రాగో
భాగం-12
– సాధన
భళ్ళున తెల్లారింది. తూరుపు పొద్దు కరకర పొడుస్తుంది. తొలిపొద్దుకి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆకులు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయి. నాలుగు రోజులుగా ముసురులో తడిసిన చెట్లు తలారబెట్టుకుంటున్నట్లు పిల్ల గాలులకు సుతారంగా తల లాడిస్తున్నాయ్. పొద్దు వెచ్చవెచ్చగా పెరుగుతూంటే ఆ పొడి పొడి వాతావరణంతో ఒళ్ళు పులకరించినట్టుగానే ఉంది. అడవిలోని పిట్టలు కిచకిచమంటున్నాయి. ధీకొండలోని పోలీస్ పటేల్ పుస్లె పావురాలు గూడు నుండి బయటకు ఎగిరి సోలార్ లైటు స్తంభం మీద, బ్యాటరీ పెట్టెమీద సయ్యాటలాడుతున్నాయి.
పుస్లా భార్య జానో ‘గిన్నో, గిన్నో’ అంటూ పందులను తోడుకు. ‘కోర్, కోర్, కోర్’ అంటూ నూకలు, ఉనుక చల్లుతూ కోళ్ళనూ, ‘డుర్ నైయ్యి డుర్ డుర్’ అంటూ అంబలికి కుక్కను ఆప్యాయంగా పిలుచుకుంటుంది.
ఇంటి ముందు పందిట్లో కూచుని పు జంట నెమళ్ళకి నూకలు చల్లుతున్నాడు. పాపిష్టి గార్డు యేడాది కిందట ఎత్తుకపోయిన మరో జంటను తలుచుకున్నపుడల్లా పోలీసు పటేల్ ఒళ్ళు మండుతుంది. అడవిలో దొరికిన నెమలి గుడ్లు తెచ్చి కోడికాడ పొదుగేసి పెంచుకున్న నెమళ్ళను నానా హంగామా చేసి ఆ దుర్మార్గుడు ఎత్తుకపోయిండు. ఈ జంట పెరట్లో ఉండిపోయి వాని కంట్లబడక బతికిపోయింది.
పుస్లా బిడ్డ షాంకో తన లోకంలో తానుగా ‘విట్టో, విట్టు’ అంటూ రామచిలుకకు మాటలు నేర్పుతూ పంజరంలోకి మెతుకులు అందిస్తుంది. బతుకు గూర్చి తెలిసిరాని వయస్సు షాంకోది.
ఆనాడు ఆదివారం పోల్వ (పండుగ) చేయాలని గుర్తొచ్చి ఊరి భూమ్యల్ ఖేతుల్ వద్దనుండి ఊళ్ళోకి బయలుదేరాడు. రాజులూ, రాజ్యాలూ పోయినా తాత తండ్రుల నుండి వస్తున్న భూమ్యని హోదా వేడినీళ్ళకు చన్నీళ్ళలా సన్నోకు ఎంతో ఆసరాగానే ఉంటుంది. ఊరికొక భూమ్యల్ ఉంటాడు. అలాగే పట్టీ అంతటికి వేరుగా మరో భూమ్యల్ ఉంటాడు. పట్టి భూమ్యల్ హోదా పెద్దది. రాజుల కాలంలో ఎక్కడికక్కడ ప్రజలను అదుపు చేయడానికి, పన్నులు వసూలు చేయడానికి తయారు చేసుకున్న యంత్రాంగంలో కీలకపాత్ర వహించారు ఈ భూమ్యలు. డజనుల కొద్దీ గ్రామాలు గల పట్టీలలో నేటికీ వీరి పటాటోపం మాసిపోలేదు. మహా రాజు విశ్వేశ్వర్రావుగారి ధోరణిలో వచ్చే ప్రతి మార్పుకు వీరు ‘ఇంగో” అంటూ తలాడిస్తారు. ఊళ్ళల్లో సంఘాలు ప్రారంభం కావడంతో వీరు గోడమీది పిల్లుల్లా తయారయ్యారు. బరితెగించి దోపిడి చేసే ప్రభుత్వ గార్డులు, జులుం సాగించే పోలీసులు, నిలువుదోపిడి చేసే షాపుకార్లు ఎదిరించి లడాయి చేయాలని అన్నలు ప్రచారం చేస్తే వీరు సై అంటే సై అన్నారు. తీరా పాత రివాజులు, అర్థంలేని ఆచారాలు ఇకపై చెల్లవంటూ యువకులకు మద్దతుగా నిలబడేసరికి తమ పెత్తనానికి ఎసరొచ్చిందని బెంబేలుపడి మళ్ళీ మహారాజు పక్షం అయ్యారు.
