నా జీవన యానంలో- రెండవభాగం- 26

 ‘ గేప్ ‘ కథానేపథ్యం

-కె.వరలక్ష్మి

ఈ చిన్న కథ సికింద్రాబాద్ నుంచి రైలు సామర్లకోట చేరేలోపల రాసినది.

1994లో నిజాం నవాబ్ కు చెందిన భవంతులు పురానా హవేలీ, ఫలక్ నుమా పేలలాంటివి జనం చూడడానికి ఒక నెలరోజులు ఓపెన్ గా ఉంచారు. ఆ వార్త పేపర్లో చూసి నేను, నా జీవిత సహచరుడు దసరా సెలవుల్లో హైదరాబాద్ లో ఉన్న మా తమ్ముడింటికి వెళ్ళాం. ఉదయాన్నే బస్సో, ఆటోనో ఎక్కి వెళ్ళడం, సాయంకాలం వరకూ చూసి తిరిగి రావడం, తిరుగుప్రయాణం రోజు రైల్వేస్టేషన్ కి కూడా ఎవరూ రాలేదు. ఏదో వెలితి అనిపించింది. అసలే సెన్సిటివ్ పూల్ ని, దానికి తోడు ప్రయాణం అంటే చాలు ఒకటే గాభరా, బండెళ్ళిపోతుందేమోనని కంగారు. రైలు అనుకున్న ప్లాట్‌ఫాం మీదికి రాక మెట్లెక్కి దిగీ ఏడుపొచ్చేసింది. అయినవాళ్ళ దగ్గరకెళ్ళి తిరిగొచ్చేటప్పుడు ఆపుకున్నా ఆగనంత దుఃఖం నన్ను ముంచేస్తుంది. క్రితం సంవత్సరం మా గీత దగ్గర్నుంచి తిరిగివచ్చేటప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి చికాగో చేరేవరకూ ఏడుస్తూనే ఉన్నాను.

ఈ కథలో నా చుట్టూ ఉన్నవాళ్ళు, జరిగిన సంఘటనలు, సంభాషణలు ఎలా ఉన్నవి అలా రాసేసాను. ‘నేను’ అన్న కేరెక్టరు ఆ ప్రయాణంలో ఉన్న అమ్మాయి కాదు. హైదరాబాద్లో తెలిసినవాళ్ళింట్లో తారసపడిన ఒక అమ్మాయి తను, ఆ రోజుల్లోనే టేకిటిజీగా మాట్లాడుతుండేది. అబార్షన్ గురించి ‘కంట్లో నలుసుపడితే తీసేసుకోమా’ అన్నది. ఈ మాట గురించి మిత్ర రచయిత్రులు కొందరు గుసగుసలతోనూ, ఇంకొందరు బాహాటంగానూ విమర్శించారు. నేనే ఆమాట అన్నాను అనుకున్నారు. కథలో చివరిలైన్లు చదివితే నేనేం చెప్పదల్చుకున్నానో అర్థమౌతుంది. ఇప్పుడు కథల్లోనే కాదు, నిజజీవితాల్లోనూ అదంతా కామనైపోయింది. మానవసంబంధాల్లోని ప్రేమలు – ఆత్మీయతలు సంతోషాన్నిస్తాయని చెప్పబడిన ఈ చిన్నికథంటే కూడా నా కిష్టం.

“గేప్”

ఆటో దిగి పడుతూ లేస్తూ స్టేషన్లో కొచ్చిపడ్డాను.

సాయంకాలం ఆరు దాటింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషను ఇసుకవేస్తే రాలకుండా ఉంది. రేపటితో దసరా సెలవులు ముగుస్తున్నాయి. సెలవులకి జంటనగరాల కొచ్చిన వాళ్ళంతా తిరుగుప్రయాణంలో ఉన్నారు.

ఒకటో నెంబరు ఫ్లాట్ ఫాం మీంచి కొన్ని నిముషాల్లో గోదావరి కదలనున్నదని ఎనౌన్స్మెంట్ వినిపిస్తోంది. నోడౌట్, విశాఖ రెండో నెంబరు మీద ఉండి ఉంటుంది. బ్రిడ్జి వరకూ నడిచి ఆగిపోయాను. ఇప్పుడప్పుడే ఇన్ని మెట్లెక్క చ్చో లేదో! సూట్ కేస్, బేగ్, వాటర్ బాటిల్, పర్స్ భుజాలు కూడా చేతులయ్యాయి. ఏమైతే అయిందని చకచకా మెట్లెక్కాను.

