ఆధునిక మహిళ చరిత్రను పునర్నిర్మిస్తుంది

-ఆచార్య శివుని రాజేశ్వరి

స్త్రీలు తమచుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం ద్వారా వారిని వారు ఎలా అర్థం చేసుకోవాలి? వారిఫై వారికిగల అధికారాన్ని ఎలా నిలుపుకోవాలి? అన్ని రకాల అధికారాలలోంచి, భ్రమ (మిథ్)ల నుంచి ఎలా విముక్తి పొందాలి? తమ అంతరంగ జ్ఞానం ద్వారా తమ వ్యక్తిత్వ పరిణామాన్ని ఎలా పెంపొందించుకోవాలి? తద్వారా తమను ఎలా స్థిరీకరించుకోవాలి?

ఈ ప్రశ్నలకు సమాధానాలను అన్వేషించినవి గురజాడ రచనలు. గురజాడ మేధస్సు నుంచి రూపొందిన పూర్ణమ్మ, కన్యక, మధురవాణి, సరళ, కమలిని తమను తాము స్వతంత్ర వ్యక్తులుగా ప్రతిష్ఠించుకున్న విధానము, వారు అలవర్చుకున్న జీవన తాత్త్వికత ఈనాటి స్త్రీలు తెలుసుకోవాలి. పూర్ణమ్మ, కన్యక తమ శరీరాలఫైన తమ మనస్సుపైన తమకు గల హక్కును నిలుపుకున్నారు. 

పూర్ణమ్మ:

పూర్ణమ్మ తండ్రి కాసులకోసం ఆశపడి ముక్కుపచ్చలారని చిన్నపిల్లను ముదుసలికి కట్టపెట్టాడు. తల్లిదండ్రులను ప్రేమిస్తూ, సేవిస్తూ అదే తన కర్తవ్యంగా భావిస్తూ జీవిస్తున్న  పూర్ణమ్మ తండ్రి నిర్లక్షానికి గురై ఆ భాదలోనుంచి, అవమానంలోంచి తననుతాను స్వతంత్ర వ్యక్తిగా రూపొందించుకుంది. తన శరీరంపైన, తన మనసుపైన తనకే అధికారం ఉందని దానిపై ఎవరి పెత్తనం సాగదని తన తండ్రికి, ఆనాటి సామాజిక వ్యవస్థకు చెంపపెట్టుగా తన ఆత్మార్పణతో సమాధానమిచ్చింది. “దుర్గను జేరెను పూర్ణమ్మ” అని గురజాడ అన్నాడు. దుర్గ స్త్రీ శక్తికి ప్రతీక. రాక్షసుడి దుర్మార్గాన్ని అంతమొందిచిన స్త్రీ చైతన్య స్వరూపిణి. పూర్ణమ్మ ఆ దుర్గలో లీనంకావడంలోని అంతరార్థం ఆమె చైతన్య స్వరోపిణిగా మారిందని ప్రతీకాత్మకంగా చెప్పవచ్చు.

కన్యక:

ముగ్ధమనోహరమైన కన్యకను రాజు కాంక్షించాడు. ఆమెను బలవంతంగానైనా తన దానిని చేసుకోవాలనుకున్నాడు. కన్యక తన శరీరంపైన, తన మనసుపైన తనకు తప్ప మరెవ్వరికీ అధికారం లేదని ఇతరుల అధికారానికి తానూ లొంగనని అగ్నికి ఆహుతి అయింది. అగ్నిగుండంలో దూకాబోతు “పట్టమేలే రాజువైతే పట్టు నన్నిప్పుడు” అని రాజుకే సవాలు విసిరింది. తన బంధుజనాన్ని పిరికితనం వీడి పౌరుషంతో బతకమంది. 

కన్యక స్త్రీ శక్తిస్వరూపిణి. స్త్రీ చైతన్యప్రతీక, తన చైతన్యంతో తన చుట్టూ ఉన్న సమాజానికి జడత్వం నుంచి చైతన్యవంతం చేసింది. పూర్ణమ్మ తన కుటుంబాన్ని చైతన్యపరిచే ప్రయత్నం చేసే కన్యక తన వర్గం వారిని చైతన్య పరిచింది. 

వీరు ఇద్దరూ ఆనాటి సమాజంపైన తమ నిరసన స్వరాన్ని వినిపించారు. తమపై తమకుగల అధికారాన్ని నిలుపుకున్నారు. 

