కథా మధురం  

జొన్నలగడ్డ రామలక్ష్మి

‘ మహిళకి తన చదువే తనకు రక్ష …’ అని చాటి చెప్పిన కథ –  ‘నారీసంధానం! ‘

-ఆర్.దమయంతి

ఆడపిల్లకి చదువు చెప్పించడం కంటెనూ, పెళ్ళి చేసి పంపేయడమే అన్ని విధాలా శ్రేయస్కరమని భావించే తల్లు లు  ఆ కాలం లోనే కాదు, ఈ కాలం లోనూ వున్నారు. 

గ్రామాలలో అయితే ఇలా తలబోసే వారి సంఖ్య అధిక శాతంలో వుంటుందని చెప్పాలి. అయిన సంబంధం సిద్ధం గా వుంటే కనక, అమ్మాయి టెంత్ కాగానే పెళ్ళి చేసే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. కారణాలు –  ఆర్ధిక పరమైన ఇబ్బందులు కావొచ్చు, ఆస్తి పాస్తుల లింకులూ వుండొచ్చు. 

కారణాలేవైనా, పెద్దలు పెళ్లి నిర్ణయిస్తే  ఇక చదువుకి శాశ్వతం గా స్వస్తి చెప్పి,    తలొంచడమే తప్ప  ఆడపిల్లకి మారుమాట్లాడే అవకాశమే వుండదు.   అలా ఎంతమంది స్త్రీలు  చదువుల్ని త్యాగం చేసారో పెళ్ళి కోసం! ఎంతమంది వనితల మేధావి తనం కాలగర్భం లో మరుగున పడిపోయిందో, మట్టి కలిసిపోయిందో తెలీదు! ఎన్ని  స్వప్నాలు కరిగిపోయాయో ఎన్ని ఆశలు రెక్కలు విరిగి నేల కూలాయో! వినగలిగితే ఎన్నికన్నీటి కథలో!

కానీ, అలా తన కథ మాత్రం  విషాదం కాకుండా, అడ్డంకుల్నీ, అవరోధాల్ని తెలివిగా తప్పించుకుంటూ ముందుకు నడిచి,  విజయాన్ని సాధించిన   ఓ ధీర నారీ ఆసక్తి కరమైన కథే ఈ ‘నారీసంధానం.’ 

*****

అసలు కథేమిటంటే :

ఆమెకి బావ అంటే ఇష్టం. అతనితో పెళ్ళన్నా చాలా ఇష్టం. చదువంటే ఇంకా ఇంకా ఇష్టం. కానీ పెళ్ళి తర్వాత చదువు వుండదనే షరతు మాత్రం ఆమెకి కొరుకుడు పడదు.   

 ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం లో వున్న ఆ అమ్మాయి అందరనీ ఎదిరించి  ఓ స్థిర నిర్ణయం తీసుకుంటుంది. ఫలితం గా  ఇష్టమైన బావతో పెళ్ళి  కాన్సిల్ అయిపోతుంది. 

ఆమె చదువులో పడుతుంది.  

మరో మలుపులో తనని గాఢం గా ప్రేమిస్తున్న ప్రేమికుణ్ని కాదనలేకపోతుంది.  పెళ్ళి కి అంగీకరిస్తుంది.

తీరా కట్నం అడిగాడని వొద్దనుకుంటుంది పెళ్ళిని.

కానీ వరుడి మాటలు నమ్ముతుంది. తీరా పెళ్ళయ్యాక కట్నం డిమాండ్ చేయడం చూసి విస్తుపోతుంది. 

ఓ యేడాది గడువు పూర్తి అయ్యాక , ఆమె ప్రామిస్ చేసినట్టు కట్నం డబ్బు అతనికి అప్పచెబుతుంది. కానీ తను కాపురానికి రావడానికి మరో గట్టి ముడి వేస్తుంది. ఆమె షరతు విన్న అతని ముఖం నల్ల మబ్బు లా మారిపోతుంది. 

ఇంతకీ ఆ కొత్త పెళ్ళి కూతురు ఏమంది? అతనేం విన్నాడు? విన్నాక, ఎందుకు ఖంగుతిన్నాడు? 

ఈ ప్రశ్నలన్నిటికి   అందమైన సమాధానంగా నిలిచిన కథ – ‘నారీసంధానం!’ తప్పక చదవండి.

*****

కథలోని స్త్రీ పాత్రలు, విశిష్ట లక్షణాలు :

నారీ పాత్ర :  

* అమ్మాయికి చదువు ముఖ్యమా? పెళ్ళి ముఖ్యమా?

తన కథ చెప్పుకుంటున్న ఈ నారీమణి అందమైన అమ్మాయి మాత్రమే  కాదు. మంచి అమ్మాయి కూడా!  ఈ రెండు లక్షణాలతో  ఆమె జీవితం సంపూర్ణమైపోయేదే! కానీ,  మరో లక్షణం అలవడం తో చిక్కులొచ్చి పడతాయి. అదేమిటంటే – ఆమెకి చదువంటే ఇష్టం. పిచ్చి ఇష్టం.   బావతో పెళ్ళి  బ్రేక్ అవడానికి కారణం కూడా సరిగ్గా ఈ ఇష్టమే కారణమౌతుందని  పాపం ఆమెకీ అప్పుడు  తెలియలేదు. 

ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ కన్నె కలువ కి  ఇటు అందమైన కాలేజ్ లైఫ్ తో బాటు,  బావ చెప్పే తీపి  ఊసులతో ఆమె ఊహాల జగత్తులో ఆనందం గా తేలియాడుతుంతుంది.   

కన్నె పిల్లలకి ఈ ప్రేమ కాలం  ఎంత మధురం గా వుంటుందంటే ఆకాశం లో జాబిలి అరచేతికి అందినంత గొప్ప గర్వం గా వుంటుంది.  

 కానీ, సమయం వస్తే కానీ, నమ్మిన మగాని అసలు స్వరూపం బయటపడదన్నట్టు.. 

కొంతమంది మగాళ్ళు పిరికి వాళ్ళు. ప్రేమ కోసం పడి చస్తారు కానీ, పెళ్లికి పెద్దల మాటని జవదాటలేరు. ఆమె బావ కూడా అంతే. 

పెళ్ళి అయ్యాక చదువు కి స్వస్తి చెప్పి కాపురానికి రావాలి అనే అత్తయ్య జారీ చేసిన ఉత్తర్వు కి ఆమె సూటిగా జవాబిస్తుంది. అంతే.  అక్కడితో సరి. పెళ్ళి రద్దౌతుంది.

ఎంత బాధ కదూ ఆడపిల్లకి జీవితంలో తొలి ప్రేమ వైఫల్యాన్ని  తట్టుకోవడం!

ఆడపిల్లల మానసిక క్షో భలు  అందరూ చదవలేరు. అర్ధం చేసుకోలేరు.  ఓదార్చలేరు. ఆ మాట అలా వుంచి పైపెచ్చు ,  ‘ ఎందుకు ఏడుస్తావ్? చెబితే విన్నావ్? చేతులారా బంగారం లాటి సంబంధాన్ని  జారవిడుచుకున్నావ్?   ఖర్మ. అనుభవించు.’ అని నాలుగు మాటలని పోతారు.  ఎవరో బయట వాళ్ళు కాదు. ఇంట్లో వాళ్ళే. ఆడవాళ్ళకి  ఇంటా, బయటా ఇద్దరు శతృవులుంటారు. వెంట వుండి మరీ వెంటాడుతుంటారు. 

* ఎవరేమన్నా, ఎదురీది గెలవాలి అంటుంది..

అయితే – కథలో ఈ నారి ధైర్యంగానే ఎదుర్కొంటుంది ఈ తీవ్ర పరిస్థితిని. ఎంతో ఇష్టపడిన బావతో పెళ్ళి తప్పిపోవడం తీవ్ర విషాదకరమే అయినా, ‘ బావ తన కోసం..అత్తయ్యని ఆ మాత్రం ఎదిరించలేకపోయాడే!’ అనే వాస్తవికత బహుశా  ఆమె బాధని న తగ్గించేసి వుండొచ్చు! ( అని నా అభిప్రాయం.) 

ఆమె బ్లాక్ అండ్ వైట్ కలలకి అతని కవ్వింపు  మాటలే ఈస్ట్మన్ కలర్స్ అవుతాయి. ‘ఆ రంగులన్నీ కొట్టుకుపోయాక..నిజమిదని తెలిసాక ఏ ఆడపిల్లా ఇక  దుఃఖించాల్సిన అవసరం వుండదు. –  అనే గట్టి ఓదార్పు నిస్తుంది.  

