డా|| కె.గీత కథ “ఇవాక్యుయేషన్”పై సమీక్ష

-వాడ్రేవు వీరలక్ష్మీదేవి

ఇది ప్రత్యేకమైన కథ. తీసుకున్న వస్తువు కాలిఫోర్నియాలోని శాన్ప్రన్సిస్కోలో తీర ప్రాంతపు కాలనీలకు వాటిల్లే పెను విపత్తు గురించి. అది భీకరమైన అగ్నిప్రమాదానికి చెందినది.
కష్టపడి సంపాదించి పొదుపుచేసి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇల్లు కొన్ని గంటల్లో అగ్ని కి గురి కాబోతోంది. ఇవాక్యుయేషన్ హెచ్చరిక వచ్చింది.

ఎవరైనా సరే ఉన్నఫళంగా గంటలో ఇల్లు వదిలిపోవలసి వస్తే వారి మానసిక పరిస్థితి ఏమిటి ఊహించగలమా?!
అనుభవిస్తే తప్ప తెలియదు.
అసలే కరోనా నేపథ్యం లో ఉన్నారు ఆ జంట. ఇంటి నుంచే ఆఫీసు పని. దగ్గర చేయగల హాయి నిచ్చే సమయమే కరువైపోయింది. ఇప్పుడు ఈ ఉత్పాతం వచ్చి పడింది.

కథ లో అతని వేపు నుంచి కాక ఆమె వేపునుంచి రచయిత్రి గీత కథచెప్పుకుంటూ వచ్చారు. చాలా ఉత్కంఠ తో చదివించేలా. అసలు ఆ కొద్ది సేపూ, కొన్ని గంటలూ ఎంత బరువైనవో మాటలోకి తేవడంలోని నెరేషన్ మనచేత కూడా ఆ బరువు మోయిస్తుంది.

గంటలో ఎలాఉన్నవారు అలా ఇల్లు వదిలి బయటకు రావలసిన అనేక సందర్భాలకు ఇది ప్రతినిధి కథలా ఉంది. వరదల ల్లో ప్రభుత్వాల హెచ్చరికల మేరకు ఇల్లు వదిలిన వాళ్లు ఎలా తలకిందులై ఉంటారు??! నిజానికి అంత వరదలకీ జడవక ప్రభుత్వ ఆజ్ఞలు ఉల్లంఘించి ఇళ్లు వదిలి రారు. అప్పుడు ప్రభుత్వోద్యోగులు వాళ్ళని బలవంతంగా ఇళ్లనుంచి లాక్కువస్తారు. అర్ధాంతరంగా ఇళ్లు వదిలి రావడం అంతటి అసాధ్యం.
ఊళ్లలో జరిగే అగ్ని ప్రమాదాల్లో కూడా అంతే.

ఎక్కడో కాలిఫోర్నియాలో మాత్రమే జరిగే అగ్ని విపత్తు అనేక ప్రాంతాల్లో వేరేవేరే విధంగా జరిగే ప్రమాదాలను గుర్తుచేసింది.

ఒక కథ లో ఒక ప్రాంతీయ ఉపద్రవాన్ని, అక్కడి వ్యక్తుల మీద దాని ప్రభావాన్ని కథావస్తువుగా తీసుకుని కథ చెప్తున్నప్పుడు మంచి రచయితలు దాన్ని సార్వజనీనం చెయ్యగలరు.
ఈ కథ చదివినప్పుడు ప్రాంతీయసమస్య ఐనా ఆ స్పృహ తో పాటు ఆ సందర్భానికి అక్కడి వ్యక్తుల ఆందోళన విశ్వజనీనం అనిపించింది. ఎక్కడైనా ఎవరికైనా ఇదే పరిస్థితి కదా అనిపించిది. ఇది ఈ కథ తాలూకు ఒక విశిష్టత.

ఇల్లు అంటే ఎవరికైనా కేవలం ఒక నిర్మాణం కాదు. వస్తువులూ వాటిని పోగుచేసుకోవడం వెనక ఉన్న శ్రమ, శ్రద్ధ, క్రమంగా వాటితో అనుబంధం ఇదంతా ఇల్లే.
ఇంకా మొక్కలు పూలు నీటివనరులు, ఆఖరికి పెరటి పచ్చిక ఇదంతా కూడా ఇంట్లో భాగమే. వీటన్నిటి మధ్య ఏళ్ల తరబడి గడిపిన జీవితపు బలమైన కాలం. ఇదంతా ఒక్కమాటు వదిలి పారిపోవలసిరావడం ఎంతటి పేథటిక్ ఇష్యూ.
ఇది ఇందులో అంతటి విషాదభరితంగానూ చెప్పగలగడం రెండో అంశం.

