నిష్కల నడుం వాల్చింది గానీ నిద్రపట్టడం లేదు.
అంకిత్ గుర్తొచ్చాడు.
అతను వెళ్లి అప్పుడే రెండు నెలలు అవుతున్నది.
పదేపదే మెసేజ్ లు పెడుతున్నాడు. వచ్చేస్తానంటున్నాడు.
నేను పొమ్మంటే కదా రమ్మనడానికి, అతను రావడానికి. తనకు తానుగా నోటికి వచ్చినట్టు దూషించి వెళ్ళిపోయాడు. అతను దూషించినందుకంటే ఎక్కువగా ఆమెను బాధించింది అతనిలోని హిపోక్రసీ. మాటకి చేతకి ఉన్న వ్యత్యాసం.
అతని నిజస్వరూపం తెలిసిన తర్వాత అతని నీడ భరించలేక పోతున్నది నిష్కల.
భావోద్వేగాల నుంచి విడదీసి అతని గుణ దోషాలను ఎంచడానికి ప్రయత్నిస్తున్నది.
సహజ ప్రకృతి నుంచి దూరంగా జరిగిపోతున్న అతన్ని అర్ధం చేసుకోవడానికి బుద్దితో, హృదయంతో ప్రయత్నం చేస్తున్నది.
అతన్ని రమ్మనడానికి ఆమె మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. అట్లాగని అతని మీద ప్రేమ, అతనితో గడిపిన జీవితంలో తృప్తి లేవని కాదు.
తను మనుషులకు దూరంగా సంచరిస్తున్నదా.. తెలియని దారుల్లో సంచారం తనకు సమంజసంగానే కనిపిస్తున్నది. అందులో ఎటువంటి ఆక్షేపణ లేదు.
అతను తనతో చెప్పిన విశ్వాసాలకి దూరంగా జరగడమే తనలో సంఘర్షణకు, అశాంతికి కారణం అవుతున్నది.
అపసవ్య ఆలోచనలు అతనివో లేక తనవో ..
ఏదైనా కానీ , తన ప్రేమను, అతనిపై ఉంచిన విశ్వాసాన్ని అపహాస్యం చేసాడు.
తమ సహజీవనంలో ఏవైతే ఉండకూడదని అనుకున్నారో అవన్నీ ఒక్కటొక్కటిగా అతనిలో బయటపడుతున్నాయి. దాంతో ఆ ప్రేమ, నమ్మకం బీటలు వారి రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
అందరికీ ఏమో గానీ కరోనా లాక్ డౌన్ తనకు మంచి చేసింది అనుకున్నది నిష్కల. లేకపోతే ఇప్పట్లో అతని అసలు స్వరూపం బయటపడేది కాదేమో..
ఏడాది పైన ఇరవై నాలుగు గంటలూ ఒకే కప్పు కింద కలిసి ఉండడం వల్లనే కదా అతను ఏమిటో పూర్తిగా అర్ధమయింది. మేడిపండు లాంటి అతని స్వభావం బయటపడింది.
లేకపోతే ఇద్దరి మధ్య రిలేషన్ ఇంకెంత కాలం కొనసాగేదో..
మనకు పిల్లలు ఉంటే బాగుంటుంది కదా నిషీ.. అని అప్పటికే రెండు మూడు సార్లు ప్రస్తావించాడు.
బోసినవ్వుల పాపాయిలంటే ఎవరిష్టం ఉండదు. నాకూ ఇష్టమే అంకిత్.
నీకు తెలుసు నా ప్రాధాన్యత ఏమిటో.. తెలిసి తెలిసీ ఎందుకు ఆ ప్రస్తావన తెస్తావ్. ఇక ముందు తేవద్దు అని సున్నితంగా చెప్పేది నిష్కల.
ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించిన నిష్కలకు కెరీర్ లో నిలదొక్కుకునే వరకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. అందుకు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేదు.
పిల్లలు కావాలని బలంగా కోరిక కలిగినప్పుడు ఆ విషయం ఆలోచిస్తానని సహచరుడితో చెప్పింది నిష్కల.
అది కాదు నిషీ… ఇరవై నాలుగు గంటలు మన మొఖాలు మనమే చూసుకుని బోర్ రావడం లేదూ…
మనకిప్పుడు ఒకరో ఇద్దరో ఉంటే. ఎంత బాగుంటుంది. జీవితం ఎంత ఉత్సాహంగా ఉంటుంది ..!
