ఆమె
చందమామలా నవ్వుతుంది
గాలితో ఈలలు వేయిస్తూ పాడుతుంది
ఆశ మనిషికి శ్వాస కావాలంటుంది
భిన్నత్వాన్ని గౌరవిస్తుంది .
అస్తిత్వాలేవైనా మనుషులందరినీ ఒకే లాగా చూస్తుంది.
ప్రేమ వెన్నెల చిలకరిస్తుంది.
గాలి వీస్తే, వాన వస్తే, వరద పొంగితే, ఉత్పాతం వస్తే చెదిరిపోదు. కదిలిపోదు. మరింత రాటుదేలుతుంది. తనను తాను నిలబెట్టుకుంటుంది.
అసమానతల వలయంలోంచి అస్తిత్వ కేతనం ఎగురవేస్తుంది.
ఆవిడెవరో కాదు సమాజానికి పత్ర చిత్రకారిణిగా, కళాకారిణిగా, సాహితీ సృజనశీలిగా, అధ్యాపకురాలిగా, సామాజిక కార్యకర్తగా బహు ముఖాల్లో చిరపరిచితమైన లక్ష్మీ సుహాసిని.
ఆమె ఏ పని చేసినా ఆ పనితో చీకట్లను తగలేసి వెలుగు బావుటా ఎగురవేయాలనుకుంటుంది.
కన్నీటి సందర్భాలు తెలియని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. తల్లి భాస్కరమ్మ రచయిత్రి. ఆమె నుండి సాహిత్య వారసత్వం పుణికి పుచ్చుకున్న లక్ష్మీ సుహాసిని మొదట భావుకురాలు.
క్రియేటివ్ రైటింగ్ పోటీలో ప్రకృతి గురించి రాసి మొదటి బహుమతి గెలుచుకుంది కానీ కన్నీటి వాన అని స్నేహితురాలు ఇరగవరపు నళిని రాసిన కవిత ఆమెను బాగా ఆలోచింప చేసింది. కన్నీళ్లు లేని సమాజం గురించి కలలు కనడం ఆరంభించింది.
ఆ కలల ప్రయాణంలోనే విముక్తి పోరాట చరిత్ర తెలుసుకుంది. తన జీవితాన్ని తన ఆశయాలకు అనుగుణంగా నిర్మించుకోవాలని తపన పడింది .
ఆ క్రమంలోనే దళిత యువకుడు సుబ్రహ్మణ్యంతో పరిచయం పెళ్ళి దాకా వచ్చింది.
ఒక సనాతన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబ అమ్మాయి దళిత యువకుడిని సహచరుడిగా ఎంచుకోవడం, వర్ణాంతర వివాహానికి సిద్ధపడడం సామాన్యమైన విషయం కాదు. అదంత తేలిక కాదు. ఆనాడు అదో సంచలనం. సుహాసిని విషయంలోనూ అదే జరిగింది.
ఆమె తల్లిదండ్రులు ఎంతో కొంత ప్రగతిశీల, అభివృద్ధి దిశగా ఆలోచించే వారే. అయినా వారు అడుగు ముందుకు వేయలేదు. వెనక్కి పడింది. తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకు ప్రధాన కారణాలు రెండు.
సుహాసిని తర్వాత మరో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేయాల్సి ఉండడం ఒక కారణమైతే,
బంధువర్గంలో తమని ఆమోదించరనే భయం మరో కారణం.
అందుకే తమ కులంలోనే సంబంధం చూసి పెళ్లి చేయాలనే ప్రయత్నాలు ఇంట్లో మొదలయ్యాయి.
తిరుపతిలో ఎమ్మే మొదటి ఏడాదిలో ఉన్న సుహాసిని దగ్గరకు ఆమె తండ్రి ప్రతి ఆదివారం వెళ్లి కౌన్సిలింగ్ చేసేవారు. ఆమె ఆలోచన మార్చే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. మరో వైపునుండి సుబ్రహ్మణ్యం వచ్చి కౌంటర్ క్లాస్ ఇచ్చి వెళ్లేవారు. బ్రాహ్మణ సమాజం నుంచి చూసే ఆమె దళిత స్పృహ పెంచుకుంది.
తన పెళ్లి సంప్రదాయాలు బద్దలుకొట్టే అవకాశంగా భావించింది. నిక్కచ్చిగా నిర్ణయం తీసుకుంది.
