“భవిష్యత్తు కళ్ళద్దాలలోంచి- గతంవేపు”
– డా. కల్లూరి శ్యామల
(మనం భారతీయ సంస్కృతి గురించి మాట్లాడేటప్పుడు మనశాస్త్రీయ దృక్పధలోపం మన నేటి సమస్యలకెలా కారణమవుతున్నదో పదే పదే గుర్తుచేసుకుంటాము. అది పూరించుకోడానికి మన వేదకాలంలో పురాణాలలో, చరిత్రకందని గతంలో భారతదేశంలొ పరిణతి చెందిన శాస్త్రీయ వైజ్ఙానిక సంపద మనకుండేదని గొప్పలు చెప్పుకోడం కద్దు. ఏ రకమైనటువంటి శాస్త్రీయ సాక్షాధారాలు లేకుండానే టెస్ట్యూబ్ బేబీలు అవయవ మార్పిడులు అన్నీ మనం ఎరుగుదుమని అంతర్జాతీయ సభల్లో సమావేశాల్లో గొప్పలు చెప్పి నవ్వులపాలవుతూ వుంటాం. ఈ రో జు మనమెదుర్కొంటున్న సంక్షోభాలలొ కనీసం తగినంత సాక్షాధారాల రూపంలో కొంత సహెతుకమైన సమాచారాన్ని సృష్టిస్తే తర్వాత తరాలు బాగు పడతాయని నేటి కరొనా మహమ్మారి ని గూర్చిన సమాచారం అందుబాటులో వుంచాలనే విశ్వాసలోనుంచి ఈ కథ పుట్టీంది. చదవగలరు) మనిషి ఒక వర్తమానంలో నుంచుని నడుస్తున్న చరిత్రని చూస్తూ అనుభవిస్తూ, దీని పరిణామాలు భవిష్యత్తులో ఎలావుంటాయి అని తన్ను తాను ప్రశ్నించుకుని ఆభవిష్యత్తులోనుంచి గతంవేపుకి చూస్తే ఏది మనల్ని నడిపిస్తుందో ఆ శక్తిని గురించి ఈ కథ.)
2099 వ సంవత్సరం
అది ఒక పల్లెటూరే కానీ అక్కడ ఆధునిక జీవితానికి అవసరమనుకున్న సదుపాయలన్నీ వున్నాయి. మొబైల్ నెట్వర్క్స్ వున్నాయి. ఇంటర్నెట్ వుంది. టెలిఫోన్లు కేబుల్ టి.వి లు వున్నాయి. యాభై ఏళ్ళక్రితం కంటే ఇప్పుడు బయటికి వెళ్ళి కాలేజీలలో చదువుకునేవాళ్ళు ఇంజనీర్లయినవాళ్ళు బయట వుద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. బయట మెడిసన్ చదివి ఇక్కడ ప్రాక్టీసు పెట్టుకున్నవాళ్ళు ఎక్కువయ్యారు. హాస్పిటల్స్ ఒకటి నుంచి ఏడయ్యాయి. అక్కడ వూరికి కొంచెం దూరంగా ఒక చిన్న డాబా ఇల్లు వుంది. చిన్న ఇల్లేగాని చుట్టూ మంచి స్థలం, కాంపౌండు గోడ వున్నాయి. ఇంటి చుట్టూ మంచి తోట రకరకాలైన పూల మొక్కలు ముందువైపు, కూరల మొక్కలు వెనకవైపు వుండి, అవేకాక వెనక, సపోటా, జామ మామిడి చెట్లు మూడు మూలల్లో వున్నాయి. ముందువైపు నాలుగో మూల పారిజాతం చెట్టు. క్లుప్తంగా చెప్పాలంటే మిథునం కథ చదివారా, అందులో అప్పదాసు ఇల్లులా వుంది. ఇందులో కూడా ఇద్దరు వృద్ద దంపతులు. పేపరు చదువుతూ అతను మొబైల్ లోనుంచి వచ్చే భక్తి పాటలు వింటూ ఆమె. ఒక అరగంట తర్వాత అవి చేతులు మారతాయి. కాఫీ తాగుతూ చిన్న చిన్న సంభాషణలు చేసుకుంటూ ఒక గంట గడిచాక అప్పుడు ఇద్దరు దైనందిన కార్యక్రమాల్లో పడతారు.
వాళ్ళు ఇప్పుడున్నది ఈ చిన్నవూరైనా ఒకప్పుడు వాళ్ళపేరు దేశంలో మారు మ్రోగిపోయింది. ఇవ్వాళ ఆదంపతులగురించి పేపర్ లో ప్రచురించటానికి ఒక దేశం లో పేరున్న ఒక పత్రికారచయిత వస్తున్నాడు హడావుడిగా తయ్యారయి వాళ్ళిద్దరికీ టిఫిన్ చేసి తిన్నాక మద్యాహ్నానికి కావాల్సిన కూర పప్పు రోటి పచ్చడి అన్నీ చేసి అన్నం పడేసి కూర్చున్నారు పదిన్నరయ్యేసరికి.
పత్రికారచయిత వచ్చాడు, వస్తూనే ఇద్దరికీ నమస్కారం చేసి “సర్, నాపేరు రమేష్. నేనే మీకు ఫోన్ చేసి ఆపాయింట్మెంట్ తీసుకున్నాను. టయిమ్స్ పత్రికా విలేఖరిని. ఒకప్పుడు దేశాన్ని మీ ఆలోచనలతో మార్గదర్శకం చేసి ఇప్పుడిలా మారుమూల వూళ్ళో వుంటున్నారేమిటి?” అని అడిగాడు.
” మీకు రావటానికేమీ ఇబ్బంది అవలేదు కదా?” అన్నారు అభిరామశర్మ గారు. లేదనగానే మళ్ళీ అందుకుని “ఏముంది, ఒక వయస్సులో మాకు చేతనయినది చేశాము. మా అవసరం సమాజానికి తీరిపోయింది. అందుకని ఈవూరు ప్రశాంతత నచ్చి ఇక్కడ స్థిరపడ్డాము“
“ఇప్పుడెలా కాలక్షేపం చేస్తున్నారు సర్?”
“అదే పని ఒక ఇరవైఏళ్ళ క్రితం ఏదైతే చేసామో అది ఇప్పుడు క్రోడికరించి డేటా బేస్ చేస్తున్నాం. ఇదంతా అప్పుడు మేము రన్ చేసిన వెబ్సైట్ లో అప్లోడ్ చెయ్యాలని ప్లాన్.”
