నారి సారించిన నవల-24
రంగనాయకమ్మ-1
-కాత్యాయనీ విద్మహే
1950 లలో తెలుగు నవలా సాహిత్య రంగంలోకి ప్రవేశించిన రంగనాయకమ్మ 1980 వరకు ఉధృతంగా నవలలు వ్రాస్తూనే ఉన్నది. ఆ తరువాత గడచిన ఈ నలభై ఏళ్లలోనూ అప్పుడప్పుడు ఆమె నవలలు వ్రాయటం చూస్తాం. ఆమె కేవలం నవలా రచయిత మాత్రమే కాదు. కథలు అనేకం వ్రాసింది. కాపిటల్ వంటి మార్కిస్టు సిద్ధాంత గ్రంధాలు తెలుగువాళ్ళకు పరిచయం చేసిన మేధావి. సామాజిక సాహిత్య విషయాలపై నిశితమైన పరిశీలనతో వ్రాసిన వ్యాసాల సంగతి చెప్పనక్కరలేదు. నిక్కచ్చితనం , సూటితనం, తిరుగులేని , రాజీ లేని వాదనాపద్ధతి ఆమె వ్యాసరచన లో విశేషం. ఆమె వ్రాసిన రామాయణ విషవృక్షం అందుకు నిదర్శనం. అంతేకాదు. స్పార్టకస్, స్వేఛ్ఛా పథం (హోవార్డ్ ఫాస్ట్), టామ్ మామ ఇల్లు ( అంకుల్ టామ్స్ కేబిన్ ) నవలలను తెలుగువాళ్ళకు పరిచయం చేసింది.
రంగనాయకమ్మ 1939 లో సెప్టెంబర్ 21 న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా బొమ్మిడి లో పుట్టింది. ఉండటం తాడేపల్లి గూడెం . తండ్రి ‘పద్మనాయక పత్రిక’ నడుపుతుండేవాడు. ఏడుగురు తోబుట్టువుల మధ్య పుస్తకాలూ , సంగీతం ఆమె బాల్యాన్ని ఆవరించాయి. గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు తెచ్చుకొని చదువుకొనటం చిన్నతనానే అలవాటైంది. తండ్రి ప్రోత్సాహంతో పద్మనాయక పత్రికకు రాజుల రాజకుమార్తెల కథలు వ్రాసివ్వటం, ఆమెలో సృజనాత్మక శక్తుల వికసనానికి పాదులు తీసింది.( గమనం ఇంటర్వూ , మానవ సమాజం , నిన్నా- నేడూ- రేపూ 2008 నవంబర్ ముద్రణ) 1955 లో హైస్కూల్ చదువు పూర్తి అయింది. చదవటం ,ఏదో ఒకటి వ్రాసి పత్రికలకు పంపటం ఆ పదహారేళ్ళ వయసులో అభ్యాసంగా మారింది. దద్దనాల రంగనాయకమ్మ పేరుతో ఆమె తొలి కథ ‘పార్వతమ్మ’ 1958 లో తెలుగు స్వతంత్ర పత్రికలో ప్రచురించబడింది.
అదే సంవత్సరం ‘పల్లెటూరు’ అనే నవల వ్రాసింది. ఆంధ్రప్రభ వారపత్రిక కు ప్రచురణార్ధం పంపిన ఆ నవలను చదివిన విశ్వం ఆ నవలలోని నిరాడంబరతకు , సహజత్వానికి , పరిశీలనా పాటవానికి ముగ్ధుడై ఒక మంచి నవలా రచయిత గరిడీలోకి దిగిందని భావించాడు. ( కళ ఎందుకు 1967, డిసెంబర్ ముద్రణ, ఆముఖం ) మలి నవల కృష్ణవేణి 1959 లో వ్రాసింది. 1960 ఫిబ్రవరి నుండి ఏడాది పాటు అది ఆంధ్రప్రభ లో సీరియల్ గా వచ్చింది. అప్పటికి పెళ్లి వల్ల ఇంటిపేరు ముప్పాళ్ల అయింది. ముప్పాళ రంగనాయకమ్మగా ఆవిడ తెలుగు నవలా ప్రపంచంలో అరవయ్యవ దశకాన్ని తనదిగా చేసుకొన్నది. ఆండాళ్ళమ్మ (1961) , నాడైరీలో ఒక పేజీ ( 1963) కూలినగోడలు (1964) నవలలు వరుసగా వచ్చాయి. 1965 లో పేకమేడలు, స్త్రీ, చదువుకున్న కమల రచయిత్రి, బలిపీఠం నవలలు వచ్చాయి.1966లో ఇదేనా న్యాయం , 1967 లో స్వీట్ హోమ్ , కళ ఎందుకు? 1969 లో అంధకారంలో నవలలు వచ్చాయి. ఆ రకంగా యాభయ్యవ దశకం చివరలో రెండు నవలలతో ప్రారంభించి అరవయ్యవ దశకం లో రంగనాయకమ్మ వ్రాసిన నవలలు పన్నెండు. డెబ్భయ్యవ దశకపు నవలలు రెండు. అవి ఒకటి చుట్టాలు, రెండవది జానకివిముక్తి . 1990 వ దశకం లో ప్రేమకన్నా మధురమైనది వస్తే 2011లో కళ్ళు తెరిచిన సీత నవల వచ్చింది. 70వ దశకం లో ఆమె తనకు బాధాకరమైన వివాహబంధం నుండి విముక్తమైనప్పటి నుండి ఆమె నవలలు , రచనలు అన్నీ రంగనాయకమ్మ అన్న పేరుతో మాత్రమే ప్రచురించబడుతున్నాయి.