రెండో నెంబరుమీద విశాఖ చీకటి మొహం వేసుకుని కునికిపాట్లు పడుతోంది. ఇంకా లైట్లు వెయ్యలేదంటే ఖచ్చితంగా బోలెడంత టైముందన్నమాట. జనం మాత్రం ట్రైన్ ఈ క్షణంలోనే కదిలి పోబోతున్నంత టెన్షన్ని మొహాల్లో నింపేసుకుని పరుగులు పెడుతున్నారు. .

ఎస్ – టూ ఎక్కడుందో తీరిగ్గా వెతుక్కునేసరికి బండిలో లైట్లు వెలిగాయ్. సీట్ నెం -31 చేరుకుని భుజాల బరువు వదిలించుకుని ‘హమ్మయ్యా ‘ అని కూలబడ్డాను. వెయిటింగ్ లిస్ట్ లో దొరికింది ఈ సీటైనా, టి.టి .ఇ వస్తేగాని బెర్త్ కన్ఫం అయ్యిందో లేదో తెలీదు.

ఇలా ఒంటరిగా వచ్చి ట్రెయినెక్కడం ఇదే మొదటిసారి. ఇదివరకంతా డాడీ కార్లో తీసుకొచ్చి, బండి కదిలేవరకూ ఉండి, మేగ్ జైన్స్ కొనిచ్చి వెళ్ళేవారు. బండికదుల్తూంటే ఆవేదనతో ఆయన ముఖం వాడిపోయేది. డాడీకి నన్నొదిలి ఉండాలంటే అంత కష్టం. ఆంధ్రాయూనివర్శిటీలోనే చదువుతానని నేనంత పట్టుపట్టిక్కూ చోకపోతే నా చదువిక్కడే సాగేది.

పూర్ డాడీ, ఆయనకేం తెలుసు, నేనెందుకు విశాఖపట్నంలోనే చదువుతానన్నానో!

నాకు ఎడం వైపు సీట్లో వయసుమళ్ళిన దంపతులున్నారు. నా పక్క సీటు ఖాళీగా ఉంది.

ఎవరూ రాకుండా ఉంటే బావుండును. నాకు బర్త్ కన్ఫం అయిపోతుంది.

కుడిపక్క సీట్లోని పెద్దామె ఎందుకో కొంగుతో ఒకటే పనిగా కళ్ళు ఒత్తుకుంటోంది. కిటికీ వైపు అదేపనిగా ఆత్రంగా చూస్తోంది. అంతలో ఎక్కణ్నుంచొచ్చారో బిలబిల్లాడుతూ ఏడెనిమిది మంది పిల్లలు కిటికీ దగ్గర చేరిపోయారు.

“పద్మక్కా వాళ్ళూ ఇక్కడున్నారు” వాళ్ళలో ఒకడు అరిచాడు. నా చెవి గింగురుమంది.

ఎడం వైపు సీట్లోని పిల్లలు ముగ్గురూ నా బేగ్ వగైరాలు కిందపెట్టేసి కిటికీ దగ్గరికి చేరిపోయారు.

“వచ్చేసారా, హమ్మయ్యా, మీరొచ్చేసరికి బండెళ్ళిపోతుందేమో అని హడలి చచ్చాం”

“ఎందుకు, మేం తోస్తేగానీ ఈ బండి కదల్టుగా” నవ్వులు.

“యూ నాటీ” కిటికీలోంచి చెయ్యి చాపి ఆ మాటన్న అబ్బాయిని ఓ మొట్టికాయ వేసిందీ అమ్మాయి.

“బాగా చదువుకోండి, రేంక్స్ రావాలి”

”చిత్తం”

”మీరు మాత్రం రాత్రి ఎనిమిదికే నిద్రపోయి పొద్దుట ఎనిమిదికి లేస్తూ బాగా చదివేసుకోండేం” మళ్ళీ నవ్వులు.

అంతలో ఓ జంట చిన్నపాపాయినెత్తుకుని వచ్చారు. వాళ్ళ వెనుక డ్రైవరు.

“ఆంటీవాళ్ళూ వచ్చేసారు” అరిచారు పిల్లలంతా.

“భలే, భలే, ఈ రోజు అంకుల్ వాళ్ళ జీప్ స్టేషన్ కి మూడు ట్రిప్పులు వేసింది” నవ్వులు నవ్వులు.

బాల్యం ఎంత మధురమైంది. జెలసీ అనిపించింది నాకు.

మనుషులంతా పన్నెండేళ్ళు దాటకుండా అలాగే ఉండిపోతే.

లోపలున్న పిల్ల తండ్రి జేబులోంచి పదిరూపాయల నోటొకటి తీసి “ఓబయ్యా నాలుగు టీలు పడ్డా. నువ్వు కూడా ఒకటి తాగి, చిల్లరుంచుకో” ఇంకేం చిల్లర? నాకు నవ్వు రాబోయి ఆగింది.