ఇంకా ఇలాంటి సందర్భాల ప్రభావం స్త్రీలమీద ఎలాఉంటుంది?? పురుషులు ఎలా గడ్డకట్టుకొని పోతారూ. అలాగే స్త్రీలు ఎలా స్పందిస్తూ ఎదుర్కుంటారు? పురుషుల పరిస్థితి ఏమిటి అన్నది మూడో అంశం.ఇది చెప్పీచెప్పకుండా చెప్పిన అంశం.

ఇక నాలుగవది ఈ కతలోంచి తోచే తాత్వికాంశం. ఇల్లు అంటే శరీరం అని కూడా తాత్విక పరిభాషలో వాడవచ్చు. శరీరం వదలవలసివస్తే సహజంగా ఐనా అసహజంగా ఐనా సరే ప్రాణం ఎన్నింటికోసం కొట్టుకుంటుందో కూడా ఈ కథ లోంచి గమనించవచ్చు.

ఇవాక్యుయేషన్ మరణసదృశమే.

కానీ రచయిత ఆశావహదృక్పథంతో ఉండడం నాకు నచ్చుతుంది. ఆపద తొలగి ఎవరింటికి వారు చేరే ముగింపు రచయిత లోని సానుకూలదృష్టి ని చెప్తోంది.

ఈ కథలో ముదింపును అగ్ని నాలుకలతో విజృంభిస్తూ ఆ ఇళ్లను దగ్ధం చేసిందనీ వారు ప్రకృతి కల్పించిన భీభత్సం ముందు నిస్సహాయంగా మిగిలిపోయారనీ కూడా రాయవచ్చు.

కానీ మానవ జీవితానికి మూలాధారం ఆశ.
దాన్ని నిలబెట్టడమే మంచి రచయితల కర్తవ్యంఅని నా నమ్మకం

అలా ఇవాక్యుయేషన్ నాకు నచ్చింది.

*****

ఇవాక్యుయేషన్ (కథ)

-డా|| కె.గీత

సూట్ కేసులోంచి  నా జీవితంలో అతి ముఖ్యమైన రెండు ఫోటోలు తీసి టేబుల్ లాంప్ బల్ల మీద పెట్టేను

అమ్మ ఫోటో, పక్కనే మా ఇద్దరి ఫోటో. హనీమూన్ లో నా భుజం చుట్టూ చెయ్యి వేసి నాకేసే చూస్తున్న శశాంక్ మెరిసే చిలిపి కళ్ల ఫోటో.

శశాంక్ వెల్లకిలా పడుకుని తల మీద చెయ్యి వేసుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నాడు.

వేడి వేడి నీళ్లతో తల స్నానం చేసి వచ్చేసరికి ఒంట్లో ఓపిక అయిపోయినట్లయ్యినా ఎడతెరిపిలేని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మనసు కాస్త తెరిపిన పడ్డట్లయ్యింది

తల తుడుచుకుంటూనువ్వూ వెళ్లరాదూ, కాస్త ఫ్రెష్ గా ఉంటుందిఅన్నాను.

ఇంకా యోగముద్రలో ఉన్నట్టే ఉన్న శశాంక్ ఉలకలేదు, పలకలేదు.

చేత్తో తట్టేను.

అబ్బబ్బ రాగా, నన్ను విసిగించకు. ఒకసారి నీకు చెప్తే అర్థం కాదాగట్టిగా అరిచేడు.

అదేవిటీ అసలెప్పుడు చెప్పేవు?” అన్నాను నేను కూడా మొండిగా.

ఇదే నీతో వచ్చిన ప్రాబ్లం. పంతం. ఇప్పుడేంటి? నువ్వు స్నానానికెళ్తే నేను కూడా వెళ్లాలా? నేను వెళ్లను.” అని అటు తిరిగి ముసుగు పెట్టుకున్నాడు.

వెళ్లకపోతే మానెయ్యి. నీ ఖర్మ….” అనాలని నోటి చివరి వరకూ వచ్చింది కానీ గొడవ పెంచడం ఇష్టం లేక బాల్కనీ లోకి వచ్చి కూచున్నాను.

దుఃఖం తన్నుకు వస్తూంది.

గత ఆరు నెల్లుగా ఇలాగే ఉంది మా ఇద్దరి మధ్యా.

మార్చి నుంచి కరోనా తీవ్రత వల్ల ఆఫీసులు ఇంటి నుంచే పనిచెయ్యమని ఆదేశించాయి.

హమ్మయ్యఇంటి నుంచే పనిచెయ్యడమంటే ఇద్దరం కలిసి రోజూ టిఫిన్  చేయొచ్చు, లంచ్ చేయొచ్చు అనుకుని పొంగిపోయాను నేను.

