నారి సారించిన నవల-23

                      -కాత్యాయనీ విద్మహే

లతవి బ్రాహ్మణ పిల్ల , పిచ్చి వాళ్ళ స్వర్గం, భగవంతుడి పంచాయితీ , దెయ్యాలు లేవూ ! సప్తస్వరాలు, వైతరణీ తీరం వంటి నవలలు మరికొన్ని ఉన్నాయి.( నిడదవోలు మాలతి An  invincible force in Telugu literature  , see Eminent scholars and  other essays in Telugu  literature , 2012, e book ) అవి కాస్త కుడిఎడమలుగా మిగిలిన  లత నవలలో వలె సాంఘిక జీవితంలోని వైచిత్రిని చిత్రించినవే. హెచ్ జి వెల్స్ , సోమర్సెట్ మామ్ వంటి రచయితలను చదువుకొన్న ప్రభావం  వస్తు సేకరణలో , నిర్వహణలో ఉన్నట్లు నవలలకు ఆమె వ్రాసుకొన్న ముందుమాటలను బట్టి  తెలుస్తుంది.  లత సాంఘిక నవలల కన్నా భిన్నంగా , విశిష్టంగా కనబడేవి ఆమె వ్రాసిన పౌరాణిక చారిత్రక నవలలు. 

 లత అనగానే అందరూ ముందుగా చెప్పే  నవల మోహనవంశి. మోహనవంశి గురించి  మాట్లాడటం లత  నవలల తత్వం తెలిసిన సంస్కార లక్షణానికి గుర్తు అన్న స్థాయి గుర్తింపు ఉంది .   2013 ప్రతి లభిస్తున్నది. మొదట ఎప్పుడు అచ్చయింది తెలియదు. 1965 లో వచ్చిన ‘అంతరంగ చిత్రం’  ( లత స్వీయ చరిత్ర ) లో ఈ నవల గురించిన  ప్రస్తావన ఉంది కనుక ( నిడదవోలు మాలతి )స్థూలంగా  ఇది  1965 లోపలే  వచ్చి ఉంటుంది అనుకోవచ్చు . ఈ నవలకు   ‘ఎలా చెప్పాలి’  అనే శీర్షికతో  వ్రాసుకొన్న వెనుక మాటలో  లత బ్రతకమని నాకు నిర్ణయించిన  కాలంలో  ఇరవయి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినై ఎం మిగుల్చుకోగలిగాను అని ఇన్నాళ్లు బాధపడిన విషయం ప్రస్తావించి మోహన వంశి నవల వ్రాసాక ఇప్పుడు తనకా బాధ లేదంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఆమె 28 ఏళ్ల వయసులో ఈ నవల వ్రాసిందని. 1932 లో పుట్టిన ఆమెకు 28 ఏళ్ళు అంటే 1960. అదే మోహనవంశి నవల రచనాకాలం. ఆమె వ్రాసిన  అనేక నవలలు 1960 వి కావటం విశేషం. 

సాంఘికంగా ఏ నిబంధనను , ఏ ధర్మాన్ని పాటించని కృష్ణుడి కథ చిత్రంగా తోచి తన ఆలోచనను, ఆంతర్యాన్ని చుట్టేసిందని మోహనవంశి నవలకు అదే మూలం అని నవలకు రాసుకున్న వెనుక మాటలో చెప్పుకొన్నది లత. రాధాకృష్ణుల ప్రేమ మాధుర్య నిరూపణం ఈ నవల.  యుగాలనాటి  రాధతో ఆంతర్యంలో  అభేదాన్ని సంభావించి , సాధన చేసి చేసి వ్రాసిన నవల ఇది. వ్రేపల్లె లో కృష్ణుడి రాసక్రీడల దగ్గర ప్రారంభించి  కంసుని పక్షాన మధురకు ఆహ్వానించి తీసుకుపోవటానికి వచ్చిన అక్రూరుడితో కలిసి మధురకు రావటం , కంసుడిని చంపి, తల్లిదండ్రులను జైలు నుండి విడుదల చేసి , తాతగారిని సింహాసనం మీద కూర్చోపెట్టి  అక్కడ ప్రజాతంత్ర పాలన కొనసాగించటం, ఉద్ధవుడిని  వ్రేపల్లె కు పంపి తనకోసం ఎదురు చూస్తున్న స్త్రీలకు తాను వస్తానని సందేశం పంపటం , ఒక రాత్రి ఒంటరిగా వెళ్లి వాళ్లందరినీ ఆదరించి రావటం , రుక్మిణితో పెళ్లి , ద్రౌపది తో పాండవుల వివాహం తీరు పై అర్జునుడితో సంభాషణ , సుభద్రను అతను పెళ్లాడటం , పాండవుల రాజసూయం , శిశుపాల వధ , సత్యభామా జాంబవతి కృష్ణుడి భార్యలు కావటం , పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు , పాండవుల పక్షాన కౌరవుల కడకు శ్రీకృష్ణుడి రాయబారం , యుద్ధ సన్నాహం, గీతోపదేశం మొదలైన ఘటనలను ఒరుసుకొంటూ సాగే  ఈ నవలలో అసలు జీవ ధార , నిత్య ప్రవాహం  స్త్రీపురుష ఆకర్షణలోని సహజ సౌందర్యాన్ని భిన్న కోణాలనుండి ఆవిష్కరించటం. 

శ్రీకృష్ణుడు బాల్యంలో ఇల్లిల్లూ చొచ్చి పాలు , పెరుగు , వెన్న ఆరగించిన అల్లరి పిల్లవాడు. అదే సమయంలో గొల్లభామల హృదయాలలోకి కూడా చొచ్చినవాడు. అతని మురళీ గానానికి పరవశులై గోపికలు ఇళ్లను , భర్తలను , వదిలి  అతని వెంటపడటం, యమునాతీర సైకత భూములు, కాళింది తీర ప్రాంత బృందావనం   గోపికా కృష్ణుల రాసక్రీడలతో , గోపికల విరహాలాపనలతో మారుమ్రోగటం  భాగవతం దశమ స్కంధంలో వర్ణింప బడినవే . అవి భగవంతుడి లీలలు.  అహంకార మమకార బంధాలను అన్నిటినీ వదులుకొని నీవే తప్ప ఇతఃపరంబెరుగ అన్న స్థాయికి వాళ్ళను తెచ్చి ముక్తినియ్యటం ఆ లీల .  కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు , మరి 16000 మంది గోపికలు నరకాసురుని  చెర  నుండి  విముక్తులై కృష్ణుడి ఆశ్రయంలోకి వచ్చినవాళ్లు ఉన్నారు. ఒక పురుషుడి జీవితంలో ఇంతమంది స్త్రీలు ఉండటం దేవుడి లీలగా ఆమోదం పొంది ఉండవచ్చు కానీ మానవుడైనప్పుడు దీనిని ఎలా అర్థంచేసుకోవాలి? పురుషుడి కి ఎంతమంది స్త్రీలతోనైనా సంబంధం ఉండటానికి ఈ సమాజం హక్కు , అవకాశం ఇచ్చింది. కానీ అనేక పెళ్లిళ్లు , వైవాహికేతర సంబంధాలు స్త్రీలకు నిషేధం విధించింది. విధి నిషేధాలు స్త్రీల అంతఃకరణ ప్రవృత్తులను నియంత్రించగలవా ? ఈ మొదలైన అనేక ప్రశ్నలు రేపే ఆలోచనల వెల్లువలో స్త్రీపురుష  మోహ లక్షణాల  లైంగిక ఆసక్తుల తత్వాన్ని నిగ్గు తేల్చటం లక్ష్యంగా మోహనవంశి నవల ఇతివృత్తాన్ని సమకూర్చింది లత. 

అసూయ , అర్థరహితమైన వాంఛ , ద్వేషం లేకుండా మనుషులందరూ కృష్ణుడి నిండి వెలిగిన దీపాలుగా భావించింది లత. రాధ , తపతి, చంద్రిక  అందరూ  అతని భౌతిక భావ గాన సౌందర్య లోలులే . వాళ్లకు పెళ్లయి సంసారాలు ఉన్నాయి. వయసులో కృష్ణుడికన్నా పెద్దవాళ్ళు.  కృష్ణుడికి వాళ్ళందరి పట్ల సమ అనురక్తి.  అసలతని దృష్టిలో వేరువేరు పేర్లతో భౌతికంగా భిన్నులుగా  కనిపించే స్త్రీలందరూ ఒకే స్త్రీత్వం యొక్క భిన్న అభివ్యక్తులు . 

