నిష్కల – 7
– శాంతి ప్రబోధ
తలూపి చిన్నగా నవ్వుతూ కిటికీలోంచి చేయి అందించిన కరుణ చేతిలో చేయి కలిపింది నిష్కల.
ఆ తర్వాత సరస్వతిని పరిచయం చేసింది.
ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దామనుకుంటున్నారు అడిగింది నిష్కల.
కరుణ భర్త వివరాలు అడిగింది సరస్వతి.
గూగుల్ లో పని చేస్తారని మాత్రమే తెలుసు. మిగతా వివరాలు ఏమీ తెలియదు తల వంచుకుని చెప్పింది కరుణ.
మీ ఆయన పేరు చెప్పండి. నేను కూడా గూగుల్ లో పనిచేస్తున్నాను అన్నది సరస్వతి.
అవునా.., అన్న కరుణ గొంతులోనూ, కళ్ళలోనూ, మొహంలో భయం రెపరెపలాడుతూ స్పష్టంగా కనిపించింది నిష్కల , సరస్వతి లకు.
మీరు ఏమీ భయపడకండి కరుణా. మీకు అవసరమైన సహాయం అందించడం లో నాకంటే సరస్వతి ఎక్కువగా చేయగలదు. అందుకే తీసుకొచ్చాను కరుణ మొహంలో కనిపించే భీతి పోగొట్టే ఉద్దేశంతో అన్నది నిష్కల.
ఆ వెంటనే , సరస్వతి ఇక్కడ గత మూడేళ్ళ నుంచి ఉంటున్నది. తెలుగు సంఘాల వారితో చాలా పరిచయాలు ఉన్నాయి. మీకు ఏ విధమైన సహాయమైనా చేయగల సామర్థ్యం ఆమెకుందని స్పష్టం చేసింది నిష్కల .
‘అవునండీ.. మీ ఆయన నేను ఒకే సంస్థలో పనిచేస్తుండొచ్చు. మీ ఆయనెవరో నాకు తెలియదు. మీరు పేరు చెప్తే తెలుసుకునే అవకాశం ఉంది. అట్లాగని మీరు భయపడాల్సిన పనిలేదు.
నిష్కల మీ గురించి, మీ కొచ్చిన ఇబ్బంది గురించి చెప్పినప్పుడు నాకు చేతనైనంత సహాయం చేయాలనుకున్నాను. అయిన వాళ్లందరినీ వదిలి కొత్త వ్యక్తితో, కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఆడపిల్లల ఇబ్బందులు కొత్తగా చూస్తున్నవి, తెలియనివి కావు . నేను కూడా అట్లా వచ్చినదాన్నే’ అంటూ కరుణ కేసి చూసింది సరస్వతి.
శూన్యంలోకి చూస్తున్నట్లున్న కరుణ చూపులు సరస్వతి చూపుల్లో చిక్కడంతో తల దించుకుంది కరుణ.
‘ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకండి.
మీరు వచ్చిన పది రోజులకే ఇండియా వెళ్ళిపోతా అంటున్నారంటే తొందర పడుతున్నారని, ఎమోషనల్ గా నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తున్నది’ సూటిగా చూస్తూ అన్నది సరస్వతి.
‘లేదు లేదు, ఆవేశంతో, అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం అస్సలే కాదు. చాలా స్పష్టతతో తీసుకున్న నిర్ణయమే’ తల అడ్డంగా ఊపుతూ దృఢంగా అన్నది కరుణ. అలా అంటున్నప్పుడు గొంతులో వేదన ధ్వనించింది. ఆమె కళ్ళలో నీళ్లు ఉబికివచ్చాయి. వాటిని దాచే ప్రయత్నం చేస్తూ చూపు పక్కకు తిప్పింది.
‘మీరిద్దరూ వేరువేరు కుటుంబ వాతావరణం నుంచి , వేర్వేరు అలవాట్ల నుంచి , ఆర్థిక, సాంస్కృతిక వాతావరణాల్లోంచి వచ్చి ఉంటారు. ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అది మీరనే కాదు ఎవరికైనా అంతే. ఇద్దరిలోను సర్దుబాటు అవసరం.
మీ పెద్దలు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేసి ఉంటారు. అవునా..!
వాస్తవ దృష్టితో ఆలోచించండి. మీరే తల్లిదండ్రుల స్థానంలో ఉంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఆలోచించండి.
మీ ఆయన, మీ కుటుంబ సభ్యులు మీకు శత్రువులు కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
కొద్దిగా ఓపిక పడితే నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారేమో ..!
మాట్లాడకుండా ఉండటం సమస్యకు పరిష్కారం కాదేమో ఆలోచించండి.
మీ మనసులో ఉన్నది, మీరు చెప్పాలనుకున్నది స్పష్టంగా అతనితో చెప్పండి . అయితే ఆవేశంతో కాకుండా శాంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. అవతలి వారు తన వాదన, పంతం నెగ్గించుకోవాలని ఎదురు దాడి మొదలుపెట్టవచ్చు. అది అప్పటికే. ఆ నిముషానికే..
