జీవితమే నవీనం
అనుభవాలు -జ్ఞాపకాలు (చివరి భాగం)
-వెనిగళ్ళ కోమల
అమెరికాలో స్నేహితులు
మా ఇద్దరికీ ముఖ్యమైన మిత్రులు ప్రొ.ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయి. వారితో ఇండియాలో పరిచయమైనా ఇక్కడ మాకు వారితో స్నేహం గాఢమయింది. వారింటికి (గెయితీస్ బర్గ్) తరచు వెళ్ళి రోజంతా గడుపుతాము. కృష్ణ కుమార్ గారు సౌమ్యులు. నెమ్మదిగా అనేక విషయాలు ఇన్నయ్యతో చర్చిస్తుంటారు. ఇక జ్యోతిర్మయి రకరకాల వంటలు ఓపిగ్గా మాకు చేసి పెడుతుంటారు. ఎప్పుడూ వారింట్లో ఎవరో ఒకరు స్నేహితులు బస చేస్తుంటారు. వారింట సత్కాలక్షేపం అవుతుంది. వారి స్నేహితులనందరినీ మాకు పరిచయం చేశారు. వారింటనే కృష్ణవేణి రావు, దంపతులను, భారతిని తరచు కలుస్తుంటాము.
ఇక నవీన స్నేహితులు – నోబుల్ రాబర్ట్స్ (నోబి) సేరా, గ్లోరీ, ఏంజెలా, క్వీనీ, రాధిక, సెలీనా మాకు స్నేహితులే. నోబి చాలా విధాల సహాయపడుతుంటారు మా యిద్దరికీ. డా. దీప్ భార్య ముక్త (జాలీ) మాకూ బాగా స్నేహితులయ్యారు. దీప్ మా యిద్దరికీ వైద్యుడు కూడా.
రాజు స్నేహితులు, ఎస్.శ్రీనివాస్, మాధురి, మురళి, ప్రతిమ మాకు ఎప్పటినుండో స్నేహితులు. కలుస్తుంటాము అప్పడుడప్పుడూ. రాజా కరణం, నిర్మల బాగా దగ్గరయ్యారు.
తులశమ్మ, రాఘవరావుగారబ్బాయి జితేంద్ర – భార్య జ్యోతి, రత్న కిషోర్ – అన్నపూర్ణల బిడ్డ నీలిమ, భర్త రవి ఇక్కడ వర్జీనియాలోనే ఉండటాన అన్ని ఫంక్షన్ లలో కలుస్తుంటాము. పిల్లలందరితో మేమూ పిల్లల్లాగ కలసిపోతున్నాము.
ఇన్నయ్యతో సహజీవనం సజావుగా సాగుతున్నది
ఏభయేళ్ళవవస్తూన్నది మా వివాహమయి. వెంట, వెంటనే నవీన, రాజు పుట్టారు.
ఇన్నయ్య ఎప్పుడూ తాను నమ్మి, ఆచరిస్తున్న మానవవాద, హేతువాద సెక్యులర్ భావాల వ్యాప్తి కోసమే పాటు పడుతూ, రచనలు చేస్తూ వస్తున్నాడు అప్పటికీ, ఇప్పటికీ. అతి కొద్దికాలం ఉద్యోగం చేశారు. అమెరికన్ ఎంబసీ మద్రాసువారు ఉద్యోగం ఆఫర్ చేశారు. వద్దనేశాడు. కారణం – ఆ ఉద్యోగంలో ఉండగా మిగతా పేపర్లకేమీ రాయకూడదని నిబంధన అప్పాయింట్ మెంట్ ఆర్డరులో ఉండటమే. తన స్వేచ్ఛనరికట్టే పనేదీ ఆయనకిష్టముండదు. ఉద్యోగ ప్రయత్నాలెప్పుడూ చేయలేదు. తన స్వభావం ఎరిగినదాన్ని, ఆయన మీద ఎలాంటి వత్తిడీ నేను తేలేదు.
