“సందేహ జీవనం”
(ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)
– డా॥కొండపల్లి నీహారిణి
కోసుకొస్తున్న చీకట్లు
మోసుకొస్తున్న ఇక్కట్లు
మెలికల నాలుకకు మొలకలు బుట్టిస్తూ
అబద్ధాలే అల్లుకుపోతున్న నేలమీద
కళ్ళూ, కాళ్ళూ ఆన్చిన బతుకయ్యి
శిక్షాస్మృతి పుటలలో మనం అక్షరాలమైపోయినం.
సమయనియమాలు లేని ప్రయాణాలను
గమ్యం చేర్చే పనిలో
కాలాన్ని అధీనం లోకి తెచ్చామనుకునే అపరాధులం.
సత్యాసత్యాల జగత్తు
కల్తీలో జీవితాల్ని బింబమానం చేస్తుంటే
కారణాలను చూడక
ప్రతిఫలనాలనే చూసే ఆక్రమిత జీవులం
చల్లగాలికీ పిల్ల ఏరుకూ
కనిపించని వెతల వంతెనపై
కనిపించే మనకు మనమే
కలుషిత అసువులమవుతున్నవాళ్ళం
పాలనూ వదలరు
గాలినీ వదలరు
ఈ దారుణాలను సమాధి చేసి
రేపటి కాంతుల స్వచ్ఛ జీవనానికి
ఎదురు దారులు వేయలేని నిస్సహాయులం.
చాటుమాటు కలపోతలు
దాటుకు పోవాల్సినవి కాదని
నాడీమండలమంతా వాడి
ఎదతాలూకు కమురు కంపు
నింపుతుంటే,
అసలుసిసలైనది కాకున్నా సరేనని
ఒప్పుకునే పిడివాదులం .
కల్తీని కాలదన్ని మరో కొత్త జీవజాలానికి
ఊపిరి పోయలేని పిరికివారం
తెగిన ఆలోచనలను, తెంపలేని అనుబంధాలను
ఒక్కటి చేయలేనిమని
సుడిగాడ్పుల రెక్కలు తొడిగించుకొని
అన్నీ కల్తీ అని తెలిసినా
కొన్నైనా ఒప్పుకొనే భయస్తులం !
అందరమూ ఎవరికి వారమూ
అమిశ్రిత యథాలాప గమన
సందేహ జీవనులమే !!
****
రోజూ చూసి, సర్దుకుపోవడం అనే అలసత్వం చూపే ఈ వాణిజ్య విపణిలో ఐరనీ ఏంటంటే వినియోగదారుడే! తీరా ఎదురు తిరిగితే ఒరిగేదేమీ ఉండదు. ప్రతి పౌరుని నిట్టూర్పులను మీరు చక్కగా చూపించారు.
కాస్త ఆశో, సమస్యా పరిష్కారమో అన్వేషించే బాధ్యత పాఠకుల మీద నే అని చెప్పే కవిత.