“అంటే? ఎందుకు? దీనివల్ల ఏంప్రయోజనమని మీ ఉద్దేశ్యం?”
“మాచిన్నప్పుడు కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఎవరూ మానసికంగా గానీ వైఙ్జానికంగా తయారుగాలేరు అంతకు ముందు స్పానిష్ ఫ్లూ వచ్చిందంటారు. దానిగురించి ఏ డేటా కరోనా రోజుల్లో ఎవరి దగ్గరా లేదు. కథల్లో చదివిన విశేషాలేకానీ మరే శాస్త్రీయ పరమైన ఙ్జానం జనాలకి లేదు. దానివల్ల మా తరంవాళ్ళం బాగా నష్టపోయాం“
“పిల్లలు…?” ప్రశ్నార్థకంగా ఆగిపోయాడు.
“లేరు అనడం కంటే వద్దనుకున్నాము అంటే సరిగ్గా వుంటుంది. మేము ఆ సమయంలో చేసిన ప్రాజేక్ట్ ఎంతగా ప్రభావితం చేసిందంటే పిల్లలు కూడా మా లక్ష్యసాధనకి అడ్డు అవుతారనో వాళ్ళ జీవితాలకి తల్లిదండ్రులుగా మేము న్యాయం చెయ్యలేమనో ఏదో ఒక సందేహం మమ్మల్ని పిల్లలు వద్దనుకునేలా చేసింది. అయితే ఇప్పుడు దానిగురించి ఏమీ బాధ లేదు.”
“అయితే చెప్పండి సార్. మొదటినుంచి ఎప్పుడో ఇరెవైలలో వచ్చిన కోవిడ్ 19 అనే మహమ్మారి మీ జీవితాల్నింతగా ఎందుకు ప్రభావితం చేసింది?“
“చాలాటైమ్ పడుతుంది. మీకు ఓపిక టైమ్ వున్నాయా” అన్ అడిగాడా వృద్దమూర్తి.
“చెప్పండి. నేనీరోజు మీతోగడపాలనే వచ్చాను.” భార్యవేపు అర్థవంతంగా చూశాడు శర్మ గారు. మృదుల లేచి లోపలికి వెళ్ళీంది. అభి అనబడే అభిరామ శర్మ మృదులల కథ అలా మొదలయింది.
****
2048 వ సంవత్సరం
“రండి,” తలుపు బాగా బార్లా తెరిచి లోపలికి ఆహ్వానించింది మృదుల.
“నమస్కారం” అంటూ లోపలికి అడుగు పెట్టాడు అభిరామ్.
వాళ్ళీద్దరూ ఆఫీస్ లో కలిసి పనిచేస్తారు. ఒకే టీమ్ లో రెండేళ్ళనుంచీ పనిచేస్తున్నారు. మంచి సుహద్భావమున్న హద్దులుదాటని స్నేహం వాళ్ళది. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఒక నిబద్దత, ఒక కొత్తకోణం తప్పక ఆవిష్కరింపబడుతుందనేది ఆఫీస్ లో అందరూ గుర్తించిన విషయమే! జగమెరిగిన సత్యం! ఆ రోజు ఆదివారం. వారం రోజులుగా కుస్తీపడుతున్న ప్రాజక్ట్ తాలూకు ముగింపు తేలక నానా అవస్థలు పడుతున్నారు. అందరూ కలిసి అన్ని బుర్రలూ జోడించి ఏదైనా సాధించగలమేమో అనిపించి తన టీమ్ మేట్స్ అందర్నీ ఇంటికి భోజనానికి పిల్చింది మృదుల.
అది ఇంకా చెప్పాలంటే వాళ్ళ భాషలో ఒక బ్రైన్ స్టార్మింగ్ సెషన్ అని అనుకోవాలి. మొట్టమొదట అడుగుపెట్టిన వాడు అభి అని పిలిచే అభిరామ్.
కాఫీ కలిపి అభికొక కప్పు ఇచ్చి తనొక కప్పు పట్టుకు కూర్చుంది.
“మిగతా వాళ్ళింకా రాలేదేమిటి? ” అడిగింది.
“నిన్న రాత్రి అందరూ ఇంటికి వెళ్ళేసరికి రెండు దాటిందికదా! కొంచెం అటుఇటూగా ఇంకో గంట కి అందరూ వచ్చేస్తారనుకుంటా!
“నేనెంతలేట్ గా పడుకున్నా ఆరుకల్లా లేచిపోతాను. అందుకే నేను ముందు వచ్చేసాను. మీకేమీ సమస్యలేదుగా?” అని అడిగాడు
“అబ్బే! నాకేమి సమస్యలేదండీ! అందరికి కలిపిపులిహోర చేసేశాను. అందరూ వచ్చాకా ఎవరికి కావల్సిన పిజ్జాలు, బర్గర్లూ ఆర్డర్ ఇచ్చి తెప్పిద్దాం.”
రాత్రి లేట్ గా పడుకున్న కారణంగానే ఓపిగ్గా నాలుగు అయిటమ్స్ చెయ్యకుండా పులిహోర ఒక్కటి చేస్తే అందరూ బద్దకస్తురాల్ననుకుంటారేమో నని భయంగానే వుంది. ఆఫీసులో అందరికీ మంచి రుచికరమైన భోజనం పెట్టగల ఏకైక మహిళకూడా ఆమే!
అభి కప్పు తీసుకుని లోపల పెట్టడానికి లేస్తూ మృదుల కప్పుగూడా తీసుకోబోయాడు. “ఆహా, అక్కరలేదు. ఆకప్పు అక్కడ పెట్టండి. రెండూ నేను లోపలపెట్టేస్తాను.”
“మీరు పొద్దున్ననుంచి శ్రమపడుతూనే వున్నారు కదా. మాకూ కొంచెం స్వతంత్రం ఇస్తే ఇల్లాంటి చిన్నచిన్న పన్లు చేస్తాం” అంటూ రెండు కప్పులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. సింకులో పెట్టడమే కాకుండా కడిగేసి బోర్లించి మరీ వచ్చాడు. వస్తూ వస్తూ హాల్లో షో కేస్ లో ఒక ఫ్రేమ్ కట్టీంచి వున్న ఫొటో దగ్గర ఆగిచూశాడు. చేతుల్లోకి తీసుకుని చూస్తూ వుండి పోయాడు.
