చేతులు చాస్తేచాలు! 

– కందుకూరి శ్రీరాములు

సూర్యుడు ఒక దినచర్య
ఎంత ఓపిక ! ఎంతప్రేమ !

భూమిపాపాయిని
ఆడించేందుకు
లాలించేందుకు
నవ్వులవెలుగులు నింపటానికి
పొద్దున్నే బయల్దేరుతాడు
భానుడు తల్లిలా –

ఆత్మీయత
ఒక వస్తువు కాదు
ఒక పదార్థం అంతకంటే కాదు
లోలోన రగిలే ధగధగ-

వేల వేలకిరణాలతో
నేలను  ఒళ్లోకి తీసుకొని
నేలను ఆడించి పాడించి
లాలించి 
బుజ్జగించి ముద్దాడి
తినిపించి నిద్రపుచ్చి
కూలికి వెళ్లిన తల్లిలా
మళ్లీవస్తా అంటూ వెళ్లిపోతుంది పొద్దు!

అరచేయి చేతివేళ్లు
ఒకటవటమూ విడివిడిగా ఉండటమూ
ముడివడి ఒకటై పిడికిలవటమూ
ఒక నైపుణ్యం!
ఒక అనురాగం!
అవెంతో హాయిగా
ఐక్యంగా ఉంటాయి!

హృదయంతో పలికినప్పుడు
గుండె
విషాన్నియ్యదు!

మనసువిప్పి మాట్లాడినప్పుడు
ప్రేమ కయ్యానికి
కాలుదువ్వదు!

చెట్టు పెరుగుతూ
కిరణాల వైపు మొగ్గుతూ వంగుతూ పైకి సాగుతుంది !

సాదుకున్న
దాన్నెప్పుడూ
నీచంగా పెంచరు !

పెంచి పోషించుకున్నదాన్నెప్పుడూ
నికృష్టంగా తెంపెయ్యరు !

ఒక పద గుభాళింపుతోనో
ఒక వాక్య విన్యాస
సౌందర్యం వల్లనో
మాటలనిర్మలప్రేమ
సౌకుమార్యం చేతనో
స్నేహభావార్థాలు పెనవేసుకు
పోతుంటాయి

భానుని
మబ్బుతమ్ముళ్లు
భూమిని
ఎప్పుడూ కాపలా కాస్తుంటాయెప్పుడు !

చుక్కలస్నేహితులు
అప్పుడప్పుడైనా
హలో !హలో ! అంటూ
చేస్తుంటాయి
చప్పుడు!

కిటికి రెక్క తెరిస్తే
గాలిస్పర్శ
గదిని
పులకికాంకితున్ని చేస్తుంది!

చేతులు చాస్తే చాలు!
నవ్వుతూ అంబాడుతున్న బుజ్జాయి అమాంతం
ఒళ్లోకి వాలుతాడు!

పరిశుద్ధమైన ఆత్మకు దిగులు లేదు
పరిశుభ్రమైన హృదయానికి
చావులేదు

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.