‘మాటకెదురు లేకుండా ఆచారాలు అమలు జరగాల్సిందే’, అంటే తమ పిల్లలే వినేట్టులేరు. పద్దతులు మారడానికి వీలులేదని అన్నయనే వాదిద్దామంటే వారి ముందు నోరు పెగల్లు. ఇదీ వారి అవస్థ. తాగినపుడల్లా ఊళ్ళో యువకులకు, పెద్దలకు మధ్య ఇదే లొల్లి. ‘కొత్త కోడెకు కాని తలిగిచ్చినట్టు’ ముసలాళ్ళ ధోరణి యువకులకు రెచ్చగొట్టినట్టుంది. ‘ముడ్డిమీద ముల్లుపడితే ఎగిరి చంగున గెంతులేసే కోడెతీర్ధ’ మీ మాటలు మేం పడేది లేదని సంఘపోల్లు బదులు చెప్పేసరికి వేడుకోల్లు – దేబిరింపులు మొదలవుతాయి. అన్నల ఎదుటికొచ్చేసరికి ఈ సన్నాయి నొక్కులన్నీ బందవుతాయెందు కన్నదే యువకులకు అర్థం గానిది.
పోల్వ గురించి ఆలోచిస్తూ ఊళ్ళో అడుగు పెడుతున్న భూమ్యల్ సన్నోకు ఇవన్నీ తొలుస్తున్నట్టవుతుంది. గోటుల్ వద్దకు చేరిన సన్నోకు అక్కడ దుమ్ములో పడి ఎగురుతున్న కాగితాలు కనపడేసరికి అవి ఏరుకోబుద్ధి అయ్యింది. కంటికి అతి దగ్గరగా పెట్టుకున్నా ఒక్క అక్షరం ముక్క కూడ కనబడ్డం లేదు. చత్వారి వచ్చాక మరీనూ అనుకుంటూ చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకుందామని ఆ కాగితాలు జేబులో కుక్కి బిర బిర నడుస్తూ పటేల్ ఇంటి ముందుకొచ్చాడు.
“పుఫ్లా! ఏయ్ గైతా” (పటేల్) అంటూ కేకలేయసాగాడు.
“ఏం బాటో (బావ). ఏం కొంపమునిగింది. కేకలేస్తున్నావు” అంటూ దీర్ఘం తీస్తూ పటేల్ బదులు పలికాడు.
“ఆఁ! ఏం లేదు. ఇవ్వాల పోల్వ చేయాలిగదా” అంటూ పోల్వ సంగతి గుర్తు చేశాడు.
“ఆఁ! అది నిజమే. కానీ ఏం పోల్వనో బాటో. రావూ లోపలికి. అవుతలుండే మాట్లాడుతున్నావు. ఆదివారం ఆదివారం హమేషా పోల్వ చేస్తున్న మాట నిజమే. కానీ ముసుర్లు కూడ పడక పడక ఈ సందుల్లోనే పడబట్టే. అసలే ఇసుక పర్రెలు. ఉస్కలో ఉచ్చపోసినట్టేనాయె. ఈ భూములల్ల వాన యవారం. నీళ్ళు నిల్చిన పాపాన పోవాయె. బురద లేకుంటే నాట్లు కుదరవు. అందరికీ పనుల సందేనాయె. పై ఆదివారం పోల్వ చేద్దామనుకుంటున్నా” అంటూ మెల్లగా పటేల్ పోల్వ వాయిదా వేయాలన్న విషయం ప్రస్తావించాడు. “వారం వారం ఒకరోజు పోల్వ దినాన సెలవు తీసుకునుడంటే మనమేమన్నా సర్కార్ జీతగాళ్లమా! ఓ వారం తప్పినా వచ్చే నష్టం ఏం లేదు కదా” అంటూ పటేల్ సన్నో ముఖంలోకి చూశాడు.
