జ్ఞాపకాల సందడి-26

-డి.కామేశ్వరి 

ఈ  కరోనా  కట్టడి  వచ్చాక  netflix  హాట్స్టార్ చూడడం ఒక్కటే కాలక్షేపం అయి  ఎన్నెన్ని  సినిమాలు  సీరియల్స్  shotfilms ! ఎంతో గ్రిప్పింగ్ గా, 20,25ఎపిసోడ్స్  ప్రత్యేకం ott  కోసం తీసిన రెల్స్టిక్ గా తీసిన  క్రైమ్  అట్టడుగు వర్గాల కధలు  చూసాక అసలు  మామూలు  సినిమాలు  చూడలేకపోతున్నా.   ఎంత అద్భుతంగా, అనవసరమైన  చెత్త  లేకుండా పోలీస్  వ్యవస్థ,   జైళ్లలో కరుడుకట్టిన నేరస్తులు, నిరపరాధులు అన్యాయంగా నేరస్తులుగా శిక్షించపడడం (జైల్ ) హాట్స్టార్), రాజకీయ కధలు (సిటీ అఫ్  డ్రీమ్స్ ), క్రిమినల్ జస్టిస్,  అమాయకంగా హత్యానేరం లో ఇరుక్కుపోయిన టాక్సీ డ్రైవర్  ఆర్య   డ్రగ్ కేసులో భర్త ఇరుక్కుని మాఫియా చేతిలో  చనిపోతే ఆ సరుకు ఎక్కడుందో చెప్పమని ఫామిలీ ని హింస పెడితే  భార్య  ధైర్యంగా పోరాడడం  ఎన్నో మనకు  తెలియని ప్రపంచాన్ని చూపించే అద్భుత కధనాలు. 

అన్నిటికంటే అట్టడుగు ఆడవారి దుర్భర జీవితాలు  వారి బతుకులు చూస్తే వళ్ళు జలదరిస్తుంది.  మోసపోయిన ఆడవాళ్లు,  ఇంట్లో హింస భరించలేక పారిపోయిన స్త్రీలు,  అత్యాచారాలకి గురయ్యి  అమ్మకానికి విదేశాలకి తరలించే  ముఠాలు,  ప్రేమని నమ్ముకు మోసపోయి  బతికే దారిలేక వ్యభిచార వృత్తిలోకి దిగి మనసు శరీరాలు రాయిలా అయిపోయి బతికే స్త్రీలు,  పడుపువృత్తిలో  అడ్డమైన నీచమైన వెధవలందరికి ఒళ్ళప్పగించి వాళ్ళు పడే నరకయాతన,  ఎక్కడికి కావలిస్తే అక్కడికి  సింగారించి టాక్సీ ఎక్కించి పంపి డబ్బులు దండుకునే  వ్యాపారాలు,  ఇంట్లోనించి తాగుబోతు తండ్రి తన్నులు తినలేక పారిపోయిన చిన్న కుర్రాళ్ళు  రౌడీ షీటర్ ల చేతిలో పడి  డ్రగ్మాఫియా లుగా తయారవడం (beyond the clouds )….అబ్బా  చూస్తుంటే  మనం ఎంత  సుఖంగా బతుకుతున్నాం! అసలు  ఇలాటి  జీవితాలు  ఇంత  ఘోరంగా  వుంటాయా! అని  బిత్తర పోతాం.

గుడిసెల్లో బతుకులు  యథాతథంగా చిత్రీకరిస్తూ ఎంతో  గ్రిప్పింగ్  తీస్తున్న  ఈ సినిమాలు  చూస్తుంటే వేదన కలుగుతుంది  ముఖ్యంగా ఆడవాళ్ల బతుకులు ఎప్పటికి ఇంతేనా అనిపిస్తుంది.  మోసపోవడం అన్నది ఎప్పటికీ మారే చరిత్ర కాదనిపిస్తుంది. 

