“సమ్మోహనం

– రోహిణి వంజారి

  “సమీ..” 

   ” ఉ ” 

     ” ఈ పచ్చని చెట్లు  ఊగుతూ  పిల్ల తెమ్మెరలను వీస్తుంటే,  తడిపి తడపనట్లు కురిసే ఈ వాన తుంపరలు నేలలోకి ఇంకి వెదజల్లే ఈ  మట్టి సుగంధం, ఈ చల్లటి పరిసరాలు చూస్తుంటే  ఏమనిపిస్తోందో తెలుసా..”

     “ఏమనిపిస్తోంది” మత్తుగా అంది సమీర

    ” నీ వెచ్చని కౌగిలిలో కరిగి పోవాలనిపిస్తోంది”

    ” ఇంకా ” హృదయంలోని అనురాగాన్నంతా  స్వరంలో నింపి మార్దవంగా అంది  

   ” నీ కౌగిలి   తప్ప ఈ ప్రపంచంలో  ఇంకేం వద్దు ” అనిపిస్తుంది అంటూ ఆమెను గాఢంగా  హత్తుకున్నాడు పులకిత్.

     అతని తియ్యని మాటలకు పరవశిస్తూ, అతని   కౌగిలింతతో పులకరించి పోతూ..”పులకిత్” అంది మత్తుగా.

      ఆ క్షణం కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది ఇద్దరికి.. 

     సెల్ ఫోన్ లో మెసేజ్ వచ్చిన చప్పుడైంది.  అంతదాకా కమ్మని ఊహల్లో ఉన్న సమీర  ఉలిక్కి పడి ఊహలనుంచి  వాస్తవంలోకి వచ్చింది.

     కాస్త నీరసంగా ఉన్నా ఇప్పుడు తనని ఉల్లాసపరచేవి పులకిత్ తో తాను కంటున్న కలలే.  నెమ్మదిగా లేచి టేబుల్ మీద ఉన్న సెల్ ఫోన్ అందుకుని చూసింది. తాను ఇంతవరకు ఎదురు చూస్తున్న తన పులకిత్ దగ్గరనుంచే.  ఆత్రంగా  మెసేజ్ ని ఓపెన్ చేసి చూసింది.

      కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లుఅనిపించింది ఆమెకి. అంత వరకు తాను కట్టుకుంటున్న కలల గూడు పెనుగాలికి చెదిరిపోతున్నట్లు  గూడు చెదిరిన పక్షిలా ఆమె మనసు విలవిలలాడింది. ఇప్పుడు తాను ఏం చేయాలి. జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదు. దుఃఖభారంతో కన్నీళ్లు వెచ్చగా సమీర చెంపలను తడుపుతున్నాయి. 

     అంతలోనే మళ్ళీ సెల్ ఫోన్ మ్రోగింది. హాస్పిటల్ నుంచి డాక్టర్ చేసిన ఫోన్ అది. 

    ” హలో..సమీర గారు. మీ హెల్త్ రిపోర్ట్స్ అన్ని పులకిత్   వాట్సాప్ కి  పంపాను. మీకు, మీ మదర్,ఫాదర్ ముగ్గురికి   రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చింది.” అన్నాడు  అతను.

     “ఇప్పుడే తెలిసింది డాక్టర్ ”  అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ  

     ”  నథింగ్ టు వర్రీ.  హాస్పిటల్ లో బెడ్స్ లేవు. మీరు ఫోర్టీన్ డేస్ హౌస్  క్వారంటైన్ లో ఐసొలేషన్ లో ఉంటే చాలు. మెడిసిన్  వేసుకోవాల్సిన కోర్స్ వివరాలు  నేను మీకు వాట్సాప్ లో పంపుతాను. మా హాస్పిటల్ బాయ్ మీ ఇంటికి వచ్చి మెడిసిన్ ఇచ్చివెళతాడు. ఇంకేమైనా సజెషన్స్ కావాలంటే మీరు ఏ టైములో అయినా నాకు కాల్ చేయవచ్చు.  పులకిత్ కి కూడా ఈ విషయం చెప్తాను. తను  మీ గురించి వర్రీ కావద్దని చెప్పండి. ఓకేనా” అంటూ ఫోన్ కట్ చేసాడు డాక్టర్.

