శబరి

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– గౌతమి సి.హెచ్

ఇంట్లోకి వస్తూనే, “శబరీ!! ఇప్పుడెలా ఉందే నీ ఒంట్లో?” అంటూ చేతిలోని సంచిని పక్కన పెట్టి, భార్య దగ్గర కూర్చుంటూ అడిగాడు సుబ్బారావు.

“నాకేమైందని అలా అడుగుతున్నావు, నే బానే ఉన్నాలే అయ్యా…అనవసరంగా లేనిపోని భయాలు పెట్టుకోకు.” అంటూ నీరసం నిండిన గొంతుతో అంది శబరి. తన బాధకి చిహ్నంగా కంటిచుట్టూ చేరిన నీటిపొరని భార్యకి కనపడకుండా చేయడానికి విఫలప్రయత్నం చేస్తూనే “నువ్వెట్టా ఉండేది కనపడతానే ఉందిలే, లే.. లేచి ఈ పండ్లు తిను” అంటూ ఒక చేత్తో భార్య తలని, మరో చేత్తో భుజం పట్టుకొని పైకి లేపి కూర్చోపెట్టాడు.

“ఇప్పుడివన్నీ ఎక్కడ్నించి పట్టుకొచ్చావు? నేను ముందే చెప్పాను గదా, నాకోసం ఏమీ పట్టుకురావద్దు, పిల్లగానికి తెమ్మని. ఎందుకు ఈ అనవసర ఖర్చు.” అంటూ పూడుకుపోతున్న గొంతుతో ఒక్కొమాట కూడబలుక్కోని ముద్దముద్దగా అంది.

“ఆడికి కూడా తెస్తానులేయే, ఇక నువ్వేం మాట్లాడక ఇవి తినేసి ఆ డాక్టరమ్మ ఇచ్చిన మందు బిళ్ళలేసుకొని పడుకో, నేను ఇప్పుడే వత్తాను.” అంటూ బయటకి నడిచాడు.

“ఏరా సుబ్బి!! ఈ టైంలో ఇలా వచ్చావు…! రేపు కూడా పనిలోకి రానని ఉదయమే చెప్పిపంపావుగా..?” అడిగాడు రామారావు ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో వాకింగ్ చేస్తూ.

“అవునయ్యగోరు, కానీ ఇప్పుడొచ్చింది పని గురించి కాదండీ.”

“మరి…!?”
“అది…అది… అదేటంటే అయ్యగారు..!”
“డబ్బేమన్నా కావాలా?”
“అబ్బే లేదయ్యా.”
“మరి…! ఇంకేం కావాలో అడుగు?”

“ఏమండీ రేపు ఉదయం గుర్తుచేయండి చపాతీలు మిగిలాయి పనమ్మాయికి ఇవ్వాలి.” అంది అప్పుడే లోపలినుంచి వచ్చిన రామారావు భార్య, చేతిలోని గిన్నెని భర్త వైపు చూపిస్తూ.

“ఏం ఎందుకు మిగిలాయి పిల్లవాడు తినలేదా?” అడిగాడు రామారావు గిన్నెలోకి చూస్తూ.

“లేదండీ..వద్దు వద్దు అంటున్నా వినకుండా సాయంత్రం ఆ మ్యాగీ తిన్నాడు, ఇప్పుడేమో ఆకలిగా లేదు అని ఏమీ తినకుండానే పడుకుండిపోయాడు. ఇవేమో మిగిలిపోయాయి, ఉదయానికి ఎలాగో తినము కదా అందుకే కనీసం ఆ అమ్మాయికి ఇస్తే తింటుందేమో అని.” అంది సుభద్ర.

“మీకు అభ్యన్తరం లేకపోతే అవి ఇలా ఇయ్యండమ్మా.” అంటూ చేతులు ముందుకు జాపాడు సుబ్బడు. అలా చేతులు చాపి దీనంగా అడుగుతున్న సుబ్బడుని చూసిన భాగ్యానికి జాలి వేసింది.

