ఇదీ ఓ అమ్మ కథే!
(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)
– వి.విజయకుమార్
మనసంతా దిగులుగా వుంది. నిన్నటిదాకా చీకూ చింతా లేకుండా ఏదో రాసుకుంటూనో, చదూకుంటూనో కాలక్షేపం చేస్తూ వెళ్లిపోతున్న జీవితం అనుకోకుండా ఒక మలుపు తిరిగింది.
చాలా గిల్టీగా వుంది!
నేను చేసిన ద్రోహం ఇంత మంది మర్యాదస్తుల్ని నొప్పిస్తున్నదని తెలిసేలోగా ఘోరం జరిగింది.
హృదయాన్ని కెళ్ళగించే బాధ ఒక పట్టాన విడివడక వెంటాడుతోంది.
నేను చేసిన నేరం నన్ను ముద్దాయిని చేసి వెక్కిరిస్తోంది.
ఈ మర్యాదస్తుల నుంచి ఎటైనా దూరంగా పారిపోవాలని నిర్ణయించుకున్నాను.
నేను చేసిన ఆ నేరాన్ని ఒప్పుకోబోయే ముందు అనుకోకుండా ఒక కుక్క కథ చెప్పాల్సి వస్తోంది.
***
అవును! ఇది కుక్క కథే…అనునిత్యం అవమానించబడే ఒక సగటు ప్రాణి కథ!
బొద్దు బొద్దుగా ముద్దు ముద్దుగా ఇళ్లల్లో సర్వ భోగాలతో అలరారే లక్కీ కుక్కల గురించి కాదిది.
పోగేసిన సంపదల్ని కాపాడుకునేందుకు సింహంలా ఇళ్ళ ముందు పెంచుకునే రాజ భోగాల కుక్కల గురించో, మిలిటరీ లో సైనిక వందనాలు స్వీకరించే గొప్ప గొప్ప శునకాల గురించో కూడా కాదు.
సగటు వీధి కుక్క! ఎవరింటి ముందు జాలిగా తోక ఊపుతూ ఆకలితో నిలబడ్డా ఛీ ఛీ..అంటూ ఛీ కొట్టించుకునే ఎన్నో సగటు కుక్కల లాంటి కుక్క యిది!
***
బాగా చదూకొని, బాగా డబ్బులూ ఉండీ, నిరంతరం పూజాదికాలు చేసుకుంటూ వుండే బాగా నాగరీకులు నివసించే ప్రాంతమిది.
ఏదో పుణ్యం కొద్దీ అన్నట్టు నా లాంటి వారు ఇలాంటి చోట కొంతకాలమైనా వుండే భాగ్యం పట్టడం నిజానికి
నా అదృష్టం.
ఒకోసారి గిల్టీగా ఉంటుంది. ఇంత గొప్ప గొప్ప వారిమధ్య ఉండటం కూడా! బేసిగ్గా నేను మట్టిమనిషిని.
ఆ ఇళ్ల మధ్య వుండే డస్ట్ బిన్ దగ్గర్లో జాలిగా చూస్తోంది, ఒకరోజది.
ప్లాస్టిక్ బాగుల్లో, విసిరేసిన ఆ ఎంగిలి మెతుకుల్లో దానికి కూడా ఒకటి రెండు దొరుకుతాయన్న గ్యారెంటీ ఏమీ లేదు.
మిగతావి అప్పటికే ఒకదానిమీద ఇంకొకటి లంఘిస్తూ ఆ ప్లాస్టిక్ బాగులో వుండే అపరూప ప్రసాదాల్ని ఆబగా కబళిస్తూ కొట్టుకుంటున్నాయి.
ఇది రోజూ జరిగే తంతే!
నాగరీక ప్రపంచంలో ఫ్రిజ్జులో రోజుల తరబడి ఉంచుకున్నాక, పనిమనుషులు కూడా తీసుకోరని రూఢి చేసుకున్నాక, విసిరేయబడ్డ మెతుకుల కోసం కుక్కలు గుమిగూడి కాట్లాడుకోవడం ఎక్కడ చూసినా కనబడే దృశ్యమే.
