కొత్త అడుగులు – 22
స్నేహలత ఒక ప్రవాహగానం
– శిలాలోలిత
స్నేహలత ఎం.ఏ. ఆంత్రోపాలజీ, చేసింది. సమాజంపట్ల గొప్ప ఆర్తి ఉన్న వ్యక్తి. ఎవరు బాధపడుతున్నా చలించిపోయే హృదయం. దేనికీ భయపడని ధైర్యం. కులమత భేదాలు పాటించని స్వభావం. స్పష్టమైన రాజకీయ చైతన్యం. మార్క్సిస్ట్, లెనినిస్ట్, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను మనఃస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి.
కృష్ణా జిల్లా గన్నవరం తాలుకా తేలప్రోలులో వైదేహి, లక్ష్మారెడ్డిల ఏకైక పుత్రిక. 1950 జనవరి 29న పుట్టింది. తమ్ముడు రమేష్. స్నేహలత పేరుకు తగ్గట్టుగా స్నేహశీలి. ధన వ్యామోహం, అహంకారం ఆమె దరికి రాని అంశాలు. తన భావాలను, అభిప్రాయాలను ఎంతో స్వేచ్ఛగా ప్రకటించింది.
మెడికల్ కాలేజీలో సీటురాక పోయినా నిరాశ పడక, వైద్య వృత్తిలోనే కాక, ఏ వృత్తిలోనైనా ప్రజల సాన్నిహిత్యం సంపాదించుకొని వాళ్ళని రాజకీయాలకు పరిచయం చేసి, ప్రజల్ని పోరాటోన్ముఖుల్ని చెయ్యొచ్చన్న నిజాన్ని తెలుసుకొని మార్క్సిజమ్ గురించి, పార్టీ కార్యక్రమాల గురించి అధ్యయనం చేస్తూ లోతైన అవగాహనను కార్యశీలతను పెంపొందించుకుంది.
యూనివర్సిటీ చదువుల్లో తోటి విద్యార్థుల ప్రవర్తనల్లో నిజాయితీ, నూతనత్వకాంక్ష లేని వాళ్ళను చూసి చాలా ఆవేదన చెందింది.
తనలోని సాహిత్య పిపాసను కవిత్వాభిమానాన్ని ప్రదర్శిస్తూ కొన్న కవితల్ని రాసింది. కానీ కవిత్వ రచనా ఆమెకు తృప్తి నివ్వలేదు.
‘‘నాకు వ్రాయాలని వుంది.
ఏమని వ్రాయను?
ఎవరని వ్రాయను…
ఎటు చూసినా విషాదం
ఏది విన్నా భయంకరం
ఏది దారి?….’’
అంటూ తన అంతర్గత మథనాన్ని కవిత్వీకరించింది.
తనకు పెళ్ళి సంబంధాలు వస్తూంటే, సంఘంలో పెళ్ళి అనేది వ్యాపారం కింద తయారవడాన్ని చూసి పెళ్ళంటే విరక్తిని పెంచుకుంది. ‘పెళ్ళికోసం నా ఆశయాన్ని అమ్ముకోను’ అని స్థిరంగా ఇంట్లో వాళ్ళతో చెప్పింది.
ఆదర్శవివాహం పేరిట జరుగుతున్న అవకతవకల్ని కూడా ఆమె విమర్శించింది. దండలు మార్చుకోవడం, మంగళసూత్రాలు లేకపోవడమే ఆదర్శం కాదు అంటూ ఓ కవితలో…
‘‘అన్నీ ఉన్న ఆకు అణిగివుండునట్లే ఆచరించేవారు. వీపును కట్టుకు తిరుగును. ఇదే నా ఆదర్శం / ఏదీ ఆదర్శ వివాహం’’ అంటూ సమాజాన్ని సూటిగా ప్రశ్నించింది.
స్నేహలత రాసిన కథ ‘విక్టిమ్స్ ఆఫ్ టైమ్’లో తన అభిప్రాయాల్ని, ఇలా చెబ్తుంది. ‘కన్నతల్లి తన బిడ్డను చెడుగా మారడానికి దోహద పడిన రీతిగా, విద్యార్థుల పతనానికి కారణమవుతున్న ఈ విద్యాలయాలు ఏ జాతికి మార్గదర్శనం.’
‘‘స్త్రీకి వెలకట్టి వెలయాలుగా మార్చిన ఈ సమాజం తనకు తాను వెలకట్టుకుని అమ్ముడు పోతున్న ఈ మగవాడిని ఏమనాలో తెలియక మూగపోయిందా? లేక దానికి మతి పోయిందా? స్త్రీకి పెళ్ళి అవసరమని, అది ప్రకృతి సిద్ధమని వంకర మాటలు చెప్పడం మగవాడు తాను అధికుడిగా ఉండటానికి అర్హత సంపాదించుకోవడానికే కదా!’’ – అని తేల్చేస్తుంది.