      తల పట్టుకుని కూర్చుంది సమీర.  చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీతకు ఇక పెద్దగా విలువ ఉండదు. ఇప్పుడు తన పరిస్థితి అలాగే ఉంది.      

     అయినా తనలో ఆశ చావక, ఒకసారి పులకిత్ తో మాట్లాడాలి  అనుకుని అతని నెంబర్ ని టచ్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది అని సమాధానం వచ్చింది. పిచ్చి పట్టిన దానిలా పది సార్లు డయల్ చేసినా అదే సమాధానం వచ్చింది. 

    ఇప్పుడు ఈ విషయం అమ్మ, నాన్నకు ఎలా చెప్పాలి.  చెప్పాక వాళ్ళు ఏమైపోతారో అని భయం వేసింది సమీరకి. కానీ చెప్పక తప్పని పరిస్థితి. ఫోన్ పక్కన పెట్టేసి కాసేపు బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది సమీర.

      మూడు నెలల క్రితం కరోనా సెకండ్ వేవ్ రాక ముందు తనకి, పులకిత్ కి నిశ్చితార్థం జరిగింది. కరోనా పూర్తిగా తగ్గిపోయింది. ఇక ఏ బెంగ లేకుండా సంతోషంగా పెళ్ళి జరపవచ్చు అనుకుని ఇటు అమ్మ, నాన్న, అటు పులకిత్ పేరెంట్స్ ఎంతగానో సంతోషించారు. ఎలాగూ నిశ్చితార్ధం అయిపోయింది కదా  కరోనా టైంలో పెద్దవాళ్ళు  బయటకు వచ్చి ఇబ్బంది  పడడం ఎందుకని ఇద్దరు కల్సి బట్టలు షాపింగ్ కోసం, నగల కోసం చాల చోట్లకి తిరిగారు. దాదాపు పెళ్ళి పనులన్నీ పూర్తీ అయినాయి.   ఇంకొన్ని రోజుల్లో పెళ్ళి. 

      మనిషి ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది అన్నట్లు ,  నేను ఎక్కడికి పోలేదు అంటూ కరోనా రక్కసి మరోసారి మానవాళిని కబళించడానికి మరింత బలాన్ని పుంజుకుని వచ్చేసింది. ఈసారి రావడంరావడమే పెను ఉప్పెనలా విరుచుకుపడి చాల మంది ప్రాణాలను గాలిలో కలిపేసింది. మళ్ళీ లాక్డౌన్ మొదలైంది.  బయట ఎక్కడ పెద్దగా తిరగలేదు. రెండు రోజుల ముందు పులకిత్ తో కలసి నగల షాప్ కి వెళ్లివచ్చింది సమీర.  తర్వాత రోజు కాస్త ఒంట్లో నలతగా అనిపించింది.      

      అమ్మ, నాన్నకి, తనకి విడవకుండా దగ్గు రావడం, ఊపిరి తీసుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తే తను పులకిత్ కి ఫోన్ చేసిచెప్పింది. పులకిత్ ఫ్రెండ్ డాక్టర్ మోహన్  హాస్పిటల్ కి వెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించుకోమని తను ముఖ్యమైన పనిలో ఉన్నానని అన్నాడు పులకిత్. మొదటిసారి పులకిత్ మీద ఏదో తెలియని అసంతృప్తి కలిగింది తనకు.  కాబోయే భార్య  ఆరోగ్యం బాగాలేదు రమ్మని పిలిస్తే అతను రాకుండా అలా సలహా  ఇచ్చేసరికి తనకు నివ్వెరబోయింది. అమ్మ, నాన్నలను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ మోహన్ ని కలవడం, అతను కోవిడ్ టెస్ట్ చేసి రిజల్ట్ పంపిస్తాను అనడం అంతా ఒక్కరోజులోనే జరిగిపోయింది.        

