“వెంట వచ్చునది”
-అనురాధ నాదెళ్ల
మనిషి పుట్టిన క్షణం నుంచి తన ప్రమేయం లేకుండానే సమాజంలో ఒక భాగం అయిపోతాడు. పెరుగుతున్న క్రమంలోనూ, ఆ తరువాత కూడా ఆ సమాజం మంచి చెడులే అతని మంచి చెడులవుతూ వాటి ఫలితాలు అతని జీవితం మీద ప్రతిఫలిస్తూ, అతనికో వ్యక్తిత్వాన్నిస్తాయి. చుట్టూ ఉన్నది సంఘర్షణాత్మక వాతావరణం కావచ్చు, ప్రేమపూర్వకమైన వాతావరణం కావచ్చు, అది మనిషి ఆలోచనల్లోనూ, చేతల్లోనూ కనిపిస్తూ సమాజ రూపురేఖల్ని నిర్ణయిస్తూ ఉంటుంది.
సమాజం మనుషుల సముదాయమైనపుడు ఇక్కడి సమస్యలకు, సంఘర్షణలకూ కారణం కూడా మనిషే. అందరి శ్రేయస్సు కాక ఏ కొందరి ప్రయోజనాలకో పనిచేసే స్వార్థ శక్తులు బలం పుంజుకోవటమే కారణమనుకుంటే ఆ బలం ఎవరి వల్ల వచ్చింది? బలవంతుడే రాజన్నది నిర్ధారణైపోయింది. ఆ బలానికి తలవంచి బ్రతకటమూ అలవాటైపోయింది. అయితే బ్రతకలేని పరిస్థితులు ఎదురవుతుంటే ప్రశ్నించే గొంతులు తప్పని సరి. ప్రకృతి అయినా, సమాజమైనా సమతుల్యం చెదిరిపోతున్నపుడు నిద్రాణంగా ఉన్న శక్తులన్నీ ఏకమై సమతుల్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తాయి.
ఈ ఉపోద్ఘాతమంతా ఈమధ్య నేను చదివిన ‘వెంట వచ్చునది’ కథా సంపుటి గురించి చెప్పేందుకే. రచయిత ఎమ్వీ రామిరెడ్డి గారు.
సమస్యలెదురైనపుడు ప్రతి మనిషి ఆవేదన చెందటం, అసహనానికి గురికావటం, తమలో తామే నిందారోపణల్ని చేసుకోవటం, పరిష్కారం కోసం ప్రయత్నించటం జరుగుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుక్షణం పరిశీలిస్తూ, సమాజానికంతటికీ చెందిన సమస్యల్ని తనవిగా చేసుకుని మథనపడి, వాటికోరూపునిచ్చి, నలుగురి ముందూ ఆవిష్కరించే పని రచయిత చేస్తాడు.
పుస్తకం ముందుమాటలో రచయిత వర్తమాన సమాజంలో ఎదుర్కొంటున్న అనుభవాలు, అశాంతి, దుఃఖం తన చేత ఇవి రాయించాయని చెప్పారు.
ఈ సంపుటిలోని పంతొమ్మిది కథల్లో మూడవ భాగం కంటే ఎక్కువ కథలు భూమిని పోగొట్టుకున్న రైతుల వ్యథని, ఛిద్రమైన జీవితాల్ని, అయోమయంలో పడిన భవిష్యత్తుని చెబుతాయి. ఈ కథల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత పరిణామాలు, ఒక రాజధాని నిర్మాణానికి మూడు పంటలు పండే కొన్ని వేల ఎకరాల భూముల్ని ప్రభుత్వానికి ఇష్టపూర్వకంగానో, బలవంతంగానో ఇవ్వాల్సి వచ్చినప్పుడు అక్కడివారి జీవితాలు అకస్మాత్తుగా ఎదుర్కొన్న సన్నివేశాల్ని, తలక్రిందులవుతున్న జీవితాల్ని, గాడిన పెట్టుకుందుకు ఎలాటి అవకాశమూ మిగలని పరిస్థితుల్ని అత్యంత సహజంగా చూడవచ్చు.