ఎంచక్కా వాళ్ళ ముద్దు మురిపాలతో సమయం తెలియకుండా గడిపేయవచ్చు కదా .. అంటుంటాడు అంకిత్.
ఎన్నిసార్లు ఆమె కాదని చెప్పినా పదేపదే ఆ ప్రస్తావన తేవడం అంకిత్ కి ఆనవాయితీ గా మారింది.
ఇప్పుడిప్పుడే పిల్లల్ని కనడానికి నేను సిద్ధంగా లేనని చెప్పాను కదా.. మళ్ళీ మళ్ళీ ఆ ప్రస్తావన ఎందుకు తెస్తావ్ అని ఓ రోజు విసుక్కుంది నిష్కల.
అది కాదు నిషీ.. మా పేరెంట్స్ కూడా అడుగుతున్నారు నచ్చచెప్పే ధోరణిలో నెమ్మదిగా నసిగాడు.
అసలు విషయం అర్ధమయింది నిష్కలకి.
అయినా విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు.
అంకిత్ తల్లిదండ్రులు అంకిత్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మాతృదేశం వదిలి అమెరికా వచ్చి స్థిరపడ్డారు.
మెరుగైన జీవనోపాధి కోసం, ఆర్ధికంగా ఎదగడం కోసమో, ఊడలేసుకున్న కుటుంబ వ్యవస్థ వదిలి, కుటుంబ సంబంధ బాంధవ్యాలు వదిలి ఖండాంతరాలు దాటి వస్తూ వస్తూ అక్కడి సామాజిక అలవాట్లను కూడా మోసుకొచ్చారా .. అని నవ్వేసింది నిష్కల.
మారిన పరిసరాలు , వాతావరణం అలవాటు పడుతూ తన మూలాల్ని మరచి పోవద్దని తన తాత ముత్తాతల సంస్కృతిని కొనసాగించడానికి తపన పడడం, సామాజిక అవసరాలు ఆ పద్దతిలోనే కొనసాగించడం ఎక్కువైపోతున్నాయి అమెరికన్ ఇండియన్స్ లో అన్నది నిష్కల.
ముడుచుకు పోయిన సహచరుడిని చూస్తూ , హలో మై డియర్…
వాళ్ళ ఆశలో, నీ బుర్రలో తొలుస్తున్న కోరికలో నాకు తెలియదు. వాళ్ళు కోరుకున్నట్లుగానో, నువ్వు కోరుకున్నట్లుగానో నేను ఉండను. నేను కోరుకున్నట్లుగానే నేను నేనుగానే ఉంటాను. నా చుట్టూ మొలుచుకొస్తున్న గోడలని లెక్కచేయను. బద్దలు కొట్టుకుంటూ పోతూనే ఉంటాను అని నవ్వుతూనే స్పష్టంగా చెప్పింది.
అది కాదు .. నసుగుతున్న అతని ఉద్దేశం ఆమెకు స్పష్టంగానే తెలుస్తున్నది. ఈ చర్చ ఇక్కడితో ఆగిపోవాలంటే తను కూడా తన నిర్ణయాన్ని మరింత స్పష్టంగా చెప్పాలి అనుకున్నది నిష్కల.
అయినా నువ్వెంటోయ్.. మన మధ్య ఎలాంటి లెక్కలు, గోడలు ఉండవని ఢంకా కొట్టి చెప్పావ్ .. మళ్ళి ఈ గొళ్ళాలు, ఫిట్టింగ్లు ఏంటి? అన్ని రకాల లెక్కలను, ఆడవాళ్ళ చుట్టూ కట్టే ఎత్తైన గోడలను బద్దలు కొడుతూ ముందుకు పోతా అని మరోసారి స్పష్టం చేసింది నిష్కల.
అలా చెప్పినప్పుడు అతని మొహం చిన్నబోయేది. నెమ్మదిగా అతనిలో అసంతృప్తి మొదలయింది. ఆమె తనకు నచ్చినట్లుగా నడుచుకోవడం లేదని.
మరో వైపు తల్లి దండ్రుల నుండి ఒత్తిడి ..