వారంలో ఏ రోజైనా ఊళ్ళో పోల్వ జరుపుకోవచ్చు. అయితే అది ఊరి పటేల్, భూమ్యల్ చేయాలి. ఇప్ప ఆకుతో డొప్పలు కుట్టి డొప్పకింత నూనె పూసి నాలుగు నూకలేసి తల్లుంగ్ ముత్తి, మారై షేడో (పోచవ్వ తల్లి, మారమ్మ)లకు మొక్కుతరు. అక్కలు తప్ప అన్నలందరూ పోవచ్చు. ఆనాడు పొలంలోనూ, అడవిలోనూ ఎవరూ ఏ పనీ ముట్టుకోరు. ఊరులోని మంచి, చెడు, పంచాయితీలన్నీ చూసుకుంటారు. పనుల ఒత్తిడి ఉంటే వర్షాకాలంలో పోల్వ చేయడంలో కొంత ముందూ వెనుక కావడం ఈ మధ్య మొదలైంది.
పోల్వ జరుపడం మాడియా గోండుల సాంప్రదాయం. పోల్వ వాయిదా వేయాలన్న పటేల్ ఆలోచన గోటుల్ ముందు కూడిన ఊరివాళ్లందరికి చెప్పాలనీ భూమ్యల్ సన్నో, పు ఇంటి గడప దాటాడు. కలుస్తున్న వారందరికి వచ్చేవారం “పోల్వ అన్న కబురు చేరవేస్తూ నడుస్తున్నాడు.
* * *
దళం ఊళ్లో అడుగుపెట్టింది. దారెంట నడుస్తున్న దళానికి కనుచూపు మేర ఊరి పొలాలు కనపడుతున్నాయి. పొలాల మధ్య అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. వంద గడప ఉన్న ధీకొండలో ఆ మాత్రం పొలాలుండటం విశేషం ఏం గాదు.
అయితే భూముల్లో ఎక్కువ పట్టాలు లేనివే. అడవి చట్టాలను లెక్క చేయకుండా కనీస బతుకుదెరువు కోసం అన్నలు వచ్చాక నరుక్కున్నవే ఆ పొలాలు. 1981కి ముందు నరుక్కున్న భూములకే పట్టాలంటూ సర్కార్ ఖానూన్ చేసింది. దానితో ఈ భూములకు పట్టా దొరికే ప్రసక్తే లేదని రైతులందరికి తెలుసు. పట్టా లేకున్నా ‘పంట తీసేటోనికి పట్టాతో ఏంపని, అన్నలొచ్చినాక భూములొచ్చినయి. జంగలోడు వచ్చుడు అడుగుడు కూడ బందయ్యింది. సర్కారుకు అడిగే దమ్ము లేద’నుకుంటూ జనాలు ధైర్యంగా పొలాలు ఖాస్తు చేసుకుంటున్నరు. గతంలో తమకున్న భూములతో ఓ పూట గడవడమే గగనమయ్యేది. ఇపుడు కాలం కలిసొస్తే ఓ పూట తిండి దొరక్కపోదు.
భూములకు నీటి సౌలత్ లేదు. పట్టాభూమి చూపిస్తేనే చెరువులు – కుంటలు మంజూరు చేస్తామని కలెక్టరు తెగచెప్పిపోయాడు. పాత భూములే అంటే, పి.ఓ. ఆర్.లో లేవని, పట్టాలు పుట్టవు. కొత్త భూములకు పట్టాలు దొరకవు. మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు అన్నట్టు ఇరుకనియ్యకుండా, కొరుకనీయకుండా ఉంది సర్కార్ వ్యవహారం అన్నది రైతులందరికి తెలిసిన విషయం.
