“తప్పొప్పుల జీవితం”
-తమిరిశ జానకి
ఎవరికైనా సరే సొంత ఊరిపేరు తలుచుకుంటే చాలు సంతోషంగా అనిపిస్తుంది కదా
కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటూ చాలా ఆనందంగా తన అభిప్రాయం చెప్పాడు సమీర్.
రాజు తప్ప మిగిలిన ఇద్దరూ సుబ్బారావు చక్రధర్ ఔనంటే ఔనని ఒప్పేసుకున్నారు. రాజు చూపులెక్కడో ఉన్నాయి. స్నేహితులు నలుగురూ కాఫీ షాప్ లో కలిశారు అనుకోకుండా.
నలుగు రూ ఒకే ఊరి వాళ్ళు. అప్పట్లో పరిచయాలున్నాయి. కానీ తదనంతరం ఎవరెవరు
ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. బతుకుతెరువు వెతుక్కునే రంధిలో ఇంకొకడి విషయాలు పట్టించుకునే ఆసక్తి నలుగురికీ లేదు. అది సహజమే కావచ్చు ఈరోజుల్లో.
నలుగురిలోనూ ఒక్క రాజే ఇప్పుడు మంచి ఉద్యోగం దొరికి చక్కగా స్థిరపడ్డవాడు. మిగిలిన ముగ్గురికీ ఇంకా ఏ ఉద్యోగమూ దొరకలేదు.
నీ అభిప్రాయం చెప్పవేంటి రాజూ
ప్రశ్నార్ధకంగా చూశాడు రాజు సమీర్ వైపు.
ఏం చెప్పమంటావు ఏం చూసుకుని ఏం తలుచుకుని సొంతఊరంటే మురిసిపోవాలి నేను
అప్రయత్నంగా రాజు భుజమ్మీద చెయ్యివేశాడు సమీర్ స్నేహితుడి మాటలకి వింతగా చూస్తూ. జాలిగా
కూడా అనిపించింది నిజానికి.
ఏవిటి రాజూ ఎందుకలా అంటున్నావు
ఇంకెలా అనమంటావు సొంత ఊళ్ళో మా కుటుంబం అందులో ముఖ్యంగా నేను పడిన కష్లాలు నష్టాలు అవమానాలు తల్చుకుంటూ సంతోషపడమంటావా మన ఊరిపేరు తల్చుకుంటే మీకు ఒళ్ళు
పులకరిస్తుంది నాకు ఒళ్ళు మండుకొస్తుంది . ఒంట్లోంచి పొగలు సెగలు వస్తాయి. ఎవరి అనుభవాలు
వాళ్ళవి . ఒప్పుకుంటారు కదా .
సమీర్ కి తెలుసు వాళ్ళకుటుంబం గురించి. మిగిలిన ఇద్దరికీ కొద్దోగొప్పో తెలుసుగానీ మరీ లోతుపాతులు తెలియవు.
అందుకే ఆ ఇద్దరూ కూడా తేలిగ్గానే తీసుకున్నారు రాజు మాటలు.
కానీ సమీర్ మాత్రం మనసుతో ఆలోచించాడు. ఏనాటి విషయాలో ఇంకా తల్చుకుంటూ బాధపడుతున్నాడెందుకు ఈ రాజు . రోజులెలా మారిపోయాయో తెలియదా తనకి. ఓడలు బళ్ళు
అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి. చెడ్డవాళ్ళు మానసిక పరివర్తనతో మంచివాళ్ళుగా మారవచ్చు
మంచివాళ్ళు పరిస్థితుల వలన గానీ వాతావరణప్రభావం వలనగానీ చెడ్డవాళ్ళుగా మారిపోవచ్చు.
అందులో వింతేమీ లేదు. ఒకనాటి తన కుటుంబాన్ని ఇప్పటికీ తల్చుకుంటూ ఇప్పుడు మారిన
పరిస్థితులు చూసుకుని సంతృప్తి చెందడం అలవాటు చేసుకోలేకపోతున్నాడా చాలా పొరపాటు
చేస్తున్నాడు. లభించిన మంచి జీవితానికి తృప్తిపడటం పాత కోపాలూ దుర్భరమైన గడచిన కాలాన్నీ
మరిచిపోవడం చెయ్యకపోతే కళాకాంతులుంటాయా బ్రతుకులో.
నువ్వుండేది ఎక్కడ రాజూ రేపు ఏ టైమ్ లో ఇంట్లో ఉంటావు కొంచెంసేపు నేను వస్తాను మీఇంటికి అన్నాడు కాఫీషాప్ లోంచి బయటికి వచ్చేసేటప్పుడు సమీర్.