ఒకసారి వొద్దనుకున్నాక, ఇక ఆ వ్యక్తి మీద కానీ, జరగనిది జరిగి వుంటే ఎంత బావుణ్నో అనే తెలివితక్కువ ఆలోచనలు కానీ వుండకూడదని సూచిస్తుంది. 

* మనో విశ్లేషణ తో అనవసరమైన ఒత్తిళ్ళని దూరం చేసుకోవాలి..

 ఏ స్త్రీ జీవితం లో అయినా ఇలాటి సంఘటనలు జరిగినప్పుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ‘జరిగిన దాంట్లో  నా  పాత్ర ఏమిటి? అందుకు నేనెంత బాధ్యురాలినయ్యాను? తీసుకున్న నిర్ణయం తప్పా? ఒప్పా? ఇక పై ఏం జరిగినా అందుకు పూర్తి బాధ్యురాలిని నేనే..’    అనే మనోవిశ్లేషణ  చాలా అవసరం. ‘ అని చెప్పిన ఈ పాత్ర స్వభావ చిత్రీకరణ  ఎంతైనా ప్రశంసనీయం.

* నిందలను తిప్పి కొట్టే గట్టి జవాబు నీ చేతిలో వుండాలి :

ఈ సందర్భం గా తల్లి  ఆమెని నిందిస్తున్నప్పుడు ఎంతో నిబ్బరం గా జవాబు చెబుతుంది నారీ..’  బావతో పెళ్ళి ని  నేను వొదులుకోలేదు..వాళ్ళే నన్ను వొదులుకున్నారు..’  అని నిర్భయం గా జవాబిస్తుంది.   ఆమె మాటల్లో ఎంత నిబ్బరత్వమో! 

* పెళ్ళి తప్పిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోదు..

ప్రేమించిన వాడు వొద్దన్నాడనో , తాంబూలాలు రద్దయ్యాయనో,   మోజు తీరాక  అతను మరో ఆమె తో పెళ్ళికి సిధ్ధమయ్యాడనో .. ఇలా చాలా మంది యువతులు  ఆత్మహత్యలకు పాల్బడుతుంటారు..అలాటి బేలలకు బలమైన ఆధారం లా నిలిస్తుంది ఈ నారి. 

అంతే కాదు, ఆడపిల్లల చదువుని అడ్డుకునే ఏ శక్తి ఎదురైనా, ధైర్యం గా ఎదిరించి తీరాలి అంటుంది. ఎందుకంటె స్త్రీ కి చదువు వల్ల కలిగే జ్ఞానం   వెన్నంటి నిలిచే నిధి లాటిదనే గొప్ప సందేశాన్ని  అందచేస్తుంది.

* స్త్రీ కి పెళ్ళి ఎంత ముఖ్యమో చదువు అంతకంటే ముఖ్యమైనది..

స్త్రీలకి  జీవితం లో పెళ్ళి ముఖ్యమా? చదువు ముఖ్యమా అనే ప్రశ్నకి..సాధారణ స్త్రీలకి మల్లేనే ఈ  నారి కూడా పెళ్ళికే ప్రాధాన్యత ఇచ్చింది. 

పెళ్ళయ్యాక కూడా చదువు కొనసాగింపు…చదువయ్యాక కాపురం ‘ అనే తన భవిష్య ప్రణాళికని  వివరిస్తుంది బావకి.

యుక్త వయస్సులో ని ఆడపిల్లలు   కేవలం ఊహాలోకం లో ప్రియునితో విహరించడమే కాదు,  ప్రాక్టికల్ లైఫ్ పట్ల కూడా ఓ ఖచ్చితమైన అవగాహనని  కలిగివుంటం కూడా చాలా అవసరమని స్పష్ట పరచిన పాత్ర.. ఓ గొప్ప మెలకువైన సందేశాన్ని  అందిస్తుంది.  

* స్త్రీకి ఆర్ధిక స్వేచ్చ కేవలం విద్య వల్ల మాత్రమే సాధ్యమౌతుంది!

ఇంతకీ  ఈమె గారు అమెరికా బావతో పెళ్ళి వొద్దనుకుని,  చదువయ్యాక  ఏం చేస్తుందట? ఎవర్ని ఉద్ధ్హ్దరిస్తుందట? అనే చాదస్తపు వాదులకు ధీటుగా నే జవాబిస్తుంది. 

‘నేను చదువుకునేది  నన్ను నేను ఉద్ధరించుకుని, వెలిగిపోడానికే ‘ అని  శుభ్రంగా, ధీటుగా జవాబిస్తుంది .  పెళ్ళాయ్యాక భర్త తో సమాన సంపాదన ఆర్జించాలనే కోరిక తనలో బలం గా వుందని బాహాటం గానే ఒప్పుకుంటుంది.  ఈ తరం ఆధునిక స్త్రీ  ఆర్ధిక స్వేచ్చ లేకుండా మనలేదనడానికి ఈ పాత్ర ఓ సోదాహరణ గా పేర్కొనక తప్పదు. 

* తమ పురోగతికి బంధాలు సంకెళ్ళు అయితే తప్పించుకోవాల్సిందే! 

స్త్రీలు ఆర్ధికంగా భర్త మీద ఆధారపడటాన్ని ససేమిరా ఇష్టపడరు. ‘It’s an outdated reality that men are providers and women are spenders.. ‘ అని అంటారు ఓ విశ్లేషకుడు.

‘ నీ చదువు ఇక్కడితో ఆపేయ్. ‘anO, ‘నువ్వేం ఉద్యోగం వెల గ బెట్టఖర్లేదు. ఇంట్లో వుండి పిల్లలని చూసుకో చాలు..’ అనే ఆంక్షలు ఇక చెల్లవు అని చాటి అని చాTi chebuతున్న  ఈ తరం స్త్రీ కి ప్రతీక ఈ పాత్ర..

ఆఫ్ఘనిస్తాన్ స్త్రీలు  ప్రాణాలని సైతం ఎదురెడ్డి  పోరాడుతున్నదీ అందుకే!  స్త్రీ లకి విద్య, ఆర్ధిక స్వేచ్చలు గనక కొరవడితే ఆ జీవితం నరకప్రాయం.. 

 నారీ కూడా అదే సత్యాన్ని తన మాటల్లో వెల్లడిస్తుంది. తను ఇంజినీరింగ్ చేసాక,  ఉద్యోగం  సంపాదించి తన కాళ్ళ మీద తాను నిలబడాలని గాఢం గా కోరుకుంటుంది.   ‘సంపాదనలోనూ భర్తతో సమంగా ఉండాలన్న నా కోరిక- నన్నిష్టపడ్డ బావని కూడా కాదనేలా చేసింది..’ అంటూ అసలు విషయాన్ని కూడా బహిరం గా  ప్రకటిస్తుంది. 

 *  చదువు మీద ఏకాగ్రత సడలిపోరాదు.. 

 యుక్త వయసులో ఆడపిల్లలు –  ఎన్ని ఆకర్షణలకు లోనయినా,     ప్రేమ లో   ఓడినా, గెలిచినా..ఆ ప్రభావాలు చదువు మీద పొడసూపకూడదు.  చదువు మీద ఫోకస్డ్ గా వుండాలనే గొప్ప నీతి పాఠాన్ని నేర్పుతుంది ఈ నారి.  ఈ పాయింట్ ని చాలా ముఖ్యాంశం గా బోధించబడింది నారీ పాత్ర ద్వారా అని చెప్పాలి.

అంతే కాదు. జీవితం లో ఒక లక్ష్యం అంటూ ఏర్పరుచుకోవాలి. ఆ సాధనలో ఎన్ని అవరోధాలు, అవమానాలు ఎదురైనా   మనోధైర్యంతో  అధిగమించాలి. అంతే కానీ, పరిస్థితుల మీద నెపాన్ని నెట్టి, కాంప్రమైజ్ కావొద్దు.  లోకమంతా ఒకటవ్వని. నువ్వు మాత్రం  కార్య సిధ్ధి కై ఒంటరి సైన్యమై  పోరాడాలి. విజయాన్ని చేజిక్కించుకోవాలి…అని  ధైర్యాన్ని నూరిపోసిన పాత్ర. యువతరానికి స్ఫూర్తి దాయకంగా నిలిస్తుందనడంలో ఎలాటి సందేహమూ లేదు. 

*   కాలేజ్ లో టీజింగ్ ఒక సవాల్..