వ్రేపల్లె ను దేవభూమిగా అభివర్ణిస్తుంది లత . దేవలోకం భూమి మీద ఉన్న స్వర్గం . స్వాతంత్య్ర ప్రియత్వం , సాధుత్వం , అనుభవ ప్రాధాన్యం , వివాహంతో , కుటుంబంతో నిమిత్తం గానీ   ఎటువంటి విధినిషేధాలు గా నీ  లేని స్వేచ్చాయుతము , స్వచ్ఛందము అయిన స్త్రీపురుష  ప్రేమ బంధం , నీది నాది అన్న భేదభావం లేని సుఖ శాంతుల జీవితం ఒక సారెప్పుడో చూసివచ్చిన నందుడు ఆ  విలువలను వ్రేపల్లె  గణతంత్ర  అధికారిగా  అమలు చేసాడు కనుకనే  అక్కడ  స్త్రీలకు స్వేఛ్చ సాధారణ విషయం. ఇంద్ర పూజ వంటి వైదిక సంప్రదాయాలు ప్రవేశించినా మొత్తంగా వైదిక మార్గం మనుషుల జీవితాన్ని శాసించకపోవటం వ్రేపల్లె విలక్షణత. ఆ ఇంద్ర పూజను కూడా మాన్పించి కృష్ణుడు గోవర్ధన గిరి పూజ ప్రారంభించటం  ద్వారా ప్రకృతి శక్తుల ఆరాధనకు ప్రాభవం కల్పించిన అంశాన్ని ప్రస్తావించిన లత ప్రకృతి సహజమైన స్త్రీపురుష ఆకర్షణకు , అనురక్తికి , అనుభవానికి అనితర ప్రాధాన్యం కల్పించినట్లయింది . ఇంద్రపూజ జరిపించటానికి వచ్చిన బ్రాహ్మణులు ఏ పనీ లేకుండా వ్రేపల్లె లో గడిపిన వారం రోజులలో వారిలో ఒకడు వ్రేపల్లె స్త్రీతో ఏర్పరచుకొన్న సంబంధం గురించి వచ్చిన సంఘర్షణను ఒక దానిని నవల ఇతివృత్తంలో భాగం చేయటం ద్వారా ఆసక్తి కరమైన వైరుధ్యాన్ని చర్చకు పెట్టింది లత. 

బ్రాహ్మణ బృందంలో భూరిశ్రవుడు వ్రేపల్లె జయవాణి ని ఆకర్షించాడు. ఆమె  పట్ల నైష్ఠికుడు, బ్రహ్మచారి అయిన అతనీలోనూ ఆమె పట్ల ఆకర్షణ జనించింది. ఇద్దరూ యమునా సైకత తీరాలలో, తోటలలో విహరించారు. ఏకాంతంలో వాళ్ళిద్దరినీ చూసిన గురువు  శైవాలుడు అది అధర్మమని , వేదబాహ్యమైన పని అని మండిపడ్డాడు. ఈ ప్రతిస్పందనను  జయవాణి ఎంత తేలికగా తీసుకొని నవ్వుతూ తోసేసిందో భూరిశ్రవుడు అంత భయపడ్డాడు. వ్రేపల్లె ధర్మానికి మధురా నగర ధర్మానికి మధ్య వైరుధ్యమే దానికి కారణం. స్త్రీ పురుషుల ఏకాంతం  ఏ నిషేధాలు లేని సహజ ప్రాకృతిక ధర్మం వ్రేపల్లె లో . వైదిక మార్గ నిర్దేశనాల మధ్య అది ఒక సామాజిక ధర్మం. మతం, కులం , కుటుంబం,   రాజ్యం అన్నిటి  నియంత్రణకు అది లోబడి ఉంటుంది. అందువల్ల అది నేరం కూడా అవుతుంది. అయింది కనుకనే గురువు శిష్యుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు తీర్ధయాత్రలు చేసి పాపవిముక్తుడు కావచ్చు అన్న మినహాయింపు కూడా ఇచ్చాడు.  వ్రేపల్లె సంస్కృతిలో. యువతీయువకులు అన్యోన్యఆకర్షితులు కావటం   నేరం కానీ కాదు. మధురానగర శిక్షాస్మృతి వ్రేపల్లె లో చెల్లదు అన్నది కృష్ణుడి తీర్పు. 

వివాహం , కుటుంబం లేని  దేవలోకపు  ఆచారాలు మానవుడికి నచ్చవు  అని తండ్రి చెప్తున్నప్పుడు ‘ నచ్చేదేమిటి? ఎవరి సంఘానిర్మాణం వారిది. కాకపోతే ఏ సంఘంలో సుఖం ఉంటె ఆ సంఘాన్ని మిగతా సంఘాలు అనుసరిస్తాయి.’ అని కృష్ణుడు అన్నమాటలు గమనించదగినవి. ఒకటి ఎక్కువని , ఒకటి తక్కువని దేనినీ తిరస్కరించక పోవటమే అసలైన సంస్కృతి.మానవుల సుఖ సంతోషాలు గీటురాయిగా అభివృద్ధి చేసుకోవలసిన మానవసంబంధాల సంస్కృతి లత ఆదర్శం.  అన్న సిద్ధాంతం   వ్రేపల్లె ను వదిలి మధురకు వెళ్లేముందు తన వియోగాన్ని భరించలేమని తల్లి యశోద దగ్గరనుండి తపతి , చంద్రిక , నీరజ అందరూ దుఃఖితులే అయ్యారు. ప్రేమతో ఆర్ద్రమైన హృదయం , కన్నీటితో నిండిన కన్నులూ, ఆరాధనతో పరవశమైన బ్రతుకు వెల లేనివి అని కృష్ణుడు అంటాడు. ఆంతర్యంలో కలుగుతున్న వేదన బాధో, మోహమో తెలుసుకోలేని స్త్రీల అసమర్థతే వాళ్ళ దుఃఖానికి కారణం అని రాధ ముఖంగా చెప్పించింది లత. 

అనాకారి అయిన కుబ్జలోని శారీరక వంకలనన్నిటినీ  పోగొట్టిన దైవీ శక్తి  కృష్ణుడు అని ప్రతీతి. లత దానిని స్త్రీత్వాన్ని గుర్తించి గౌరవించే మానవీయ లక్షణంగా చెప్తుంది. కుబ్జ కళ్ళల్లో కదలాడే  ఒకానొక  అందాన్ని గుర్తించిన  కృష్ణుడి పలకరింపు కుబ్జకు తానొక స్త్రీని అన్న స్పృహను కలిగించిందని అంటుంది లత.  స్త్రీత్వం అందం , అవయవ సౌష్ఠవం వంటి భౌతిక అంశాలను బట్టి కాదు నిర్ధారితమయ్యేది. స్త్రీత్వం వీటన్నిటికంటే అతీతమూ , ఉన్నతము .. దానిని మేల్కొల్పగల మానవీయ సంస్కారం పురుషులలో కోరదగినది. అటువంటి ఆదర్శ పురుషుడు శ్రీకృష్ణుడు. ఇది లత నిర్ధారణ. 