“మీరేమి ఆలోచించకండమ్మా, ఇప్పుడున్న నా పరిస్థితికి అవే పంచబక్ష పరమాన్నాలతో సమానం.” అంటూ చపాతీలు ఇవ్వమన్నట్లు చూసాడు. భర్త కూడా ఇవ్వమన్నట్లు సైగ చేయడంతో ఆ గిన్నెలోని చపాతీలు తీసి అన్యమనస్కంగానే ఒక కాగితంలో చుట్టి సుబ్బడు చేతిలో పెట్టింది. అవి తీసుకొని వెనుతిరిగి వెళ్ళబోతున్న సుబ్బడుని చూసి “అవునురా సుబ్బి! ఏదో అడగాలని వచ్చావు, అడగకుండానే వెళ్ళిపోతున్నావేంటి.?” అని అడిగాడు రామారావు.

“గుడికెళ్ళి భగవంతుని ఎదుట నించున్నంత మాత్రాన మన కష్టాలు తీరతాయో లేదో తెలియదు కానీ నేను ఎప్పుడు మీ దగ్గరకొచ్చినా నేను అడగాలనుకున్నది అడగకుండానే నా చేతికి అందుతుంది. ఇంక అడగవలసిన అవసరం ఏముంటుంది, అందుకే ఎళ్ళిపోతున్నాను.” అంటూ బదులిచ్చాడు.

“అంటే, నువ్వొచ్చింది వీటి కోసమేనా..!?”

“అవునయ్యా!! నెల రోజుల క్రితం నా ఇంటిదానికి సుస్థి చేసింది. ఒంట్లో అస్సలు బాగోలేదు… కానీ 4 రోజుల నుంచి మరీ అడుగు తీసి అడుగేయటం కూడా కష్టంగా ఉండడంతో నేను కూడా సరిగ్గా పనిలోకి పోవడంలేదు…దాంతో ఇంట్లో 3 పూటలా తిండికి కూడా గడవటంలేదు. నా కాడుండే పైసలన్నీ దాని మందులకి, వాటికే సరిపోతున్నాయి. పైగా ఈ నడుమ బయట కూలికి కూడా పోకపోవడంతో ఆ కాస్త పైసలు కూడా రాలేదు. ఇక నా బిడ్డ ఆకలి తీర్చడం ఎలాగ అని ఆలోచిస్తూ ఇటొచ్చాను. ఇక వీటితో ఈ పూటకి ఆడి ఆకలి తీరుద్దామని ఎళ్తున్నాను.” అన్నాడు నేల చూపులు చూస్తూ.

‘అంటే! శబరి ఆరోజు నాతో అన్న మాటలు…అయితే అప్పటికే తన ఆరోగ్య పరిస్థితి గురించి తనకి తెలుసా? అందుకే నాతో అలా చేయించిందా!’ అనుకొని బిడ్డ పట్ల ఆమెకున్న ప్రేమకి ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకొని “నీ భార్యకి అంత బాగా లేకపోతే నాతో ఒక్కమాట చెప్పుండొచ్చుగా?” అన్నాడు.

“ఇప్పటికే మీరు నాకు చానా సాయంచేసారు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక చెప్పలేదయ్యా. ఒంట్లో ఎంత బాగలేకపోయినా అది బయటకు తెలియకుండా దాచిపెట్టి ఇక్కడి దాకా తెచ్చుకుంది నా పెళ్ళాం. ఎంత కష్టం వచ్చినా ఏరోజూ పనిలోకి ఎళ్ళడం మానలేదు. చివరాకరికి ఒంట్లో సత్థువంతా అయిపోయి ఇక లేవలేని స్థితికి వచ్చిన తరువాతే ఇలా ఇంటి పట్టున ఉంటుంది. అప్పటివరకు నాకు కూడా చెప్పకుండా దాచింది. నేను ఎన్ని సార్లు చెప్పినా నా మాటలు పెడచెవిన పెట్టేది. ఓపిక ఉన్నన్నాళ్ళు నాకోసం నా కొడుకు కోసమే పాకులాడింది, ఇప్పుడేమో ఇలా దాని పానం మీదకి తెచ్చుకుంది.” అంటూ కళ్ళ నుండి ఉబికి వస్తున్న కన్నీటి బొట్టుని కనురెప్పల చివర కట్టడి చేస్తూ అన్నాడు.

“అంతగా బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయావా?”

“అది కూడా అయ్యింది అయ్యగారు…దాని అవస్థ చూడలేక ఆసుపత్రికి వెళదాం రమ్మని నాలుగు చివాట్లు పెట్టడంతో ఆసుపత్రికి రావడానికి ఒప్పుకుంది. కానీ వారం రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది. వాళ్ళు కూడా దాని పరిస్థితి చూసి, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు వెంటనే పట్నంకి పోయి పెద్ద ఆసుపత్రిలో చూపించుకోమన్నారు. రెక్కఆడితే కానీ డొక్కాడని బ్రతుకులు మావి, మా బోటోళ్ళకి అంత పెద్ద ఆసుపత్రులకు ఎల్లే ధైర్యం ఎక్కడిది అయ్యా…!”

