మేలుకొలుపు( సమీక్ష)
-సరోజన బోయిని
జనజీవన జాగృతం ఈ మేలుకొలుపు కవనం.
కారుణ్యం వీడిన కఠిన హృదయాలకు ఒక మేలుకొలుపు గీతం. మనిషి శాశ్వతంగా మహిని నిలువడని తెలిసికొనక, మానవత్వాన్ని మరిచిన మనుషులకు ఇదొక మేలుకొలుపు శ్లోకం. మానవీయ విలువల పెంపుకై, మానవతా వాద దృక్పథంతో కూకట్ల తిరుపతన్న రాసిన వచన కవితా సంపుటియే మేలుకొలుపు. ఈయన రాసిన ప్రతి కవితా సంపుటిలోను స్త్రీవాదాన్ని చాలా బలంగా వినిపించాడు. స్త్రీల ఆంతరంగిక ఆవేదనను అక్షరీకరిస్తూనే, సమానత్వ సాధన కొరకు అసువులు ధారవోసిన అబలల జీవితాన్ని గురించి ఆర్ద్రంగా చెప్పాడు. తన కవనంతో మహిళా లోకాన్ని చైతన్య పరుస్తారు. మానవత్వం మరిచిపోయిన మనుషులకు కనువిప్పు కలిగేలా ఈ కవితా సంపుటిని రాసాడు. యువతరంలో నరనరం ఉప్పొంగేలా ఉద్యమ స్ఫూర్తిని నింపాడు. కాలం విలువను కవిత్వం చేశారు. జూదంతో నాశనం అయ్యే బ్రతుకులను కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఇక ఈ అన్నా పుస్తకాలపై సమీక్షలు రాయడం నాకో పెను సవాలే. చాలా సున్నితమైన అంశాలే ఈయన కవితా ఇతివృత్తాలు. జనాలను చైతన్య పరిచే కవన శిల్పం. మనిషి మానసిక పరిపక్వతను పెంచుకొనేలా అభివ్యక్తి. మానవత్వపు విలువలు తెలుసుకునేలా సాగే రచనలు. ఇక జనాలు తప్పుదోవ పట్టకుండా మంచి ఆలోచన వైపు మరలించేలా అల్లికలు. మనుషులు మనసును జయించేలా ప్రబోధం. అక్షరాక్షరం ఆయుధంగా చేసి, మూఢాన్ని గెలిచేలా సంధిస్తాడు. శాస్త్రీయ దృక్పథం కనిపిస్తుంది. అన్ని కవితల మర్మం పట్టుకోవడం నాకు పెద్ద సవాలే. కాబట్టి ఇక నేను ఇందులో స్త్రీల గోసను గురించి రాసిన కవితలను మాత్రమే విశ్లేషిస్తాను.
“అడదంటే…!అలుసుఎందుకు?” అనే కవితలో
“ఆడశిశువు నిలకు మొలవగానే/అదృష్టలక్ష్మి ఆడ బిడ్డగా జనించిందని/ఆర్ద్రత హృదయనికి ప్రతిరూపమని/ భావించి,సంభావించక/
ఛీ ఛీ ఆడజన్మ అని ఛీ కొట్టడం/ఎవరిని ఉద్ధరించడానికి జనించిదోనని/అభాండ ఆరంభం న్యాయమా?” అవును ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందంటేనే ఒకింత అసహనం. ఆడపిల్ల ఇంటికి అదృష్టలక్ష్మి అని మరిచి, దరిద్రమని తూలనాడటం. దీనికి కారణం తల్లితండ్రులు ఆడపిల్లను సాకడం భారం అనుకోవడం. వరకట్నం దురాచారం ఇంకా కొనసాగడం. పేదవాడు ఏమిపెట్టి ఆడపిల్ల పెళ్లి చేస్తాడు. కట్నకానుకలు ఎలా ఇవ్వగలడు. ఎదిగిన బిడ్డ తన ఆర్థిక అసమర్థతతో ఇంటి ముందు ఉంటే , తను ఎలా తట్టుకోగలడు. ఆడపిల్ల చదువును, పెళ్లిని మోయలేని భారంగా భావించే తల్లి తండ్రులు.