‘ఒకే తడవ ఒకే స్త్రీ ప్రేమను పొందగలిగితే కలిగే మాధుర్యం నాకు చాలదు’ అంటాడు శ్రీకృష్ణుడు కుబ్జతో. అది కృష్ణుడి బహు నారీ సంబంధాలకు సమర్ధింపు కావచ్చు. కానీ లత ఉద్దేశంలో అది ఆ మాధుర్యానుభవం స్త్రీలు కూడా కోరేదే. రాధ , తపతి , చంద్రిక , నీరజ అందరూ పెళ్లిళ్లు అయినవాళ్ళే కానీ ఆ మోహ మాధుర్య కాంక్ష తరుముతుంటేనే కృష్ణుడికోసం వేదన పడ్డారు. అయితే ఎవరూ కృష్ణుడితో శాశ్వతంగా ఉండిపోయే పెళ్లిని కోరుకోలేదు. ఒకరిని ఒకరికి శాశ్వతంగా కట్టి ఉంచటమే ఊపిరాడని తనం. దాని నుండి విముక్తి కోసమే వాళ్ళు మైదానాలకు పరుగులు తీశారు. వివాహం కృత్రిమం అని కృష్ణుడు అంటే రాధ తనకు దాని మీద నమ్మకమే లేదంటుంది. వివాహం వాళ్ళ దృష్టిలో ఒక భౌతిక కర్మ అంతే . ఆత్మలను ముడిపెట్టే బంధం దానికి అతీతమైంది. కర్మానుభవం కావాలి కనుక పెళ్లి చేసుకోవాలి అంతే .. రాధ చేత కృష్ణుడికి ఆ మాటే చెప్పించి లత పూర్తిగా తిరస్కరించకపోయినా అంత ప్రాముఖ్యం ఉన్న వ్యవస్థ ఏమీ కాదు వివాహం అని తేల్చేసింది. 

రుక్మిణి వివాహ ఘట్టం ఉంది ఈ నవలలో .  మనసు లేని వాడితో పెళ్లిని  వ్యతిరేకిస్తాడు కనుక , తనపై మనసుపడిన ఆమెను మన్నించాలి కనుక కృష్ణుడు విప్రరాయబారానికి సమాధానంగా రుక్మిణిని ఎత్తుకొచ్చి ఇల్లాలిని చేసుకున్నాడని లత దానిని వ్యాఖ్యానిస్తుంది. అట్లాగే ద్రౌపది అయిదుగురు పురుషులకు భార్య కావటం లో ఆ నైతికత ఏమీ లేదన్న విషయాన్ని సూచించటానికి సవ్యసాచికి , కృష్ణుడికి ఒక సంభాషణ కల్పించింది. ఒక స్త్రీ ఏకకాలంలో  అనేకమంది పురుషులతో సంబంధం కలిగి ఉంటూ వాళ్ళను సంతృప్తి పరుస్తూ తాను సంతోషపడటం వ్యాసుడికి సమ్మతమైందేనని కూడా చెప్తుంది. ద్రౌపది పాండవుల సంబంధాన్ని అసూయరహితమైన ప్రపంచ నిర్మాణానికి మెట్టుగా కూడా వ్యాఖ్యానించింది లత. స్త్రీవిషయం లో అసూయ నుండి మానవుడు సాధించవలసిన విముక్తికి సంబంధించిన ప్రయత్నం భర్త కథామూలం అని కూడా ఆమె అభిప్రాయం. ఆ మూలం సత్యవతి.  దాశరాజు కూతురై పడవ నడుపుతూ  ఒక మునీంద్రుడివల్ల వ్యాసుడిని కని, శంతన మహారాజును పెళ్ళాడి ఇద్దరు కొడుకులను కని , వాళ్ళు అకాలమరణం చెంది సంతానం లేని వితంతువులుగా మిగిలిపోయిన కోడళ్ల యందు వంశ వారసులైన పుత్రులను కనమని వ్యాసుడిని నియోగించిన  సత్యవతి ఉదంతాన్ని కృష్ణార్జునల సంభాషణలో భాగం చేసి అది సృష్టికి, మాతృత్వానికి  ఆమె ఇచ్చిన ప్రాధాన్యతగా  కృషుడి మాటలలో నిర్ధారించి చెబుతుంది లత. ఈ సందర్భంలో ఎవరో ఎంపిక చేసిన స్త్రీపురుషుల మధ్య కాక స్వచ్చందంగా కోరిక కలిగిన స్త్రీపురుషుల మధ్య ఏర్పడే సహజ సంబంధమే ఉత్తమ సంతాన ఉత్పత్తికి కారణం అవుతుందని కూడా సూచిస్తుంది. సత్యవతి లోని మాతృత్వ ప్రేరణ  కుంతి యమ పవన ఇంద్రులతోనూ , మాద్రి అశ్వనీ దేవతలతోనూ పాండవులను కనటానికి  కూడా మార్గదర్శకమైనదని .. ఈ రోజు పంచపాండవులకు భార్య అయిన కృష్ణ మరొక సత్యవతి అని అర్జునుడు చెప్పిన మాట విన్నాక కృష్ణుడు తాను ప్రతి స్త్రీని రాధగా చూసినట్లు పాంచాలి కూడా అయిదుగురినీ సవ్యసాచిని చూసినట్లే చూస్తున్నదన్నమాట అనుకొంటాడు. ఆ రకంగా లత ఒక స్త్రీకి అనేకమంది పురుషులతో సంబంధం అనైతికం కాదని స్థాపించటానికి ఇంత ప్రయత్నం చేసింది. 

ఎవరిదారిన వాళ్ళు , ఎవరి అవసరాన్ని బట్టి వారు ఉచితమైన పద్ధతిలో జీవించటం , సుఖించటం చేయవలసిన పనులని , ఆధిక్యత కోసం తోటి మానవులకు మత్తు మందు పెట్టటం , స్వీయ ఉన్నతి కోసం తోటివాళ్లకు నియమాలు విధించటం చేయకూడని పనులని , సాంఘిక నియమాలు ఉరితాళ్లు కానంతవరకు పాటించవచ్చు అనీ,  ఆంతర్యానికి ప్రాధాన్యత ఇచ్చి జీవించటం ముఖ్యమని   తనదైన ఒక సమన్వయపూర్వక జీవన సూత్రాన్ని ప్రతిపాదించటానికి లత వ్యాసుడిని , సత్యవతిని కూడా సమర్ధవంతంగా వాడుకున్నది. సత్యవతి చేత ‘స్త్రీ ఒక ప్రాణి. కొన్ని అభిరుచులూ , అనుభూతులూ కలిగిన మానవి . ఆమె ఒక పురుషునితో ఉండాలనుకొంటే ఉంటుంది. లేదనిపిస్తే మానుతుంది. ఎవరి సంస్కారాన్ని  బట్టి వారు జీవితాన్ని దిద్దుకుంటారు’ అని చెప్పించి స్త్రీపురుష సంబంధాలను అక్రమ సంబంధాలు అనే మాటతో కలుషితం చేస్తున్న లోక ధర్మాన్ని తిప్పికొట్టింది లత. మొత్తం మీద ఈ నవలలో మధుర ప్రేమ కు పెద్దపీట వేసి అది గోపికల ఆరాధనగా , సర్వ సమర్పణంగా , ఏ కోరికలూ లేని మనన ధ్యానంగా , సర్వ స్వతంత్ర గీతంగా , గానంగా సాగుతూనే ఉంటుందని పెళ్లి వలన ఏర్పడే ధర్మ ప్రేమ లో స్వేచ్ఛ కన్నా సర్దుబాటుకే ప్రాధాన్యం ఉంటుందని రుక్మిణి ప్రవర్తన మూలకంగా సూచించింది. ఆ రకంగా మోహన వంశి నవల ఒక రొమాంటిక్ గానే కాదు లత భావజాల సిద్ధాంత నిరూపణకు వ్యూహాత్మకంగా  రచించబడిన నవల.  శ్రీచరణాలు  నవల కూడా ఈ కోవలోదే కావచ్చు  . జ్ఞానులూ … భారత ప్రాచీన సాహిత్యం మీద పూజనీయభావం గలవారూ అయినా పాఠకుల కోసం వ్రాసిన నవలగా మోహనవంశి  తో పాటు పేర్కొన్న నవల ఇది. ( పౌలస్త్యుని హృదయం ముందుమాట వినతి ) 

భారత భాగవత కథలను కలిపి మోహనవంశి నవల వ్రాసిన లత రామాయణ కథ ఆధారంగా వ్రాసిన రెండు నవలలు పౌలస్త్యుని ప్రేమకథ , స్వర్ణసీత . మొదటి నవల దేశి ప్రచురణగా 1973 లో ప్రచురించబడింది. రెండవది ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వచ్చింది కానీ ఎప్పుడు వచ్చిందో తెలియదు. 2013 లో సాహితీ ప్రచురణగా వచ్చింది. లత రంగనాయకమ్మ వ్రాసిన రామాయణ విషవృక్షం (1974- 76) పుస్తకాన్ని సవాల్ చేస్తూ రామాయణ విషవృక్ష ఖండన వ్రాసి ప్రచురించింది 1977 లో . పౌలస్త్య హృదయం దానికంటే ముందే వచ్చింది. స్వర్ణసీత మరి ముందో వెనుకో …!?  