“పోనీ, ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్య శ్రీ పధకం కింద ఇక్కడే ఎక్కడో ఒకదగ్గర చూపించకపోయావా…?”

ఆ మాట విన్న సుబ్బడు శుష్కంగా నవ్వి “ఆ పధకం కోసం అడిగితే తెల్ల కార్డ్ ఉంటే గాని ఇవ్వము అన్నారు. ఆ తెల్లకార్డు కోసం ఇప్పటికి ఎన్ని సార్లు దరఖాస్తు పెట్టానో నాకే తెలుసు, గత కొన్ని ఏళ్ళుగా ఆఫీసుల చుట్టూ పిచ్చోడిలా తిరుగుతానే ఉన్నాను, ఇదిగో వస్తది, అదిగో వస్తది అని చెప్పడమే తప్ప ఇప్పటివరకు వచ్చిందే లేదు. కానీ నేను పనిచేసే చాలా ఇళ్ళల్లో అందరికి తెల్లకార్డు ఉంది. దాని ద్వారా వచ్చే అన్ని పథకాలు అందుతున్నాయి. ఒక్కొక్కరికి రెండేసి ఇల్లు కూడా ఉన్నాయి, ఒకటి కట్టుకున్నది మరొకటి ప్రభుత్వం ఇచ్చినది. మేము లేనోల్లం మోర్రో అని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే, మా కన్నీళ్లు తుడవటానికి ఇచ్చిన పథకాలు అవి, కానీ అవి చేరవలసినోళ్ళకి ఖచ్చితంగా చేరుతున్నయా? లేదా? అని పట్టించుకునేది ఎవరు?. దేనికైనా కూసింత అదృష్టం ఉండాలయ్యా.” అంటూ తన దురదృష్టాన్ని తిట్టుకున్నాడు.

సుబ్బడు మాటలు విన్న రామారావు మనసు చలించిపోయింది. కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. ‘నన్ను క్షమించు సుబ్బి నువ్వింత కష్టంలో ఉన్నా కూడా ఆ విషయం నీకు చెప్పలేకపోతున్నాను. అమ్మా శబరి ఎందుకమ్మా నా చేత ఇటువంటి పాపం చేయిస్తున్నావు.’ అనుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు. “ఇవన్నీ ఇప్పుడెందుకు కానీ, ముందు మీ ఇంటికి పద నీ భార్యని పట్నం తీసుకెళ్లి మంచి ప్రైవేట్ హాస్పిటల్లో చూపిద్దాం. ఖర్చుల గురించి నువ్వేమి ఆలోచించకు.” అంటూ బలవంతంగా సుబ్బడు చెయ్యిపట్టుకొని ఇంటికి బయల్దేరాడు.

“అయ్యా… అయ్యా…” అని అరుస్తూ ఖంగారు ఖంగారుగా పరిగెడుతూ వాళ్ళకి ఎదురొచ్చిన కొడుకును చూసిన సుబ్బడుకి మనసెందుకో కీడు శంకించింది. “ఏందిరా ఇట్టా వచ్చావు ఏమైంది?” అని అడిగాడు.

“అమ్మ… అమ్మ…అమ్మ…”అంటూ రొప్పుతూ “అమ్మ ఎంత పిలిచినా పలకట్లేదు, నాకు చానా భయంగా ఉంది. నువ్వు త్వరగా ఇంటికి రా అయ్యా.” అంటూ ఏడుస్తూ చెప్పాడు సుబ్బడు కొడుకు.