పొలాలు దాటుతున్న దళానికి మొదట బారే వాళ్ళ ఇండ్లు కలిసినాయ్. ఆ గడపల్లో నిలబడ్డ అమ్మలక్కలు దళాన్ని మొదటి సారే చూస్తున్నట్టు చాటంత కళ్లు చేసుకొని చూస్తున్నారు. “రాం! రాం! బాయి” అంటూ దళంలోని మహిళా కామ్రేడ్స్ పలకరిస్తూంటే అమ్మలక్కల ముఖాలు ముసిముసి నవ్వులో వెలిగిపోతున్నాయి. ఆ ఇళ్ళను దాటి దళం కమ్మరి బూసరి కొలిమి దగ్గరికొచ్చింది. బూసరి నాగళ్లు సవరిస్తున్నాడు. ఇక్ష్వాకుల కాలం నాటి తిత్తిపొయ్యికి బూసరికొడుకు బిచ్చంగ తిత్తి కొడుతున్నాడు. మూరెడు నాగలికి జానెడు కర్రుపెట్టి తరతరాలుగా అదే దున్నుడయితే ఏం పంట వస్తుంది? ‘కండెడు (క్వింటాల్న్నర) అలికితే కండెడు రాలడమే గొప్ప’. మగ పుబ్బల్లో అలుకుల్లో పూర్తయితే మాడియా జనం మహారాజులే. ఎవరో నూటి కొకరు, కోటికొకరు నాటువేయడం, ఎరువులు చల్లడం లెక్కలోది గాదు. నూటికి తొంబై మంది యవుసాయం అంతా ఆ తాతముత్తాతల తీరే. అలకడం మినహా కలుపు తీయడమే తెలియదు. పెరట్లో మక్కజొన్న కలుపుతీయడమే బ్రహ్మ విద్య. నీటి పారకం అసలే సున్న. ఇక ఇలాటి వ్యవసాయంలో పంటలెలా రావాలి? అందుకే అదనంగా ఎంత భూమి నరుక్కున్నా బతుకు గడవడం అంతం మాత్రమే.
కమ్మరి బూసరి కొలిమి దాటి దళం అంగన్వాడి రమాతాయి ఇంటి ముందు నుంచి పోతూంది. అందరి చూపులటు తిరిగాయి. “ఉందా అంగన్వాడిబాయి” అంది. జైని నడుస్తూనే. ఆమె ఉంటే తినడానికి పిండి పంపిస్తుందని అందరి ఊహలోనూ మెదలకపోలేదు. గత రెండేళ్ళుగా ఈ అంగన్వాడీలు ప్రారంభించింది సర్కార్. మహిళలనే ఈ పనికి పెడుతుంది సర్కార్. పిల్లలందరిని ఓపిగ్గా కుప్పవేసి వారికి పిండి పెట్టి, వాళ్ళకు దేశభక్తి గీతాలూ, దైవ ప్రార్థనలూ నేర్పాలి. స్త్రీలయితేనే ఇదంతా ఓపిగ్గా చేస్తారని వాళ్లనే పెడుతున్నారు. పిండి ఎంతో పోషక శక్తిని సమకూరుస్తుందని ప్రభుత్వం పెద్దగా బొంకిస్తుంది. అన్నగాండ్ల పుణ్యమా అనీ ఇవన్నీ తమ వాకిట్లో వాలుతున్నాయని పిండి బుక్కే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఎవరూ చెప్పకుండానే అర్థమైపోయింది.
మరో నాలుగు అడుగులు వేసే సరికి దళానికి రెడ్డిగాండ్ల ముత్తయ్య ఇల్లు ఎదురైంది. అక్కడ కొడిపె వాగయ్య నోటికొచ్చినట్లు తల్లీ ఆలిని మునుం పెట్టి షావుకారిని దీవిస్తున్నాడు. ‘కార్డుమీద ఇచ్చే రెండు కిలోల బియ్యం, అర్థకిలో శర్కర, అర్థకిలో నూనె నెలనెలా ఇవ్వకుంటే నీ మొగుడి సొమ్మనుకున్నావా’ అన్నది మొదలు బూతుల పంచాంగం విప్పేస్తున్నాడు. రెడ్డిగాండ్ల ముత్తయ్య మొగం మీద నెత్తురు చుక్కలేదు. ‘నాటి కాలమైతే ఈపాటికి కొడిపె వాగయ్య వీపు ఏమయ్యేదో గానీ ఇపుడు పాడై ఊళ్ళో సంగాలాయె – అడవిలో అన్నలయిరి’ – ఇది షావుకారి అసలు పీకుడు.