కానీ వారు నెమ్మదిగా తర్వాత ఆలోచిస్తూ ఉండవచ్చు. వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు.
ఒకరి తప్పొప్పులు, పొరపాట్లు మరొకరు ఎత్తి చూపుకుంటూ దుందుడుకు గా వ్యవహరిస్తూ అరుచుకుంటే వచ్చే లాభం లేదు . మరింత దూరం పెరగడం తప్ప. కాపురాలు ముక్కలవడం తప్ప.
పంతాలకు పోవడం కంటే సామరస్యంగా సర్దుకు పోవడానికి చూడటం మంచిది’ అనునయంగా చెప్పింది సరస్వతి.
అధునాతనంగా కనిపిస్తున్న సరస్వతిని తేరిపార జూస్తూ ‘అచ్చం మా అమ్మో , అక్కో నా ముందుకొచ్చి చెబుతున్నట్లుగానే ఉన్నాయి మీ మాటలు. మీ అభిమానానికి థాంక్స్. రెండు చేతులూ జోడించింది కరుణ.
సరస్వతిని, నిష్కల ను మార్చి మార్చి చూస్తూ ‘ఇది నేను తొందరపాటుతో తీసుకున్న నిర్ణయం కాదండీ.
నాది పచ్చని కాపురం కాదు నిప్పుల గుండం .
నేను చిన్నప్పటి నుంచి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకున్న దాన్ని. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇంజనీరింగ్ దాకా చదివిన దాన్ని. ఏదో ఒక ఉద్యోగం వెలగబెట్టిన దాన్ని.
సమయాన్ని బట్టి సర్దుకుపోవడం, సమస్య బట్టి ఎదుర్కోవడం, పరిష్కారం వెతుక్కోవడం చిన్నప్పటి నుంచి అలవాటయిన దాన్ని.
ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఆర్థికమో, సామాజికమో , సాంస్కృతికమో కాదండీ.
అతనిలో మేటలు వేసిన ఆధిపత్యం, అహంకారం, వివక్ష ధోరణి’ ఒక దీర్ఘ శ్వాస తీసుకుని వదిలి ‘వాటిని నేను భరించలేక పోతున్నాను.
నన్ను, నా కుటుంబ ఆర్ధిక పరిస్థితిని, మా సామాజిక స్థితిని తెలుసుకొని నా చేయి అందుకున్న ఆదర్శవంతుడని, సంస్కారవంతుడని ఎంతో సంబరపడ్డాను.
నన్ను చూసి చేసుకుంటానన్నప్పుడు కొన్ని సందేహాలు కలిగినప్పటికీ వాటిని తీసి పడేసాను. నేను నచ్చడం వల్లనే, నాపై ప్రేమతోనే నన్ను చేసుకున్నాడని పొంగిపోయాను.
కానీ అతని ఆంతర్యం ఇక్కడికి వచ్చాక పూర్తిగా అర్ధమయింది. నిజస్వరూపం కళ్ళముందు కనిపిస్తుంటే అది అబద్దమని ఎలా మభ్యపెట్టుకోగలను?
రెండు ముఖాలతో ఉన్న అతన్ని గురించి ఏమని చెప్పను? ‘ గుండె బరువెక్కుతుండగా కళ్ళు మూసుకు తెరిచింది కరుణ. రోడ్డు కేసి ఓ చూపు విసిరింది .
ఆమెలో అతను వస్తాడేమో, వస్తే ఏమి జరుగుతుందో నని లోలోన పెరిగిపోతున్న భయం పెరిగిపోతున్నది. వచ్చిన ఇద్దరికీ ఎక్కడ సమస్య అవుతుందోనని దిగులు కమ్ముకుంటున్నాయి. అట్లాగని తన సమస్యకి ఓ పరిష్కారం కావాలి. ఎలా ..? ఆలోచిస్తూనే తనను తాను కూడదీసుకుంటూనే–
‘అమెరికాలో ఉద్యోగం చేస్తూ రెండు చేతులా సంపాదించే నా కులం వాళ్ళని కాదని నిన్నే ఎందుకు కోరి చేసుకున్నా అనుకుంటున్నావు? నువ్వు ఏరకంగా చూసినా ఆ కన్నా తక్కువే . దిగువ స్థాయే .
వయసులో నాకన్నా చాలా చిన్న దానివి. కులంలో తక్కువ దానివి. ఆర్ధికంగా లేని దానివి. చదువు నాకంటే తక్కువే .
ఏ రకంగా చూసినా నా కంటే చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చిన దానివి.
ఎగతాళి చూపులతో అందుకే చేసుకున్నా.. ఏదో నిన్ను ఉద్ధరిద్దామనో నీ అందాన్ని చూసి మోహంతోనో కాదు.