“ఏంట్రా! ఏమైంది అమ్మకి!? నువ్వు సరిగ్గా చూసావా? మీ అమ్మకి ఏమీ కాదులే, పద నాతోటి” అంటూ ఇంటివైపు పరుగుతీసాడు సుబ్బడు. అతని వెనకే సుబ్బడు ఇంటికి వెళ్ళాడు రామారావు. గుమ్మం దగ్గరకు రాగానే సుబ్బడికి కాళ్ళు, చేతులూ వనకడం మొదలయ్యాయి, గుండె చప్పుడు వేగం పెరిగింది, భారంగా అడుగు ముందుకు పడుతుంది. మెల్లిగా ఒక్కోఅడుగు ముందుకు వేస్తూ లోపలికి వెళ్ళి ఎదురుగా నేలమీద పడుకొని ఉన్న భార్యని సమీపించాడు. తన శంక నిజం కాకూడదు అనుకుంటూనే మెల్లిగా భార్య పక్కన కూర్చొని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసాడు. ఒక్క క్షణం సుబ్బడి గుండె ఆగిపోయింది. “అయ్యగారూ! నా శబరి…నా శబరికి ఏమీ కాలేదు అయ్యా.” అంటున్న సుబ్బడి కళ్ళు ఆనందంతో తడిచాయి. ఆ మాటవిన్న రామారావు వెంటనే అంబులెన్స్ని రప్పించాడు. శబరిని తన రెండు చేతులతో పైకెత్తుకొని “శబరీ నీకేం కాదు ..మన అయ్యగారు నీకు మంచి వైద్యం చేయిస్తానన్నారు. ఇక నువ్వేమీ భయపడకు.” అంటూ బయటకి నడిచాడు. అంబులెన్స్ తలుపు తీసి సిద్ధంగా ఉన్న రామారావుని చూసిన శబరి తన ఒంట్లోని శక్తినంతా కూడగట్టుకొని చేతులెత్తి దణ్ణం పెట్టింది. పక్కనే ఉన్న కొడుకు చేతిని తన చేతులమీదుగా భర్త చేతిలో ఉంచింది. మరుక్షణంలో వారి నుండి ఆమె చెయ్యి విడిపోయింది. ఆమె ప్రాణం ఆనంతవాయువుల్లో కలిసిపోయింది. సుబ్బడి గుండె అరక్షణం ఆగిపోయింది.

పక్కనే ఉన్న కొడుకుని దగ్గరకు తీసుకొని “నాన్నా కృష్ణా! మీ అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది రా..” అంటూ రోధించాడు. తెల్లవారు జామువరకు భార్య శవం పక్కనే కూర్చుని కంటిమీద కునుకు లేకుండా చూస్తూ ఉండిపోయాడు. తెల్లవారగానే భార్యకి జరగవలసిన కార్యక్రమాలు అన్ని జరిపించాడు.

                                                                              ****

బెంగళూర్ నుండి కార్లో ఊరికి బయల్దేరాడు కృష్ణ. కారు ఊర్లోకి అడుగుపెడుతూనే మనసంతా ఏదో తెలియని బాధతో కూడిన ఆనందంతో కృష్ణ ఒళ్ళంతా పులకించింది. కారుని సరాసరి రామారావు ఇంటి దగ్గర ఆపాడు. ఇంటి గేట్ బయటే నిలబడి “అయ్యగారూ..! అయ్యగారూ..!” అని పిలిచాడు. లోపల్నుంచే కృష్ణని చూసిన రామారావు ఆనందంగా ఎదురెళ్ళి, నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు. “ఏంటి కృష్ణా! ఇన్నేళ్ళయినా ఇంకా ఈ అయ్యగారు ఏంటి! అంకుల్ అని పిలవచ్చుగా?” అన్నాడు.

లోపలికి వస్తూనే రామారావు కాళ్ళకి నమస్కరించి “ఎన్నేళ్ళయినా మీరు నాకు అయ్యగారే, అలా పిలిస్తేనే నాకు తృప్తి.” అన్నాడు వినయంగా.

“అది నీ తల్లి దండ్రులు నేర్పిన సంస్కారం. అయినా నువ్వెంటి ఇన్నేళ్ళ తర్వాత ఉన్నట్లుండి ఇలా వచ్చావు. ఊరు గుర్తొచ్చిందా?”

“అలాంటిదే అయ్యగారు, నాకు బెంగళూర్ లో ఉద్యోగం వచ్చింది. నాకంటూ ఈలోకంలో మిగిలింది మీరే కదా. తల్లి దండ్రి లేని నన్ను చేరదీసి, చదివించి, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఇంత స్థాయికి తీసుకొచ్చిన మీరు నాకు గురుతుల్యులు. అందుకే మిమ్మల్ని కలిసి ముందుగా ఆ సంతోషాన్ని మీతో పంచుకోవలనిపించింది.”