పులస్త్యుడి మనుమడు పౌలస్త్యుడు. పులస్త్యుడు బ్రహ్మ మానసపుత్రుడు. పదిమంది ప్రజాపతులలో ఒకడు. సప్త ఋషులలో పులస్త్యుడు కూడా ఉన్నాడు. అతని కొడుకు విశ్రవసుడు. అతనికి కిలబిల అనే భార్య వలన కుబేరుడు,  కైకసి గా ప్రసిద్ధి కెక్కిన  పుష్పోత్కట వలన రావణ కుంభకర్ణ విభీషణులు , శూర్పణఖ జన్మించారు. పులస్త్యుడి కొడుకు కొడుకు కనుక రావణుడు పౌలస్త్యుడు అయినాడు. రాక్షసుడిగా , సీతను అపహరించి తెచ్చిన అనైతికుడిగా , కాముకుడుగా లోక నిందకు గురైన రావణుడిని బ్రహ్మ మునిమనుమడుగా ,  బ్రాహ్మణుడుగా ,శివభక్తుడుగా చూపించే క్రమంలో పౌలస్త్యుడు అయినాడు. అతనిని ఒక మానవీయ కోణంనుండి చూసే ఆధునిక దృష్టి నుండి కాటూరి పింగళి కవులు పౌలస్త్య హృదయం కావ్యం వ్రాసారు. అది లతను బాగా ఆలోచింపచేసింది. రామాయణంలో రావణుడు ఎందుకు అలా చిత్రించబడ్డాడు అన్న ప్రశ్న ఆమెను వేధించింది . దానికి జవాబు వెతికే క్రమంలో పౌలస్త్యుని ప్రేమ కథ ఇతివృత్తం  సమకూడింది. ఈ నవలకు వినతి అనే శీర్షికతో వ్రాసిన ముందుమాటల భావం అదే . రావణుడు సీతాపహరణం చేయటానికి ఆనాటి యుగధర్మం, లేదా రాజకీయం మాత్రమే కారణం కాని రావణుడి అధర్మ బుద్ధి లక్షణం కాదని నిరూపించటానికి అభిముఖంగా రావణుడి వ్యక్తిత్వాన్నినిర్మిస్తూ , ఉన్నతీకరిస్తూ కథను అల్లుకుపోయింది లత. 

రావణుడు గొప్ప శివభక్తుడే కాదు గొప్ప సంగీత కవిత్వ మహత్వ సంపద ఉన్నవాడు అని ప్రసిద్ధి. రావణుడు రచించాడు అని చెప్పబడే శివతాండవ స్తోత్రం ఒకటి ఉంది. ఆ స్తోత్రంతో  రావణుడు  శివుని పూజించటం  దగ్గర కథను ప్రారంభించి ,రంభ ను ప్రవేశపెట్టి అలకాపురిపై దండయాత్ర సమయాన రంభను  చెరిచిన ఘటన ను ప్రస్తావనకు తెచ్చి ఆ అపకీర్తి నుండి విముక్తికి రావణుఁడు ఎంత తపిస్తున్నాడో చూపించి రంభను క్షమించమని అడిగేంత ఉత్తమ సంస్కరం కలవాడు అతను స్థాపించటం జరిగింది. మండోదరిని ప్రవేశపెట్టి ఆమె ముందు రావణుడు తనలోని లోపాలు, లౌల్యాల గురించి అవి అయితే రక్తగతాలు, వంశ వారసత్వంగా  వచ్చినవి లేదా  యుగధర్మం తనతో   చేయించినవి అన్నట్లుగా తన అంతరంగాన్ని బహిరంగపరచుకొన్నట్లు కథను నడిపించింది. స్త్రీ వీరుడైన పురుషుడి సొత్తు అన్న బలమైన యుగభావం తనను స్త్రీల కోసం ఆశపడేట్లు చేసిందని రావణుడు తన ప్రవర్తనకు, ప్రవృత్తికి ఒక న్యాయ సంబద్ధతను  సమకూర్చుకొనే పనిచేశాడు. 

ఆ సందర్భంలోనే రావణుడు జానకిని తాను చిన్నతనంలోనే మిథిలా నగరంలో చూశానని అప్పుడే ఆమెకు రావణుడితో పెళ్లవుతుందని తనకు తెలుసు అని రాముడికి ఆ విషయం చెప్పటానికి , రాయబారం నడపటానికి తాను అయోధ్య వెళ్లానని , అక్కడ హనుమంతుడు ఉన్నాడని , శూర్పణఖ అప్పుడే రాముడిని చూచి వలచిందని .. ఇలాంటి చిత్రగతి కథనం చూస్తాం. నారదుడు రాముడి కథ వ్రాయమని వాల్మీకికి పురమాయించినట్లు , ఆ సంకల్పం జరుగుతున్నప్పుడే రావణుడు వాల్మీకిని కలిసినట్లు మృత్యురహస్య జ్ఞానబోధతో అతనిని రచనకు ఉపక్రమింపచేసినట్లు మరొక కల్పన. మొత్తం మీద  నవల ప్రారంభంలోనే  రావణుడు మరణాన్ని గురించిన ఎరుకతో ఉన్నాడని మండోదరిని అందుకు సిద్ధంచేస్తున్నాడని స్థాపించింది రచయిత్రి.  వాల్మీకి  సీతారాములను నాయకీనాయకులుగా చేసి వ్రాసే రామాయణ కావ్యంలో  భవిష్యత్ చరిత్రలో  పొరపాటున పాపాత్ముడుగా పరిగణింపబడే తానేప్రతినాయకుడు అని తెలిసిన వాడు  పౌలస్త్యుడు. వర్తమానం నుండి భూత భవిష్యత్తులలోకి  రాకపోకలు సాగిస్తూ అన్నిటికీ   సాక్షిభూతుడుగా  పౌలస్త్యుడి చిత్రగతి వర్ణన   అతని కాలాతీత మానుషత్వ ప్రకటనకే. 

అయోధ్యా రాజ్ఞి మరుత్తుని పట్టమహిషిని యజ్ఞదీక్షలో ఉండగా చలించిన  మనస్సు తో శివపూజలో మాతృదేవతారాధన చేసినందుకు రావణుడికి ఆయోధ్యారాజ్ఞి వల్లనే నాశనం అని రుద్రాణి శపించినట్లు మరొక కల్పన. ఈ సంగతి కూడా రావణుడికి తెలుసు .. అఖండ మేధావంతుడు కానీ శాపగ్రస్తుడు కనుక దాని ఫలం రామాయణ కావ్యంలో దుష్కీర్తి గా నమోదువవుతుందని సనత్కుమార ఋషిచేత కూడా చెప్పించటం జరిగింది. అతనితో సంవాదంలోనే శివకేశవ అభేద స్థాపన రాముడి పట్ల రావణుడి ఆరాధన .. అతని చేతుల్లో మరణించలన్నంత స్థాయిలో వ్యక్తం కావటం చూస్తాం. సానుభూతి అంతా రాముడి పైన ఉండేట్లు కావ్యం వ్రాయటానికి వాల్మీకికి బోధ జరిగినట్లు … వాల్మీకి సంకల్పం మేరకు నడుస్తున్న కథలో తనపాత్రకు నిర్దేశింపబడుతున్న గతిక్రమంలో ప్రవర్తించటానికి రావణుడు సిద్ధపడుతున్నట్లు మరొక కల్పన. త్రికాలలోకే కాదు కాల్పనిక ప్రపంచపు హద్దులు కూడా ముట్టగల ఒక అద్భుత వ్యక్తిగా రావణుడిని తీర్చి దిద్దింది లత. 

