“కేశోపనిషత్ “
– మందరపు హైమవతి
పచ్చకాగితాల కట్ట చూచినా
పసిడి కణికలు కంటబడినా
చలించదు నా హృదయం
అరచేతి వెడల్పున్న
పొడుగు జడల అమ్మాయిల్ని చూస్తే చాలు
మనసులో ఈతముల్లు గుచ్చుకొన్న నరకయాతన
దువ్వెన పెట్టినా పెట్టకున్నా
ప్రతిరోజూ నేల రాలుతున్న
కేశరాజాలను చూసి
దిగులు మేఘాలు కమ్మిన
కన్నీటి ఆకాశం నా మానసం
ఏదైనా జబ్బు చేస్తే శిరోజపతనం సహజం
ఏజబ్బు లేకున్నాతల దువ్వుకొన్నప్పుడల్లా
ఊడిపోతున్నకురులన్నీ కూడబలుక్కుని
జీవితం క్షణభంగురమన్నపాఠాన్ని
చెంప మీద చెళ్ళున కొట్టినట్లు చెప్తాయి
పావురాల రెక్కలు నిమిరే సున్నిత హస్తాలతో
నరకునిపై కరవాలం ఝళిపించిందనే
సాహస సౌందర్యాల ద్వంద్వ సమాసం
సత్యభామంటే వెర్రి అభిమానమే కాదు
‘భామనే సత్యభామనే’ అంటూ
సాత్వికాభినయాల సామ్రాజ్ఞి
వయ్యారంగా వెనక్కు గిరుక్కున తిరిగి
గుండె లపై పడేలా ముందుకు వేసుకొన్న
నల్లని నాగుపాము జడంటే
మరీ మరీ ఇష్టం నాకు
ఒక రహస్యం చెపుతాను చెవిలో
రాజకీయ నాయకశిఖామణులకు
ఎన్నికల్లో ఉద్యోగాలిస్తామని
సెల్ ఫోన్ లిస్తామనే వాగ్దానాలకు
చరమగీతం పాడండి
బట్టతల మైదానంలో
వెంట్రుకల వృక్షాలు మొలిపిస్తామని
భుజాలు దాటని మూరెడు జుట్టు స్థానే
మోకాళ్ళు దాటే బారెడు జుట్టు పెరిగే
నూనెలు ఉచితమనే వాగ్దాన మంత్రాలు వల్లె వేయండి
అఖండ విజయం సంప్రాప్తం
అధికార సింహానం హస్తగతం
వ్యోమకేశుడా! గౌరీ పతీ!
ఆకాశమంత కేశపాశ మెందుకు నీకు
రోజూ దువ్వలేక
పాపం! పార్వతి చేతులు పడిపోతున్నాయి
నాకు సగం అప్పివ్వగూడదూ!
రోజూ ఊడిపోయే జుట్టును
వడ్డీగా చెల్లిస్తా!
****