 చదువుకునే ఆడపిల్లల పాలిటి టీజింగ్ ఓ పెద్ద గండం లాంటిది.. 

ఇంజినీరింగ్ పూర్తయే లోపు నారీ కి ఎంతమంది ప్రేమికులో వెంటపడతారు..మనోజ్..వరుణ్, ఇలా ఎందరో!  తెలివిగా జవాబులిస్తూ తప్పించుకుంటుంది.  కథలో వారితో సాగించే సంభాషణలు ఎంత ఆసక్తి కరం గా వుంటాయంటే..ఈ నారీమణిలా  జవాబు చెప్పడం నేర్చుకుని, టీజింగ్ బారి నించి  తప్పించుకోవాలన్నంత గొప్ప  స్ఫూర్తిని కలిగిస్తాయి.

రచయిత్రి  అన్నట్టు… ‘ ఏదైనా భయపడితే వేట. భయం లేకుంటే ఆట.’ నిజమే!  అందుకే నారి వాళ్ళనో ఆట ఆడించి గెలిచిందని చెప్పాలి. ఎలా రాణించిందో కథ చదివితే తెలుస్తుంది..

* ఏ స్త్రీకైనా జీవితంలొ అసలైన పరీక్ష మగాడే!

 జీవితమనే చదరంగం లో ఆట పూర్తయ్యేదాక తెలివిగా  ఆడాల్సిందే!  

ఏ స్త్రీకైనా  విద్య వల్ల, ఉద్యోగం వల్ల సంపూర్ణ సుఖ శాంతులు లభిస్తాయన్న మాట పూర్తిగా నిజం కాదు. కొందరి అభాగ్యుల విషయంలో అస్సలు నిజం కాదు అని చెప్పాలి. 

కథలో నారి మరో సారి ప్రేమలో పడుతుంది. ఆమెకి వికాస్ తో పరిచయం..స్నేహం గా మారి ప్రేమగా రూపుదిద్దుకుంటుంది. 

స్త్రీ మనసు తీగలాంటిది. తుఫాను గాలులకు వాలిపోయినా  తిరిగి లేచి నిలబడగలదు.. వడగాడ్పులకి ఎండి రాలినా..మరలా చిగురింపచేసుకోగలదు.  ఆ స్ఫూర్తి – స్త్రీలలో ఓ అసాధారణమైన అపూర్వ శక్తి గా పేర్కొనాలి.

కష్టాలకి అవమానాలకి కుంగి కన్నీరవడం గత కాలం నాటి స్త్రీల అబలత్వం..ఈ నాడు కన్నీరు చిందకుండా నిగ్రహించుకోవడం..చిరునవ్వుతో జీవితాన్ని గెలుచుకోవడం ఈ తరం నారీ మణుల దివ్య లక్షణం గా పేర్కొనాలి. 

 ఈ నారి ఇంజినీరింగ్  ఫైనలియర్ లో వుండం గా మరో సారి విష్ ప్రేమలో పడుతుంది. 

మొదటి చూపులోనో,  ప్రపోజ్ చేయం గానే  ఆమె ప్రేమలో పడదు.  అతని ప్రవర్తన పరిశీలించాక, నచ్చాకే ముందడుగు వేస్తుంది.  ప్రేమ గుడ్డిదంటారు. అందుకే కాస్త కళ్ళు తెరిచి నడవాలని సలహా ఇస్తుంది. 

ఇక్కడ మరొ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విష్ ఎవరో కాదు. తన బావకి తెలిసిన వాడే. బావ రికమండేషన్ తో నే ఆమెని పరిచయం చేసుకుంటాడు…

‘మీ బావ నాకు అంతా చెప్పాడు..’ అన్న విష్  మాటలకి  ఆమె ఏ  మాత్రం తత్తరపడదు. ‘బావతో తన పెళ్ళి ఆగిపోయిందనే నిజం ఇతనికి తెలిసిపోయింది..ఇప్పుడెలా అనే ఆత్మనూన్యతా భావాలు  వుండవు. పిరికితనం మాట అస్సలికే లేదు.  ఆ మాట కొస్తే, కాబోయే జీవిత భాగస్వామికి   గతం  తెలిసి వుంటేనే  మంచిదన్న సత్యాన్ని గ్రహించమంటుంది ఈ నారి.

  విష్ తో  అరమరిక లేని ఆమె స్నేహం అది  పెళ్ళి వరకు  దారి తీస్తుంది. ఇంతలో కొత్త ఉద్యోగమూ వస్తుంది. ఇక కథ అంతా సుఖాంతం అనుకునే లోపే..

సరిగ్గా పెళ్ళి కి ముందు  అతను కట్నం కోరిన సంగతి తెలుస్తుంది  తల్లితండ్రుల ద్వారా. 

అమెకి ఇదొక షాకింగ్ న్యూస్.

తనది ప్రేమ వివాహం. కట్నం ప్రసక్తి ఎలా వచ్చిందనేది ఆమె మొదటి ప్రశ్న. ఎందుకంటే ప్రేమలో డబ్బు ప్రసక్తి వుండకూడదనేది ఆమె స్థిర అభిప్రాయం. ప్రేమ స్వచ్చం గా వుండాలి. నీరు లా, గాలిలా, ఆకాశం లా. అలా కానప్పుడు ఓ అబధ్ధ ప్రేమికుడా! అసలు నీ ప్రేమా వొద్దు..నీతో పెళ్ళీ వొద్దు..; అని  తేల్చి చెప్పేయగల నిజాయితీ పరురాలు నారి.  

 అయితే వొద్దని పెళ్ళి రద్దు చేసుకోడానికి మునపటిలా,  బావతో పెళ్ళి వొద్దనుకున్నట్టు కాదు ఇప్పటి పరిస్థితి. విష్ తో స్నేహం, షికార్లూ..అన్ని  తన చుట్టూ వున్న సమాజానికి  తెలిసిపోయింది. కట్నం కోసం పెళ్ళి వొద్దనుకుంటే పరువు సంగతేమిటన్న తల్లి ఆవేదనని అర్ధం చేసుకుంటుంది.

ఆడపిల్లలు తల్లిని  బాగా అర్ధం చేసుకుంటారు.  లోకాన్ని సైతం ఎంత గా ఎదిరించి నిలబడిన  వారైనా, అమ్మ బాధపడితే చూడలేరు. అమాంతం కన్నీరౌతారు. అందుకే, ఆమె అయిష్టం గానే విష్ తో పెళ్ళికి అంగీకరిస్తుంది. 

 *  పెళ్ళి కి ముందు స్నేహం గా వుండే వారికి  హెచ్చరిక..

ఎంత ధైర్యం, స్థైర్యం గల ఆడవారైనా పుకార్లకు, అపనిందలకు  భయపడతారు.  సరిగ్గా ఈ జడుపునే  ఆధారం గా చేసుకుని చాలామంది దుర్మార్గులు బ్లాక్ మెయిలింగ్ కి తెగబడి లొంగదీసుకోవడం, వీడియో లు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం,  డబ్బు గుంజుకోవడం,  వ్వంటి దురాగతాలు జరుగుతున్నాయి సమాజంలో.  

‘పెళ్ళి కి ముందు మనం స్నేహం గా వుందాం ఒకర్నొకరం అర్ధం చేసుకునేందుకు అనే విష్ మాటలకి ఈ నారీ కూడా ‘సరే ‘ అని తలూపుతుంది. 

ఇలా తలూపేముందు  ఒకటికి  పది సార్లు ఆలోచించుకోమని పరోక్షం గా హెచ్చరిస్తుంది.

ఇవన్నీ ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటారు అని కొట్టేస్తాం కానీ..మనకు తెలిసిన వాళ్లల్లోనే వెతికి చూస్తే..ఆ అమ్మాయి ఎవరితోనో చెట్టాపట్టాలేసుకు తిరిగిందట మా మేనమామ కోడలు చెప్పింది అని ఒకరంటే.. ‘ అవును నేనూ చూసినట్టే గుర్తు..’అంటూ మరో మతిమరుపు మల్లమ్మ లేని కథని  అతికిస్తుంది..అలా అలా ఆ అమ్మాయి మీద ఒక ముద్ర పడిపోతుంది.  తస్మాత్ ఆడపిల్లలూ జాగ్రత్త! 

అనే సూచనప్రాయం గా సెలవిస్తుంది.

 * పెళ్ళి తో సమస్యలు తీరవు..నిజానికి అప్పుడే మొదలౌతాయి..  

