మా కథ
రచన: దొమితిలా చుంగారా
అనువాదం: ఎన్. వేణుగోపాల్
గనికార్మిక స్త్రీ ఎక్కడ?
అది చాలు. రెండు రోజులు పోయాక వాళ్ళు నన్ను అరెస్టు చేయడానికి వచ్చారు.
వాళ్ళో అపరాత్రి నా ఇంటి కిటికీ తలుపులు పగలగొట్టి దొంగల్లాగ లోపలికి జొరబడ్డారు. ఇల్లంతా సోదా చేశారు. నేను సాజువాన్ రోజు రాత్రి యూనియన్ భవనం ముందర ఒక లెఫ్టినెంటును చంపేశానని ఆరోపించారు. అది పచ్చి అబద్ధం. నేనారాత్రి యూనియన్ భవనం దగ్గరికి వెళ్ళనేలేదు. వాళ్లలో ఒకతను చలిలో పెట్టుకునే ఊలు టోపి పెట్టుకున్నాడు. ఆ టోపీ పెట్టుకుంటే కళ్లు తప్ప మొఖంలో మరే భాగమూ కనబడదు. అతను నేను స్త్రీల నాయకురాలినని మిగిలిన వాళ్లకి చెప్పాడు.
“జనరల్ తల తెంచాలని చెప్పింది ఈమెనే” అన్నాడింకొకతను.
“లంజ.. రెండు వైపుల నుంచి డబ్బులు సంపాదించే దొంగ లంజ… కమ్యూనిస్టు” అని ఇంకొకడు మొరిగాడు.
దానితో నాకు పిచ్చెత్తిపోయింది. నా సొరుగులో ఉన్న వస్తువులన్నీ బయటికి లాగి వాళ్లముందు వేసి “రెండు వైపుల నుంచి డబ్బొస్తోందా? ఏదీ? నాకు మంచి బట్టలైనా లేవే?!” అని మొత్తుకున్నాను. వాళ్లు నన్ను పక్కకు తోసేశారు. ఈ గొడవకు నా కూతురు అలిషియా నిద్రలేచింది. వాళ్ళు దాన్ని గాలిలోకి విసిరేశారు. నేను పరుగెత్తి దాన్ని అందుకోగలిగాను.
నాకున్న విలువైన వస్తువులన్నీ, కాగితాలు, సంఘం డాక్యుమెంట్లు, అన్నీ వాళో దుప్పట్లో మూటకట్టారు. నన్ను బయటికి లాక్కుపోయారు. అలాగే నా భర్తనుకూడ ఉన్నవాణ్ని ఉన్నట్టుగానే లాక్కొచ్చారు.
ఆయన్ని ఓ సైన్యపు ట్రక్కుకి చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. ‘నా పసికూనకి చలికోటు తెచ్చుకోవడానికి అతి కష్టం మీద ఒప్పుకున్నారు.
అలా మేం ట్రక్కులోకి ఎక్కాం. అక్కడ మరికొందరు సైగ్లో-20 నాయకులు కూడ కనబడ్డారు. అప్పటిదాకా నాకేమీ భయం వేయనేలేదు.
మేం లాలాగువా బయటికి వచ్చేసరికి అక్కడ నిండా ఖైదీల్ని నింపుకున్న ట్రక్కు ఒకటి కనబడింది. వాళ్ళందరూ ఒకళ్లకొకళ్లు కట్టేయబడి ఉన్నారు. వాళ్ల ముఖాల నిండా రక్తం పేరుకుపోయింది. మరోట్రక్ హెడ్ లైట్ల వెలుగులో నేనక్కడ రక్తం ప్రవహించడం చూశాను. వాళ్లను సైనికులు అక్కడ చంపి పారేశారని నాకర్థమైంది. నన్ను కూడ చంపేయబోతున్నారని అనుకున్నాను. నేను చనిపోతే అనాథలైపోయే నా పిల్లల సంగతి ఆలోచించాను. నాకు అప్పుడు మాత్రం చాల భయం వేసింది.
ఇంతలో సైనికులు నన్ను ట్రక్కులోకి బలవంతంగా తోశారు. నేను లోపల పడగానే ఎవరో పెద్దగా మూలిగారు. అప్పుడు గాని లోపలివాళ్ళు బతికే ఉన్నారని నాకర్థం కాలేదు. సైనికులు మగవాళ్ళకు చేసినట్టే నాకు కూడ చేతులుకట్టేయబోయారు. అది చూసి నా కూతురు రాగం మొదలెట్టింది. కల్నల్ అసెరో వచ్చి ఆ పాప ఎవరని, ఆ పాప తల్లి ఏదని అడిగాడు.
“స్త్రీ నాయకురాలు ఆమే” అని టోపీ మనిషి చెప్పాడు. అప్పుడు కల్నల్ ట్రక్కు ఆపించి నన్ను కిందికి దించి ఏజెంట్లు ఉన్న చోటికి తీసుకెళ్ళాడు.
