ఒక భార్గవి – కొన్ని రాగాలు -15
మధువులు చిలికించే రాగం —ధర్మవతి
-భార్గవి
“అందెల రవమిది పదములదా? “
అని ప్రశ్నిస్తే కాదు అంబరమంటిన హృదయముదే అని సమాధానం ఇవ్వాలనిపిస్తేనూ
“హలో మై డియర్ రాంగ్ నంబర్ “అని పలుకుతుంటే —రాంగ్ నంబర్ రైటవ్వాలనిస్తేనూ
“కొంటె గాణ్ణి కట్టుకో కొంగు కేసి చుట్టుకో ” అని కవ్విస్తుంటే మనసులో కొంటె ఊహలు చెలరేగిపోతేనూ
“గోవిందా శ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానందా” అని పాడుతుంటే ఆ గోవిందుణ్ణి పారవశ్యంతో స్తుతించాలనిపిస్తేనూ
తప్పు మనది కాదు ఆ పాటలన్నిటిలోనూ సూత్రంలా భాసిల్లే ధర్మవతి రాగానిదే
ధర్మవతి రాగం వింటుంటే నా మనసులో యేదో వేదన సుళ్లు తిరుగుతుంది,నిలవలేని ఒక ఆర్తి బయలు దేరుతుంది ,ఎందుకలా ?ఒక రాగానికి ఇంత శక్తి యెలా వచ్చింది ?అని ఆలోచిస్తే, ఆ రాగం లో పలికే జీవస్వరాలూ, ఆ రాగానికి చెందిన పాటల బాణీలలో వినిపించే స్వరాల గుత్తులూ అని అనిపిస్తుంది
ఇంతకీ ఈ రాగలక్షణాలేవిటీ? అని పరిశీలిస్తే —-ఇది 59వ మేళకర్త రాగము.
అంటే అన్ని స్వరాలూ వినిపించే సంపూర్ణ రాగం. ఇది ప్రతి మధ్యమ ప్రధానమైన రాగం అంటే ఇందులో వినపడే “మ” ని ప్రతిమధ్యమం అంటారు.
హిందుస్థానీ లో దీనికి సమాానమైన రాగం “మధువంతి” .మధువంతి లో ఆరోహణ లో “రి”,”ద” లు వినపడవు,అవరోహణ లో మళ్లీ అన్ని నోట్సూ వినపడతాయి.శృంగార భావాన్ని తెలిపే రాగంగానూ,భక్తి,ఆర్తీ,కరుణ మొదలైన రసాలను పలికించే రాగంగానూ భావిస్తారు.
ముత్తుస్వామి దీక్షతర్ వర్గీకరణ లో ఈ రాగాన్ని “ధామవతి ” అని పిలుస్తారు.
అంతేకాదు ముత్తుస్వామి దీక్షతర్ “పరంధామవతి జయతి” అనే కృతి ని కూడా ఈ రాగంలో చేశారు.
మైసూర్ వాసుదేవాచారి ఈ రాగంలో చేసిన “భజన సేయరాదా” బాగా పేరొందినది.
ఇంకా మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారు ఈ రాగంలోస్వయంగా రాసి స్వరపరిచి పాడిన “వశమా నీ అతిశయ మహిమ తెల్ప” అనే అద్భుతమైన కృతి వింటుంటే మనసు పరవశమౌతుంది.
అన్నమయ్య పదాలు ఈ రాగంలో వినపడేవి,శోభారాజు గానం చేసిన “గోవిందా శ్రిత గోకుల బృందా” ,గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ స్వయంగా మట్టుకట్టి పాడిన “మంగాంబుధి హనుమంతా” చాలా బాగుంటాయి
సినిమా పాటల గురించి చెప్పాలంటే తెలుగు తమిళాల్లో అయినా,హిందీలో అయినా చాలా పాటలు వున్నాయి.అయితే ఈ పాటల్లో ధర్మవతి,మధువంతి రాగాల ఛాయలు పెనవేసుకుని వుంటాయి అని గమనించాలి.
