గతి తప్పిన కాలం
-కూకట్ల తిరుపతి
ఇవ్వాల్టి మనిషంటే?
అట్టి ముచ్చట గాదు
అతన్ది అల్లాటప్పా పని అస్సలు లేదు
బొడ్లె వరాలు మోరీలు ముల్లెకట్టుకొని
రామసక్కని పుట్క పుట్టిండాయే
సుద్దపూసల సుద్దులోడు
గ్యారడీ విద్దెల గమ్మతోడు
పాణసరంగ కొట్లాడి లొంగదీసుకొన్నడో
మచ్చికతోటి మరిగించుకొన్నడో కానీ
పసుపచ్చుల పంచెపాణాలను దొర్కవట్టుకొని
మెస్లకుంట అదుపాగ్గెల వెట్టుకొన్నడు
ఉత్తగ సూత్తిమనంగనే
రెక్కలు కట్టుకొని విమానమైతడు
బొత్తిగ మెరుపు తీగోలె
రాకెట్టై రయ్యన దూసుకుపోతడు
నింగి అంచున నివాసం
కడలి కడుపున సహవాసం
నేల మాళిగన సరస సల్లాపం
ఏగిలేసింది సురువు
ఎన్కాముందు కానేదే లేదు
జెప్పన బశోటి కావటాన్కి
బొచ్చెడు నీలాపనిందెలను మోస్తడు
బుర్రబుర్రొక్కటే ఒర్రె పోకడ పోతడు
సర్రసర్ర ముక్కుసూటిగ ఉరుకుతడు
మూగజీవాలను రామచెరల వెట్టిండనీ
పురాగ బట్టకాల్సి మీదేసుకుంటడు
అంతువట్టని ఆపచ్చెనల జాడల్లేవు
మితిమీరిన తొండేషాల నీడల్లేవు
ఉన్నదల్లా యిరాంలేని తొవ్వల్ల
పుత్తెమంత పుర్సతును దొర్కవట్టుకొనుడే
గివన్ని ఉత్తుత్తగనే
అన్నెం పున్నెం ఎరుగకుంటనే
ఎవల కండ్లల్ల కరిగిపోయేనో కదా!
కన్నతల్లి వంటి మానులు మటుమాయమైనయి
గుండెలు పల్గిన కొండలు కొరిజీవునమిడిసినయి
నడకనేర్పిన నదీనదాలు గొడ్డు బోయినయి
నీళ్లూ పైసా నివాల్నివాలైనయి
పసిడి పిసరోలే ఉస్కెతొప్పెలు పిరమైనయి
సందువోకుంటా మన్నూమిన్ను కబ్జాలైనయి
చిట్కు రోగమచ్చినట్టూ
పురుగూపుట్ర పెట్టన ఎగిరి సచ్చినయి
వనరులు కరగడం… మరగడం…
జీవరాసులు కాలడం… కూలడం…
నక్కను తొక్కచ్చిన మనిషి
నిత్తె మారాజుతనంతో మురువడానికనే
అపవాదుల మీద అపవాదులు మోస్తడు
గిదేం యిచ్చంత్రమో!
ముసుర్ల నట్టనడిమిట్లనేమో
ముదిరిన రోనెండలు యెండుగలారవోత్తయి
ఎండల నెత్తిమీదనైతే
వడగండ్లు యిసిరిసిరి కొడ్తయి
సంకలు లేవనియ్యని సట్టియాళ్ల
అంబట్ల దుడ్డోలె కాలాలు కలెగలుస్తయి
మొకం మీద మొగుతాడు ముచ్చట గొల్ప
ముంగటికే ఉరికే ముక్కాల చెక్కురాలు
పట్టపగ్గాల్లేని పయన సంబురంల
గతి తప్పిన గమనాలైనయి
ఈ కల్తీకాలం పొడుగూత
సొప్పకట్టలు మెలిగిన బండోల్గె
కడగండ్ల మోపుల బర్తే నిండూత
కొని తెచ్చుకొన్న సావోలె
మిటమిట చూసేది చూడంగనే
సట్కన లవాకేసిన బత్కుబండి
గిదేం నడిమంత్రపు సిరో గానీ
అయితే గియితే వరదల వలపోతలు
కాకపోతెనేమో దిక్కుమల్లె కరువుకోరలు
ఆగమాగంగ అమాంతం బూమదులుడో…
త్సునామీ సుడి గుండాలల్ల చిక్కుకొనుడో…
గిదంతా ఎవలు వొరగవెట్టిన పున్నెం
అబ్బబ్బా చెప్ప నోరూ రాదు
ఇన చెవులూ చాలవు
చూడ కండ్లూ సరిపోవు
నువ్వంటే నువ్వని నిందలేసుకుంటరు
ఒగల మొకం ఒగలు జూసుకుంటరు
ఎవ్వలు తవ్వుకొన్న బొందల వాళ్ళే పడ్డట్టు
ఇట్లా జెప్పుకుంటవోతాంటే
ఓటోటిగా ఒడువని కతా కచ్చీరులు
ఆకురాలు కాలంల అగ్గిదునుకుడు
చినుకురాలు కాలంల ఆకురుబ్బుడు
మన్సు కురిసే యాళ్ల తుకతుక ఉడుకపోసుడు
ఎన్నీల ఎలుగులకు మబ్బులు కమ్ముడు
ఆరు ఋతువులు ఆగంబట్టినయి
పెంటకుప్పలోలె పల్లెలు
మురుక్కుంటలోలె పట్నాలు
ఇగ లోకమేమో లొటలొట కొట్టుకొనుడు
దాపురించిన ఇచ్చంత్రాల కాలం
బొత్తిగ దొరగిల వడ్డ బతుకు కచ్చురం
మనిషంటే?
మాదండి మనిషి కదా!
ఏదెక్కడికి పోతేందీ
కూకున్న కాడికే కుప్పలస్తయి
కూసున్న కొమ్మనే నరుక్కున్నడనీ
నిందల మీద నిందలు మోసుడు
****