నేను చివరిదాకా ఉద్యోగానికి అంటిపెట్టుకొని ఉన్నాను. పిల్లలు, ఇల్లు, ఉద్యోగం – ఈ మూటి చుట్టూ నా జీవితం పరిభ్రమించింది.
పిల్లలు హేపీగా, కాన్ఫిడెంట్ గా పెరిగారు. గొప్ప సౌకర్యాలు వాళ్ళకు కలిగించలేకపోయినా వారికేమీ లోటు చేయలేదనే అనుకుంటున్నాను. చక్కగా చదువుకొని మంచి స్థితికెదిగారిద్దరూ.
తట్టుకోలేని ఆర్ధిక ఇబ్బందులేమీ ఎదురు కాలేదు. అప్పుడప్పుడూ కొంత ఇరుకుగా అనిపించినా. అనుకోని పెద్దఖర్చులెదురయినప్పుడు దగ్గర ఉన్న బంగారం ఆదుకున్నది. మొత్తం మీద జీవితం సీదా – సాదాగా, సంతృప్తిగానే సాగింది.
పిల్లలిద్దరూ ఎక్కొచ్చిన దగ్గర నుండీ మా ఇద్దరి అవసరాలను వాళ్ళే చూసుకుంటున్నారు. మాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బిడ్డలు బాధ్యత వహిస్తున్నారు.
జూబ్లీహిల్స్ లో మా తాహతుకు తగినట్లు చిన్న ఇల్లు కట్టుకోగలిగాము. ఇంటి ముందు పూల మొక్కలు, వెనక పండ్ల చెట్లు పెంచి ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదం చేసుకున్నాము.
ఇంటి విషయంలో ఎం. సత్యనారాయణ రెడ్డి సూపర్ వైజ్ చేశారు. స్నేహితుడు కొసరాజు సీతా రామారావు బోర్ వెల్ ఫ్రీగా తవ్వించి పెట్టారు. దానితోనే యింటిపని ప్రారంభమయింది. జయరాం, దిలీప్, రత్నకిషోర్, శివనాగేశ్వరరావు, ఆయన స్నేహితుడు సోమిరెడ్డి ఇతోధికంగా సహాయమందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మాకు ఎలాంటి అప్పులూ లేకపోవటమే మా ఆస్తిగా భావిస్తున్నాము.
ఇన్నయ్య సేకరించిన కొన్నివేల పుస్తకాలు, తనకిష్టమైన సంస్థలకు డొనేట్ చేశాడు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కొనసాగుతున్నాడు. తనకిష్టమైన రీతిలో నడుచుకుంటున్నాడు. అందుకు నా సహకారం సంపూర్ణంగా అందిస్తున్నాను.
నేను పోగొట్టుకున్న ఆప్తులు
అమ్మ, అన్నయ్య, నాన్న, కమలక్కా, విమలక్కా, ఇద్దరు బావలూ మమ్ముల్ని వీడిపోయారు. అమ్మ పెరాలిటిక్ స్ట్రోక్ తో పోయింది. అన్నయ్యకు ఆస్తమా బాధ ఉండేది. కార్డియాక్ అరెస్టయి వెళ్ళిపోయాడు. నాన్న తన 93వ ఏట ప్రశాంతంగా 1995 మే 9న కన్ను మూశాడు. మిగతా పెద్దలందరూ వారి టైము వచ్చినప్పుడు మమ్మల్ని వీడారు.
శేషగిరి, నిర్మల అశోక్ వారికున్న గోరంత సమస్యలను కొండంతగా భావించారు. ఎవరితోనూ బాధ పంచుకోకుండా అకాలంగా, పిన్నవయసులో మృత్యువునాహ్వానించి మాకు బాధ మిగిల్చారు. కోటేశ్వరరావు చిన్నవయస్సులోనే పోయాడు. కుసుమ అనూహ్యమైన ఏక్సిడెంట్ లో భర్త, కొడుకుతో సహా నీటమునిగి ప్రాణాలు వీడింది. మిక్కిలి విషాద సంఘటన అది. ఇటీవలె కమల, సుబ్బయ్య దంపతులను పోగొట్టుకున్నాము. అత్తగారు, బావగారు ఒకరి తరవాత ఒకరు వెళ్ళిపోయారు.
