చాతకపక్షులు  (భాగం-4)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

హరి సాయంత్రం ఆఫీసునించి వచ్చి గీత అందిచ్చిన కాఫీ చప్పరిస్తూ, శనివారం తన ఆఫీసులో స్నేహితులని నలుగురిని భోజనానికి పిలిచానని చెప్పేడు. 

గీత అయోమయంగా చూసింది. తనకి ఇంకా అంతా కొత్తగానే వుంది. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో పాలుపోలేదు. నిజానికి హరితో చెప్పలేదు కానీ దేశంలో వుండగా తను వంటింట్లో అడుగెట్టలేదు. గత రెండురోజులుగా అమ్మవంటలు తలుచుకుని ఉప్పురుచీ చింతపండు రుచీ ఊహించుకుంటూ తనఊహకి అందిన రుచులప్రకారం వంటలాటిది చేస్తూ గడుపుకొస్తోంది. హరి తెలిసో తెలీకో ఏ వంకా పెట్టకుండా వడ్డించిందేదో తినేసి లేచిపోతున్నాడు. 

“నాకింకా అంతా కొత్తగానే వుంది. ఈ విద్యుత్ పొయ్యీ, కత్తులూ, కటార్లూ వీటితో సాముతోనే సరిపోతోంది నాకు. కూరలు తరుక్కోడానికి కత్తి తెమ్మంటే మేకలు నరుక్కునే కత్తి తెచ్చేరు మీరు. నాలుగు రోజులాగి చేసుకుందాం పార్టీలు,” అంది. 

“ఫరవాలేదులే. నీకెంత వస్తే అంతే చెయ్యి. వాళ్లేం అనుకోరు” అన్నాడు హరి.  

“మీ స్నేహితులందరూ మనవంటలు తింటారా?” అంది సందిగ్ధంగా.

“తింటారు. కారాలు మరీ గుప్పించెయ్యకు. అంతే. సింపుల్గా బంగాళదుంపలకూరా, పప్పూ, సాంబారూ చెయ్యి చాలు” అని సలహా ఇచ్చేడు. 

“భోజనానికి అంటూ కొత్తవాళ్లని పిలిచి, పప్పూ, ఓకూరతో సరిపెట్టేస్తే బాగుంటుందా?”

“చాలా బాగుంటుంది. వాళ్లు మనలా రెండు కూరలూ, రెండు పచ్చళ్లూ, చారూ, పులుసూ, అన్ని ఆధరువులు అన్నంలో కలుపుకు తినరు. ఒక్క పప్పూ అన్నంచేసినా పరమానందపడిపోతారు” అన్నాడు హరి. అతను తన బ్రహ్మచారి రోజుల్లో వాళ్లకి అలాగే పెట్టేడు. 

గీత వాదించడం ఇష్టం లేక సరేలెండి అని సరిపెట్టింది.  

అనుకున్న శనివారం వచ్చేలోపున అతిథుల్లో ఇద్దరు ఫోను చేసారు వారి స్నేహితురాలిని లేక స్నేహితుడిని తీసుకురావచ్చా అని అడగడానికి. అందరికీ తప్పకుండానూ అని చెప్పేడు హరి.  

గీతకి మాత్రం బెరుగ్గానే వుంది. శుక్రవారం మధ్యాన్నం, హరి ఆపీసుకి వెళ్లేక భాగ్యంగారికి ఫోను చేసింది సలహాలకోసం. 

“అమెరికనులు మనవంటలంటే సరదా పడతారు కానీ మనలా పద్ధతిగా కూరలూ, పచ్చళ్లూ, విడివిడిగా ఒకొకటే అన్నంలో కలుపుకు తినేవాళ్లు కోటికొకరిని కూడా కానం. నేనూ కొత్తలో తెలీక పదిరకాలు చేసేదాన్ని. వాళ్లేమో అన్నీ కంచంలో కుప్ప పోసేసుకుని కలిపేసి కుమ్ముకు తినేవారు. అంచేత నువ్వట్టే హైరాన పడకు. ఫ్రైడ్ రైస్, రైతా, చాలు. ఓపికుంటే ఇడ్లీ సాంబారు. సాంబారులో చింతపండుకి బదులు టొమాటాలు వేసినా చాలు. వాళ్లరుచులకి దగ్గరగా వుంటాయి. dessert కారట్ హల్వా సుళువుగా అయిపోతుంది, ఇంకా కావలిస్తే బొబ్బట్లు చెయ్యి,” అన్నారావిడ.