అతని చేతిలో ఫొటో చూసి ’అయ్యో, లోపల పెడ్దామనుకుని మర్చిపోయానే’ అనుకుంది మృదుల. ఆమెకేసి ప్రశ్నార్థకంగా చూశాడు.
“ఇదేంటి, ఎదో న్యూస్ పేపర్ కట్టీంగ్ ఫ్రేమ్ కట్టించినట్టుగా వుంది. అవునన్నట్టు తలూపి వూరుకుంది.
వున్నట్టుండి నిశ్శబ్దమైన మృదులని చూసి ఏమీ మాట్లాడకుండా కూర్చుని పేపర్తీసుకుని చదువుతూ కూర్చున్నాడు. ఒక కంటితో ఆమె వంక చూస్తూనే వున్నాడు. వున్నట్టుండి ఆమె నిశ్సబ్దం అయిపోవడం అతనికి అర్థం కాలేదు. ఏదో వుంది అనుకున్నాడు. ఇంతలోకి తక్కిన వాళ్ళంతా లోపలికి ఒకేసారి అడుగుపెట్టారు.
“మంచి వాసన వేస్తోంది మాడమ్,”అంది సంధ్య లోపలికి వస్తూనే.
“వాసనా, నాముఖం! నేనేదైనా చేస్తే కదా వాసనరావడానికి. మీతోబాటు రాత్రి పదకొండుకి ఇంటికి వచ్చి పడుకుని లేట్ గాలేచి ఎవరేమి తింటారో తెలియక ఒక్క పులిహోర చేసాను. పిజ్జాలు తినితిని నాలుక పిడచ బారివుంటుంది. అందరికీ పదహారణాల తెలుగు పులిహోర పెట్తున్నాను. ఇంకా కావాలంటే తెప్పించుకుందాం.” అందరికీ నీళ్ళ గ్లాసులిస్తూ.
“జయహో పులిహోర. ఇల్లొదిలి వచ్చాక తినలేదు. నాకైతే మరేమీ అక్కరలేదు” అందరూ డిట్టో అంటే డిట్టో అనడంతో “భేష్, అయితే కొంచెం పెరుగన్నం పోపు పెట్టి దద్దోజనం చేస్తాను. నిమ్మకాయగానీ ఆవకాయో మాగాయో నంచుకుని తినచ్చును.”
ఇప్పుడే వస్తామని చెప్పి క్రిందకెళ్ళి అభి, జనార్థన్ అందరికి ఐస్క్రీమ్ తీసుకొచ్చారు వేడివేడి జిలేబితో పాటు.
తిండి ఏర్పాటు అవగానే ఇంక పనిలో పడ్డారు అందరూ. అయితే ముందు వేడిగా వుందని జిలేబి ఆరగించడం మొదలెట్టారు. అంతే, ఎప్పుడు పని మొదలెట్టారో ఎప్పుడు ఆపాలో తెలియనంత దీర్ఘచర్చల్లో మునిగి ఒక్కొక్కళ్ళ రిపోర్టులు చూస్తూ ప్రతి వాళ్ళ రిపోర్ట్ ని తక్కిన అందరూ విశ్లేషణలు, సలహాలు ఇస్తూ మూడయ్యేదాక పనిచేశాక సంధ్య “ఎవరికీ ఆకలి వుండదు, ఖర్మ. ఆ పులిహోర రాత్రికి నువ్వొకదానివే తింటావా ఏమిటి?” అని గట్టిగా అడిగేసరికి దిగ్గున లేచింది మృదుల.
“నాకైతే పైనుంచి వార్నింగ్ వచ్చింది. పని ఈరోజు పని పూర్తి చేసెయ్యాలని ఆరాటంలో ఏమీ గుర్తులేదు. మీ అందరికీ ఏమయ్యింది? ఇంకానయం. సంధ్య గుర్తుచేసింది. లేకపోతే అదంతా పూర్తి చెయ్యలేక డ్రైన్లో పొయ్యాల్సివచ్చేది.” లేచి ప్లేట్స్, గ్లాసులు మంచినీళ్ళూ తలొకళ్ళూ తలొకటీ తీసుకువచ్చారు. పులిహోర గిన్నె బయటికి తీసుకొస్తుంటే కాల్ బెల్ మ్రోగింది. తలుపు తియ్యగానే అందరికీ వేడి వేడి పూరి కూర తీసుకొచ్చాడు డెలివరీ బాయ్. ఎవరు ఆర్డర్ ఇచ్చారు అంటే ఎవరిచ్చారు అని ముఖాలు చూసుకున్నారు. నవ్వుకుంటూ అభి “తినండి ఎవరిస్తేనేమి తినండి. ఇవ్వాళ మనపంట పండింది.” మృదుల అతనికేసి ప్రశ్నార్థకంగా చూసింది.
“మీరే ఇచ్చారు. నేను క్రెడిట్ తీసుకోవడంలేదు. మీరిందాక వాష్ రూమ్ కి వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు నేను మీవెనకాల వచ్చాను. అప్పుడుమీరు ఆర్డర్ ఇవ్వడం విన్నాను. మమ్మల్ని సర్ప్రైజ్ చెయ్యడానికే ఈ ప్లాన్ అని తెలుసు. అందుకే మీరు లంచ్ కి లేవలేదని కూడా వూహించాను.”
“నాకే అనుమానంవచ్చింది. అందరూ ఆకలిమీదవుంటే ఒక్క పులిహోర సరిపోదని అనిపించింది” అని అందర్నీ “తినండి. తినండి!” అని అదిలించింది
అంతాతిన్నాక వూడ్చుకుని వూడ్చుకుని పులిహోర వేళ్ళు నాక్కుంటూ తినేసి పూరీలు ఖాళీ చేసారు. మృదులని అందరూ మంచి ఆఫీసర్, లీడర్ అనుకుంటారు. ఇప్పుడు మంచి రుచికరమైన భోజనం కడుపునిండా పెట్టడాన్ని అందరూ లోపలలోపలే అభినందించుకున్నారు.