విపరీతమైన వ్యతిరేకత మధ్య ఉపాధ్యాయుల సహకారంతో సుహాసిని వివాహం సుబ్రహ్మణ్యం తో 1975లో జరిగింది. అప్పుడతను బిఎ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు.
అది జవహర్ భారతి కాలేజ్ కావడంవల్ల అక్కడ విప్లవకర వాతావరణం ఉండడంవల్ల అధ్యాపకులు వకుళాభరణం రామకృష్ణ, చెంచయ్య, రామకృష్ణ, మాల్యాద్రి , సిహెచ్సుబ్రహ్మణ్యం గార్లు, తోటి విద్యార్థులు పూనుకుని ఆ పెళ్లి జరిపించారు.
సుహాసిని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిందని ముందే చెప్పాను కదా .. అయితే ఆమె కుటుంబం అదే సనాతన సంప్రదాయం లో ఉండిపోలేదు. ఆమె తల్లిదండ్రులు విగ్రహారాధన నుంచి రాజయోగం లోకి, ధ్యాన మార్గం లోకి వచ్చారు. అలా వాళ్లలో వచ్చిన పరిణామం కూడా సుహాసిని ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి ఉంటుంది.
అదే విధంగా ఆమె చదివిన జవహర్ భారతి కాలేజీ అధ్యాపకుల ప్రభావం కూడా ఆమెపై ఎక్కువే.
ఇక మూడోది సుబ్రహ్మణ్యం తో పాటు మిత్రులతో సాగిన సుదీర్ఘ చర్చలు..
ఫలితంగా, ఆమె నెమ్మదిగా మార్క్సిజం వైపు మొగ్గుచూపడం మొదలైంది
మరోవైపు ఎమ్మె లో చేరిన తర్వాత అధ్యాపకులు ఇనాక్ , పీసీ నరసింహారెడ్డి ప్రభావం కూడా పడింది.
ఆ తర్వాత మార్క్సిస్టు గా మారిపోయింది. మొత్తం పరిణామాల్లో ఎప్పుడో తెలియకుండా తన జీవితాన్ని ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని కోరిక అంకురించింది.
కొత్త సమూహాలతో, సంఘాలతో పరిచయాలు, కలిసి పనిచేయడం, బాధ్యతలు పంచుకోవడం మొదలైంది.
సుహాసిని సహచరుడు సుబ్రహ్మణ్యం apclc లోనూ, మానవ హక్కుల వేదికలోను, సమాంతర ఆలోచనతోను, దళిత హక్కుల నేత గా పనిచేసేవారు. సుహాసిని విరసంలో, మహిళా హక్కుల కోసం పనిచేశారు. కలిసి నడిచారు.
సుబ్రహ్మణ్యం మొదట FCI లోను, ఆ తర్వాత జూనియర్ కాలేజీ లెక్చరర్ గా పనిచేశారు.
సుహాసిని పెళ్లి అయినప్పటి నుంచి అవగాహనలో , ఆచరణలో , ఎక్కడ మడమ తిప్పలేదు. తాను కోరుకున్న జీవితంలో ఎన్నో సమస్యలు, సంఘర్షణలు ఎదుర్కొంటూ సహనంతో బాధ్యతలు పూర్తి చేశారు.
సహచరుడితో కలిసి ఉండేంత సఖ్యత మిగలక పోయినా ఆమె తొందరపడ్డానని, తప్పు చేశానని ఎప్పుడు అనుకోలేదు. తన జీవితానికి తానే కర్త కర్మ క్రియ అని, తమ మంచి చెడులకు తామిద్దరే బాధ్యులని అనుకునేది.
1982లో గూడూరు మహిళా కళాశాలలో ఉద్యోగంలో చేరింది. అక్కడ వచ్చిన ఇబ్బందులతో క్వాలిఫికేషన్ పెంచుకోవాలని తపన పడింది. ఇన్ సర్వీస్ స్టూడెంట్ గా డిస్టెన్స్ లో బీఎడ్ , లింగ్విస్టిక్స్ లో డిప్లొమా లో చేరింది. దానితో పాటు పార్ట్ టైం పీహెచ్డీ కి కూడా శ్రీకారం చుట్టింది. ఓ వైపు ఉద్యోగం, ఇల్లు పిల్లల బాధ్యత, ప్రజా సంఘాలలో చురుకుగా పాల్గొంటూనే చదువు కొనసాగించింది.
