ్డారు. మొదట.అందరూ ఈ చప్పుళ్ళు మా బాణసంచావే అనుకున్నారు.

సైన్యం ఒక దుష్టపథకం వేసుకునే వచ్చింది. మామూలు దుస్తుల్లో కొందరు వచ్చారు. వాళ్ళు కాన్ కనిరి స్టేషన్‌కు సరుకుల కార్లలో వచ్చి కార్లలోంచి దిగుతూనే కనబడ్డ వాళ్ళనల్లా కాల్చేయడం మొదలెట్టారు. ఆ దృశ్యం ఎంత ఘోరమో! అబ్బ – దారుణం!.

వేకువనే యూనియన్ సైరన్ కూత వినిపించింది. అది రోజుకు ఒక్క సారే ఉదయం ఐదింటికి మమ్మల్ని నిద్ర లేపడానికి కూస్తుంది. అలాకాకపోతే మరేదైనా అత్యవసర సందర్భంలో మాత్రమే సైరన్ మోగిస్తారు. ఆ రోజు చాల పెద్దగా సైరన్ వినిపించడంతో ఏదో మూడిందనుకుని మేం రేడియో పెట్టాం. సైన్యం వచ్చి ఊరిమీద దాడి చేస్తోందనీ, అందరూ వెంటనే వచ్చి రేడియో స్టేషన్ ను కాపాడుకోవలసి ఉందనీ మేం రేడియోలో విన్నాం.

వెళ్దామని మేం తలుపులు ఇలా తెరిచామో లేదో వాళ్ళు కాల్పులు ప్రారంభించారు. అంటే వాళ్ళప్పటికే వీధుల్లో కాల్పులు జరపడానికి సిద్ధమై కూచున్నారన్నమాట.

వాళ్ళిక ప్రతి ఒక్కళ్ళమీదా, ప్రతి వస్తువు మీదా కాల్పులు జరిపారు. ఎటు చూసినా చప్పుడే చప్పుడు. తుపాకి గుళ్ళ హోరు.

ఇంత దారుణం ఎందుకు? ఎందుకంటే మర్నాడు మా ప్రధాన కార్యదర్శుల సమావేశం జరగబోతున్నదనీ, దాంట్లో మళ్ళీ ఒకసారి మా సమస్యలు చర్చించబడతాయనీ ప్రభుత్వానికి తెలిసింది గనుక ఈ సమావేశం జరగకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యం.

రేల్వే స్టేషన్ దగ్గర గాయపడి పడిపోయినవాళ్ళను ఎత్తుకొని తీసుకు రావడానికి స్త్రీలను ఒప్పించాం. అంతేగాక, అప్పటికి కోపోద్రిక్తులయి ఉన్న మగవాళ్ళను బయటికి పోకుండా చూడమనీ, బయటికి పోయారంటే వాళ్ళు బుల్లెట్ల పరంపరలో తూట్లు పడిపోవడమేనని మేం స్త్రీలకు చెప్పాం.

మేమారాత్రి ఎన్నెన్ని దుస్సహ దృశ్యాల్ని చూశాం! ఒక చెక్కకాలు ఉన్న కార్మికుడు తన పాత పిస్టల్ పట్టుకుని సైన్యాన్ని ఎదరించడానికి పోవడం నేను చూశాను. అయితే ఆయన దగ్గర్నుంచి మేం ఆ ఆయుధం లాక్కొని దాచేశాం. అతనిది చెక్కకాలు అని చూశాక సైన్యం అతణ్ని ఏమీ అనలేదు.

పొట్టలో బుల్లెట్ దూసుకుపోయిన ఒక గర్భిణి స్త్రీని నేను అంబులెన్స్ లో చూశాను. ఆ గర్భస్త శిశువు ప్రాణం అప్పుడే కడతేరిపోయింది.

ఇంకొక స్త్రీ “నా కొడుక్కేమయింది? ఓరిదేవుడో? అయ్యో… నేనేమిజేతురో…” అని శోకాలు పెడుతోంది. నేనా పిల్లవాణ్ని ఎత్తుకొని అంబులెన్స్ లో పెట్టడానికి గబుక్కున ఇంటిబయటికి పరిగెత్తుకొచ్చాను. ఆ పసికందును అంబులెన్స్ లో పెట్టేముందు ఒక్కసారి ఒళ్ళోకి తీసుకుని చూశాను…. ఆ బిడ్డడి తలలోంచి దూసుకుపోయిన బుల్లెట్ పుర్రెను రెండు వైపులా రంధ్రాలో లోపలేమీ లేకుండా చేసింది.

ఆ రోజు నేనెన్నటికీ మరిచిపోలేని భయంకర సంఘటనలెన్నో జరిగాయి. అవి నాకింకా బాగా గుర్తు. ఎంతెంత దారుణమైన సంఘటనలవి! కొన్ని కుటుంబాలు అవశేషం లేకుండా తుడిచి పెట్టుకు పోయాయి. సైగ్లో-20 వీథుల్లో రక్తనదులు ప్రవహించాయి. కొందరు నిద్రలో ఉండే తూటాలు తగిలి చనిపోయారు. సైనికులు ఆ రోజు పిచ్చిగా, ఆటవికంగా తమ కళ్ళు దేనిమీద పడితే దానివైపు తుపాకి పేలుస్తూ స్వైర విహారం చేశారు.