రంగనాయకమ్మ నవలలు విస్తృత జనాదరణ పొందాయి. ఒక్కొక్కటి అనేకమార్లు ప్రచురించబడింది. అయితే 1970 లలో మార్క్సిజం ప్రభావంలోకి వచ్చి , ప్రజాసాహితి పత్రికను పెట్టి సంపాదకత్వ బాధ్యతలు వహిస్తూ , జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యలో భాగమై పనిచేసిన క్రమంలో రంగనాయకమ్మ ‘విమర్శ – ఆత్మ విమర్శ’ అన్న భావనను బాగా పట్టుకొన్నది. సాహిత్య సామాజిక రాజకీయ విమర్శ ఆమె రచనా వ్యాసంగం లో భాగమైంది. తాను అప్పటివరకు వ్రాసిన సాహిత్యాన్ని ఈ కొత్త అవగాహన నుండి తానే విమర్శించుకొనటం మొదలు పెట్టింది. ఏ పుస్తకం మళ్ళీ ముద్రిస్తున్నా కొత్తముందుమాటలు వ్రాస్తూ వచ్చింది.వస్తువును , పాత్రలను, సంభాషణలను వ్యక్తిత్వాలను నిశితంగా పరిశీలిస్తూ అభివృద్ధి నిరోధకమైన వాటిని నిష్కర్షగా ఖండిస్తూ వ్రాసిన ఈ కొత్త ముందుమాటలు ఇంతవరకూ ఏ రచయితా చెయ్యని ప్రయోగం.
నవలా వస్తువులోనూ, రచయిత్రిదృక్పథంలోనూ వచ్చిన పరిణామాల దృష్ట్యా రంగనాయ కమ్మ నవలలను అయిదు భాగాలుగా వర్గీకరించి పరిశీలించవచ్చు. ఆమె నవలలు ప్రధానంగా గుర్తింపు దశకంగా ప్రసిద్ధమైన అరవైయ్యవదశకానికి చెందినవి. అవి పద్దెనిమిది(18) కాగా అందులో పన్నెండు(12) ఆ దశకం లో వచ్చినవే కావటం గమనించవచ్చు. 1947 స్వాతంత్య్రం తరువాత అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానహక్కులు , అవకాశాలు వాస్తవాను భవం కాకపోవటం వల్ల, స్త్రీల ప్రధాన పని క్షేత్రంగా చెప్పబడే కుటుంబం లో స్వతంత్ర వ్యక్తిత్వానికి అవకాశం కనబడక పోవటం వల్ల స్త్రీలు అసంతృప్తులకు లోనయ్యారు. అంతః సంఘర్షణకు గురయ్యారు. ఆందోళన పడ్డారు. ఈ పరిస్థితులలో రచనారంగంలోకి ప్రవేశించిన స్త్రీలకు కుటుంబం పై విమర్శ ఏదో ఒక స్థాయిలో సాహిత్య వస్తువు కావటం జరిగింది.
ఆ నేపధ్యం నుండి చూసినప్పుడు రంగనాయకమ్మ నవలలో అది మరీ ప్రధానాంశం కావటం కనిపిస్తుంది. 20 ఏళ్ల వయసులో జరిగిన పెళ్లి వల్ల రంగనాయకమ్మ కుటుంబ జీవితం దుఖభూయిష్టం అయింది. ఆ దుఃఖంలోంచి పుట్టిన సాహిత్యం అనివార్యంగా కుటుంబ వ్యవస్థ మీద విమర్శగా పదునెక్కింది. రంగ నాయకమ్మనవలల్లో కుటుంబం మూడు దశలలో ప్రతిఫలించింది. కుటుంబంలోని అధికార స్వభావాన్ని గుర్తించి అది ఎన్ని రూపాలలో ఎన్ని స్థాయిలలో వ్యక్తం అవుతున్నదో చూపించి ఒక విమర్శనాత్మక దృక్పథాన్ని అభివృద్ధిచేసిన దశ ఒకటి. పల్లెటూరు నుండి అంధకారంలో వరకు వచ్చిన పద్నాలుగు నవలలు ఈ దశకు చెందినవి. వ్యక్తిగత సంస్కార చైతన్యాలతో కుటుంబ అధికార సంబంధాలను స్నేహ సహజీవన సంబంధాలుగా మార్చుకొనటాన్ని కలగన్న దశ రెండవది. స్వీట్ హోమ్ నవల ఈ దశకు సంబంధించింది, మార్క్సిస్టు దృక్పథంతో కుటుంబాన్ని ప్రజాస్వామికీకరించుకొనటం గురించిన ప్రయత్నాలకు సంబంధించినది మూడవ దశ. చుట్టాలు నవలతో మొదలు పెట్టి జానకి విముక్తి తదితర నవలలు ఈ దశకు సంబంధించినవి.
1958 నుండి 1964, 1965, 1966 నుండి 1969, 1971నుండి 1980, 1995 నుండి 2011 అని కాల ప్రాతిపదిక మీద ఆయా కాలాలలో వచ్చిన రంగనాయకమ్మ నవలలను పరిశీలిస్తూనే ఆయా కాలాల నవలల్లో కుటుంబం గురించి రచయిత్రి వ్యక్తం చేసిన దృక్పథం ఏమిటో ప్రత్యేకంగా నిగ్గు తేల్చవచ్చు.