మొదట తెలంగాణా పోరాట కథలపై పీహెచ్డి చేయాలనుకున్నది. అందుకు డిపార్ట్మెంట్ వారు ఒప్పుకోలేదు. 1985లో విరసం మీటింగ్ కి వెళ్లి వచ్చిన తర్వాత కె వి రమణారెడ్డి గారిపై పరిశోధన చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆ మాటే కృష్ణాబాయి గారితో , చలసాని ప్రసాద్ గారితో చెబితే ఆయన పెద్ద సముద్రం తల్లీ మునిగిపోతావేమో ఆలోచించుకో అన్నారు.
ఈత వచ్చిన వారికి సముద్రం ఒక లెక్క కాదని గైడ్ అనడంతో కె వి రమణారెడ్డి గారిపై పరిశోధన చేయాలని నిర్ణయించుకుని సాగించింది . కెవిఆర్ ని మార్క్సిజం ని ఏకకాలంలో అర్థం చేసుకోవడం ఆమెకు పెద్ద సవాలుగా మారింది.
కె వి ఆర్ ఎంతో సహకరించారు. సుహాసినికి వచ్చే అనుమానాలు ఎప్పటికప్పుడు తీర్చడం , చర్చించడం చేసేవారు. ఎన్నో పుస్తకాలు ఇచ్చి ఈ వరుసలో చదువుకో మంటూ నడిపించారు. ఎంతో ఆత్మీయంగా “ఏం బా సుహాసిని వచ్చింది’ అని కే క వెయ్య గానే శారదాంబ గారు రెండు కప్పుల కాఫీ తో బయటకు వచ్చేవారు కాఫీ తాగిన వెంటనే పనిలో పడకపోతే ఒప్పుకునే వారు కాదు.
రమణారెడ్డి గారి సాహిత్య రచనలలో సామాజిక రాజకీయ దృక్పథం – ఒక విశ్లేషణ ” అంశం పై సుహాసిని చేసిన పరిశోధన ద్వారా కెవిఆర్ పిలుచుకునే కెవి రమణారెడ్డి గారు 74 పేర్లతో తమ రచనలు చేశారని ప్రపంచానికి వెల్లడయింది. ఆమె పరిశోధనకు 1989 లో డాక్టరేట్ అందుకున్నారు.
కె.వి.ఆర్ వాంగ్మయ సూచిక 100 పేజీల ని ఒక పుస్తకంగా కె.వి.ఆర్ తొలి వర్ధంతి సందర్భంగా (1999) ప్రచురించి ఆయనకు అంకితం ఇచ్చారు సుహాసిని. మిగిలిన థీసిస్ ని 2006లో ప్రచురించారు.
మహిళా సంఘాలతో పనిచేస్తున్నప్పుడు సారా ఉద్యమం తో మొదలుపెట్టి అనేక సమస్యలు, వారి జీవన సంఘర్షణను అర్థం చేసుకోగలిగింది. ఆ అనుభవాలే ఆమె రచనకి , చిత్రలేఖనానికి బలం.
కుటుంబంలో ఏర్పడిన సంక్షోభం సుహాసిని ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. సుబ్రహ్మణ్యం తో పెరిగిన దూరం, సరిగ్గా అదే సమయంలో తండ్రి మరణం, చదువు కోసం కూతురు దూరంగా వెళ్లాల్సి రావడం, కొడుకు ఉద్యోగరీత్యా దూరమవడం సుహాసిని పై తీవ్ర ప్రభావం చూపింది. ముందు బెల్స్ పాల్సి కి తర్వాత అది హెమి ఫేసియల్ పాల్సీ కి దారితీసింది. Facial Palsy తో 11 నెలలు బాధపడింది. doctor treats but the nature heals అని మనోధైర్యంతో ఒంటరిగా పరిస్థితి ఎదుర్కొన్నది. పాటలు పాడుతూ , నినాదాలు చేస్తూ ఎన్నో సామాజిక , సాంస్కృతిక , సాహిత్య కార్యక్రమాలు నిర్వహించిన సుహాసిని ఇక అవేమి చేయలేనేమోనన్న బాధని అధిగమించడం కోసం, నాలుగ్గోడల మధ్య మిగిలిన జీవితంలో కొత్త శక్తులు నింపుకుంటూ ఆ సమయంలో పత్ర చిత్రకళను ప్రారంభించింది. బొమ్మలు వేసింది. వాటికీ పాటలు రాసింది. సాహిత్యం , చిత్రలేఖనం సహవాసంతో సంక్షోభం నుంచి బయటపడింది.