“బొబ్బట్లా?” అంది అంతసేపూ లలితసంగీతం వింటున్నట్టు ఫోను పట్టుక్కూచున్న గీత వులిక్కిపడి. 

అవతలినుండి గట్టిగా నవ్వు వినిపించింది, “వింటున్నావో లేదో అని అనుమానం వచ్చిందిలే” అన్నారావిడ ఆపూటకి పాఠం ముగించి. 

గీతకి ప్రాణం కుదుటపడింది. “ఇడ్లీప్లేట్లు కూడా లేవులెండి,” అంది ఆవిడ ఇచ్చిన జాబితాలోంచి ఇడ్లీ కొట్టేస్తూ. 

“కావలిస్తే నేను ఇస్తాను.” 

“వద్దులెండి. హరిగారు కూడా తేలిగ్గా చేసెయ్ అన్నారు. ఈసారికి వేపుడన్నం, రైతాతో కానిచ్చేస్తాను. ఇంకా కొత్త అన్న పేరుంది కదా. అది వున్నంతకాలం వాడుకోడం ఉత్తమం.” 

అవతలినుండి మళ్లీ నవ్వు వినిపించింది. “అదీ జాణతనం అంటే” అంటూ ఫోను పెట్టేశారు భాగ్యంగారు. 

ఆ సాయంత్రం గీతా, హరీ బజారుకి బయల్దేరేరు కావలసిన కూరా, కాయా, పాలూ, పెరుగూ, పళ్లూ, పానీయాలూ, కొనుక్కు రావడానికి. దారిలో హరి అడిగేడు “ఏం చేస్తావు?” అని.

గీత భాగ్యంగారి సలహాలు చెప్పింది. 

“అలా కాదులే. రేపు వచ్చేవాళ్లలో మనవంటలు థామస్ ‌కి చాలా ఇష్టం. అతని స్నేహితురాలికి కూడా ఇష్టం అని చెప్పేడు. కొంచెం తింటుందేమో. అంచేత మామూలుగా మనకి వేసే కారాలతో ఒకటో రెండో వంటకాలు చెయ్యి. మిగిలినవాళ్లకి పప్పూ అన్నం చాలు” అన్నాడు హరి ముందురోజు తను చెప్పినమాటలు మర్చిపోయి. 

మామూలు కారాలూ, మన కారాలూ, కొంచెం కారాలూ … ఈ స్థాయీబేధాలు లెక్కలేసుకుంటూ మన వంటలు చెయ్యడం ఎలాగ అన్న మీమాంసలో పడిపోయింది గీత చాలాసేపు. 

 

శనివారం తెల్లారి లేస్తూనే, వంట మొదలెట్టి ఒకొకటే, కూరా, పప్పూ, చేస్తూ, గిన్నెలు కడుక్కుంటూ మొత్తం పూర్తి చేసేసరికి నాలుగయింది. నేను సాయం చెయ్యనా అంటూ అప్పుడప్పుడు హరి అడుగుతూనే వున్నాడు. వద్దులెండి అంటూనే గీత వంట పూర్తి చేసింది. 

ఆరు అయేసరికి ఒకొకరే రావడం మొదలు పెట్టేరు. ప్రతివారూ అందంగా, రంగుకాయితాల్లో చుట్టిన బహుమతులతో రావడం గీతకి మొదట ఆశ్చర్యంగానూ, తరవాత ఇబ్బందిగానూ తోచింది. తనకి తెలిసి మనదేశంలో పెళ్లో పండుగో అయితే తప్ప ఇలా బహుమానాలు తీసుకురాడం జరగదు. 