నా చెప్పు చేతల్లో పడి ఉంటావని . అంటే నా కాలికింద చెప్పు లాగా పడి ఉంటావని తెలిసిందా… అంటూ నాతోనే స్పష్టంగా చెప్పాడతను.
ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టారంటే చచ్చినట్టు పడి ఉంటుంది. అంతవరకే దీని నీలుగుడు అని అతని తల్లితో చెప్పడం విన్నాను . ఇంకా నన్ను నేను చంపుకుని అతనితో ఎలా ఉండగలను? అతని శాడిజాన్ని ఎలా భరించగలను?’ ఉద్వేగంగా ప్రశ్నించింది కరుణ.
మగవాళ్ళు ఇలా కూడా ఉంటారా ఆశ్చర్యపోయింది నిష్కల.
‘మీ ఆయన కరెక్ట్ అని నేను చెప్పడం లేదమ్మా .. మీరింత స్పష్టంగా చెబుతున్నప్పుడు కాదని నేను ఎలా అనగలను? మరో ఆలోచన అనవసరం.
సరే, మీ ఆయన మీద మీరు ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. అలాగే అతని నుండి మీరు ఏం ఆశిస్తున్నారో చెప్పండి ‘ అన్నది సరస్వతి.
‘నాకు కావలసింది అతనిపై కేసు పెట్టడం శిక్షించడం కాదు. అతని నుండి నేను ఏమీ కోరుకోవడం లేదు. ఈ నరకం నుంచి బయటపడడం తప్ప. అది చాలు.’ అన్నది కరుణ
‘అదేంటమ్మా అలా అంటున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి కదా. ఇతన్ని చూసి రేపు మరికొందరు తయారవుతారు కదా’ నిష్కల అన్నది
‘ఇవన్నీ నాకు తెలియదు. నేను ఇండియా వెళ్లిపోవడం తప్ప నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. అతను నాకు పెళ్ళిలో పెట్టిన బంగారం, ఖరీదైన బట్టలు అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తాను. అతనివి అనేవి ఏవీ నాకు అవసరం లేదు ‘ మళ్ళీ స్పష్టం చేసింది కరుణ.
‘ఒక్కసారి నింపాదిగా ఆలోచించండి. వెళ్లాలంటే వెళ్ళ వచ్చు. ఆ ఏర్పాట్లు మేం చేస్తాం. వెళ్లిన తర్వాత ఏం చేస్తారు ?’ ప్రశ్నించి ఆమె సమాధానం చెప్పేలోపునే ‘ముందు మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవ్వండి టికెట్ బుక్ చేద్దాం.’ అన్నది నిష్కల
నా పాస్పోర్ట్ .. కొన్ని క్షణాల ఆలోచన తర్వాత అతని వద్దే ఉంది. నా దగ్గర లేదు. అయ్యో ఎలా అది లేకుండా .. బేలగా అన్నది కరుణ.
వచ్చిన మొదట్లో నా బాగ్ లో ఉంది. నాలుగు రోజుల తర్వాత జాగ్రత్త చేస్తానని తీసుకున్నాడు. ఎక్కడ పెట్టారో తెలియదు. అయ్యో .. ఇప్పుడెలా.. ఇలాంటి స్థితి వస్తుందని అనుకోలేదు’ నెత్తి కొట్టుకుంది కరుణ.
‘సరే కరుణా.. కంగారు పడకండి. అధైర్య పడకండి. ముందు మీ పాస్పోర్ట్ మీరు సంపాదించే మార్గం వెతకండి. అతనికి కొంచెం చేరువ అవడానికి ప్రయత్నం చేయండి . మీ మీద అతనికి నమ్మకం వచ్చాక మీరు అనుకున్నది చేయొచ్చు. మనం మీరు బయటపడే మార్గాలను అన్వేషిద్దాం అని చెప్పింది సరస్వతి.
‘నేను తిరిగి వెళ్లగలనా ..’ బేలగా కరుణ
“ఎందుకు వెళ్ళలేరు. వెళ్ళగలరు.
సవాళ్ళని ఎదుర్కోడానికి కావాల్సింది సామర్థ్యం.
సమస్యలకు పరిష్కారం కనుగొనే మార్పు అందిపుచ్చుకో గల అమ్మాయిలు , మహిళలుగా మనం ఉందాం.
ఏదీ అసాధ్యం కాదు అని చెప్పే అమ్మాయిలుగా , మహిళలుగా ముందుకెళదాం .. ‘ కరుణతో ధైర్యం, స్థైర్యం నింపుతూ అన్నది నిష్కల.
అవును కరుణా .. మహిళలకి ప్రపంచం రోజూ మారిపోతూనే ఉంటుంది. ఆ విషయం కొందరికి అర్ధం కావడంలేదు. ఇంకా మన అమ్మమ్మలు, బామ్మల కాలంలోనే ఉంటారు నవ్వుతూ అన్నది సరస్వతి.
