Please follow and like us:
పేరు ఘంటశాల నిర్మల. స్వస్థలం విజయవాడ. పెరిగిందీ , ఆంగ్లసాహిత్యంలో గ్రాడ్యుయేషన్ చేసిందీ అక్కడే. ఎమే చదువుతూండగానే ఆంధ్రజ్యోతి సంస్థలో ఉపసంపాదకురాలిగా చేరాను. ఇరవయ్యేళ్లపాటు (ఆం . జ్యో. స. వారపత్రికలోనే ) నాకు ఇష్టమైన జర్నలిజంలో కొనసాగి , అసోసియేట్ ఎడిటర్ గా సంస్థనుంచి వైదొలగాను.
2001 నుంచి హైద్రాబాద్ లో స్థిరనివాసం. స్వచ్ఛంద పాత్రికేయురాలిగా , పత్రీకరణనిపుణురాలి (ప్రింట్ డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్) గా పనిని ఎంచుకుంటున్నాను. ఇక్రిశాట్ వంటి సంస్థలకు ఆన్లైన్ న్యూస్ లెటర్ ఎడిటర్ గా, పేదరిక నిర్మూలనాసంస్థ (సెర్ప్- వెలుగు), రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వంటి సంస్థలకు కొన్ని ప్రాజెక్టుల అమలులో పాత్రికేయపరమైన భాగస్వామ్యం వంటి బాధ్యతల నిర్వహణ.
ఏ పనిని తీసుకున్నా, లింగవివక్ష (జెండర్ డిస్పారిటీ ) నాకు ప్రాధాన్యతాంశం. ఆ తరువాత బాలలకు అందవలసిన సహజన్యాయం, మానవహక్కులు నేను ఎంచుకునే అంశాలు.
ఇక వ్యావృత్తి గురించి:
బడి చదువుల నాటి నుంచే సాహిత్యపఠనమే ఆసక్తి. చదవటం వ్యసనం.
కళాశాలనాళ్ళలో అల్లిబిల్లి రాతలుగా మొదలైన వ్యాసంగం వికసనం చెందే క్రమానికి విజయవాడ ఆకాశవాణితో అనుబంధం చాలా దోహదం చేసింది. అలాగే, పాత్రికేయవృత్తి కూడా సహాయపడింది అనుకుంటాను.
* 2002లో వెలువడిన ‘నిర్వచనం’ నా కవిత్వ సంపుటి. ఆ పుస్తకానికి 2004 సంవత్సరానికి ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కారం, 2005 ఏడాదికి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్త్తమ కవిత్వ పురస్కారం అందుకున్నాను.
* 2011లో ‘అమ్మపదం’ కవిత్వసంకలనానికి ప్రధాన సంపాదకత్వం. ఆదికవి నన్నయ నుంచి నేటి వచనకవులవరకు అమ్మ/ అమ్మతనం కేంద్రంగా వెలువడిన పద్య, వచన కవిత్వం నుంచి సాధ్యమయినంత మేలి రచనల కూర్పు ఈ సంకలనం.
* ప్రధాన సంపాదకురాలిగా, పితృత్వం తాలూకు విభిన్నపార్శ్వాలను స్పృశిస్తూ 160మంది పద్య/ వచనకవుల రచనలనుంచి ఏర్చి కూర్చిన ఉత్తమ రచనల సంకలనాన్ని ‘నాన్నపదం’ పేరిట 2020 లో వెలువరించాను.