ఒకరి అభిప్రాయాలూ ఒకరు గౌరవించుకుంటూ , ఎటువంటి అధిపత్యాలు లేకుండా ఒకరికి ఒకరుగా, ఎవరికి వారుగా ఉండాలని అనుకున్నాం నిజమే నిషీ.. మా వాళ్ళు కోరుకున్నట్టు పెళ్లి చేసుకోలేదు. సింపుల్ గా సహజీవనంలోకి అడుగుపెట్టా.
ఎంత అమెరికాలో ఉంటే మాత్రం సగటు భారతీయ అమ్మానాన్నలు తమ పిల్లల పెళ్లి వాళ్ళ పిల్లల గురించి ఆలోచించకుండా ఎలా ఉంటారు ? అనేవాడు.
నా తల్లి ఇండియాలోనే ఉంది. ఆమె కూడా మీ అమ్మానాన్నల లాగే ఆలోచిస్తూ ఉంటుంది. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళున్న సంస్కృతిలో అది సబబే.
అయితే మా అమ్మ మనసులో ఏమున్నా నా అభిప్రాయాలకు గౌరవం ఇచ్చింది. నాపై ఒత్తిడి తేవడం లేదు అని చెప్పేది.
అంకిత్ లోని ఆదర్శం పొరలు పొరలుగా విడిపోతున్న సమయంలో అతనికి అమ్మానాన్నల ప్రేమ గుర్తొచ్చింది. స్వేచ్ఛగా తాను తీసుకున్న నిర్ణయం వల్ల తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించారో అన్న బాధ మొదలైంది. తన కుటుంబ సంస్కృతి ఆచారాలు, తన వంశ అభివృద్ధి గుర్తొచ్చాయి.
అంకిత్ తల్లి తనతో స్నేహంగానే మాట్లాడుతుంది. ఎప్పుడు పిల్లల ప్రస్తావన తేలేదు. కానీ పదేపదే అంకిత్ అదే ప్రస్తావన తెస్తున్నాడు. అక్కడి నుండి కుటుంబ జీవనంలో మాధుర్యం అంటూ ఏవేవో వల్లెవేస్తున్నాడు.
వాటిలో ఏ మాత్రం ఇమడలేని తత్వం నిష్కలది. ఆమె స్వేచ్ఛకి ఆకాశమే హద్దు అనుకుంటుంది. అటువంటి అమ్మాయిని ఆ ఇంటి కోడలుగా ఆచార వ్యవహారాలు నేర్చుకోవాలంటున్నాడు. బిడ్డలు కనివ్వాలన్న అతని మాటల్లో మగవాడినన్న అహంభావం ఎక్కువగా కనిపిస్తుంది నిష్కలకు.
సహచరుడుగా కాకుండా అహంబావి లా సాధారణ భర్తలా , మగవాడిలా ప్రవర్తిస్తున్నాడు.
ఆడవాళ్లు ఎలా ఉండాలో పాఠం చెప్పడం మొదలు పెట్టాడు . స్త్రీత్వం గురించి మాట్లాడుతున్నాడు.
అతని అధిపత్యం పెరిగిపోతున్నది . అది సహించలేకపోతున్నది ఆమె .
ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే జీవితం కాదు ఆమె కోరుకున్నది . సహజీవనంలో అది ఉండదని అనుకున్నది . కానీ ఇప్పుడు ఇదేంటి ,..
సహజీవన బంధాలు మహిళకు స్వేచ్ఛ ఇవ్వడం లేదా .. లైంగిక చర్య కోసమే వాడుకుంటున్నారా .. పని మనుషుల్లా చూస్తున్నారా
నన్ను నన్నుగా చూడటం మానేసి భారతీయ మహిళగా అతని చెప్పు చేతల్లో ఉండాలంటున్నాడు. అతని బందీగా చూస్తున్నాడు. అక్కడే వస్తున్నది అసలు చిక్కంతా.. అక్కడే ప్రశాంతత పోతున్నది. ఘర్షణ మొదలవుతున్నది.
ఇద్దరి మధ్య చర్చలు పోయి వాదనలు పెరిగిపోతున్నాయి. ఇద్దరిలో అంతర్యుద్ధం జరుగుతున్నది.
అతన్ని మార్చడానికి ఆమె ప్రయత్నించలేదు. అతను మారమన్నట్టు మారడానికి సిద్ధంగా లేదు. అది సహజీవన సూత్రాలకు వ్యతిరేకం.