     పులకిత్ నిర్ణయం తనని దిగ్భ్రాంతిని కలిగించింది.  ఆలోచించేకొద్దీ పిచ్చి పడుతోంది సమీరకి.  ఇప్పుడు తమ ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదు. ముందు అమ్మా, నాన్నకు ధైర్యం చెప్పాలి.. దృఢ నిశ్చయంతో గది తలుపు తీసుకుని హాల్లోకి వచ్చి ” నాన్న ” అంది సమీర

   ” చెప్పు తల్లి రిపోర్ట్స్ అంతా ఒకే కదా. అయినా ఎప్పుడో షాపింగ్ కోసం నువ్వు, పులకిత్ బయటకు వెళ్లారు. అంతే కదా. మనకి పాజిటివ్ ఎందుకు వస్తుంది” అన్నాడు ఆయన నమ్మకంతో కూడిన భరోసాతో.

    “లేదు నాన్న..మన ముగ్గురికి పాజిటివ్ అని  రిపోర్ట్ వచ్చింది. ” అంది సమీర నెమ్మదిగా 

    ” అయ్యో..ఇదేంటి తల్లి. ముందర పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు మనకు కరోనా రావడం ఏంటి. ఈ విషయం పులకిత్ వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారో”   అంటూ సోఫాలో  కూలబడిపోయాడు గుణశేఖర్  నిస్తేజంగా.

       భర్త మాటలకి వంతపాడుతూ దిగాలు పడిపోయింది సమీర తల్లి ప్రభావతమ్మ . 

     ” అమ్మా..నాన్న.. మరీ అంత అధైర్యపడకండి. అంతగా కావాలంటే పులకిత్  పేరెంట్స్ చెప్పి పెళ్ళి కొన్ని రోజులు వాయిదా వేయిద్దాం” అంది సమీర సాలోచనగా వారివంక చూసి.

     “నిశ్చితార్థం అయినాక పెళ్ళి ఆలస్యం కాకూడదు తల్లీ. తర్వాత ఎవరి మనసులు ఎలామారుతాయో చెప్పలేం” అన్నది ప్రభావతమ్మ  కంగారుగా.

     ” అమ్మా.. ఇప్పుడు నా పెళ్ళి కంటే ముఖ్యం మన ఆరోగ్యం. ముందు దానిగురించి ఆలోచించాలి. డాక్టర్ మోహన్  మనకి మెడిసిన్ ఎలా వాడాలి అన్ని వివరాలు రోజు తెలుపుతారు. ఇప్పుడు మంచి ఆహరం, మంచి విశ్రాంతి. ఈ రెండే కావాల్సింది.రిపోర్ట్స్ లో నెగటివ్ వచ్చే వరకు పెళ్ళి మాట ఏత్తకండి. పులకిత్ కి నేను సర్ది చెప్తాను”  అంది సమీర 

     కూతురి నిర్ణయాన్ని అటు అవుననలేక, ఇటు కాదనలేక మిన్నకుండిపోయారు ప్రభావతమ్మ,గుణశేఖర్లు. డాక్టర్ మోహన్ చెప్పిన మందులు  వాడడం, వేడి నీళ్ళతో ఆవిరి పట్టడం,  టైంకి ఆహరం, ఎవరి గదుల్లో వారు విశ్రాంతి తీసుకోవడం ఇదే వారి దిన చర్య ఇప్పుడు.

     పద్నాలుగు రోజులు పద్నాలుగు యుగాల్లా గడిచాయి వారికి. ఓ పక్క సమీర పెళ్ళి రోజు దగ్గర పడుతోంది.  ఇంతవరకు పులకిత్ అమ్మా, నాన్నల దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా తమకి రాలేదు. కరోనా కంటే ఆ దిగులే ఎక్కువైంది వాళ్ళకి.

     ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తానని డాక్టర్ మోహన్ ఫోన్ చేసాడు సమీరకి. ఆ ముందు రోజే  రిపోర్ట్స్ కోసం బ్లడ్ సాంపిల్స్ తీసుకువెళ్లాడు హాస్పిటల్ ల్యాబ్ బాయ్. ” రా..బాబు.. నువ్వు ఈ రోజు ఇంటికి వస్తావని సమీర చెప్పింది. ఇంటి దగ్గర అందరు కులాసానేనా?” డాక్టర్ మోహన్ మీద ప్రశ్నల వర్షం కురిపించాడు గుణశేఖర్ .

     మోహన్ డాక్టర్ గా కంటే చిన్నప్పటినుండి సమీర స్నేహితుడిగా వాళ్ళకి బాగా చనువు అతనితో.

   ” అందరం బాగున్నాం అంకుల్.. ముందుగా  మీకో గుడ్ న్యూస్. మీ ముగ్గురికి  కరోనా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది ” అన్నాడు మోహన్ నవ్వుతూ సమీర వంక చూసి.

     ” అబ్బా..! ఎంత చల్లటి  వార్త చెప్పావు నాయనా.  నిన్నటినుండి  టెన్షన్ భరించలేకపోయాం. కాఫీ తీసుకో బాబు అంటూ గ్లాస్ ని మోహన్ కి అందించింది ప్రభావతమ్మ .

     “జ్వరం తగ్గినా, కాస్త నీరసం ఉంది మోహన్ ఇంకా. అయినా నువ్వు ఎప్పటికప్పుడు మాకు చెప్తున్న ధైర్యమే మమ్మలిని మాములుమనుషులను చేసింది. ఇక ఏ దిగులు పడాల్సిన అవసరం లేదు మాకు. సమీర పెళ్ళి రోజు కూడా దగ్గర పడుతోంది. పులకిత్ వాళ్ళతో మాట్లాడాలి  ఇక ” అన్నాడు సమీరా నాన్న గుణశేఖర్  కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ.

     మోహన్ సమీర వంక చూసాడు. ఆ చూపులో ఎన్నో అర్ధాలు గోచరించాయి సమీర కి.

అంతా నేను చూసుకుంటాను అనే ఆత్మీయత ఏదో అతని కళ్ళలో కనపడింది  సమీర కు.

     ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా ” అంకుల్..! పులకిత్ వాళ్ళు ఈ నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నాము అని చెప్పారు ” అన్నాడు మోహన్ 

     నెత్తిన పిడుగు పడ్డట్లు అదిరిపడ్డాడు ఆయన . ఆ మాట వింటూనే అక్కడే కూలబడిపోయింది ప్రభావతమ్మ . గొంతులో తడారిపోతుండగా 

     ” అ..అదేంటి మోహన్..ఇంకో పది రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఇప్పుడు నిశ్చితార్ధం రద్దు చేసుకోవడం ఏమిటి”   సమ్మెట పోటు పడ్డట్టు విలవిలలాడాడు ఆయన.

     సమీర నిర్లిప్తంగా చూస్తుండిపోయింది.

     ” అంకుల్..   మీకు అందరికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇక ఈ పెళ్ళి చేసుకుంటే తమ జీవితాలకు భరోసా లేదని, అందుకే ఈ పెళ్ళిని రద్దు చేసుకుంటున్నాం అన్నారు పులకిత్ అమ్మా, నాన్న. వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పాడు పులకిత్ ”    కిందకు చూస్తూ అన్నాడు

     కాసేపు మౌనం రాజ్యమేలింది అక్కడ. సన్నగా వెక్కిళ్లు పడుతోంది ప్రభావతమ్మ . 