ఈ  కొత్త తరము చదువుకుంటున్నారు,  సంపాదించుకుంటున్నారు.  కావలసినవారిని ప్రేమించి పెళ్లిచేసుకుంటున్నారు.  చిన్న  విషయాలలో  సర్దుబాటు లేక  ఆత్మాభిమానాలు,  వ్యక్తిత్వాలు, ఆత్మగౌరవాలు అంటూ ఎదుటివారిని అర్ధంచేసుకోలేక అవతల వ్యక్తి లో మైనస్ పాయింట్లు మాత్రమే చూస్తూ గొడవలు పడి  విడిపోయి, సుఖంగావున్న జీవితాలు చిన్న విషయాలకి సమస్యల సుడిగుండాల్లోకి నెట్టుకుంటున్నారు.  ఇలాంటి  జీవితాలు  చూసైనా  సుఖమయ జీవితం,  సమాజం పెళ్లికి ఇచ్చే  గౌరవం, అధికారం,  చట్టం అంతా  స్త్రీలకి  తోడుగా ఉంటుంది అన్నది మర్చిపోకూడదని ఈ నాటి  యువతకి  నా  విన్నపం. చదువుకున్నాం,  బోలెడు  ఆర్జించుకుంటున్నాం,  మాకేం  ఖర్మ  అలా ఎందుకు  బతుకుతాం?  పురుషుడితో  సమంగా హక్కులు  అధికారాలు  వున్నాయి, మీరు  చెప్పిన  చదువుసంధ్యకి  డబ్బు లేనివారితో మాకు పోలికేమిటి  అంటారు.   చదువుకుంటున్న,  సంపాదిస్తున్న స్త్రీలకి గృహహింస, సెక్సువల్  హెరాస్మెంట్లు, అత్యాచారాలకధలు  ఎన్ని  వింటున్నాం!

ఆర్ధిక స్వతంత్రం  ఉన్నంత మాత్రాన  సమస్యలు  వుండవనుకోవద్దు.  సింగల్ వుమన్, సింగిల్ mothers  కష్టాలు తెలుసుకుని, ఒక ఇల్లు సంసారం లో వున్న  రక్షణ  ఇంకెక్కడా దొరకదు  అని ప్రతి దంపతులు  అర్ధం చేసుకుని  సామరస్యంగా  సర్దుకు బతకాల్సిన  అవసరం ఇద్దరికి  ఉండాలి.  అలాని మగాడి  దౌర్జన్యం, శాడిజం,  పరస్త్రీలతో  సంబంధాలు,  కావాలని  హింసించి అధికారం చెలాయించినా సర్దుకుపోవాలి  అని నేనెపుడూ  చెప్పను.

కానీ  చిన్నవిషయాలు భూతద్దం లో చూడద్దు.  మాటలతో సర్దుకుపోయే  విషయాలని  లాగి తెంచుకోవద్దు .  పాతకాలం మాటలు అనుకున్నా పరవాలేదు.  లోకాన్ని  చూసి అనుభవంతో చెప్పేమాటలు. కధల్లో అయినా,  జీవితం లో అయినా నేనిదే అమ్మాయిలందరికీ  చెపుతా. 

వ్యక్తిత్వం మీ అభిప్రాయం,  అయిష్టత  చెప్పగలిగే  ధైర్యాన్నివ్వాలి  అంతేగాని   ఆత్మాభిమానం జీవితాన్ని కష్టాలలో నెట్టుకోడానికి కాదు.  ఇద్దరు వ్యక్తులు  భార్యభర్తే అక్కరలేదు.  అమ్మ అయినా  అక్కయినా,  చెల్లి కూతురు  ఎవరయినా ఒక ఇంట్లో  కలిసి  వున్నప్పుడు  అభిప్రాయ బేధాలు  రాక  తప్పవు.  అడ్జస్ట్మెంట్  అన్నది ఉండాలి.  forget అండ్  forgive  ఆటిట్యూడ్  అలవర్చుకోకపోతే  మనశ్శాంతి మిగలదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.