“ఏం వాగు మామ. మళ్ళీ ఎప్పటాటే అయ్యిందా షావుకారి దందా” అంటూ ముందు నడుస్తున్న పైలట్ డుంగ పలకరించాడు. గతంలో ‘ఒకసారి కోటా అంతా దొంగతనంగా అమ్ముకున్నాడని వెయ్యి రూపాయలు దండగవేసి ముక్కు భూమికి మూరెడు రాయించినప్పటికీ వీనికి బుద్ధిరాకపాయె’ అనుకుంటూనే డుంగ సాగిపోతున్నాడు.
గల్ల పెట్టెముందు కూచున్న ముత్తయ్య పబ్బతి పట్టి ఒక దుముకు దునికి నడివీధిలోకి వచ్చి “అన్నలందరికి – అక్కలందరికి శరణార్థి” అంటూ అచ్చు తెలుగులో మొక్కాడు.
“థూ! లంజాకొడుకా” అంటూ నీ మొక్కుడు కూడ పాపమే అన్న ధోరణిలో వాగయ్య దళం వెంట నడిచాడు.
“ఏం నాగయ్య అంతా మంచిదేనా” రుషి ఆప్యాయంగా పలకరించాడు.
“ఇంగో దాదా” అంతే ఆప్యాయంగా వాగయ్య జవాబు.
“ఏం పని చేస్తున్నావు దాదా” – రుషి.
“ఏమున్నది దాదా – ఎద్దా, యవుసాయమా! గరీబు లంజకొడుకును. ఉన్నోళ్ళకు గీ దెవుసంలో చేతినిండా పని. కోరి (కౌలు)కి దున్నాలన్నా లాగోడి (పెట్టుబడి) వెళ్ళదు. సనుగులు లేవాయె. గూలి పైసలో కోటా నూకలు కొందామంటే ఈ షావుకార్లు తేరైరి. మీరుండగా భూమి నరుక్కుందామన్నా ఎడ్లు లేక నరికేం ఫాయిదా దాదా. ఇంకేం చెప్పాలి” అంటూ క్లుప్తంగా తన యాభై ఏళ్ళ అవస్థ ఒక్క గుక్కలో చెప్పాడు.
“నీ అటువంటోళ్ళు ఊళ్ళే ఎందరుంటారు దాదా? భూమి ఎడ్లు లేక కూలి మీద బతికేటోల్లు” అంటూ కమాండర్ వాకబు చేశాడు.
“ఇంటింటికి మట్టిపొయ్యి అన్నట్టు కూలోల్లు లేకుండా ఊరేడ ఉంటదన్నా. ఈడో పదిండ్లున్నయి” అని తేల్చి చెప్పాడు వాగయ్య.
నడుస్తున్న దళానికి నేతగాని (మాల) సోమయ్య లాల్ సలాం అంటూ ఎదురు వచ్చాడు.
“అన్నలు రాక చాలా రోజులవుతుంది. ఈడ నా ఇంటికాడ ఆగి ఛాయ్ తాగి పోవాలంటూ” ఆహ్వానించాడు. –
“దాదా చక్కెర కిలో పదమూడు రూపాయిలుంది. ఇంతమందికి పావుకిలో కావాలి. ఛాయ్ అవుసరం లేదు” అంటూ గాండో వెంటనే అనేశాడు.
గాండో జవాబుతో జైని ‘హమ్మయ్య’ అనుకుంది. కానీ గిరిజ మాత్రం ‘గాండోకు ఎందుకింత తత్తర. బంగారం లాంటి ఛాయ్ ఎందుకు వద్దనాలి’ అని మనస్సులోనే అనుకుంది. సోమయ్య రుషిని మరీ మరీ బలవంతం చేస్తే దళం సోమయ్య ఇంటి ముందు ఆగింది. ఛాయ్ గొడవ అంతగా పట్టించుకోని కర “నేను సెంట్రీ ఉంటాను. తాగిరండి” అంటూ వాలంటరీగా ముంగిట్లో నిల్చిపోగా దళం లోపలికి నడచింది.