ఎలా అయితేనేం…కట్నం ప్రసక్తి లేకుండా పెళ్లైతే జరిగిపోతుంది. 

కథ అక్కడితో ఆగలేదు. ఏ స్త్రీ జీవితం కూడా ఒక విషాద ఘటనతో, లేదా ఒక చేదు అనుభవంతో,  కష్టాలకి ఫుల్ స్టాప్  పడదు.   జీవితం కడ దాకా మలుపు మలుపులోనూ ఎన్నో సవాళ్ళు  ఎదురౌతూనే వుంటాయి.

ఈ నారి కి కూడా పెళ్లయాక అత్త గారు అడ్డుతగిలింది. కట్నం ఇచ్చాకే కాపురం అంటుంది. అతను తలొంచుకుంటాడు. మరి మంచి వాడు కదా..తల్లిని ఎదిరించలేడు.  

‘నాతి చరామి..’  అని ప్రమాణం చేసిన ఆ దేవుడు సైతం ఓ అల్పుని మాటలు విని  భార్యని విడనాడాడిన దేశం ఇది.  తల్లి మాట కోసం భార్యని దూరం గా వుంచిన విష్ ని చూస్తే  బాధ వేయలేదు  ఆమెకి

ఆమె తల్లితండ్రులు కట్నం డబ్బుని సమకూర్చుకోడానికి ఒక యేడాది సమయాన్ని కోరతారు. అలా కాపురానికి యేడాదిపాటు  దూరం గా వుంటారు ఆ ఇద్దరూ.

‘ఇంతలో అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తుంటా..’ అనే మొగుడి కి ఘాటైన మాటలతో చెక్ పెట్టి సెభాష్ కథానాయిక అనిపించుకుంటుంది. 

నాఇ తన నెల జీతాన్ని ప్రతి నెలా పొదుపు చేసి,  కట్నం డబ్బుని సమకూర్చి  అంద చేస్తుంది.

వరుడు సంతోషిస్తాడు..ఇక జీవితమంతా శోభాయమాయమనుకునే అతనినెత్తి మీద  మెత్తని చెప్పుతో గట్టి దెబ్బలే పడతాయి. 🙂 

ఆమె పెట్టిన షరతుకి అతని దిమ్మ తిరిగి మెదడు బ్లాక్ అయిందేమో..మాటలు రానివాడయ్యాడు.

ఇంతకీ ఈ నారి సంధించిన ఆ అస్త్రం ఏమిటి? అని తెలుసుకోవాలని వుంది కదూ? మీకు ఆ రహస్యం – కథ చదివాకే తెలుస్తుంది!

****

కథానాయిక తల్లి పాత్ర : ఈవిడ ఒక సాధారణ గృహిణి. మధ్య తరగతి కుటుంబీకురాలు. సాంప్రదాయ జీవన విధానానికి అంకితమైపోయిన స్త్రీ. ఇంటి పని, వంట పని తో పొద్దు సరిపోతుంది. 

 పంతులు ఉద్యోగం చేస్తున్న భర్త సంపాదనతో గుట్టుగా కాపురాన్ని ఎలా నెట్టుకురావాలనే    ఆలోచనలతో సతమతమయ్యే  ఓ మధ్య తరగతి కి చెందిన ఇల్లాలు. 

కూతురు   పెళ్ళయ్యే దాకా చదువుకోవచ్చు కాబట్టి చదువుకుంటోంది అని ఆమె గాఢమైన అభిప్రాయం . ఇంజినీరింగ్ కాలేజ్లో ఫ్రీ సీట్ సంపాదించుకున్న కూతురి గొప్పతనం  ఆమెకి తెలీదు. గుర్తించదు.  ఏడాదిలో పెళ్ళౌతుంటె నాలుగేళ్ళ చదువెందుకు దండగ  అని మొత్తుకునేంత అమాయకురాలు. 

ఈడొచ్చిన ఆడపిల్లకి చదువు కంటే  పెళ్ళి చేయడమే ముఖ్యం అని భావిస్తుంది. సొంత  ఆడబడుచు కొడుకుతో కూతురి పెళ్ళి జరగబోతోందంటే ఆ తల్లికి ఎంత సంబరమో. అయిన సంబంధం, తెలిసిన కుర్రోడు, పైగా ఇష్టపడి చేసుకుంటున్నాడు, కలిసిపోయి వుంటాడు. అప్పో సప్పో.. ఆ మూడు ముళ్ళు వేయించి పంపేస్తే ఇక హమ్మయ్య దాని  బాధ్యత తీరిపోతుంది. 

‘ఆడపిల్లను కన్నందుకు ఎంత తొందరగా పెళ్ళి చేసి పంపేస్తే అంత మంచిది అని భావించే నూటికి తొంభై శాతం మంది  తల్లుల్లో ఈమె కూడా ఒకరు.   

మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలూ చదువుకోవాలని  కానీ, తమ కాళ్ళ మీద తాము నిలబడ్డాకే పెళ్ళి చేయాలనే టువంటి పెద్ద పెద్ద వాక్యాలు .. కానీ తెలీని సామాన్యురాలు. 

ఆశపడిన సంబంధం చివరి నిముషం లో కూతురి తప్పిదం వల్ల  తప్పిపోయినందుకు ఆమె ఆడపడుచు ని ఏమీ అనదు కానీ, కూతుర్ని మాత్ర దెప్పి పడేస్తుంది. కూతురూ అదే బాధలో వుందని కానీ, నాలుగు మంచి మాటలతో ఓదార్చి, ఒడ్డుకేద్దామనే కరుణ కానీ  ఆమెలో అస్సలు కలగవు అంటె కారణం ఒకటే.. కూతురు – పెళ్ళి కి ప్రాముఖ్యత ఇవ్వకుండా పనికిరాని చదువుకి ఇంపార్టన్స్ ఇచ్చి చేతులారా జీవితాన్ని అగమ్యగోచరం చేసుకుంటోందని ఆవిడ బాధ.   

ఏ తరం లో ని తల్లుల్లో అయినా ఈ ఆలోచన సహజమే అయినా, సమర్ధనీయం కాదు అంటారు నేటి తరం. అందుకే ఈ నారి తల్లిని సైతం ఎదిరించి నిలిచింది. 

 ఆ తల్లి ఆలోచనలో ఇది మొదటి పొరబాటు అయితే,  ఆ తర్వాతి కాలం లో కూతుర్ని ప్రేమించిన విష్ కోరిక మేర  కట్నం ఇస్తాం అని మాట ఇవ్వడం ఆ తల్లి అమాయకత్వానికి  పరాకాష్ట లాంటిదని చెప్పాలి. 

ఈ విషయం పై కూతురు ఆవేశపడి, పెళ్ళి కాన్సిల్ చేసుకుంటా అంటే కంగారు పడి,  బ్రతిమలాడి, నచ్చచెప్పి,  ప్రయాస పడి  కూతుర్ని పెళ్ళికి ఒప్పిస్తుంది.  

కూతురు చదువుకుని,  సంపాదనా పరులు అయినా, ఆమె జీవితం మగాడి నీడలో మాత్రమే చల్లగా వుంటుందని, అందుకు కట్నం ఇవ్వడం నేరం కాదనే  ఓ అబద్ధపు నమ్మకంలో మగ్గిపోయే అనేకానేక మంది తల్లుల మనస్తత్వానికి ప్రతీక లా నిలుస్తుంది తల్లి పాత్ర. 

మన చుట్టూ వున్న సమాజంలో ఎందరో తల్లులను సునిశితం గా పరిశీలిస్తే తప్ప ఇలాటి పాత్రలను సృష్టించడం కష్టం. 

నారి అత్తగారి పాత్ర స్వభావం : 

కాబోయే కోడలు  ఎంత అందంగా వున్నా, ఉద్యోగస్తురాలే అయినా అవన్ని పక్కన బెట్టాల్సిన సంగతులు. మరి లెక్కలోకి రావాల్సిన విషయం ఏమిటంటే కట్నం. ‘ ఏం వదినో! కానీ కట్నం అయినా ఇవ్వలేదంట గా? నీ కొడ్డుక్కేమైనా కన్నొంకరా కాలొంకరా అంత కక్కుర్తి పడ్డావ్? అని ఎవరైనా నిలేసి అడిగి, పరువు తీస్తారని భయం కొందరి ఆడవాళ్ళల్లో లో బలం గా నాటుకుపోయి  వుంటుంది. 