ట్రక్ లాలాగువాలో చాల సేపు ఆగింది. అక్కడ మరో నలభై యాభై మంది ఖైదీలని ఎక్కించాక మమ్మల్నందరినీ మిరాఫోర్స్ బ్యారక్ లకు తీసుకెళ్ళారు. వాళ్ళక్కడ మమ్మల్ని ఓ ఖాళీ గదిలో పడేశారు. మమ్మల్నందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తిస్తున్నామనీ, మేమేమీ చేయడానికి వీల్లేదనీ, పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చి చంపేస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.
సైనికులు ఖైదీలందర్నీ కట్టేసి వెళ్ళిపోయారు. నేను నా పాపను అక్కడ ఓ బల్లమీద కూచోబెట్టి వాళ్ళ వాళ్ళు విప్పడం మొదలెట్టాను. వాళ్ళను నిజానికి చాల గట్టిగా కట్టేశారు. నాకు విప్పడం చాల కష్టమైంది. చివరికి ఎట్లాగో ఆ కట్లన్నీ విప్పేశాను.
మరుసటి రోజు వాళ్ళు మమ్మల్ని అషియా విమానాశ్రయానికి తీసుకెళ్ళారు. అక్కడ్నించి విమానంలో లాపాజ్ తీసుకెళ్లాలని వాళ్ళ ఆలోచన. ఐతే ఆ రోజు వాతావరణం అనుకూలంగా లేక విమానం రానేలేదు. మేం ఆ విమానాశ్రయంలోనే చాల సేపు కూర్చున్నాం.
ఈ లోగా సైగ్లో-20 స్త్రీలు ఒక ప్రదర్శన జరిపి ఊరేగింపుగా అషియాకు తరలివస్తున్నారని తెలిసింది. ఏజెంట్లు అక్కడ్నించి బ్యారక్ లకు ఫోన్ చేసి ఆ స్త్రీలు చేరుతున్నారనీ, చేరారనీ ఆందోళనగా చెప్పారు.
జనం మిరాఫోర్స్ పోలీసు గస్తీ శిబిరాన్ని దాటారని వార్త రాగానే వాళ్ళు మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళారు. బ్యారక్క దగ్గర ఒక వాహనం మమ్మల్ని మరో మార్గం గుండా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. వాళ్లు నన్ను పాపతో సహా ముందు క్యాబిన్లో కూచోబెట్టారు. ఎదుటి వైపు నుంచి కాల్పులేమన్నా జరిగితే నా చాటున రక్షణ తీసుకోవచ్చుననే ఉద్దేశ్యంతోనే వాళ్లీ పని చేశారు. నా పక్కన ఒక ఏజెంటు నాకు తుపాకీ గురి పెట్టి కూచొని ఉన్నాడు. వాళ్లు బ్యారక్స్ వెనుక దారి నుంచి వాహనాల్ని ఒరు దారి పట్టించారు. అక్కడి నుంచి లాపాజ్ తీసుకెళ్లామనుకున్నారు. జనం బ్యానర్లు పట్టుకొని బ్యారల వైపు పరుగెత్తుకు రావడం నాకు కనబడింది. ఐతే వాళ్లు మా ట్రక్కుల్ని చూడలేక పోయారు.
ఒరురొకు వెళ్లే దారిలో మా ట్రక్ చెడిపోయింది. వాళ్లు నన్ను ట్రక్ నుంచి కిందికి దించి కూచో బెట్టారు. చుట్టూ సైనికులు నిలబడి ఉన్నారు. వాళ్లందరి దగ్గరా సబ్ మెషిన్ గన్లు ఉన్నాయి. బైటి జనానికి తెలియకుండా ఉండేందుకు గాను వాళ్ళు సబ్ మెషిన్ గన్ల మీద దుప్పట్లు కప్పుకున్నారు. వాళ్ళు మాతో “జాగ్రత్త – మేం తల్లీ బిడ్డలకు తుపాకీ గురి పెట్టి ఉన్నాం. ఎవరైనా కదిలే ప్రయత్నం చేశారో, సాయం పిలవడానికో, పారిపోవడానికో ప్రయత్నించారో మేం మొదట ఈ తల్లీ బిడ్డల్ని కాల్చి పారేస్తాం” అని బెదిరించారు.
ఆ ట్రక్కు బాగయ్యేవరకూ మేం అలా కొన్ని గంటలపాటు కూచున్నాం. ఎన్నో ట్రక్కులు రోడ్డు మీద వెళ్లి పోయాయి. కాని వాళ్ళెవరికీ ఈ ట్రక్కులో ఏం జరుగుతోందో తెలియదు. ఈ ట్రక్కు చుట్టూ టార్పాలిన్ కప్పేసి ఉంది.
మేం ఒరురో చేరగానే నాకక్కడ, బడిలో నాతో పాటు చదువుకున్న నేబర్ కనబడ్డాడు. అతనిప్పుడు ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తూ మమ్మల్ని తీసుకెళ్లడానికొచ్చాడు. అప్పుడు నా బిడ్డ ఆకలితో ఏడుస్తూ ఉండింది. ఒక ఏజెంట్ ఇచ్చిన ఐదు పిసోలతో నా కూతురికి తినేందుకేమన్నా కొందామనుకున్నాను. నేబర్ దగ్గరికెళ్ళి సాయం అడిగాను. “ఏమనుకుంటున్నావు నువ్వసలు? నేన్నీకు సాయం చేయడమా? ఎలా అనుకున్నావు?” అని తిట్టాడు.