ఆదివారమేగా రేపు. ఇంట్లోనే ఉంటాను. నా సెల్ నెంబరు కూడా తీసుకోమంటూ తన ఇంటి గుర్తులు చెప్పగానే పరమానందం పడిపోయాడు సమీర్. కారణం తను ఉన్న చోటికి చాలా
దగ్గిరే రాజు ఉన్నది.
రాత్రంతా కలతనిద్రే అయింది రాజుకి. ఏమీ ఎరగనట్టే ఎంత చక్కగా కబుర్లు
చెప్పేశాడు ఆ సమీర్ . దాన్ని గురించే ఆలోచనలు. ఊళ్ళో ఉన్నన్నాళ్ళూ తన తండ్రిని సమీర్ వాళ్ళనాన్నగారు ఎన్ని రకాలుగా ఎన్ని విషయాల్లో ఏడిపించుకు తినలేదూ. వాళ్ళకంటే ఆస్తిలోనూ అంతస్తులోనూ పరపతిలోనూ కులంలోనూ చదువుల్లోనూ అన్నిట్లో తాము తక్కువ అని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నలుగురిలో అపహాస్యం చేస్తూ ఎన్నివిధాలుగానో తమ కుటుంబాన్ని నవ్వులపాలు చేశాడు వాళ్ళ నాన్న. ఘోరమైన నేరాన్ని తాను చేసి అది తన తండ్రిమీద మోపాడు. దొంగ సాక్ష్యాలు పుట్టించి జైలుశిక్ష పడేలా చేశాడు .
అవమానం భరించలేక తన తండ్రి గుండె ఆగిపోతే తమని ఓదార్చిన దిక్కులేదు. అమ్మా తనూ ఇద్దరూ కష్టపడి పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుని తిండీ బట్టాయే కాదు చదువుకున్నాడు కూడా తను. అందుకే సొంత ఊరంటే ప్రేమ మక్కువ మాయమయ్యాయి తనలో. ఆ ఊరి వాళ్ళు కనపడినా ఆసక్తి అన్నది లేకపోవడమే కాదు అసలు జీవితమంటేనే విరక్తి భావం పెరిగింది ఏడాది కిందట కామెర్లు వచ్చి అమ్మ నీరసంగా అయినప్పటినించీ.
చెప్పినట్టుగానే మర్నాడు సమీర్ వచ్చాడు. తనని తను పరిచయం చేసుకున్నాడు
రాజు తల్లికి. కంగారుపడిపోయింది తులశమ్మ చేతులు జోడించి బాబూ తమరు మా ఇంటికొచ్చారా
అంటూ. మీరు నాకు దండం పెట్టకండి
చటుక్కున ఆమె చేతులు పుచ్చుకున్నాడు సమీర్ . ఆ వెంటనే ఆమె కాళ్ళకి నమస్కరించాడు.
తెల్లబోయింది తులశమ్మ.
ఎందుకింత నాటకం ఆడుతున్నాడు వీడు అనిపించింది రాజుకి.
కానీ కూచుని కబుర్లు మొదలుపెట్టాక అది నాటకం కాదని అర్ధమైంది.
చూడు రాజూ ఆరోజుల్లో చిన్నవయసు కాబట్టి మానాన్నగారు చేసే వంచనలూ మోసాలూ
ఏవీ నాకు తెలియవు తెలుసుకునే ప్రయత్నం కూడా నేనెప్పుడూ చెయ్యలేదు. ఈమధ్య కాలంలోనే మా అమ్మ నాన్నగారిగురించి ఆయన ఎవరెవరి పట్ల ఎలాంటి అన్యాయాలు చేశారో చెప్పింది. అవి నాకు
తెలిసేటప్పటికి మీరా ఊర్నించే వెళ్ళిపోయారు. అప్పటినించీ నేను నీగురించి అప్పుడప్పుడు
ఆలోచిస్తూనే ఉన్నాను. నిన్న మనం కలిసిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా నేను పాతాళాన్ని నువ్వు హిమాలయమంత ఎత్తుకి ఎదిగి పోయావని .
అర్ధం కానట్టు చూశాడు రాజు . దగ్గిరగా వచ్చి స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేశాడు సమీర్.
నాలాంటి వాళ్ళు మాతాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అనే రకం. కానీ నీలాంటివాళ్ళు పైకి వచ్చారంటే స్వయంకృషి వల్ల పైకి రావడం కదా. మీ తాత తాగిన
నేతి వాసన చూడమనవు . నువ్వే నెయ్యి సంపాదించుకుంటావు కష్టపడి . మా పెద్దలు చేసిన తప్పులు
క్షమించి నేను చెప్పేది ఒక్కటి వినమని కోరుతున్నాను.