వాల్మీకితో మాట్లాడుతూ రావణుడు   జానకీ కళ్యాణం వరకు కథ వచ్చిందని తెలుసుకొని అందుకు సంతోషిస్తూనే తన చెల్లెలి సంగతి ఏమిటని అడుగుతాడు. బ్రాహ్మణ కన్యకు క్షత్రియుడితో వివాహం పొసగదు అన్నది వాల్మీకి సమాధానం. జానకి జనకుడి అభిమానాపుత్రికే కానీ కన్నా కూతురు కాదు కదా , బ్రాహ్మణ కన్య కాదని మీరు చెప్పగలరా అని ఒక ప్రశ్నవేసి వెళతాడు. దాని గురించి ఆరా మొదలవుతుంది . నారదుడు చెప్పిన సమాధానం ఆమె మండోదరి పుత్రి కనుక బ్రాహ్మణ బాలిక . ఆ విషయం  రాముడికి రావణుడు చెప్పాడు. నారదుడు దానికి సాక్షి . ఇలా రావణుడి కూతురు జానకి , రాముడు అతని అల్లుడు . రాముడి తల్లి కౌసల్యకు రావణుడు చిన్ననాటి స్నేహితుడు. అందువలన ఆమె అరణ్యవాస సమయాన రాముడు తిరిగే భూములు రావణుడి అధికారంలోవి కనుక అతని రక్షణ బాధ్యత రావణుడికి అప్పచెప్పినది అని మరొక కల్పన. 

శూర్పణఖ తానెప్పుడో ప్రేమించిన రాముడిని జనస్థానంలో చూసి  సేవకోసం అడిగిందని ,లక్షణుడు ఆమెను గాయపరిచాడని ,సీత నవ్వింది అని దానికి ప్రతీకారం కావాలని ఆమె అన్న రావణుడిని కోరింది.  తనకూతురిని తాను  ఎత్తుకు రావటానికి  రావణుడు నిర్ణయించాడు. బతుకు మీద విసుగు కలిగింది కనుక రాముడి చేతిలో మరణించటానికి అది కారణం అవుతుంది కనుక అదంతా చెప్పి  మారీచుడిని మాయలేడి రూపంలో పోవటానికి ఒప్పించి రావణుడు ఈ పని చేసాడని నవలలో కథను నడిపింది లత.  వాల్మీకి రామాయణ రచనను బట్టి రావణుడు ప్రవర్తించినట్లు ఒకసారి , రావణుడి చర్యలను గమనిస్తూ వాల్మీకి వ్రాస్తున్నట్లు ఒకసారి కథను నడిపిన ధోరణి విచిత్రంగా కనిపిస్తుంది. 

ఈ నవలలో హనుమంతుడిని రాముడికి బాల్య స్నేహితుడు గా కల్పించింది లత . అందువల్ల రాముడి బాల్య కౌమార దశలలో  అతను అయోధ్యలోనే ఉన్నట్లు ఘటనలను కల్పించింది. హనుమంతుడు కూడా రామాయణం వ్రాస్తున్నట్లు మొదటి నుండి సూచనలు చేస్తూ వచ్చింది. ఆ హనుమంతుడే సుగ్రీవుడితో రాముడికి స్నేహం కలిపి రావణుడిపై యుద్ధానికి సైన్య సహాయాన్ని సమకూర్చాడు. వాలి సుగ్రీవుల యుద్ధంలో సుగ్రీవుడి పక్షాన రాముడు వాలిని చాటునుండి బాణం వేసి చంపినట్లు రామాయణ కథ చెబుతుంది. అది అనైతికం కదా అనే వాదనను  ఏ శత్రుత్వమూ లేని వ్యక్తిని చంపటం అధర్మం కాదా అనే అభిప్రాయాన్ని నిరాకరించి రాముడి చర్యకు న్యాయసంబద్ధతను సమకూర్చటానికి వాలి రావణుడి భార్య అయిన మండోదరి మీద అత్యాచారం చేసిన ఘటనను కారణంగా చూపిస్తూ కథను నడిపింది లత. 

సీతను తెచ్చిన రావణుడు ఆమెకు  సుగ్రీవుని వలన మండోదరికి పుట్టి జనకుని భూములలో వదిలివేయబడిన శిశువే ఆమె అని ఎరుక పరిచాడని మండోదరికి బిడ్డను చూపి తల్లీబిడ్డల సంగమ సంతోషాన్ని తాను చూసి ఆనందించాడని లత కథనం. మిథిలా నగరంలో తొలిసారి చూసినప్పుడే  రావణుడు సీతలో మండోదరి పోలికలను చూసి పితృభావనకు లోనయినట్లు కథను మొదలుపెట్టిన లత అడవిలో రాముడిని చూసిన సందర్భంలో కూడా పక్కనే ఉన్న సీత లో మండోదరి పోలికలు చూసి ఆశ్చర్యపడ్డట్లు చెప్తుంది.క్షేత్ర న్యాయం ప్రకారం  సీత  తనకూతురు అని  చెప్పి రాముడికి అప్పగిస్తే యుద్ధము , లంకా నాశనము ఉండదు కదా అని విభీషణుడు చెప్పినా  రావణుడు వినలేదు.  రాముడి చేతిలో మరణమే తన అభీష్టం అని ప్రకటించి జాత్యుద్ధరణకోసం అతనే విభీషణుడిని వెళ్లి రాముడి శరణు కోరమని పంపినట్లు కథను నడిపి లత రావణుడిని ఉదాత్త పురుషుడిగా చేసింది. 

ఆంతర్యంలో అతను విష్ణుభక్తుడు అని అతనిని చూసి తరించి అతనిచేతిలో మరణించి మోక్షం పొందాలన్నది అతని ఆకాంక్షగా చేసి దానిని ఫలవంతమయ్యేవరకు జీవ శక్తులను ఊదుతూ నవలలో కథను నిర్వహించుకు రావటంలో మోహనవంశి నవలలో తాను రాధ అయిపోయిన లత ఇందులో రావణుడు అయిపోయిందా అనిపిస్తున్నది.   లత రామభక్తి  ఈ నవలే తివృత్తంలో  అంతర్వాహిని. జటాయువు ,శబరి , వాలి – ఇలా ఒక్కొక్కరు రాముడి చేతిలో మరణించి మోక్షం పొందారన్న సూత్రాన్ని కథలో ముందుకు తీసుకుపోతూ రావణుడి వైపుగా కథను నడిపించి ముగించింది. 

స్త్రీని మాతృమూర్తిగా దర్శించే బిడ్డలక్షణం , కూతురిగా  చూసే పితృవాత్సల్యమూ   రావణుడిలో పుష్కలంగా ఉన్నట్లు అంచలంచెలుగా నవల ప్రారంభం నుండి నిరూపిస్తూ వచ్చింది లత. భార్య పట్ల పట్టరాని ప్రేమ . చెల్లెలిపట్ల అమిత అభిమానం . రాముడి పట్ల ఆమెకు కలిగిన ప్రేమను అతను గౌరవించాడు. బ్రాహ్మణ కన్యకు క్షత్రియ పురుషుడి యందు ప్రేమ నిషేధం అన్న మండోదరికి అయినా , వాల్మీకికి అయినా అదెంత అసంబద్ధమో స్పష్టంగానే చెప్పాడు . ప్రేమ  కులాన్ని చూసి ,తెలిసి పుట్టదని అది ఒక సహజ స్వచ్చంద భావోద్వేగం అని అభిప్రాయపడ్డాడు. రావణుడు మనిషి .. మంచి చెడ్డలు రెండూ కలగలసిన మనిషి. బలాలు బలహీనతలు ఉన్న మనిషి . ఏది బలహీనతో గుర్తించి దాని నుండి బయటపడటానికి పెనుగులాడే మనిషి వివేకపూర్ణుడు. లత రావణుడిని అలా చిత్రించాలని చిత్రించింది. లోకంలో మూడువందలకు పైగా రామాయణాలు ఉన్నాయని అంటారు. అనేక రామాయణాలు ఆ  ఇతిహాసంలోని పాత్రల భిన్న స్వభావాలను భిన్న కోణాలనుండి వ్యాఖ్యానించాయి. ఆ అవగాహన నుండే  లత ఈ నవల వ్రాసింది. అనేక రామాయణాలలో పౌలస్త్యుని ప్రేమకథ అనే ఈ నవల కూడా ఒకటి అనుకొంటుంది ఆమె . 

 సీతను అపహరించాడు ,  కాముకుడు అన్న దుష్కీర్తి తనకు ఆపాదిస్తూ రామాయణ రచన జరుగుతున్నది అన్నది రావణుడిని ప్రారంభం నుండి వేధించిన సమస్య. శివారాధన సమయంలో ఈ అపకీర్తి భయం గురించి చెప్పుకొని తనను అనుగ్రహించమని శివాని ని కోరుకున్నాడు. అప్పుడు ఆమె “ ఈ మహాయుగ చతుర్ధ పాదమున అయిదువేల ఆరువందల ఇరువది సంవత్సరాలు గతించిన అనంతరము- నా నావంశలలో  ఒక్కటి కనకదుర్గగా వెలసిన క్షేత్రమున – నా నామమే గల ఒక ఐశ్వర్యవతి సాహిత్యోపాసకురాలై నీ చరితము కాలానుగుణముగ రచించును లెమ్ము” అని చెప్పిందని వ్రాసింది లత .మహాయుగ చతుర్ధపాదం కలియుగం. కనకదుర్గ వెలసిన క్షేత్రం  విజయవాడ.  అమ్మవారి పేరే గలిగిన    ఐశ్వర్యవతి సాహిత్యోపాసకురాలు తెన్నేటి హేమలత.  నవల చివర మరొక  ఘట్టం. మండోదరికి రాముడికి మధ్య సంభాషణ .  రావణుడికి ఉన్న అపకీర్తి భయాన్ని తొలగించమని మండోదరి కోరినప్పుడు రాముడు వాల్మీకి రామాయణంలోనే ఆ విషయం నిగూఢమై ఉందని కాదన్న కలియుగ ప్రధమ పాదమున ఒక సౌభాగ్యవతి చేత కొలదిగా తొలగింపబడును అని వరం ఇచ్చినట్లు ఆ సంభాషణ ను బట్టి తెలుస్తున్నది .  ఆ సౌభాగ్యవతి తెన్నేటి  హేమలత  తప్ప మరొకరు కాదు.  ఆ రకంగా లత ఈ నవల రచన అటు పార్వతీదేవి  మాటగా , ఇటు రాముడి మాటగా  యుగయుగాలకిందే  ఎవరూ కాదనటానికి వీలులేని దైవసంకల్పంగా సాగిందని పౌరాణిక ట్విస్ట్ ఇచ్చింది. కవులే కాదు నవలా రచయితలు కూడా నిరంకుశులేనేమో .. 

స్వర్ణసీత మరీ చిత్రమైన నవల.  రావణుడి చెర నుండి సీత ను విడిపించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అయిన తరువాత  సీత శీలం గురించి, ఆమెను తెచ్చుకొని ఏలుకొంటున్న రాజు ధర్మ లక్షణం గురించి లోకంలోని అపవాదుల గురించి చారుల వలన విని   రాజుగా ప్రజల విశ్వాసం చూరగొనటం ముఖ్యం కనుక రాముడు గర్భవతి అయిన సీతను అడవులకు పంపించాడని , అశ్వమేధం చేయవలసిన సందర్భంలో భార్య పక్కన  ఉండాలి గనుక బంగారంతో సీత ప్రతిమను చేయించి  ఆ స్థలాన నిలిపి కార్యం వెళ్లదీసిన కథ ప్రసిద్ధం. కానీ స్వర్ణ సీత నవల వస్తువులో  అది  కనీ కనబడని పోగు మాత్రమే. శ్రీరామ పట్టాభిషేకానంతరం సీత మహారాజ్ఞి గ నెరపిన ప్రాభవం, సీత రాముల చుట్టూ అల్లుకున్న రాజకీయాలు, వాటిని విప్పటానికి,  పరిష్కరించటానికి జరిగిన ప్రయత్నాలు ఈ నవలేతివృత్తానికి కీలకమైనవి. పౌలస్త్యుని ప్రేమకథ కు పూర్వాపరాలలో విస్తరించిన సీత కేంద్రమైన రాజకీయాలు ఇందులో కథనం చేయబడ్డాయి .  ఇందులో నాయిక సీత అయితే ప్రతినాయిక శూర్పణఖ.  పౌలస్త్యుని ప్రేమకథలో రామునియందు ఆమె  మధురప్రేమ ను , రాముడు ఆమెను రెండవభార్యగా స్వీకరించి ఆదరిస్తే బాగుండును అన్న రావణుడిని ఆశను చిత్రించిన హేమలత ఇందులో శూర్పణఖను సర్వ అనర్ధాలకు, తిరుగుబాట్లకు మూలమైన అధర్మ శక్తిగా , అందరిచేతా ఏవగించుకొనబడిన  స్త్రీగా చిత్రించింది.    లంకారాజ్యం మీద సంపదల మీద ఆశ , అధికార కాంక్ష నడిపిస్తే నడిచిన మనిషిగా పతనపు చివరి అంచులవరకు తీసుకువెళ్ళింది. 

పౌలస్త్యుని ప్రేమకథలో హనుమంతుడు సీతాయాణం వ్రాస్తున్నట్లు ప్రస్తావన ఉంది.. స్వర్ణసీతలో అతనాపని కొనసాగిస్తున్నట్లు శిలలమీద వ్రాసి సముద్రంలో భద్రపరుస్తున్నట్లు చెప్పబడింది. హనుమద్రామాయణం ఒకటి ఉందని , హనుమంతుడు రాముడిని దగ్గరినుండి చూసినవాడుగా అతని జీవితాన్ని కొండ రాళ్ళమీద వ్రాసాడని, వాల్మీకి రామాయణానికి పోటీ కాకూడదని సము ద్రంలో వాటిని వేసాడని ఒక జనశ్రుతి ఉంది. దానిని లత ఈ విధంగా వాడుకున్నది. అంతే కాదు అనేక రామాయణ కథలు తాను ఏమేమి చదివి తెలుసుకొన్నదో వాటినన్నిటినీ హనుమంతుడు చెప్తున్నట్లుగా ఈ నవలలో భాగం చేసి వాటిమీద విన్నవాళ్ళ అభిప్రాయాలన్నట్లుగా తన వ్యాఖ్యానాలను చేర్చింది. రామాయణ కథాకాలం ఒకటి ఉందనుకొంటే రామాయణాలు అన్నీ ఆ సమకాలంలోనే వ్రాయబడ్డవి కాదు. కాలాంతరాలలో రామాయణాలు రచించబడుతూనే ఉన్నాయి. కావ్యనాటక రూపాలలో వచ్చాయి. వాటన్నిటినీ రామాయణ కాలంలోనే వచ్చినట్లు  రామాదుల సమక్షంలో  హనుమంతుడు వాటిని చర్చకు పెట్టినట్లు వ్రాయటంలో సంభవ యోగ్యత పొసగదు. 

సీతారాముల రాజ్యంలో వాళ్ళ గురించి ఏవేవో అపప్రధాలు పుట్టించి ప్రచారం చేస్తూ  , వాస్తవాన్ని వక్రీకరించటమే లక్ష్యంగా   అనేక రామాయణాల రచన  సాగిందన్న సూచన ఇందులో ఉంది. వాస్తవం ఏమిటి? దానిని వక్రీకరించవలసిన అవసరం ఎవరికి ఉంది ? ఆ ప్రక్రియ ఎలా జరిగింది అన్న ప్రశ్నలకు సమాధానాలు కథాగతిలో కానవస్తాయి. సీత మండోదరి కూతురు. వెళ్లి వలన పుట్టింది అని పౌలస్త్యుని ప్రేమకథలో చెప్పిన లత ఈ నవలలో ఆమె మండోదరికి రావణుని వలన పుట్టిన బిడ్డేనని చెబుతుంది. అయితే సీత తల్లిదండ్రుల దగ్గర పెరగలేదు. ఆమె అక్కడే పెరిగితే రావణుడి సంపదకు , అధికారానికి వారసురాలు అవుతుంది. శూర్పణఖకు వాటి మీద ఎప్పటి నుండో మనసు ఉంది. సీత పుట్టుక లంకకు చేటు అని ఒక అపప్రధను పుట్టించి ఆ పిల్లను వదిలించుకొనేటట్లు అన్నగారిని ప్రోద్బలం చేసింది. దండకారణ్య భూములను కానుకగా తీసుకొని రావణుడు ఆ పిల్లను  జనకుడికి ఇచ్చాడు. జనకుని ఇంట పెరిగి  ఆమె జానకి అయింది. దండ కారణ్యభూములు తనవిగా చేసుకొని తిరుగుతున్న శూర్పణఖ అరణ్యవాస కాలాన సీతను చూసి మండోదరి పోలికలు గ్రహించి ఆమె మీద పగ సాధించదలచింది. రావణుడు శూర్పణఖ వల్ల సీతకు ముప్పు ఉందని గ్రహించి ఆమెను తెచ్చి తన ఇంట పెట్టుకొన్నాడు. రాముడితో యుద్ధానికి బయలుదేరే ముందు లంకాద్వీపంలోని సంపదను ఆమె పేరా వీలునామా వ్రాసి ఆమె జడలో భద్రపరచుకోమని ఇచ్చాడు. ఆ విషయం ఎలాగో తెలిసింది శూర్పణఖకు. సీత అగ్నిప్రవేశాన్ని అనివార్యం చేసే కథలు ప్రచారం చేసింది. మండోదరి సూచనతో హనుమంతుడు సీతను అగ్ని నుండి ఉద్ధరించి తెచ్చాడు. 

రావణుడి మరణం , విభీషణుడి రాజ్యాభిషేకం జరిగి సీతారాములు అయోధ్యలో సుఖంగా ఉన్నారనుకొంటే శూర్పణఖ లంకా సంపదల అపహరణ కోసం తన కొడుకు శంబూకుడితో కలిసి కుట్రలకు పాల్పడింది . అంతఃపురంలోకి తన వేగులను ప్రవేశపెట్టి పథకాలు రచించింది . అది పసిగట్టి మహారాజ్ఞి సీత హనుమంతుడిని గూఢ చార వ్యవస్థ అధ్యక్షుడిని చేసి వాస్తవాలు తెలుసుకోమంది. హనుమంతుడు  అనేక ప్రాంతాలు తిరిగి, పెద్దలను అనేకులను కలిసి  , ప్రజా సమూహాలలో సంచరించి  అన్నిటికీ మూలం శూర్పణఖ దురాశ అని ఆర్యులపట్ల , బ్రాహ్మణులపట్ల అనార్యులలో విద్వేషం రెచ్చగొట్టటం ద్వారా శూర్పణఖ తన స్వప్రయోజనాలు నెరవేర్చుకొనటానికి ప్రయత్నిస్తున్నది అని నిర్ధారణకు వచ్చాడు.అతనిచ్చిన సమాచారం మేరకు కుట్రలను భగ్నం చేయటానికి రాముడు హనుమంతుడితో కలిసి   మారువేషాలు కట్టి వెళ్ళటం ఇలాంటి ఘట్టాలతో ఒక నేర పరిశోధన  నవల లాగా దీనిని నడిపించింది లత.   

సీతశీలం గురించి న అపవాదు సృష్టి కర్త కూడా ఆమే . అయితే ఆ కారణంచేత కాక ఈ అంతఃపుర కుట్రలు ఒక కొలిక్కి రాకముందు తాను అయోధ్యలో పురుడు పోసుకొనటం అంత క్షేమం కాదని సీత స్వయంగా తన తల్లి మండోదరి ఆశ్రమం సమీపంలోనే ఉన్న వాల్మీకి ఆశ్రమానికి వెళ్లి అక్కడ ప్రసవించటానికి నిర్ణయించుకున్నట్లు  లత ఈ నవలలో ఒక కల్పన చేసింది. ఆమె అంతఃపురంలో లేని కాలంలో ఆమె లేదన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండటానికి మయుడు స్వర్ణ సీత ప్రతిమను తయారుచేసాడని కల్పన. సీత పరిత్యక్తగా పురుడు పోసుకోలేదు. తల్లి మండోదరి , పినతల్లి సరమ , తన తండ్రి రావణుడికి వేరొక స్త్రీ యందు పుట్టిన చిన్న సోదరి మరీచి వీళ్లందరి మధ్య కుశలవులకు జన్మనిచ్చింది. నాయనమ్మ కైకసి కూడా చూడటానికి వచ్చింది.  పాము కరచి శూర్పణఖ మరణించింది. తల్లి కైకసితో సహా అందరూ ఆమెను ఏవగించుకొన్నారు. దహనం చేస్తే వాతావరణం పాడవుతుందని భూమిలో లోతుగా తవ్వి ఉప్పుపొసి పూడ్చిపెట్టించారు. రాముడు ఈ లోగా అంతఃపుర కుట్రలను ఛేదించి అంతఃపుర సేవలలోకి  తనపోలికలతో ఉన్న కవల సోదరిని తప్పించి  చేరిన సూర్యనఖ వంటి శత్రువులను బంధించాడు.  కుశలవులతో సీత మళ్ళీ అయోధ్య చేరింది.వాళ్ళను చూడటానికి వచ్చిన  అహల్య మాట మీద సూర్యనఖ క్షమించబడి చంద్రనఖ తో పాటు రాజదంపతులకు చామరములు వీచే కొలువులో ఉన్నారు . వాళ్లిద్దరూ రావణుడికి మరొక స్త్రీ యందు పుట్టిన పిల్లలు. సూర్యనఖ శూర్పణఖ కొడుకు శంబూకుడికి భార్య. అత్త మరణించింది. భర్త ఊసు వదిలి ఆమె రాముడి కొలువులో కుదిరిపోయింది.  

రాముడు శంబూకుడిని కూడా చంపాడు.  అయితే  తపస్సు చేస్తున్నందుకు కాదు. అశోకవనంలో పిల్లలతో విశ్రాంతి తీసుకొంటుండగా  తన  సేవలో ఉన్న సూర్యనఖను ఎత్తుకుపోవటం వల్ల. బలాత్కారం చేయబోయి హత్య చేసినందువల్ల. దానితో శత్రునాశనం పూర్తయింది. ఇలా రామాయణానికి సంబంధించిన ప్రచారంలో ఉన్న అనేకానేక కథనాలను కలుపు కొంటూ సీత కేంద్రంగా కథను కల్పించి లత వ్రాసిన నవల స్వర్ణ సీత .  రాముడు పిల్లలను చదువుకు పంపి సోదరులకు ఇక్ష్వాకు రాజ్యంలో భాగాలు పెట్టి సీతతో , హనుమంతుడితో కలిసి వానప్రస్థానానికి బయలుదేరినట్లు నవల ముగించింది. తన సకల సద్గుణ సామర్ధ్యాలవల్ల సీత స్వర్ణ సీత అయింది తప్ప ఈ నవలలో స్వర్ణసీత ప్రతిమను బట్టి కాదు  ఈ నవలకు ఆ పేరు.  

రాముడు వానప్రస్థానము ప్రతిపాదన చేస్తూ “ మన ఈ చరిత్ర , ఈ రామరాజ్యమూ అందరికీ నచ్చుననుకొంటివా ? భవిష్యత్తులో ఎంతమందికీ నా రామాయణమూ , నీ సీతాయాణమూ విరక్తి పుట్టింపకుండునా ? అప్పుడు హనుమ ఏమి చేయును ? వాల్మీకి ఏమి చేయును”  అని సీతతో అన్నట్లు లత వ్రాసిన వాక్యాలు గమనించదగినవి. పౌలస్త్యుడే కాదు , రాముడు కూడా తమగురించి భవిష్యత్తు ఏమి తీర్పులు ఇస్తుందో దిగులు పడినవాళ్ళే . వాళ్లకు భవిష్యత్తు అయినది లతకు సమకాలం. వర్తమానం. ఆ కాలంలో వచ్చిన రామాయణ విమర్శ , సృజనరూప వ్యాఖ్యానాలు ఇవన్నీ తనకు కలిగిస్తున్న చిరాకుకు అదొక వ్యక్తీకరణ  అనుకోవచ్చు. 