మధురవాణి (కన్యాశుల్కం), సరళ (సంస్కర్తహృదయం) వేశ్యలుగా స్వతంత్ర జీవనాన్ని గడుపుతున్నారు. ఈ సమాజంలోని ద్వంద్వ వైఖరిని, పురుషాధిపత్యాన్ని ప్రశ్నించారు. పెళ్లి చేసుకొని గౌరవంగా జీవించమని సంస్కర్తలు హితవు చెప్పబోయారు. పెళ్లి చేసుకొని ఎవడో ఒకడికి బానిసగా బతకమంటారా? అని వివాహ వ్యవస్థలోని అసమానతల్ని, డొల్లతనాన్ని బయటపెట్టారు. పాతివ్రత్య భావనలోని బోలుతనం గురించి భార్యాభర్తల సంబంధాలలోని అభద్రతనుగురించి స్పష్టం చేశారు. వివాహ చట్రానికి అవతల తాము స్వేచ్ఛాపూరిత వాతావరణంలో జీవిస్తున్నామని, తాము ఎవరి అధికారానికి లొంగమని, ఎవరినీ తాము బంధించమని నిర్బయంగా చెప్పారు.

బుచ్చెమ్మ, బుచ్చెమ్మ తల్లి, చెల్లెలు, (కన్యాశుల్కం) మెటిల్డా (మెటిల్డా), కరణం భార్య (సంస్కర్త హృదయం) వివాహచట్రంలో తమపై అధికారాన్ని కోల్పోయి బానిసల్లాగా బతుకుతున్నారు. తమదికాని జీవితాన్ని జీవిస్తూ జీవచ్చవాలు అయ్యారు.

కమలిని (దిద్దుబాటు) రంగనాధయ్యర్ భార్య (సంస్కర్తహృదయం) వివాహచట్రంలో ఉంటూ అధికారం కోసం, స్వేచ్ఛకోసం పోరాడుతున్నారు. అభద్రతాభావంతో భర్తలపై అపనమ్మకంతో జీవిస్తున్నారు. తమ భర్తలు వేశ్యలను ఉద్ధరించబోయి వారి వ్యామోహంలో పడతారన్న భయంతో వారిని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఈ ప్రయత్నంలో కమలిని రంగనాదయ్యర్ భార్యకంటే కొంత చైతన్యంతో ఉంది. భర్త ఆ వేశ్యా వ్యామోహం నుంచి బయటపడకపోతే తాను వివాహబంధంనుంచి తప్పుకుంటానని హెచ్చరించి స్వేచ్ఛకోసం ప్రయత్నించింది. భర్తను ప్రేమిస్తూ, సేవిస్తూ వీరు అదే తమ జీవితధ్యేయంగా  భావిస్తూజీవిస్తున్న వ్యక్తులుగా రూపు దిద్దుకునే ప్రయత్నం చేశారు.

గురజాడ సృష్టించిన కన్యక, పూర్ణమ్మ, మధురవాణి, సరళ, కమలిని వంటి స్త్రీలు తమని తాము స్వతంత్ర వ్యక్తులుగా ఆవిష్కరించుకున్న విధానం, అందుకు వారు అలవారుచుకున్న జీవన తాత్త్వికత ఈనాటి మహిళలు తెలుసుకోవాలి. వారి అంతరంగజ్ఞానం ద్వారా తమ వ్యక్తిత్వాలను స్థిరీకరించుకునే ప్రయత్నంలో “ఆధునిక మహిళా చరిత్రను పునర్నిర్మిస్తుంది” అన్న గురజాడ మాటను అక్షరసత్యం చేశారు.

వైవాహిక చట్రానికి ఆవల ఉన్న మధురవాణి, సరళ ఆ చట్రంలో ఇంకా అడుగిడని కన్యక, పూర్ణమ్మలది పూర్తిస్థాయి చైతన్యం. వివాహబంధంలోనే ఉంటూ ఆ బంధంలో ఇమడలేక తమనితాము వ్యక్తులుగా మలచుకున్న కమలిని, రంగనాథయ్యర్ భార్యలది రూపుదిద్దుకున్న చైతన్యం.

వివాహబంధంలో బందీలై తమనితాము కోల్పోయి నిర్జీవంగా మారిన మెటిల్డా, బుచ్చమ్మలు చైతన్యావగాహన లేనివారు. ఇటువంటి స్త్రీలనుంచి కమలిని వంటి స్త్రీలు రూపోందాలని, ఆమె ఆధునిక మహిళై చరిత్రను పునర్నిర్మిస్తుందని వందేళ్ళనాడు వ్యక్తం చేశారు గురజాడ. 

ఆధారగ్రంథాలు:

  1. అప్పారావు గురజాడ గురజాడ రచనలు (కవితా సంపుటం)

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (1984),

4-1-435 విజ్ఞాన భవన్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-500001

  1. అప్పారావు గురజాడ గురజాడ రచనలు (రెండవ కూర్పు)

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (1986),

4-1-435 విజ్ఞాన భవన్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-500001

  1. అప్పారావు గురజాడ గురజాడ కథానికలు (2014)

పల్లవి పబ్లికేషన్స్, క్లాసిక్ బుక్స్ 

డా. ఏ. ప్రేమ్ చంద్ కాంప్లేక్స్, ఆశోక్ నగర్, విజయవాడ-10

  1. ఓల్గా విముక్త కథల సంపుటి

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.