నాన్న నూరిపోసిన ఆశావాదం ఊతంగా తన ప్రాపంచిక దృక్పథం చేయూతగా దృఢంగా పడిలేచిన కెరటం లా ఆ సందర్భాన్ని అధిగమించి ఆ సందర్భాన్నే అనుకూలంగా మలుచుకుంది. తనను తాను నిలబెట్టుకుంది సుహాసిని. అది ఆమె నైజం.
ఆకుల విభాగంలో తొలి పత్ర చిత్రకారిణి గా 2004లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తొలిసారి చోటు సంపాదించుకుంది. మళ్లీ 2010 లో పూల రేకుల విభాగంలో మరొక రికార్డు సాధించింది. అలా మొదలై గింజల విభాగంలోనూ టిష్యూ పేపర్స్ విభాగంలోనూ మల్టీమీడియా కొలాజ్ విభాగంలోనూ రికార్డులు సాధించడమే కాక ఇవాల్టికి 54 రికార్డులలో తన పేరు నమోదు చేసుకున్నది. తన రికార్డును తానే అధిగమించి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
రెండు మోకాళ్ళు అరిగిపోయి నడవడం అతికష్టం అయిపోయింది. మళ్లీ ఇంటికి పరిమితమై పోవాల్సి వచ్చింది. ఆమె ఆలోచనలకి ఆశయాలకి దూరంగా ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. శారీరక రుగ్మత మానసిక రుగ్మతగా పరిణమిస్తున్న సందర్భంలో పని చేయనిది కాళ్లు మాత్రమే చేతులు బాగున్నాయి కదా అంటూ మళ్లీ తనను తాను మోటివేట్ చేసుకోవడం మొదలు పెట్టింది. మరోసారి తానేంటో నిరూపించుకుంది లక్ష్మి సుహాసిని.
2019లో తన 64 ఏళ్ల వయసులో రెండు స్టేట్ మీట్స్ లోనూ ,2020 లో రెండు నేషనల్ మీట్స్ లోను జావలిన్ త్రో, డిస్కస్ త్రో లలో పాల్గొంది. ఇంటర్ నేషనల్ కి అర్హత సాధించింది.
సుహాసిని తల్లి పనులు చేసుకుంటూ అద్భుతంగా పాటలు పాడేది. పాటలు రాసేది. తండ్రి జానపదాలు పాడుతుండే వారు. అలా తల్లిదండ్రుల నుంచి పాటలపై , జానపదాలపై మక్కువ పెరిగింది.
జానపదాల మీద మక్కువ తీరక పదవీ విరమణ తరువాత ఆ ఆసక్తి కొనసాగిస్తూ జానపదాల మీద పరిశోధనకు పూనుకుంది. జానపదాలకి స్త్రీవాద దృక్పథం మేళవించి కొత్త చూపుతో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి “జానపద స్త్రీల పాటలలో స్త్రీల వ్యక్తీకరణ రీతులు” అంశంపై డిలీట్ చేశారు.
మహిళా ఉద్యమాల నేపథ్యం గ్రామ పర్యటనలు అట్టడుగు వర్గాల స్త్రీల సాంస్కృతిక వారసత్వాన్ని పట్టుకోవడానికి ఆమెకు సహకరించింది. దళితుల ఇంటి కోడలు కావడం, సాంస్కృతిక దళాలతో ఉన్న స్నేహ సంబంధాలు తన పరిశోధనకు పూర్వరంగాన్ని కూర్చాయి. సామాజిక అనుభవాల నేపథ్యంలో ఆమె రచనలు బయటికి వచ్చాయి.
మనుషుల్ని ప్రేమించడం నేర్చుకున్న లక్ష్మి సుహాసిని దృక్పథం మారింది. అది ఆమె జీవితాన్ని మార్చింది. మారిన జీవితం చీకటి కోణాలు చూడడం నేర్పింది. అది వెలుతురు కేసి ప్రయాణం చేయించింది.
జీవితంలో వచ్చిన సంక్షోభాలు, అవరోధాలు ఆ క్షణంలో మనసును మెలి పెట్టినప్పటికీ అవి తన దిశను మార్చుకునేందుకు వచ్చిన స్పీడ్ బ్రేకర్స్ గా భావించే లక్ష్మీ సుహాసిని “జీవితంలో ఏర్పడిన ఎత్తు పల్లాలు నాకున్న ప్రాపంచిక దృక్పథం తో మార్క్సిజం అనే చేతి కర్ర పట్టుకుని దాటేసాను” అంటుంది.
జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకే శూన్యత, స్తబ్దత, డిప్రషన్, ప్రస్టేషన్. అది తట్టుకోలేక క్షణికావేశంతో జీవితాన్ని అంతం చేసుకుంటున్న యువతకు సుహాసిని జీవితం స్ఫూర్తి. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఎదురుదెబ్బలు తిన్నప్పుడు నిరాశా నిస్పృహల వలయం నుండి తనను తాను బయటకు తెచ్చుకుని, తనను తాను నిలబెట్టుకోవడానికి తననే ఆసరాగా చేసుకుంది. తనకు తానే ప్రేరణ గా నిలబడింది. తనను తాను మలుచుకుంది. అటువంటి సుహాసిని జీవితం కొందరికైనా బతుకుని నిలబెట్టుకునే ధైర్యం, స్థైర్యం ఇస్తుందనే ఆశతోనే లక్ష్మీ సుహాసిని జీవిత పరిచయం.
*****
జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొని అనేక రంగాల్లో తానేమిటో రుజువుచేసుకున్న సుహాసిని జీవితాన్ని స్ఫూర్తి దాయకం గా పరిచయం చేసారు శాంతిప్రబోధ.మిత్రులు సుహాసిని గారికీ, శాంతిప్రబోధ కూ ఆత్మీయ అభినందనలు
సుహాసిని అమ్మ గురించి గొప్పగా పరిచయం చేసారు. తన పట్టుదల, ఆశావహ దృక్పథం, అన్నన్ని రంగాలలో అద్భుతమైన విజయం, సైద్ధాంతిక నిబద్ధత చాలా inspiringగా వున్నాయి. ధన్యవాదాలు.
Thank you
Tnq
Hats off mrs shanti to introduce my friend lakshmi Suhasini. She is the self lit flame to the society. Her achievements are marvelous. Thanking you again, mrs shanti
Thank you
ఎన్ని ఒడిదుడుకులు, మీ జీవితం ఎందరికో ఆదర్శంగా ఉంది సుహాసిని గారు..ఓ కథో , చిత్రమోలా అనిపించింది అడుగడుగునా. ఇంత గొప్ప అస్తిిత్వకేతనాన్ని మాకు పరిచయం చేసినందుకు శాంతి ప్రబోధ గారికి ధన్యవాదాలు 🙏
Thank you
She is great artist , activist, and human being
Yes
చాలా చాలా బాగుంది madam. నిజం గా మీరు ఎందరికో స్ఫూర్తి. ఇంత మంచి పరిచయం చేసిన శాంతి ప్రబోధ గారికి కృతజ్ఞతలు
Thank you
లక్ష్మీ సుహాసిని గారితో నా పరిచయం మాస్టర్స్ అథ్లెటిక్స్ లో క్రీడాకారిణి గా మాత్రమే..కానీ ఆవిడ లో ఉన్న ఇన్ని కోణాలు..జీవితం లో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు సాగిన వైనం…బహుముఖ ప్రజ్ఞాశాలి..ఇంత మహోన్నత వ్యక్తితో నాకు స్నేహం దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను..మంచి స్నేహశీలి..ఆవిడ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను.. సుహాసిని గారి గురించి తెలియచేసిన శాంతి గారికి ధన్యవాదాలు.
Thank you
లక్ష్మీ సుహాసిని గారు నాకు మాస్టర్ అథ్లెటిక్స్ లో క్రీడాకారిణి గా పరిచయం..కానీ జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు ఎన్నో రకాల కళలు.. ఇవన్నీ ఇప్పుడే మీ ద్వారా చదివి తెలుసుకున్నామం డి..ఆవిడ జీవితం అందరికీ ఆదర్శం..ఇంత మహోన్నతమైన వ్యక్తితో నాకు పరిచయం కలగడం నా అదృష్టం గా నేను భావిస్తున్నాను అండీ..సుహాసిని గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని..మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను..
Thank you
Hats off to you Lakshmi. I feel proud to be your sister in law. You proved yourself my dear. We got inspiration from your multi talented personality. Keep rocking my dear.
Thank you
హాయ్ శాంతి నాజేవితాని నాకే చూపించావు.. సుహాసిని
అవునా.. 😊