ఉపగ్రహం కన్నుకు దొరకని ఉపద్రవం మాటు వేసింది.
ఊపిరాడనీయని మృత్యువు
వింత వాహనం ఎక్కి విహార యాత్రకు వచ్చింది.
బ్రతుకు మీద ఆశ నాలుగ్గోడల మధ్య బందీ అయింది.
ప్రియమైన వారి శ్వాస ఆడేందుకు పరుగులు తీసి అలిసిన గుండెలు,
కూర్చున్న చోటే కలత నిద్దర్లోకి జారి మందుల పేర్లు పలవరిస్తూ ఉలిక్కిపడి లేస్తున్నాయి.
ప్రాణం కోసం ఇంటి పునాదులు
కుదువ పెట్టినప్పుడు,
కళ్ళలో దైన్యం కరెన్సీ నోట్లను తడిపేస్తుంది
మరణం నల్లని శిలీంధ్రమై శరీరాన్ని చప్పరిస్తుంటే
కొత్త మందుల ప్రయోగాల్లో
లాభాల పంపకాల గురించి పేచీలు మిన్నంటుతాయి.
మానిటర్ సంకేతాలు,
మృతదేహాన్ని మూట కట్టే చప్పుళ్ళు
వినీ, వినీ చెవులు కన్నాలు పడతాయి.
సామూహిక వీలునామా లో
అమాయక పౌరులు
పాలకుల ఓటమిని వాజ్మూలం గా రాసిపెట్టారు.
జీవాయుధాలు నేలను మింగేసాక
స్వార్థం దాహం తీరక కొత్త గ్రహాల అన్వేషణ!
చీకటి సొరంగంలో మనిషి దీనంగా అస్తిత్వాన్ని తడుముకుంటున్నాడు.
వాలుకుర్చీ,వీధిగుమ్మం,
అలికిడి లేకుండా పడున్నాయి
సగం రాగం కట్టి వదిలేసిన పాట
గదిలో గాలిని నిలదీస్తోంది
పాత పుస్తకాల వాసన పీలుస్తూ ఇల్లాలు తల్లడిల్లగా,
ఖాళీ అయిన ఇళ్ళలో మృత్యువు వడగాడ్పులు.
ఐనా తప్పదు.
ఉన్నవాళ్లే ఒకరినొకరు ఓదార్చుకోవాలి.
చిన్నారులను ప్రేమ గా పొదువుకుని
మళ్లీ నడక మొదలు పెట్టాలి.