రచయితకున్న గ్రామీణ నేపథ్యం ఈ కథల్నింత బలంగా చెప్పేందుకు సాయపడీ ఉంటుంది. అక్కడి జీవితాన్ని స్వయంగా చూసిన రచయిత తనకు ఆప్రాంతాల పట్ల, ఆమట్టి పట్ల ఉన్న అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా రాసేరు.
ఈ సంపుటికి తలమానకంగా ‘రేపటి బీడు’ కథని చెప్పచ్చు. ఈ కథలోని ముఖ్యపాత్రల బాల్యానుభవాల్ని చదువుతుంటే అవి రచయిత స్వీయానుభవాలే అనిపిస్తుంది. పల్లెజీవితం, మట్టితో పెనవేసుకున్న రైతు జీవితాలు ప్రత్యక్ష్యంగా చూస్తున్నంత సహజంగా చిత్రీకరించారు. కొన్ని పదాలు, ఉదాహరణకి, ‘డొంకదారిలో ‘ఉసీగా’ సైకిల్ తొక్కటం’ వంటి ప్రయోగాలు కొత్తగా, అందంగా ఉన్నాయి. ఈ కథంతా క్రోనలాజికల్ గా చెప్పుకొచ్చారు. 1985 సంవత్సరం మొదలుగా కథ నడుస్తూ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక గ్రామాలను పేరుపేరునా స్పృశిస్తూ 2015 రాజధాని భూసమీకరణ వరకు నడుస్తుంది. భూమిని నమ్ముకుని, తనతో పాటు కుటుంబం జీవితాన్నికూడా దాని చుట్టూ నిర్మించుకున్న అనేకమంది అనుభవించిన, అనుభవిస్తున్న ఆవేదన చదువుతున్నవారితో కన్నీరు పెట్టిస్తుంది. అకస్మాత్తుగా వచ్చిపడిన లక్షలు, కోట్ల డబ్బు అక్కడి వారి జీవితాల్లో ముందు ఎరుగని ఎన్నో వ్యసనాల్ని, వాటినంటి ఉండే దుఃఖాల్ని ఎలా పట్టుకొచ్చిందో చెబుతుంది. కుటుంబాలు కుటుంబాలే సామాజికంగా, నైతికంగా, ఆఖరికి అర్థికంగా ఎలా నష్టపోయాయో చెబుతుంది. ఈ కథ అనేకమంది జీవితాలకి అన్వయించేదిగా ఉండటంతో నాటకంగా మారి అనేక ప్రదర్శనలను ఇస్తోంది.
న్యూస్ పేపర్లలో ఆయా రాజధాని గ్రామాల ప్రజల గురించిన వార్తల్ని వింతగా చెప్పుకోవటం ఇంకా తాజాగా జ్ఞాపకాల్లో ఉంది. కోట్ల కొద్దీ వచ్చిన డబ్బు ఏం చెయ్యాలో తెలియక ఒక తండ్రి, కొడుకు గుర్రాల్ని కొనుక్కుని ఈ ప్రాంతంలో తిరగటం కంటిముందు సజీవంగా ఉంది.
‘త్రిశంకు స్వప్నం’ కథలో గ్రామీణ జీవితం, ఆ సజీవభాష ఎంత అందంగా ఉన్నాయో! అయితే అకస్మాత్తుగా వచ్చిన రాజధాని అంశం, భూముల విలువలు పెరగటం, కోట్లకొద్దీ డబ్బు కళ్ల పడటం, అది అయినవాళ్లమధ్య తీసుకొచ్చిన స్పర్థలు, పచ్చని, చల్లని గ్రామాల్ని మాయంచేసిన వైనం…
కథ ముగింపులో వాక్యాలు మనసుని గాయపరుస్తాయి.
