బెనారస్ లో ఒక సాయంకాలం
-నాదెళ్ల అనూరాధ
రొటీన్ లోంచి కాస్త మార్పు తెచ్చుకుని, జీవితం పట్ల మళ్లీ ఉత్సాహం కలిగించుకుందుకు దేశం నలుమూలలకీ వెళ్లి రకరకాల అనుభవాల్ని మూటగట్టుకుని తెచ్చుకోవటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు వారం రోజులుగా ఈ అమృతయాత్రలో ఉన్నాను. చిన్ననాడు భూగోళ పాఠాల్లో చదువుకుని, చూడాలని కలలుగన్న ప్రాంతం ఇది. వచ్చివెళ్లిన అనుభవం, మళ్లీ వచ్చివెళ్లిన జ్ఞాపకమూ ఉన్నా మరోసారి వెళ్దామంటూ మనసు మారాం చేస్తూనే ఉంటుంది. తీరని దాహంలా తయారైంది ఈ ప్రాంతం పట్ల నా ఆశ. తిరుగుప్రయాణం దగ్గర పడుతున్న కొద్దీ మరి కొన్నాళ్లుందామని మనసు కొసరుతోంది.
ఆరోజు సాయంత్రం దిగులుగా మరోసారి పట్టణ వీధుల్లోకి నడిచా. ఆ పట్టణమేదో సాధారణమైంది కాదుసుమా. అత్యంత విశిష్టతను కలిగినది. శతాబ్దాలుగా గొప్ప చరిత్రను స్వంతం చేసుకుంది. దేశవిదేశాలనుంచీ జనాన్ని తన ఆకర్షణతో లాక్కొచ్చేస్తుంటుంది.
అక్కడ ఉన్నది ఆధ్యాత్మికమైన శక్తో మరేదో తెలియదు. అనంతంగా ప్రవహించే ఆ గంగానది, అతి నిరాడంబరంగా నిలిచి ప్రపంచాన్ని నిశ్శబ్దంగా చూసే ఆ శివాలయం, చిరునవ్వుతో పిలిచే ఆ అన్నపూర్ణాలయం, ఒకదాని వెనుక ఒకటిగా రెండు విగ్రహాలను ప్రతిష్టించుకున్న ఆ విశాలాక్షి ఆలయం, ఆ జనసమ్మర్దం నిండిన వీధులు, ఆ కిటకిటలాడే బనారస్ చీరల దుకాణాలు, లెక్కకు తేలని మఠాలు, స్టేషన్ లో దిగిన వారిని ఆప్యాయంగా పలకరించి బస గురించి వివరాలిచ్చి, వారిని ఎక్కించుకుని పరుగెత్తే టాంగాలు, రిక్షాలు, పెద్దపెద్ద ఆటోలు, రోడ్ల మధ్య స్వేచ్ఛగా తిరిగే ఆవులు, చెత్తాచెదారంతో నిండిన ఇరుకిరుకు వీధులు, వాటికి అడ్డంగా పడుకునో, అటుఇటు తిరుగుతూనో వచ్చిపోయే యాత్రికులికి కాస్త బెదురు పుట్టించే ఎద్దులు మొదలుగా అనేకానేక జంతువులు, ఆ ఇరుకు వీధుల్లోనే పాశ్చాత్య దేశ యాత్రికులకి అవసరమైన వసతిని, ఆహారాన్ని అందించే చిన్నచిన్న రెస్టొరెంట్లు, భారతదేశపు భోజనాన్నే కాక ఇక్కడి దుస్తులను కూడా ఇష్టంగా స్వంతం చేసుకునే ఆ విదేశీ యాత్రీకులు, ప్రతి వీధి మలుపులోనూ కనిపించి ఊరించే జలేబీ, లస్సీ దుకాణాలు, వాటికి కొనసాగింపుగా కనిపించే బనారస్ పాన్ దుకాణాలు…ఓహ్, అక్కడిదొక అలౌకికమైన ప్రపంచం! ఇక్కడ దేనికి మాత్రం లోటుంటుంది?! సాక్షాత్తు అన్నపూర్ణ కొలువుంది కదూ.