       “లేదు మోహన్,  నేను వెళ్ళి పులకిత్ అమ్మా, నాన్నల కాళ్ళు అయినా పట్టుకొని బతిమిలాడుతాను. సమీర బతుకు నాశనం చేయవద్దని” కాస్త  ఆవేశం, మరికాస్త ఆవేదన ధ్వనించింది  గుణశేఖర్ గొంతుకలో 

     ” వద్దు నాన్న..  మనల్ని కాదన్నవారిని వెళ్ళి బతిమిలాడవద్దు. వాళ్ళ నిర్ణయము మనకి పాజిటివ్ వచ్చిన రోజే నాకు తెలుసు. కానీ  మొదులే కరోనా ఫీవర్. ఆ సమయంలో ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని కాస్త నెమ్మదించాక చెప్పమని మోహన్ నాకు సలహా ఇచ్చాడు” సమీర బదులిచ్చింది 

    “అదేంటమ్మా..నిశ్చితార్ధం జరిగిన పెళ్ళి ఆగిపోతే మగాడికి నష్టం ఉండదు తల్లి. మళ్ళీ ఆ ఆడపిల్లకి పెళ్ళి కావడం ఎంత కష్టమో తెలుసా నీకు” మాట తడబడుతోంది గుణశేఖర్ కి .

    “అంకుల్, ఆంటీ.. మీరు   పాత కాలపు భావనలకు స్వస్తి పలకండి.   కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించండి.  చిన్నప్పటి నుండి మీరేంటో తెలుసు నాకు, మీతో ఉన్న చనువుతో చెప్తున్నాను 

పులకిత్ చదువుకున్న మూర్కుడు. ఈ రోజు కరోనా అని పెళ్ళి వద్దన్నాడు. రేపు పెళ్ళి అయినాక 

ఏదైనా ప్రమాదం జరిగి సమీరకి ఏ కన్నుకో, కాలుకో  లోపం వస్తే అప్పుడు వదిలేయడని గ్యారెంటీ ఉందా చెప్పండి ”  అన్నాడు మోహన్ అనునయంగా 

     “అవును నాన్న..పెళ్ళికి ముందే వాళ్ళ బుద్ధి మనకు తెలిసింది అని మనం సంతోషించాలి ” సమీర దృడంగా పలికింది

   ” అంకుల్..ఒక్క నిముషం నేను సమీర తో పర్సనల్ గా మాట్లాడతాను ” అన్నాడు మోహన్ 

    అలాగే  బాబు. సమీర దైర్యంగా ఉంటే మాకు అదే పదివేలు ” అన్నాడాయన కాస్త నిమ్మళంగా 

     ” సమీర..ఏంటి అంత మౌనంగా ఉన్నావు. నువ్వు కూడా ఆంటీ, అంకుల్ లాగా పెళ్ళి కాన్సల్  ఆయిందని బాధ పడుతున్నావా ” అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ..

     “లేదు మోహన్. కానీ పులకిత్ ఇలా నమ్మక ద్రోహం చేస్తాడని మాత్రం నేను ఊహించలేదు ” అంది మాట తడబాటుగా .

    ”  కరోనా గురించి ఉన్న భయం వాళ్ళ మైండ్ సెట్ ని అలా మార్చింది సమీర. నీకు తెలుసా..! అసలు కరోనా పాజిటివ్ వచ్చింది అనేదానికంటే, కరోనా తమకి ఎక్కడ వస్తుందో, తాము చనిపోతామేమో అనే భయంతో గుండె ఆగి చనిపోయిన వారిని   నేను  హాస్పిటల్ లో కళ్లారా  చూసాను.  పులకిత్ ని కాన్విస్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ అతను కూడా మూర్ఖంగా ఆలోచిస్తూ పిచ్చి  భయం తో వాళ్ళ పేరెంట్స్ మాటలకు తలవొగ్గుతాడనుకోలేదు సమీరా  ” చెప్తూ  ఆగాడు మోహన్.

