కథన కుతూహలం -3
– అనిల్ రాయల్
ఎండు చేపా, ఎండు చేపా, ఎందుకున్నావు కథలో?
అనగనగా అప్పుడెప్పుడో పూర్వకాలంలో, అదేదో దూరదేశంలో కుక్కలకి వేట నేర్పటానికో పద్ధతి పాటించేవాళ్లు. ఫలానాదాని వాసన చూపిస్తే దేవులాడుకుంటూపోయి దాని ఆచూకీ పట్టేయటం శునకరాజావారి పని . కానీ ఆ ఫలానా వాసనకన్నా ఘాటైన పరిమళమేదో వాతావరణాన్ని కమ్మేస్తే రాజావారి పరిస్థితేంటి? కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనైనా అసలు వాసన మీదనే మనసు లగ్నం చేసేలా జాగిలాలకి తర్ఫీదునీయటం ముఖ్యం. అందుకోసం శిక్షణాప్రాంగణాన్ని ఎండుచేపల తీవ్రాతితీవ్రమైన సుగంధంతో ముంచెత్తేవారు. ఆ కంపుదెబ్బకి దారితప్పుతుందా, లేక ఆనవాలు వాసనే ఆఘ్రాణిస్తూ పోయి ఆచూకీ కనిపెట్టేస్తుందా అన్నది పరీక్ష.
కథలు రాసే మెళకువలేవో దొరుకుతాయనొస్తే కుక్కల వేట చిట్కాలు ఎదురయ్యాయని కళవళపడకండి. ఈ ఉపోద్ఘాతమంతా కథారచనలో వాడబడే ‘రెడ్ హెర్రింగ్’ అనబడే ఒకానొక ప్రక్రియ గురించి.
‘హెర్రింగ్’ అనే ఒకరకం వెండి చేపని ఎండబెట్టి పొగలో పండబెడితే కాసేపటికది ఎర్రబారి ‘రెడ్ హెర్రింగ్’ అవుతుంది. అప్పట్లో శునక శిక్షకులు ఎలాగైతే ఈ యొక్క ఎర్ర హెర్రింగుతో కుక్కల్ని ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించ ప్రయతించేవాళ్లో, అలాగే కొన్ని తరహా కథల్లో పాఠకుడి దృష్టి అసలు విషయం నుండి మరెటో మళ్లించటానికి కథకులు రకరకాల ఎత్తులు వేస్తారు. ఇవి సాహిత్యానికి సంబంధించిన రెడ్ హెర్రింగ్స్. పాత్రికేయులడిగే ప్రశ్నలకి రాజకీయ నాయకులు పొంతన లేని సమాధానాలు చెప్పి అసలు సమస్యనుండి దృష్తి మళ్లిస్తారు చూడండి – అది రాజకీయెర్ర హెర్రింగన్న మాట. మనకి రాజకీయాల్తో సంబంధం లేదు కాబట్టి కథల్లో ఎండు చేపలెందుకో మాత్రం చూద్దాం.
అన్ని రకాల కథలకీ ఎర్ర హెర్రింగులతో అవసరముండదు. వీటి ఉపయోగం అపరాధ పరిశోధన, సస్పెన్స్, హారర్, మిస్టరీ తరహా కథల్లోనే ఎక్కువగా ఉంటుంది. సాధారణీకరించాలంటే – చిక్కు ముడులు విప్పే తరహా కథలకి ఎండు చేపలతో ఎక్కువగా అవసరం పడుతుంది. ఈ కథల్లో ప్రధాన పాత్ర ఓ సమస్య పరిష్కరించటానికి పూనుకుంటుంది. ఆ సమస్య ఓ హత్యో, దొంగతనమో, మరే నేరమో కావచ్చు; నిధి నిక్షేపాల ఆచూకీ కనిపెట్టటం కావచ్చు; ఏదో రహస్యం గుట్టు విప్పటమూ కావచ్చు. ఆ పని చేసే క్రమంలో ప్రధాన పాత్రకి పలు ఆధారాలు లభించటం, వాటినో క్రమంలో పేర్చుకుంటూ పోయి చివరికి చిక్కుముడి విప్పటం – స్థూలంగా ఇదే కథ. రెడ్ హెర్రింగులేమీ లేకుండానే ఇలాంటి కథలు రాసేయొచ్చు. అయితే అవి చప్పగా ఉండే అవకాశాలెక్కువ. చేప కూరకి మసాలా ఎంత ముఖ్యమో, చిక్కుముడి కథకి ఎండుచేపలు అంత ముఖ్యం. ఎందుకో చూద్దాం పదండి.