“వద్దన్నయ్యా, ఈ టైంలో నేను టీ తాగలేను. ఓబయ్యా నాకు తేవద్దు” అంది పాపాయినెత్తుకున్నావిడ.

ఓబయ్య రెండు టీలు లోపలికి తెచ్చాడు.

” చిల్లరుంచేసుకో” మరోసారి ఉదారంగా ఈయన.

వాళ్ళావిడ ఒంటిమీద బంగారం మెరుస్తోంది. టీ అందుకుంటూ ఆవిడ ఓబయ్యను ఉదారంగా ఓ ప్రశ్న వేసింది. “నీ ఇంటిమాటేమైంది ఓబయ్యా!”

“ఏమైతుందమ్మ, బిడ్డపెండ్లికి ఇల్లమ్మిన”

“అదికాదది కాదు, అప్పుడెప్పుడో లోన్ కి అప్లై చేసావుగదా” ,

“ఔమల్ల, అది శాంక్సను గాలే. మాకేడరువాండ్లకి లోనై చ్చేది లేదంట. శాంక్సనైతే పైన రేకు విప్పి పక్కా ఇల్లు కడదామనుకొంటి. అదిగూడవోయే, ఇంకేం లాభం.” అడిగిందేగాని ఆమె వింటూండింది లేదని గ్రహించి ఆపేసాడు ఓబయ్య.

ఇవతల పిల్లలంతా ఆపకుండా ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు.

“పద్మక్కా, మొన్నేమైందో తెల్సా, స్కూల్లో టీచర్ పెద్దయ్యాక ఏమౌతావని అడిగితే ఈ టింకూగాడు ‘చిరంజీవినవుతా ‘ అన్నాడు”

“ఏరా టింకూ?”

“ఔ, నేనదే అవుత”

“యాదగిరి మూడీగా ఉన్నాడేంటి, ప్రేమికుడు పిక్చర్ కి టిక్కెట్లు దొరకలేదనా?” పద్మ.

అందరికీ కొంచెం ఎడంగా నుంచున్న నల్లని పదిహేనేళ్ళ కుర్రాడి కళ్ళు మెరిసాయి “ఇయ్యాలేపు దొరక్కపోతే ఏమైంది, ఏ పొద్దుకైనా చూసేది చూసేదే” అన్నాడు ముందుకొచ్చి.

చటుక్కున ప్రభాకర్ గుర్తుకొచ్చాడు నాకు. ఫస్ట్ డే రష్ లో టిక్కెట్లు సంపాదించి తీసుకెళ్ళాడు. ప్రభుదేవా స్పీడ్ డాన్స్ ఇష్టం నాకు. ఫ్లాట్ ఫాం మీద వెళ్తున్న పళ్ళబండిని ఆపేసారు పిల్లలంతా.

బండిమీది రికార్డర్లోంచిఓ చెలియా నా ప్రియ సఖియాఅంటోంది ఆర్ధంగా ఉన్ని క్రిష్ణ గొంతు.

‘మనసు చెయిజారడం’ ‘అధరానికి ఉదరానికి మధ్య అలజడి చెలరేగడం’ డబ్బింగ్ ట్యూన్ కి అంత చక్కటి పదాలు కూర్చినందుకు హేట్సాఫ్ రాజశ్రీ

అవతలి సీట్లోని పెద్దాయన కళ్ళద్దాల్లోంచి నిర్లిప్తంగా ఎటో చూస్తున్నాడు. ఆవిడ మాత్రం కళ్ళల్లో ఊరుతున్న నీటిని ఆపలేకపోతోంది. ఈ పిల్లల అల్లరి కూడా వాళ్ళని ఏమార్చలేకపోతోంది.

హఠాత్తుగా మొన్న చూసిన ఫలక్ నుమా పేలస్ గుర్తుకొచ్చింది. వీళ్ళలాగే ఏదో విషాదాన్ని నిలువెల్లా నింపుకున్నట్టనిపించింది.

ఎంత రిచ్ ఉడెన్ వర్క్. ఆ గొప్ప శిల్పులెవరో తెలీదుకదా!

లోపలి హాల్లో మెట్ల మీది తివాసీని శుభ్రం చేస్తున్న పనమ్మాయిని చూసి “ఆహా ఆవిడే మహారాణీ, బానిస మహారాణీ” అంటూ జనం నవ్వులు, నిజానికి చెమటోడ్చి దాన్ని నిర్మించిన వాళ్ళూ, అనుక్షణం దాన్ని పరిశుభ్రంగా ఉంచిన వాళ్ళే రాజులూ, రాణులూ, రీవిగా నిలబడిన ఫలక్ నుమా మీది బ్రిటిష్ ముద్ర బానిసత్వానికి ఆమోదముద్రలా, వర్తమానాన్ని వెక్కిరిస్తూన్న గతంలా కనిపించింది నాకు.