మా అమ్మ గన్న సంతానంలో, శ్యామలక్క, నేను మిగిలాము ఇప్పుడు. వారందరి స్మృతులూ మదిని భారం చేస్తుంటాయి ఇప్పటికీ.
మా బాధ్యత భుజానికెత్తుకున్న నవీన
ఇదివరలో 7 ఏళ్ళు అమెరికాలో నవీన, హేమంత్ వాళ్ళతో ఉన్నా మధ్య మధ్య ఇండియా వెళ్ళి వస్తూ ఉన్నాము ఇన్నయ్య, నేను. కాలు ఇబ్బంది వలన 10 ఏళ్ళు నేను అమెరికా పోలేదు. ఇన్నయ్య ప్రతి సంవత్సరం వెళ్ళారు. నవీన రాజు కుటుంబాలతో ప్రతి వేసవిలో వచ్చి రెండు వారాలు మాతో గడిపారు. ఆ పది సంవత్సరాలు.
2010 మే నెలలో నేనూ, ఇన్నయ్య వచ్చాము నవీన వాళ్ళదగ్గరకు. రెండు నెలలనే వచ్చాము. రాజు కూడా అప్పుడిక్కడ ఉన్నాడు. ది వాషింగ్టన్ పోస్టు ఉద్యోగ నిర్వహణలో. ఇద్దరితో గడిపినట్లుంటుంది రమ్మని పట్టు బట్టింది నవీన.
మేము వచ్చిన తరువాత మా గ్రీన్ కార్డులు రెన్యూ చేయించి ఇక ఇక్కడే ఉండండి. వయసు మీరుతున్నారు. మీరక్కడ ఉంటే ఎలా ఉన్నారో అని మాకు ఆతురతగా ఉంటుంది. మా కళ్ళముందుంటే మంచీ చెడూ చూసుకోవడానికి వీలవుతుంది అని బలవంతంగా ఉంచేసింది. భారమవుతామేమో అని నాకు భయంగా ఉంటుంది. పిల్లలతో, మనవలతో జీవితం సుఖంగా గడిచిపోతున్నది. కాని రేపేదన్నా ఆరోగ్యాలు దెబ్బతీస్తే వారికి కష్టం, నష్టం కలుగుతుందేమోనని నాకు ఎప్పుడూ మనసులో పీకుతుంటుంది. మెడికల్ ఇన్ ష్యూరన్స్ తీసుకున్నది. నాలుగేళ్లవవస్తున్నది. తన సుఖం చూసుకోకుండా మాకు సౌకర్యం కల్పిస్తుంది. అవసరానికి తన పనులు మాని డాక్టర్ల దగ్గరకు తీసుకుపోతుంది. పని వత్తిడిలో తనకు తినటానికి వీలుగాకున్నా, మేము తిన్నామా, బాగున్నామా అని ఫోనులో పలకరిస్తుంది తన పని మధ్యలో.
ఎప్పుడూ మా పట్ల ప్రేమాభిమానాలు, శ్రద్ధ చూపిస్తూనే ఉన్నది. వైద్యరీత్యా నా మీద చాలా ఖర్చు పెట్టింది. “మీకు గాక మరెవరికి చేస్తాం” అంటుంది.
మా 40వ వెడ్డింగ్ యానివర్సరీకి నవీన, రాజు ఇండియా వచ్చి 125 మంది స్నేహితులనూ, బంధువులనూ విందుకు పిలిచి గొప్ప సందడి చేశారు. శ్యామల కొడుకు రామకృష్ణ ఏర్పాట్లలో సహాయపడ్డాడు. అలాగే నా 70వ జన్మదిన వేడుక “అవర్ ప్లేస్” లో స్నేహితులు, బంధువుల మధ్య ఘనంగా చేశారు నవీన, మనవలు.