రామకథా రచన జీవితాన్ని తరింపచేసే క్రియ అనీ , కవి అయినవాడు రామాయణం వ్రాయక ఇంకెన్ని కథలు వ్రాసినా ప్రయోజనంలేదని హనుమతుడిచేత అనిపించిన మాట లత ఆంతర్య సంబంధమైనదే. తన రామాయణ కథా జ్ఞానం  అంతటికీ , రామభక్తికి , సీతామాత ఆరాధనకు హనుమంతుడిని  ఆలంబనగా చేసుకొన్నలత ఈ నవలలో  తాను హనుమంతుడే  అయిపొయింది. 

లత వ్రాసిన చారిత్రక నవల ఉమరుఖయ్యాం . 2013 నాటి సాహితీ ప్రచురణల ప్రతి లభిస్తున్నది. కానీ రచనాకాలం వివరాలు లభించటం లేదు. పదకొండు పన్నెండు శతాబ్ధాలలో జీవించిన పర్షియన్‌ గణిత ఖగోళ శాస్త్రజ్ఞుడు, కవి ఉమర్‌ ఖయ్యాం. మద్యాన్ని, మగువను అస్వాదించటాన్ని ఒక జీవిత తత్వంగా తన కవిత్వంద్వారా ప్రచారం చేసాడు.సృష్టికి ములం దుఃఖమే నన్న అవగాహన నుండి వ్యక్తిగత అనుభవం, ఆనందం ఆదర్శంగా జీవించటమే  ఉమర్ తత్వసారం. ప్రకృతినైనా, స్త్రీనైనా, చూడటానికి, తద్వారా పొందే అనుభవానికి ప్రాదాన్యత నిచ్చాడు. ఆ క్రమంలో శరీరానికి అనితర ప్రాధాన్యత నిచ్చాడు. శరీరాన్ని సుఖింప చేయ్యటం స్త్రీకైనా పురుషుడికైనా ఆదర్శమే. అందుకు సాంఘిక నీతిని,కట్టుబాట్లను తిరస్కరిస్తాడు.మనిషి సృష్టించిన కృత్రిమ సంఘాన్ని నిలబెట్టేందుకు నీతిని సృష్టించి దానికి శరీరాన్ని లోకువ చేసి దూషించటాన్ని సహించని తత్వం ఆయనది.శరీరం సత్యం.ఆత్మ అనుమానాస్పదం అని చెప్పిన ఉమర్  జీవితం, కవిత్వం లతకు నవలేతి వృత్తాన్ని సమకూర్చాయి. 

సైన్యంలో పనిచేసి తండ్రి చనిపోవటంతో  ఒంటరిదై విశృంఖలంగా తిరిగి తనకంటే ఇరవైఏళ్లు పెద్దవాడైన ఉమర్ ఖయ్యాం కు ఆత్మర్పణ చేసి అతనితో ఆశ్రమంలో ఉంటూ మదిరను , స్నేహాన్ని ఇచ్చి అతని భావాలను పంచుకొనే సాఖీ అతని కావ్యాలతా బీజం. ఆమెతో పాటు జులేఖా , మెహర్ అనే మరో ఇద్దరు స్త్రీలు ఉమర్ ఖయ్యాం జీవిత సరిహద్దులను తాకినవాళ్లు. ఈ ముగ్గురికీ పర్షియాదేశపు సుల్తాన్ షహెన్ షా జలాలుద్దీన్ జీవితంలోనూ అంతే ప్రాధాన్యం ఉన్నది. రాజ్య వారసత్వ తగాదాల కారణంగా బ్రతుకు భయంతో మారువేషంలో బాగ్దాద్ వీధులలో తిరిగిన కాలంలో  తండ్రి  చనిపోయి వారసత్వంగా లభించిన ఒంటెతో  వీధులలో సంచరిస్తూ తాను జీవించే పద్ధతి ద్వారా ఆయనకు జీవితోత్సాహాన్ని ఇచ్చింది. జులేఖా  ఆయన మహారాజ్ఞి. రాజ్య కార్య దురంధురాలు. మెహర్ ఆయన భవనంలోని  బానిస పిల్ల. ఆ ముగ్గురు స్త్రీలు ఈ ఇద్దరు పురుషులకు   మధ్య సంబంధాలలోని సంఘర్షణగా , సమన్వయంగా నవలేతి వృత్తం పరిణామం చెందింది. 

మెహర్ సుల్తాన్ షహెన్ షా మీద మనసు పడింది . కానీ బానిసగా తనకున్న సాంఘిక స్థాయి ఆమెను జులేఖకు భయపడేలా చేస్తుంది. మెహర్ కళ్ళలోని వాంఛ , శరీరంలోని చాంచల్యం అర్ధం అవుతుంటే జులేఖా కు భయపడి మెహర్ పై జాలి పడి ఆమె నుండి తప్పించుకొనటానికి ప్రశాంతిని వెతుక్కొంటూ షహెన్ షా రుస్తుం పేరుతో ఖయ్యాం కుటీరానికి చేరాడు. ఆక్కడ ఒకప్పుడు తనకు బాగ్దాద్ వీధుల్లో ఆత్మబలాన్ని ఇచ్చిన సాఖీ ని చూసి మోహంలో పడ్డాడు. అంతఃపురంలో మెహర్ ను ప్రణయ భిక్ష కోసం అడగలేని వాడు తన  చక్రవర్తిత్వాన్ని మరుగుపరచుకొని ఉమర్ ఖయ్యాం కుటీరావరణంలో లభించిన స్వేచ్ఛతో సాఖీని అడగగలిగాడు. ఆకర్షించగలిగాడు. మెహర్ అతన్ని వెతుక్కొంటూ అక్కడికి వచ్చింది. సాఖీ అతనితో వెళ్ళింది . మెహర్ కూడా వాళ్ళతోటే . అయినా సాఖీ ఖయ్యాం కవిత్వంలో కరిగిపోవటమే తనకు ఇష్టం అని అతనితో కుటీరానికి వచ్చేసింది. 

సాఖీతో మక్కాకు పోవటానికి సిద్ధపడుతున్న ఉమర్ తో సాన్నిహిత్యాన్ని కోరి అక్కడికి వచ్చిన జులేఖా కూడా అతనితో మాక్కాకు వస్తానంటుంది. రాణిని అన్న అహం, అది  పోతుందేమోన్న భయం , మెహర్ పట్ల అసూయ ఇవన్నీ ఆమెలో గుర్తించాడు కనుకనే ఉమర్ అవన్నీ వదులు కోవలసినవని ఆమెకు చెప్పాడు. ఇక్కడే ఖయ్యాం ఒక మాట అనుకొంటాడు. సాఖీ, మెహర్ , జులేఖా ముగ్గురూ ఏకకాలంలో షహెన్ షా శరీరాన్ని తన కవిత్వాన్ని కోరుకొంటున్నారని. ఈ జీవన వైచిత్రిలో దేనికీ వగచక లభించినదానితో ఆనందించటం ఉమర్ అభ్యాసం చేసిన జీవిత విధానమని నిరూపితమవుతూ ఉంటుంది. జులేఖా ఆయనతో మక్కాకు బయలుదేరే సాహసమే చెయ్యలేకపోయింది. మెహర్ ఆయనతో మక్కా వరకైతే వెళ్లివచ్చింది కానీ రాగానే షహన్ షా ను కలవటానికి వెళ్ళిపోయింది. ఇలా ముగ్గురు స్త్రీలు ఇద్దరు పురుషుల ఆకర్షణ ఆరాధనల సంబంధ బాంధవ్యాలతో కథను నడుపుతూ సాఖీ సమక్షంలో ఖయ్యాం మరనించినట్లు  నవలను ముగించింది లత. ఖయ్యాం కవితల సౌందర్యాన్ని నవల పొడుగునా పరిచి చూపింది లత.  

తెన్నేటి హేమలత వ్రాసినట్లుగా తెలుస్తున్న శతాధిక నవలలో ఎంత  వస్తువైవిధ్యం ఉన్నదో తెలుసుకొనటానికి , ఆమె జీవిత దృక్పథం ఏమిటో అర్ధం చేసుకొనటానికి ఈ నవలల పరిచయం సరిపోతుందనుకొంటా. 

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.