‘ మట్టి… మనుషుల్ని నమిలి ఊస్తున్నట్లుగా ఉంది.
…సేద తీరటానికి చెట్టునీడ ఉంటుందో…లేదో…
కూలితల్లి తెరిచే సత్తు టిపినీలో సద్దన్నం, బీరపచ్చడి ఆనవాళ్లు మిగులుతాయో లేదో…’
ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రజోపయోగ ప్రాజెక్టుల విషయంలో పనులను దొరికించుకున్న కంట్రాక్టర్లు, లంచగొండితనాన్ని అలవాటుగా చేసుకున్న అధికారులు కలిసి ప్రజాధనాన్ని తమ స్వార్థానికి ఎలా వాడుకుంటారో ‘కొండ అద్దమందు’ కథలో చెప్పారు. ప్రజలు మాత్రం తమ శ్రమని, ధనాన్ని, నమ్మకాన్ని తాము పట్టం గట్టిన రాజకీయ నాయకులకిచ్చి బలహీనులుగా వ్యవస్థలో మిగిలిపోవటం కనిపిస్తుంది.
గత మూడు దశాబ్దాలుగా పిల్లల చదువుల పట్ల తల్లిదండ్రులు పెంచిపోషించుకుంటున్న ఆశలు, వాటిని ధనార్జనకి ఎలా వాడుకోవాలో తెలిసిన వ్యాపారులు, వీళ్లందరి ఒత్తిళ్ల మధ్యా నలిగిపోతున్న విద్యార్థులు కనిపిస్తూనే ఉన్నారు. ఈ విషయాన్నిసంపుటిలోని నాలుగు కథల్లో చూస్తాం.
‘ముళ్లూ, పూలూ’ కథలో చదువుకున్న తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, పిల్లల పట్ల వాళ్ల నిరంకుశత్వం… పిల్లల భవిష్యత్తుని, ఇంకొంచెం ముందుకెళ్ళి వాళ్ల జీవితాల్నేబలి తీసుకుంటున్న వైనం కనిపిస్తుంది. నేటి సమాజంలో నిత్యం మనం చూస్తున్న విషయం.
తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోరు? వాళ్లు పెరిగిన క్రమంలో అలాటి ఒత్తిళ్లను ఎదుర్కొన్న వాళ్లు కూడా అదే శిక్షని పిల్లలకి వేస్తున్నారు. పిల్లల జీవితాల్ని నరకప్రాయం చేసి వాళ్లు ఆత్మహత్యలు చేసుకునేలా చేసే హక్కు వారికెక్కడిది? ఇది ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. పిల్లలు అడిగిందల్లా ఇస్తారు కానీ, భవిష్యత్తు నిర్ణయించే చదువు విషయంలో వాళ్ల మనసులు, అభిరుచులు ఎందుకు అర్థం చేసుకోరో నిజంగా ప్రశ్నే. ఈ కథలో నష్టాన్ని కొంతమేరకు నివారించే ప్రయత్నం చెయ్యగలిగినా, నిజ జీవితంలో ఎందరికి ఇలాటి అవకాశం దొరుకుతుంది? అలాటి వీలులేని ఎందరు పిల్లలు తొలి అడుగులోనే జీవితం పట్ల నిరాశా, నిస్పృహల్ని పెంచుకుని తమకు తామే మరణశిక్షను వేసుకుంటున్నారు! కార్పొరేట్ విద్యాసంస్థల తీరు తెన్నులను చదువుతుంటే భయం వేస్తుంది.
ఈ కథలో ప్రసిధ్ధ కవి, రచయిత పాపినేని శివశంకర్ ‘ పెంపకం’ మీద రాసిన కవితా పంక్తుల్ని ఉదహరించారు,
‘పెద్దగా నేర్పిందేమీ లేదు
పలకమీద దయ అనే రెండక్షరాలు రాసి దిద్దించాను
అమ్మ ఆకాంక్షలాగానో నాన్న నమ్మకంలాగానో కాకుండా
మీరు మీకు మల్లేనే జీవించమని కోరాను…’
ఈ వాక్యాల్ని చదివితే పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా పెంచకూడదో అర్థం అవుతుంది. ఎంత ఉదాత్తంగా ఉన్నాయీమాటలు!