మొత్తానికి మేం లాపాజ్ చేరాం. నా కూతురు చలికి చచ్చిపోతోందప్పుడు. దానికప్పుడు రెండేళ్ల వయసు. ప్రతివాళ్లు “ఏమిటీ? ఈ పాపను కూడా అరెస్టు చేశారా? ఈ పాపేం నేరం చేసిందీ?” అని అడిగారు. వాళ్లలో మరీ దయాపరులు కొందరు ఏడవడం కూడా మొదలు పెట్టారు. నా పాప తనకు జరిగిన అవమానాలెన్నడూ మరిచిపోదని నేను వాళ్లను ఓదార్చాను. ఇంత చిన్నతనం నుంచే గట్టిపడడమూ, అన్యాయాన్ని తెలుసుకోవడమూ మంచిదే గదా అని నేనన్నాను.
లాపాజ్ లో వాళ్లు మమ్మల్ని ప్రభుత్వ భవనం పక్కనే ఒక భవనంలో ఉంచారు. ప్రభుత్వ భవనంలోనే డిఐసి ఉంది. మాలోంచి మగవాళ్లను విడదీసి కింది అంతస్తుకి పంపేశారు. నేను నా భర్తని ఆ తర్వాత చూడలేదు. నన్ను ఒక్కదాన్నీ వాళ్లు బయటిగదిలో ఉంచారు.
అప్పుడే పాప ఆకలికి విపరీతంగా మొత్తుకోవడం మొదలెట్టింది. ఒక ఏజెంట్ వచ్చి “పాప ఎందుకు ఏడుస్తుంది?” అని అడిగాను.
“ఆకలికి.”
“మరి పాలివ్వరాదూ!”
“అంత చిన్న పిల్లకాదు. పాలు చీకదు. రెండేళ్ళ పిల్ల, తెలుసా?”
మరి కొంచెం సేపటి తర్వాత ఆయన ఒక చిన్న లోటాతో కాఫీ, ఒక బ్రెడ్ ముక్కా తీసుకొచ్చి ఇచ్చాడు. “తీసుకో-నేను ఇచ్చానని ఎవరికీ చెప్పకు. ఈ కారణం మీద నా ఉద్యోగం పోయినా పోవచ్చు” అన్నాడు. ఈ
మర్నాటి ఉదయం నేను వాళ్ళతో స్నానాలగదికి వెళ్ళాల్సి ఉందని చెప్పాను. నిజానికి నేను తోవలో ఎక్కడన్నా మా వాళ్ళు కనబడతారేమో ననుకున్నాను. వాళ్ళు కిందికి తీసుకెళ్ళారు గాని మా వాళ్ళెక్కడా కనబడనే లేదు. నేను నడవాదాటి వెళ్తున్నప్పుడు ఒక పొడవాటి మనిషిని చూశాను. చుట్టూ చూస్తూ అనుకోకుండానే ఆయనను ఢీ కొన్నాను. ఆయన దాదాపు నా మొఖంమీద ఉమ్మేసి నన్ను అవమానించాడు. ఆయన ఒక ఏజెంటు అయి ఉంటాడని నాకనిపించింది.
నేను బాత్ రూంలోంచి బయటికొస్తున్నప్పుడు ఒకతను నన్ను గుర్తించి పలకరించాడు. నేనాయన్ని మా మగవాళ్ళేమయ్యారని అడిగాను.
“వాళ్ళను ఉదయం నాలుగుగంటలకు పోర్టోరికోకు తీసుకెళ్ళారు” అని ఆయన చెప్పాడు. పాండో రాష్ట్రంలో ఒక అనారోగ్యకరమైన, నిర్మానుష్యమైన దీవి పోర్టోరికో.
ఐతే ఆ కింది అంతస్తులో నాకు కనిపించిన వాళ్ళందరూ ఖైదీలే. వాళ్ళు నాకు చాలా తినే పదార్థాలు ఇచ్చారు. “చెల్లీ! ధైర్యంగా ఉండు- నువు ఒంటరివి కావు. మన ఆశయం మహత్తరమైంది” అన్నారు. నేను తలుపుదాకా వెళ్ళి నన్ను అంతకుముందు అవమానించినతని వైపు చూశాను. ఆయన “క్షమించమ్మా – నువు ఖైదీవి కావనుకున్నాను క్షమించు” అన్నాడు. తన జేబులన్నీ వెతికి తన దగ్గర ఉన్న సిగరెట్లు నాకిచ్చాడు.
నేను అక్కడి నుంచి నా కొట్లోకి రాగానే వాళ్ళు నా దగ్గరున్నవన్నీ లాగేసుకున్నారు. పాప తిండి కూడా ఇవ్వలేదు. నేను కొట్లోకి వెళ్ళేసరికి లోపల ఒక యువతి కనిపించింది. ఆవిడ ఒక ఏజెంటే అనుకొని నేను నమ్మలేదు.
*****