ఇద్దరూ కలసి నడవాల్సిన చోట, సామరస్యంగా బతకాల్సిన వాళ్ళు ఒకరినొకరు నియంత్రించుకోవడం, బందించుకోవడం ఏంటి ?
అట్లాగని స్త్రీత్వం కాపాడుకునే పేరుతో తన జీవన విధానాన్ని వదులుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు.
అతనితో రాజీపడిపోయి సర్దుబాటు చేసుకోవడం ఆమెకు నచ్చడం లేదు. అది ఆమె స్వభావానికి విరుద్ధం.
ఎన్ని ఆటుపోట్లయినా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటుంది కానీ అతన్ని ఆకర్షించడం కోసం , అతని కోరికలు తీర్చడం కోసం, అతని సంరక్షణలో ఉండడం కోసం, అతనిచ్చే సౌకర్యాలు పొందడం కోసం , జీవిత శ్రేయస్సుకోసం తనను తాను చంపుకోలేదు. మనసును చంపుకుని మొహంపై నవ్వు పులుముకుని యాంత్రికంగా బతకలేదు. నటించడం చేతకాదు.
తన సంరక్షణలో తానుంటుంది. తన ఆత్మగౌరవం తాను నిలుపుకుంటుంది. తాను స్ఫూర్తి నింపుకుంటుంది.
సమాజం నుండి , కుటుంబం నుండి ఒత్తిడి ఉంటే ఉండొచ్చుగాక . ఆందోళన పడదు. చింత పడదు. అన్నిటిని అధిగమిస్తూ దృఢమైన చిత్తంతో లక్ష్యం కేసి సాగుతుంది.
అతని ప్రేమ లేకపోయినా బతక గలదు. నాకు నేను ఏర్పరచుకున్న నియమాలకు లోబడి ఉంటాను కానీ అతను ఏర్పరచే నిబంధనలు అమలుచేయను మరోసారి తనకు తాను చెప్పుకుంటూ పక్కకు ఒత్తిగిల్లింది నిష్కల. వాక్సిన్ వేసిన చెయ్యి కొద్దిగా నొప్పిగా ఉండడంతో మరో వైపుకు తిరిగింది.
ఒడ్డు దరి లేని గడచిన కాలపు ఆలోచనల ప్రవాహంలో ఆమె కొట్టుకుపోతున్నది.
ఎన్నిసార్లు చెప్పినా అంకిత్ లో మార్పు రాలేదు. పదే పదే పిల్లల ప్రస్తావన తెస్తూనే ఉన్నాడు.
పిల్లలు వద్దనే నువ్వేం ఆడదానివి అంటూ పరుషంగా మాట్లాడి చెప్పా పెట్టకుండా ఆమెను వదిలి వెళ్ళిపోయాడో రోజు.
అతని మాటలు, ప్రవర్తన నిష్కలను చాలా బాధించాయి. బాగా హార్ట్ అయింది.
సహజీవనం కోసం చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని బాధపడింది.
పెళ్లి, సహజీవనం ఏ బంధంలో ఉన్న మగవాడు మగవాడేగా ..
అతని హృదయ లోతుల్లో ఉన్న ఆలోచనలు బయటికి వస్తూ ఆమెను భయపెడుతున్నాయి. ముందుకు వెళ్లనీకుండా అడ్డుపడుతున్నాయి.
ఇప్పుడే ఇలా ఉంటే రేపటి రోజు అతనితో బంధం ఎలా ఉంటుందో..
కరుణ భర్త కరణ్ అనుకున్నట్లు అంకిత్ కూడా అనుకుంటున్నాడు.
పిల్లలు పుడితే చచ్చినట్లు అతనితోనే ఉంటానని అతని అభిప్రాయమా.. లేకపోతే అతన్ని కాదని మరొకరితో సహజీవనం లోకి వెళ్ళిపోతానేమోనన్న భయమా..
సందేహం మొలిచింది ఆమెలో.
ఏమో.. అవునని చెప్పలేను, కాదని అనలేను అనుకున్న ఆమెకి ఆలోచిస్తున్న కొద్దీ అతని ఆంతర్యం స్పష్టంగా అవుననే బోధపడింది.
ఏదేమైనా పిల్లల పేరుతో తన చుట్టూ గోడలు పేరుస్తున్నాడని అర్ధమవుతున్నది. ఆ పేరుతో తనని కట్టడి చేయాలన్న వ్యూహం స్పష్టమైంది.