ఇన్నాళ్లూ ప్రతీ రోజూసాయంత్రం ఎంత త్వరగా అవుతుందాఅని ఒక్కదాన్నీ ఇంత పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమని ఎదురుచూసే బాధ తప్పుతుందని ఎంతో సంతోషపడ్డాను.

అయితే నేనూహించుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నది మరొకటి.

ఇల్లు కొనగానే ఇంట్లో తన ఆఫీసు కోసం ఒక గది సెపరేట్ గా పెట్టుకున్నాడు.

కానీ ఇంటి నుంచి ఒంటరిగా పనిచెయ్యడం ఇష్టం ఉండదని క్రమం తప్పకుండా తను ఆఫీసుకి వెళ్లడం వల్ల గదికి ఇప్పటివరకు మోక్షం రాలేదు.

ఇక ఇప్పుడు ఇంటి నుంచి పనిచెయ్యడం అంటే పొద్దున్న ఆరుగంటలకే ఆఫీసు పనంటూ అలారం పెట్టుకుని లేచినవాడు అర్థరాత్రి వరకూ గదిలోనే గడుపుతాడు.

ఎప్పుడో కడుపులో నకనకలాడినప్పుడుతినడానికేవుంది?” అంటూ వస్తాడు కాస్సేపు కూడా చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకుని ఏదో మీటింగు మధ్యలో వచ్చిగబగబా కానిచ్చి మళ్లీ తన గదిలోకెళ్ళి తలుపేసుకుంటాడు.

రెండ్రోజులకో, మూడ్రోజులకో గుర్తొచ్చినప్పుడు స్నానం.

మాసిన గెడ్డం, భుజాలదాకా పెరిగిన జుట్టుఆర్నెల్లలో సన్యాసిలాగా తయారయ్యేడు.

గ్లాస్ డోర్స్ వెనక పల్చని పరదాలున్నా స్పష్టంగా గదిలోంచి బయటికి, బయటినుంచి గదిలోకి  కనిపిస్తూంది.  

శశాంక్ ఇంకా అలాగే తల మీద చెయ్యి వేసుకుని పడుకుని ఉన్నాడు.

లాప్ టాప్ తెరిచి ఎయిర్ బీ ఎన్ బీ సైటులో దగ్గర్లో అద్దెకి ఏదైనా  ఇల్లుందేమో చూడసాగేను.

ఇల్లు జ్ఞాపకం వస్తేనే మనసంతా నీరయిపోసాగింది.

కాలిఫోర్నియాలోఅందునా  శాన్ ఫ్రాన్ సిస్కో బే ఏరియాలో మా అమ్మలు ఇల్లు  కొనుక్కోవడమంటే మాటలు కాదునాతో ఫోన్లో మాట్లాడుతూ పక్కనున్న వాళ్ళతో అమ్మ పదేపదే గొప్పగా చెప్పడం ఎన్నో సార్లు విని నవ్వుకున్నాను. కానీ లోపల్లోపల గర్వపడ్డాను.

అమ్మ చెప్పినట్టు  శాన్ ఫ్రాన్ సిస్కో  బే ఏరియాలో సముద్రానికి 50 మైళ్ళ దూరంలో కొండల్లో ఉన్న ఊరు ఇది.

శశాంక్  ఆఫీసుకి  దూరమే అయినా ఏరికోరి నచ్చిన  ఇంటికోసం ఇంత దూరానికి వచ్చేం.   

అసలింత దూరంలో కొనుక్కుంటామని అనుకోలేదు.

ఇళ్ల  ఏజెంటుమీ బడ్జెట్టులో బ్రహ్మాండమైన ఇల్లు చూపిస్తాను, రండి.” అని తీసుకొచ్చినపుడు ఇల్లు  చూడగానే మా ఇద్దరికీ బాగా నచ్చేసిందిమేం ఎన్నాళ్ళుగానో  కలలుగన్న ఇల్లు ఇది.

హై రూఫ్ లివింగ్ రూమ్, వంటింట్లో ఐలాండ్, విశాలమైన మాస్టర్ బెడ్ రూమ్, పెద్ద టబ్బు, వాకిన్ క్లాజెట్ఒకటేవిటి, బహుశాః స్థలం కొనుక్కుని కట్టించుకుంటే మా ఇల్లు  ఇలాగే ఉండి ఉండేది. ముఖ్యంగా బాల్కనీ తెరవగానే చెయ్యి చాస్తే అందేటట్టు దట్టమైన గడ్డి కొండ.

గాలి వాటుకి అలల్లాగ  కదిలే సుతారమైన గుత్తులతో  భలే  అందమైన గడ్డి.

ఇంటి చుట్టూ పెద్ద పెరడు. విరగకాసిన నారింజ, నిమ్మ పళ్ళ చెట్లు .

