నారి సారించిన నవల-25

రంగనాయకమ్మ-2

                      -కాత్యాయనీ విద్మహే

రంగనాయకమ్మ నాడైరీలో ఒక పేజీ వ్రాయటానికి ఒక ఏడాదికి  ముందే వచ్చిన నవలలు పేకమేడలు, బలిపీఠం. రెండింటి రచనాకాలం 1962 . అదే సంవత్సరం  జులై లోగా పేక మేడ లు,  సెప్టెంబర్  నుండి 63 ఏప్రిల్ వరకు బలిపీఠం నవలలు ఆంధ్రప్రభలో వరుసగా సీరియళ్ళుగా ప్రచురించబడ్డాయి. 1966 నాటి బలిపీఠం నవల ప్రచురణకు ముందుమాట వ్రాస్తూ కొడవటిగంటి కుటుంబరావు “సమాజంలో ఎల్లప్పుడూ గతానికీ, భవిష్యత్తుకూ వర్తమానంలో సంఘర్షణ జరుగు తూనే ఉంటుంది. గతం ఒక విజయం సాధించినప్పుడల్లా సాంఘికాభ్యుదయం ఒక అడుగు వెనక్కు వేస్తుంది. భవిష్యత్తుకు ఒక విజయం లభించినప్పుడల్లా ఒక అడుగు ముందుకు వేస్తుంది.” అని ప్రతిపాదించి ఆ సూత్రం ప్రాతిపదిక మీదనే బలిపీఠం నవల విశిష్టతను అంచనా వేసాడు. ఈ సూత్రం ఆధారంగా పేకమేడలు నవలను కూడా అంచనా వేయవచ్చు. 

1

 సాహిత్య పఠనంతో , ఆడపిల్లగా కాక తనను తోటి వ్యక్తిగా భావించి అన్ని విషయాలు చర్చించే అన్నయ్య కేశవ్  స్నేహం వల్ల ప్రపంచాన్ని తెలుసుకొని బుద్ధిని , హృదయాన్ని వికసింపచేసుకొని వ్యక్తిత్వాన్ని సంతరించుకొన్న భాను కథ పేకమేడలు నవల. భాను జీవితాన్ని పాఠకుల ముందు పరచే కథకుడు కేశవ్ . భానుతో తన స్నేహాన్ని , వివిధ సందర్భాలలో  చేసిన సంభాషణల, సంభవించిన ఘటనల సమాహారం నుండి ఈ నవల ఇతివృత్తం రూపు దిద్దుకొన్నది.   ఉత్తమ పురుషులో నవల సాగుతుంది.  

భాను కేశవ్ కు పెదనాయనమ్మ మనుమరాలు. వాళ్ళింట్లో ఉండి స్కూల్ ఫైనల్ చదివాడు. వయసులో చిన్నదైనా తన క్లాసే కావటంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.     స్కూల్ ఫైనల్ తరువాత   పైకి చదవాలని ఉన్నా తండ్రి ఆర్ధిక స్థితి వల్ల , ఆడపిల్లలకు పెళ్ళిచేయటమే ప్రధాన బాధ్యతగా  చేసిన కుటుంబ సంస్కృతి వల్ల భానుకు  అది సాధ్యం కాలేదు. కేశవ్ చదువులకు పోతే భాను పెళ్లయి కాపురానికి వెళ్ళింది.  స్త్రీపురుషుల  అసమానతలు , స్త్రీలపై పురుషులు చేసే అధికారం పునాదిగా   నిర్మిత మైన దాంపత్య సంబంధాలు గతానికి సంబంధించినవి కనుక అక్కడ ఆమెకు స్నేహం లభించ లేదు. ప్రేమ , గౌరవం గగన కుసుమాలు. భర్తకు  ఆమె ఇష్టాయిష్టాలు, శరీరారోగ్యం, మానసిక వేదన ఏవీ పట్టవు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరిముందయినా ఆమెను చులకన చేయటానికి వెనుకాడడు. ఆర్ధికంగా ఆమె ను నిస్సహాయురాలిని చేసి ఏడిపిస్తాడు. ఆమె తన సేవలకోసమే పుట్టింది అన్నట్లు ప్రవర్తిస్తాడు. గతకాలపు హింసాయుత అధికార సంబంధాలలో నిత్య నరకం అనుభవం అవుతుంటే భార్యాభర్తల మధ్య సమసంబంధాల సహజీవన సాహచర్యం గురించిన తన ఆకాంక్షలు , ఆశలు , కలలు  భగ్నం అవుతుంటే  సహనం కూడదీసుకొంటూ వర్తమానంతో సంఘర్షించి  సంఘర్షించి  చివరకు ఆత్మహత్య చేసుకొన్నది భాను. 