కట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరాలే అనే ప్రభుత్వ ప్రకటనలు గాల్లో కలిసిపోడానికి కారణం ఇదిగో ఇలాటి మంకు పట్టు పట్టే అత్తలు వుంటం వల్లే అని చెప్పాలి.

విష్ తల్లికి కట్నం డబ్బు కంటే కూడా తన మాటే నెగ్గాలి అనే అహం పాలు హెచ్చు.   అత్త స్థానంలో వున్న  ఆ శాల్తీ అహం అప్పుడే చల్లారుతుంది.  అదే గనక జరగకపోతే ఇల్లు శ్మశానం చేసి పడేసేంత సమర్ధులు కొందరు అత్తలు.

పెళ్ళి తంతు పూర్తయ్యే వరకు.. కొడుకు తనని మానేజ్ చేసినట్టు గుర్తించిన అత్తగారు..కట్నం ఇస్తేనే పిల్ల కాపురానికి వస్తుందని తెగేసి చెప్పిందంటే.. ఆ అత్త గారి   దుర్మార్గానికి అద్దం పట్టిన పాత్ర విష్ (వికాస్)  తల్లి  పాత్ర.   

అమ్మాయి తల్లి తండ్రులు కట్నం డబ్బు సమకూర్చుకోడానికి యేడాది గడువు అడిగినప్పుడు ఆమె సరే అని అంటూనే,  ఆ  యేడాది అయ్యాకే కోడల్ని కాపురానికి  పంపించమంటుంది.  

 పెళ్ళైన కొడుక్కి సుఖమూ శాంతి లేకుండా , కోడలితో కాపురం చేయనీకుండా అడ్డుపడే  తల్లులు వుంటారనడానికి  పెద్ద నిదర్శనం – విష్ తల్లి పాత్ర.     

ఇవీ-  ఈ కథలోని స్త్రీ పాత్రలూ, స్వభావపు తీరుతెన్నులూ! 

రచయిత్రి గురించి :

విభిన్న కథాంశాలతో, వైవిధ్య భరితమైన్ రచనలను అందించడం లో అందె వేసిన చేయి గా పేరొందిన పాపులర్ రైటర్ శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు! 

నెచ్చెలి కోసం కథ అడగిన వెంటనే ఆసక్తికరమైన నారీసంధానం కథని పంపినందుకు పత్రిక తరపున  నా ధన్యవాదాలు. 

ఇలాటి అద్భుతమైన మరెన్నో కథలు వీరి కలం నించి జాలువారాలని ఆశిస్తూ..అభినందనలు తెలియచేసుకుంటున్నాను.

ఫ్రెండ్స్! వచ్చేనెల మరో మంచి కథతో కలుసుకుందాం..

అప్పటిదాక సెలవ్..

***

నారీసంధానం

 – జొన్నలగడ్డ రామలక్ష్మి 

మా నాన్నకి అక్క కొడుకు బావ. నాకంటే పదేళ్లు పెద్ద. నాకు చిన్నప్పట్నించీ తెలుసు.

నాకు ఐదారేళ్లప్పుడు బావని చాలా పెద్దవాడనుకునేదాన్ని. మారాం చేసి ఏడిపించేదాన్ని. కానీ నాకు పదిహేనేళ్లొచ్చేసరికి బావని చూడగానే సిగ్గు మొదలైంది. మరుసటేడే మా ఇద్దరికీ సంబంధం అనుకుంటే చాలా సంతోషించాను. అప్పుడు నాకు పెళ్లన్నా, బావన్నా కూడా ఇష్టంగానే ఉండేది.

చదువన్నా నాకిష్టమే. టెన్తులో 96, ఇంటర్లో 98 శాతం మార్కులొచ్చాయి. కోచింగు లేకుండా ఇంజనీరింగులో ఫ్రీ సీటొస్తే- ఏడాదిలో పెళ్లయ్యేదానికి నాలుగేళ్ల కోర్సులో చేరడం దండగంది అమ్మ. అంతవరకూ నాకు తెలియలేదు- పెళ్లికీ, చదువుకీ ఉన్న లంకె.

నాకైతే పెళ్లికంటే చదువే ఇష్టం. ఐనా ఆ మాట పైకనకుండా- “పెళ్లికింకా ఏడాదుంది. అందాకా ఓ ఏడాది ఇంజనీరింగ్‌ కాలేజి లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తా” అన్నాను అమ్మతో.

నాన్నకూడా మద్దతివ్వడంతో కాలేజిలో చేరాను. అబ్బ- ఆ లైఫెంత బాగుందో!

మధ్యలో బావకీ నాకూ మధ్య ఈమెయిల్సు, ఫోన్లు నడుస్తున్నాయి. నా కాలేజి అనుభూతులు విని, “మన పెళ్లవగానే ఇంతకు మించిన అనుభూతులు కలుగుతాయి. అందుకు నాదీ హామీ!” అన్నాడు బావ.

పెళ్లవగానే బావ నన్ను చదువాపించి అమెరికా తీసుకుపోయే ఉద్దేశ్యంలో ఉన్నాడని నాకర్థమైంది. “పెళ్లి చేసుకుందాం. కానీ గ్రాడ్యుయేటునయ్యాకే- నీ దగ్గిరకొస్తాను” అని బావకి ఖచ్చితంగా చెప్పేశాను.

విషయం అత్తయ్యకీ అక్కణ్ణించి నాన్నకీ చేరింది. మా ఇంట్లో చాలా పెద్ద గొడవయింది.

“పెళ్లయిన వెంటనే చదువాపి కాపురానికి వెళ్లకపోతే- ఈ పెళ్లి రద్దుట. మీ మేనత్త పేలేసి చెప్పింది” అంది అమ్మ నాతో. ఆ మాటల్లో ఉన్న కోపం అత్తయ్యమీద కాదు- మొత్తమంతా నామీదే!

“పెళ్లికంటే చదువే ముఖ్యమన్నానని నువ్వూ అత్తయ్యకి tEలేసి చెప్పు” అన్నాను అమ్మతో తాపీగా.

పెళ్లయ్యాక సంపాదనలోనూ భర్తతో సమంగా ఉండాలన్న నా కోరిక- నన్నిష్టపడ్డ బావని కూడా కాదనేలా చేసింది.

అందుకు అమ్మ ఇప్పటికీ నన్ను దెప్పుతుంది. ఎందుకంటే- మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్న బడిపంతులు. పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులు లేవు. నేను, నాకంటే ఆరేళ్లు చిన్నవాడైన తమ్ముడు రాం, ఆయన బాధ్యతలిప్పుడు.

బావ నన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటే కూడా- పెళ్లి ఖర్చులకి డబ్బెలా తేవాలీ అని ఇంట్లో సతమతమౌతున్న పరిస్థితి మాది.

కొడుకైనా కూతురైనా తన కాళ్లమీద తాను నిలబడ్డాకే పెళ్లి చెయ్యాలనుకునే తత్వం కాదు అమ్మది. బావ అమెరికాలో ఉన్నాడు. బాగా సంపాదిస్తున్నాడు. ఈ పెళ్లితో నా జాతకం మారిపోతుందని అమ్మ ఆశ!

బావని నేను వదులుకోలేదనీ, బావే నన్ను వదులుకున్నాడనీ అమ్మకి చెప్పి చూశాను.

అమ్మ ఒప్పుకోలేదు. సిరి రా మోకాలడ్డానని బాధపడింది. ఎటొచ్చీ నాన్న, “అమ్మాయి మాటల్లో నిజముంది. చదువొస్తున్న పిల్లని చదువుకోనివ్వాలి. ఈ రోజుల్లో అంతా అదే చేస్తున్నారు” అని నాకు వత్తాసుగా ఉన్నాడు. అది చాలు నాకు!  

అమ్మాయిలకి లైనెయ్యడమే పనిగా పెట్టుకున్న అబ్బాయిలు చాలామందే ఉంటారు కాలేజిలో. కానీ నాకు బావతో ఫిక్సయిందని తెలిసో ఏమో ఫస్టియర్లో ఎవరూ నా జోలికి రాలేదు. బావకీ నాకూ బ్రేకయిందని తెలియగానే సెకండియర్లో లైనేసేవాళ్లు మొదలయ్యారు. నా క్లాస్‌మేట్‌ వరుణ్‌ ఐతే ఒకరోజు- ‘ఐ లవ్‌ యూ’ అనేశాడు హొటల్లో మెనూకార్డ్‌ చూసి ఆర్డరిచ్చినంత తేలికగా. నేనూ అంత తేలికగానే వెంటనే, ‘సారీ’ చెప్పాను.