ఈ చట్టాలు, న్యాయస్థానాలు అధికారుల చేతుల్లో తొత్తులు… పాతివ్రత్య మహిమను మత్తెక్కించి ఆడదాన్ని మార్చిన ఈ పురాణాలు ఆదర్శాలా లేక అవకాశవాదుల చేతులలో ఆయుధాలా? ఈ నవ నాగరిక సమాజంలో బతుకు తెరువు లేక కాబరే డాన్సర్ కార్చేది కన్నీరు కాదని, రక్తబిందువులేనని, ఆమె బతికేది ఈ సమాజంపై పగతోనని ఏ ఒక్కరైనా గ్రహిస్తున్నారా? ఈ ఆటవిక దశ ఏమిటి? ఈ జీవితాలకు ముగింపేమిటి?
ఇలా అనేకానేక ప్రశ్నలు, సంఘర్షణలు, జవాబులు, విమర్శలు, విసుఫలింగాలు, ఆమె నోట, ఆమె రచనల్లో నిరంతరం ప్రవహించేవి.
బాధితురాలైన స్త్రీల దగ్గరికి వెళ్ళి, అధ్యయన ప్రవృత్తితో గమనించి, వాళ్ళందరినీ తన వాళ్ళుగా భావించేది. వాళ్ళ దుఃఖం తనదనుకుంది. వాళ్ళ ఆవేదన ఆమెను కన్నీటి ప్రవాహం చేసింది. వాటిని, కవితలుగా, కథలుగా మలచడానికి యత్నించింది. కానీ అక్షరాలు ఆమె ఆర్తిని చల్లార్చ లేకపోయాయి. స్నేహలతకు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఆమె ఆవేదన తొలగలేదు. ఈ వ్యవస్థను అర్థం చేసుకుంటే సరిపోదు. దాన్ని మార్చాలి. అని తనకు తానుగా నిర్ణయించుకుంది ప్రతిజ్ఞ చేసుకుంది.
మానవజాతి మీద, మానవత్వం మీద మహోన్నతమైన ప్రేమ ఉన్నప్పుడే ఈ వ్యవస్థలోని లోపాల పట్ల నీచాల పట్ల అసహ్యం, దేవసం కలుగుతాయి. మానవత్వానికి వ్యతిరేకమైన ప్రతిదానితో ఆమె యుద్ధానికి తలపడింది. పోరాడింది. ధైర్యంగా ఎదురొకంది. ఈ వ్యవస్థ దుర్మార్గమైన స్వరూపస్వభావాలు తెల్సినప్పటికీ ఎదురునిలిచింది.
మరో ప్రపంచపు కిటికీలు తెరవాలనే ఆమె ఆవయ సాధనలో – అందరిలా ఆమె కూడా నేలకొరిగింది. నెత్తుటి ముద్దయింది. 25 సం.ల జీవితమే ఆమెకు ముగింపు వాక్యమైంది. శివసాగర్, గద్దర్లు ఆమెపై పాటలు రాశారు.
‘‘ఆమె పట్ల వున్న అపారమైన కరుణతో గద్దర్ –
లాల్ సలామ్!
పంచాది నిర్మలవలె
నీ ఊరే ప్రజాపోరు
నీ రక్త తరంగాల
ఊపిరిలే ఉద్యమాలు
త్యాగాల చాలు బోసి
ధన్యత నొందిన తల్లీ
చెల్లీ ఓ స్నేహలతా
అందుకో లాల్సలామ్!’’
అంటూ గాయపడ్డ హృదయంతో నెత్తుటి నమస్కారం చేశారు.
1975 లో జరిగిన ఎన్ కౌంటర్లో ఒక యువతి కూడా వుందని, ప్రకటించి శవాన్ని బంధువులక్కూడా ఇవ్వకుండా దహన సంస్కారాల్ని చేసింది వెంగళరావు ప్రభుత్వం. ఆ యువతి స్నేహలత. సముద్రమంత విజ్ఞానం, అనంతమైన మానవత్వం, ఆకాశమంత ఆదర్శం, కలగలిసిన స్నేహలత కనిపించని తీరాలకు కదిలి ప్రవాహమై సాగిపోయింది. ఆ ప్రవాహం ఆగినట్లు కన్పించినా, ఆగని నిత్య ప్రవాహం ఆమె.
(‘భూమిక’ – మార్చి, జూన్, 2003)
*****