ఒక్కొక్క పువ్వేసి-3

భారతక్రీడలు – కులజెండర్ వివక్షలు

  –జూపాక సుభద్ర

మగవాల్లు బలాడ్యులనీ, ఆడవాల్లు అబలులనీ అవమానకరంగా ప్రచారంచేస్తున్న ఆదిపత్యకుల మగ సమాజము ఒక్కసారి పొలాలకు, అడవుల్లకు పోయి పనిచేసే ఆడవాల్లను గమనించండి తెలుస్తది శ్రమ కులాల మహిళల ప్రతాపములు, బలాలు. పొలాల్లో మగోల్లకంటే ఎక్కువ బరువులెత్తేవాల్లు మగవాల్లకంటే ధీటుగా పనిచేసే మహిళలు కోకొల్లలుగా కనిపిస్తుంటరు. అడవిలో చెట్లు కొట్టగలరు, పెద్ద పెద్ద మొద్దులు మోయ గలరు. పులుల్ని, విషజంతువుల్ని గూడ వేటాడగలరు. వాల్లకు ఆరుబయలు, యిల్లు ఒకటిగానే వుంటయి ఆడవాళ్లు అబలలనీ, వంటింటి కుందేల్లని ఎవరన్నారు? ఆధిపత్య కులమగ సమాజమ్ (జనాభాలో5%) తమ ఆడవాల్లను వంటింటి వరకే పరిమితం చేసిన ప్రచారమిది. సమాజములో మెజారిటీగా వున్న శ్రమకులాల మహిళకు యిది వర్తించదనేది బైట శ్రమ జేసే మహిళలను చూస్తే అర్తమైతది.

ఆడవాల్లు మగవాల్లకంటే బలశాలురు, తెలివైనవాల్లనీ వారి వల్లనే భారత్ వెలిగిపోయిందనీ ప్రపంచక్రీడా వేదికల్లో నిరూపితమైంది. మన మహిళాక్రీడాకారులు భారతదేశ ప్రతిష్టను, విశిష్టతను పతకాలతో ఎగరేశారు. రియో ఓలంపిక్స్, టోక్యో ఓలంపిక్స్ క్రీడలు భారతదేశానికి ప్రత్యేకమైనవి. పోయినసారి రియో ఓలంపిక్స్ లో యిద్దరు మహిళలే పతకాలు (2) సాధించి భారతదేశ పరువుకాపాడినారు. ఈసారి వ్యక్తిగత క్రీడలే కాకుండా హాకీ లాంటి జట్టు క్రీడల్లో కూడా మహిళలు ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబర్చడము గొప్ప విషయం.

ఆడపిల్లలకు ఆటలెందుకు? అని కుటుంబంలో సమాజములో ఆంక్షలు అడుగడుగునా ప్రతిబంధకాలే మహిళలకు. ప్రభుత్వాలనుంచి, పౌర సమాజాల నుంచి కూడా ప్రోత్సాహకాలుండయి. ఆటలంటే మొగవాల్లయి. ఆడపిల్లలకు

సంబoధం లెనివనే అభిప్రాయాలు పితృస్వామిక కుల వ్యవస్థ బలంగా నాటింది. ఆటలు మగ పర్యావరణం చేసింది. కానీ యీ మగ క్రీడాకారులు సాధించింది చెప్పుకోదగ్గ ఫలితాలేమి లేవు దేశానికి. స్వాతంత్రానికి పూర్వం (1900) నుంచి యిప్పటిదాకా ఓలంపిక్స్ క్రీడల్లో భారతస్థానము 58వది. అప్పట్నించి యిప్పటిదాకా వేలమంది మగధీరులు, గండర గండలు భారత్ కి సాధించిన పతకాలు కేవలమ్ ఇరువై ఏడు పతకాలు. మహిళలు కేవలం ఇరువై ఏండ్లనుంచి ఆడుతూ ఎనిమిది (8) పతకాలు సాధించిన ఘనత. అయినా మహిళా క్రీడాకారులకు ప్రోత్సాహము అంతంత మాత్రంగానే అందుతుంటది.

నిజానికి ఓలంపిక్స్ మొదలైందే కేవలం పురుషులతో, తర్వాత్తర్వాత మహిళా క్రీడాకారులు చేరిండ్రు. యిక భారత దేశానికి వస్తే ప్రపంచ క్రీడల్లోకి క్రీడాకారిణులు ఆడడము రెండున్నర దశాబ్దాల ముందునుంచే. యిప్పుడిప్పుడే భారత క్రీడా కారిణుల సంఖ్య పెరుగుతున్నది. పోయిన రియో ఓలంపిక్స్ కి 21 మంది మహిళలు వెళితే
ఈసారి 57 మంది మహిళలు వెళ్లడము కొంత శాజనకము.