ఇల్లు చూడ్డానికొచ్చినపుడు నారింజ చెట్ల దగ్గిరికి పరుగెత్తి వాటి చుట్టూ మురిపెంగా చూస్తూ తిరుగుతున్న నన్ను ఉద్దేశిస్తూమనం ముందు చూడాల్సింది ఇంటిని. చెట్లని కాదుఅని నవ్వుతున్న  శశాంక్  ముఖం గుర్తుకు వచ్చింది.

ఎప్పుడూ మా మధ్య ఇంత నిశ్శబ్దం లేదు.

  ఆరు నెల్లుగా మేం ఒకరికొకరం కొత్త మనుషులమయిపోయేం.

నిశ్శబ్దం అగాధంలా ప్రవేశించింది మా మధ్య.

నాకు సాధారణంగా రోజల్లా పెరట్లోనే పొద్దుపోతుంది.

ఉయ్యాల పందిట్లో బల్ల ఉయ్యాల మీద దిండేసుకుని పుస్తకాలు చదూకుంటూ శెనగలో, బఠాణీలో తినడమన్నది నా చిన్ననాటి తీరని కోరిక.

ఇప్పుడు ముచ్చటపడి కట్టించుకున్న ఉయ్యాల పందిరి, బల్ల ఉయ్యాల ఉన్నా వెయిట్ వల్లే పిల్లలు కలగడం లేదన్న అనుమానంతో  శెనగలు, బఠాణీలు తినడం మాత్రం కుదరడం లేదు

ఇక మధ్య మధ్యలో ఎప్పుడైనా బోరు కొడితే మొక్కలకి గొప్పతవ్వుతూనో, కాయగూరల మొక్కలకి సంరక్షణ చేస్తూనో, పిచ్చిమొక్క కనబడ్డప్పుడల్లా దండయాత్ర చేస్తూనో, తియ్యని పళ్ళని నా కళ్ళుగప్పి దొంగతనంగా తినడానికి నిశ్శబ్దంగా నా వెనకే వచ్చి, నేను తల తిప్పగానే పరిగెత్తే ఉడతల్ని చూసి నవ్వుకుంటూనో గడిచిపోతుంది.

ఆర్నెల్ల నుంచి శశాంక్ ఇంట్లో ఉండేసరికి తనకెప్పుడు ఏం అవసరమొస్తుందో అని పెరట్లో కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉండడం అలవాటు చేసుకున్నాను.

అలా గార్డెను సంగతి కొంతైనా మరుపున పడడమూ ఒకందుకు మంచిదే అయ్యింది.

ఇప్పుడిలా ఇల్లొదిలి ఎక్కడో ఉండాల్సి వస్తున్నందుకు బెంగ మరీ తీవ్రమయ్యేది.

అయినా దిగులుగా ఉంది.

ఇవాక్యుయేషన్ వార్నింగ్  సెల్ ఫోనులో రావడమేవిటి, ఊర్లో నుంచి సహాయార్థం టీములు వచ్చేయి.

ఉన్న పళంగా ఇల్లు ఒదిలి వెళ్ళిపోమని, అవసరమైనవి ఒకటో రెండో  సూట్ కేసుల్లో సర్దుకుని సరిగ్గా గంటలో ఇవాక్యుయేషన్  చెయ్యమని చెప్పేరు. గంటలోగా ఎమర్జన్సీ సైరన్ వచ్చి వెళ్లాల్సి వస్తే ఎక్కడి వాళ్ళక్కడ పరుగెత్తకుండా వాళ్ళే జాగ్రత్తగా తీసుకెళ్లి వేరేచోట దించుతామని అగ్నిమాపక దళ సహాయక టీము వాళ్లు చెప్పేరు.

నాకు కాళ్లూ చేతులూ ఆడలేదు.

ముఖ్యమైనవంటే ఏం సర్దుకోవాలి? అదీ ఒకటో రెండో  సూట్ కేసుల్లో.

పాసుపోర్టులు, వీసా డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, లాప్టాపులు పెట్టేసరికే ఒకటి సగం నిండిపోయింది.

అసలు ఏం వదిలెయ్యాలి? ఇంట్లో ప్రతివస్తువూ ప్రీతిపాత్రమైందే.

అద్దె ఇంట్లోని పాత ఫర్నిచర్, పాత వస్తువులు సొంత ఇంటి లోపలికి తీసుకురావద్దని శశి నియమం పెట్టినపుడు మా ఇద్దరికీ దాదాపు ఒక పెద్ద యుద్ధమే నడిచింది.

బంగారం లాంటి ఫర్నిచర్ ఏం చేసింది నిన్ను?” అన్నాను.

గొప్ప బంగారమే. అన్నీ క్రైక్స్ లిస్టు లో కొన్న సెకండ్ హాండ్ తుక్కు సామాన్లేగాఅన్నాడు ఈసడింపుగా.

అమెరికా వచ్చిన కొత్తలో తమరి జీతం ఎంతో గుర్తుంచుకుని మాట్లాడండి సార్. ఇదుగో సెకండ్ హాండ్ డైనింగ్ టేబులు, కుర్చీలు, గ్రైండరు…. తుక్కు సామాన్లే ఆదుకున్నాయి.”  అన్నాను ఎక్కడా తగ్గకుండా.

చాలా ఆదుకున్నాయి. కొత్త  గ్రైండరు కొనుక్కోలేనపుడు ఇడ్లీలు తినడం మానెయ్యాలి.” అన్నాడు.

శశి వితండవాదం మొదలు పెడితే దానికి అంతూ పొంతూ  ఉండదని తెలుసు నాకు.

ఎదుటివాళ్లు వాగీ  వాగీ అలిసిపోయి నమస్కారం పెట్టాల్సిందే కానీ ఎక్కడా తగ్గడు.

ఇంట్లో ఉన్న ప్రతీ సామానూ రోజుల తరబడి షాపింగు చేసి, ఎన్నో షాపులు తిరిగి ఏరికోరి కొనుక్కున్నవే.    

గంట….. ఉన్న ఒక్క గంటలో ఏం సర్దుకోవాలి?

మా పెళ్లి ఆల్బం, నా చిన్నప్పటి ఫోటోలు, మేమిద్దరం పెళ్లికి ముందు రాసుకున్న ప్రేమలేఖలు, నా డైరీలుగబగబా మెదడులో పరుగెత్తుతున్న ఇంపార్టెంట్ లిస్టు సర్దసాగేను. గాభరాగా సర్దుతుండే సరికి చెమటలు ధారాపాతంగా కారసాగేయి.

శశి తన ఆఫీసు వస్తువులు, వారానికి సరిపడా డ్రెస్సులు రెండు నిమిషాల్లో సర్దుకుని హాల్లోకి వెళ్ళిపోయేడు.

క్లాజెట్టులోకి వచ్చేసరికి నాకు బుర్ర పనిచెయ్యడం మానేసింది.

పెళ్లి పట్టుచీర దగ్గర్నించి, మొన్న మొన్న కొనుక్కున్న ఫాషనబుల్ ఈవెనింగ్ డిన్నర్ గౌనుతో సహా ఏవని వదిలెయ్యను?

కనీసం ఆరేడు పెద్ద సూట్ కేసుల నిండా సర్దుకోవాల్సినవి ఉన్నాయి.

శశి ఫోన్లో ఎవరితోనో అంటున్నాడు.

ప్లీజ్ గివ్ అజ్ ఫ్యూ మోర్ మినిట్స్, జస్ట్ టెన్ మోర్ మినిట్స్…”

ఇక ఫోన్ పెట్టేడంటే ఎంత గట్టిగా అరుస్తాడో తెలుసు.

గాభరాగా ఎదురుగా కనబడ్డ నాలుగు ప్యాంట్లు, చొక్కాలతో బాటూ పెళ్లి చీర మడతలు నలిగిపోతున్నా చూసుకోకుండా సూట్కేసులో కుక్కేసాను.

ఏం చేస్తున్నావింతసేపు? ఫోన్ ఛార్జర్లు,లాప్ టాప్ ఛార్జర్లంటూ పరిగెత్తకుండా అన్నీ పెట్టుకున్నావా?”  అన్నాడు విసుగ్గా.

ఎంట్రన్సులో ఉన్న అందమైన ఆర్టు పీసుని చేత్తో తడిమి మౌనంగా బయటికి నడిచేను

ఒక్క నిమిషం అని వెనక్కి పరుగెత్తి హాల్లోంచి పెరట్లోకి వెళ్లే గ్లాస్ డోర్ ముయ్యబోతూ ఉయ్యాలకేసి చూసేను.

కొస మీద కూచుని ఉన్న ఉడుత ఒకటి తల తిప్పి భయంగా చూసింది. అది నాకేసే నిస్సహాయంగా చూస్తున్నట్టు అనిపించసాగింది.

బయట భూమి అంతం కాబోతున్నట్టు దట్టంగా దుమ్ము పట్టిన ఆకాశంలో కిరణాలు కోల్పోయి ఎరుపు రంగు రింగులా కనబడుతున్నాడు సూర్యుడు.

వారం రోజుల ముందే దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుకుని వందల ఇళ్ళు తగలబడిపోవడం మొదలు పెట్టేయి.

దట్టమైన పొగ కొన్ని వందల మైళ్ళ వరకు ఆవరించింది. దానితో బాటూ 101డిగ్రీల ఫారన్  హీట్ వేడిమితో హీట్ వేవ్ కాలిఫోర్నియాని చుట్టుముట్టింది. ప్రభావంతో మేమున్న బే ఏరియాలో కొండలున్న ప్రతీ చోటా కార్చిచ్చు రాజుకోవడం మొదలుపెట్టి ఆర్పడానికి వీలు లేనంత వేగంగా చుట్టు పక్కల అన్ని ప్రాంతాలకీ విస్తరించసాగింది.

మాకు 2 మైళ్ల దూరంలో కొండ తగలబడుతుండడం, మా ఇల్లు కూడా రిస్కు జోన్ లో ఉండడం వల్ల ఇవాక్యుయేషన్ ఆర్డర్లు వచ్చేయి.

ఇళ్లు తగలబడుతూండడం టీవీ లో చూస్తేనే భయంతో తల మొద్దుబారిపోసాగింది.

అలాంటిది ఇల్లు రిస్కు జోన్ లో ఉందని కబురు తెలియగానే మెలితిరిగే బాధ కలగసాగింది.

ఇంటికి ఇన్సూరెన్సు ఉందనుకోకానీ…” ఎవరితోనో ఫోన్లో అంటున్న శశి మాటలు వినబడనంతగా చెవులు గళ్ళెతిపోయినట్లు గుయ్యిమని ఏదో శబ్దం వినిపించసాగింది.

అగ్నిమాపక దళ హెలీకాప్టరొకటి ఎగిసిపడ్తున్న మంటల్ని ఆర్పే మందేదో వెదజల్లుతూ కొండ చుట్టూ  జుయ్ జుయ్ మని తిరుగుతోంది.

చుట్టూ మందు తాలూకు పొడి లాంటి పదార్థం గాల్లో గులాబీ రంగులో తేలొస్తూ ఊపిరి సలపనివ్వడం లేదు.

కారు వీథి మలుపు తిరుగుతుండగా మాస్కు ముఖానికి బిగించుకుని లిండా వాళ్ల ఫ్రంట్ లాన్ దగ్గిర ఆపమని చప్పున వాళ్ళ గుమ్మం దగ్గిరికి పరుగెత్తేను. ఉహూ..ఇంట్లో లేదు. ఇంటి చుట్టూ వెతికాను. వాళ్లు అప్పటికే వెళ్లిపోయినట్టున్నారు.

అయ్యో, వాళ్లు ఎక్కడికి వెళ్లేరో తెలిస్తే బావుణ్ణునాలో నేను గొణుక్కుంటున్నట్టు అన్నాను తిరిగి కారెక్కుతూ.

దేశంలో ఎంత స్నేహితులైనా గుమ్మం ఇవతలి వరకే. ఇంత ప్రమాదం వచ్చినా కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయింది చూడు నీ వాకింగు స్నేహితురాలుఅన్నాడు ఎద్దేవా చేస్తున్నట్లు శశి.

మారు మాట్లాడకుండా కారు అద్దాల్లోంచి బయటికి చూడసాగేను.

నిజానికి లిండా వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలిసినా వాళ్ళ కూడా వెళ్లగలిగేటంత స్నేహం లేదు.

ఇద్దరం వాకింగ్ చేస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం కానీ ఒకరింట్లోకి ఒకళ్ళం ఇప్పటివరకూ వెళ్ళింది లేదు.

ఇక మగవాళ్ళిద్దరూ ఎప్పుడన్నా బయట లాన్లలోంచిహలోలు చెప్పుకోవడం మాత్రమే

కొండ మలుపు తిరగగానే మా ఇల్లు దట్టమైన పొగలో కనుమరుగైపోయింది. అల్లిబిల్లిగా అల్లుకున్న పొదరిల్లు లాంటి అందమైన ఇంట్లో ఉండడమే ప్రమాదం అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను.

నా వరకు నాకు ఇల్లంటే వస్తువులు, వాటితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు.

అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారినపుడు వదిలేసిన వస్తువులతో బాటే నా జ్ఞాపకాలన్నీ పోగొట్టుకున్నాను.

ఇప్పుడు ఇల్లే పోగొట్టుకోవాల్సి వస్తుందంటే విపరీతంగా దుఃఖంగా ఉంది.

రెండు చేతులూ జోడించి మనసులోనే కనబడ్డ దేవుళ్ళందరికీ మొక్కసాగేను.

చిన్నప్పుడు పరీక్షలకి వెళ్లేటపుడు అమ్మ వరండాలోని దేవుడి పటానికి దణ్ణం పెట్టమంటే పెడసరంగా తిరిగి చూడని నేనేనా ఇప్పుడిలా

మా ఇంటికి పదిమైళ్ల దూరంలో ఉన్న హోటల్లో ఉన్నాం ప్రస్తుతానికి.