1
రంగనాయకమ్మ తొలి నవలలు సంభాషణా ప్రధానంగా సన్నివేశాలను దృశ్యాలుగా బొమ్మ కట్టించే కథనంతో ఉన్నాయి. పల్లెటూరు నవలలో కథలో చాల సరళమైనది. బస్తీ కాలేజీలో చదువుకొంటున్న ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ప్రేమ ఈ నవలకు వస్తువు . పెళ్లి కి ముందే అతను ఆమెను తమ పల్లెటూరు చూడటానికి తీసుకురావటం, పది రోజులు అక్కడ వాళ్ళు గడిపిన తీరు నవలకు ఇతివృత్తం. ప్రేమించిన యువతిని పెళ్ళికి ముందే ఇంటికి తీసుకొచ్చే యువకుడి తెగువ, అందుకు ఇష్టపడి వచ్చిన యువతి చొరవ , కూతురు అలా ఆ యువకుడి వెంట వెళ్లి వాళ్ళింట్లో వారం ఉండటానికి అంగీకరించిన తల్లిదండ్రుల ధైర్యం ,ఆహ్వానించిన యువకుడి కుటుంబ సంస్కారం అన్నీ 1958 నాటికి చాలా కొత్తవి. కానీ నవలలో ఏ పాత్రా ఈ విషయమై ఎక్కడా ఆశ్చర్యం కానీ , ఆక్షేపణకానీ వ్యక్తం చేసినట్లు కనబడదు. అది అత్యంత సహజమైన విషయం అన్నట్లుగా భావించే సంస్కారాలు అందరిలో పరిణితి చెందిన ఒక వాతావరణాన్ని నిర్మించి కథ నడిపింది రంగనాయకమ్మ.
డబ్బుండి ఖర్చు పెట్టి చదివించుకోగల స్తోమత ఉండీ ఆడపిల్లల చదువుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పెద్దల వైఖరి ప్రస్తావన ఉంది ఈ నవలలో. ఊళ్ళోనే స్కూళ్ళు , కాలేజీలు ఉంటేనే వాళ్ళకు చదువుకొనే అవకాశాలు ఉండటాన్ని కూడా ఇందిర గుర్తించింది. పుట్టినప్పటి నుండే మేనకోడలికి మేనమామకు , మేనత్త మేనమామ పిల్లలకు భార్యాభర్తల వరుస కలిపి పెళ్ళిళ్ళను నిర్ణయించే సంప్రదాయం లోని గతానుగతకత్వాన్ని నిరాకరించటం ఈ నవల ఇతివృత్తంలో ముఖ్యాంశం. యుక్తవయస్కులై స్నేహ సహవాసాల నుండి ఏర్పడిన ఆకర్షణ , అనురాగం ప్రాతిపదికగా జరగవలసిన ఆధునిక వివాహాల గురించిన ఒక సహజ సుందర దృశ్య పరికల్పన పల్లెటూరు నవల ప్రత్యేకత.
రెండవ నవల కృష్ణవేణి 1961 లో పుస్తక రూపంలో వచ్చింది. కృష్ణవేణి చదువుకొంటున్న యువతి. ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న యువకుడు మాధవ్ . వాళ్ళ మధ్య ఏర్పడిన ఆకర్షణ ప్రేమగా పరిణమించింది. యువకుడికి అంతకుముందే జరిగిన పెళ్లి, కాపురానికి రాని భార్య సమస్యగా తేలి వాళ్ళ పెళ్లి సందిగ్ధంలో పడింది. ఆమె అతనితో సంబంధాన్ని వదిలేసుకొని తల్లి తండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నది. అయినా సర్దుకుపోలేక తన అశాంతి ని మాధవ్ కు వ్రాసుకొన్నది. దానికి జవాబుగా అతను వ్రాసిన ఉత్తరం భర్త శ్యామ సుందర్ కంటపడి కృష్ణవేణిని తిరస్కరించి వెళ్ళటం, కల్లోలానికి గురి అయిన కృష్ణవేణి తన సమస్యను అతనికి వివరంగా వ్రాయటం చివరకు ఆమె సంసారం కుదురుకొనటం కృష్ణవేణి నవలలో కథ. ఇందులో కథనం ప్రధానంగా కృష్ణవేణి మాధవ్ , కృష్ణవేణి శ్యామసుందర్ వ్రాసుకొన్న ఉత్తరాలతో సాగుతుంది.
ఈ నవల 7వ ముద్రణకు (1975) రంగనాయకమ్మ కొత్త ముందుమాట వ్రాసింది. ‘కృష్ణవేణికి మాధవ్ కు పరిచయం , ప్రేమగా మారటం , ఇద్దరూ ఒక సమస్యలో చిక్కుకొని ఆందోళన పడుతూ కాలం గడపటం చివరకి సామాజికమైన కట్టుబాట్లకు తలవంచటం’ అనే కథ అసహజం కాదుగానీ , కథ నడిచిన తీరు అసహజంగా ఉందని ఆమె భావించింది. శారీరకమైన అందచందాల మీద ఆధారపడి ప్రేమ పెరగటం , బస్సులో చూసుకొనటం పార్కులలో కలవటం వరకు పోవటం, ఆడవాళ్ళ గురించిన అవమానకరమైన అభివ్యక్తులు, అశాస్త్రీయ అంశాలు ఈ నవల ఇతివృత్తంలో భాగమయ్యాయని వ్యతిరేకించింది. ప్రేమ కథను స్పష్టమైన ఉద్దేశం, నిర్దిష్టమైన గమ్యం , అవసరమైన హెచ్చరిక లేకుండా వ్రాయటం రచయితగా తన దోషమని చెప్పింది. ఆ కారణంగానే తరువాత ఈ నవలను మళ్ళీ ముద్రించలేదు. అవసరం లేదని కూడా తేల్చేసింది. ఆ నాటి మాటను ఉపసంహరించుకొని 35 ఏళ్ల తరువాత 2010 లో తిరిగి ముద్రించింది. ప్రేమను ఉత్తమ స్థానంలో నిలబెట్టక పోవటం , ప్రేమ సంబంధం గెలవకపోయినా వ్యవస్థలో సుఖంగా, సంతోషంగా ఉండవచ్చు అని సంకేతాలియ్యటం ఈ నవలలోని దోషాలనీ చెప్పటమే కాక కృష్ణవేణి ఎలా అలోచించి ఏమి చేస్తే బాగుండేదో తద్వారా నవలకు ఒక కొత్త ముగింపును ఎలా ఇయ్యవచ్చో ఈ ముద్రణలో వివరంగా చర్చించింది.