మరో చక్కని కథ, ‘దాహ నీగిసిదరప్పా’. ఈ కథ కన్నడం లోకి అనువాదమైంది. ఈ కథలో కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా చేసే పనుల్లో అనవసరంగా చేసే వ్యయాలు, అలాటివి అదుపు చేసి ఆడబ్బుని మరొక మంచిపనికి ఉపయోగించవచ్చన్న ఆలోచన కలిగిన వ్యక్తులు తీసుకొచ్చే మంచి మార్పులు చూడవచ్చు. ఆర్వో ప్లాంట్లను ఏర్పాటుచేసి ప్రారంభోత్సవానికి మంత్రులు దగ్గర్నుంచి వివిఐపిల వరకూ రప్పించే ప్రయత్నాన్ని ఆపి, తద్వారా మిగిల్చిన డబ్బును మరో గ్రామ దాహార్తిని తీర్చేందుకు వాడటం ఈ కథలో చూస్తాం.
ఆఖరుగా, కథా సంపుటికి పేరునిచ్చిన కథ గురించి …
సత్య హరిశ్చంద్ర నాటకంలోని కాటిసీను లో పద్యం తో మొదలవుతుంది,
‘…తల్లిదండ్రులున్, స్నేహితుల్, బంధువుల్…
వెంటరారు తుదిన్!
వెంట వచ్చునది…అదే సత్యము! అదే యశస్సు!’
పక్కనే అవసరంలో ఉన్న మనిషికోసం ఒక్క క్షణం తన పనిని వాయిదా వేసుకునే వ్యవధి ఇచ్చుకోక, తన మనస్సాక్షికి తనే జవాబిచ్చుకోలేకపోయిన ఒక మనిషి తన తప్పు తెలుసుకుని ఆలోచనలో పడటమే ఈ కథ. మరణం తర్వాత తనవెంట భౌతికమైనదేదీ రాదని తెలిసీ, మనిషి ఒక మాయ వెనుకే పరుగెడుతుంటాడు. జీవితాన్నిఒక తాత్త్వికకోణంలో చెప్పిన కథ ఇది.
ఈ సంపుటిలో ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులు, మొబైల్ గేమ్స్ దుష్పరిణామాలు కూడా కొన్ని కథల్లో చెప్పటం జరిగింది.
వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా సేవా రంగంలో పనిచేస్తున్న రచయితకు సమాజం పట్ల ఉన్న ప్రేమ, దాని బాగుకోసం ఏదైనా చెయ్యాలన్న ఆరాటం ఈ కథల్లో స్పష్టంగా, నిజాయితీగా కనిబిస్తాయి. ఆర్ధ్రత నిండిన కథలివి.
కథలన్నీ మనమధ్య జరుగుతున్న వాస్తవ జీవిత సన్నివేశాలే. పుస్తకం ముఖ చిత్రం భావగర్భితంగా ఉంది. ఈ పుస్తకం ప్రచురించినది మువ్వా మెమొరియల్ ట్రస్టు వారు. అక్షర దోషాలు లేవు, హాయిగా చదివిస్తుంది.
****
నా పేరు నాదెళ్ల అనూరాధ, నా గురించి చెప్పాలంటే పుస్తకాలు, పిల్లలు, సంగీతం ఇష్టమైన విషయాలు. పిల్లల మీద ఉన్న ఇష్టం నన్ను ఎమ్మే,బియెడ్ చేయించి టీచర్ని చేసింది. గత ఏడు సంవత్సరాలుగా విజయవాడలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడిన పిల్లలకోసం సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాల్ని నేర్పుతోంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది.