చిత్రం-27

-గణేశ్వరరావు 

కొందరు చిత్రకారులు ‘వస్తువు’ కు కాక ‘శిల్పానికి ‘ ప్రాధాన్యం ఇస్తారు. వారి చిత్రాలు రూప రహితంగా వుంటాయి. అవి అర్థం కావడం కష్టం. మనకు మొట్ట మొదట ఇలాటి చిత్రాలను పరిచయం చేసినది పద్మశ్రీ ఎస్వీ రామారావు. గుడివాడకు చెందిన వీరు అమెరికాలో స్థిరపడ్డారు. మన దేశం లోని చిత్రకారులు(ఉదా. రాజా రవి వర్మ) అలంకారిక చిత్రకారులు కాగా పాశ్చాత్య దేశ చిత్రకారులు (ఉదా. పికాసో) చాలా మంది నైరూప్య చిత్రకారులు. రామారావు లండన్ చేరాక పాశ్చాత్య చిత్ర కళా రీతులను అధ్యయనం చేసాక నైరూప్య చిత్ర శైలికే ప్రాధాన్యతను ఇచ్చారు. అరూప చిత్రాలు – కుక్క తోకకు రంగులు పూసి కాన్వాస్ మీద పులిమించి తయారు చేసినవని అంటూ కొందరు వెక్కిరించినా, దీన్ని నవ్య కళ గా సంజీవ్ దేవ్ లాటి వారు గుర్తించి మెచ్చుకున్నారు. రూపాన్ని అపురూపంగా చిత్రించే ప్రయత్నంలో, చిత్రకళ ముందడుగు వేసింది, ఎన్నో మార్పులకు గురైoది, విశ్వవ్యాప్తం గా ఎందరో ఈ శైలి ని అనుసరిస్తున్నారు.
టెక్సాస్ కి చెందిన కే రేయింకీ అలాటి అరూప చిత్రకారిణి. తను వేసిన ఈ చిత్రానికి మొన్న ఆమె బోల్డ్ బ్రష్ అవార్డ్ గెలుచుకుంది. ఆయిల్ పెయింట్స్ కు సహజంగా వున్న ద్రవ స్వభావo ఆమెని ఆకర్షిoచింది. ఆమె తైల వర్ణ చిత్రాలు గీయడం చిన్నతనం నుంచే ప్రారంభించింది. కాన్వాస్ పైన ఆమె కుంచెతో పొరల పై పొరలని గీసినప్పుడు .. వాటికి పరిమితులు ఉండవు, అవి ఒక స్థలానికి .. సమయానికి లోబడి వుండవు. ఆమె కోరుకున్నదీ అదే. తన చిత్రాలు అనుభూతి చిత్రాలని, అవి అనూహ్యమైన అనుభవాన్ని చూపరులకి కలగజేయాలని ఆమె కోరుకుంటుంది. తన చిత్రాలు చూపరుల ఊహలకు రెక్కలు తొడిగి, కాల్పనిక వీధుల్లో వారిని విహరింప చేయాలని ఆమె ఆశిస్తుంది. నిజానికి ఆమె చిత్రాలలో ఉన్నదే అది – అద్భుత వర్ణ ప్రపంచం .. అపురూప వర్ణ సమ్మేళనం. ఆస్కార్ వైల్డ్ ‘కేవలం రంగులు..భావాలు పాడుచేయని, నిర్దిష్ట రూపం లేని రంగులు మాత్రమే మిమ్మల్ని వేయి రకాల గొంతులతో పలకరిస్తూ మీ హృదయానికి తాకగలవు’ అన్నట్టు ఆమె చిత్రాలలో వర్ణవిన్యాసం వుంటుంది.
 
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.