అయితే మనుషులు ఎలా ఉంటె బాగుంటుందో ఊహించవచ్చు కానీ మనం ఊహించిన ప్రకారమే మనుషుల చిత్తవృత్తులు ప్రవర్తిస్తుంటాయా ? వాటిని నియంత్రించే జ్ఞాన చైతన్యాలు, పరిస్థితులు, సందేహాలు, మానసిక ఒత్తిడులు మొదలైన వాటి మాట ఏమిటి అన్న ప్రశ్న కలగక మానదు. కృష్ణవేణి కాకపోతే మరొక స్త్రీ ..
ఈ నవలలో ప్రధానంగా కనబడే కుటుంబం కృష్ణవేణిది. అదెక్కడా సమస్యాత్మకం కాదు. తల్లితండ్రి , అన్న వదినా, తాను సభ్యులుగా ఉన్న ఆ కుటుంబంలో అన్న కులాంతర వివాహం చేసుకొన్నాడు.తల్లీ తండ్రీ మొదట్లో వ్యతిరేకించినా తరువాత సర్దుకుపోయారు. అందరూ కలిసే ఉంటున్నారు. అత్తా కోడళ్ల మధ్య , వదినా ఆడబడచులమధ్య స్నేహానురాగ పూర్వకమైన సంబం ధాలే ఉన్నాయి. అందువల్ల ఈ నవలలో సమస్య కుటుంబం కాదు. ప్రేమ, దానిని నిర్వహించు కొనటంలో యువతీ యువకులు పడే గందరగోళం ఈ నవలలో సమస్య.
సమస్య అంతా కృష్ణవేణిదే. మాధవ్ కి మగవాడిగా ఈ సమాజంలో కొన్ని ప్రత్యేక అవకాశాలు ఉన్నాయి. తనకు పెళ్లయి భార్య ఉన్నా – ఆమె తనతో సఖ్యంగా లేకపోవటం , తన దగ్గరకే రాకపోవటం అవి వేరే విషయాలు – కృష్ణవేణితో తన పరిచయం గురించి , ప్రేమ గురించి ఇంట్లో చెప్పగలడు. చెప్పాడు. కృష్ణవేణి వంటి ఆడపిల్లలమీద వాళ్లకు తెలియకుండానే వాళ్ళ మీద పెత్తనం చేసే సంఘబలం ఉన్నది. నిజానికి ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా మాధవ్ ఇంటికి వచ్చినప్పుడు , ఫోన్లు చేసినప్పుడు అతను తనకు కాలేజీలో లెక్చరర్ అని చెప్పిందే కానీ స్నేహితుడని చెప్పలేకపోయింది. ప్రేమ పెళ్లి చేసుకొన్న అన్నకు గానీ , చనువుగా ఉండే వదినకు గానీ, వీళ్లిద్దరి సంబంధాన్ని ఆమోదించి హాయిగా ఉన్న తల్లిదండ్రులకు కానీ తన ప్రేమ విషయం చెప్పాలనే అనుకోలేదు. అందుకు కారణం ఏమై ఉంటుంది. ఆడపిల్లలు తమ ప్రేమలు, ఆసక్తులు చెప్పటం మీద ఉన్న అప్రకటిత నిషేధమే పరోక్షంగా స్త్రీల బుద్ధిని శాసిస్తుండమే అందుకు కారణమై ఉంటుంది. అందువల్లనే ప్రేమ తరచు రహస్య విషయం అయిపోతుంటుంది. కృష్ణవేణి మాధవ్ పట్ల తన ఇష్టాన్ని ఇంట్లో చెప్పకుండానే ఒక ఉత్తరం వ్రాసి పెట్టి వెళ్లిపోవాలనుకొనటం వెనుక పనిచేసిన సంస్కృతి అదే కావాలి.
మాధవ్ పట్ల తనకు ఎంత ప్రేమ ఉన్నా , అతను పెళ్లయినవాడని తెలిసి ముందు బాధపడ్డా, భార్య ప్రేమ దొరకనివాడని , ఆ ప్రేమ తానే అందించగలనని అతనితో గుళ్ళోపెళ్లికి సిద్ధపడ్డ కృష్ణవేణిని – భార్య నుండి విడాకులు తీసుకోని మాధవ్ తో పెళ్లి ఆమెకు చట్టబద్ధతను , సామాజిక గౌరవాన్ని కల్పించదని స్నేహితులు రేణు శాంత హెచ్చరించారు. ఇక్కడ మళ్ళీ కృష్ణవేణికే సమస్య . చట్టబద్ధత లేకపోయినా వెళ్లి అతనితో జీవించటమా ? తరువాత వచ్చే పరిణామాలను ఎదుర్కొనటానికి సిద్ధపడటమా ? లేక స్నేహితులు చెప్పినట్లు మాధవ్ విడాకులు తీసుకొనేవరకు చదువుకొంటూ పెళ్లిని వాయిదా వెయ్యటమా ? ఈ సదసత్ సంశయంలో పెద్దలు కుదిర్చిన పెళ్ళికి సిద్ధపడింది ఆమె. ఈ మొత్తం లో కృష్ణవేణిది ఒంటరి ఆరాటమే అని గుర్తించాలి. ప్రేమ ఒక ఉద్వేగపూర్వకమైన అనుభవం. ఆ ఒత్తిడిలో సమస్యను అన్ని వైపుల నుండి ఆలోచించగల జ్ఞాన చైతన్యాలు , వివేకం అరుదైన విషయాలు. అందువల్లనే చరిత్ర పొడుగునా ప్రేమ కథలలో స్త్రీల తొందరపాట్లు , తప్పటడుగులే కనిపిస్తాయి. ఆ విషయాల వైపు దృష్టి మరల్చి స్త్రీలను ఆలోచింపచేయటానికి వీలైన కథను ఎంచుకొని, -యుద్ధాన్ని మధ్యలోనే వదిలేసి – సాంప్రదాయ వివాహాలతో , సంబంధాలతో సంతృప్తి పడినవాళ్లుగా కృష్ణవేణి, మాధవ్ ల వ్యక్తిత్వాన్నినిరూపిస్తూ నవలను ముగించింది రంగనాయకమ్మ. అదే ఇప్పటికీ ఆమెను వేధించే సమస్య.