    కాసేపు ఇద్దరి మధ్య మౌనం.  మోహన్ మనసులో  మాత్రం  ఎన్నెన్నో మాటలు  ముత్యపు స్వరాల  మూటల్లా  కళ్లనుంచి అనురాగపు  జల్లులు కురుస్తుండగా 

       “సమీరా..నన్ను పెళ్ళి చేసుకుంటావా..? ” హఠాత్తుగా  అడిగాడు మోహన్. 

    నీ మీద జాలితో  నేను ఇలా అడగడం లేదు సమీరా. చిన్నప్పటినుంచి నువ్వు అంటే నాకు ఇష్టం. డాక్టర్ గా కాస్త స్థిరపడినాకా నా ఇష్టాన్ని నీకు చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలోనే నీకు పులకిత్ తో నిశ్చితార్థం జరగడంతో నా ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను” సమీరా కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ అడిగాడు మోహన్.

    ” కానీ మోహన్..మేము పెళ్ళికి ముందే..” ఆమె మాట పూర్తీ కాకముందే ” వద్దు సమీరా..నాకు తెలుసు .నువ్వు ఏమి చెప్పవద్దు.  నేను పులకిత్ లాంటి ఫూలిష్ పర్సన్ ని కాదు. పనికి రాని పిచ్చి సెంటిమెంట్స్ ని పక్కన పెట్టి నీ మనసులో నాకు చోటు ఇస్తావా చెప్పు ” అన్నాడు 

     అతని మాటల్లో, చూపుల్లో  ఏ సమ్మోహనాస్త్రం ఆమె హృదయాన్ని తాకిందో కానీ అతని ప్రతిపాదనని అంగీకార సూచకంగా తల ఊపింది సమీర మనసు సమ్మోహన రాగం ఆలపిస్తుండగా.

****

Please follow and like us:

16 thoughts on “సమ్మోహనం”

  1. కథ చాలా బాగుంది. మంచి సమస్య తీసుకొని రాశావు.పులకిత్ వంటివారి ప్రేమలు చలిమంటలా గప్పున వెలిగి చప్పున చల్లారిపోతాయి.కరోనా నేపధ్యంలో మంచికథ అల్లావు.పులకిత్ ప్రేమకూ మోహన్ అనురాగానికీ హస్తిమశకాంతరం తేడా ఉంది.మంచికథ అందించినందుకు అభినందనలు!💐💐💐

  2. పేరుకు తగినట్లే బాగుంది కథ..చలిమంటలా గప్పున వెలిగి చప్పున చల్లారిపోయిన పులకిత్ ప్రేమకూ మోహన్ ప్రేమకూ హస్తిమశకాంతరం అంత తేడా ఉంది.ఆరోగ్య పరంగా వచ్చిన చిన్న అవాంతరం పెళ్లిని రద్దు చేసుకునేదాకా రావడం వారి నిబద్దతకు నిదర్శనం.. ఈ కరోనా కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో కదా!మంచి కథ అందించినందుకు అభినందనలు రోహిణీ..హృదయపూర్వక అభినందనలు!💐💐💐

  3. కథ చాలాబాగుంది మిత్రమా…ఇలా చాలా చోట్ల ఇలా జరిగి పెళ్ళిళ్ళు ఆగిపోయాయి….చాలా హృద్యంగా ఉంది కథ……

  4. చాలా బాగుంది రోహిణి కథ.. చక్కని సందేశం.

  5. మంచి కథ
    ప్రస్తుత పరిస్థితి కి అద్దం పట్టినట్టుంది

    కరోనా మనుషుల్లో మానవత్వాన్ని కూడా చంపేసింది

    1. It is indeed a very good story. Those who believe in destiny curse for their illluck. But the tables are turned when Mohan expressed Sameera to marry. If one door closes, another door opens the writer brought out in this beautiful story.

  6. చాలా చక్కని కథ. హాయిగా చదివించింది. కరోనా మూలంగా నిజమైన ప్రేమను దక్కించుకుంది సమీర 👌 చాలా బాగా రాసారు రోహిణి గారూ

Leave a Reply

Your email address will not be published.