జైని అసలైన మాడియా కులంలో పుట్టింది. మాలవాళ్ళ గాలి కూడ సోకి ఎరగదు. అంటు ముట్టు జాస్తి. ఆదివాసీలెవరైనా నేతగాని వారిని ఇళ్ళల్లోకి రానివ్వరు. వాళ్ళ ఇళ్ళల్లోకి వీరు పోరు. వెనుకటివారైతే నీడ సోకనిచ్చేవారు కాదు. ఆదివాసీలు నూతి నీళ్ళు తోడిస్తేనే మాదుగులకు మాలలకు తాగదిక్కు. సంఘం పుట్టి అంటు ముట్టు లేకుండా నియ్యత్ పాటించకుండా పాడు చేస్తున్నదని గ్రామ పూజార్లు, పెద్దల ఏడుపు. గాండో జవాబుతో బతికిపోయాననుకున్న జైని కమాండరే ఆ ఇంట్లోకి నడవడంతో సందిగ్ధంలో పడింది.
గిరిజకి మినహా అక్కలందరికీ విషమ పరీక్షలా ఉంది. తాము ఇంటి వద్ద ఉండి సంఘం పనిచేస్తూ క్యాంపెయిన్లు చేసి ఇంటికొస్తే పసుపు నీళ్ళు చల్లిగానీ లోనికి రానిచ్చేవారు కాదు తమ అయ్య అవ్వలు. కొన్నాళ్ళు దళంలో తిరిగి అనారోగ్యంతో ఇంటికి చేరిన భురిషీబాయిని ఇప్పటికీ వంట దగ్గరికి రానియ్యరైరి. ఆ పాత తరం ఏ తప్పు పడుతుందో అన్న బెంగ అక్కల ముఖాలపై నీడలా పాకింది.
“బారీ ఆమో” (ఏంగాదు) అన్న గాండో మాటతో వారికి కొంత ధైర్యం చిక్కింది. గాండో తమ కులస్తుడే. ఆయనకు లేని కుల తప్పు మాకెందుకు? అని ఎవరికి వారే సమాధానపడ్డారు. ఆ ధైర్యమే ఛాయ్ కప్పు తీసుకోవడానికి ధైర్యం చూపింది.
గోటుల్ నుండి ఇంటి దారి పట్టిన భూమ్యల్ సన్నో అటుగా వస్తూ పల్ కర్ర (పండ్ల పుల్ల) రెండుగా చీరి నాలుక గీరుతున్న రుషి కంటపడ్డాడు.
“ఏక భూమ్య? ఎక్కడి నుండి?” రుషి.
“ఇంటికే దాదా. లాల్ సలాం. ఆదివారం కదా! పోల్వ అనుకున్నం. కానీ పటేల్ ఇవ్వాలటికి దున్నుకుందాం అంటే గోటుల్ కాడి నుండి అందరం లేసి వస్తున్నం” అని వివరణ ఇచ్చాడు.
“దాదా మరి మనం మీటింగ్ పెట్టుకోవాలి గదా! అందరు రావాలి. కబురు ఇవ్వు” అంటూ రుషి బాధ్యత అప్పగించాడు. –
“ఇంకేం పోల్వ అయినట్టే. ఇవాళ పనికి పోవడం కుదరదు. ఎలాగు అన్నలొస్తే వారి వద్దనే కాలం గడుస్తుంది. ఇవాళనే పోల్వ చేస్తే రెండు కలిసి వస్తాయి. పైగా మరో వారం పని వృధాగాకుండా ఉంటుంది” అని తనలో తాను తీర్మానించుకున్న సన్నో గిరుక్కున వెనుతిరిగాడు.
వెనుతిరిగిపోతున్న సన్నోను చూసి కమాండర్ లో తళుక్కున ఒక ఊహ మెరిసింది.
వంగిన మెడలు, నెరుస్తున్న తల, బక్కపల్చటి ఆకారం, ముడుతలు పడ్డ శరీరం, పీక్కుపోయిన కళ్ళు, ముక్కు మీద జారిపడుతున్న అద్దాలు, లోతుకుపోయిన దవడలు, ఉబ్బినరాలు తేలిన పిక్కలు, రొండ్లు లేని పిర్రలు, వెయ్యిమీద బరిబద్ద బొక్కలు లెక్కపెట్టొచ్చు. కట్టెపుల్ల చేతులు అలా యాభై దాటిన సన్నోను చూస్తూ అతనిలో తన రూపం ఊహించుకున్నాడు. కేవలం అద్దాలే మినహాయింపు తప్ప అలాగే కనిపిస్తుందా తన వాలకం అని అనుకున్నాడు. ‘ఇరవయేళ్ళ ప్రాయమందునా అరువై ఏళ్ళ వయసొచ్చెనా’ అని తాను అపుడపుడు పాడే చరణాలు తనకే వర్తించవు కదా అని గతుక్కుమన్నాడు.