ఆండాళమ్మ గారు నవలలో కుటుంబం పద్మావతి పార్ధసారధులది. ఏడాది రెండేళ్ల కొడుకుకు తల్లిదండ్రులు. భర్త ఉద్యోగం , భార్య ఇంటిపని , పిల్లవాడి పని తో పాటు భర్తకు సేవలు చేస్తుంటుంది. .అవి అనురాగంతో చేస్తున్నది కనుక తన మీద భర్త పెత్తనానికి మారు రూపంగా ఆమెకు అనిపించలేదు. అలా చేయించుకొనటం తన ఆధిక్యత, హక్కు అని అతనూ అనుకున్నట్లు కనిపించదు. వ్యవస్థ అలవాటు చేసిన పద్ధతిలో వ్యక్తిగత సంస్కారాలతో సాగుతున్న వాళ్ళ సంసారం ఈ నవల వచ్చిన నాటికి మంచి దాంపత్యం కిందనే లెక్క. పద్మావతి మీద భర్త ప్రత్యక్ష ఆధిపత్యం లేదు. అధికారం చేయటానికి అవకాశం ఉన్న అత్తా ఆడబడుచు ఆమెకు లేరు. అందువల్ల అధికార సంబంధాల కుటుంబం అనేది సమస్య కానేకాదు ఈ నవలలో.
అయితే కుటుంబంలో అధికారం సాధారణంగా మగవాడిదే అయినా ఆడవాళ్లు అధికారాలు చెలాయించే సందర్భాలు లేకపోలేదు. ఒక మగవాడి తల్లిగా వచ్చిన ఆధిక్య స్థాయి స్త్రీకి కోడళ్ళమీద అధికారాన్ని ఇస్తుంది. మగవాడికి తోడబుట్టినవాళ్లుగా ఆడపిల్లలకు వచ్చిన ఆధిక్య స్థాయి ఆడబడుచులుగా ఒదిన లేదా మరదలిపై పెత్తనానికి ఉపయోగపడుతుంటుంది. అంతవరకూ తనకంటూ ఆదాయం , ఆస్తి నిర్వహణ అవకాశం లేని స్త్రీలకు ఏ కారణం వల్లనైనా ఆస్తి పెత్తనం సమకూడినప్పుడు వాళ్ళ పరిమిత అవగాహనలు, అపరిమిత దురవగాహనలు కలిసి స్త్రీలను అధికారం నెరిపే అహంకారులుగా మారుస్తాయి. అది ఆస్తిగల వితంతువులలో , భర్తృ పరిత్యక్తలలో తరచు వ్యక్తమవుతూ ఉంటుంది. ఆస్తి వల్ల , కొత్తగా వచ్చిన ఆర్ధిక పెత్తనం వలన తబ్బిబ్బుపడుతూ ఏ మాత్రం అవగాహన లేని ఆర్ధిక లావాదేవీల నిర్వహణ లో వాళ్ళు సుఖాన్ని , సంతోషాన్ని , శాంతిని పోగొట్టుకొంటున్నామన్న స్పృహ కూడా లేకుండా కన్న పిల్లలతో, బంధువులతో, చుట్టుపక్కలవారితో సరైన సంబంధాలు నెరపలేక ఒంటరి వాళ్ళు అవుతుంటారు. కొంతవరకు ఈ సమస్యను కొడవటిగంటి కుటుంబరావు అంతరాత్మ , కొత్త జీవితం వంటి కథలు చర్చించాయి. ఆ క్రమంలో రంగనాయకమ్మ వ్రాసిన ‘ఆండాళమ్మ గారు’ నవల పరిశీలించదగినది.
ఆండాళమ్మగారు పార్థసారధి కి వరుసకు పెద్దమ్మ. ఆమె వస్తానని వ్రాసిన ఉత్తరం గురించి మాట్లాడుకొంటూ సారధి ‘ఆమెకు ఒక కొడుకు పెళ్లి అయి భార్య ఇంకా కాపురానికి రాకముందే చనిపోయాడు. కొడుకుపోయిన దిగులుతో , భార్యతో కూడా సరిపడక ఒక రాత్రి భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇదంతా ముప్పై ఏళ్ల నాటి మాట ‘ అని ఆండాళమ్మ ను పరిచయం చేస్తాడు. అంటే ముప్ఫయ్ ఏళ్లుగా ఆమె ఒంటరి స్త్రీ . ఈ ముప్పై ఏళ్లలో కొంతకాలం తనతో ఉండటానికి వచ్చిన వితంతు కోడలీని సాధించటం , ఆమెతో ఆస్తి పంచుకొనటం సరిపోయింది. కోడలు ఆస్తి తీసుకొని తనదారిన తాను వెళ్ళాక ఆమె జీవితం ఏమిటి? ఒంటరిగా తన ఇంట్లో తాను గుంభనం గా బతక లేకపోయింది. మేనకోడళ్లు, మేనల్లుళ్లు ఆమెను తమ ఇంట ఉంచుకొనటానికి సిద్ధపడ్డారు కానీ తన ఆస్తి చూపి పెత్తనం చెయ్యాలని ప్రయత్నించటం, తనకు లేని కుటుంబ సంబంధాలు , సౌఖ్యం వాళ్లకు ఉన్నాయన్న అసూయ వల్లనో ఏమో వాళ్ళమధ్య ఏవో వైషమ్యాలు పుట్టించటానికి ప్రయత్నించటం , ఆ విషయం అర్ధమయ్యాక ఎవ్వరూ ఆమెను భరించటానికి సిద్ధపడకపోవటం – ఇదీ ఆమె జీవితం. అలా ఒక్కొక్కచోటా ఉద్వాసన పొందుతూ సారధి ఇంటికి రావటం దగ్గర నవలలో కథ మొదలవుతుంది.