ఇప్పటి ఆకాశహర్మ్యాలే నచ్చుతాయి నాకు. పరుగులెత్తే వర్తమానమే ఇష్టం.

క్రమంగా బైటనిలబడిన వాళ్ళలో సహనం తగ్గిపోతోంది. కాలు మార్చి కాలుమీద నిలబడుతున్నారు. అలాగని వచ్చిన తర్వాత బండి కదలకుండా వదిలేసి వెళ్ళలేరు.

బెల్ మోగింది.

హఠాత్తుగా ముసలామె కళ్ళలోకి మెరుపొచ్చింది. పిల్లల్ని తోసుకుంటూ కిటికీ దగ్గరకొచ్చింది. దూరంగా హెల్మెట్ చేతిలో ఊపుకుంటూ ఒక వ్యక్తి వస్తున్నాడు.

“బాబూ ఇటు.. ఇటు..” అందావిడ.

పిల్లలంతా వెనక్కి చూసి, చోటిచ్చారు.

అతనొచ్చి కిటికీ దగ్గర నిలుచున్నాడు. ఆవిడ ప్రేమగా అతని చెయ్యందుకుంది ”నీ ఆరోగ్యం జాగ్రత్త, వేళకి తింటూ ఉండు. బండిమీద మరీ వేగంగా వెళ్ళకూ”

ఎక్కడేం కదిలిందో అతని కళ్ళల్లోకి చటుక్కున నీళ్ళోచ్చాయి.

బండి కదలబోతోంది. ఏదో తట్టినట్టు అతను పర్స్ లోంచి కొన్ని నోట్లు తీసి ఆవిడ చేతిలో పెట్టబోయాడు.

“బండి కదుల్తోంది, జాగ్రత్త నాయనా” అంటూ ఆవిడ అతని చెయ్యి వదిలేసింది. ”కోడలూ పిల్లలూ జాగ్రత్త”

కదుల్తోన్న బండి పక్కనే పరుగెడుతూ పిల్లలు “బై..బై.. ఆల్ ద బెస్ట్” అంటూ అరుస్తున్నారు.

బండి స్పీడందుకుంది. సీట్లో రిలాక్సింగ్ గా కూచున్నాను.

డాడీకి ఎందుకు కోపం వచ్చిందో నాకిప్పటికీ అర్థంకావడం లేదు. అమ్మపోయినప్పట్నుంచీ కంటికి రెప్పలా పెంచిన ఆయనకి తెలీకుండా నేను ప్రభాకర్ని ప్రేమించడమే కాదు, పెళ్ళికాకుండానే ఎబార్షన్ చేయించుకున్నాను. పూర్ఫలో ప్రెగ్నెన్సీ మాట చెప్పగానే హడలి చచ్చాడు ప్రభాకర్. వాళ్ళ నాన్నతో ఇంకా ప్రేమమాట చెప్పడానికే ధైర్యం లేదు, ఈ మాట చెపితే చంపి పాతరేస్తాడన్నాడు. చదువు పూర్తికాకుండా పెళ్ళి నాకు ఇష్టం లేదు. అందుకే ఈ సెలవుల్లో ప్రతిభాంటీని కలిసాను. ఆవిడేమో నాన్నగారికి ఫోన్ చేసి చెప్పేసింది. ఆయనేమనుకుంటున్నారో, ఎలా ఫీలయ్యారో తెలీదు. నేను హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చేసరికి బిజినెస్ టూర్ మీద కారు తీసుకుని వెళ్ళారన్నారు. నాకు చెప్పకుండా వెళ్ళి, సెలవులు పూర్తి కావస్తున్నా తిరిగి రాలేదంటే ఖచ్చితంగా ఆయనకి కోపం వచ్చిందన్నమాటే.

దీన్లో ఏముందని? కంట్లో నలుసుపడితే తీసేసుకోమా? నాన్నగారు నాలా ఎందుకాలోచించలేరో.

నా పక్క సీట్లోకి ఎవరూ రానేలేదు.

ముసలావిడ ఇప్పుడు ఏడవడం లేదు. ఆమె ముఖం తేటగా, తృప్తిగా ఉంది. తృప్తి ఎందుకొచ్చిందో నాకు తెలిస్తే బావుండును.

(13-11-94 ఆదివారం ఆంధ్రజ్యోతి)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.