కాళరాత్రి
ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్”
అనువాదం : వెనిగళ్ళ కోమల
పరిచయం
ఎలీ వీజల్ బోస్టన్ యూనివర్సిటీలో హ్యుమానిటీస్ ప్రొఫెసర్, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత (1986). 40కి పైగా పేరుగాంచిన రచనలు చేశారు. నైట్ (కాళరాత్రి – అనువాదం) ఆయన మొదటి రచన. అతిశక్తివంతమైన చిన్న పుస్తకం.
జర్మనీలో నాజీలు పరిపాలనకు రాగానే వారు నిర్మించిన సమాజంలో యూదులకు చోటు లేదని నిర్ణయించారు. లక్షలమంది యూదులను తుపాకులకు బలి చేశారు. వారిని చంపటమే కాక వారికి సరైన అంత్యక్రియలు కూడా జరగనీయలేదు.
రెండవ ప్రపంచయుద్ధంలో నాజీపాలకులు హిట్లర్ నాయకత్వాన యూదు పిల్లలను పెద్దవారిని ఆడమగ తేడాలేకుండా అంతమొందించడమే కాక వారి మతాన్ని, వారి నాగరికతను, వారి ఆచారాలను, వారి సాహిత్యాన్ని సమూలంగా తుడిచిపెట్టసాగారు.
ఎలీ వీజల్, అతని కుటుంబాన్ని సిఘెట్ టౌన్ నుండి తీసుకువెళ్ళినప్పుడు అతని వయస్సు 15 సంవత్సరాలు. యూదులందరిని అరెస్టు చేసి క్యాంపులకు పశువులను చేరవేసే రైలు బోగీలలో కుక్కి చేరవేశారు. వారిలో చనిపోయినవారిని ఈడ్చిపారవేశారు. పిల్లలను, ఆడవారిని, వృద్ధులను కొలిమి మంటలలో విసిరి బూడిద చేశారు. ఎలీ తల్లి, చిన్న చెల్లి మొదటినాడే అగ్నికి ఆహుతయ్యారు. తండ్రి నరకయాతనలు వీజల్ వెంటవుండి కళ్ళారా చూసి సహించవలసి వచ్చింది. ఆయనను కూడా చివరలో ప్రాణం వుండగానే ఈడ్చిపారవేశారు. ఇంత సూపు, రొట్టెముక్క ఇచ్చి యూదులతో రకరకాల చాకిరీ చేయించారు. వీజల్ బతికి బయటపడటం ఒక అద్భుతం అన్నారు అందరూ. కానీ వీజల్ అలా భావించలేదు. ఛాన్స్ అన్నాడు. మిరకిల్ అనలేదు. లక్షలమంది యూదులు చంపబడ్డారు. ఆ పీరియడ్ ప్రపంచ చరిత్రలో ఒక మాయని మచ్చ.
వీజల్ క్యాంపులో బతకడానికి ప్రయత్నించలేదు. బతకాలనే ఆశ వదులుకున్నాడు. అయినా బతికి ఆష్‌విట్స్ క్యాంపు జీవితాన్ని, అక్కడి క్రూరత్వాన్ని (నాజీలు యూదులను రెండో ప్రపంచయుద్ధ కాలంలో చంపటం) హాలో కాష్ట్ అన్నారు. దానిని గురించి వివరంగా వీజల్ నైట్ అనే పేరుతో రచించాడు. అక్కడ అమానవీయత కేవలం మానవతగా చెలామణి అయ్యిందన్నాడు. ఒక మనిషిలోని క్రూరత్వమంతా బట్టబయలయిన ప్రదేశం అది.
వీజల్ మొదట తన మాతృభాష యిద్దిష్‌లో ‘ప్రపంచం నిశ్శబ్దంగా వుండిపోయింది’ అనే పేరుతో రాశాడు. తరువాత ఫ్రెంచ్, ఇంగ్లీషులోకి అనువాదాలు వచ్చాయి. నేను చదివిన అనువాదం వీజల్ భార్య మారియల్ చేసినది. యువతకు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలకు యూదుల దహనకాండ గురించి తెలపాలని ఇది రాశానన్నాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘోర కలి పునరుక్తి కాకూడదని ఇలా రాశానన్నాడు. నోబెల్ ప్రైజు గ్రహించేటప్పుడు ఆయన చేసిన ప్రసంగంలో ` ప్రపంచంలో ఎక్కడైనా ఏ జాతి అయినా హింసకు, ఆకలికి, అవమానాలకు, మతం పేరిటనో, అభిప్రాయ భేదాలపేరిటనో గురయితే మిగతా మానవులు వారి పక్షాన నిలబడటమే బాధ్యత అన్నాడు. తాను జీవించి వున్నందుకు ఈ పుస్తక రచన సార్ధకతనిచ్చిందన్నాడు.
మొదట ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి పబ్లిషర్స్ ముందుకు రాలేదు. కేథలిక్ ఫ్రెంచి రచయిత నోబెల్ లారియెట్ ఫాన్స్‌వా మారియాల్ అవిరళ కృషితో పుస్తకం ముద్రింపబడిరది. మొదలు యూదులు హాలోకాస్ట్ గురించి తమ పిల్లలకు చెప్పకూడదనుకున్నారు. గతాన్ని గురించి చెప్పి వారిని బాధించకూడదన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్కూళ్ళల్లో కాలేజీల్లో ఇది పాఠ్యాంశంగా చదువుతున్నారు. అనేక పుస్తకాలు, సినిమాలు, నాటకాలు వచ్చాయి. వాషింగ్టన్ డిసిలో హాలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియం స్థాపించారు (1993). మిలియన్ల సంఖ్యలో జనం మ్యూజియంను సందర్శిస్తున్నారు. వీజల్ తాను బ్రతికి బయటపడినందుకు సార్ధకత ‘నైట్’ రాసినందుకు ఏర్పడిరదన్నాడు. 2016 జూన్‌లో నేను నైట్ చదివినప్పుడు మనసు బాధతో విలవిలలాడిరది. తెలుగు చేద్దామని అనిపించి చేశాను. తెలుగు మాత్రమే చదవగల నా సహ పాఠకులు ఈ పుస్తకం ద్వారా ప్రపంచ చరిత్రలోని ఈ అంధకార యుగాన్ని గురించి తెలుసుకుంటారని ఎలీ వీజల్ చెప్పిన ‘బాధ్యత’ను గుర్తుచేసుకుంటారని తమవంతు కృషి హింసను అరికట్టడానికి చేస్తారని అనిపిస్తుంది. ఏ కొద్దిమంది చదివినా నా కృషి సార్ధకమయిందనుకుంటాను. రచయిత మరణించినా (జూన్ 2016) ఈ పుస్తకం ద్వారా హాలోకాస్ట్ జ్ఞాపకాలూ, రచయిత శాంతిసందేశం సజీవంగా వుంటాయి.
మైనేని గోపాలకృష్ణ ఈ పుస్తక అనువాదానికి అనుమతి పొందడంలో సహాయ సహకారాలందించారు. వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. శ్రీమతి దామరాజు నాగలక్ష్మి, కాళరాత్రి అనువాదాన్ని ప్రెస్‌వర్దీ చేసి ముద్రణలో ప్రత్యేక శ్రద్ధ చూపినందుకు కృతజ్ఞతలు చెపుతున్నాను.
నా రచనా వ్యాసంగాన్ని ప్రోత్సహిస్తూ ఎల్లప్పుడూ సహకారాన్నందించే నా భర్త ఇన్నయ్యకు, నా కుమార్తె డా॥ నవీనకు, నా కుమారుడు రాజు నరిసెట్టికి ప్రేమపూర్వక కృతజ్ఞతలు. మా కుటుంబ మిత్రులు ఆలపాటి బాపన్న అందంగా ముద్రించి అందజేసినందుకు ధన్యవాదాలు. ధారావాహికగా ప్రచురిస్తున్న నెచ్చెలి మన:పూర్వక ధన్యవాదాలు.
– వెనిగళ్ళ కోమల
*****
కాళరాత్రి-1
అతన్ని అందరూ మోషే ది బీడిల్ అనే పిలిచేవారు. అతనికి ఎప్పటికీ ఇంటి పేరంటూ లేనట్లే. హసిడిక్ ప్రార్థనా మందిరంలో అన్ని పనులూ చక్క బెట్టేవాడు. ట్రాన్‌సిల్వేనియాలో చిన్నపట్నం సిఘెట్ ` అక్కడే నా బాల్యం గడిచింది. ఆ పట్నంలో అందరికీ అతను ఇష్టుడు. అతను చాలా పేదవాడు. మా ఊరివాళ్ళు పేదవాళ్ళను ఆదుకునేవారు. కాని వాళ్ళంటే యిష్టపడేవాళ్ళు కాదు. కానీ మోషే ది బీడిల్ సంగతి వేరు. అతను ఎవరి పనులకూ అడ్డువచ్చేవాడు కాదు. ఎవరికీ ఇబ్బంది కలిగించేవాడు కాదు. అందరి దృష్టి నుండి తప్పించుకొనటమే నేర్చుకుని గడిపాడు.
చూడటానికి సర్కస్ బఫూన్ మాదిరి ఉండేవాడు. అతను సిగ్గుపడటం అందరికీ నవ్వు తెప్పించేది. కాని నాకు మాత్రం అతని పెద్దకళ్ళు, ఏదో స్వప్న జగత్తులో ఉన్నట్లు వుండే అతని చూపు అంటే చాలా యిష్టం. తక్కువ మాట్లాడేవాడు. పాడుతూ ఉండేవాడు. అతని పాటలు ప్రార్థనలాగా అనిపించేవి. బహిష్కరణకు గురైన షేఖినా బాధలు అనిపించేవి నాకు అతన్ని వింటుంటే.
అతన్ని నేను 1941లో కలిశాను. నాకప్పుడు 13 ఏళ్ళు. అతన్ని నిశితంగా పరిశీలించేవాడిని. నేను పగలు టల్‌ముడ్ చదివేవాడిని. రాత్రిపూట సినెగాగ్ (మందిరం)కు వెళ్ళేవాడిని. మందిరాన్ని కూల్చటం గురించి ఏడ్చేవాడిని.
ఒకనాడు మా నాన్నను అడిగాను. నాకు కబాలా (దేవుడు సృష్టిమర్మం గురించి లోతుగా పరిశీలన) పఠించడం నేర్పడానికి ఒక మాష్టర్ని కుదర్చమని. ‘‘నీవు ఇంకా చిన్నవాడివి. మై మోని డేస్ ప్రకారం 30 ఏళ్ళు వచ్చేదాకా మార్మికవాదం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించకూడదు. ప్రపంచంలో ఎన్నో బాధలున్నాయి. నీవు ముందు నీ చదువు కానివ్వు. అప్పటికి అన్ని తెలుసుకోగలుగుతావు’’ అన్నాడు నాన్న.
మా నాన్న చాలా సంస్కారం గలవాడు. సెంటిమెంట్స్ లేనివాడు. తన కుటుంబీకుల ముందు కూడా తన ఆలోచనలను తెలియజేసేవాడు కాదు. తనవారికంటే అన్యుల శ్రేయస్సు మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు. సిఘెట్‌లో ఆయన సలహా సంప్రదింపులకు ఎక్కువ విలువ ఉండేది. మేము నలుగురం పిల్లలం ` హిల్డా, బయా, నేను మూడవ వాడిని, ఏకైక పుత్రుడిని ` జిపోరా ఆఖరిది.
అమ్మా నాన్నా ఒక షాపు నడిపేవారు. అక్కలిద్దరూ వారికి సాయపడేవారు. నేను చదువుకోవాలనే చెప్పేవారు.
సిఘెట్‌లో కబాలిస్టులు లేరు అని నాన్నెప్పుడు అంటూండే వాడు.
కబాలా చదవాలనే నా జిజ్ఞాసను తుడిచెయ్యాలనే ప్రయత్నించేవాడు. కాని అది సాధ్యం కాలేదు. నేను మోషే ది బీడిల్‌ను నా గురువుగా ఎన్నుకున్నాను.
ఒక సాయంసంధ్యవేళ నేను ప్రార్థిస్తుంటే అతను నన్ను గమనించాడు.
నన్ను ఎరిగినవాడులా దగ్గరకొచ్చి ‘‘ప్రార్థన చేస్తూ ఎందుకు ఏడుస్తున్నావు?’’ అని అడిగాడు.
నాకు తెలియదు అన్నాను. నన్ను నేను ఎప్పుడూ ఆ విషయంగా ప్రశ్నించుకోలేదు. నాలో నుండి దుఃఖం పొర్లు కొచ్చేది. ఏడ్చేవాడిని ` అంతే.
‘‘అసలు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు?’’ అని అడిగాడు.
అది వింత ప్రశ్న ` నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అనేది. నేను ఎందుకు బ్రతుకుతున్నాను? ఎందుకు నాకు శ్వాస ఆడుతున్నది?
అప్పటి నుండి రోజూ అతన్ని కలిసేవాడిని. ప్రతి ప్రశ్న శక్తివంతమయింది. కాని సమాధానం అంత బలంగా ఉండదంటూ చాలా లోతు విషయాలు చెప్పేవాడు.
ప్రశ్నించటం ద్వారానే మనిషి దేవునికి దగ్గరవుతాడు. కాని మనకు అది అర్థం అవదు. అవి మనలో నిక్షిప్తం అయి ఉంటాయి మనం చనిపోయే వరకూ. అసలైన సమాధానాలు నీలోనే ఉన్నాయని తెలుసుకుంటావు అని నాకు చెప్పేవాడు.
‘‘మోషే నీవు ప్రార్థన ఎందుకు చేస్తావు?’’ అని అడిగాను అతడిని.
‘‘నాలోని దేవుడిని ప్రార్థిస్తాను. ప్రశ్నించగల శక్తి నా కివ్వ’’మని అన్నాడు.
అలా రోజూ సాయంత్రం సినెగాగ్‌లో అందరూ వెళ్ళి పోయాక కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం.
సిఘెట్‌లో కబాలిస్టు విషయాలు గాని యూదుల మార్మికవాదం గురించి గాని నాకు తెలిపేవారు లేరని ఒకనాడు వాపోయాను. మార్మికత తెలుసుకోవాలంటే వేలకొలది మార్గాలున్నాయి. ఎవరి మార్గం వారికుంటుంది. తప్పు త్రోవన ప్రవేశించరాదన్నాడు.
అలా మోషే గంటల తరబడి కబాలాల గురించి మార్మికవాదం గురించి నాతో చెపుతూ ఉండేవాడు. అలా నా శిష్యరికం మొదలయింది. ఇద్దరం జోహార్ పేజీలు పదేపదే చదువుతుండేవాళ్ళం. అది కంఠస్తం పట్టటం కాదు. అందులోని దైవత్వం గురించి ఆకళింపు చేసుకునే ప్రయత్నమే అది.
మోషేయే నాకు దైవత్వం గురించి చెప్పగలడని, ఒకనాటికి ప్రశ్నలూ సమాధానాలు ఒకటవుతాయని నేను తెలుసుకోగలనని నమ్మకం కుదిరింది.
ఒకనాడు విదేశీ యూదులనందరినీ వెలివేశారు. మోషే వారిలో ఒకడు.
హంగరీ పోలీసులు వాళ్ళందరినీ పశువుల బండ్లలోకి కుక్కారు. వాళ్ళు నిశ్శబ్దంగా రోదించారు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్ మీద నిలబడి మేమూ ఏడ్చాము. నల్లటి పొగలు కక్కుతూ రైలుబండి వారితో వెళ్ళిపోయింది.
నా వెనకెవరో ఇంకేమి జరుగుతుందనుకుంటున్నావు. ఇది యుద్ధం అన్నారు. వెళ్ళగొట్టబడిన వారి గురించి అందరూ త్వరలోనే మరచిపోయారు. వాళ్ళు గెలీసియాలో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారంటూ పుకార్లు వినిపించాయి.
జీవితం గాడిన పడిరది. షాపుల వాళ్ళు తమ వ్యాపారం బాగా కొనసాగించారు. విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడు తున్నారు. పిల్లలు ఎప్పటి మాదిరిగానే రోడ్లమీద ఆడుకుంటున్నారు.
ఒకనాడు నేను సినెగాగ్ వెళుతుంటే మోషే ఒక బల్లమీద కూర్చుని కనిపించాడు.
బహిష్కరింపబడినవారితో బయలుదేరిన బండి ప్రయాణం సంగతులు చెప్పాడు.
బండి హరారే సరిహద్దు దాటి పోలెండ్‌లోకి ప్రవేశించగానే గెస్టాపో (జర్మనీ రహస్య పోలీసులు) అధీనంలోకి తీసుకున్నారు. బండి ఆపి యూదులందరినీ దిగమన్నారు. బయట ఉన్న ట్రక్కులలోకి ఎక్కమన్నారు. ట్రక్కులు ఒక అడవి వైపుకు చేరాక అందరినీ దిగమన్నారు. వారిని పెద్ద కుంటలు త్రవ్వమన్నారు. గస్టాపోలు ఒక్కొక్కరిని వరుస బెట్టి కాల్చి చంపారు. పసివాళ్ళను గాలిలోకి ఎగురవేసి కాల్చారు. ఇది జరిగింది కలామే దగ్గరలోని గెలీసియా అడవి దగ్గర. మోషేని కాళ్ళవైపు కాల్చగా పడిపోయాడు. చనిపోయాడని వదలి వెళ్ళారు.
రాత్రింబగళ్ళు నడుస్తూ జరిగిన సంఘటన గురించి యూదుల యిళ్ళకెళ్ళి చెప్పాడు. మాల్కా అనే అమ్మాయి మృత్యువుతో పోరాడటం గురించి, టోబీ అనే టెయిలర్ తన కొడుకుల కంటే ముందు తనని చంపమని వేడుకున్నాడు అని చెప్పాడు.
మోషేలో చాలా మార్పు వచ్చింది. పాడటం మానేశాడు. అతనిలోని సంతోషం యిగిరిపోయింది. దేవుని గురించి, కబాలా గురించి ప్రస్తావించటం లేదు. తాను చూసిన దాని గురించే మాట్లాడాడు. జనం అతన్ని నమ్మలేదు, వినటం కూడా మానేశారు. కొందరు జాలిపడటం కోసం కల్పించి చెపుతున్నాడన్నారు. మరి కొందరు అతనికి మతి భ్రమించిందన్నారు.
కానీ, మోషే ఏడుస్తూ బ్రతిమలాడాడు. ‘‘నేను చెప్పేది వినండి చాలు బాబు, మీ డబ్బు, దయా నాకు వద్దు. మీరు వింటే చాలు’’ అని సినెగాగ్‌లో ప్రార్థనల మధ్య గట్టిగా అరిచేవాడు. నేనూ నమ్మలేదు. అతను చెప్పేది వింటూ ఉండేవాడిని, జాలి పడ్డాను.
‘‘నేను పిచ్చివాడిననుకుంటున్నారు’’ అంటూ కన్నీరు కార్చేవాడు.
‘‘జనం నిన్ను నమ్మాలని ఎందుకనుకుంటున్నావు, నేనైతే వాళ్ళను లెక్కచేయను’’ అన్నాను.
కాసేపు కళ్ళు మూసుకుని ` ‘‘నీకర్థం కాదు. నేను దైవికంగా బయటపడ్డాను, తిరిగి వచ్చాను. నా చావు అనుభవం మీకందరికీ చెప్పి, మీ అందరికీ యింకా వ్యవధి ఉంది, సావధానులు కండి అని చెపుతున్నాను. నాకు బ్రతకాలనే ఆశ లేదు. నేను ఒంటరివాడను. మీ అందరికీ వార్నింగ్ యిద్దామని చెపుతున్నాను. కానీ ఎవరూ వినటం లేదు’’ అన్నాడు.
*****
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.