ఆండాళమ్మ తత్వం ఏమిటి? తాను ఏ ఇంట అడుగుపెడుతుందో ముందు వాళ్లకు తన ఆస్తిపాస్తుల ఆశ చూపటం. వస్తూనే సారథి కొడుకు మెడలో రెండు పేటల పలకసర్ల గొలుసువేయటం. మేనల్లుడి దగ్గర ఉన్నప్పుడు అతని కూతురుకని చేయించిన గొలుసు అది. దానికే ఉంచెయ్యకపోయావా అని సారధి అంటే నేను పనికిరాని వాళ్లకు నా సొమ్ములెలా పనికివస్తాయన్నది ఆమె తర్కం. తాను ఇచ్చిన అప్పులు తాలూకూ ప్రాంసరీ నోట్లు సారధికి ఇచ్చి అన్నీ నువ్వే వసూలు చేసుకో అని ఉదారత ప్రకటించటం. వూళ్ళో రెండెకరాల పొలం అతనికే వ్రాసిస్తాననటం. అది సరోజకు పెళ్ళిలో చదివించిన పొలం కదా అంటే అది తనతో పాటు తనను అత్తవారింటికి తీసుకు పోలేదు కనుక దానికి ఇచ్చేది లేదని చెప్పటం… ఆస్తి పాస్తులు ఉండటంవల్ల అందరూ తన చుట్టూ తన దయకు పాకులాడుతూ తిరుగుతుంటారని ఆమెకు ఉన్న అవగాహన. ఎన్ని అనుభవాల తరువాత కూడా ఏమీ నేర్చుకోక పోవటం ఆమె లక్షణం.
నిజానికి ఆండాళమ్మ గారు తన ఆస్తిపాస్తులను ఖర్చుపెట్టుకొని కడుపునిండా తింటూ కంటి నిండా నిద్రపోవచ్చు. పిల్లవాడికి పెట్టటం నెపం తో తాను ఎక్కువ బిస్కెట్లు తినటం , వంట చేస్తానని వండుతూనే రుచి నెపమె మీద తినటం , బియ్యం పోసి కూరలు కొంటూ కొంత డబ్బు మిగుల్చుకొనటం ఇలాంటివి ఆమె ఎందుకు చేసినట్లు? ఆస్తి ఉంటేనే తనను ఎవరైనా చూస్తారు అనే భ్రమలో బతికే ఆమెకు ఆస్తి కూడేసి చూపటం ఒకటే జీవిత లక్ష్యం అయింది. అందుకు ఎంతకైనా దిగజారింది. మనుషులతో మంచిగా ఉండటం , మనుషుల సుఖ సంతోషాలను కోరటం మరిచిపోయింది. ఆస్తికోసమే కాదు నైతికంగా కూడా మనుషులు తన చెప్పుచేతల్లో ఉండాలని అనుకొనటం వల్లనే భార్యాభర్తల మధ్య అపనమ్మకాలు సృష్టించి ఆడుకొనటానికి ప్రయత్నించింది. అది బెడిసికొట్టినప్పుడల్లా ఉన్న ఇల్లు వదిలి మరో ఆశ్రయం కోసం ఆమెకు వెతుకులాట తప్పలేదు. జీవితంలో ఉన్న పెద్ద అభద్రతా భావాన్ని , భయాన్ని అణిచేసుకొనటానికి ఆస్తిని ఒక ఆసరా అనుకొనటమే ఆమె జీవితంలోని విషాదం. ఆస్తి బలమే ఆమెను చెడ్డదాన్ని చేసింది అంటుంది రంగనాయకమ్మ ( 1976 లో వచ్చిన ఆరవ ముద్రణ ముందుమాట) ఆ రకంగా స్త్రీలకు మూర్ఖత్వం, అజ్ఞానం, అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలు వదుల్చుకొని సద్గుణాలను పెంచుకొని ప్రవర్తించటానికి ఎంత మాత్రం అవకాశం ఇయ్యని కుటుంబంవైపు, సమాజం వైపు వేలెత్తి చూపుతుంది రంగనాయకమ్మ.