ఇన్నయ్య 75వ జన్మదిన వేడుక అమెరికాలో తన యింటిలో 75 మంది అతిథులతో సంతోషంగా జరిపారు- హేమంత్, నవీన, రాజు. మే 31న (2014) మా 50వ వెడ్డింగ్ యానివర్సరీ. పిల్లలూ. మనవలూ గోల్డెన్ జూబిలీ అనీ చాలా సంతోషపడ్డారు.
నవీన మొదటి నుండి మా పట్ల శ్రద్ధ చూపించి అన్ని అవసరాలకు ఆదుకుంటూ వచ్చింది. స్నేహానికి విలువ యిస్తుంది నవీన. మోంటిసోరీ నుండి కాలేజీ దాకా స్నేహితులు ఇప్పటికీ టచ్ లో ఉన్నారు తనకి. ఉదారంగా ఖర్చు చేస్తుంది. అవసరంలో తెలిసినవారున్నారని తెలిస్తే ఎంత కష్టమైనా వారిని ఆదుకోవడానికి వెనకాడదు. డబ్బు ఇవ్వలేము అన్న పేషెంట్లకు ఫ్రీగా వైద్యం చేస్తున్నది. ఇక్కడ స్నేహితులందరి మదిలో నవీనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఎదుటివారి సమస్యలను సహృదయంతో అర్ధం చేసుకుంటుంది. ప్రేమించే స్వభావం, స్నేహ హస్తం అందించటం, ఆదరించే పద్ధతి, ఎప్పుడూ నవ్వుతూ అలుపెరగక శ్రమించే నైజం అందరికీ ముచ్చట గొలుపుతుంది. వృత్తిలో నైపుణ్యం సంపాదించి పేషెంట్ల మన్నన పొందుతున్నది. ఇవన్నీ ఆమె విజయానికి సోపానాలు.
చిన్నప్పుడు కుక్కను పెంచుకుందామని నవీన, రాజు అడిగేవారు. మేము పడనీయలేదు. తానిప్పుడు ఒక పప్పీని తెచ్చి పెంచుతున్నది. రాహుల్ క్లోయి అని నామకరణం చేశాడు. పెద్ద కళ్ళతో ముద్దుగా అందరి ప్రేమను పొంది పెరుగుతున్నది. మనం చెప్పేది అర్ధం చేసుకుంటూ అందరి మదిని దోచింది – ఫ్రండ్లీ పప్పీ. అందరిలో నవీన అంటే అమితంగా ప్రేమిస్తుంది. తను ఇంట్లో ఉంటే క్షణం వదలదు తనని. నవీన క్లోయీని అంత సుకుమారంగా చూసుకుంటున్నది మరి.
రోహిత్ డిగ్రీ రెండవ సంవత్సరంలో తనకు ఇష్టమైన సబ్జెక్టులు తీసుకొని చదువుతున్నాడు. ఆయన పసితనం మాకింకా గుర్తువస్తుంటుంది. పెద్దవాడయ్యాడు రాహుల్ కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యత సంపాదిస్తున్నాడు – రంగ ప్రవేశం (ఆరంగేట్రం) త్వరలో జరగవచ్చు. లేలా, జోలా చదువులో ప్రశంసలందుకుంటున్నారు. వీళ్ళందరి మధ్య మా కాలం హాయిగా గడుస్తున్నది. ఇండియాలో కావలసిన వారందరితో ఫోనులో కలుస్తున్నాము. పుస్తకాలు, టి.వి. కాలేక్షేపానికి ఉన్నాయి. అప్పుడప్పుడు మాతృదేశాన్ని మిస్ చేస్తూ ఉంటాను – సహజమే గదా!
*****
(సమాప్తం)
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.