మిస్టరీ, క్రైమ్, డిటెక్టివ్ తరహా కథలు ఇష్టపడే పాఠకులు వాటిలో ఎదురయ్యే చిక్కు ప్రశ్నలు కథానాయకుడి కన్నా ముందు తామే పరిష్కరించాలని ఉబలాటపడతారు. వాళ్లు ఇటువంటి కథలు చదవటానికి సదరు ఉబలాటమే సగం ప్రేరణ. కానీ ఈ పాఠకులతో వచ్చిన చిక్కేమిటంటే – వాళ్లు ఇలాంటి కథలు విరగబడి చదివేసి కథానాయకుడికన్నా ముందే సమస్యని పరిష్కరించే స్థాయికి చేరిపోయుంటారు! వాళ్లు వాసన పట్టలేనంత పకడ్బందీగా కథ నడపాలి. ముగింపుదాకా రాకముందే మిస్టరీ విడిపోయిన కథ తుస్సుమన్నట్లే. కాబట్టి ఇలాంటి కథల్లో పాఠకుల్ని చివరిదాకా దారి తప్పించాలి. వాళ్లనుద్దేశించి కథలో కొన్ని తప్పుడు ఆధారాలొదలాలి. అవి ఎంత పక్కాగా ఉండాలంటే, అవే అసలు ఆధారాలనుకుంటూ పాఠకుడు వాటి వెంటబడి పరుగుతీయాలి. చివరికొచ్చాక తన తప్పు గ్రహించి నాలిక్కరుచుకోవాలి. ఈ నాలిక్కరిపించేవే రెడ్ హెర్రింగ్స్ లేదా ఎండు చేపలు.
రెడ్ హెర్రింగ్స్ ఎలా ఉండాలో చెప్పమంటే కష్టం. చాలా అపరాధపరిశోధనా కథల్లో ఓ పోలిక్కనిపిస్తుంది: ఓ నేరం; ఏ అరడజను మందో అనుమానితులు; నేరం చేయటానికి అందరికీ సహేతుకమైన కారణాలు, అవసరాలు. ఇది రెడ్ హెర్రింగ్‌కి ఓ మూస ఉదాహరణ. అయితే రెడ్ హెర్రింగ్ అంటే ఇలాగే ఉండాలనేం లేదు. నిజమైన ఆధారం నుండి పాఠకుడి దృష్టి మళ్లింపజేసేది ఏదైనా – అదొక అసందర్భ వ్యాఖ్య కావచ్చు, జోక్ కావచ్చు, మరోటి కావచ్చు – అది రెడ్ హెర్రింగ్ కిందకే వస్తుంది.
సాధారణంగా రెడ్ హెర్రింగ్స్ అనేవి కథ పూర్తిగా రాసిన తర్వాత వేసే తాలింపులు. అప్పటికి కథ ఓ రూపానికొస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ పాఠకుడి దృష్టిమళ్లించాలో రచయితకి అవగాహనొస్తుంది. అప్పుడు అవసరమ్మేర రెడ్ హెర్రింగ్స్ చల్లితే సరిపోతుంది. అయితే ఒకటి – పాఠకుడి దృష్టి మళ్లించటానికి రచయిత తోచినన్ని వేషాలేయొచ్చు, కానీ ఆ వేషాలు మితిమించకూడదు. మీరిచ్చే ఆధారాలు తప్పైనా ఒప్పైనా కథ పరిధిలోనే ఉండాలి, కథకి సంబంధించినవై ఉండాలి. మాన్య మంత్రివర్యులవారు సభలో ప్రతిపక్షం సంధించిన ప్రశ్నకి సంబంధం లేని అనర్ఘళ సమాధానమివ్వటాన్ని చూస్తున్న టీవీక్షకులకి ఎలా చిర్రెత్తుతుందో, రెడ్ హెర్రింగ్ అనుకుంటూ కథకి సంబంధంలేని చెత్తంతా రాస్తే చదివేవారికీ అలాగే చిరాకేస్తుంది. అవసరమైన వివరాలని కావాలని దాచిపెట్టి అనవసరమైన విశేషాలతో కథంతా నింపేసి చివర్లో అసలు సంగతి బయటపెట్టటం సరైన పద్ధతి కాదు. పాఠకుడికి ఎండుచేపలు ఎరవేయటానికీ, తొండిచేయటానికీ చాలా తేడా ఉంది. రెడ్ హెర్రింగ్స్ పని పాఠకుల్ని వక్రమార్గం పట్టించటం; వాళ్లని వెధవల్ని చేయటం కాదు.