ఒకోదానికి ఒకో మెతుకు కూడా దొరుకుద్దో లేదో తెలియదు గానీ వాటికోసం అవి రక్తాలు కారేలా కొట్టుకోవడం గుండెల్ని పిండేసే హృదయ విదారక దృశ్యం అది.
ఇవి మర్యాదస్తుల ఇళ్లల్లో పెరిగే జాతికుక్కల లాంటివి కావు కాబట్టి వాటికి మర్యాదలు తెలియవు.
గోల చేస్తాయ్. వేరే గుంపు ఆ ప్రాంతాల్లోకి చొరబడే ప్రయత్నం చేస్తే గనక ఆ నాలుగు మెతుకులు కూడా దొరక్కుండా పోతాయేమో, తమ మీద పోటీకి వస్తాయేమో నన్న భీతితో ఆ చోటు కోసం పోటీ రాకుండా యుద్ధాలు చేస్తాయ్. అడ్డుకునే ప్రయత్నంలో రక్తాలు ధారపోస్తాయ్.
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అనుకొని కిందపడ్డ మెతుకుల్ని కూడా ఏరుకొని తినే పుణ్య సంప్రదాయం పుణ్యమా అని ఏ ప్రాణికీ ఇన్ని మెతుకులు దొరకవు చాలా ఇళ్ల వెనుక.
అయినా సరే పిట్టల్లా ఒక్కో మెతుకూ ఏరుకుని తినే వాటి దైన్యం చాలా బాధగా వుంటుంది.
ఆ మెతుకుల కోసం కూడా తోటి కుక్కలతో కాట్ల కుక్కల్లా కలబడితే తప్ప నాలుగంటే నాలుగు మెతుకులు నాలుకకు అంటుకోవు.
అందుకే అవి నిస్సహాయతతో నీరసంగా వేలాడుతూ ఉంటాయి కొన్ని.
చూస్తే కడుపు తరుక్కుపోతుంది.
ఎలా వచ్చిందో వచ్చిందది. బెరుకు బెరుగ్గా…బేలగా…
అది ఒక పేద తల్లిలా, కష్టంతో కండల్ని కరిగించేసుకున్న ఎముకల పోగులా ఉంది.
గూడుకట్టుకున్న దైన్యంలా వుందది!
రెక్కలు ముక్కలు చేసుకొని ఎండిపోయిన నిరుపేద కూలితల్లిలా ఉంది.
ఎండకి ఎండి తేమ ఇంకిపోయిన మోడులా ఉంది.
మగబిడ్డ కోసం ఐదుగురి ఆడబిడ్డల్ని కని శవంగా మిగిలిన అమ్మ తల్లిలా ఉంది.
గుండెలు ఎండిపోయి, అమ్మతనం అట్టగట్టుకుపోయి, ఎండిన చెక్కబల్లలా వుందది.
బిడ్డతల్లి అనుకుంటా…చాలా చిక్కిపోయివుంది.
పొట్ట కింద తోలు తిత్తి వేలాడుతూ ఉంది.
ఏదో మ్యూజియంలో వేలాడే డైనోసార్ ఎముకల కుప్పలా వుంది.
ఆకలితో డొలుచుకు పోతున్న దాని కడుపులో రోజుల తరబడి నాలుగు మెతుకులు కూడా పడ్డట్టు లేవు! వూపిరి తప్ప ఏమీ లేదు.
బిడ్డ తల్లి బిడ్డలకు పాలిచ్చే రోజుల్లో వేరే కుక్కల తో పోటీ బడి పోరాడకుండా దూరం నుంచే తప్పుకు పోతాయి.
వేటితో నైనా పోటీ పడితే, తనకు గాయాలైతే, పసి కూనలైన తన బిడ్డలు ఆకలితో అలమటించి చచ్చిపోతాయేమో నన్న భయం.
అందుకే త్వరగా బిడ్డల దగ్గరకు వెళ్లిపోతాయి, ఒక వైపు ఆకలి కాల్చుకు తింటున్నా…
పోరాడి గెలుచుకుందామని అనుకోవు.
ఆ చుట్టుపక్కల నుండి వచ్చినట్టుంది.
ఇక్కడ చుట్టుపక్కల శిథిలావస్థకు చేరిన పాడుబడ్డ పాతకాలపు భవనాలు కొంచెం విరిగిపోయిన కప్పుతో దయ్యాల సినిమాల్లో చూపించే పాడు బడ్డ నిర్వాసిత భవనాలరీతిలో ఉంటాయి. అవీ కూడా చిట్టడివిలా పెరిగిన చెట్ల గుబుర్ల లో ముళ్ళ తుప్పల మధ్య పగటిపూట కూడా లోపలికి వెళ్ళడానికి కూడా భయపడేంత దారుణంగా పెరిగి ఉంటాయి.
సాధారణంగా అందులోకి వెళ్లడం అసాధ్యం.
సాయంత్రం 5 గంటల కల్లా చీకట్లు చుట్టుముట్టేవి.
అంత చిక్కని చీకట్లను చీల్చుకొని వళ్ళంతా ముళ్ళు గీరుకుపోయినా ఆ కొద్దిపాటి మరుగుకోసం బిడ్డల్ని కనడానికి వచ్చిన అమ్మతల్లి అదని అర్ధం అయింది.
ప్రకృతి దానిమీద ఎంత బాధ్యత పెట్టిందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది.
అది ఎన్ని బిడ్డలకి తన రక్త మాంసాల్ని పంచి ఎముకల పోగయిందో తెలీదు.
ఇంకా అవి కళ్ళు విప్పినట్టు లేవు.
దాని చను మొనలు పుళ్లు పడిపోయి వున్నాయి.
పొట్టకు అతుక్కున్న తోలు తిత్తి కున్న నల్లని బుడిపెల పైన ఎర్రగా రక్తపు జీరలు…
ఆకలితో ఆ పసికూనలు పాలకోసం రక్తం వచ్చేలా చీకు తున్నాయి కాబోలు!
అది పళ్ల బిగువున గాయం తాలూకూ బాధని ఓర్చుకొని పాలివ్వడం యెంత బాధాకరం!
అది నా వైపు ఇంకా జాలిగా చూస్తోంది. నేను ఇతర కుక్కలకి అన్నం పెట్టడం చూసింది గావన్నూ
ఏదో ఆశ దాని కళ్ళలో తారట్లాడుతోంది.
దాని కళ్ళు ఆర్థిస్తున్నట్టు జాలిగా చూస్తున్నాయ్.
నా బిడ్డలు ఆ తుప్పల్లో ఆకలితో అలమటించి పోతున్నాయి…అన్న వేడికోలు దాని కళ్ళల్లో…
గుండె తరుక్కుపోతుంది. దానికి కూడా మిగతా వాటిలా ఇంత అన్నం పెడితే?
పసికూనల్నిఎక్కడో ముళ్ళ తుప్పలో భద్రంగా దాచుకొని ఇన్ని మెతుకుల అన్వేషణలో
నా కంట బడ్డ ఆ అమ్మతల్లికి ఇంత అన్నం పెట్టడం నేరం కాదని పించింది!
ముందు అది బెరుగ్గా వచ్చినా అది ఎంత ఆకలితో అలమటిస్తుందో అది తినే విధం చూశాక దుఃఖంతో మనసంతా దేవినట్టు అయ్యేది.
అది భయ భయంగా నేను పెట్టిన అన్నం తింటున్నప్పుడు నాకు ఏనాడూ నా చేతి మెతుకు తినడానికి నోచుకోని నా కన్న తల్లి గుర్తుకు వచ్చింది.
నా కన్నతల్లి నేను కడుపునిండా అన్నం తిన్నరోజు తన మొహంలో పరచుకున్న సంతృప్తి ఎంత మనోహరంగా ఉండేదో అది అన్నం తినే దృశ్యం అంత గొప్పగా ఉండేది.
అన్నం తిన్నాక అది తృప్తిగా, కృతజ్ఞతా పూర్వకంగా చూసేది!
దాని కళ్ళల్లో ఒక చిన్న మెరుపు!
తన బిడ్డలకు ఇన్ని పాలజీరలు వస్తాయని తిన్న వెంటనే ఆ తుప్పల్లో క్షణాలలో మాయమయ్యేది!
వాటికి పాలివ్వడానికి ఆత్రంగా పరిగెత్తే దాని అమ్మతనం ఎంత మధురం!
అప్పట్నుంచీ అది రోజూ క్రమం తప్పకుండా వొచ్చేది!
***
అన్నిరోజులు నిద్రాహారాలు మాని తన పసికూనల్ని కాపాడుకున్న ఆ అమ్మతల్లి, తన బిడ్డలు
కళ్ళు తెరిచాక, ఆ నరక కూపంలోంచి, చిట్టడవి లాంటి ఆ ముళ్ల తుప్పల్లోంచి, కొద్దిగా మానవ సంచారం ఉన్న చోటుకు, ఏ అర్ధరాత్రో అపరాత్రో శత్రువుల దాడుల నుంచి తప్పించుకుంటూ,
కొంచెం జనావాసాలకు దగ్గర్లో తన ఏడుగురి పండంటి బిడ్డల్ని తెచ్చి పెట్టుకుంది ఒకరోజది!
ఒక బాలింత తన బిడ్డని మురిపెంగా చేతికందించే మనోహర దృశ్యం ఏమీ కాదది!
అంత అమ్మ తనాన్ని అత్యంత బాధ్యతగా మోసి ఏడు రత్నాల్లాంటి బిడ్డల్ని వెలుగులోకి తెచ్చి ఎముకల పోగైన ఆ అమ్మ ఎవరికి గర్వకారణం?
ఓ రోజది దాని బిడ్డలతో డస్ట్ బిన్ దగ్గరకు నడుచుకుంటూ వొచ్చింది.
ఎంతటి అపరూపాలవి!
కళ్ల లో మెరుపులు…
అమ్మని ముద్దుగా గుర్రుమని కరుస్తూ, పాలు చీకుతూ గర్వంగా చూసే ఆ చూపు ఎంత బావుంది!
ఆ కళ్ళలో ఆ వైడూర్యాల వెలుగులెక్కడివి!
కెంపుల్లా మెరిసి పడే ఆ సౌందర్యం ఎక్కడిది?
అమ్మతో పాటూ అన్నం తింటూ, గడుసుగా అమ్మ నోటినుంచి లాక్కొనే ఆ దృశ్యం
ఎంత మధురంగా వుందో!
కడుపు డొలుచుకుపోతున్నా బిడ్డలు తినే వరకూ నోరుకట్టుకొని ఉండేదది.
అమ్మ కదా! ముందు బిడ్డలకు పెట్టి మిగిల్తే తిని పస్తులుండే అమ్మ లెందరో కదా!
ఆ అమ్మ ఇంక తన బిడ్డలికి ఇంత ఆకలితేరే మార్గం దొరికిందన్న సంతృప్తితో హాయిగా నిద్రపోయేది.
ఆ బిడ్డల్ని ఆ ముళ్ళ తుప్పల్లో పెట్టుకొని బాహ్య ప్రపంచపు వెలుగులోకి వచ్చేవరకూ అది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపివుంటుందో అనూహ్యం.
***
మూడు రోజుల క్రితం జరిగిన ఒక ఘోరం వీటన్నింటినీ తుడిచిపెట్టేసింది.
మర్యాదస్తుల పిల్లల వెంట సరదాగా వెంటబడ్డ కుక్క వాటన్నిటికీ మరణ శాసనం రాసేసింది!
భయానికి పరుగెత్తిన పిల్లలు కిందపడి దెబ్బలు తగిలించుకున్నారు.
ఇంకేముంది ఉప్పెనై విరుచుకుపడ్డారు!
వీధీకుక్కలకి అన్నం పెట్టడం ఎంత నేరమో మూకుమ్మడిగా తెలియజేశారు.
మీకు “సిగ్గుండాలి”ఇలాంటి పనిచేస్తున్నందుకు అని కళ్లెర్ర జేశారు!
ఇలా కుక్కలకి అన్నం పెట్టి నేరం చేసినందుకు అన్ని కంఠాలు ఏకం అయ్యాయి!
ఇలాంటివి జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
రాత్రంతా నిద్రాభంగం చేస్తున్నందుకు ఆగ్రహావేశాలు మిన్నంటాయి.
రాత్రికి రాత్రి నోటీసులిచ్చేందుకు, పై అధికారులకు ఈ ఘోరకలిని వివరించేందుకు
వాటిని పట్టించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయ్!
***
తెల్లవారిందన్న మాటే గానీ రేపు జరగబోయే ఘోరం ఏమిటో అనూహ్యం.
నిన్నటిదాకా అడుగేయకుండా కాళ్ళకు అడ్డం పడుతూ, గోముగా చిట్టి పళ్ళతో కొరుకుతూ, పెట్టే నాలుగు మెతుకుల కోసం బుద్దిగా అమ్మ పక్కన కూచునే ఆ అపరూప దృశ్యం ఒక జ్ఞాపకం.
ఆ డస్ట్ బిన్ దగ్గర పసికూనలతో నేను పెట్టె నాలుగు మెతుకుల కోసం ఓపిగ్గా నిరీక్షించే ఆ అమ్మ కి ఇవేమీ తెలియదు.
ఇవాళ్టి నుంచీ ఆ పసికూనలకు మెతుకులు దొరకవనీ, నేనెందుకు రోజులాగే తన బిడ్డలకీ తనకీ అన్నం ఎందుకు పెట్టలేకపోతున్నానో దానికి తెలియదు.
రేపు ఏదో ఒక మునిసిపాలిటీ బండిలో అమ్మ నుంచి వేరుచేసి, ఆ పసిబిడ్డల్ని వెంటాడి, వేటాడి, హింసించి తీసుకెళ్లి పోయే ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూడలేక నేను దూరంగా పారిపోయి వచ్చేశానని దానికి తెలియదు.
ఇవేవీ తెలియని ఆ పసికూనలు ఆ డస్ట్ బిన్ దగ్గర అమ్మదగ్గర ఆదమర్చి నిదరపోతున్న దృశ్యం చూసే శక్తి లేక అటువైపు తల తిప్పకుండా ఒక గిల్టీ ఫీలింగ్ తో వెళ్లిపోతున్నాను.
ఒక బంధాన్ని బలంగా తెగ్గొట్టుకొని…’ఐ యామ్ ఎ క్రిమినల్’ అనుకొని, వెళ్లిపోతున్నాను.
****
నేను ఆంగ్ల సాహిత్యం మరియు అర్ధశాస్త్రం లో ఎం.ఏ చేశాను. అయిల సైదా చారి గారి రెండు కవితా సంపుటాలూ, అందెశ్రీ గారి కొన్ని పోయెమ్స్, దెంచె నాల గురితప్పిన పద్యం కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదాలు చేశాను. అంగార స్వప్నం లో కూడా కొన్ని అనువాదాలు చేశాను. రంగనాయకమ్మగారూ, గాంధీ గారు సంకలనం చేసిన వర్గాల గురించి పుస్తక అనువాదం ఇటీవల విడుదల అయింది. మరికొన్ని అనువాదాలు పుస్తకాలు గా వెలువడ్డాయి.నా సమీక్షలూ, కవితలూ, వ్యాసాలూ, తెలుగు పత్రికల్లో వస్తుంటాయి. సారంగ లో, కౌముదిలో ఒకటీ రెండూ వచ్చాయి. మీ పత్రికకి పంపడం ఇదే ప్రథమం. సాహిత్య ప్రపంచానికి నాది పూర్తిగా కొత్త మొహం.