తర్వాతరోజు ప్రాజెక్ట్ ప్రెజంటేషన్ అప్ప్రూవ్ అయింతర్వాత అందరూ పార్టీ చేసుకోటానికి మళ్ళీ రెష్టారెంట్ త్రోవ పట్టారు.
అలామొదలైంది మృదుల అభీల స్నేహం. తర్వాత ఎన్నొసార్లు ఇద్దరూ కలిసే ఆఫీస్నుంచి బయటకి వచ్చేవాళ్ళు. ఆమెని దింపి ఇంటికి వెళ్ళేవాడు. పదైనా పదకొండైనా. వాళ్ళ స్నేహం బాగా పెరిగి ఒక ఆత్మీయత ఒక దగ్గరతనం కూడా ఇద్దరిలోను వచ్చింది. ఆఫీసులో అందరికీ ఈ స్నేహం అలవాటయినట్టు అసలు ఇది ఒక ప్రత్యేకమయిన విశేషం అని ఎవరూ అనుకోటంలేదు గతఏడాదిగా.
అభి ఎప్పుడు మృదులదగ్గరికి వచ్చినా మళ్ళీ ఎప్పుడూ ఆఫొటో చూడలేదు. వింతగా పేపర్ కట్టీంగ్ ని ఎవరు ఫ్రేమ్ చేసి దగ్గర పెట్టుకుంటారు? అయితే ఆమెనెప్పుడూ అడగనూ లేదు.
ఒకరోజూ ఇద్దరూ బీచ్ కివెళ్ళి కూచుని ఆఫీస్ గురించి కబుర్లు చెప్పుకున్నప్పుడు అభి తనకి ఆఫీస్ వాళ్ళు ఆర్నెళ్ళు ఆస్ట్రేలియా పంపటానికి ప్రపోజల్ పెట్తున్నట్టు చెప్పాడు. మృదుల స్తబ్దురాలైనట్టు అల్లాగే కూచుండిపోయింది.
అభి “ఏమిటి అల్లా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయావు“
“నువ్వు బాంబ్ పేల్చినట్లు ఈ కబురు చెప్పాక నన్నేం మాట్లాడమంటావు?” అంది.
“నాకూ ఇవ్వాళే తెలిసింది. నీలాగే నేను ఒక షాక్లోకి వెళ్ళిపొయాను. ఏంచెయ్యలో ఆలోచించలేని పరిస్థితిలో వున్నాను.” అభి ముఖ్హంలో ఎప్పుడు చూడని ఒక విషాదవీచిక. ఇద్దరూ ఏంమాట్లాడలేనట్టు కూచుండిపోయారు. “నేనయితే నువ్వెక్కడెళ్ళిపోతావోనని బెంగలోకి వెళ్ళాను. ఈ వూరిగాని వూళ్ళో నాకున్న ఒకేఒక్క స్నేహితుడివి నువ్వే. ఆఫీసులో అమ్మాయిలు అందరూ వాళ్ళవాళ్ళ కుటుంబాలతో కాలక్షేపం చేస్తుంటారు. వాళ్ళవాళ్ళిక్కడ లేకపోయినా వారంతిరిగేసరికల్లా ఇంటికెళ్ళిపోతారు. నాకు నా ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి నువ్వే ఆధారం. కలుసుకోక పోయినరోజు ఫోన్ అన్నా చేసుకుంటాం.” మృదుల నిస్పృహ గా అంది.
అభి చటుక్కున మృదుల చెయ్యి పట్టుకున్నాడు. మృదుల ఆశ్చర్యంగా అతనికేసి చూసింది. అయితే అభి ప్రతిసారిలా సందేహించలేదు. ఆమె చెయ్యిని మరింత బిగించి పట్టుకున్నాడు. “నిజం చెప్పాలంటే నేనెన్నేళ్ళుగానో నీకు చెప్పాలనుకుంటున్న విషయం ఒకటి వుంది. ఇక్కడ నేను తప్పితే నీకు ఎవరూ స్నేహితులు లేరని నువ్వెలా అనుకుంటున్నావో నేను అలాగే అనుకుంటున్నాను. నా గురించి నీకేమీ తెలియదు. తెలిస్తే నువ్వెలా స్పందిస్తావో కూడా నాకు తెలియదు. అయితే ఈ రోజు నాకథ నీకు చెపుతాను. నీకుబోర్ కొట్టను కానీ నీకు తెలిసితీరాల్సిన అవసరం వుందని నాకనిపిస్తోంది. ఇప్పటికి దాదాపు ముప్పైఏళ్ళ క్రితం నువ్వువినేవుంటావు. ఒక మహమ్మారి ఒక దేశాన్నికాదు, ఒక ఖండాన్ని కాదు మొత్తం ప్రపంచాన్నే గడగడలాడించింది. అప్పుడు సమయం బట్టి దాన్ని కోవిడ్19 అన్నారు లేకపోతే సులువుగా కరోనా అన్నారు. ఈ కరోనా అనే వైరస్ చైనా లో మొదలయ్యి యు.ఎస్, యూరొప్ దెశాల్లో భయంకరంగా చెలరేగి కొన్ని కోట్లమందిని పొట్టన పెట్టుకుంది. ఇవాల్టికి కూడ ఎంతమందికి వచ్చింది ఎందరు చచ్చిపోయారు అనేలెక్కలు ఎవరికీ తెలియదు. ప్రయొగశాలలోనుంచి వచ్చిందనో చైనీయులు తినే గబ్బిలాల వంటి ఆహార పదార్థాల ద్వారా వ్యాపించిందనో ఎన్నో సిద్దాంతాలు చెప్పారు. భారతదేశం కుడా తప్పించుకోలేకపోయింది. ఇలాంటి మహామ్మారి 1918 తర్వాత మళ్ళీ రాలేదని అన్నారు.”
“అవునునేనూ వున్నాను, దానిని స్పానిష్ ఫ్లూ అన్నారు. మొదటిప్రపంచ యుద్దం తర్వాత వచ్చిందిట. కరోనా కూడా నేను పుట్టినప్పుడే వచ్చింది.” మృదుల ముఖంలో ఒక బాధావీచిక.