మనముందు సాక్షాత్కరించి, మనల్ని మంత్రించే అక్కడి మార్మికలోకం నిజమా, కలా అన్న సందేహాన్ని అప్పుడప్పుడు కలిగిస్తుంది. ఎందుకో దిల్లీలోని చాందినీ చౌక్ లోని గల్లీలు చూసినపుడు కలిగిన అర్థంకాని అయోమయం ఇక్కడాను ! ప్రధానిని మళ్లీ గెలిపించిన బనారస్ తన అస్తిత్వాన్ని, రూపును అంత త్వరగా మార్చుకుందుకు ఇష్టపడనట్టుగానే కనిపిస్తోంది నా కళ్లకి.
దశాశ్వమేధ ఘాట్ దగ్గర కూర్చుని నిరామయంగా ప్రవహిస్తున్న గంగను చూస్తుంటే మరింత మోహం, ఇదంతా నాది, నాకే కావాలన్న కోర్కె. అంతలోనే మణికర్ణికా ఘాట్ దగ్గర కొస్తే ఒక వైరాగ్యం! తెలవారి ప్రయాణం దిగులు పుట్టిస్తోంది. ఈ మాయలోంచి, మోహంలోంచి బయటపడటమెలా? వాటిలోంచి బయటపడేసే దారి కనుక్కుందుకే కదా ఇక్కడికి వస్తున్నది! ఇదేంటి?
ఎటు వెళ్తున్నానో ఆలోచన లేకుండా తిరుగుతున్నాను. విశాలాక్షి ఆలయం వైపు మళ్లాను. అక్కడ దేవతకి సమర్పించిన చీరెలను భక్తులు అమ్మవారి ప్రసాదంగా వందో, రెండొందలో ఇచ్చి పట్టుకెళ్లటం చూస్తున్నాను. ఎవరో ఆంధ్రదేశం నుంచి వచ్చినట్టున్నారు. అర్చకస్వామితో ఏదో చెప్పాలని చేతకాక అవస్థ పడుతున్నారు. ఆలయ ఆవరణ అనేదేమీ లేక వీధి గుమ్మంలోంచే కనిపించే దేవి విగ్రహం ఎదురుగా వాళ్లని గమనిస్తూ నిలబడ్డాను. ‘’మీరు తెలుగువారా?’’ అంటూ అతను నా దగ్గరకి వచ్చాడు. ఔనన్నాను.
‘’ఒక్కసారి ఇలా రండి. మా అమ్మ అస్థికలు నిమజ్జనం చేసి, ఇక్కడ దైవదర్శనం చేసుకుంటున్నాం. అమ్మవారికి కానుకగా వచ్చిన చీరెల్ని అడిగిన వారికి దైవప్రసాదంగా కొద్దిపాటి ధరకి ఇస్తున్నారు. మా పిల్ల పెళ్లి పెట్టుకున్నాం. బోలెడు ఖర్చుల్లో ఉన్నాం. అందరూ పట్టుకెళ్లటం చూసి మేము కూడా కావాలని మా భాషలో అడుగుతున్నాం. అర్చకస్వామికి కాస్త చెప్పరూ, తక్కువ ధరకి ఇమ్మని.’’ అతను ప్రాధేయపడ్డాడు.