ఏమిటన్నట్టుగా చూశాడు రాజు .
చిన్నప్పుడు మన ఊళ్ళో ఆడుకున్నవి ఆ బడి విశేషాలూ ఏమీ గుర్తు లేవా నీకు
ఎందుకు గుర్తులేవూ కాలవలో ఈత కొట్టడాలూ తోటల్లో ఆటలూ పరుగులూ
ఆ మాటలంటుంటేనే రాజు కళ్ళల్లో వచ్చిన మెరుపు గమనించాడు సమీర్ .
కొంచెంసేపటిక్రితం ఉన్న రాజు ముఖకవళికలు వేరు ఇప్పుడు వేరు. గమనించాడు సమీర్.
రాజూ ఇంకనించీ నువ్వు సొంత ఊరంటే అవే తలుచుకో రాజూ వేరే తలంపులు రానివ్వకు . నీ ముఖంలో వచ్చే కళాకాంతులు చూసి మీఅమ్మగారికి కూడా ఎక్కడలేని శక్తీ వస్తుంది తెలుసా . ఆ రోజుల్లో మా నాన్న మీ పట్ల చేసిన అన్యాయాలకి నేను చాలా బాధపడటమే కాదు సిగ్గుపడుతున్నాను కూడా. చెప్పానుగా అప్పట్లో నాకు అవేమీ నిజంగా తెలియదు. నాన్న పోయాక అమ్మ చెప్పింది . అమ్మకి కూడా నాన్న చేసే పనులేవీ ఇష్టం ఉండేది కాదని చెప్పింది. శతృత్వం అన్నది ఎప్పటికప్పుడు తుంచుకోవాలనీ స్నేహబంధం ఎప్పటికీ పెంచుకుంటూ పోవాలనీ నేర్పింది అమ్మ. అందుకే మీ ఇంటికి వచ్చాను. నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు.
సమీర్ మాటలకి రాజు పెదవులమీద చిందులాడిన చిన్న చిరునవ్వు ఆ ఇంటికి కొత్త వెలుగునిచ్చింది.
నిజమే బాబూ మీ అమ్మగారు అన్నమాట నూటికి నూరుపాళ్ళూ నిజం. తరతరాలకీ శతృత్వాన్ని పెంచుకుంటూ పోతే మనిషికి మనిషిపొడ గిట్టకుండా మచ్చుకైనా మానవత్వం అన్నది ఈ భూమ్మీద మిగలదు.
తులశమ్మ మాటలు స్నేహితులిద్దరి మనసుల్లోనూ మంచి ఆవిష్కరణకు పునాది వేశాయి.
****
పేరు…………..తమిరిశ జానకి
పుట్టినఊరు….మచిలీపట్నం, క్రిష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్ . ( అమ్మమ్మగారి ఊరు )
తండ్రిగారి ఊరు—నర్సాపురం , పశ్చిమగోదావరిజిల్లా .
పుట్టినతేదీ——-26- 10- 1946
విద్య———–బి.ఏ.
రచనలు చేయడం మొదలుపెట్టినది 1960 లో హైస్కూల్లో చదువుతున్నప్పటినుండీ. హైస్కూల్ మేగజైన్ ,కళాశాల మేగజైన్ , చిన్నచిన్న స్థానిక పత్రికలలోనూ రచనలు చేశాను. అప్పుడు నాపేరు యర్రమిల్లి జానకి. పూర్తిపేరుతో రాయకుండా వై.జె. అనే పేరుతో రాసేదాన్ని. కళాశాలలో చదివేటప్పుడు మంజువాణి అనే పత్రికవారు అన్ని ఊళ్ళల్లోని కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులకు నిర్వహించిన కధలపోటీలో నా కధకు బహుమతి వచ్చింది. యువ, జ్యోతి మాసపత్రికలలోనూ, ఆంధ్రపత్రిక, చుక్కాని పక్షపత్రికలోనూ,కృష్ణాపత్రికలోనూ, ఎమ్.ఎస్.కో వారి పుస్తకప్రపంచంలోనూ వై.జె. అనే పేరుతోనూ, వై.జానకి అనేపేరుతోనూ కధలు రాసేదాన్ని. 1965లో వివాహమయ్యాక తమిరిశ జానకి పేరుతో అన్ని పత్రికలలోనూ కధలు , కవితలు , వ్యాసాలు, నవలలు రాస్తూనే ఉన్నాను.
మంచి సందేశం