వరుణ్‌ వెంటనే, “సారీ చెబితే కారణం చెప్పాలి” అన్నాడు అదేదో గేమ్‌లో రూలైనట్లు.

“నువ్వు నాకు ఐ లవ్‌ యూ చెప్పావు. నేను కారణం అడగలేదు. నేను సారీ అన్నాను. నువ్వు కారణం అడక్కూడదు. అదీ డీల్‌. ఓకే’ అన్నాను.

వరుణ్‌కి కోపమొచ్చింది. నాకు పొగరని ప్రచారం మొదలెట్టాడు. అది అవకాశంగా తీసుకుని మనోజ్‌ నా దగ్గిరకొచ్చి వరుణ్‌ ప్రచారం గురించి చెప్పాడు.

“మా అమ్మాయిల్లో మీ అబ్బాయిల గురించి లక్షనుకుంటాం. మీ అబ్బాయిల్లో మా అమ్మాయిల గురించి లక్షనుకుంటారు. ఎవరి సరదా వాళ్లది. వదిలేయ్‌” అన్నాను తేలికగా.

మనోజ్‌ వెంటనే తనొచ్చిన పని కూడా మర్చిపోయి, “అమ్మాయిలు నా గురించి ఏదో అనుకుంటారంటేనే థ్రిల్లింగ్‌గా ఉంది. నా గురించి అనుకునేవాటిలో ఒక్కటి చెప్పవూ?” అన్నాడు మహా కుతూహలంగా.

“అవి మా సీక్రెట్స్‌. అడిగినా చెప్పను. కొంతమంది ఇడియట్సుంటారు. వాళ్లు ఇలాంటివి అడక్కపోయినా చెబుతారు. వెళ్లి అలాంటివాళ్లనడుగు” అన్నాను- ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని మనసులో అనుకుంటూ. మనోజ్‌కి అర్థమైంది. ఐనా వదల్లేదు. “ఇడియట్‌నే అనుకో. అడక్కపోయినా వరుణ్‌ గురించి నీకెందుకు చెప్పానో తెలుసా? వాడన్నది నాకెంతో ఇష్టమైన నిన్ను!” అంటూ నా విసురుని తనకి అవకాశంగా మార్చుకున్నాడు.

“ఐతే వాడూ, నువ్వూ చూసుకోండి” అన్నాను.

నాకు తెలుసు- వరుణ్‌ది సిక్స్‌పాక్‌ టైపు బాడీ. మనోజ్‌ అతడి జోలికి వెళ్లే సాహసం చెయ్యడు.

“నువ్వనాల్సింది అది కాదు. నీమీద నాకిష్టం అన్నానుగా, అదెప్పట్నించీ అనడగాలి” అన్నాడు మనోజ్‌ మాట మార్చుతూ.

“నీకు అడక్కుండా చెప్పే అలవాటుందిగా. అందుకని అడగలేదు” అన్నాను.

మనోజ్‌ది ‘న భయం, న లజ్జా’ బ్యాచిలా ఉంది. ఏమాత్రం తడబడకుండా, “అంటే చెబితే వింటావనేగా అర్థం. చెబుతున్నా విను. వరుణ్‌ నీకు పొగరనగానే ముందు వాడిమీద కోపమొచ్చింది. అంతలోనే ఆ కోపం నీమీద ఇష్టంగా మారిపోయింది. ఎందుకంటే నాకు పొగరున్న అమ్మాయిలంటే ఇష్టం. అంతే- పొగరున్న అమ్మాయిని పరిచయం చేసినందుకు వాడిమీద కోపం కూడా పోయింది” అన్నాడు.

“సరే- నీకు నా పొగరంటే ఇష్టం. ఐతే ఏమిటి?” అన్నాను పొగరుగా. ఎలాగూ పొగరన్నాడు కదా మరి!

“ఐ లవ్‌ యూ” అన్నాడు మనోజ్‌ వెంటనే.

“సారీ మనోజ్‌! మానసిక పరిణతిలో అబ్బాయిలు అమ్మాయిలకంటే వెనకబడి ఉంటారు. మనం ఒకే ఏజ్‌ గ్రూప్‌. నేను నాకంటే పెద్దవాడినే లవ్‌ చెయ్యాలని ఫిక్సయిపోయాను” అన్నాను వస్తున్న నవ్వాపుకుంటూ.

మనోజ్‌ ఇది ఊహించి ఉండడు. “లవ్‌, ఏజ్‌ చూసుకుని పుడుతుందా?” అన్నాడు తడబడుతూ ఉక్రోషంగా.

“ఊఁ” అన్నాను పొగరుగా.

ఆ తర్వాత నాకు క్లాస్‌మేట్స్‌ బెడద పోయింది. కానీ సీనియర్ల బెడద పట్టుకుంది. థర్డియర్‌నుంచి ముగ్గురు ఒకరి తర్వాత ఒకరుగా- నాకు ఐలవ్‌యూ చెబితే- ముందొచ్చిన వికాస్‌తో హైట్‌ తక్కువన్నాను. తర్వాతొచ్చిన ఆదితో వెయిటెక్కువన్నాను. ఆ తర్వాతొచ్చిన మాధవ్‌తో- నీ తెలుగు బాగోలేదన్నాను.

అబ్బాయిల సర్కిల్లో నేనో టాకింగ్‌ పాయింటయ్యానని- నా సీనియర్‌ నీరజ చెప్పింది. ఎలాగైనా నన్ను ప్రేమలో పడెయ్యాలని ఫైనలియర్‌ బాయ్స్‌ కొందరు పట్టుదలగా ఉన్నట్లు కూడా చెప్పింది.

నేను కలవరపడలేదు. ఏదైనా భయపడితే వేట. భయం లేకుంటే ఆట. అందుకే- ఒకరోజు పైనలియర్‌ కౌశిక్‌ నాకు ఐలవ్‌యూ చెబితే, “నిండా పదహారేళ్లు లేవు. నేనింకా మైనర్ని. ఏజ్‌ ఎక్కువేసి చదివిస్తున్నారు” అని ఓ బాంబు పేల్చాను.

“అంటే నువ్వు పదకొండేళ్లకే టెన్తు ప్యాసయ్యావా? ఇంపాసిబుల్‌” అన్నాడు కౌశిక్‌.

“నేను చైల్డ్‌ ప్రోడిజీ” అన్నాను. గొంతులో పొగరు లేకపోవచ్చు కానీ సమాధానంలో ఉంది.

అలా ఆ ఆట పైనలియర్లోకి వచ్చేదాకా కొనసాగింది. అప్పుడు మా కాలేజిలో లెక్చరర్‌గా చేరాడు వికాస్‌. అతగాడు కాల్‌ మి విష్‌ అంటాడు. అందంగా ఉంటాడు. పాఠాలు బాగా చెబుతాడు. సరదాగా ఉంటాడు.

కాలేజిలో చేరిన మూడు వారాలకి ఒకరోజు నన్ను స్టాఫ్‌ రూంకి పిలిచి, “మీ బావ గోకుల్‌ నా కజిన్‌. నాకు ఐదేళ్లు సీనియర్‌. చిన్నప్పట్నించీ తను నాకు రోల్‌ మోడల్‌. తనకి నువ్వంటే ఇష్టం. ఏ పరిస్థితుల్లో మీ పెళ్లి ఆగిపోయిందో చెప్పాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అతడి కోరిక” అన్నాడు.

ప్రపోజ్‌ చేసేముందు- కులం, వయసు, ఇష్టాలు కలిశాయని తెలివిగా చెప్పాడని గ్రహించాను. కాదనలేనని అతడి ఉద్దేశ్యం కావచ్చు. కానీ నేను, “ఐతే?” అన్నాను.

అతడు నవ్వి, “ఇంకా సూటిగా చెబుతాను. నీకిష్టమైతే నీ చదువయ్యేక మనం పెళ్లి చేసుకుందాం. ఈలోగా మనం కొన్నాళ్లు కలిసి తిరుగుతూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం” అన్నాడు.