ఆ మాటలకి కరుణ గలగలా నవ్వింది. చిన్నబోయిన ఆమె మొహంలో కొంత ధైర్యం తొణికిసలాడింది.
‘మీ కలలను సాకారం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ దారిలో వచ్చే కష్టాలను తట్టుకుంటూ మీ కలలను సాకారం చేసుకోండి. వయసు, జెండర్, జాతి ఇవేమీ వాటిని సాకారం చేసుకోవడానికి అడ్డంకి కాదు. కాకూడదు.
మనం ఈ భూమి మీద ఒక్కసారే ఉంటాం. ఉన్నప్పుడే చేయగలిగినంత చేసెయ్యాలి. మనతో మనం సమన్వయం సాధించగలిగితే భూమి ఆకాశాలను కూడా సాధించగలం అని నా విశ్వాసం ‘ ఏమంటావు అన్నట్లు సరస్వతి కేసి చూసింది నిష్కల .
నిజమేనన్నట్లుగా తల ఆడించింది కరుణ.
కరుణా .. జీవితంలో ఎవరికి ఎవరూ శాశ్వతం కాదు. గడచిన రెండు నెలల కాలాన్ని మీ జీవితాన్నుంచి డిలీట్ చేసెయ్యండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి.
గతాన్ని తక్కువ ఆలోచిస్తూ భవిష్యత్ ని ప్రేమించండి అంతా మంచే జరుగుతుంది.’ అన్నది సరస్వతి
బయట చల్లటి గాలి మొదలయింది. భర్త ఎక్కడ వస్తాడోనని కరుణ భయం భయంగా చూస్తున్నది. కానీ ఆమెలో తాను ఈ చెర నుంచి తప్పించుకో గలదని నమ్మకం వచ్చింది.
మీ ఇంటి ముందు మేము ఇలా నిలబడి మాట్లాడడం సబబు కాదు. మమ్మల్ని ఇలా చూసి ఎవరైనా కాప్స్ కి కంప్లైంట్ చేసినా చేయొచ్చు అంటూ నవ్వింది సరస్వతి.
సారీ.. మిమ్ముల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను ‘నొచ్చుకుంటూ అన్నది కరుణ
‘ముందు అలాంటి మాటలు ఆపండి. మీ అమ్మలాగో, అక్కలాగో చెప్తున్నాని అన్నారుగా .. వాళ్ళతో అయితే ఇట్లాగే మాట్లాడతారా .. ‘ ప్రశ్నించింది సరస్వతి
తల వంచుకున్న కరుణకేసి చూసి చిన్నగా నవ్వుకుంటూ ‘మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి . మేము మీతో టచ్ లో ఉంటాం అని చెప్పి బయటపడ్డారు సరస్వతి, నిష్కల లు.
****
మనం ఒకవైపు మాత్రమే విని, అదే నిజమని నమ్మి ఆమెకు సహాయం చేయడం సరికాదేమో అన్నది సరస్వతి కాఫీ షాప్ లో కాఫీ సిప్ చేస్తూ..
వేడి వేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే చాలా హాయిగా ఉంది. కానీ సరస్వతి అన్న మాటలు మాత్రం నిష్కలకు ఏ మాత్రం రుచించలేదు.
మొదటిసారి కరుణ ని చూసిన రోజు ఆమె పరిస్థితి గుర్తొచ్చింది.
‘ఇతరుల విషయంలో ఏమో కానీ, కరుణ విషయంలో ఆమె చెప్పిన ప్రతి విషయాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆరోజు నేను విన్నది ఆమె నోటితో పైపైన వచ్చినవి కావు. అది ఆమె హృదయ ఘోష.
అతని శాడిజం, ఇగోయిజం, బాసిజం అప్పుడే అర్థమయింది. ముక్కలైన ఆమె ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం ఆమె తపన తెలిసింది సరస్వతి.
అటువంటి శాడిస్ట్ తో ఏ ఆడపిల్ల మాత్రం గడప గలదు. ఆత్మగౌరవం ఉన్న ఏ ఆడపిల్ల అతనిని అంగీకరించగలదు చెప్పు’ కించిత్ ఆవేశంతో అన్నది నిష్కల.
కావచ్చు నిష్కలా .. కానీ మనం కరుణ ఉన్న పరిస్థితిలో తప్పనిసరిగా ఆమెకు అండగా నిలబడదాం.. ఆమె సమస్యకు పరిష్కారం కోసం కృషి చేద్దాం. కానీ అవతలి వైపు కూడా వినడం మంచిది అంటున్నాను.
నిష్కల మొహం చిన్నబోయింది.
అమ్మా తల్లీ .. మీ జర్నలిస్టులతో వచ్చిన చిక్కే ఇది. ఏదయినా ఒక వార్త దొరికితే చాలు దాని గురించి పూర్వాపరాలు తెలుసుకోవడం కన్నా ముందు బ్రేకింగ్ న్యూస్ అంటూ మీ ఇష్టం వచ్చినట్లు వండి వార్చేస్తారు అని మిత్రురాలికేసి చూస్తూ అల్లరిగా నవ్వింది సరస్వతి .
నిజమే, ఇప్పుడు నేను ఈ సంఘటన మన తెలుగు ఛానల్ వాళ్ళతో చెబితే వెంటనే పెద్ద సెన్సేషనల్ వార్త అయిపోతుంది అందులో సందేహమే లేదు. ఆ సంచనలన వార్త వల్ల ఆ ఛానెల్ టి ఆర్ పి రేటింగ్ పెరుగుతుందేమో గానీ కరుణకు ఒరిగేది ఏమీ ఉండదు. ప్రపంచమంతా ఆమె అల్లరి అవడం తప్ప. అట్లా కాదు. ముందు ఆమె బయటపడడం ముఖ్యం. సమస్యకు పరిష్కారం కావడం ముఖ్యం మనసులో అనుకుంది నిష్కల.
హలో జర్నలిస్టు గారూ .. మాట్లాడారేంటి? మీ ఛానెల్ వాళ్లకి ప్రోగ్రాం ప్లాన్ చేస్తన్నారా.. రెట్టించింది సరస్వతి.
ఊహూ .. అదేమీ లేదు. తను ఏ వీసాపై వచ్చిందో తెలియదు, దాని పరిమితి ఏమిటో కూడా తెలియని కరుణకి చూస్తే జాలివేస్తున్నది. చివరికి పాస్ పోర్ట్ చేతిలో లేకుండా ఆమె ఎలా బయటబడగలుగుతుంది? కబేళాకు చేరే గొర్రె పిల్ల లాగా అమ్మాయిలు అతని వెంట ఎలా వచ్చేస్తున్నారో.. ఈ తరం అమ్మాయిలు కూడా అంత తెలివి తక్కువగా ఎలా ఉంటున్నారు ఆశ్చర్యంగా ఉంది నెమ్మదిగా ఒక్కో సిప్ తీసుకుంటూ అన్నది నిష్కల.
ఆ అమ్మాయిని ఆమె అమాయకత్వం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. కానీ అందరూ అలా ఉండరు. పెళ్లిని సంపాదనకు ఒక మార్గంగా చేసుకున్న అమ్మాయిలూ ఉన్నారు తెల్సా .. అన్నది సరస్వతి.
రియల్లీ .. నమ్మలేకపోతున్నది నిష్కల.
అవును తల్లీ .. నిజం . అక్షరాలా వాస్తవం.
మా కజిన్ ఇండియా లోనే ఉంటాడు. ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆర్ధికంగా ఫర్వాలేదు. ఎంబీఏ చదివిన అమ్మాయితో పెళ్లయింది. పెళ్లి సమయంలో అమ్మాయి తరపు వారి గొంతెమ్మ కోరికలు కాదనలేక మా పెద్దమ్మ పెళ్ళికూతురికి వడ్డాణం కూడా చేయించింది. ఎంగేజ్మెంట్ లో కెంపుల సెట్ , పెళ్ళిలో డైమండ్ సెట్ , వడ్డాణం , గొలుసు , నల్లపూసలు చేయించింది. ఖరీదైన పట్టు చీరలు తీసింది.
పెళ్లి అయిన నెలరోజులకే అత్తింటివారు పెట్టిన బంగారం, బట్టలు సర్దుకుని పుట్టింటికి చేరింది. కారణం ఆ అమ్మాయికి అతను నచ్చడం లేదట. అతనికి విడాకులు ఇస్తానంటోంది. విడాకులు ఇవ్వాలంటే 50 లక్షలు ఇవ్వాలని బేరం చేస్తున్నది. లేదంటే మీ అబ్బాయి సంసారానికి పనికిరాడని అల్లరి చేస్తా. గృహహింస కేసు పెడతా అని బెదిరిస్తున్నదట. ఏంచేస్తే అది చేస్కో .. నీ బ్లాక్ మెయిల్ కి లొంగేది లేదు అంటున్నాడు మా వాడు.
ఏమవుతుందో .. ఎదురుగా వస్తున్న జంటని చూస్తూ చెప్పింది సరస్వతి.
కరుణ డబ్బు మనిషి కాదు. తన ఆత్మగౌరవం కోసం పాకులాడే మనిషి. లేకపోతే అతనితో సర్దుకుపో గలిగేదేమో లేదా అతనిపై కేసు పెట్టేదేమో .. అతను పెట్టిన హింస గురించి నోరు విప్పి కేసు పెడితే ముందు అతని ఉద్యోగం ఊడుతుంది . ఊచలు లెక్కపెడతాడు. కానీ కరుణకి అతన్ని సాధించాలన్న తలంపు, కక్ష తీర్చుకోవాలన్న ఆలోచన లేవు.
సరస్వతితో కలసి కాఫీ షాప్ లో కాసేపు గడిపి తన రూమ్ కి బయలు దేరింది నిష్కల.
బస్ ఆగుతున్నది. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. దిగేవారు దిగుతున్నారు. ఇళ్ళు , షాపులు, బజార్లు, పరిసరాలు మారిపోతున్నాయి. అదేమీ గమనించని నిష్కల మాత్రం కరుణ గురించి ఆలోచనల్లోనే.. అతనికి బుద్ధి చెప్పేది ఎలా అనే చింతన లోనే …
గొంతెత్తే అవకాశం లేకుండా ఉండిపోయిన వాళ్ళ కథలు ఎన్నో.. కల్లలైన కలలు ఎన్నో .. అవన్నీ బయటికి రావాలి. ఎలా .. ఆలోచిస్తున్నది నిష్కల.
అబ్బాయికి ఇష్టం లేకుండా పెద్దల బలవంతం తోనో, ప్రోద్భలంతోనో, ఒత్తిడితోనో జరిగే పెళ్లిళ్ల వల్ల అమ్మాయి జీవితం నష్టబోతున్నది అనుకున్నది కానీ కరుణ విషయం అందుకు భిన్నం. అతను ఆమెను చూసి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు.
వేరొకరి కొవ్వొత్తిని ఆర్పడం అంటే తన కొవ్వొత్తి ప్రకాశంగా వెలగలేదని అతనికి తెలియదా .. ఆశ్చర్యపోతున్నది నిష్కల.
కరుణ అన్నట్లు వాదులాడడం, మొరటుగా మాట్లాడడమే ఓ పనిగా పెట్టుకునే వారికి ఎంత తక్కువ స్పందిస్తే అంత శాంతి అనుకుంటూ బయటకు చూసిన నిష్కల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దిగవలసిన స్టాప్ దాటి పోతున్నది. బటన్ ప్రెస్ చేసింది. తరువాతి స్టాప్ లో ఆగింది బస్. కార్డ్ స్క్రాచ్ చేసి వెనక్కి నడవడం మొదలుపెట్టింది నిష్కల.
చల్లటి గాలి ఎదురొస్తున్నది. జుట్టు తన ఇష్టం వచ్చినట్లు విన్యాసాలు చేస్తున్నది . హుడి తల పైకి లాక్కుని నడక వేగం పెంచింది. ఆలోచనలు అంత కంటే ఎక్కువ వేగంగా పరిగెడుతున్నాయి. మస్తిష్కాన్ని వేడెక్కిస్తున్నాయి.
మంచితనం ముసుగులో తిరుగాడుతూ వేటాడే మేకవన్నె పులులు ఎన్నో .. అభం శుభం ఎరుగని లేడిపిల్ల లాంటి కరుణలు ఎప్పుడూ మోసగించబడుతూనే ఉంటారు.
ఇలాంటి వారికి ఏదైనా చేయాలి. తను ఏదైనా చేయాలి దీర్ఘంగా ఆలోచిస్తూ గూటికి చేరింది నిష్కల.
అప్పటి నుండి అమెరికాలో ఉండే జెండర్ వివక్ష, గృహ హింస ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది.
రంగు, జాతి, మత , ప్రాంత , సామాజిక, ఆర్థిక స్థితిగతుల తేడా లేకుండా ప్రపంచమంతా గృహ హింస కనిపిస్తుందని అమెరికా వచ్చాకే అర్ధమయింది నిష్కలకి.
ప్రతి నలుగురు ఆడవాళ్ళలో ఒకరు ఏదో రూపంలో గృహ హింస ఎదుర్కొంటారని తెలిసి విస్తుపోయింది.
ప్రపంచమంతా గొప్ప దేశంగా పొగిడే దేశంలో కూడా ఈ ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఆమె ఊహించనిది.
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకరికొకరం తోడు అని బాసలు చేసుకున్న కొన్నాళ్లకే వచ్చే అపార్ధాలు, అపోహలు, అహంకారాలు, ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక సమస్యలు వచ్చి చేరతాయి.
ఆ కుటుంబం లో వివాదాలు మొదలవుతాయి. ఎంతో కలత పరుస్తాయి. వత్తిడికి గురి చేస్తాయి. ఎడమొహం పెడమొహంగా ఉంటారు. చిలికి చిలికి గాలివానగా మారతాయి ఆ తర్వాత సునామీలు ఆ కుటుంబాన్ని ధ్వంసం చేయడం భారతీయ సమాజం కంటే అమెరికన్ సమాజంలో ఎక్కువ.
నచ్చినా నచ్చకపోయినా , ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనస్సు చంపుకుని సర్దుబాటు చేసుకుని అతనితో లేదా ఆమె తో సంసారం చేయడం, ఒకే గొడుగు కింద ఉండడం భారతీయ కుటుంబంలో ఎక్కువ.
భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉన్న గొప్పతనం అంటూ ఉంటారు కానీ అందువల్ల ఉన్న మానసిక కుంగుబాటు ఎదుర్కొన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది.
ఆ బంధంలో ఇమడలేక , బయటపడలేక పడే నరకం అంతా ఇంతా కాదు. పరువు ప్రతిష్ట పేరుతో ఆ నాలుగ్గోడల మధ్యే కొట్టుకు చస్తుంటారు.
అమెరికన్ సమాజంలో కూడా కోర్టు మెట్లు ఎక్కని, రిపోర్ట్ కాని కేసులు లేవని కాదు అక్కడ కూడా ఉన్నాయి. అయితే మనతో పోల్చుకుంటే తక్కువ.
ఓ పక్క అమెరికన్ సమాజంలో కుటుంబ సమస్యలు, మహిళల స్థితిగతులపై అవగాహన పెంచుకుంటూ కరుణకి సాయం చేస్తున్నది.
మొత్తానికి పాస్పోర్ట్ సంపాదించింది కరుణ. డీటెయిల్స్ నిష్కలకు వాట్సాప్ చేసింది.
విజిట్ వీసాతో వచ్చింది. కాబట్టి ఆరు నెలల వరకు ఆమెకు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. ఆమె బయటపడడానికి కావలసినంత సమయం ఉంది. కానీ, ఆమె ఎప్పుడెప్పుడు ఆత్మగౌరవ పతాక ఎగురవేయాలా అని ఎదురు చూస్తున్నది కరుణ.
గతంలో లాగా ఆమె మొహం ముడుచుకుని ఉండటం లేదు. ఆ మొహం లో కొంచెం ఉత్సాహంగా తొంగిచూస్తోంది. వచ్చిన విధంగా వంట చేస్తున్నది. అతను బయటనుండి తెచ్చిన ఆహారం తనకు ఇష్టమొచ్చినప్పుడు తింటున్నది. మారిన ఆమె తీరు చూసి కరణ్ సంతోషించాడు. నెమ్మదిగా తన దోవలోకి వస్తుందని భావిస్తున్నాడు.
పుట్టిల్లు పక్కనుంటే ఎప్పుడో పారిపోయేది. ఇప్పుడెక్కడికి పోతుంది.
ఆమె ఏమి చెప్పినా వినేవాళ్లెవరు? చివరికి ఆమె అక్క , అమ్మ నాన్న అందరూ నేను చెప్పిందే నమ్ముతున్నారు. చిన్న పిల్ల తెలియక మూర్ఖంగా ప్రవర్తిస్తుంది సర్దుకుపొమ్మని అతనిని బతిమాలుతున్నారు . అదంతా అతని అహాన్ని తృప్తి పరుస్తున్నది.
ఆమె గర్భవతి అయ్యేవరకు తాను కొంత ఓపిక పడితే చాలు ఆమె చచ్చినట్టు పడి ఉంటుంది అని తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు కరణ్. ఎవరి చింతన వారిది.
ఈ లోగా కరుణ ప్రయాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి.
టికెట్ కోసం క్రౌడ్ ఫండింగ్ చేద్దామని ఆలోచన చేసింది నిష్కల. వద్దు ఆ మొత్తం తాను ఏర్పాటు చేస్తానని చెప్పింది సరస్వతి.
కరణ్ కి ఏమాత్రం అనుమానం రాకుండా మసులుకున్నది కరుణ. అతను ఇంటికి తాళం వేయకుండా బయటికి వెళుతున్నాడు.
ఓ ఫైన్ మార్నింగ్ నిష్కల, సరస్వతి ల సహకారంతో ప్లైట్ ఎక్కింది కరుణ .
భారత దేశంలో ఉన్నప్పుడు జర్నలిజం చదివేటప్పుడు కొత్త ప్రపంచం చూస్తున్నట్లు ఫీలయేది.
అమెరికా వచ్చాక విశాల ప్రపంచపు పోకడ తో పాటు నిష్కల ఆలోచనలు కూడా విశాలం అయ్యాయి. అప్పటి వరకు ఉన్న అవగాహన , ఆలోచనల్లో కొట్టొచ్చిన మార్పు కనిపిస్తున్నది.
ఎప్పటికప్పుడు తనకున్న అవగాహన నుంచి తనను తాను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతున్నది నిష్కల. తన గమ్యాన్ని దిశ మార్చుకుని అడుగు వేయాలని నిర్ణయించుకున్నది. అందుకు ప్రధాన కారణం కరుణ అమెరికా జీవితం.
జర్నలిజం పూర్తి అవడంతో న్యాయ విద్యలో ప్రవేశించింది నిష్కల.
JD జ్యూరిస్ డాక్టర్ డిగ్రీ లో చేరింది . అమెరికాలో లా చదవడం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కొద్దిగా కష్టమే. మూడేళ్ల కోర్సు. విజయవంతంగా పూర్తి చేసింది నిష్కల .
రెండో సంవత్సరం ఇంటర్న్షిప్ లో చేరింది. మూడో సంవత్సరం ఫామిలీ లా మేజర్ గా తీసుకుంది. పూర్తయ్యే సమయానికి బార్ కౌన్సిల్ పరీక్ష కూడా పూర్తి చేసింది.
ఇంటర్న్ షిప్ చేసిన సంస్థ నిష్కలకి ఉద్యోగం ఆఫర్ చేసింది. వాళ్ళ ఆఫర్ అన్ని విధాల నచ్చడంతో ఫుల్ టైం ఉద్యోగంలో చేరింది.
నిష్కలకి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ టైపింగ్, వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్ ఆ ఉద్యోగ ఆఫర్ రావడానికి కారణం అయ్యాయి.
చురుకైన ఆమె పని విధానం, చురుకుగా ఆలోచించడం, స్పందించడం కూడా అందుకు దోహదం చేశాయి.
ఎంట్రీ లెవెల్ జాబ్ అయినా మంచి శాలరీ, పైడ్ వెకేషన్, సిక్ లీవ్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ ఇస్తున్నారు.
అసిస్టెంట్ ఫ్యామిలీ అటార్నీ గా చేరిన నిష్కల సంవత్సరం తిరక్కుండానే అసోసియేట్ గా ప్రమోట్ అయింది.
అలా కళ్ళు మూసుకున్న నిష్కలకి ఫైల్ అయిన గృహ హింస కేసులు, చైల్డ్ కస్టడీ, డివోర్స్ కేసులు, డెడ్ లైన్ దగ్గర పడుతున్న కేసులు కళ్ళ ముందు నిలిచాయి.
తల సుత్తితో కొట్టినట్టు ఉంది. కొద్దిగా కదిలినా ఒళ్ళంతా చితక కొట్టినట్టు నొప్పులు.. అంతకంతకు అధికం అవుతున్నాయి.
ఇంట్లో ఒక్కటే ఉంది. అవసరం అయితే సాయం చేసే వాళ్ళు కూడా లేరు.
కిటికీ దగ్గరున్న ఆర్కిడ్స్ కేసి చూసింది . ఉదారంగు , తెలుపు చారలతో ఉన్న ఆ పూల గుత్తులు, పసుపు రంగు గుత్తులు, నీలిరంగు గుత్తులు తనను ఓదారుస్తున్నట్టుగా అనిపించి ఆ ఊహకు నవ్వుకుంది నిష్కల. నెమ్మదిగా లేచి వెళ్లి వాటిని ప్రేమగా పలకరించింది. కాసేపు వాటితో ముచ్చట్లాడింది.
చేయి కదిలితే చాలా నొప్పిగా ఉంది.
రాబోయే విపత్తుల నుండి తననుతాను కాపాడుకోవాలంటే తప్పదు ఈ బాధ భరించాల్సిందే.
ఆ సమయంలో ఏది ఉచితంగా రాదు అంటూ వచ్చే తెలుగు ప్రకటన గుర్తొచ్చి నవ్వుకుంది.
నీరసంగా ఉండడంతో వెళ్లి బెడ్ పై వాలింది నిష్కల.
* * * * *
నేను వి. శాంతి ప్రబోధ . చదివింది జర్నలిజం అయినా స్థిరపడింది సామాజికసేవా రంగంలో. శ్రీమతి హేమలతలవణం, శ్రీ లవణం నిర్వహణలోని సంస్కార్ సంస్థలో వారితో కలసి ఇరవై ఏళ్ళు నడిచాను. ఆ నడకలోనిజామాబాద్ జిల్లాలోని అనేకమంది గ్రామీణ మహిళల, పిల్లల జీవన పరిస్థితులు అవగతమయ్యాయి. ఆ అనుభవాల్లోంచి రాసినవే భావవీచికలు , జోగిని , గడ్డిపువ్వు గుండె సందుక , ఆలోచనలో …ఆమె . భావవీచికలు బాలలహక్కులపై వచ్చిన లేఖాసాహిత్యం . ILO , ఆంధ్రమహిళాసభ , బాల్య లు సంయుక్తంగా 2003లో ప్రచురించాయి. తరతరాల దురాచారంపై రాసిన నవల ‘జోగిని ” . వార్త దినపత్రిక 2004లో సీరియల్ గా ప్రచురించింది . 2015లో విహంగ ధారావాహికగా వేసింది . ప్రజాశక్తి 2004లో ప్రచురించింది . గడ్డిపువ్వు గుండె సందుక (2017) బాలల నేపథ్యంలో, ఆలోచనలో …ఆమె (2018) మహిళల కోణంలో రాసిన కథల సంపుటిలు . అమర్ సాహసయాత్ర బాలల నవల (2019) మంచిపుస్తకం ప్రచురణ. ఆడపిల్లను కావడం వల్లనే శీర్షికతో వ్యాసాలు ప్రజాతంత్ర వీక్లీ లో కొంతకాలం వచ్చాయి . కవితలు ,వ్యాసాలు ,రేడియో ప్రసంగాలు వగైరా వగైరా ..