నిశి దోచిన స్వప్నాలు
(ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)
-డి. నాగజ్యోతిశేఖర్
నిద్ర కూడా ఓ కలే నాకు….
ఒక్కసారైనా…..
పనిసూరీడు చొరబడని విశ్రాంతిచీకటిని
కనుపాపల్లో నింపుకోవాలి!
తుషార బిందు పరిశ్వంగానికి మైమరచి వాలే తృణపుష్పంలా నిద్దుర స్పర్శ కనురెప్పలపై భారంగా ఒరగాలి!
ఎగిరిపోతున్న సాయంత్రం పిట్టల్ని కాఫీ కప్పులోకి ఆహ్వానించి వెలుగు కబుర్లు చెప్పాలి!
రాత్రి చెట్టుపై నక్షత్రమై వాలి
ఇష్టమైన అక్షరాలను కౌగలించుకోవాలి!
పారేసుకున్న కలలనెమలీకల్ని రెక్కలుగా చేసుకొని ఏకాంతంలోకి ఎగిరెళ్ళాలి!
కుదించబడ్డ స్వీయ కవితల్ని
పూలతీగల్లా పరచాలి!
ఒక్కసారైనా…..
వంటింటి చెప్పుల్ని విడిచి
నగ్న పాదాలతో పచ్చని పచ్చికలో పరుగులు తీయాలి!
దోచుకోబడ్డ ఉదయాలను అందిపుచ్చుకుని
దీర్ఘ రాత్రుళ్లకు స్వస్తి పలకాలి!
ఒక్కసారైనా…
నన్ను నేనోసారి మనసారా పలకరించుకొని
ఆ తడిదనంలో పులకరింతల మొలకై చిగురించాలి!
పారేసుకున్న నా ఆత్మ పుస్తకాన్ని కాంతి వాక్యాలతో నింపాలి!
నేనో నవ్వు దేహమై నిండుగా
ఒక్కసారి నవ్వాలి!
ఓ పూలరుతువునై పరిమళ పొద్దుల్లో ఇష్టంగా మేలుకోవాలి!
*****
కవిత చాలా బాగుంది నాగ జ్యోతి గారూ.. రోజు వారీ యాంత్రిక జీవనంలో కొంత సమయానికి.. ప్రశాంతి కి ఆడవారు పడే ఆవేదన ను బాగా వ్యక్తీకరించారు.. అభినందనలు