కొన్ని రకాల కథల్లో రెడ్ హెర్రింగ్స్ ఉంటాయనే అంచనా ఉన్న పాఠకుడు కనబడ్డ ప్రతి ఆధారాన్నీ అనుమానంగానే చూస్తాడు. ఇలాంటివారిని బురిడీ కొట్టించటం కాస్త కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. దానికోసం కథకుడు చేయాల్సిందల్లా, అది రెడ్ హెర్రింగ్ అని అనుమానం రాకుండా, అతి సాధారణంగా కనపడే వాక్యాలతో పాఠకుడి దృష్టి మళ్లించటమే. అంటే, కథలో ఎండుచేపలున్నా వాటి వాసన తెలీకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. వ్యక్తిగతంగా – నా దృష్టిలో పాఠకుడిని పూర్తిగా తప్పుదారి పట్టించకుండా, అన్ని వివరాలూ సక్రమంగా అందిస్తూనే వాటి పూర్వోత్తర సంబంధాన్ని (context) మాత్రం స్పష్టపరచకుండా వదిలేసి, పాఠకుడి దృక్కోణాన్ని కాస్త పక్కకి జరిపే రకం రెడ్ హెర్రింగ్స్ ఉత్తమమైనవి, అత్యంత ప్రభావశీలమైనవి. ఇటువంటి కథలు మొదటిసారి చదివినప్పుడు ఓ రకంగానూ, context బోధపడ్డాక తిరిగి రెండోసారి చదివినప్పుడు మరోరకంగానూ కనిపించి పాఠకులతో ఔరా అనిపిస్తాయి. నా ‘శిక్ష’ కథలో ( లంకె: https://goo.gl/kVEZ3S ) ఈ విధమైన ఎండుచేపలు దండిగా ఉంటాయి గమనించండి. ఎర్ర హెర్రింగుల్ని కేవలం చిక్కుముడి కథల్లోనే కాదు, సందర్భం కుదిరితే ఎలాంటి కథలోనైనా దర్జాగా వాడుకోవచ్చు అనేదానికీ ఈ కథ ఓ ఉదాహరణ.
ఇదే కథలో నేను వాడిన మరో ప్రక్రియ గురించి మరో భాగంలో తెలుసుకుందాం.
గమనిక: కథల్లో రెడ్ హెర్రింగ్స్ వాడకానికి ఉదాహరణలీయటానికి చాలా గొప్పకథలున్నాయి కానీ, వాటిని విపులీకరించటం వల్ల ఆయా కథల ముగింపులు బయటపడిపోయే ప్రమాదముంది. అందువల్ల ఈ వ్యాసంలో వాటి జోలికిపోలేదు.
*****
(సారంగ, తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపు లలో ప్రచురితం-)
అనిల్ ఎస్. రాయల్ నివాసముండేది శాన్ ఫ్రాన్సిస్కో తీర ప్రాంతంలో. 2009లో ‘నాగరికథ’తో మొదలు పెట్టి 2021లో ‘Annie’ (ఆంగ్ల కథ) వరకూ పదకొండు కథలు రాశారు. అడపాదడపా మాత్రమే రాస్తుండే వీరి కథలు ఎక్కువగా సైన్స్, సస్పెన్స్ మేళవింపుతో నడుస్తుంటాయి. అనిల్ ఇతర కథల్లో కొన్ని: ‘రీబూట్’, ‘ప్రళయం’, ‘శిక్ష’, ”రాక్షస గీతం”.