అంగట్లో సరుకుల్లాగా మగ మహారాజులు నిలుచుంటే, వారిని కొనలేని దుస్థితి తల్లిదండ్రులది.
ఇగ మగాడు వంశోద్ధారకుడని చివరి వరకు తమను చూసుకుంటాడనే అపోహ ఇంకొకటి. ఆడపిల్లను పాశవికంగా గర్భంలోనే, ఆ పసి మొగ్గగానే తుంచేస్తున్నారు. కానీ ఆడపిల్ల లేని సృష్టి ఎక్కడ ఉంటుంది. తల్లిగా, చెల్లిగా, భార్యగా అన్ని తానై మగవాడికి సేవలు చేస్తూవుంటుంది. ఆడపిల్ల పుట్టుకనే అవమానిస్తుండ్రు. ఇదెక్కడి న్యాయం?. ఆడపిల్లలు ఎదుర్కొంటున్న గోసను ఉన్నదున్నట్టుగా కూకట్ల తిరుపతి ఈ రచనలో అల్లిక చేశారు.
ప్రసవ వేదన పేరుతో ఈ కవి రాసిన కవితలో
“ప్రసవవేదన రోదనలతో/జలజల రాలు కనీళ్లు/
భరించ లేని భాధ/వర్ణించ లేని రోద/
విధి రాతకు తల వంచిన/ఉవిదల ప్రసవ వేదన” మోసే వాడికి తెలుస్తుంది కావడి బరువు అన్నట్లు,
ఆడ జన్మకు మాత్రమే తెలిసేది ప్రసవ వేదన. అపుడు భరించలేని పురిటినొప్పులతో కన్నీళ్లు రాలుతుంటే. పుట్టిన బిడ్డ ఏడుపు విని, అవి ఆనందభాష్పాలుగా మారతాయి. ఆ బిడ్డను చూసి తల్లి మురిసిపోతుంది. బొడ్డు పేగు తెంచుకొని, తన రక్తాన్ని పంచుకొని, పుట్టిన బిడ్డను చూసిన తల్లి ఆ బిడ్డను కనడానికి తను పడ్డ వ్యథనంతా మర్చిపోతుంది. తన ప్రాణం పోతుందని తెలిసినా, తన ప్రాణాలను ఫణంగా పెట్టి, చావుకు తెగించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది బ్రతుకునిస్తుంది. అలాంటి అమ్మ మన కళ్ళకు కనబడే దేవతేగా. మరి మనకు జన్మనిచ్చిన అమ్మరుణం ఎంత మంది తీర్చుకుంటున్నారు. నవమాసాలు మోసి కని, పెంచి, పెద్దచేసి, తనకు ఓ.. జీవితం ఇస్తే, తను అనుభవించే జీవితం అమ్మపెట్టిన భిక్ష అని మరిచి, అలాంటి తల్లినే తనయుడు భారం అనుకొని అనాథాశ్రమాల పాలు చేస్తున్నాడు. అమ్మకడుపు మాడుతేనే, తన కడుపు నిండిందనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అమ్మకడుపు తీపిని కూకట్ల తిరుపతన్న సహజంగా వర్ణించారు.
మహిళా చైతన్యోత్సవం కవితలో …”హంగూ ఆర్భాటంతో../ప్రతిఏటా జరుపుతున్నాం
మార్చి ఎనిమిది /అంతర్జాతీయ మహిళ దినోత్సవం
కానీ నేటికీ కాన రావడం లేదు /ఉవిదల జీవితంలో ఆనందోత్సవం” మహిళలను గౌరవిస్తాం అంటారు. మహిళా దినోత్సవాలు జరుపుతారు. కానీ మహిళలకు సమన్యాయం ఎక్కడ జరుగుతున్నది. వారికి తగిన గౌరవం ఎక్కడ దక్కుతున్నది. మగాడి అహంకారం రాజ్యం ఏలినంత కాలం ఆడవాళ్ళవి బానిస బ్రతుకులేగా. అన్నింటిలో సమానం అంటారు. అంతటా చిన్న చూపే చూస్తారు. గడప దాటిన ఆడ దానికి రక్షణ లేని సమాజమిది. ఆడదాన్ని అందలం ఎక్కిస్తాం అంటూనే, అదఃపాతాళానికి తొక్కుతున్నారు. మగాడితో సమనంగా మగువ అన్ని రంగాలలో దూసుకెళ్తున్నా, ఇంకా బానిసను చేసే ఆడుకుంటున్నారు. పేరుకు మాత్రమే మహిళ దినోత్సవం. ఎక్కడ మహిళల జీవితంలో ఆనందోత్సవం. మహిళలకు సమాన గౌరవం ఇవ్వాలని కవి నొక్కి వక్కాణించారు.
