అనుసృజన
నిర్మల
(చివరి భాగం)
అనుసృజన: ఆర్.శాంతసుందరి
హిందీ మూలం: ప్రేమ్ చంద్
మరో నెలరోజులు గడిచాయి.సుధ మూడో రోజు మరిది వెంట వాళ్ళింటికి వెళ్ళిపోయింది.నిర్మల ఒంటరిదైపోయింది.ఇప్పుడు ఆమెకి ఏడుపొక్కటే మిగిలింది.ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించసాగింది.పాత ఇంటి అద్దె ఎక్కువని ఒక ఇరుకు సందులో చిన్న ఇల్లు అద్దెకి తీసుకుంది.ఒక గదీ, నడవా,అంతే.గాలీ, వెలుతురూ లేవు.ఎప్పుడూ ఇల్లు కంపుకొడుతూ ఉండేది.డబ్బున్నా భోంచెయ్యకుండా ఉపవాసాలుండేవాళ్ళు వదినా మరదలూ.సామాన్లు కొనేందుకు బజారుకెవరెళ్తారు అనేది సమస్య.ఇంట్లో మొగదిక్కు లేనప్పుడు రోజూ కష్టపడి వండటం ఎందుకు?ఆడవాళ్ళు రోజూ భోంచెయ్యటం అవసరమా?ఒక పూట తింటే చాలు, రెండ్రోజులు ఏమీ తినక్కర్లేదు!పాప కోసం మాత్రం రొట్టెలూ, హల్వా వండేవారు.మరి అలా రోజులతరబడి పస్తులుంటే ఆరోగ్యం పాడవక ఏమౌతుంది?విచారం,దుఃఖం, దురవస్థ, ఒక సమస్యా? ఆరోగ్యం ఎంత పాడైనా నిర్మల మందులు వేసుకోనని భీష్మించుకుంది.ఏం చేస్తుంది ఉన్నవే కాసిని డబ్బులు, వాటిని మందులకి ఖర్చు చేసేస్తే ఎలా? తినటానికి తిండే లేనప్పుడు మందులేం కొంటుంది? రోజు రోజుకీ ఆమె బక్కచిక్కి ఎముకలగూడులా తయారైంది.
ఇక ఉండబట్టలేక రుక్మిణి ఒకరోజు నిర్మలతో,” ఇలా ఎంతకాలం నిర్మలా? చూడు ఎలా ఉన్నావో. బతికుంటే బలుసాకు తినచ్చు.పద ఎవరైనా డాక్టర్ కి చూపించి వద్దాం,”అంది.
“ఇలా ఏడుస్తూ బతకటం కన్నా చచ్చిపోవటమే మేలు,”అంది నిర్మల విరక్తిగా.
” కావాలన్నప్పుడు చావు రాదు కదా?”
“పిలవకుండానే వస్తుంది, పిలిస్తే ఎందుకు రాదు? ఆయన ఎప్పుడొస్తారో ఏమో.అంతవరకూ బతికుంటే చాలాకాలం బతికినట్టే వదినా!”
“అంత నిరాశ పనికిరాదు నిర్మలా.ఇంకా నువ్వు ఏం సుఖాలు అనుభవించావని?”
“ఈ లోకంలో దొరికే సుఖాలు ఇవే అయితే నాకు వీటితో మొహం మొత్తిపోయింది.నిజం చెపుతున్నాను వదినా, ఈ పాప మీద మమకారమే లేకపోతే ఎప్పుడో పోయేదాన్నే.పాపం దీనికేం రాసిపెట్టి ఉందో!”
ఇద్దరూ ఏడవటం మొదలెట్టారు.నిర్మల మంచం పట్టినప్పట్నుంచీ రుక్మిణి ధోరణి పూర్తిగా మారిపోయింది.నిర్మల పట్ల జాలీ, సానుభూతీ ఎక్కువయాయి.పాప బాధ్యతంతా ఆవిడే చూసుకుంటోంది.అందులోనే ఊరట చెందుతోంది.
“నిర్మలా, నా మాట వినమ్మా, మంచి డాక్టరున్నాడు,ఆయన దగ్గరకెళ్దాం పద ,”అంది మళ్ళీ.
“నాకే డాక్టరూ వద్దు వదినా.నా గురించి బాధపడకండి.పాపని మీకు అప్పగించి పోతాను.పెద్దయేదాకా బతికుంటే మంచి కుటుంబం లోని అబ్బాయిని చూసి దాని పెళ్ళి చెయ్యండి.నేను దానికి ఏమీ చెయ్యలేకపోయాను.నా కడుపున పుట్టటమే అది చేసుకున్న పాపం.పెళ్ళి కాకుండా కన్యగా ఉండిపోయినా పరవాలేదు కానీ సరైన వరుడు దొరక్కపోతే ఎవరో ఒకరికిచ్చి కట్టబెట్టకండి.నేను మీకేమీ సేవలు చెయ్యలేకపోయాను, అదొక్కటే బాధ.నేను పాపిష్టిదాన్ని, నావల్ల ఎవరూ సుఖపడలేదు.నా నీడ పడ్డ చోటనల్లా సర్వనాశనమే జరిగింది!ఆయన ఎప్పటికైనా ఇల్లు చేరితే ఈ అభాగ్యురాలు చేసిన తప్పులని మన్నించమని చెప్పండి.”
“నిర్మలా నువ్వే తప్పూ చెయ్యలేదమ్మా.దేవుడి మీద ఒట్టేసి చెపుతున్నాను, నీ మీద నాకెటువంటి కోపమూ లేదు.నీపట్ల ఎప్పుడూ చెడ్దగానే ప్రవర్తించాను. నేను పోయేవరకూ ఆ బాధ నాతోనే ఉంటుంది,” అంది రుక్మిణి ఏడుస్తూ.
“వదినా, ఇది నేను చెప్పకూడదు గాని,చెప్పకుండా ఉండలేకపోతున్నాను.ఆయనకి ఎప్పుడూ నా మీద అనుమానమే,కానీ నేనెప్పుడూ ఆయన్ని తప్ప ఇంకెవర్నీ తలచలేదు,ఆయనపట్ల పూర్తి విశ్వాసంతో బతికాను.జరగవలసిన పెళ్ళి జరిగిపోయింది. నీతి తప్పి పైలోకంలో కూడా కష్టాలనుభవించటం దేనికి?పోయిన జన్మలో ఏం పాపం చేశానో,ఈ జన్మలో దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలసొచ్చింది,”అంది నిర్మల దీనంగా రుక్మిణి వైపు చూస్తూ.
ఉన్నట్టుండి నిర్మల వేగంగా ఊపిరి తీసుకోసాగింది.మళ్ళీ మంచం మీద పడుకుని కూతురికేసే చూడసాగింది.ఆ చూపుల్లో ఆమె జీవితం లోని దుఃఖ గాథంతా ఉన్నట్టు తోచింది.దాన్ని మాటల్లో అంత బాగా చెప్పటం సాధ్యమేనా?
మూడు రోజులపాటు నిర్మల కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి.ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరివైపూ చూడకుండా ,ఎవరి మాటా వినిపించుకోకుండా ఊరికే అలా ఏడుస్తూ ఉండిపోయింది.ఆమె దుఃఖాన్ని ఎవరు అంచనా వెయ్యగలరు?
నాలుగో రోజు పొద్దువాలే వేళకి ఆ విషాద గాథ ముగిసిపోయింది.ఆ సమయంలో పక్షులు తమ గూళ్ళకి చేరుకుంటున్నాయి.నిర్మల ప్రాణాలు కూడా పక్షిలాగానే వేటగాళ్ళ బాణాలనీ, పెద్దపక్షుల పంజాల దాడికీ, సుడిగాలుల దెబ్బలకీ గాయపడి, వ్యథతో తన గూటికేసి ఎగిరిపోయింది.
ఆ పేతలోని జనం గుమిగూడారు.శవాన్ని బైటికి తెచ్చారు.అందరి మనసుల్లో ఎవరు తలకొరివి పెడతారు, అనే ప్రశ్న తలెత్తింది. ఏమీ నిర్ణయించలేక అందరూ మాట్లాడుకుంటూ ఉండగా వృద్ధ బాటసారి ఒకడు భుజానికి జోలె తగిలించుకుని అక్కడికి వచ్చి నిలబడ్డాడు.ఆ వచ్చినది తోతారామ్ !
*****
(సమాప్తం)