ఎక్కడో తెలుగు ప్రాంతాలనుంచీ వచ్చిన వాడు, మాపై పెత్తనం చలాయించటమేంటి?? అని ఆ స్థానిక కేరళ ఉద్యోగుల
బాధ!! అప్పటికే ప్రాకృత భాషలూ, సంస్కృతమూ పైనున్న పట్టుతో మళయాళం నేర్వటం కష్టమేమీ కాలేదు పుట్టపర్తికి!! గ్రీక్,
లాటిన్, కాస్త ఫ్రెంచ్ కూడా కాస్త వచ్చిన పుట్టపర్తిని నిరోధించగలిగే సత్తా ఎవరికీ లేదు.
ఇన్ని కారణాలవల్ల అక్కడి వాళ్ళు పుట్టపర్తిని ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే చూసేవారట!!
గ్రంధాలయాల్లో పుస్తకల పట్టికకోసం, వరసాగ్గా పెట్టబడిన చెక్క పెట్టెల్లో, ఒక సైజులో పేర్చిన అట్టముక్కల్లో, అకారాది
క్రమంలో వ్రాయబడిన పుస్తకాల/రచయితల పేర్లూ, వాటి ప్రచురణ వివరాలూ, ప్రచురణ సంవత్సరం వంటి వివరాలు చూస్తాం.
ముందుగా ఆ వివరాలు నోట్ చేసుకుని ఆ తరువాతే, ఆయా పుస్తకాల అన్వేషణలో పడతాం కదా!!
అదే పద్ధతి, యీ పదకోశ పరిశోధనలోనూ అనుసరిస్తారు. అయ్య అదే విభాగానికి అధికారి. ఇలా పదాల పుట్టుపూర్వోత్తరాలు
కనుక్కునే పనిలో ఆయనకు సహకరించే యీ మళయాళీ పండితులకు ఆయనంటే బాగా అసూయ గా ఉండేదన్నాను కదా!!
ఒకసారి, అయ్య సెలవు మీద కడపకు వచ్చి, మళ్ళీ వెళ్ళేనాటికి, ఇలా చెక్క డబ్బాలలో సిద్ధంగా ఉంచుకుని వున్న కొన్ని
నెలల పరిశోధనంతా కాలి మసిపోయి ఉన్నదట!! అది తన కింది ఉద్యోగుల పని అని అయ్య త్వరగానే గమనించారు. మరో
నాలుగైదు రోజుల్లో, పై అధికారులతో జరుగబోయే సమావేశంలో, ఇప్పటివరకూ జరిగిన పరిశోధనల గురించి నివేదిక
సమర్పించవలసి ఉంది !! ఇది లోగుట్టేనని అర్థమైపోయింది పుట్టపర్తికి!! ఎవరినడిగినా మాకేమీ తెలియదనేవాళ్ళే!!
యౌవ్వనంలో అవధానీ, ఎన్నో కావ్యాలను ఒక్కసారి చదివి గుర్తుపెట్టుకోగలిగే ఏకసంథ గ్రాహి ఐన పుట్టపర్తి, తానొక్కరే కూర్చుని,
మళ్ళీ ఆ పద పరిశోధనకు సంబంధించిన కార్డులను తయారు చేసుకుని, నివేదిక సమర్పించగలిగారట!! అది చూసిన అక్కడి
వాళ్ళకు పుట్టపర్తిపై నున్న అసహనం కాస్తా ద్వేషంగా మారిపోయిందట కూడా!!
అక్కడ కూడా నారాయణాచార్యులు అనే ఒక సహోద్యోగి ఉండేవాడట!!పేరు ఇద్దరిదీ ఒకటే అవటం వల్ల, కాస్త ఇద్దరికీ
సత్సంబంధలే ఉండేవట!! ఒక దశలో అక్కడి కింది ఉద్యోగుల్లో చాలామందికి, పుట్టపర్తి తెలివితేటలు నచ్చక, వారంతా
పుట్టపర్తిని అంతమొందించాలనికూడా పథకం వేసుకుంటున్నారనీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడినుంచీ
వెళ్ళిపొమ్మని, అతడు రహస్యంగా చెప్పాడట, పుట్టపర్తికి!! కేరళలో మంత్ర తంత్రాలే కాక, అతి ప్రాచీన మార్షల్ విద్యలు
కూడా అప్పుడే చాలా విసృతంగా ప్రచారంలో ఉండేవని పుట్టపర్తి తన ఉద్యోగ సమయంలో గమనించే ఉన్నారు కదా!!
ఒక్కసారి కుటుంబం గుర్తుకు వచ్చి ఇక్కడినుంచీ తప్పుకునే అవకాశ0 ఎలా వస్తుందా అని ఆలోచనలో పడ్డారు – పుట్టపర్తి.
ఇంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా పుట్టపర్తి పరిశీలనాదృష్టి పనిచేస్తూనే ఉంది. కేరళలో తనకు కనిపించిన
విశేషాలను తన చిన్న డైరీలో ఎప్పటికప్పుడు వారు నోట్ చేసుకుంటూనే ఉండేవారని, ఇదిగో ఇటువంటి చిన్న చిన్న
రాతలవల్ల తెలుస్తున్నది. గమనించండి.
‘ఒక అరటి, ఖర్జూరం వలె ఉంటుంది. రెమ్మలు, పండ్లు వాడరు. శుభ కార్యాలలో ఇండ్లకు మాత్రం కడతారు. అరటి కూర
ఎక్కువ తింటారు. మగ వ్యభిచారులు ఎక్కువ. హెచ్చరికగా ఉండవలె!! ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు. మగవాండ్లు
ఇళ్ళలో ఉంటారు. ఏమి చిత్రమో!!’
***
‘ఎళుత్తచ్చన్ ‘అధ్యాత్మ రామాయణము, ‘సంగ్రహ భారతమూ ‘బుద్ధ చరితమూ ‘ మొదలైనవి వ్రాశాడు. నారాయణ భట్టు
గొప్ప సంస్కృత కవి. భాగవతం వ్రాసెను. ఇంకా అనేక గ్రంధాలు. కానీ, మళయాళం దాటి బైటికి రాలేదు..’
***
కేరళ సాహిత్యంతో తన అనుబంధాన్ని వ్యాసాల రూపంలో సాహిత్య పత్రికలకు పంపుతూనే ఉండేవారాయన!! స్వాతి
తిరుణాళ్ సంస్కృత కృతుల గురించి ‘పరిశోధన’ లో ప్రచురితమైన వారి వ్యాసం లో (మార్చి, 1955) రాజశేఖరుడు కేరళమును
వర్ణించిన తీరును గుర్తు చేస్తూ, కేరళ కామినుల మోహ పరవశమొందించే రూప లావణ్యాన్ని పరిచయం చేసి, అంటారు,
‘ సాహిత్య విద్యావధువు కావ్య పురుషుని లోబరచుకొనుటకై అనేక ఉపాయాలను పన్నిందట!! అతగాడు వలలో పడలేదట!!
అతగానితో కలిసి ఎన్నో ప్రదేశాలు చుట్టి వచ్చిందట!! చివరకు చేర దేశానికి తోడుకుని వచ్చిందట!! ఇక్కడి గాలి సోకిన వెంటనే,
అతగాడు వెన్నవలె కరిగిపోయాడట!! ఆ కాంత ఒడిలో, పద్మ మధ్యంలో రాజహంసవలె వాలిపోయాడట!!
ముప్పది నాలుగేళ్ళకే మృత్యువు వాత పడిన స్వాతి తిరుణాళ్ ఇంత చిన్న జీవితంలో చేసిన ఎన్నెన్నో గొప్ప
పనులను, ముఖ్యంగా సంగీత ప్రపంచానికి స్వాతి తిరుణాళ్ చేసిన సేవను శ్లాఘించారు పుట్టపర్తి.
తిల్లానాలు, ప్రబంధాలు, హిందుస్థానీ పద్ధతిలోకూడా వ్రాసిన తరువాత, తెలుగులో ఎక్కువ పదరచనలు చేసిన ఆ సంగీత
శిఖరం గురించి వ్రాసిన వ్యాసంలోనే, తిరువాన్ కూరు ప్రాచ్య లిఖిత భాండాగారంలో మూలుగుతున్న ఎన్నెన్నో ఆంధ్ర
గ్రంధాల గురించి కూడా ప్రస్తావించారు. వాటిని చూస్తూ, వాటికి మోక్షమెప్పుడొస్తుందో అన్న బాధతో కన్నీళ్ళు పెట్టుకున్నారట
వారు!! మన విశ్వవిద్యాలయాలకు యీ గోడు పట్టదని చురకలంటిస్తూ, డిగ్రీల ధీమాతో కొలువులు చేసేవారికి యీ కథలు
కాబట్టవంటారు. అటు సాహిత్య విమూఢులైన రాజకీయ అధికారులకు ఓట్లు లెక్ఖించటంలో ఉన్న ఆసక్తి, తిక్కన భారతాన్ని
చదవటంలో ఉండదు కదా!!’ అని వాపోతారు పుట్టపర్తి!! ఈ స్థితిలో మార్పు యీనాటికీ అంత పెద్దగా కనబడదేమో,
పాఠకులు చెప్పవలె!!
కేరళ కథాకళి నాట్య విన్యాసానికి ప్రసిద్ధి. ఆ కళాకారుల ఆహార్యం, గాన పద్ధతి, వాడే సంగీత పరికరాలు, అప్పటిరోజుల్లో
కేవలం నూనె దీపాల వెలుగులో మాత్రమే ప్రదర్శించే సంప్రదాయం – పుట్టపర్తిని చాలా ఆకర్షించింది. వారు కేరళ ఆట్ట
కథా సంప్రదాయం గురించి ఎన్నెన్నో విశేషాలను ఆ రోజుల్లోనే సేకరించుకున్నారు. కార్యాలయంలో తన వైదుష్యమంటే
అస్సలు పడని సహోద్యోగుల మధ్య రోజంతా గడిపినా, తన గదికి వెళ్ళగానే, పుట్టపర్తిలోని పరిశోధకుడు, ఒళ్ళు విరుచుకుని,
లేచి, పద వెళ్దాం..’ అని చేయిపట్టి తీసుకుని వెళ్ళేవాడేమో గానీ, కథకళి సాహిత్యం గురించి వారు సేకరించిన అద్భుత
విషయాలు ఇప్పటికీ అమూల్యాలే!!
కథాకళి కాస్త మన బైలు నాటకాల వలె ఉంటాయన్నది వారి అభిప్రాయం. (ఇప్పుడు బైలు నాటకాలున్నాయంటారా??
ఎన్ని కళలు అంతరించిపోతున్నాయో తలచుకుంటే, గుండె చెరువవుతుంది కదా?) పాత్రలెప్పుడూ మాట్లాడవు.
అపుడప్పుడు తమ మనోవికారాలను తెలిపే విధంగా కొన్ని ధ్వనులను మాత్రమే చేస్తారట!! నాట్య రంగానికి, కుడి,
ఎడమ వైపులలో, రెండు భద్ర దీపాలు, వాటిలో నిండుగా వేరు సెనగ నూనె పోసి వెలిగిస్తారు. కథాకళిలో అతిముఖ్యమైనది
వేష రచన. దానికే గంతలు గంటలు పెడుతుంది. రంగుల మేళనము, ముఖముపై, ఆయా పాత్రలకు తగినట్టు అలదటం
కూడా కళే అంటారు వారు!! ఆయా వస్త్రాలను తయారు చేయటం – ఎంత కష్టమో!!
పుట్టపర్తి ఇలా కేరళలోని సంగీత సాహిత్య వీధుల్లో విహరిస్తున్న సమయాల్లో ఒక్కోసారి వారిలోని చారిత్రక పరిశోధకుడు
విజృంభించి చరిత్ర బాట పట్టించేవాడని వారి వ్రాతల వల్ల విశదమౌతున్నది. టిప్పు సుల్తాను కేరళముపై దండెత్తిన
సమయంలో ఉత్తర కేరళమంతా నిర్మానుష్యమైపోయిందట! పద్మనాభస్వామి కోవెలను కూడా దోచుకునే ప్రయత్నం
చేశాడు సుల్తాన్. అప్పుడు అక్కడి రాజు మార్తాండ వర్మ. టిప్పు సుల్తాన్ శక్తి ముందు, తన సైన్యం ఏపాటిది? నిరాశతో
రాజు నిస్సత్తువగా నిలబడిపోయాడు – పద్మనాభ స్వామి ముందు చేతులు జోడించి!!
కానీ..జరిగినదేమిటి?? టిప్పుసుల్తాన్ ప్రయత్నాన్ని,ఒక అద్భుత సంఘటన అడ్డుకున్నట్టు పుట్టపర్తి గమనించారు.
అదెలా?? పద్మనాభస్వామి యీ దురాక్రమణను అడ్డుకోదలచాడు. అంతే!! లెక్కకు మించిన తేనెటీగలు
టిప్పు సుల్తానును దేవాలయంలోనికి రానీకుండా అడ్డుకున్నాయట!! ఆ దెబ్బకు సైనికులంతా పరుగో పరుగు!!
ఈ పరిణామాన్ని గమనించిన రాజు, నిశ్చేష్టుడై నిలుచుండిపోయాడు. సాక్స్తాత్తూ ఆ పద్మనాభస్వామే యీ ఉపద్రవాన్ని
అడ్డుకున్నట్టు విదితమైంది. అప్పుడే, రాజు, ఆ అనంత పద్మనాభునికి శరణాగతుడై, తన రాజ్యాన్నంతటినీ,
సమర్పించుకున్నాడు. (విశాఖ వద్ద ఉన్న సిం హాచల వైష్ణవ క్షేత్రాన్ని అన్య మతస్తులు కబళించి వేయాలనే ప్రయత్నం
చేస్తే, అక్కడ కూడా ఇదే విధంగా తేనెటీగల దండు ఆ శత్రు సైనికులపై దాడి చేసి, వారిని విపరీతంగా గాయపరచి,
పారద్రోలిన సంగతి సింహగిరి శతకం లో ఉటంకించ బడింది. అంతా దైవలీల!)
ఇక అప్పటినుంచీ, కేరళ రాజ్యాధికారంలో ఉన్నవారు, విధిగా, రోజుకు రెండుసార్లైనా స్వామి దర్శనానికి వెళ్ళే
పద్ధతిని పాటిస్తున్నారట!! (మరి ఇప్పుడు ఆ నియమం ఉందో లేదో !!) గర్భగుడిలో, ‘పద్మనాభదాస ‘ అని ఒక అరుగు
ఉన్నదట!! నాటి మార్తాండవర్మ రాజు వరపడి, స్వామిని వేడుకున్న చోటు అదేనట!! ఆ అరుగుమీద, పొరపాటుగా
యే వస్తువు జారిపడినా, అది ఇక స్వామి వారికే చెందినట్టుగా భావించాలట!! పుట్టపర్తి కేరళలో కొలువు చేస్తున్న
సమయంలో, గుడిని సందర్శించే వారిని అక్కడి వాళ్ళు హెచ్చరిస్తూనే ఉండేవారట, ‘మీదైన ఏ వస్తువునూ కింద పడ
నివ్వకండి. ఒకసారి కింద పడితే ఇక అది, ఆలయానికి చెందినదే!!’ అని!!
ఇంతలో ఒక సారి పుట్టపర్తి దృష్టిని ‘చంద్రోత్సవము’ అనే కేరళ కావ్యం ఆకర్షించింది !! సహ్య పర్వతములలోని ఒక
పర్వతము పేరు ‘మరుత్తామల’. (దీనికే ‘మరకత పర్వతము ‘ అని పేరు పెట్టుకున్నారట!!) ఇంతకూ, యీ కొండలలో
ఒక గంధర్వుడు తన ప్రేయసితో క్రీడిస్తున్నవేళ, ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణంలో, చల్లని గాలులు వీచాయి.
ఆ వాయువులలో కలిసి, ఏదో ఒక దివ్య పరిమళం ఆ జంటను పరవశులను చేసింది. గంధర్వుని ప్రేయసికి ఇదేదో అపూర్వ
సుమ పరిమళం వలె తోచింది. ఇంకేముంది?? తన ప్రియుణ్ణి, ఆ పువ్వేదో కనుక్కుని, తనకోసం తెచ్చిపెట్టమంది –
అచ్చం, ద్రౌపది, భీమసేనుణ్ణి సౌగంధిక కమలం తెచ్చిపెట్టమన్నట్టుగా!!
ప్రియురాలి కోర్కె తీర్చని ప్రియుడూ ఒక ప్రియుడేనా?? వెంటనే ఆమె కోర్కెను తీర్చేందుకు గంధర్వుడు
ఎటువంటి ప్రయత్నాలు చేశాడు?? అతని ప్రయత్నాలకూ, చంద్రోత్సవానికీ లంకె ఏమిటి?? ఇదే ఆ చంద్రోత్సవ
కావ్య కథావస్తువు.