అతను కోరిన మొత్తానికి ధర నిర్ణయించి అడిగాను. కాస్త కొసిరి, అటూఇటూ చేసి స్వామి అతను ఎన్నుకున్న పది చీరెల్ని ఇచ్చారు. ఆ దంపతులు నా చెయ్యి పుచ్చుకుని తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అతను సంచీ సర్దుకుని, నాతో అడుగులు వేస్తూ చెబుతున్నాడు,
‘’మీరు చేసిన ఉపకారం గుర్తుంచుకుంటాం. బిడ్డల్ని కన్నాక వాళ్ల జీవితాలకి ఒక దారి చూపేందుకు ఇన్ని తిప్పలు తప్పవు. సాక్షాత్తు కాశీ విశాలాక్షి తల్లి ముందర నిలబడే యోగ్యత ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ తల్లి ప్రసాదం కోసం బేరాలాడాను. శక్తి లేనివాడిని.’’ అతను చెమ్మగిల్లిన కళ్లను ఒత్తుకున్నాడు. ఫర్వాలేదన్నట్టు అతని చేతిమీద తట్టి మరో వీధిలోకి నడిచాను. బిడ్డ పట్ల అతని ఆర్తి చూస్తే ఎందుకో అమ్మ జ్ఞాపకానికొచ్చింది. అమ్మలంతా ఇంతే కాబోలు. జీవించినంత కాలం పిల్లల కోసం తాపత్రయం తప్పదేమో! పిల్లల పట్ల ప్రేమ పెద్ద వ్యామోహమే మరి!
అక్కడ ఆ వీధి మలుపు తిరిగాక కనిపించిన చిన్న దుకాణానికి ఆనుకున్న గోడ దగ్గర ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడని అకస్మాత్తుగా గమనించాను. అసలు అతని ఉనికి కంటే ముందు అతని ఎదురుగా రోడ్డు మీద, జనసమ్మర్దంలో మోకాళ్లపైన కూర్చుని ఉన్న పదకొండేళ్ల అమ్మాయిని చూసాను. ఒంటి మీద ఉండవలసిన గౌను ఆమె పక్కన పడి ఉంది. చిన్న లాగు ఒకటి మాత్రం ఆమె శరీరం మీద ఉంది. కత్తిరించిన జుట్టు సంస్కారం లేక ముఖం మీద పడుతోంది. ఆమె నిశ్శబ్దంగా అతన్ని చూస్తోంది. చుట్టూ ఉన్న జనం ఓచూపు ఆ అమ్మాయి మీద వేసి తమ పనుల మీద వెళ్లిపోతున్నారు. చుట్టుపక్కలున్న దుకాణాలు మామూలుగానే తమ వ్యాపారాల్ని చేసుకుంటున్నాయి.
చటుక్కున ఆ అమ్మాయి దగ్గరకెళ్లి పలకరించబోయాను. అప్పుడు స్పష్టంగా చూసాను, ఆమె కంటి చుట్టూ కన్నీరు ఎండి చారికలు కట్టి ఉంది. పలకరింపుకి ఎలాటి స్పందన చూబించకుండా ఆ అమ్మాయి ఎదుటి వ్యక్తిని చూస్తూనే ఉంది అభావంగా. అతని ముఖంలో ఒక కౄరత్వం కనిపించింది. ఒక వెటకారం, ఒక వెకిలి నవ్వు కూడా ఉన్నాయి. అమ్మాయిని పలకరించినా ఫలితం లేదని అర్థమై అతన్ని అడిగాను,
‘’ఎందుకలా ఆ అమ్మాయిని గౌను ఇప్పించి మోకాళ్ల మీద కూర్చోబెట్టావ్? అని.
‘’నీకెందుకు?’’ అన్నాడు సూటిగా.
ఆ అమ్మాయి నీకేమవుతుందన్న ప్రశ్నకి, తన కూతురని చెప్పాడు.
‘’అలా అమ్మాయిని బట్టలు లేకుండా, పదిమందిలో హింస పెడుతున్నావ్, అది నేరమని తెలుసా?’’ అన్నాను.
‘’దాని మీద నాకిప్పటిదాకా పదిహేను వేలు ఖర్చు అయింది.’’ అన్నాడు.
ఇంతలో అతని దగ్గరకి ఓ ఇరవై, పాతికేళ్ల మధ్య వయసున్న ఒకామె, చేతిలో ఏడాది పిల్లతో వచ్చి, పక్కనే నిశ్శబ్దంగా కూర్చుంది. ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి ఆమె కూతురు అయ్యే అవకాశం లేదు.