“నాకప్పుడు ఆరేళ్ళు. నాజీవితంలో నేను కోలులోలేని విషాదం నాచిన్నప్పుడే జరిగింది. దానిముందు నేను నాబతుకులో పడిన కష్టాలన్నీ దిగదుడుపే. మానాన్నకి మాచిన్నప్పుడు ఒక దుకాణం వుండేదిట. ఇప్పుడన్నీ ’ట’లే ఎందుకంటే ఇవేవి నాకు గుర్తులేవు. మావూరు ఒక మంచి సుఖశాంతులతో వెల్లి విరిసే వూరని అనను ఎందుకంటే అవేంటో నాకు తెలియదు. కానీ శుభ్రంగా జరుగుబాటవుతున్న సమయంలొ మానాన్న ఆవూళ్ళో నే పరిచయమున్న ఒక స్నేహితుడితో కలిసి పట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాడు. నేను పుట్టేసరికి అల్లా మకాం పట్నానికి మార్చేసి ఇద్దరూ మంచి లాభాల్లోనే వ్యాపారాలు చేసుకునే వారుట. అమ్మ చెప్పే వినే అలవాటు లేకపోవడం అటుంచి అమ్మని అడగటం అవసరం కూడా అనిపించలేదతనికి అని మాపిన్ని చెప్తూ వుండేది. నిజానికి తల్లిలా చేరదీసిన పల్లెటూరొదిలేసి దూరంగా నాలుగు రాష్ట్రాలవతల ఉత్తరప్రదేశ్లో పట్నానికి వెళ్ళాడు తర్వాత నాన్న. అప్పుడొచ్చిందట ఒక మహమ్మారి ఈకరోనా. దాని ధాటికి పన్లన్నీ ఆగిపోయాయి. ఇదుగో తగ్గుతుంది అనుకుంటూ నెల్లాళ్ళు గడిపారు నాన్న ఆయన స్నేహితుడు. తగ్గలేదు సరిగదా దేశంలో లాక్ డౌన్ పెట్టింది కేంద్రం. రైళ్ళన్నీఆగిపోయాయి. కార్లు, బస్సులు, చివరికి లారీలు అన్ని బందయిపోయాయి. సంపాదించిన డబ్బు ఎప్పటిదప్పుడు ఇంటికి పంపెయ్యడంతో ఇంటికెళ్ళే మార్గాలన్ని మూసుకుపోయాయి. మళ్ళి పుంజుకుంటుందన్న ఆశ ఒక నెల్లాళ్ళు అక్కడే ఆపేసినా చివరికి తక్కిన వారందరితో నెమ్మదిగా కాలినడకన వూరికి బయలుదేరాడు ఆయన కళ్ళల్లో అప్పుడు గుర్తుకొచ్చివుండచ్చు వూళ్ళో విడిచిన వృద్ద తల్లిదండ్రులు అమ్మ అయిదారేళ్ళ చిన్నవాడినైన నేను. కేంద్రం ఒక్క నాలుగురోజులాగినా ఆయనొక నాలుగురోజులు ముందనుకున్నా ఇల్లు చేరుకుని వుండేవాడు. ఆయనలా నడిచి ఇళ్ళకివెళ్ళటానికి రోడ్డున పడ్డవాళ్ళు మధ్యలో తిండిలేక నీళ్ళు దొరక్క పసిపిల్లలికి పాలు లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వేల సంఖ్యలో వున్నారు. ఒకచోట రైలు కట్ట దాటుతూ ఎవరూ కాపలాదారులేని గేటుదగ్గర హడావుడిగా దాటుబోయబోయారట. ఎదుర్నుంచి అంతే హడావుడిగా వేగంగా ఒక లారీ! కకావికలై పరుగులుపెట్టిన మనుష్యులమద్య తప్పించుకున్నవాళ్ళు తప్పించుకోగా మానాన్న శవమై తేలాడట. ఆయనతో వెళ్ళిన స్నెహితుడు గాయాలతో తప్పించుకోగలిగాడు. పోలీసులు పోస్ట్ మార్టెమ్ లు వ్యవహారాలన్నీ ముగిశాక కబురందుకుని వెళ్ళిన తాతయ్య అక్కడే దహనక్రియలు జరిపి వెనక్కి వచ్చేసాడు. అయితే అంత పెద్ద ప్రయాణం లో ఎక్కడో వైరస్ కాటేసింది. మామూలు జలుబు దగ్గనుకున్నాడు చిన్న జ్వరం అనుకున్నాడు ఇంటికి వచ్చేసరికి తీవ్రమైన జ్వరం ఊపిరాడకపోవడం కోవిడ్ అని నిర్థారణ చెయ్యడం ఆయననుంచి అమ్మ నాయనమ్మ వైరస్ దారిన పడటం ఆపల్లెలో టెస్ట్ చెయ్యడానికిగూడా సదుపాయం లేకపోవడం అలా ఒక్క మాకుటుంబంలోనే ముగ్గురు బలయ్యారు, నాన్న మృతి కాక. పిన్ని నన్ను తీసుకెళ్ళి దగ్గరపెట్టుకుని చదివించింది. తను నిజానికి నాకేమీ తక్కువ చెయ్యలేదు. కానీ నాకు అందరిపిల్లల్లా అమ్మ నాన్న ఎందుకులేరు అనే ప్రశ్న నన్ను అస్తమానూ వేధించేది. వాళ్ళకొక్కతే అమ్మాయి. పెళ్ళయి అమెరికా వెళ్ళిపోవడంతో ఇప్పుడు తను కూతురుదగ్గరే వుంది నాకైతే నాకంటూ ఎవరూ లేరని అనిపిస్తూవుంటూంది. నాసోదంతా చెప్పి విసిగించానా? ఎన్నో సార్లు అనుకున్నాను. మనపరిచయం పెరగముందే నీకు నాగురించి చెబ్దామని.”
మృదుల నిశ్సబ్దంగా వుండిపోయింది. ఎందుకలా మాట్లాడటంలేదు అని మనసులోనే మల్లగుల్లాలు పడుతున్నాడు అభి. “పద వెళ్దాం. చీకటి పడుతోందిగా. మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళాలి కూడా” అంటూ లేచింది. అంతే నిశ్సబ్దంగా అమె ననుసరించాడు. ఆమెని ఇంటి దగ్గర దింపి “వస్తా, మళ్ళీ రేపు కలుస్తాంగా.” అంటూ కారెక్కబోయాడు. అతని చెయ్యి పట్టుకుని “లోపలికి రా, ఒక్కసారి. ప్లీజ్” అంది.
“ఏమైంది? గుడ్ బై చెప్తావా కొంపదీసి” అన్నాడు.చెయ్యి వదలకుండా లాగుతూ “రా, చెప్తాను” అంది
లోపలికి వెళ్తూనే ’ఇప్పుడే వస్తాను’ అని లోపలికి వెళ్ళి తను ఫ్రేమ్ కట్టించి దాచుకున్న ఫొటో తెచ్చి అతని చేతిలో పెట్టింది. అది తీసుకుని చూసి ప్రశ్నార్థకంగా చూశాడు.
“ఇది నాగతం. దాదాపు నీ గతం లాంటిదే!”
“ఏమిటి, ఏమంటున్నావు? ఎవరిదీ ఫొటో? ఈ పాప…”
“ఇది మాఅమ్మ. ఈ ప్రక్కన ఆడుకుంటున్న పసిపాప నేను. నువ్వు ఇప్పటిదాకా చెప్పిన మహామారి నా జీవితంలో ప్రవేశించి నేను పూర్తిగా కళ్ళు తెరవకముందే నా తలరాత రాసేసి వెళ్ళిపోయింది. మా అమ్మ నాన్న గూడ వలసకూలీలు, నడిచి నడిచి ఇంటికి వెళ్తూ మాఅమ్మ మార్గమధ్యంలో రైల్ ఎక్కుదామని బరొడా లో స్టేషన్ లో వేచి వుండగా దారిలోనే మృతి చెందిందిట. ఆ విషయం తెలియని నేను అక్కడ ఆడుకుంటుంటే ఎవరో ఒక జర్నలిస్ట్ ఫొటొ తీశాడట. ఆరోజు అన్ని పేపర్లో ప్రముఖంగా ప్రచురించారట. నాన్న ఎటు వెళ్ళాడో ఎవరికీ తెలియదు. పొలీసులు నన్ను ఒక అనాధాశ్రమంలో చేర్పించారట. తర్వాత మా అమ్మనీ నాన్ననీ ఎరిగిన వాళ్ళెవరో తీసికేళ్ళి మావూరుకి దగ్గర వున్న విజయవాడలో చేర్పించారట. అక్కడే పెరిగాను. ఏం కష్టాలు పడలేదనే చెప్పాలి. నాకెవరూ లేని అనాధనన్న భావంతోనే పెరిగిపెద్దయ్యాను. అదృష్టవశాత్తు చదువులో వెనకబడలేదు ఎప్పుడూ. పన్నెండో క్లాసులో నాకొచ్చిన ప్రైజులు చూసి పెద్ద మనస్సున్న ఒక పారిశ్రామికవేత్త నాకు పై చదువులు చెప్పించాడు. స్కాలర్సిప్పు కూడా వచ్చింది. అల్లా బయటపడ్డాను. అయితే నాచిన్నప్పుటినుంచి నేను మారిన రెండు అనాధాశ్రమాలలో ఈ ఫొటో నాబట్టల్లో పెట్టి వుంచి అల్లా నాదగ్గరే వుండి పోయింది. అయితే చిరిగినట్టు అయితే నాగతానికున్న ఒకే ఒక్క లింక్ అవడంతో నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మళ్ళీ లైబ్రరీలకెళ్ళి ఆ డేట్ పేపర్ బయటికి తీసి ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాను. ఎందుకు చేశానో నాకైతే తెలియదు. ఆరోజు నువ్వు మొదటిసారి వచ్చినప్పుడు నీ కుతూహలం గమనించి కూడా చెప్పలేకపోయాను. జీవితంలో ఇప్పటివరకు నేనెవర్నో ఎవరికీ చెప్పలేదు. నాకే తెలియదు. ఎవరో ఒకళ్ళం అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మనకొక గుర్తి్ంపు లేకపోతే ఈ సమాజం గౌరవించదుసరికదా అడుగడుగునా అవమానాలని పరమవీరచక్రల్లా బహుకరించి మనకి అలంకరిస్తారు. అందుకే నాకు తప్పించి మరో పురుగుకి కూడా తెలియదు నాజీవితంలో జరిగిన ఈ విషాదం గురించి. ఇప్పుడెందుకు చెప్పాను? నిజంగా నాకు తెలియదు. ఒక కుటుంబం అంటూ లేకపోయినా ఎవరో నీకు చెందిన వాళ్ళే నిన్ను పెంచి పెద్ద చేశారు. అమ్మా నాన్న లేరు నిజమే, నీకు చాయామాత్రంగానయినా వాళ్ళ ఙ్జాపకాలు నీ మెదడులోతులలో నిక్షిప్తమై వున్నాయి. అనాధవి కాదు. నా విషయం అల్లా కాదు. నేను నా అన్నవాళ్ళు లేకుండా పెరిగాను. అది నా ప్రమేయంలేని నా దురదృష్టం.”
మృదులకి తెలియకుండానే కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి. ఇది బాధా, ఒంటరితనమా, అణచి పెట్టిన దుఃఖమా ఆమెకీ తెలియదు అతనికీ అర్థం కాలేదు. ఆభి నిశ్సబ్దంగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు. అల్లాగే వుండిపోయింది మృదుల చాలా సేపు. కాసేపటికి తేరుకుని కళ్ళు తుడుచుకుని “సారీ, మనం ఎవరం అన్న అస్థిత్వం లేకపోవడం ఎంత కష్టపడి పైకి వచ్చి జీవితంలో నిలదొక్కుకున్నా ఒక తీరని లోటు.”
“అభి, ఎందుకో ఎవరికీ ఎప్పుడూ చెప్పని గతాన్ని నీకు చెప్పేశాను. ఎవరితో అనకు ఆఫీసులో, సరేనా?”
“అనను, అనను, ముమ్మాటికి అనను. ఇవ్వాల్టినుంచి మనస్నేహపుస్తకంలో ఒక కొత్తపేజీ తెరుచుకుంది. నువ్వు నేను ఒకరి కొకరం. ఇంతకీ ఆస్ట్రేలియా సంగతి ఏమిటి? వెళ్ళనా వద్దా?”
“వెళ్ళకపోవడం ఏం, వెళ్ళు. అవకాశాలు అస్తమానూ రావు. మన స్నేహమేమీ ఆగిపోదు, మాసిపోయి మసకబారదు. నాగురించి మానకు. నేను బాగానే వుంటాను. ఏం భయం లేదు. ఇప్పుడు నాతో నువ్వున్నావుగా!” నవ్వింది మృదుల.
“అదీ, అల్లా నవ్వుతూ వుండు. ఇంకా వెళ్ళటానికి టైమ్ వుందిలే. రేపే వెళ్ళటంలేదుగా. నేనింటికి వెళ్ళనా మరి?” అంటూ లేచాడు.
ఆ తర్వాతవాళ్ళమధ్య ఆత్మీయత పెరిగింది. స్నెహంలో చనువు పెరిగింది. కానీ ఇద్దరూ అంతకంటే ముందుకువెళ్ళటానికి ఎక్కడో ఒక సందేహం.
అతను ఆస్త్రేలియా నుంచి వాళ్ళు రోజూ స్కైప్ లో మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడే బీజం పడింది ఇద్దరి మనస్సుల్లో వాళ్ళు భవిష్యత్తులో అభి ఇండియా తిరిగి వచ్చాక కలిసి చెయ్యటానికి ఒక ప్రాజెక్ట్ రోజురోజుకీ కొత్త అలోచనలతో పధకం పెరిగి రూపుచెందటం మొదలయ్యింది.
“ఒక ఆఫీసులోనే కరోనా బాధితులం ఇద్దరం వున్నాం. అప్పటికి మనకి ఙ్జానం రాకపోయినా తర్వాత సేకరించిన సమాచారం ఎంత వుందంటే మనలాంటి వాళ్ళందరినీ సమీకరించటానికి అందులో ఆర్థికంగా బయటికి రాలేని వాళ్లకి మద్దతు ఇవ్వాలంటే ఏంచెయ్యాలో ఎల్లాచెయ్యాలో ఆలోచించాలి” అభితో మనస్పూర్తిగా అంగీకరించింది.
అభి వచ్చేసాడు. ఆఫీసులో అందరూ కరతాళధ్వనులతో స్వాగతం చెప్పారు. తర్వాత వాళ్ళ జీవితాలు మళ్ళీ ఆఫీసు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ రొటీన్ లో పడ్డారు. అయితే అభి, మృదుల మాత్రం వాళ్ళకి దొరికిన ప్రతి శలవనీ ఉపయోగించి ఒక వెబ్ సైట్ మొదలెట్టారు.
తర్వాత ఎఫ్. ఎమ్ రేడియోలో ప్రతిరోజూ ప్రకటన రావటం మెదలేట్టీంది.
“మీరు కరోనా బాధితులా? అయితే ఇక్కడ మీపేరు రిజిస్టర్ చెసుకోండి. మీకు తెలిసిన ఎవరైనా సరే కరోనా వల్ల బాధపడివుంటే వాళ్ళకి తగిన ఆర్థిక వనరులు లేకపోయినా గూడా రిజిస్టర్ చెయ్యండి. ఈ విషయాన్ని మీకుతెలుసున్న వాళ్ళందరికీ చెప్పండి.”
ఒక నెల, రెండునెలలు, ఒకటి అయిదు పదీ తో మొదలయిన రిజిస్ట్రేషన్ వందలు వేలకు చేరటం మొదలయింది. ఒకొక్కళ్ళు వాళ్ళ అనుభవాలని చెప్పుకుంటూ పోవడంతో పాటు ఆరోజుల్లో వాళ్ళు తీసిన ఫొటోలు వీడీయోలు అప్లోడ్ చెయ్యడం మొదలెట్టారు. మనుష్యులందరూ మాస్క్ లు వేసుకుని గ్లౌవ్స్ ఎసుకుని గ్రహాంతరాలనుంచి వచ్చారన్నట్టు వున్నారు. డాక్టర్లయితే వాళ్ళ రక్షణ కవచాలతో భూమి మీదున్న జీవాలేనా అన్నట్టు వున్నారు. డాక్టర్లయితే నెలల తరబడి ఇళ్ళకి రాలేకపోవడం కొందరు కరోనా బారిన పడటం, చనిపోయిన వాళ్ళని అంత్యక్రియలకి తీసికెళ్ళతానికి పడిన ఇబ్బందులు పి.పి యి లతో పాతిపెట్టడాలు. అలా చెయ్యలెని వాళ్ళు మూకౌమ్మడి దహనాలు అన్నీ హ్రుదయవిదారకమైన కథనాలు. ఇవన్ని రోజూ వస్తుంటే అభికి మృదులకీ తర్వాతేమిటి అన్న ప్రశ్న తలయేత్తటం మొదలయింది. కరోనా బాధితుల పిల్లల్లో కొంత ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆర్థిక వనరులు వాళ్ళకి పెరిగేలా నిధి సమకూర్చుకోవటం ఎల్లా అని ఆలోచనలో పడ్డారు. మహమ్మారి వల్ల చితికిపోయిన కుటుంబాలకి ఏవూరుకావూర్లో ఒక యూనిట్ ఏర్పాటు చేసి కొంత సహాయం చెయ్యాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక్కళ్ళే ఉద్యోగం చెయ్యలని రెం వాళ్ళు పూర్తిగా దీనికి అంకితమై పని చెయ్యాలని తీర్మానించుకున్నారు.
“ఇన్ని నిర్ణయాలెల్లాగో తీసుకున్నాం. పెళ్ళీకూడా చేసేసుకుందామా అని జోక్ చేసిన అభిని దీర్ఘంగా చూసి ” ఆమాటెప్పుడొస్తుందా నీ నోటినుంచి అని చూస్తున్నాను. ఈ అనాధ, తల్లిదండ్రులెవరో తెలియని అనామకురాలు అనుకునివుండవచ్చుగా, అని సర్దిచెప్పుకుంటున్నాను కూడా.”
“నీమొహం. నీకు నాకు ఈ విషయంలో అభిప్రాయబేధమే లెదు. ఇంక ఎందుకు సందేహిస్తాను? ఒకటిమాత్రం సతాయిస్తున్న ప్రశ్న – మనపిల్లలెవరవుతారు? ఇదే అంకితభావంతో రేపు పిల్లలు పుట్టాక కూడా చెయ్యగలమా? అనే నా బాధ.”
“అయితే సరే పెళ్ళిచేసేసుకుందాం. పిల్లలంటావా, ప్రస్తుతానికి వద్దనే అనుకుందాం. తర్వాత కావాలని అనిపిస్తే అప్పుడే చూద్దాం” అంది మృదుల. అల్లా వాళ్ళీదరూ భార్యభర్తలయ్యారు. వెబ్ సైట్ లో చెరుతున్న వారిలో చేరుతున్న వారిలో ఆర్థిక వెసులుబాట్లున్నవారికి ఏమాత్రం ఠికాణా లేని వారి పిల్లలకి స్కూల్ చదువులు చెప్పించేటట్లు అగ్రీమెన్ట్లు రాయించుకున్నారు. అందరూ ఆ బాధలో నుంచి వచ్చినవాళ్ళే కదా మానవత్వం కొత్త రెక్కలు కట్టుకున్నట్టు సహాయ సహకారాలు బాగా వచ్చాయి. అది అల్లా మొదలయి పది పదిహేనేళ్ళకి వాళ్ళ వెబ్శైత్లో చేరిన ప్రతివాళ్ళకీ ఒక ఆధారం వుందనీ. ఒక జీవనోపాధికి సరిపడే సంపాదన వుందని తెలుసుకున్నాకే వాళ్ళని వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేలా తీర్చి దిద్దటానికి కష్టపడ్డారు. వలస కూలీల పిల్లలు పోశ్ట్ గ్రాడ్యుయేట్లయ్యారు ఎన్నో చోట్ల. వాళ్ళనే పిల్లలను కున్నారు పిల్లలు లేరనే కొరత అనిపించనంతగా ఈ కార్యక్రమంలో మునిగిపోయారు. ఒక పదిహేనేళ్ళకు వెబ్ సైట్ అవసరం లేదనిపించి మృదుల రె్టైర్ అవడంతో ఈ పల్లెలో సెటిల్ అయ్యాము” అని ముగించాడు.
“మరి ఈ డేటా అంతా ఏమీ చేస్తారు?” అడిగాడు రమేష్.
“ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వారి ఆదేశం ప్రకారం తయారు చేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలు వస్తే ఈ డేటా కొంత ఉపయోగిస్తుంది. కనీసం మాలాంటి వలస వెళ్ళిన వాళ్ళ పిల్లలు అనాధలుగా మిగలరు. దేనితర్వాత ఏది చెయ్యాలి. ఎలాంటి తయారీలు అవసరమవుతాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అతి తక్కువ నష్టంతో బయటికి రావచ్చు అనే విషయాలు క్రోడీకరించాం.”
“మరో విషయం. ఈ కరోనా అయిపోయిందని అందరూ సాధారణ జీవితాన్ని మొదలెట్టబోతుంటే కరోనా మరో సారి మరిన్ని రూపాలలో ప్రత్యక్షమై ముందుకంటే ప్రమాదకరంగా కాటువేసింది. ఈ సారి తెలివితక్కువతనమో ప్రభుత్వాల నిర్లక్షమో మందులులేక ఊపిరితిత్తులకి పాకడంతో ఆక్సిజన్ లేక వేలాదిమంది ఆస్పత్రిపాలయ్యారు. బెడ్లుకి కొరత మందుకి కొరత, ఐసొలేషన్లో ఐసియు ల్లో జనం అయినవారికి దూరంగా వంటరి పోరాటాలు చేస్తూ భయభ్రాంతులతో జనం దిక్కుతోచ క అల్లాడి పోయారు. కరోనా కంటే దాని భయంతో మనుష్యులు నిస్సహాయులయ్యారు. ఎంతోమంది పిట్టల్లాచనిపోతున్నవారిని చూసి ఊపిరొదిలేసినవారెందరో! మానసిక సంక్షోభంలొ జనం, స్థైర్యం కోల్పోయి రోగులూ నానా అవస్థలు పడుతుంటే ఏ సహాయం అందించలేక పోయారు ఎవరూ. కొంతమంది ఆలోచించగలిగిన వాళ్ళు జనానికి మానసిక ఆరోగ్యం కాపాడుకోడానికి సలహాలు ఇచ్చి హెల్ప్ లైన్లు ఏర్పాటుచేశారు. కానీ ఆస్పత్రి పాలైన రోగులు ధర్యాన్ని కోల్పోతే ఎల్లా ఎదుర్కోవాలో ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. దాని గురించి ఒక డేటా బేస్ పెట్టి నివారణోపాయాలు నిపుణులద్వారా అందులో పొందుపర్చాలను్కుంటున్నాము”
“బాగుంది సర్, మంచి ప్రయత్నం చేస్తున్నారు. నేనెళ్ళొస్తాను.” అని లేచాడు. “భోజనంచేసి కొంత విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. వంట అంతాఅయింది” మృదుల ముగ్గురికి కంచాలు పెట్టి మంచినీళ్ళవీ తెస్తుంటే అభి గిన్నెలు తీసుకొచ్చాడు. కబుర్లతో భోజనాలయ్యాక సాయంకాలం బస్సు కి బయలుదేరి వెళ్ళాడు.
రమేశ్ ఇంటర్యూ పేపర్లో చదివిన వాళ్ళందరూ కరోనా రోజుల్ని తలుచుకుని అమ్మయ్య మనం తప్పించుకున్నాం అనుకుని వుంటారు.
****
Syamala Kallury taught for over a decade and a half in the AP Govt colleges in Srikakulam and Visakhapatnam as Lecturer in English She moved to Delhi after marriage where she taught in Delhi University, and in the Department of Humanities and Social Sciences at IIT Delhi till 2011 She has two daughters Ahana and Kruttika, who live in UK and Dubai respectively. Currently she lives in Visakhapatman with her dog Subbu, a cocker spaniel. A bilingual writer and translator, Syamala authored many books. 1. Telugu Short Stories women’s Voices: An Inner Voyage(1930-2000) Asian Publication House (2001)2. Twentieth Century Telugu Poetry (2006) 3. Godavari Tales Viveka Foundation (2006) 4.స్వగతాలు (2009) 5. If you Want To be a Poet, Patridge India (2018) 6. కంచికి వెళ్లకూడని కథలు navachetana పబ్లిషర్స్ (2019) 7.భావవిహంగాలు Telugu translation of Tagore’ s Stray Birds (1988, 2019)8. Rajanigandha, translation of Papineni Sivasankar’s award winning poetry collection with the same title published by Sahitya Academy New Delare ఆ few of her పబ్లికేషన్స్ in addition to a number of academic articles