జ్ఞాపకాల సందడి-25

-డి.కామేశ్వరి 

మై  చిల్డ్రన్  అండ్  యువర్  చిల్డ్రన్  ఆర్ ఫైటింగ్  విత్ అవర్  చిల్డ్రన్ –   హాస్యంగా  విదేశీయుల గురించి  అనడం  వింటుంటాం .

ఈ మధ్య టర్కిష్  సీరియల్స్ కి అడిక్ట్  అయిపోయి తెగచూస్తున్నా. సీరియల్స్ బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే తో గ్రిప్పింగా చక్కటి అందమైన మనుషులు లొకేషన్స్  తో కట్టిపడేస్తున్నాయి. అయితే అన్నిటిలో కామన్  పాయింట్  భార్యాభర్తలు  డైవోర్సులు , ఇద్దరికీ పిల్లలు , కొంతమంది తండ్రుల డిమాండ్ తో తండ్రుల దగ్గర వదిలేసేవారు ,కొంతమంది తల్లిదగ్గర  పెరుగుతారు , మళ్లీ  ఆ మొగుడు  పిల్లలు ,ఈ  పిల్లలకి ఒకరిమీద ఒకరికి ద్వేషాలు ,కోపాలు  వారిద్దరిమధ్య తల్లితండ్రులు నలిగిపోవడం , వదిలేసిన తల్లి  తండ్రులమీద పిల్లల ద్వేషం ,తండ్రిగానో తల్లిగానో  అంగీకరించకపోవడం  ,అలా పెరిగిన పిల్లలు రెబెల్  గానో , సైకో  లుగానో , లేదంటే వంటరితనంతో డిప్రెషన్  లో ఉండడం , రకరకాల  సమస్యలతో ఆ  సంసారాలు సుఖంగా , సంతోషంగా లేకపోవడం …బాబోయి  ఆ గందరగోళం  ఏమొగుడి పిల్లాడెవరో, ఏ  తల్లి   పిల్లెవరో , అర్ధం  చేసుకోడానికి టైం పట్టి మనబుర్ర వేడెక్కుతుంది.

అదంతా చూస్తే  మనదేశంలో కుటుంబవ్యవస్థ ఎంత  గొప్పగావుందో అనిపిస్తుంది . భార్యా భర్తల వారిమధ్య ప్రేమాభిమానాలు లేకపోయినా , ఎన్నిగొడవలు  వున్నా , పిల్లలకోసం సర్దుకుని బతుకుతుంటారు . మనదేశంలో పిల్లలు చాల అదృష్టవంతులు . డబ్బున్నా లేకున్నా  ఉన్నంతలో పిల్లలకి అన్నీ  అమర్చి కడుపుకట్టుకు పిల్లలని చదివించి ప్రయోజకులని చేయడమే ధ్యేయంగా  బతుకుతారు .కనీసం తల్లి నాలుగిళ్ళు పనిచేసి పిల్లలని పోషించుకుంటుంది . భర్తతో పడనంతమాత్రాన తన సుఖం తాను చూసుకుని పిల్లలని వదిలి ఇంకోడితో పోదు.

నూటికి తొంభయి తొమ్మిది  సైతం కాపురాలు ఇండియా లో పిల్లలవల్లే నిలుస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. పిల్లలు లేనివారు డైవోర్స్ తీసుకోడం ఇక్కడా జరుగుతుంది ,కానీ పిల్లలుంటే ,కాపురం వదిలిపోయిన తనతో తీసికెడుతుంది స్త్రీ.  వంటరిగా  పిల్లల్ని  పెంచుకునే స్త్రీలున్నారు. ఇక్కడ ఎక్కడయినా ఒకటి రెండుకేసులు అలా జరగొచ్చు. అంతేకాని అక్కడలా అది కామన్ సమస్యకాదు ఇక్కడ .

ఆ సీరియల్స్ చూసాక పోనీ అలా ఇంకో పెళ్లి చేసుకున్నాక ఆ మోజు తీరాక పిల్లల గొడవలతో సతమతమయి కొట్టుకుంటూ ఏం బావుకుంటున్నారనిపించింది .తరువాత ఇంకో గోల ,యూత్ ఫ్రీ సెక్స్ – క్లబ్బులు పబ్బులు తిరుగుతూ మద్యం మత్తులో అమ్మాయిలతో గడపడం onenight  ఆనందం ఎప్పుడో సీరియల్  మధ్యలో  నీ కొడుకంటూ  ఒకర్తి  క్లెయిమ్ చేసి  కాపురం లో దుమారం రేపడం  డిఎన్ఏ టెస్టులు హీరోగారి మతిపోగొట్టడం విడాకులువరకు వెళ్లడం  .

ఇదంతా చూస్తే ,మనపిల్లలు ఇప్పటికయినా  తమకోసం తల్లితండ్రులు స్వార్ధం చూసుకోకుండా ఎంత ప్రాణంగా  కష్టపడి పెంచుతున్నారో ఎన్నేళ్లొచ్చినా కష్టంలో సుఖంలో మేమున్నాం అని భరోసా ఇస్తారో గ్రహించి తల్లితండ్రుల విలువ గుర్తించాలి . మొగాడి చేతులో మోసపోయిన స్త్రీ ఈ నాటికీ బయటపడి నీ బిడ్డ అని ధైర్యంగా చెప్పదు అక్కడలా  బిడ్డనైనా చంపుకుంటుంది ,తనేనా చస్తుంది లేదా దొంగచాటుగా వదిలేస్తుంది. అంటే యువత ఫ్రీ సెక్స్ ఎంత అవస్థలు అవమానాలు కలతలు రేపుతుందో ఏదేశంలోనైనా ఇది ఒక సమస్యగానే తయారవుతుంది అన్నది యువత గుర్తించగలగాలి. మొత్తమ్మీద విదేశాల్లో సయితం మానవ  మనస్తత్వాలు -ప్రేమ ద్వేషం, కోపం ,అసూయా పగ  ,ప్రతీకారాలు  ,మమకారాలు ,డబ్బు పదవి కోసం చేసే ఘోరాలు ,పోలీస్ ,జైళ్లు  ,గొప్పబీదా  తారతమ్యాలు ,వ్యవస్థలు ,స్వభావాలు ,అన్ని ఒకటే అనిపించింది. మన సీరియళ్ళులా వేలకొద్ది  ఎపిసోడ్స్  లాగకుండా  మాక్సిమం నూరు నూటఏభయిలో గ్రిప్పింగా తీస్తారు. అంచేత చూడబుద్ధి  వేస్తున్నాయి. డిటెక్టివ్  మిస్టరీ  టెర్రరిజం  సబ్జెక్టువి ఇంకా గొప్పగా తీస్తున్నారు. ఈ  కరోనా టైం లో ఇవి ఉండబట్టి టైం గడిచిపోతుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.