సంగీత దర్శకులలో యెక్కువగా ఈ రాగాలని మక్కువతో వాడిన వారు,ఇళయరాజా,ఎ.ఆర్ రెహమాన్
అయితే వారికంటే ముందు తరానికి చెందిన వారయిన సుసర్ల దక్షిణామూర్తి,యం.యస్ విశ్వనాథన్ కూడా ధర్మవతిలో చక్కని పాటలే చేశారు.
“హలో మై డియర్ రాంగ్ నంబర్ “అనే పాట తమిళ్ లో జేసుదాస్ యల్ .ఆర్ .ఈశ్వరి పాడితే ,తెలుగులో బాలసుబ్రహ్మణ్యం,యల్ .ఆర్ .ఈశ్వరి పాడారు —చిత్రం–“మన్మథలీల”–సంగీత దర్శకుడు యం.యస్ .విశ్వనాథన్
సుసర్ల దక్షిణామూర్తి—“నాన్ దా ఎన్నిలా” అనే తమిళ సినిమాలో బాలూచేతే పాడించిన “నాన్ దా ఎన్నిలా ” అనే పాట వున్నది ధర్మవతి లోనే.
ఇంకా చెప్పాలంటే బాలూ మొట్టమొదట తమిళ్ లో పాడిన పాట”అయిరమ్ నిలవే వా” అనేదికూడా వున్నది ధర్మవతి రాగంలోనే ,–చిత్రం పేరు “అడిమై పెణ్ ” —సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్
ఇళయరాజా తమిళ్ లో ఈ రాగం ఆధారంగా చాలా పాటలు చేశారు ,తెలుగులో చెప్పాలంటే
“అందెల రవమిది పదములదా”—వాణీజయరామ్ –స్వర్ణకమలం—అత్యంత అందమైన పాట,వింటుంటే నిజంగానే యెదలో యేదో సడి వినపడినట్టవుతుంది.
“వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం”—చిత్రం “సితార”–ఈ పాట పాడిన యస్ .జానకికి జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది,నేనైతే ఈ పాట యెక్కడ యెప్పుడు విన్నా అలాగే నిలబడి పోతాను పూర్తయ్యే దాకా.
ఎ.ఆర్ .రహ్మాన్ సంగీత దర్శకుడు గా చేసే ఇంద్రజాలం తెలుసుకోవాలంటే “జంటిల్ మన్ ” సినిమాలో ధర్మవతి రాగంలో వినిపించిన “కొంటె గాణ్ణి కట్టుకో” అనే పాట వింటే చాలు,సాధారణంగా నెమ్మదిగా మాధుర్య ప్రధానంగా వినపడే ఈ రాగంలో వేగంగా,బీట్ ప్రధానంగా యెలా చేశారో చూశారుగా ఈ పాటని
హిందీ సినిమాలలో చేసిన పాటలలో మధువంతి రాగఛాయలు వినపడతాయి
గీతాదత్ “మిస్టర్ అండ్ మిసెస్ 55” కోసం ఓ.పి. నయ్యర్ దర్శకత్వం లో పాడిన “నీలే ఆస్ మానీ” దీనికొక ఉదాహరణ
మదన్ మోహన్ సంగీత సారథ్యంలో “దిల్ కీ రాహే ” సినిమాలో లతా గొంతులో వినపడిన “రస్మె ఉల్ఫత్ కో నిభాయే” అనే అద్భుతమైన పాటకి కూడా మధువంతి రాగమే ఆధారం.
ఈ పాటలన్నీ వింటుంటే ధర్మవతి ,మధువంతి రాగాలు చిలికించే మధురమైన మత్తులో మునిగి హృదయం పరవశమవుతుందనడంలో యేమీ సందేహంలేదు—–రండి రాగాల విందుకు మీదే ఆలస్యం——
*****