అతని ఆలోచనే ఆమెకు నచ్చలేదు. పిల్లల పేరుతో తన స్త్రీత్వాన్ని కించపరచడమే నచ్చడం లేదు.
సహజీవనం లోకి రాకముందే చెప్పిందతనికి తన గురించి ఇరవై నాలుగు గంటలూ స్త్రీత్వాన్ని మీదేసుకుని తిరిగే స్వభావం తనది కాదని.
అప్పుడు నాలోని భిన్నత్వాన్ని ప్రేమించిన అతను ఇప్పుడు అదే భిన్నత్వాన్ని ప్రేమించలేకపోతున్నాడు. దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తనుకాని ప్రపంచపు కళ్లజోడులోంచి చూస్తున్నాడు. స్త్రీత్వం లేదని ముద్ర వేస్తున్నాడు .
అసలు స్త్రీత్వం అంటే ఏంటి ?
శారీరకంగా పైకి కనిపించే లక్షణాలా ..
ముక్కు మొహం , నడక , బట్టలు , అలంకరణ ఇవన్నీ స్త్రీత్వానికి ప్రతిబింబాలా .. అందమైన చీరలు , నగలు , జుట్టు
పుట్టినప్పుడు స్త్రీత్వం వస్తుందా .. లేక తర్వాత అలవరచుకుంటున్నామా ..
స్త్రీత్వమంటే అతనికి విధేయంగా ఉండడమా .. అతనేం మాట్లాడినా శాంతంగా ఉండడం , అతనితో మర్యాదగా ప్రవర్తించడం , గౌరవించడం .. అతనికి సిన్సియర్ గా ప్రేమించడం … అదేనా?
ఆమెకు ఆలోచనలు , భావోద్వేగాలు ఉండవా.. వాటిని వ్యక్తీకరించకూడదా ..
ఆమెకు ఆ స్వేచ్ఛ లేదా .. తన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి కనే పిల్లల్ని ఎప్పుడు కనాలో ఆమె నిర్ణయించుకో కూడదా ..
ఆమెకు ఆత్మ గౌరవం ఉండకూడదా ..
నాకు నాపై గౌరవం ఉంది. నా శరీరం పై ప్రేమ ఉంది. నాపై నా నిర్ణయాలపై నమ్మకం ఉంది . నేను ఉన్న పరిస్థితులపై అవగాహన ఉంది.
నా జీవితంలో ఎదురైయ్యే పరిస్థితులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను .
అదే విధంగా నాకు నచ్చని, నా తత్వానికి విరుద్ధంగా జరగడాన్ని ఎదుర్కోవడానికి సిద్దమే .
నా ప్రశాంతతను చెదరగొట్టే , బెదరగొట్టే, రెచ్చగొట్టే అతని తీర్పరి తనాన్ని అంగీకరించలేను.
నా భావోద్వేగాలను అస్థిరపరిచి నాతో ఆడుకోవాలనుకుంటున్న అతని స్వభావాన్ని ఒప్పుకోలేను .
అతనికి నేను అస్థిరంగా ఉంటే ఆకర్షిస్తా . సానుభూతి కురిపిస్తాడు.
సాఫ్ట్ గా సున్నితంగా ఉండాలి . ఒక చట్రంలో బందీనై ఉండాలి. అప్పుడు నన్ను ప్రేమిస్తాడు.
నా సహజమైన స్వేచ్ఛభిలాష అతన్ని ఇబ్బంది పెడుతున్నది. ముల్లులా గుచ్చుకుంటున్నది.
నా కాన్ఫిడెన్స్ , దృఢత్వం , దుడుకు స్వభావం , తెగింపు , స్వేచ్ఛ భావనలు , ఒక విషయం పై ఉన్న ఖచ్చితమైన అభిప్రాయాలు , వాటి వ్యక్తీకరణ , సాహసోపేతమైన నిర్ణయాలు ఆనాడు అతన్ని ఆకర్షించాయి .ఒకప్పుడు చాలా గొప్పగా కనిపించాయి. అరుదైన వ్యక్తిత్వం అని పొగిడేలా చేశాయి.
నా వెంట పడి ప్రేమించానన్నాడు. తన మాటలు అతని భావ వైశాల్యాన్ని పెంచాయన్నాడు.