‘ఆడవాల్లు ఏమాడుతారులే’ అనే చిన్న చూపున్న భారత సమాజానికి ప్రపంచ క్రీడల్లో ఒక్క మెరుపు మెరిసి భారతదేశానికి పతకాలు సాధించే దిక్కయినారు భారత క్రీడాకారిణులు. క్రికెట్ తప్ప మరో ఆట ఈ దేశానికి కనబడది. యితర ఆటలన్నీ అనామకం చేయడం వల్ల ప్రపంచక్రీడల్లో భారత్ పరువుపోతున్నది
58వ ర్యాంకు లో నైనా నిలబడడం మహిళా క్రీడాకారులవల్లనే అని గుర్తించాలి.

ఆడపిల్లలు క్రీడారంగంలో ఎదిగొచ్చే అవకాశాలుండయి పాఠశాలల్లో ఆడుకోడానికి స్థలాలుండయి. వారినికోసారి వుండే ఆటల పీరెడ్ లు. పీటీ టీచర్లుండరు, ఆటలకు కనీస సౌకర్యాలు లేని దేసమ్మనది. మార్కులు తప్ప వంటిండ్లు తప్ప, కూలినాలి శ్రమ తప్ప మైదానాల్లో మహిళలకు ఏం పని? అనే సామాజిక స్థితి, పాలకుల నీతి.


‘ఆడవాల్లు ఆటలు ఆడకూడదు’ అనే అడ్డంకులు కుటుంబమ్ నుంచి, వూరినుంచి వాడనుంచి వున్నా…. ఆర్థిక, హార్థిక ప్రోత్సాహాల్లేక పోయినా అనేక కష్టనష్టాలకోర్చి ప్రాంతీయంగా, జాతీయంగా నెగ్గుకొచ్చి అంతర్జాతీయ క్రీడావేదికలకు చొచ్చుకొచ్చిన క్రీడాకారిణుల ప్రతిభ సామాన్యమైనది కాదు. భారత జాతి గర్వించదగింది అని భారత ప్రధానమంత్రి కూడా మహిళల ప్రతిభను మెచ్చుకున్నాడు. వాస్తవానికి పతకాలతో భారత్ ని మెరిపించి మురిపించిన క్రీడాకారిణులంతా సామాజికంగా అభివృద్ది చెందిన కుటుంబాల నుంచి వచ్చిన మహిళలేమికాదు.

వీల్లంతా అన్నీ అమరిన సామాజిక నేపథ్యాలున్న మహిళలు కాదు. మహిళల హాకీజట్టు కెప్టెన్ రాణి రాంపాల్ తండ్రి రిక్షా కార్మికుడు. రెండు పూటల కడుపు నిండ తినడానికి తిండి దొరుకుతదని హాకీ కర్రపట్టింది. టోక్యో ఓలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకము సాధించిన మీరాబాయి చాను ఆదివాసి మణిపూర్ మాణిక్యమ్. అడవికెళ్లి మొద్దులు మోసి మోసి వెయిట్ లిఫ్టర్ అయింది.
వూరికి రోడ్డు కూడా లేని బాక్సర్ లవ్లీనా బొర్గోహెయిన్ ఆదివాసి మహిళ .బాక్సర్ గా అనేక ఆటుపోటుల్ని దాటుకొని పతకమ్ కొట్టింది. మహిళా హాకీ జట్టులో హ్యట్రిక్ గోల్స్ కొట్టి …. హాకీ క్రీడను ప్రతిభావంతంగా ఆడిన తొలి భారతీయ క్రీడాకారిణి వందనా కటారియా కులంపేరుతో దూషణలను,
ఎగతాలిని, అవమానాలను ఎదురుకన్నది. ‘మహిళా హాకీ జట్టులో దళితులెక్కువ వున్న కారణంగానే ఓడిందనీ, క్రీడల్లో దళితులుండడానికి వీల్లేదనీ దూషిస్తే కేసులేదు.
అంటే…. ఇన్నాళ్లు భారత ఆటగాల్లుగా వెల్తుంది, పతకాలు తేకుండా దేశానికి అపకీర్తి తెస్తున్నది ఆధిపత్యకుల మగవాళ్లేనని అర్థమైతుంది. సాటి క్రీడా కారిని మీద ఇంత కుల దూషణ జరిగినా క్రీడా సంగాలు, క్రీడా ఉద్దండులు కూడా మాట్లాడకపోవడం శోచనీయం.

*****

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.