కూలిన గోడలు నవలలోను కుటుంబ సంబంధాలు డబ్బు కేంద్రంగా నడవటం వల్ల జీవితాలు ఎంత అసంగతంగా , అసంబద్ధంగా మారిపోతాయా చిత్రించింది రంగనాయకమ్మ. చెల్లెలు కళ్యాణి . అన్నలు విశ్వనాధం, సీతాపతి. పుట్టింటి మీద , అన్నల మీద ప్రేమను చెల్లెలు మెట్టింటి సంపదలో భాగం పెట్టటంలో , భారీ కానుకలు ఇయ్యటంలో చూపించినంత కాలం అన్నలకు ఆదరించదగినది, వదినలకు మన్నించ వలసినది అయింది. ఆమె మరణించి ఆమె ఆస్తి పాస్తులన్నీ హరించుకుపోయినప్పుడు ఆమె పిల్లలు అనాధలై తమ ఇంట చేరితే వాళ్ళు దగ్గరకు తీసి చదువులు చెప్పించి వృద్ధిలోకి తీసుకురావలసిన వాళ్ళు కాలేకపోయారు. అన్నయ్యకు పిల్లలు లేరు కనుక అతని వాటా ఆస్తి కూడా తనపిల్లలకే వస్తుందని ఆశపడిన తమ్ముడు సీతాపతి. అందువల్లనే చెల్లెలి పిల్లలపట్ల కొంత న్యాయబుద్ధి ఉండి కూడా అన్న మాటకు ఎదురాడని వాడయ్యాడు.ఆస్తి ఉండటం, ఎవరి కష్టాన్నైనా వాడుకొని స్వంతానికి ఆస్తిని కూడేసే తెలివితేటలు ఉన్న విశ్వనాధం అందువల్లనే తాను కేంద్రంగానే సమస్తం జరగాలనుకొన్నాడు. తన ఆస్తి ఆధిక్యతతో అందరి జీవితాలను శాశించే ప్రయత్నం చేసాడు. ఆ రకంగా ఆస్తి అతనిని చెడ్డవాడిని చేసింది.
శ్రమ లేకుండా వచ్చే ఆస్తులకు , ఆర్ధిక ప్రయోజనాలకు ఆశపడటం తప్పు అన్న ఒక విలువను సారధి ముఖంగా చెప్పించిన రంగనాయకమ్మ దానిని మరింత నిర్దుష్టంగా మధు ముఖంగా నిరూపించింది కూలిన గోడలు నవలలో. అన్నగారు తన పిల్లలకు ఇయ్యబోయే ఆస్తులకు ఆశపడి చిన్న మేనమామ పిల్లల విషయంలో బాధ్యతగా ప్రవర్తించకపోవటాన్ని అతను నిర్మొహమాటంగానే తప్పు అని చెప్పాడు.
ఈ నవలలో మధు అతని అన్న సూర్యం , చెల్లి సుశీలా తల్లి మరణంతో, మతిచెడిన తండ్రి పరారీతో ఆస్తులు అప్పుల కింద హరించుకుపోగా మేనమామ ల పంచన చేరి గడిపిన చేదు అనుభవాల బాల్యాన్ని , అందులో నుండే ఎదుగుదలకు పోగేసుకొన్న తెగింపును , సూర్యం ఉద్యోగస్థుడై తనదైన ఇంటిని ఏర్పరచుకొనటాన్ని , పెళ్లి చేసుకొనటాన్ని , మధు చేనేత కోఆపరేటివ్ సొసైటీలో ఆఫీసర్ కావటం ఈ మొదలైన కథ అంతా మధు రచయిత అయిన తన స్నేహితురాలికి చెప్తే ఆమె నవలగా వ్రాసి తెచ్చి ఇచ్చింది. ఆ స్నేహితురాలు శారద. ఆమె వ్రాసిన నవలను మధుతో పాటు మనమూ చదువుతాం. నవలా రూపంలో కథ అంతా ఫ్లాష్ బ్యాక్ లో చెప్పబడిందన్నమాట. ఆ రచయిత్రినే మధు పెళ్లి చేసుకొంటానని వదినకు ఉత్తరం వ్రాసి , నవలకు అదే ముగింపు అని శారదకు చెప్పటంతో నవల ముగుస్తుంది.
కూలిన గోడలు నవల కంటే ఒక సంవత్సరం ముందు నా డైరీలో ఒక పేజీ నవల (1963) వచ్చింది. ఇందులో కథానాయిక రచయిత్రి. ఉత్తమపురుష కథనం. ఆమె వ్రాసే కథ ప్రథమపురుషలో నడుస్తుంది. కూలిన గోడలు నవలలో రచయిత్రి పాత్ర ఉంది కానీ ఈ నవలలో రచయిత్రి పాత్రకు ఒక జీవితం ఉంది. కథలు వ్రాయమని వెంటపడే భర్త ఉన్నాడు. వ్రాసుకొనటానికి అవసరమైన తీరికను మిగల్చని ఇంటిపని ఉంది. ఏకాగ్రత ను భగ్నంచేసే పిల్లల అవసరాలు, అల్లరి ఉన్నాయి. వచ్చిపోయే అతిధులు ఉన్నారు. వీటిమధ్య అష్టావధానంగా ఉన్న ఆమె దైనందిన జీవితంలో ఒక రోజు ఈ నవలలో చూపించబడింది.
రచయిత్రిగా ఆమెకు కొన్ని అభిప్రాయలు ఉన్నాయి. ఒక వ్యక్తిత్వం వుంది. చచ్చు ప్రేమకథలు వ్రాసే అలవాటు లేని రచయిత్రి. నవలలో ఆమె వ్రాస్తున్న కథగా గోపాలం ప్రేమకథ ఒకటి నడుస్తుంది. కంటికి నదురుగా కనిపించిన ఆడపిల్లకు ప్రేమలేఖలు వ్రాసి పరిచయాలు పెంచుకొని షికార్లు కొట్టాలనుకొనే నవయువకులను ఊహాలోకం నుండి, కాల్పనిక ప్రపంచం నుండి నేలమీదికి తెచ్చి వాస్తవంలో నిలబెట్టి నిలదీయగల బామ్మ పాత్ర అందులో కీలకమైనది. చచ్చు ప్రేమకథల పట్ల ఆమె వ్యతిరేక చైతన్యానికి నిదర్శనం బామ్మ.
రచయిత్రిగా ఆమెను అభిమానించేవాళ్ళు ఉన్నారు. ఆమెతో మాట్లాడాలని ఆసక్తిగా వచ్చేవాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భం ఒకటి ఈ నవలలో ఉంది. ఆరోజు ఆమెను కలవటానికి అయిదుగురు అతిధులు వస్తే వాళ్లకు కూర్చునే వసతి చేసి , ఏడుస్తున్న పాపకు పాలు కలిపి పడుతూనే వాళ్ళతో మాట్లాడింది. సాహిత్య సృజన విమర్శల గురించి తన అభిప్రాయాలు చెప్పింది.
రచన వాస్తవానికి ప్రతిబింబంగా ఉండాలి.మనలో మనకే తెలియకుండా దాగి ఉండే లోపాలను, సాంఘిక దురాచారాలను గుర్తించి,అర్థం చేసుకొని సర్డుకొనటానికి దోహద పడేదిగా ఉండాలి.జీవితం లోని సమస్యలతో సంబంధం లేకుండా అతిశయాలను చిత్రించి ఆనందాలు కల్పించి ఆశపెట్టే సాహిత్యం ప్రయోజనకారి కాదు.ఎవరి కథ చెప్పదగినది? ఎవరి కథ చెప్పటం ఎక్కువ ప్రయోజనకారి అన్న వివేకం రచయితకు ఉండాలి అంటుంది.
విమర్శ లేనప్పుడు రచనకు విలువ లేదు అని అంగీకరిస్తుంది. విమర్శ సహేతుకం గా సహృదయంతో చేయాలని అభిప్రాయ పడుతుంది. స్త్రీ పురుష భేద భావం, స్వపర వైషమ్యాలు విమర్శలో వుండ కూడనివి అని భావిస్తుంది. ఆడపిల్లలేమి రాయగలరు వాళ్ళ మొహం అనే చులకన భావంతో స్త్రీల రచనలను విమర్శించే ధోరణిని గుర్తించి నిరాకరించగలిగిన చైతన్యం ఆమెది.
మీ వారి సహకారం ఎలా వుంటుంది అని అతిథులు అడిగిన ప్రశ్నకు అసలు మావారి సహకారం ఉంటుందని నేనన్నానా అని ఆమె ఇచ్చిన ప్రశ్న వంటి జవాబు లో అసలు సహకారం అనేది ఉంటే కదా,అది ఏ రకంగా ఉందో చెప్పటం…అన్న ఆంతర్యం ధ్వనిస్తుంది. “మీరు చాలా బద్ధకస్తులని,మీ వారి ప్రోత్సాహమే లేకపోతే రాయనే రాయరని” అనుకుంటారు అని వాళ్లకు తెలిసిన సమాచారాన్ని వాళ్ళు చెప్తే అది తన భర్త స్నేహితులు ఎవరో చెప్పి వుంటారంటుంది. భర్త స్నేహితులు అలా చెప్పు కొంటున్నారంటే అది భర్త చెప్పిన మాటే కావాలి అని గ్రహించ లేనంత అమాయకురాలు కాదు రచయిత్రి. మీ వారి స్నేహితులు మీకు శత్రువులు కాదు కదండీ అన్న అతిధుల మాటకు “అసలు మా వారే నాకు పెద్ద శత్రువండి ! నా మొహం! నేనేం మనిషి నన్నట్టు చూస్తుంటారు” అని స్పందించిన తీరులో రచయిత్రిగా తన గురించి బయట వ్యాపించే అభిప్రాయాల నిర్మాణంలో అతని పాత్రను గుర్తించిన లక్షణం కనబడుతుంది.
ఇవన్నీ మనసులో మెడులుతుండటం తో పాటు…’రాయి రాయి’ అని సరస వినోదంగా నైనా సరే భర్త పెట్టే ఒత్తిడి, అన్నీ సమయానికి అమర్చవలసిన తప్పని సరి కుటుంబ బాధ్యతలు ,విశ్రాంతి లేకపోవటం ఇవన్నీ ఒకదానికి ఒకటి తోడు కావటం వల్లనే కావచ్చు ‘ఎందుకొచ్చిన రాతలు ,రాయను’ అని ఆమె భర్తతో అంటుంది. కానీ అన్నం తినను అని భర్త అలిగితే కథా రచనకు ఉప క్రమిస్తుంది. సాహిత్య సృజన స్వచ్ఛందంగా కాక నిర్బంధం మీద, ఒత్తిడి మీద చేయవలసిన స్థితిలో స్త్రీలు ఉండటాన్ని ఏదో ఒక స్థాయిలో గుర్తించి చూపటం నా డైరీలో ఒక పేజీ నవల లో జరిగింది.
1965 లో వచ్చిన రచయిత్రి నవలకు మూల బీజం ఇందులోనే ఉంది. తరువాతి కాలంలో స్త్రీ సమస్య గురించి రంగనాయకమ్మ చేయబోయే ఆలోచనలకు,వ్రాయబోయే నవలలకు నా డైరీలో ఒక పేజీ నవల తో భూమిక సిద్ధం అయింది.
( ఇంకా ఉంది)
*****
డా|| కాత్యాయనీ విద్మహే కాకతీయ విశ్వవిద్యాలయం లో పూర్వ ఆచార్యులు. వరంగల్ వీరి జన్మస్థలం, ప్రస్తుత నివాసం. సాహిత్య , సామాజిక పరిశోధనలో నిత్యా విద్యార్ధి. కథలు, కవిత్వం రాసినా ప్రముఖ సాహిత్య విమర్శకులు. 23 పుస్తకాలు వెలువరించారు. 28 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రజా హక్కుల ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచే కాత్యాయనీ విద్మహే ప్రజాస్వామిక వేదిక వ్యవస్థాపక సభ్యురాలు. ప్రసుతం తెలంగాణా శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.