ఆమెని అడిగాను, ‘’ఎందుకమ్మా, చిన్నపిల్లని ఇలా బాధ పెడుతున్నారు? ఏం చేసింది? ఈయన నీకేమవుతాడు? ఈ పిల్ల మీద పదిహేను వేలు ఖర్చయ్యాయంటున్నాడు, ఏమిటిదంతా?’’
ఆత్రంగా నేను అడుగుతున్న ప్రశ్నలకి ఆమె సమాధానం ఇవ్వలేదు. అసలు తనను కానట్టు ఎటో చూస్తూ కూర్చుంది.
‘’పోలీసులకి చెప్పమంటావా? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎక్కణ్ణుంచి తెచ్చావ్?’’ అన్నాను కాస్త కఠినంగా అక్కడి వ్యక్తితో.
ఓ నిర్లక్ష్యపు నవ్వు నవ్వి, ‘’అది నా కూతురు. నీకేంటి?’’ అన్నాడు.
‘’నీ కూతురైతే సరిగా పోషించు, ప్రేమగా పెంచు. ఇలా ఎందుకు చేస్తున్నావు?’’ నా కోపం ఎక్కువవుతోంది అతని నిర్లక్ష్యానికి.
‘’కూతుర్ని ఎలా చూడాలో నాకు తెలుసు, వెళ్లు’’ అన్నాడు.
ఎదురుగా బట్టల దుకాణదారు నన్ను గమనిస్తున్నట్టున్నాడు, దగ్గరకొచ్చి ‘’వాడో మెంటల్ గాడు, వదిలేసి మీ పని చూసుకోండి’’ అన్నాడు. ఆ మాటలు పట్టించుకోకుండా,
‘’నువ్వు సరిగా చూసుకోలేకపోతే అనాథ పిల్లల ఆశ్రమంలో చేర్పించు. వాళ్లు పోషించి, చదివిస్తారు. లేకపోతే ఇప్పుడే పోలీసుల్ని పిలుచుకొస్తాను.’’ అన్నాను.
దుకాణదారు ఎవరో పిలవటంతో వెళ్లిపోయాడు. అక్కడ చుట్టూ ఉన్న జనం తమకేం పట్టనట్టు తమ పనుల్లో మునిగి ఉన్నారు. నాకు అసహనం ఎక్కువైపోతోంది.
‘’పోలీసుల్ని పిలుస్తావా? పిలు’’ అంటూ నవ్వాడు ఆ కిరాతకుడు. నేను ఆ పిల్ల చెయ్యి పట్టుకుని,
‘’రా నాతో’’ అన్నాను. ఆ పిల్ల నా చేతిని తోసేసి వాడివైపే చూస్తోంది. వాడు లేచి నిలబడ్డాడు. పక్కనున్న గుడ్డల మూటని ఒక్క తోపు తోసాడు కోపంగా. పక్కనున్న ఆడమనిషి లేచి భయంగా చూస్తోంది వాడివైపు.
నన్ను నేను నిగ్రహించుకోలేక అప్పుడే దాటి వచ్చిన పోలీస్ స్టేషన్ వైపు గబగబా నడిచాను. చూసిన విషయం చెప్పి, ఆ పిల్లని ఎక్కడినుంచో పట్టుకొచ్చినట్టున్నాడని, ఎవరికైనా అమ్మేస్తాడేమో ఆ పసిపిల్ల జీవితం నరకప్రాయమవుతుందని చెప్పి, ఒక కానిస్టేబుల్ ని నాతో పంపమంటూ పట్టుదలగా విన్నవించుకున్నాను. ఏమనుకున్నారో ఏమో, ఒక కానిస్టేబుల్ ని నాతో పంపించారు.