“ఇప్పుడు ఈ బహుమానాలెందుకండీ” అంది అలవాటయిన తెలుగులో హరితో.

“ఇక్కడి మర్యాదలివి. అయినా కొత్త పెళ్లికూతురివి కదా” అంటూ హరి ఇంగ్లీషులో చెప్పి, అటు స్నేహితులవేపు తిరిగి గీత అన్నమాటలు వాళ్లకి తర్జుమా చేసేడు. గీతకి కొంత టైము పట్టింది అందులో అంతరార్థం. ఎదుట ఇతరభాషలవారు వున్నప్పుడు వారికి తెలీనిభాషలో మాటాడడం తప్పు! 

తనకి పుట్టుకతో వచ్చిన ఏమర్యదలూ ఇక్కడ వర్తిస్తున్నట్టు కనిపించడంలేదు. అంతా పూర్తిగా భిన్నం. ఏ రష్యన్ సినిమావో చూస్తున్నట్టు అయోమయంగా వాళ్లని చూస్తోంది. 

“యూ ఎయింట్ టాక్?” అన్నాడొకతను. 

“ఆఁ?” అంది గీత అతనివేపు చూస్తూ. అతను ఏం అడిగేడో అర్థం అవడానికి అరనిముషం పట్టింది. తరవాత ఏం చెప్పాలో తోచడానికి మూడు నిముషాలు పట్టింది. 

అతను ఈసారి నెమ్మదిగా, “యూ ఆర్ నాట్ టాకింగ్” అన్నాడు. 

గీత నవ్వేసి తలాడించింది అవునన్నట్టు. ఈ సంభాషణ అట్టే సాగేట్టు లేదని గ్రహించి అతను నైస్ పార్టీ అనేసి అటు తిరిగి పక్కవారితో కబుర్లు మొదలెట్టేడు. 

ఆపూటంతా అక్కడ చేరినవారు తనతో భాషించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూనే వున్నారు. నాలుగు చుట్లు అయేవేళకి ఓ జవాబు సిద్ధం చేసుకుంది నానా తంటాలూ పడి. 

“నేను సహజముగా మాటాడే మనిషిని కాను. నాకు కొత్తవారితో మాటాడుట కష్టము.”

దాంతో మరో ప్రశ్న ఎదురైంది. “మీదేశములో ఆడువారు మగవారితో మాటాడకూడదు అని విన్నాను. అందుకేనా మీరు మాటాడడంలేదు?” అని అడిగింది ఒక అమ్మాయి. 

గీత మళ్లీ “అదేమీ లేదు. నిజంగా మాటాడడానికి ఏమీ లేకపోతే మాటాడకు అని మా అమ్మ సిద్ధాంతం. నాక్కూడా అదే వచ్చింది. అంతేకాక నేను చదువుకున్న ఇంగ్లీషు బ్రిటిష్ ఇంగ్లీషు. మీ అమెరికన్ఇంగ్లీషు చాలా వేరుగానున్నది” అంది ఒకొకమాటే కూడబలుక్కుని కుస్తీపట్లు పడుతూ,

అవతలిఅమ్మాయికి కూడా అది అర్థం చేసుకోడం అంత కష్టమూ అయింది. చిన్న నవ్వు నవ్వేసి హాఁ అనేసి “క్షమాపణలు కోరుకుని” అటుపక్క స్నేహితుడితో కబుర్లలో పడిపోయింది. 

వంటకాలు కూడా బహుబాగు అంటూ తెగ మెచ్చుకున్నారు. “ఇదేమిటి”, “అది ఎలా చేసారు”, “ఈగింజలేమిటి నల్లగా” “ఈవాసన ఏమిటి?” “ఆ రంగేమిటి?” అంటూ బోలెడు వుత్సాహంగా వాళ్లందరూ అడుగుతుంటే గీత మహ సంతోషించేసింది. తనకి వంట రాకపోయినా ఈరోజు బాగా కుదిరాయన్నమాట అనుకుని మురిసిపోయింది. 