అసలే కరోనా కష్ట కాలం. పుండు మీద కారంలా వైల్డ్ ఫైర్స్ కష్టమొకటి

లిండాకి ఫోన్ చేసేను

నా గొంతులోని బాధే తన కంఠంలోనూ ధ్వనించింది

ఏం చేస్తాం లిండా బాధపడకుఅన్నాను అనునయంగా

బాధే కాదు, నిస్సహాయంగా, చికాగ్గా ఉందిఅంది అవతల్నించి

అవునుఅన్నాను

బదులుగాకాలిఫోర్నియాలో ఏటా వందల వేల  ఎకరాలు ఇలా తగలబడిపోతున్నా ప్రభుత్వాలకి బుద్ధి రావడం లేదు. 2020 సంవత్సరమైతే చెప్పనే అక్కరలేదు. ఒక్క సంవత్సరంలోనే ఇప్పటివరకు మూడు మిలియన్ల ఎకరాలకి పైగా అడవి తగలబడిపోయింది. ఒక్కసారిగా దాదాపు పదిచోట్ల రాజుకున్న వైల్డ్ ఫైర్స్ వల్ల నాలుగువేలకి పైగా  ఇళ్లు దగ్ధమయ్యేయి. ఇలా ఇళ్లు కాలిపోయి నిరాశ్రయులయ్యిన వాళ్లు, మనలాగా ఇళ్లు వదిలేసి పరుగుతీయాల్సి వచ్చిన వాళ్లు వేలమంది ఉన్నారు.” అని 

మళ్లీ తనేఇలా హఠాత్తుగా ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా విరుచుకు పడే కార్చిచ్చుల్ని కూడా అరికట్టే మార్గం వుందీ  అని ఇప్పుడిప్పుడే కనిపెట్టారట.” అంది

మార్గాంతరం ఉందంటావా?” అన్నాను ఆశగా

. ” ప్రిస్క్రైబ్డ్ ఫైర్ “. ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలియకపోయినా ఏదో ప్లానయితే రిలీజ్ చేసేమంటున్నారుఅంది నిట్టూరుస్తూ

ప్రిస్క్రైబ్డ్ ఫైర్అంటే? అన్నాను

అంటే ఇలా ఫైర్ హజార్డ్ ఉన్న అటవీ ప్రాంతాలు, నివాస ప్రాంతాలు మొ. వాటి చుట్టూ పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లతో  లక్ష్మణ రేఖలు గీసినట్టు సరిహద్దులు తవ్వుతారన్నమాట. సరిహద్దులకటువైపు కొంత ప్రాంతం మేర అంటించి గడ్డి లేకుండా నేలని చదునుచేస్తారు. అందువల్ల ఒక చోట వచ్చిన మంట అతి వేగంగా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా, ముఖ్యంగా కొండల మీద గడ్డి భూములు తగలబడ్డప్పుడల్లా చుట్టు పక్కల ఉన్న ఊళ్లు తగలబడకుండా అడ్డుకట్టవెయ్యొచ్చు.” అంది

హమ్మయ్య, మన కాలనీకి అలాంటిది వెంటనే చేస్తే బావుణ్ణుఅన్నాను ఆశావహంగా.  

మన ప్రాంతంలో కూడా మొదలుపెట్టేరని విన్నాను. నిజానికి గాలివాటు అనువుగా ఉండే  వసంతకాలంలో ఇదంతా చెయ్యాలట. సంవత్సరానికి ఇప్పటికిప్పుడు చెయ్యవచ్చు, చెయ్య లేకపోవచ్చు. ఏదయినా అగ్ని మన ఇళ్ల వరకూ రాదని ఆశిద్దాంమీరెలా ఉన్నారో గానీ మాకైతే కంటిమీద కునుకు ఉండడంలేదు. అగ్నిమాపకదళం మన కాలనీ త్రోవని మూసేసినా మా జార్జి ఇంటి దిక్కుగా దొంగతనంగా వెళ్లి ఇంటి చుట్టూ లాన్ ని, గోడల్ని నీటితో తడిపి వస్తున్నాడు. అస్తమాటూ అదే కలవరిస్తూ పిచ్చి పట్టినవాడిలా తిరుగుతున్నాడు.” అంది మరింత బాధగా

నేను అర్థం చేసుకోగలను లిండా, నీకభ్యంతరం లేకపోతే మీరు హోటల్లో ఉన్నారో తెలుసుకోవచ్చా?” అన్నాను దుఃఖం ముంచుకొస్తుండగా.

హోటళ్ళకి రోజుకి వందల కొద్దీ డాలర్లు పొయ్యడం ఎందుకని ఎయిర్ బీ ఎన్ బీ లో ఇల్లొకటి  అద్దెకి తీసుకున్నాం. అయినా మనసంతా ఇంటి మీదే ఉందనుకో.” అంది లిండా

ఇంకా ఇవాక్యుయేషన్ ఆర్డరు కొనసాగుతూ ఉండడంతో నేనూ ఎయిర్ బీ ఎన్ బీ లో ఏదైనా ఇల్లు కాస్త చవగ్గా దొరుకుతుందేమో అని చూడ్డం మొదలు పెట్టేను.

శశితోఇలా వచ్చి చూస్తావా?” అన్నాను  కాస్త సహనం తెచ్చుకుని.

ఎప్పుడు లేచేడో లాప్ టాపు ముందేసుకుని సీరియస్ గా ఆఫీసు పని చేసుకోసాగేడు.

పరమ విసుగ్గా నా చేతిలోని లాప్ టాపు మంచమ్మీద గిరాటేసినేను రేపట్నుంచి ఎక్కడ ఉండాలా అని గాభరా పడుతూ ఉంటే నీకు ఇంత దీక్షగా ఆఫీసు పని ఎలా చేసుకోవాలనిపిస్తూ ఉంది?” అని అరిచేను ఒక చేత్తో తన  లాప్ టాపుని వెనక నుంచి దభీమని మూస్తూ.

సేవ్ చెయ్యలేదుఒక పక్క అరుస్తున్న శశిని పట్టించుకోకుండా.

చిందులు తొక్కుతూ లేచి గ్లాస్ డోర్ గట్టిగా చప్పుడు చేస్తూ తీసి, దభామని విరిగేటట్లు వేసి వెళ్లి బాల్కనీలో బయటికి చూస్తూ కూచున్నాడు.

మంచమ్మీద అడ్డంగా పడుకుని గట్టిగా ఏడుస్తున్న నన్ను పట్టించుకోకుండా తనక్కడే కూచుని ఉన్నాడు.

నాకింకా పంతం పెరగసాగింది. తనొచ్చి మాట్లాడితేనే పలకాలని మొండిగా అలాగే బోర్లా పడుకుని ఉండిపోయేను

ఎంత సేపు అలా ఉండిపోయానో తెలీదు.

ఏడ్చి ఏడ్చి కందిపోయిన బుగ్గల్ని తడుముకుంటూ లేచి కింద పడ్డ తన ఆఫీసు లాప్ టాపుని తీసేను. అంతలోనే కాస్త మెత్తబడి, పాపం ఏం పనిలో ఉన్నాడో ఏమో. సేవ్ చెయ్యనివ్వకుండా మూసేసేను. నన్ను నేను తిట్టుకుంటూ లాగ్ ఇన్ చేసేను. బ్రౌజర్ లో ఎదురుగా ఎయిర్ బీ ఎన్ బీ సైటు కనబడింది.

వెంటే ఇవేక్యుయేషన్ ఆర్డర్ ఎత్తివేస్తున్నట్టు వచ్చిన మెసేజీ నోటిఫికేషను కనబడింది నా ఫోనులో.  

ఒక్క ఉదుటున  బాల్కనీలో కి వచ్చి ఇంకా అలాగే కూచుని ఉన్న శశి వెనక్కి వెళ్లి నిలబడి తల మీద  చెయ్యి వేసి నిమురుతూసారీఅన్నాను.

చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తూ నా నడుం చుట్టుకున్నాడు.

*****

 (ఆంధ్రజ్యోతి ఆదివారం జూలై 4, 2021 ప్రచురణ)

 

  

 

 

 

 

  

Please follow and like us:

4 thoughts on “డా||కె.గీత కథ “ఇవాక్యుయేషన్”పై సమీక్ష”

  1. Sudden ga illu vadileyyamane alochne vanuku testhundi. AA situation face chesavalla manobhavalu baaga chepparu Nenu first time chadivaa ilanti theme Well written. I know Geetha garu is a good writer I read her serial in koumudi

  2. ఈమధ్యనే వీరలక్ష్మీ దేవిగారి కథలు కొన్ని చదివేను. మంచి శైలి. మీవ్యాఖ్యలో కథాకథనం చక్కగా వివరించేరు కనక నేను అంతకన్నా చెప్పేదేమీ లేదు. వీరలక్ష్మీదేవిగారు తెలుగుమీద మంచి అధికారం కలవారు. ఇంగ్లీషుపదాలు ఇంకొంచెం తగ్గించి ఉంటే బాగుండు అనుకున్నాను. ఇది నాఅభిప్రాయం మాత్రమేలెండి. చాలామందికి అభ్యంతరం ఉండదు. 🙂

Leave a Reply

Your email address will not be published.