పెద్దపెద్ద అడుగులు వేసుకుంటూ వెనక్కి వచ్చాం. అక్కడ ఆ కిరాతకుడు, వాడి పక్కనున్న ఆడమనిషి, మోకాళ్ల మీద నిలబడిన ఆ పదకొండేళ్ల పిల్లా ఎవరూ కనిపించలేదు. వాళ్ల తాలూకు ఆనవాళ్లు కూడా ఏవీ లేవు. నేను వదిలి వచ్చిన స్థలం అది కాదేమో అని ముందుకీ వెనక్కీ మళ్లీ మళ్లీ తిరిగాను. ఆ దుకాణాదారుని గుర్తు పట్టి అడిగాను, ఇక్కడివాళ్లేరని. ‘’ఏమో’’ అనేసాడాయన. నాకు భయం వేస్తోంది ఆపిల్ల గురించి తలుచుకుంటే.
పోలీసాయన నా వ్యవహారం చూసి మతిస్థిమితం లేని వ్యక్తిగా జమ చేసి విసుక్కున్నాడు. పైగా పక్కనే నడిచి వెళ్తున్న స్థానికుడితో చెబుతున్నాడు, ‘’కహీ కహీ సే ఆతాహై ఏ లోగ్ పతా నహీ’’ నిర్లక్ష్యంగా నావైపు చూసి వెళ్లిపోయాడు.
నాకు ఇంకా నమ్మకం కలగలేదు. మళ్లీ మళ్లీ ఆ చుట్టుపక్కల అలా తిరుగుతూనే ఉన్నాను చాలాసేపటివరకు. రాత్రంతా ఆ చిన్నపిల్ల కళ్లముందు కనిపిస్తోంది. ఆమె భవిష్యత్తేమిటి? ఆ కిరాతకుడి చేతిలో ఎలా పడింది? పదిహేను వేలు పెట్టి పిల్లని ఎవరిదగ్గరో కొన్నాడా ? బట్టలు లేకుండా నడివీధిలో ఎందుకలా హింసిస్తున్నాడు? పక్కనే ఉన్న ఆ స్త్రీ ఎవరు? ఆమె కూడా వీడి దురాగతాల్ని ఎందుకు భరిస్తోంది? పైగా చేతిలో మరో ఆడ శిశువు!
వాడు పెట్టే నరకం ఆ చిన్నారి ఎందుకు భరిస్తోంది. వాడి మీద పెద్ద రాయి తీసి విసిరి పారిపోవచ్చుకదా. ఎందుకు అలా చెయ్యట్లేదు? అలా పారిపోయి ఎక్కడికెళ్తుంది? తండ్రినని చెప్పుకునే వ్యక్తే ఇలా ఉంటే ప్రపంచం ఈ పసిదాని పట్ల ఇంకెంత నిర్దయగా ఉంటుందో?! పోలీసులెందుకు నా మాటల్ని సీరియస్ గా తీసుకుని వెంటనే రాలేదు.
ఆ పరిస్థితిలోంచి ఆ పిల్లని కాపాడలేకపోయాను. ఏమీ సహాయం చెయ్యలేకపోయాను. నన్ను నేను క్షమించుకోలేని స్థితి! జీవితాంతం నన్ను నిలదీసి, వేధించే సంఘటన ఈ ప్రదేశంలో జరగటం అన్నింటికన్నా ఘోరం అనిపిస్తోంది. అలా అని ఘోరాలు మరెక్కడైనా జరగచ్చని కాదు. ప్రపంచమంతా పవిత్రమైనదిగా భావించే ఈ పుణ్యస్థలిలో ఎందుకిలా జరిగింది? ఇలాటిది మొదటిసారిగా జరిగిందా? కాకపోతే, అప్పుడేం జరిగి ఉంటుంది?
నన్ను నిందించుకున్నా ప్రయోజనం ఏముంది? జరగవలసిన అన్యాయం జరిగేపోయింది. ఆ పిల్లని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఏం చేస్తాడు? ఆ అమ్మాయి మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎవరి సాయమైనా తీసుకోవాలన్న ఆలోచన, ధైర్యం చేస్తుందా? పెరిగి, పెద్దవుతూ ఈ లోకం పట్ల ఎలాటి వైఖరిని ఏర్పరచుకుంటుంది? ఎవరినైనా నమ్ముతుందా? అసలు నమ్మకమనేదొకటి ఉంటుందని ఎలా తెలుస్తుంది? కళ్లెదుటి ప్రపంచంలోని దుర్మార్గం పట్ల నిర్లక్ష్యం, కోపం ఆమెతోపాటుగా పెరుగుతాయా? ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరా పిల్లలకి భద్రత లేదని చూస్తున్నాం. భద్రత అనేదొకటి ఉందని ఎలా నమ్మటం?
ఇంటికొస్తుంటే ప్రయాణం పొడవునా మనసు దుఃఖంతో గడ్డకట్టుకుపోయింది. ఎవరికి చెప్పుకోనూ? ఎలా సాంత్వన దొరుకుతుంది? మనసుకి ఊరట కోసం మాత్రమే ఆలోచిస్తున్నాను. అదేనా నాకు ముఖ్యం?
ఈ దుఃఖం మొయ్యలేను. స్నేహితులకి చెబితే వ్యవస్థ ఇలాగే ఉందని నిట్టూరుస్తున్నారు. వ్యవస్థంటే మనమే కదా ఉన్నది. వ్యవస్థట! పైగా మనందరిదీట?! ఈ ప్రొప్రైట్రీ ఎందుకు?
మంచికోసం పాటుపడుతున్న ఎందరినో నేనెరుగుదును. వారిలో ఒకరిని కాలేకపోయానన్న ఆగ్రహం, అవమానం. అది మారాలంటే ఈ బాధ తీరాలి. కనీసం మరెవరి బాధనైనా తీర్చగలగాలి. అంటే? మరెవరో బాధ పడాలా నా ఓదార్పుకోసం? ఓహ్…!
విశాలాక్షి ఆలయంలో కనిపించిన వ్యక్తి గుర్తొచ్చాడు. బిడ్డకి పెళ్లి చేసి భద్రమైన జీవితాన్నివ్వాలన్న తాపత్రయంతో ఆర్థిక స్థోమత చాలక అమ్మవారి సొత్తుకోసం బేరం చేసాడు. అలా చేసినందుకు తన తాహతుని ప్రశ్నించుకుని దుఃఖపడ్డాడు. పిచ్చి తండ్రి! అతను మంచి తండ్రే. అవును, ప్రాధేయపడో, యాచించో బిడ్డ కోసం తపించే తండ్రి ఉన్నాడన్న విషయం నా మనసుకి ఆ పూట కాస్త ఓదార్పునిచ్చింది.
(బెనారస్ లో ఒకే సాయంకాలం ఎదురైన అనుభవాలు!)
నా పేరు నాదెళ్ల అనూరాధ, నా గురించి చెప్పాలంటే పుస్తకాలు, పిల్లలు, సంగీతం ఇష్టమైన విషయాలు. పిల్లల మీద ఉన్న ఇష్టం నన్ను ఎమ్మే,బియెడ్ చేయించి టీచర్ని చేసింది. గత ఏడు సంవత్సరాలుగా విజయవాడలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడిన పిల్లలకోసం సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాల్ని నేర్పుతోంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.
నా బెనారస్ అనుభవాలను చదివి, అభిప్రాయాన్ని తెలియజేసిన మిత్రులకు ధన్యవాదాలు.
నాదెళ్ల అనూరాధ.
Beautifully written!!!!
Beautiful , detailed description of Benaras roads by the writer .
The roadside girl incident is really saddening .
బెనారస్ లో ఒక సాయంకాలం అయిన అనుభవాలు ప్కఆత్ళ్లపాఠకుల కళ్లకి కట్టినట్టు రాయగలిగిన ,రచయిత్రి కి అభనందనలు. బెనారస్ లాంటి నగరం లో అనుభవాలు రాయాలంటే ఒక జీవిత కాలం సరిపోదు. ఆ మహానగరంలో ఒక ప్రదేశానికి మరో దానితో సంబంధం లేనట్టుగా ఉంటుంది అనుభవం. తన అనుభవాన్ని పాఠకుల మనస్సు నీ హత్తుకు పోయేలా రాయగలిగిన రచయిత్రి కి మరోసారి అభినందనలు.