ముప్పయో పడిలో పడుతున్నాననే తలంపు ఈ మధ్య తరచు పలకరించి పోతుంది. ప్రజాసేవకు అంకితమయ్యాక ఇక ‘ఆడపొందు ఆశ కూడనా’ అన్నట్టు వైరాగ్యమో, సమాధానమో తెలీని ఒక నీలి నీడ మనసులో అపుడపుడు దోబూచులాడుతుంది. ముసురుతున్న ముసలి ఆలోచనల్ని విదిలించుకుంటూ చాయ మీదికి ధ్యాస మళ్ళించిన రుషికి పెరట్లోని జొన్నపంట మీద దృష్టి పడింది.
సోమయ్య పెరట్లోని మక్కజొన్న ముందే విత్తినట్టుంది. నిరుడు ముసుర్లు అధికమై మక్క పెరళ్ళన్నీ జాలుపట్టి ఎర్రబారి పలుచగా పీకలా పెరిగి బలహీనమైన కంకులేసి విత్తులే పెట్టలేదు. కానీ ఈ యేడు ఇప్పటికే వర్షాలు ఓ మాదిరిగా ఉండటంతో వయసు పిల్లలు ఎదుగుతున్నట్లు కర్రవీపుగా బలంగా పెరుగుతుంది. వరి అలుకుడు, నారేతలు కానివ్వడానికి తొందరపడుతున్నాడు రైతులు. ఎవరో చెప్పాల్సిన అవుసరం లేకుండానే మూడేళ్ళ కరువు రైతుల్ని హుషారు చేస్తుంది. విజ్జ పండుగ (విత్తనాలు అలికే పండుగ) చేయనిదే అసలు భూమిలో విత్తువేయరు ఆదివాసీలు. కానీ, ఈ యేడు ఈ పట్టింపులేవీ చెల్లవనీ ఆ పండుగలు, మొక్కుబళ్ళు ఓపిగ్గా తరువాత చేసుకోవచ్చుననీ తీర్మానించుకున్నారు. ఊళ్ళోకి ఇతర కులస్తులు పోల్వనాడు పొలం పనులకి, అడవి పనులకి పోతే మాడియా పెద్దలు దండుగలేసేవారు. కానీ, ఈవేళ పోల్వలే వాయిదా వేసుకుంటున్నారు. అవుసరాలే అన్ని మార్పుల్ని ముందుకు తోస్తాయి.
ధీ కొండ పెద్ద ఊరు. నూరిళ్ళకు పైగానే ఉంటాయి. ఎప్పుడూ ఓ పంచాయితీ ఉండనే ఉంటుంది. అందులో పంచరంగుల ఊరు (నానా కులాలు) అయితే మరీనూ. ‘ఆదివాసీ కిసాన్ షేక్ మజ్జూర్ సంఘటన’ ఊళ్ళో చురుగ్గా పని చేస్తున్నప్పటి నుండి గతంలో భూమ్యల్, పటేల్ చేసే పంచాయితీలన్నీ సంఘం వైపు మళ్ళాయి.
ఈ పంచాయితీలు, సంఘమూ తప్ప ఇంటి మీద ధ్యాసే లేకుండా పోతుందనీ. మరో పని ఏదీ పట్టించుకోవడం లేదనీ సంఘనాయకుల ఇళ్ళల్లో ఒకే పోరు, పోలీసుల దృష్టిలో పడ్డవారైతే ఇంటిపట్టున ఒక ఘడియ కూడ ఉండరు. అయితే జైలు, లేకుంటే లాకప్పు. ఈ రెండూ కాదంటే వాయిదాలకు (కేసు) ప్రయాణం కట్టడం. ఇవేవీ లేకుండా అదృష్టం కొద్దీ ఏనాడైనా ఇంటిపట్టున ఉంటే ఆ రోజే ఏదో ఓ పంచాయితి తగుల్తుంది. సంఘం పెద్దయ్యాక ఇక ఆలు పిల్లలతో గడపడమే లేకుండా పోయిందని వారు మొత్తుకుంటున్నారు.
* * * * *
(ఇంకా ఉంది)
సాధన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.