“ఈ సాంబారు అచ్చు ఆంధ్రాసాంబారులానే వుంది. రెసిపీ ఇవ్వాలి” అన్నాడు థామస్.

గీతకి నిజంగా అతనేం అంటున్నాడో అర్థంకాలేదు. 

పక్కనే వున్న హరి “అలాగే తప్పకుండా తరవాత ఇస్తుంది” అని వాళ్లకి హామీ ఇచ్చాడు.  తరవాత గీతతో రహస్యంగా “నిజంగా కావాలని కాదు, అదో మర్యాద అంతే” అని స్పష్టం చేసేడు రెసిపీల సంగతులు.

మద్రాసులోనూ హైదరబాదులోనూ పన్నెండేళ్లు గడిపిన థామస్ “ఇంత మంచి తెలుగుభోజనం తిని ఎనిమిదేళ్లయింది.” అన్నాడు గీత ఇండియానించి తెచ్చిన ఆవకాయ ముక్క కొరుకుతూ. 

గీత అతనివేపు చూసింది తెల్లబోతూ. అతని మొహం ఆరముగ్గిన రామాఫలంలా వుంది కళ్లంటా ముక్కంటా ఏకధారగా నీళ్లు.

“కొంచెం పెరుగు వేసుకోండి.” అంది పెరుగు అందిస్తూ. 

“ఫరవాలేదు. నాకు ఇలాగే ఇష్టం. పెరుగు తింటే నోటిలో ఆ రుచి పోతుంది” అన్నాడు వగరుస్తూ, మరోగుక్క బీరు పుచ్చుకుని. ఉఫ్ అని ఊదుకుంటూ. 

గీతకి ఇబ్బంది కలిగించిన రెండోసంగతి ప్రతివారూ తన చీరెనీ, తన అందాన్నీ, మెచ్చుకోడం. నిజానికి తను కట్టుకున్నది సాదా చీరె. ఆవిషయంలో కూడా హరిని అడిగింది పొద్దున్న “ఏచీరె కట్టుకోనూ?” అని, 

“ఇదేమీ శ్రావణమంగళవారమో సంక్రాంతివేడుకో కాదు. వూరికే నలుగురు స్నేహితులు ఓపూట సరదాగా గడపడం కనక చీనిచీనాంబరాలూ, కనకాభరణాలూ ధరించవలసిన అవుసరం లేదు.”అన్నాడు. 

అంచేత ఉల్లిపొరరంగు సాదా వాయిల్‌చీరె కట్టుకంది. తన అందం కూడా అంతే. తానేమీ జగదేకసుందరి కాదు. అసలు మనిళ్లలో మనిషి అందం మొహమ్మీద చెప్పరు. అదేదో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మరీ అంతటి సుందరి అయితే పక్కవారితో “చూడు ఎంత చక్కగా వుందో, చిదిమి దీపం పెట్టొచ్చు” అంటారు. అంతే కానీ మొహమ్మీద యూ ఆర్ బ్యూటిఫుల్ అనడం ఎక్కడా వినలేదు. గీతకి తెలిసిన సాంప్రదాయం అదీ. 

వచ్చినవాళ్లు ఆరుగురూ అక్కడ వున్న మూడుగంటల కాలంలోనూ కనీసం పాతికసార్లు తననీ తనచీరెనీ, వంటకాలనీ, మెచ్చుకున్నారు. గీత థాంక్స్, థాంక్స్ అంటూనే వుంది. ఆరోజు ఆ థాంక్స్ రామనామం అయితే రామకోటి అయిపోను అనిపించింది ఆఖరికి. డూ డూ బసవన్న జ్ఞాపకానికొచ్చేడు. 

వచ్చిన ప్రతివారూ అడిగిన మరో ప్రశ్న “ఆడవాళ్లు బొట్టెందుకు పెట్టుకుంటారు?”

