బతుకు చిత్రం-7

– రావుల కిరణ్మయి

ఎందుకురా?అట్లంటవ్?మేమెప్పటికీ శాశ్వతమార?జాజులమ్మ తోనే నీ పెళ్ళి జరుగుతది.నాక్కూడా ఆ పొల్లయితేనే కండ్లల్ల వెట్టుకొని సూస్కుంటదనిపిత్తాంది.అన్నది ఈర్లచ్చిమి.

ఇట్లా అనేకానేక వాదోపవాదాల నడుమన రాజయ్య చాలా అయిష్టంగా జాజులమ్మతో సైదులు పెండ్లికి అంగీకరించాడు.సైదులు లో కొత్త ఉత్సాహం కనపడింది.ఈర్లచ్చిమికి.ఆ పిల్లే వీడి జీవితాన్ని మార్చే భాగ్యరేఖ కాబోలు అని సంతోషపడింది.

పీరయ్య కూడా తన ఇంతకంటే మంచి సంబంధం తానెలాగూ తేలేనని దృఢంగా నమ్మి,కోరుకున్న వారికే బిడ్డనిచ్చి పెళ్ళి చేస్తే సుఖంగానైనా ఉంటుందని తలపోసి,పోలయ్యకు అదే విషయం చెప్పాడు.

పీరయ్య ఆరోగ్యం దిగులు తొలగి పోవడం తో చాలా వరకు మెరుగుపడింది.పోలయ్య,పీరయ్య తో ఆ రాత్రి జరిగిన సంఘటనంతా పూసగుచ్చినట్టు చెప్పాడు.అదే విధంగా ఊరు వారందరూ జాజులమ్మ పెళ్ళికి సహాయం చేస్తామన్న విషయం కూడా చెప్పి పీరయ్యను మునేశ్వరయ్య దగ్గరకు ఇతర పెద్దల దగ్గరకు  తీసుకువెళ్ళి పరిచయం చేశాడు.

ఊరివారందరికీ ఈ పెళ్ళి ఒక అద్భుతంగా తోచింది.పూజారి గారు ఆనాడు చెప్పినట్టుగానే వీరిద్దరికి ముడిపడి ఉండడం వల్లే అలా జరిగిందని కళ్యాణ గద్దె మహిమే ఇదంతా అని,మరమ్మత్తు పనులు ప్రారంభించడానికి ముందు ఇలా జరగడం శుభ సూచకమని ఎవ్వరూ అభ్యంతర పెట్టకుండా ఎవరికి తోచిన విధంగా వారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ముహూర్తం కూడా శ్రీరామనవమి రోజున అని నిర్ణయం చేశారు.రాములవారి కళ్యాణం జరుగాగానే అదే వేదిక పై ఈ ఇద్దరినీ కళ్యాణబంధం తో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నారు.ఆ రోజు ఎవరూ కూడా ఇంట్లో వంట చేసుకోకూడదని సామూహిక భోజనాలు గుడి దగ్గరే ఏర్పాటు చేయబడుతాయని చాటింపు కూడా వేయించారు.

ఈర్లచ్చిమికి కూడా అన్ని విషయాలను సర్పంచ్ గారే ఫోన్ లో వివరించి పెళ్ళికి బంధుమిత్రులతో తరలి రావాలని జాజులమ్మ తరుపున తానే  పెళ్ళి పెద్దనని కూడా చెప్పి కట్నకానుకల విషయం గుర్తు చేశాడు.

ఆడపిల్లను  కట్నాలిచ్చి అత్తవారింటికి సాగాతోలడమనేది  మూఢాచారమని పెళ్ళి అనేది కేవలం అమ్మాయిలకే కాక అబ్బాయిలకు కూడా అంతే అవసరమని గట్టిగా నొక్కి చెప్పింది.నేను నా కొడుకును అమ్మదలుచుకోలేదు.నా వంశాభివ్రుద్ధిని చేసే కోడలును ప్రేమగా ఆహ్వానించుకుంటానని పెద్దగా చదువు లేకపోయినా,అనుభవ సారాన్నంతా కుమ్మరించి సూటిగా చెప్పింది.సర్పంచ్ ఆమె మంచితనాన్ని ,ఆదర్శాన్ని పొగడకుండా ఉండలేక పోయాడు.

రాజయ్య మాత్రం కట్నం కావాలనే పట్టుబట్టినా,అతని మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తూ సైదులుకూ అదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది.

****

ఈర్లచ్చిమి జాజులమ్మ బంధువులను బొట్టుపెట్టి తన ఇంటికే ఆహ్వానించి సంబంధం ఖాయం చేసుకుంటున్నట్టుగా పూలు,పండ్లు,చీర,రవికలు పెట్టి విడెము(పూలుపండ్లు)చేసింది.

జాజులమ్మ బంధువులుగా పోలయ్య,సర్పంచ్,పూజారి మొదలగు పెద్ద మనుషులు అందరూ వచ్చారు.వారికి పప్పన్నము విందు ఏర్పాటు చేసింది.వారు కూడా కొత్త కండువా,పోక,ఖర్జూర పండ్లతో సైదులుకు వరపూజా కార్యక్రమం కూడా చేశారు.

పీరయ్యకు కలయో,నిజమో అర్థం కానట్టుగా ఉంది లోలోపల సంబరపడిపోతున్నాడు.

ఈర్లచ్చిమి అడిగింది పూజారిని,

అయ్యా !లగ్గానికి లగ్గం కోటు రాసుకోవాలె గదా!అదెప్పుడైతే బాగుంటది?ఎవ్వలైనా పూలు పండ్లు అయినంక చేసుకుంటరు.అని సందేహిస్తుండగా….

అమ్మా !నువ్వేమీ సందేహించకు.ఇప్పుడు నువ్వు విడెము మా ఊరికే వచ్చి స్వయంగా నువ్వే నీ చేతులతో చెయ్యి అన్నాడు.

ఏదీ…ఆ….. అని రాజయ్య కోపం లో ఏదో అనబోతుండగా ఈర్లచ్చిమి ఊహించింది ఆయన ఆ పందుల కొట్టంలోనా అంటాడని,అందుకే,

నువ్వుండు.అన్నట్టుగా చేతిని నొక్కి పట్టి…..

సరేనయ్యా,అలాగే అంది.

అమ్మా!ఈ కార్యము గుడిలో మా అందరి సమక్షంలో జరుగుతుంది.ఎటూ నాకు ఆడపిల్లలు లేరు అందువల్ల మేమే తల్లిదండ్రులుగా దగ్గరుండి మీ పద్ధతి ప్రకారం   జరిపిస్తాను అన్నాడు మునేశ్వరయ్య.

అయ్యా!మీరెంత ధర్మాత్ములు ఒక బీద పిల్ల పెళ్ళికి ఇంత చొరవా?అంది ఆశ్చర్యపోతూ.

అమ్మా !ఇందులో నా స్వార్థము కూడా ఉన్నది.అయ్యవారుగా ఎన్నో పెళ్ళిళ్ళు జరిపిస్తూ జంటలను ఆశీర్వదిస్తున్నాను.అలాగే ప్రతీ సంవత్సరం రామయ్య కళ్యాణం లో పెళ్ళి పెద్దగా మహత్ భాగ్యాన్ని పొందుతున్నాను.కానీ నేనే స్వయంగా ఆడపిల్ల పెండ్లికి తండ్రి స్థానం తీసుకొని కన్యాదానం చేయాలని ఆశపడుతున్నాను.ఎన్ని దానాలు,వ్రతాలు,పూజలు,నోములు జరిపినా కన్యాదానఫలం ఒక్కటి వాటన్నిటికీ సరిపోతుందనేది సత్యం.అందుకే..అన్నాడు.

ఇదంతా విని పీరయ్య ఒక్కసారిగా మునేశ్వరయ్య పాదాలపై పడి,

అయ్యా !దేవుడు బండ కింది కప్పను కూడా మర్చిపోడన్న సంగతి ఇయాల మీ ద్వారా నా ఇషయం లో సత్తెమైంది.నా బిడ్డ అదృష్టవంతురాలు.అంటూ కన్నీళ్ళు పెట్టుకోసాగాడు.

లే..లే..పీరయ్య…నేనెవరిని?అంతా దైవేశ్చ.అంటూ లేవనెత్తి అందరి దగ్గరా సెలవు తీసుకొని రెండు రోజుల్లో అనగా శుక్రవారం మీరంతా లగ్గం కోటుకు రండి అంటూ ఆహ్వానించాడు.

 ****

శుక్రవారం ఉదయం గుడి ప్రాంగణం లో కొబ్బరి మట్టలతో చిన్న వేదిక ఏర్పాటు చేయ బడింది.వచ్చిన వారందరూ చాల ఉత్సాహంగా ఉన్నారు.జాజులమ్మ తన తల్లి పెళ్ళి చీర ను కొంచెం పట్టుచీర లాగా ఉండి కొంగుదగ్గర రెండు చిరుగులు పడ్డా అంతకంటే మంచిది లేక పోవడం వల్ల అదే కట్టుకుంది.పొడవాటి జడ,జడనిండా జాజిపూలు పెట్టుకొని కుందనపు బొమ్మలా ఉంది.

పూజారి దంపతులు పార్వతీపరమేశ్వరుల్లా కనిపిస్తున్నారు.ఇత్తడి తాంబాలంలో కొత్తబట్టలు పోక లు ఖర్జూరలు,గాజులు,అయిదు రకాల పండ్లు బుట్టలనిండా తెప్పించారు.అయిదురకాల పూలు కూడా తెప్పించిపెట్టారు.

ఈర్లచ్చిమి తన బంధువులను,కొత్తబట్టలను తీసుకొని గుడి చేరారు.అక్కడి ఏర్పాట్లను చూసి రాజయ్య వేరే ఎవరూ ఈ విధంగా చేయరేమోనని కొంచెం సంతృప్తి చెంది ఆ పుణ్య దంపతులకు ఈ సారి మనస్పూర్తిగా నమస్కరించాడు.  

ఈత చాపలు పరిచి,కుర్చీలు వేయబడ్డాయి. పెద్ద వయసు వారు కుర్చీలలో కూర్చుండగా మిగతా వారు ఆడా,మగా తారతమ్యం లేకుండా చాపలలో కూర్చున్నారు.

కాళ్ళకు నీళ్ళు అందిస్తూ ఆహ్వానించడం,అందరికీ బొట్టు పెట్టడం,ఆడవారికైతే ప్రత్యేకంగా కాళ్ళకు పసుపు,పుస్తెలకు పసుపు,గంధం,పూలు ఇచ్చి మరీ మర్యాద చేస్తుండడం తో అందరి మనసులూ ఆనందం తో తేలిపోతున్నాయి . 

అందరికీ టిఫిన్ గా ఉప్మా టీ లు అందించబడ్డాయి.

ఇదంతా చూస్తున్న జానయ్యకు  చాలా బాధగా అనిపించింది.తన బిడ్డ ను చూడడానికి వచ్చిన వాడు పూరి గుడిసెలో ఉండే కులం కానీ అమ్మాయిని పైసా కట్నం లేకుండా చేసుకోవడమేమిటి?ఇంకా ఇంత ఘనం గా ఊరి పెద్దలు అందునా పూజారి దంపతులు తల్లిదండ్రులు గా ఈ పూలు పండ్లు,లగ్నంకోటు కార్యక్రమం జరిపించడం నిజంగా జాజులమ్మ ఏ జన్మ లోనో చేసుకున్న పుణ్యమే తప్ప వేరు కాదు.ఏమైనా ఈర్లచ్చిమి వంటి మనసున్న అత్త దొరకడం కూడా ఆ పిల్ల భాగ్యమే,నేనైనా అసోంటి అత్తను నా బిడ్డకు తేలేను అని జరుగుతున్నదాన్ని చూస్తూ లోలోపల మదనపడసాగాడు.

ఇంకా నయ్యం,బిడ్డ రాలేదు కాబట్టి సరిపోయింది లేకుంటే ఎంత గీసరిల్లేదో కదా!అని కూడా అనుకుంటున్నాడు.

అందరూ టిఫిన్ చేసి కూర్చున్నాక అసలు కార్యక్రమం మొదలయింది.

పీరయ్య జాజులమ్మను పీటల పైకి తీసుకురాగ పూజారి దంపతులు అటుఇటు కూర్చోగా కొంచెం దూరం లో పీరయ్య కూర్చున్నాడు.      

మంగళవాయిద్యాల వారు గణపతి పూజకు ప్రారంభ సూచకంగా గణేశ స్తుతి వినిపిస్తుండడంతో ఈర్లచ్చిమి తానె స్వయంగా జాజులమ్మకు కుంకుం బొట్టు పెట్టి పూజారి సూచనల మేరకు తానూ తెచ్చిన ఆకు పచ్చని పట్టుచీరను ప్పోక లు ఖర్జూరాలతో చీర కొంగు లో పెట్టింది.

కొత్త పట్టుచీర కట్టుకొని వచ్చిన తరువాత ఈర్లచ్చిమి గంధం,కాళ్ళకు పసుపు తో పాటు గా మల్లెలు,మొల్లలు మరువం కలిపి అల్లిన మాలతో పాటు గా ఎర్రగులాబీ  అలంకరించింది.

ముదురాకుపచ్చ,ముద్ద పసుపు,దమయంతి ఎరుపు రంగుల  పూల గాజులను ముందుగా తాను  తొడిగి ,తరువాత ముత్తైదువల చే చేతుల నిండుగా తొడిగింప చేసింది.

సైదులును పిలిచి తన చేతి కున్న తన అత్తింటివారు తనకు తన పెళ్ళి సమయంలో పెట్టిన ఉంగరాన్ని జాజులమ్మ కుడి చేతి మధ్యవేలుకు తొడిగించింది.ఆ సమయంలోనే పీరయ్య,జాజులమ్మ తల్లివి పాత కమ్మలను ఈర్లచ్చిమికి ఇచ్చి పెట్టమన్నాడు.అలా బంగారం కూడా పెట్టినట్టు అయింది.కొత్త పట్టుచీర కొంగు ఒడిలో పరిపించి  ఐదు పండ్లు పెట్టి మిగతా ముత్తైదువలతో ఒడి నింపించింది.

లడ్డును తినిపించి నోరు తీపి చేసి,అత్తరు చిలకరించింది.

పూజారి దంపతులకు ఈర్లచ్చిమి,రాజయ్య దంపతులు బట్టలు పెట్టారు.అలాగే పీరయ్య కు కూడా తువ్వాలు కప్పి ధోవతులు పెట్టారు.

పీరయ్య వరుసగా అందరికీ నమస్కరించాడు.

పూజారి దంపతులు,ఈర్లచ్చిమి,రాజయ్య దంపతులను,సైదులు,జాజులమ్మలను వరుసగా కూర్చోబెట్టి కొత్తబట్టలను పెట్టడం ,నోరుతీపి చేసి అత్తరు పన్నీరు చిలకరించగ అమ్మలక్కలు మంగళ హారతి పట్టి 

మంగళము మంగళము మా రామచంద్రునకు సువ్వీ 

మంగళము మంగళము మా చక్కని సీతకు సువ్వీ 

మంగళము మంగళము అయోధ్యా నందనునకు సువ్వీ 

****

అంటూ రాగయుక్తంగా ఐదు హారతులు పాడడం తో పాటు ఇరువురికీ దిష్టి తీశారు. 

అందరికీ అక్షింతలు పంచబడినాయి.ఒక్కొక్కరు వచ్చి ఆశీర్వదించారు.

అదే వేదిక పైన పూజారి గారు చందనం,గంధం అద్ది పసుపు కుంకుమ దిద్దిన తెల్లని కాగితం పై మంత్రోచ్చారణల మధ్య ముహూర్తం వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నం లో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగం లో జన్మించాడు.ఈ సారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం స్వామి వారి జన్మ నక్షత్రం పునర్వసునాడు జరగడము విశేషమని చెపుతూ అదే సమయాన ఈ వివాహము కూడా జరుగునని చెప్తూ పూజారి గారు ,

అమ్మా ! మీ పేరు రాయలచ్చిమి,రాయమంటారా?ఈర్లచ్చిమి అని రాయమంటారా ?

అయ్యా!ఈర్లచ్చిమి అనే రాయండి.మా అత్తగారు పెట్టిన పేరు అదే అంది.రాయలచ్చిమి పుట్టింటి వారు పెట్టుకున్నది.

మరి మీరు కూడా జాజులమ్మ పేరు మార్చాలనుకుంటున్నారా?అడిగాడు.

లేదయ్యా!అదే ఉండనియ్యండి అనడంతో పూజారి గారు లగ్న పత్రిక రాసి అందరికీ వినపడేట్టుగా గట్టిగా చదివి వినిపించారు.అలా వేడుక పూర్తవడంతో జాజులమ్మకు ఆనందం  తో పాటు తండ్రిని గురించి బెంగ తో కన్నీళ్ళు వచ్చాయి.

అది గమనించిన ఈర్లచ్చిమి ..!ఏడవకు తల్లీ !నాకు తెలిసి మీ నాయన ను తల్సుకొని నీళ్ళు పెట్టుకోకు.ఇక నుండి నీతో పాటే మీ నాయన సుత అన్నది.

జాజులమ్మ మనసు ఇంకా తేలికవగా కాళ్ళకు దండం పెట్టబోయింది.

ముందు పూజారి గారికి పెట్టమ్మా !అని దగ్గరుండి సైదులు తోటి జాజులమ్మ తోటి నమస్కారం చే యించింది .అలా పెద్దవారందరికీ ఇద్దరి చేతా నమస్కారాలు చేయించింది.

విందు భోజనం కూడా చాలా సంతృప్తిగా ఏర్పాటు చేయబడగా అందరు పూజారి గారి మంచితనాన్ని పొగడకుండా  ఉండలేక పోయారు.కార్యకమానికి వచ్చినవారందరికీ శుభ సూచకంగా కుంకుం భరిణె కానుకగా ఇచ్చారు.అలా ఎంతో వైభవంగా వేడుక ముగిసింది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.