అర్థం చేసుకుందుకు పెళ్లికి ముందు కలిసి తిరగడం అవసరమేం కాదు. ఎందుకంటే అమ్మకీ, నాన్నకీ పెద్దలు పెళ్లి కుదిర్చారు. అందాకా వాళ్లు ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకోలేదు. మరిప్పుడు అందరికీ వాళ్లది ఆదర్శ దాంపత్యంలా అనిపిస్తుంది. ఐనా విష్‌ అడిగిన తీరు, నేటి వాతావరణం- కొంత ప్రభావితం చేయగా- కాదనలేక విషయం ఇంట్లో అమ్మకి చెప్పాను. చెప్పడం మంచిదే అయింది. ఎందుకంటే, విష్‌ అప్పటికే నాన్నని కలుసుకుని తనని పరిచయం చేసుకుని, “మీ అమ్మాయిని ఇష్టపడ్డాను. తనూ ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను. ఇష్టాయిష్టాలు తెలుసుకుందుకు పెళ్లిచూపులకంటే, స్నేహంవల్ల ఎక్కువ ప్రయోజనం. ఆమెతో స్నేహానికి మీ అనుమతి కావాలి” అన్నాడట.

నేను చెప్పింది విని- దాపరికం లేని నా ప్రవర్తనని తెగ మెచ్చుకున్నారు మా ఇంట్లో. జరిగింది తెలిసేక విష్‌ నా దృష్టిలో ఇంకా ఎత్తుకి ఎదిగిపోయాడు.

విష్‌ సంస్కారం గొప్పది. కాలేజిలో ఎప్పుడూ మితిమీరిన చనువు తీసుకోలేదు. కలిసి బయటకు వెళ్లాలంటే- మా ఇంటికొచ్చేవాడు. అక్కణ్ణించి ఇద్దరం కలిసి బయటకు వెళ్లేవాళ్లం. అంతే కాదు. కాబోయే మా ఇంటల్లుడిగా చుట్టుపక్కల వాళ్లకి పరిచయమయ్యాడు విష్‌. అంటే మున్ముందు నన్ను మోసం చెయ్యాలనుకుంటే- తనకి వ్యతిరేకంగా సాక్ష్యాల్ని తనే తయారుచేసి మాకు అప్పగిస్తున్నాడన్న మాట!

ప్రేమకు ధైర్యమే కాదు. నిజాయితీ కూడా ఉండాలి. అప్పుడు ప్రేమ విఫలమయ్యే అవకాశం తక్కువ.

విష్‌ ఏకాంతంలో హుందాగా ఉండేవాడు. భవిష్యతుని రంగుల కలల్లో చూపించేవాడు. ప్రియుడిలా కాక కవిలా నన్ను పొగిడేవాడు. అతడి మాటలు నన్ను దివ్యలోకాల్లో విహరింపజేసేవి.

“నాలో మరో విష్‌ ఉన్నాడు. వాడి బుద్ధులు వేరు. ఆలోచనలు వేరు. చర్యలు వేరు. వాణ్ణిప్పుడు చూపిస్తే- దుర్మార్గుణ్ణీ, మోసగాణ్ణీ అనిపించుకుంటాను. పద్మం చూడు- నీట్లో ఉంటే సూర్యకిరణాలు సోకగానే వికసిస్తుంది. నీటి బయటుంటే ఆ సూర్య కిరణాలే సోకి కమలిపోతుంది. నాలోని ఆ విష్‌ సూర్యుడివంటివాడనుకో. నువ్వు పద్మానివి. నీళ్లు పెళ్లి అన్నమాట!  అప్పుడు నాలో సూర్యుణ్ణి నీకు పరిచయం చేస్తాను” అన్నాడతడోసారి. ఆ మాటలు వినగానే ఆ క్షణంలో సిగ్గు ముంచుకొచ్చింది. 

అలా రోజులు, వారాలు, నెలలు గడిచాయి. నానాటికీ విష్‌పై ఆరాధనాభావం పెరిగిపోతోంది. నా అదృష్టాన్ని నేనే అభినందించుకుంటూ పెళ్లి ఘడియలకోసం ఎదురుచూస్తున్నాను.

విష్‌తో ఆ ఏడాది పరిచయం- అటు పరీక్షల్లో మేలైన ప్రదర్శనకీ, ఇటు జీవితంలో థ్రిల్లింగ్‌ అనుభూతులకీ  గొప్పగా సహకరించింది నాకు. పరీక్షలయ్యే లోగా కాంపస్‌ సెలక్షన్లో- మా ఊళ్లోనే ఓ మంచి కంపెనీలో నెలకి అరవైవేల జీతంతో ఉద్యోగమొచ్చింది.

ఈలోగా మా ఇద్దరికీ ఆనవాయితీగా పెళ్లిచూపులు జరిగాయి. విష్‌ తలిదండ్రులు కూడా నన్నిష్టపడ్డారు. ఐతే వాళ్లు ఐదు లక్షలు కట్నమడిగారు. వాళ్లకి పదిహేనునుంచి పాతికదాకా ఇస్తామని సంబంధాలు వస్తున్నాయిట. విష్‌ నన్ను ప్రేమించాడు కదా అని భారీ డిస్కౌంటిచ్చారుట.

దానికే నేను షాక్‌ తింటే- వాళ్లడిగిందానికి అమ్మ, నాన్న వెంటనే ఒప్పుకోవడం మరింత షాక్‌!

పెళ్లివారు వెళ్లేక- “మాది ప్రేమ వివాహం. ఇందులో కట్నం ప్రసక్తి ఎలా వచ్చింది? వచ్చినప్పుడు మీరెలా ఒప్పుకున్నారు?” అని మావాళ్లని నిలదీశాను.

అమ్మ నన్ను అనునయించింది. “మావాళ్లకి కట్నం పట్టింపు. వాళ్లేమడిగినా మీరొప్పుకుంటే ముందు పెళ్లి నిశ్చయమై పోతుంది. ఆతర్వాత మావాళ్లు మిమ్మల్నేమీ అడక్కుండా నేను సద్ది చెప్పుకుంటాను” అన్నాట్ట విష్‌.

నాకు నచ్చలేదు. ఆతర్వాత విష్‌ మా ఇంటికొచ్చినప్పుడు ఈ విషయమై గట్టిగా నిలదీశాను. “కట్నమడిగావన్న ఒక్క కారణానికి ఈ పెళ్లి కాన్సిల్‌” అన్నాను.

విష్‌ నవ్వి, “వాళ్లడిగారు. కానీ మీవాళ్లిస్తే కదా, నీక్కోపం రావాలి. కన్నవారి మనసు కష్టపడకూడదు కాబట్టి, వాళ్లు కట్నమడిగితే ఊరుకున్నాను. నీ మనసు కష్టపడకూడదు కాబట్టి, మీవాళ్లు కట్నమివ్వకపోయినా మావాళ్లు ఊరుకునేలా చూసుకుంటాను. ప్లీజ్‌! ఈ విషయమై పెద్ద సీన్‌ చెయ్యకు” అన్నాడు.

సీన్‌ చేసేదాన్నే- అమ్మ, నాన్న వారించకపోతే!

నాకూ, విష్‌కీ పెళ్లి కుదిరిపోయిందనీ, ఇప్పటికే మేమిద్దరం కలిసి తిరుగుతున్నామనీ చాలామందికి తెలుసు. ఇప్పుడీ పెళ్లి తప్పిపోతే- నలుగురిలో తలెత్తుకోవడం కష్టం.

ఇదీ అమ్మ, నాన్న నాకు చెప్పింది. ఇది వినగానే నాకు విష్‌ పథకం మొత్తం అర్థమైంది.

సంస్కారం ముసుగులో ఒక ఆడపిల్లని అసహాయురాల్ని చేసి- కట్నం రాబట్టడానికి వేసిన మాస్టర్‌ ప్లాన్‌ అది. తెలివైనదాన్నని అనుకుంటూ, అతడి వలలో పడిపోయాను. అంటే పెళ్లిలో కట్నం గురించి మళ్లీ రభస జరుగుతుంది. పీటలమీద పెళ్లి ఆగిపోతుందన్న భయంతో అప్పుడు నాన్న ఏ షరతుకైనా ఒప్పుకుంటాడు.

ఆలోచనలో పడ్డాను. ఈ సంబంధం వదులుకుంటే నాకు విష్‌కంటే మంచి వరుడు దొరుకుతాడో లేదో కానీ, ముందు అమ్మ, నాన్న తట్టుకోలేరు. ఇంతవరకూ వచ్చేక వెనక్కి తగ్గకూడదు. కానీ విష్‌ ప్రదర్శించిన సంస్కారం ముసుగులోనే- అతణ్ణీ అసహాయుణ్ణి చేసి- తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాను.

అనుకున్న ముహూర్తానికి మా పెళ్లి జరిగింది. అనుకున్నట్లే పెళ్లిలో నా అత్తగారు కట్నం గురించి బాగా నొక్కించింది. విష్‌ సలహామీద నాన్న ఏడాది గడువడిగాడు.