“అది వారికి పెళ్లి అయినట్టు గుర్తు” అన్నాడు హరి చటుక్కున ఇటు తిరిగి.

గీత ఆశ్చర్యపోయి. “అది కాదనుకుంటాను. పెళ్లికాకముందు కూడా పెట్టుకుంటారు కదా. పైగా బొట్టు పెట్టుకునే మగవాళ్లు కూడా వున్నారు కదా” అంది నెమ్మదిగా తెలుగులోనే. 

“అది వేరు” అనేసి అక్కడ్నుంచి వెళ్లిపోయేడతను. 

గీతకి పొరపాటు చేసేనేమో, అతనికి కోపం వచ్చిందేమో అనిపించింది. తను తెలుగులో మాటాడినందుకా అతనిమాట తప్పు అన్నందుకా అన్నది మరో బాధ.  

హఠాత్తుగా ఎక్కళ్లేని నీరసం వచ్చేసింది అకారణంగా. ఇదంతా ఓ నాటకంలా, తనకి అర్థంకాని పాత్ర ఏదో తను పోషిస్తున్నట్టుగా వుంది. ఇకమీదట కాస్త జాగ్రత్తగా వుండాలి. ఈపూటకి ఇది రెండో పాఠం. నేర్చుకోడానికి చాలా చిన్న విషయం సరిపోయింది!

అతిథులు వెళ్లేసరికి పన్నెండు దాటింది. గీత వంటింట్లో అడుగెట్టి చూసింది. అక్కడ పోగయిన గిన్నెలూ, కంచాలూ చూసేసరికి కళ్లు తిరిగినంత పనయింది. 

హరి వెనకే వచ్చి, “నాకు ఇప్పుడే నిద్దర్రాదు. నువ్వెళ్లి పడుకో. నేను తరవాత పెడతాలే డిష్ ‌వాషర్లో” అన్నాడు. 

“మీరు అసలు ఎప్పుడూ ఇంత మంచివారేనా, అమెరికా వచ్చేక మంచివారయిపోయారా?” అంది గీత నవ్వుతూ. ఇంతసేపూ పడిన యాతన మరిచి. 

“మరేమిటనుకున్నావు. నాస్నేహితులు ఏం అంటున్నారో తెలుసా? నీ అదృష్టంకొద్దీ నేను నీకు దొరికానుట” అన్నాడు హరి చిన్నగా నవ్వుతూ. 

“నాస్నేహితులని అడిగితే వాళ్లేం అంటారో మరి” అంది గీత కొంటెగా కన్ను సగం మూసి, చేతిలో గిన్నె సింకులో పడేస్తూ.  హరి వద్దంటూన్నా, మిగిలిన వంటకాలు మాత్రం tupperware డబ్బాల్లో పెట్టి రిఫ్రిజరేటర్లో పెట్టి పడకగదిలోకి వెళ్లింది. 

* * * * *

(ఇంకా ఉంది)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

8 thoughts on “చాతకపక్షులు నవల-4”

  1. బొట్టు ఎందుకు పెట్టుకుంటారు ప్రశ్నకి సమాధానం ప్రశ్న లాగే మిగిలిపోయింది.
    చాలా తెలుసుకుంటున్నాము.(అమెరికన్ మర్యాదల గురించి😊)

    1. సంతోషం పద్మజగారూ మీస్పందనకి. బొట్టు విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి కద. నాకు అవన్నీ క్రోడీకరించి రాసే ఓపిక లేకపోయింది.

  2. గీత తోపాటు నేనూ తెలుసుకుంటున్నా కొత్త చోట, అందులో పాశ్చాత్య దేశాలలో ఎలా ఉంటుందో.

  3. ఇపుడు అక్కడకు వెళ్ళే అతిధులు కూడా యీ భాగంలో వుదహరించిన విషయాలు నేర్చుకునేటట్టు వున్నాయి. బాగుంది మాలతి గారూ..

Leave a Reply

Your email address will not be published.