ఇప్పుడు అవే లక్షణాలు నా నుండి దూరం జరగడానికి కారణం అయ్యాయి. అప్పుడు, ఇప్పుడు నేను నేనుగానే ఉన్నాను.
వ్యక్తిగా అతని ఆలోచనల్లో, విధానాల్లో మార్పు అతనిలో . చేసుకున్న బాసలకు కట్టుబడిలేని తనం అతనిలో ..
కొత్త వ్యూహాల్లో , ఎత్తుగడలతో తన మనసు మార్చే ప్రయత్నం కొనసాగిస్తున్నాడు.
ఇప్పుడు నాలో మనిషితనం బదులు స్త్రీత్వం కోసం వెదుకుతున్నాడు.
అంకిత్ కూడా మాములు మనిషే. అందరిలానే బయటికి కనిపించే శరీరాన్ని తప్ప లోపలి తనని చూడలేక పోతున్నాడు.
మహిళలంటే తన ఇష్టాయిష్టాలు త్యాగం చేసి , భర్త , పిల్లలు , కుటుంబం కోసం బతుకుతారు. నీలో అవి మచ్చుకైనా కనపడడవు ..
కోమలత్వంతో ఉండే నీలో ఇంత కఠినత్వం ఎక్కడ నుంచి వచ్చాయి..
ఆడవాళ్లు అష్టావధానం చేస్తారు కదా .. నీలో ఆ సామర్ధ్యం లేదా పిల్లలు వద్దంటున్నావు .. ఇలా సాగే అతని మాటలు వింటుంటే ఒళ్ళంతా గొంగడి పురుగులు పాకుతున్నట్టు ఉండేది నిష్కలకు.
పురుషుడిని ఆకర్షించడం , అతని లైంగిక కోరికలు తీర్చడం, అతనికి పిల్లల్ని కనడమే స్త్రీత్వమా .. అని ఆమెలో ఆమె మదనపడేది నిష్కల.
ఒకప్పుడు అతన్ని ఇష్టపడింది నిజమే. మాటలతో మెస్మరైస్ చేసే అతనితో కలిసి జీవితం పంచుకోవడానికి సిద్దపడింది.
ప్రాణంగా ప్రేమించే అమ్మకు తన సహజీవనం అంటే తెలియకపోతే విశదీకరించి ఒప్పించింది. ఎందుకు?
నలుగురు నడిచే దోవలో కాకుండా భిన్నంగా అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్న అతని తీరు నచ్చడం వల్లనే. అతని మాటల్లో నిజాయితీ ఉందని భావించడం వల్లనే. చేసుకున్న బాసలు మరచిపోడని, ఆచరణలో ఉంటాడని నమ్మకం ఉండడం వల్లనే. చిటారు కొమ్మనుండి దిగివచ్చి అతని చెంత చేరింది.
కానీ ఇప్పుడతను అంకిత్ లాగా లేడు. తనతో కలిసి జీవితం పంచుకుంటానని ముందుకొచ్చిన అంకిత్ కాదు.
అతనిలో మగ పెత్తనం వేళ్లూనుకుంటున్నది. తన ఆధిపత్యంలో నియంత్రణలో ఉంచుకోవాలని చూస్తున్నాడు.
ప్రేమ బంధం లో ఉన్న మైకం వల్ల ఇన్నాళ్లు ఒకరి లోపాలు ఒకరికి అగుపించలేదేమో…
కళ్లుమూసుకు పడుకున్న నిష్కల ఫోన్ మెస్సేజ్ శబ్దంతో తల పక్కకు తిప్పి ఫోన్రా అందుకుంది. మెస్సేజ్ అంకిత్ నుండి.
అదేమిటో చదవకుండానే మళ్ళీ కళ్ళు మూసుకుంది.
అంకిత్ రూపం కళ్ళ ముందు ప్రత్యక్షమయింది.
ఒకప్పుడు అతనంటే ఆమెకెంతో ప్రత్యేకం. అతనిరాకకోసం ఎదురు చూసేది. అతని మాటకోసం తపించిపోయేది.
వారాంతం ఇద్దరూ తప్పని సరిగా కలిసేవారు. ఇప్పుడు ఎవరి దారిలో వారు.
అందరిలో అతడు కూడా ఒకడు అంతే.