“ఐతే ఏడాది తర్వాత కట్నండబ్బిచ్చి అప్పుడు మీ పిల్లని కాపురానికి పంపించండి” అంది విష్‌ తల్లి. మా శోభనం వాయిదా పడింది.

పెళ్లి హడావుడయ్యాక విష్‌ ఒకరోజు మా ఇంటికొచ్చాడు. సినిమాకి వెడదామన్నాడు.

“సారీ! పెళ్లికి ముందు మా అమ్మ, నాన్న ఒప్పుకున్నారు కదా అని నీతో బయటకొచ్చాను. ఇప్పుడు నీతో బయటకు రావడానికి నాకు అత్తయ్య పెర్మిషన్‌ కావాలి” అని కరాకండిగా చెప్పాను.

విష్‌కి ఏమనాలో తెలియలేదు. “ఐతే ఏడాదిపాటు మనకి విరహం తప్పదా?” అన్నాడు జాలిగా.

“అంటే ఏడాదిలో మీ అమ్మచేత కట్నం అక్కర్లేదని చెప్పిస్తావా?” అన్నాను.

విష్‌ తెల్లబోయాడు. కాసేపు ఇద్దరం వాదించుకున్నాం.

“మా అమ్మ, నాన్న కట్నం ఇచ్చుకోలేరు- ఇచ్చుకోగలిగినా నేనివ్వనివ్వను” అని స్పష్టం చేశాను.

కట్నం విషయం నాకు అనుకూలంగా తేలేదాకా- కాపురానికి రానన్న నా పట్టుదల విష్‌కి అర్థమైంది.

“కన్నవారిని నొప్పించలేని నా నిస్సహాయత అర్థం చేసుకో. మా అమ్మకి కట్నం తీసుకోవాలని పట్టుదల. ఈ విషయంలో మీ వాళ్లకి ఇబ్బంది లేకుండా ఓ ఉపాయం చెబుతాను. నువ్వు ఉద్యోగంలో చేరుతున్నావు కదా! నీ జీతం వేరే దాచుకో. ఏడాదిలో మా అమ్మడిగిన కట్నం ఇచ్చెయ్యగలవు….” అన్నాడు విష్‌.

నేను ఆలోచించకుండా సరేనన్నాను. విష్‌ ఆశ్చర్యపడ్డాడు. కానీ మనసు తేలికై వెళ్లిపోయాడు.

ఒక ఏడాదిపాటు విష్‌ని దగ్గిరకి రానివ్వలేదు. భర్తతో కాపురానికి తపించిపోతూ, తలిదండ్రుల గుండెలమీద కుంపటిగా మిగిలిపోవడానికి నేనేం- సాధారణ గృహిణిని కాను. ఇంజనీర్ని. ఉద్యోగస్థురాల్ని.

ఏడాది తర్వాత నాన్న నేనిచ్చిన ఐదు లక్షలూ తీసుకెళ్లి విష్‌ తలిదండ్రులకిచ్చి వచ్చారు. అత్తయ్య శోభనానికి ముహూర్తం పెట్టించమని చెప్పిందిట.

“తొందరపడొద్దు. ఒకసారి విష్‌తో మాట్లాడాలి” అన్నాను అమ్మతో.

విష్‌ వచ్చాడు. సమస్య పరిష్కారమైందన్న సంతోషం అతడి ముఖంలో దాచాలన్నా దాగడం లేదు.

“నా జీతంలోంచి దాచిన ఐదు లక్షలు నీ తలిదండ్రులకు అందజేశాం. ఇక నీ జీతంలోంచి ఓ ఐదు లక్షలు పోగుచేసి మా వాళ్లకివ్వాలి. తర్వాతనుంచి మనం మనంగా కలిసి హాయిగా బ్రతుకుదాం” అన్నాను తాపీగా.

ఏం చేస్తాడు? డబ్బు వెనక్కిస్తాడా? విడాకులిస్తాడా? విడాకులిస్తే కారణం ఏం చెబుతాడు?

ఏదిఏమైనా- ఈ నారీసంధానానికి అతడు సిద్ధంగా ఉన్నట్లు లేడనిపించింది- అతడి ముఖం చూస్తే!

ఏమైతేనేం- ఆతర్వాత వారం రోజుల్లోనే మా శోభనానికి ముహూర్తం నిర్ణయమైంది.

నారీమణుల ఈ నారీసంధాన విజయానికిది అంతం కాదు, ఆరంభం కావాలని నా ఆశ!

***

జొన్నల గడ్డ రామలక్ష్మి పరిచయం : 

ఇంటి పేరు రాయవరపు. 

హైస్కూల్ చదువు మధ్యలో ఉండగానే బాగా చిన్న వయసులో డాక్టర్ రాజగోపాలరావుతో వివాహమై జొన్నలగడ్దవారి కోడలినయ్యాను. పెళ్లయ్యేక వీణలో పీజీ చేశాను.

 మావారి ప్రభావంతో కథారచనకు పూనుకున్నాను. 

మేమిద్దరం కలిసి వ్రాసినప్పుడు ‘వసుంధర’ మా కలం పేరు. ఎక్కువగా కలిసే వ్రాస్తుంటాం. పరిచితమైన జీవితంలోని విభిన్న తరహా వ్యక్తులు, వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, సన్నివేశాలు మా ఇతివృత్తాలు. వాటిని సమకాలీన సాంఘిక పరిస్థితులతో అన్వయించడం మా శైలి. 

1600కి పైగా పిల్లల కథలు, వెయ్యికి పైగా పెద్దల కథలు, 20 పిల్లల నవలలు, 260కి పైగా పెద్దల నవలలు, ఇంకా వందలాది సాహితీవ్యాసాలు, www.vasumdhara.com  వగైరాల్లో భాగస్వామిని. 

మా రచనల్ని ఒక వరుసలో చదివితే, మన సమాజపు చరిత్ర చదివినట్లే అని ఇష్టులు అంటూంటారు. 

కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ప్రముఖ పత్రికలు, సంస్థలు  మా రచనలను ప్రచురించడమే కాక,  బహుమతులు  కూడా ఇచ్చి ప్రోత్సహించాయి, ప్రోత్సహిస్తున్నాయి. వాటిలో నెచ్చెలి వెబ్ పత్రిక కూడా ఉంది. 

మావారి జోక్యమున్న ప్రతి కథలోనూ ఎక్కడో అక్కడ కొన్ని సాంఘిక, రాజకీయ సంఘటనల పరమైన చురకలుంటాయి. అలా వద్దనుకున్నప్పుడు వచ్చినవే కేవలం నా పేరుతో వచ్చిన కథలు. సంఖ్యలో తక్కువైనా- వాటిలోనూ చాలావరకూ పోటీల్లో బహుమతులు గెల్చుకోవడం నాకు పత్రికలిచ్చిన, ఇస్తున్న ప్రోత్సాహం. 

అత్తింటివారిని మీరు అనీ, పుట్టింటివారిని మేము అనీ విభజించకుండా- మనం అనే పదంతో ముడి వేసి, యాబైఐదేళ్ల వైవాహిక జీవితాన్ని రసమయం చేసుకున్నాను. 

చాపకింద నీరులా మహిళల్ని నిర్వీర్యం చెయ్యడానికి కంకణం కట్టుకున్నట్లు అనిపించే టివి సీరియల్సులో స్త్రీపాత్రల్ని- నిమ్మకు నీరెత్తినట్లు భరిస్తున్నాం. వాటికి విరుగుడుగా, ‘ఆడవాళ్లు ఇలా ఆలోచించాలి, ఇలాగే ఆలోచించాలి. ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి’ అనిపించే కథలు ఎక్కువగా రావాలని నా కోరిక. ఆ కోవలో ఉడతాభక్తిగా వ్రాసిన ‘నారీ సంధానం’ కథను జాగృతి వారపత్రిక ప్రచురించింది. వారికీ, ఈ కథని ఆత్మీయంగా నిమిరి ‘గుర్తింపు చారల్ని’ ఇవ్వడానికి పూనుకున్న ‘కథామధురం’ విశిష్ట వేదికను సృజించిన ‘నెచ్చెలి’కీ, ఆ శీర్షికను అపూర్వంగా నిర్వహిస్తున్న శ్రీమతి ఆర్. దమయంతికీ- అభినందనపూర్వక ధన్యవాదాలు. 

 ‘నెచ్చెలి’కీ, ‘నెచ్చెలి’ పాఠకులకీ శుభాకాంక్షలు.   

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.