“ఈరోజు నిన్నిలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణా!. ఈ సమయంలో మీ అమ్మా , నాన్న ఉంటే ఎంతో సంతోషించేవారు. నువ్వు మంచిగా చదువుకొని బాగుపడాలని బలంగా కోరుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదమే ఇప్పుడు నిన్ను ఈ స్థానంలో ఉంచింది. అంతేతప్ప ఇందులో ప్రత్యేకించి నేను చేసింది ఏమి లేదు. కేవలం మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను అంతే.” అంటూ తలదించుకున్నాడు.

“మాటేంటి అయ్యగారు!?.”

“అవును కృష్ణా! ఇంత కాలం నీ దగ్గర ఒకవిషయం దాచాను. మీ అమ్మ చనిపోడానికి కొన్ని రోజుల ముందు చేతిలో కొంత డబ్బుతో నా దగ్గరకు వచ్చింది. “అయ్యగారూ! మీరు నాకొక సాయం చేయాలి.” అంటూ ఆ డబ్బు నా చేతిలోపెట్టింది. అంత డబ్బు నాకెందుకిస్తుందో అర్ధం కాలేదు. అదే విషయం ఆమెని అడిగాను.   

“అదంతా ముందు ముందు మీకే అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఈ డబ్బు మీ వద్ద ఉంచండి. నాకు కానీ నా భర్తకి కానీ ఏ కష్టం వచ్చినా సరే మీరు ఈ డబ్బు ఇయ్యెద్దు. చివరకు నా ప్రాణం పోయే స్థితిలో ఉన్నా సరే, మీ దగ్గర ఈ డబ్బు ఉన్నట్లు ఎవరికి తెలియడానికి వీల్లేదు. నా బిడ్డ బ్రతుకు మాలా కాకూడదు, అందుకే రేపటి రోజున వాడి భవిష్యత్తుకి ఈ డబ్బు తప్పక అవసరం అన్నప్పుడు మాత్రమే దీన్ని వాడికి అందజేయండి.” అని నా దగ్గర మాట తీసుకుంది. కానీ ఆ తర్వాత కొంత కాలానికి నీ తల్లి చనిపోయింది. ఈ విషయం ఇంతకాలం నీతో చెప్పనందుకు నన్ను మన్నించు కృష్ణా!. చనిపోయేవరకు నీ తండ్రికి కూడా చెప్పలేదు. ఎందుకంటే సుబ్బడు చనిపోయేనాటికి నేను ఊర్లో లేను. ఒకవేళ ఉండి ఉంటే ఆ డబ్బుని తప్పక మీ నాన్న కోసం ఖర్చుచేసేవాడిని. నేను తిరిగొచ్చాకే తెలిసింది సరైన వైద్య సదుపాయం అందకే మీ నాన్న చనిపోయారని. ఆ విషయం విని ఎంతో బాధ పడ్డాను. సమయానికి ఊర్లో లేకపోయానని ఎంతో బాధపడ్డాను. ఆ తర్వాత మీ అమ్మ మాట ప్రకారం ఆ డబ్బుని నీ చదువుకు ఉపయోగించాను.

నీ భవిష్యత్తు కోసం ఆవిడ ప్రాణాలు సైతం లెక్కచేయలేదు. అటువంటి తల్లిని పొందిన నువ్వు అదృష్టవంతుడివి. వాళ్ళు నీమీద పెట్టుకున్న నమ్మకం, ప్రేమే నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి.” అంటూ ముగించాడు.

ఆ మాట విన్న కృష్ణ తన తల్లి చేసిన త్యాగాన్ని తలచుకొని కుమిలిపోయాడు. “కానీ అయ్యగారూ!మీరు ధనవంతులు అయ్యుండి కూడా పనివాడి కుటుంభమైన మా మీద మీరు చూపిన అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని.” అంటూ చేతులు జోడించాడు.

కృష్ణ మాటలు విన్న రామారావు కళ్ళు ఆనందంతో తడిచాయి.

వచ్చిన పని ముగించుకొన్న కృష్ణ సిటీకి బయల్దేరబోతూ “ఏది ఏమైనా ఆ డబ్బు నా చదువుకు ఉపయోగించే కన్నా మా నాన్న ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడి ఉంటే, నేనింకా సంతోషించేవాడిని, అదే జరిగుంటే ఇప్పుడిలా అనాథలా మిగిలిపోయేవాడిని కాదు.” అంటూ బరువెక్కిన మనసుతో అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.