పెళ్లిసందడి పేరుతో కూకట్ల తిరుపతన్న రాసిన కవిత లో “వివాహానికి ఎందుకు…!తొందర/విద్యాబుద్ధులు నేర్చుకో..!ముందర/తరిగిపోనిది కాలం /తిరిగి రానిది జీవితం”. నిజమే బాల్య వివాహాల వల్ల బలైన జీవితాలు ఎన్నో. వివాహంపై పూర్తిగా అవగాహన లేని వయస్సు. బాధ్యతలు తెలియని ప్రాయం. పెళ్లి చేసుకొని భార్యను ఎలా పోషించాలో తెలియని అయోమయం. ఇక ఆడపిల్లకు అయితే బాల్య వివాహంతో ఆరోగ్య సమస్యలు. చిన్నతనంలో తల్లి కావడం వల్ల చాలా శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి. పుట్టిన పిల్లలకు కూడా అంగ వైకల్యం, అనారోగ్యం. అందుకే పిల్లలకు యుక్త వయస్సు వచ్చి, తన కాళ్ళ మీద తను నిలబడే దాకా పెళ్ళి చేసుకోవద్దు. ముందుగా చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి. విచక్షణాజ్ఞానం, జీవన విలువలు, జీవన నైపుణ్యాలను పెంచుకొవాలి. బాధ్యతలు తెలిసి వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకోవడం మంచిది. ఈ పుస్తకం నుండి మహిళావాద కవితలను మచ్చుకు కొన్నింటిని మాత్రమే ఉటంకించాను. అన్ని కవితలు సామాజిక దృష్టి కోణంలో రాసినవే. సామాజిక రుగ్మతలే కవితా వస్తువులుగ మలుచుకున్నవి. ఈ పొత్తం ద్వారా కొత్త లోకానికి మేలుకొలుపు పాడిన కూకట్ల తిరుపతన్నకు అభినందనలు. ఇలాంటి మానవత్వం పరిమళించే రచనలు మరిన్ని చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
****
రచనలు:పల్లె ముచ్చట్లతో ఇప్పడి వరకు 25వ్యాసాలు,(కరీంనగర్ జిల్లా మాండలికం లో) కవితలు,స్త్రీ వాద వ్యాసాలు, 10 సమీక్షలు. నా వ్యాసాలు అన్ని తెలంగాణ వాణి దినపత్రికలో, మొలక న్యూస్ పేజీ లో ప్రచురితం అయినాయి. నా సమీక్షలు శాతవాహన మాస పత్రికలో,తెలంగాణ వాణి దిన పత్రికలో ప్రచురితం అయినాయి. చలం గారి సాహిత్యం పై రెండు సమీక్షలు రాయడం జరిగింది. పుట్టిన ఊరు.నారాయణపూర్, మం౹౹సుల్తానాబాద్, జి౹౹పెద్దపల్లి.
శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు
ప్రకాశ్ గారికి ధన్యవాదాలు
మేలుకొలుపు”వచన కవిత్వం-మహిళావాద దృక్పథం-ఒక పరిశీలన చేసిన చెల్లెలు బోయిని సరోజ గారికి, అచ్చేసిన నెచ్చెలి సంపాదకులు డా. గీత గారికి ధన్యవాదాలు
మంచి విశ్లేషణ
స్త్రీ వాదం స్త్రీ లే కాదు పురుషు లు రాశారు
అసలు పురుషు లే రా యా లి
మార్పు రావలసింది పురుషుల లోనే
ఇంకా స్త్రీ అణిచి వేయ బడుతున్నది
తిరుపతి గారు మంచి కవిత్వం రాశారు
కూకట్ల తిరుపతి గారి మేలుకొలుపు కవిత్వంపై సమీక్ష సమగ్రంగా ఉంది. సమీక్షకులకు ధన్యవాదాలు