జ్ఞాపకాల సందడి-24

-డి.కామేశ్వరి 

నవంబర్ నెల  వచ్చిందంటే  మేము  బతికే  వున్నాం అని ప్రభుత్వానికి  విన్నవించుకునే  నెల.   మేము చూడందే   నమ్మం  మమ్మల్ని  దర్శించాల్సిందే అని ప్రభుత్వం  రూల్. చచ్చినవారిని  బతికున్నట్టు  డెత్ సెర్టిఫికెట్స్ సృష్టించగలిగే  ఘనులున్న  ఈ  దేశంలో  మరి  ప్రభుత్వాలు  మాత్రం పాపం  ఏంచేయగలదు. సరే ముసలి వారు  కర్రలు పట్టుకు  మనవళ్ల  చేతులు పట్టుకునో  వాకర్లు  పట్టుకునో  పడుతూ లేస్తూ  వెళ్లి  ఫోటో  అంటించి  సంతకం  పడేస్తే  మళ్ళి  ఏడాది  వరకు  నిశ్చింత. 

 సరే నాకూ  తప్పదు గదా! మహా  మహా  ఉద్యోగాలు  చేసిన  మొగుళ్ళయినా  పెళ్లాలకి  ప్రభుత్వాలు  దయతో ఇచ్చే  పెన్షన్  అనే  వరం వుండబట్టేగదా పిల్లలమీద  ఆధారపడకుండా  దర్జాగా  బతుకుతున్నాం. సరే  అబ్బాయి సెలవురోజు  చూసి  వాడికి  తీసికెళ్ళమని ఇండెంట్  పెట్టుకుని  వెళ్లా నాంపల్లి  ఎక్సిబిషన్ ఆఫీసుకి .ఇన్నాళ్లు  సీనియర్ సిటిజన్స్  మీద  దయతలచి  ఆ  చీకటి  మెట్లెక్కలేరని  కిందే  రెండుమూడు  షామియానాలు వేసి  నాలుగు  బల్లలు  నాలుగు  కుర్చీలు  వేసేవారు . అప్లికేషన్ ఫారం  నింపేస్తే  ఐదు  నిమిషాల్లో  పని అయిపోయేది. ఏదో  ఆన్లైన్  అన్నా  దానికి  వేలిముద్రలు  ఈ యాప్  అది ఇది  అంటే  ఎందుకొచ్చిన గోల  డైరెక్ట్ గా  అక్కడికే  పోదాం అన్నా. తీరాచేసి వెడితే షామియానాలు  లేవు.  చచ్చాం  మెట్లెక్కాలా  అనిచూస్తే  అక్కడే  ఒక  కారుషెడ్ . అంత  షాపులో  రెండుమూడు  కంప్యూటర్స్  పెట్టుకుని  కూర్చుని  ఆన్లైన్లో  ఆధార్  కార్డు  సాయంతో  సర్టిఫై  చేస్తున్నారు  కరొనలేదు గుడ్డులేదు  అన్నట్టు జనం  గుంపులు  తోపులాటలు  ఒకరిమీదఒకరు  పడిపోతూ. చచ్చాం  అనుకుని  ఒకనిమిషం  నించునేసరికి  చెమటలు  మాస్క్  తో ఊపిరాడక ఏంచెయ్యాలనిచూస్తుంటే  మావాడు  బయటికి వచ్చేయి అంటాడు.

ఈ లోగా  అక్కడ కూర్చున్న  అతను  మేడం  e seva center  కి వెళ్ళండి  అక్కడ చేయించుకోవచ్చు  అని సలహా  ఇచ్చాడు . బతికించావు  నాయన  అనుకుని  దోమలగూడ  బయలుదేరివచ్చాం .నా  అదృష్టం బాగుంది  జనంలేరు అట్టే.  కూర్చోగానే  పిలిచారు . ఆధార్  కార్డు ఫోన్ నెంబర్  అన్నీ  అయ్యాక వేలిముద్రలు  ఒకటీ  టాలీ  అవదే.  ఎన్నిసార్లు చేసినా  కావడంలేదు వేళ్ళు తుడిచి, గట్టిగా ఆనించి  నొక్కి  నొక్కి  ఐదు  నిముషాలు తంటా పడితే ఆఖరికి  ఒక  థంబ్  క్లియర్  అయి  క్లిక్ అయింది . వేలిముద్రలు వయసుతోపాటు  మారిపోతూ  కొన్ని  మాయమయి, కొన్ని  కొత్త గీతలు  వచ్చి  చేరతాయిట . ఒక్కక్కరికి  ఇంతసేపు.  అందుకే జనం  అసహనం తోపులాటలు.  తాతల నాటి  కంప్యూటర్లు  సర్వర్లు  మార్చరు  ఓపెన్ అవక  వాళ్ళుపాడేపాట్లు  జనం  ఇబ్బందులు చూసైనా  చెత్తఖర్చులు  ఉచితాలు  మానేసి ప్రతి ఆఫిస్ లో ముందు  మారిస్తే  తప్ప అన్ని  ఆన్లైన్  చేయాలన్న ఉద్దేశం  మంచిదయినా  ప్రయోజనం  నెరవేరదు. లక్షలమంది  పెన్షనీర్లని  ఇబ్బంది పెట్టకుండా  మళ్ళీ  ఏడాదికన్నా  సమస్యలు  సరిదిద్దుతారని  ఆశించుదాం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.