ఒక ఇంట్లోకి బులెట్ వచ్చి ఒక వ్యక్తిని చంపేసి అతనిలోంచి దూసుకొని వెళ్లి గోడను చీల్చుకొని అతని భార్యలోంచి కూడ దూసుకు వెళ్ళింది. ఎంత క్రూరమైన యాదృచ్ఛికత! వాళ్ళ శిశువు అనాథ అయి ఇప్పుడు సైగ్లో-20లోనే బతుకుతోంది.

సైన్యం రేడియో స్టేషన్ ను చుట్టుముట్టింది. రేడియో స్టేషన్లో పని చేస్తున్న వాళ్ళందరినీ సైన్యం మట్టు పెట్టదలచింది. మా నాయకుడు రొసెండో గార్షియా మైస్ మన్ తన ఇంట్లోంచి బయటికొచ్చి ట్రాన్స్ మిటర్ రక్షించడానికి వెళ్ళాడు. భార్య అతణ్ని ఆపే ప్రయత్నం చేసినా, కర్తవ్యమే ముఖ్యమని చెప్తూ రొసెండో వెళ్ళిపోయాడు. ఆయన రేడియో స్టేషన్ చేరేసరికల్లా సైన్యం మా వ్యాఖ్యాతను గాయపరిచింది. అతని కాలులో దెబ్బ తగిలింది. మరొక సైనికుడు ఆ వ్యాఖ్యాతను సూటిగా కాల్చి చంపేయబోతున్నాడు. రొసెండో ఆ సైనికుణ్ని కాల్చి చంపేసి వ్యాఖ్యాతను కాపాడాడు. ఇక భీకరంగా ఎదురుబొదురు కాల్పులు సాగాయి. మరింత ఎక్కువ మంది సైనికులు అక్కడికి చేరారు. వాళ్ళు రొసెండోను చేజిక్కించుకొని ముక్కురంధ్రాల్లోకి రెండుసార్లు కాల్పులు జరిపి ఆయన్నిహత్యచేశారు. ఆయన అలా ప్రజల సందపను కాపాడుతూ .వీరుడుగా మరణించాడు. ఆ దారుణకాండలో ఎంతమంది చనిపోయారో ఎవరికీ లెక్క తెలియదు.

మరుసటి రోజు వాళ్ళు చనిపోయిన వాళ్ళందర్నీ, వందలాది మృతదేహాల్ని శ్మశానంలో ఖననం చేశారు. నేనక్కడే ఓ పిట్టగోడ మీదికెక్కి మాట్లాడాను. “మనం ఈ దుర్మార్గాన్ని ఊరికే పోనీయగూడదు. వాళ్ళిట్లో కార్మికవర్గాన్ని దిక్కులేకుండా చంపేయడామేనా? అనంత త్యాగాలు చేసే జనాన్ని వాళ్ళెట్లా చంపెయ్యగలరు? వాళ్ళు మనపట్ల ఎంత అక్రమంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ప్రభుత్వమే మన జీతాలు కొట్టేసింది. మనం అడిగేదల్లా మనకు న్యాయంగా రావలసిన డబ్బులే. మనకు రావలసింది అడిగినందుకే వాళ్ళు మననిట్లా ఊచకోతకోస్తున్నారు. ఇది అక్రమం, అన్యాయం, దుర్మార్గం, ఇది చేసేవాళ్ళు పిరికి పందలు. దొంగలంజ కొడుకులు” అని నేను కోపంతో, ఉద్వేగంతో అరిచాను.

అప్పటికి గెరిల్లాల గురించి విని ఉన్నానుగనుక “వీళ్ళకు అంత దమ్ముంటే ఆ కొండల్లో కెందుకు పోరు? అక్కడ వీళ్లను మట్టికరిపించాడానికే ఆయుధాలు పట్టుకొని ఎదురు చూస్తున్న జనం ఉన్నారు. అక్కడికి వెళ్లి పోట్లాడరాదూ? ఎందుకు ఇక్కడికొచ్చి నిస్సహాయులైన, నిరాయుధులైన జనాన్ని చంపుతారు? కార్మికుల శ్రమ సృష్టించిన సంపదతోనే సుఖ ప్రదమైన జీవితం గడుపుతూ, ఇళ్ళూ, కార్లూ, సెలవులూ అనుభవిస్తూ, ఆ కార్మికుల్నే చంపడానికి మీకు చేతులెట్లా వస్తాయి?” అన్నాను.

అలా నేనారోజు అక్కడ చెప్పని విషయమే లేదు. “మీ చేతుల్లో ఆయుధాలున్నాయి గనుక ఇలా మా శవాలమీది నుంచి నడిచిపోవచ్చుననుకుంటున్నారా? . మేం కూడా సిద్ధపడగలం. మాకు మీకంటే సాహసులైన పురుషులెంతో మంది ఉన్నారు. కేవలం మా చేతుల్లో ఆయుధాలు లేకపోవడంవల్లనే ఈ హత్యాకాండలో మేం ఆత్మరక్షణ చేసుకోలేక పోయాం ” అని కూడా అన్నాను.

ఆ రోజు జూన్ 25.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.