భాను ఆత్మహత్య ఒకరకంగా భవిష్యత్తు పై గతం సాధించిన విజయమే. సాంఘికాభ్యుదయం ఒక అడుగు వెనకబట్టినట్లే.  కానీ ఆమె చూపు భవిష్యత్తు లోని వెలుగుల వైపు ఉందని కొడుకు పెద్ద య్యాక చదువుకోవాలని వ్రాసి పెట్టిన ఉత్తరం చెప్తుంది. “ స్త్రీని పురుషుడు గౌరవించ గలిగి నప్పుడు, భార్యని భర్త ప్రేమించగలిగినప్పుడు , ఈ శరీరాలలో అధికార దాహం  అంతరించి పోయి నప్పుడు, ప్రతి సనాతన రక్త బిందువూ ఇగిరి గాలిలో కలిసిపోయినప్పుడు , నీ- నా ఎక్కువ తక్కువలు అంత రించి నప్పుడు , గృహాలన్నీ శాంతి నిలయాలైనప్పుడు , ప్రతి స్త్రీ హృదయమూ సంతోష సదన మైనప్పుడు,-అప్పుడు నాకు స్త్రీగా జన్మించాలని ఉంది.” అన్న  వాక్యాలు  ఆమె లోని జీవితేచ్చనే ప్రతిధ్వనిస్తున్నాయి. ఆమెది బ్రతుకు పట్ల విరక్తి కాదు. పురుషాధిక్యత గల సనాతన సమాజ వైఖరి పట్ల విరక్త . ఆ సమాజం మంచికి మారాలన్నది ఆమె కోరిక. ఎలా మారుతుందో , అందుకు తానేమి చెయ్యాలో ఆమె చూపుకు అందలేదు. ఒంటరి నిస్సహాయ దుఃఖం ఆత్మహత్య వైపుకు ఆమెను తోసింది. స్త్రీని బ్రతకనివ్వటానికి , భయం లేకుండా జీవించనియ్యటానికి ,  స్త్రీ కన్నీటికి కారణం కాకుండా ఉండటానికి, స్త్రీ స్వాతంత్య్రం హరించకుండా ఉండటానికి అవసరమైన సంస్కారాలు పురుషులు అభివృద్ధి చేసుకోవాలన్నభాను  ఆకాంక్షకూడా ఈ ఉత్తరంలో కనబడుతుంది. ఆ రకంగా పేకమేడలు నవల అసమ సంబంధాల దాంపత్య వ్యవస్థపట్ల స్త్రీల నిరసనను లోపల నుండి నమోదు చేసింది.    

స్త్రీపురుష అసమానతలు దాంపత్య సంబంధాలను ఎంత దుఖభూయిష్టం చేస్తున్నాయో పేకమేడలు నవలలో చూపిన రంగనాయకమ్మ కుల అసమానతలు , ఆధిక్యతలు కూడా అలా దాంపత్య సంబంధాలను వికృతం చేసేవే అని బలిపీఠం నవలలో చూపింది. పెద్దలు కుదిర్చి చేసే పెళ్ళిలో కుల అసమానతల సమస్య ఉండదు. అవి కులంలో వివాహాలే కనుక. యువతీ యువకులు ఒకరినొకరు ఇష్టపడి స్వయం నిర్ణయంతో చేసుకొనే  పెళ్లిళ్లల్లో అవి కులాంతరాలు కావటానికి వీలుంది. అందులోనూ సంస్కరణ  భావాలు కలవాళ్ళకు కులాంతర , కట్న రహిత వివాహాలు ఆదర్శం అవుతాయి. బలిపీఠం నవలలో భాస్కర్ ఆదర్శం అదే . వితంతువును పెళ్లాడటం కూడా వుంది అతని ఆదర్శాలలో. అయితే అతను తొలిగా ఇష్టపడిన , పెళ్లి చేసుకొందామని అనుకొన్న తార అతని వలెనె మాల కులపు వ్యక్తి . కానీ పెళ్లాడింది బ్రాహ్మణ యువతిని. ఊహ తెలిసినప్పటి నుండి వితంతువుగా బతకటంలోని వేదనను అనుభవించి   జబ్బుపడిన కాలంలో మోడులా మరణించటం ఇష్టం లేక పునర్వివాహం కోరుకొన్న బాల వితంతువు అరుణ.  పెళ్లి ద్వారా కూడా ఒక వ్యక్తికి సహాయం చేయటానికి వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయదలచుకొన్నాడు కనుక భాస్కర్  అందుకోసం ప్రేమించిన తారను ఒదులుకొనటానికి సిద్ధపడ్డాడు. అరుణ ను ప్రకృతి ఆశ్రమంలో చేర్పించి వైద్యం చేయించి కోలుకున్నాక పెళ్లి చేసుకొన్నాడు. 

నిచ్చెనమెట్ల వర్ణ వ్యవస్థలో పై మెట్టు కులాల ఆధిక్యత , కింది మెట్టు కులాల న్యూనత వ్యవస్థీకృతమై భావజాల సంస్కృతిలో భాగమై మనుషుల చిత్త వృత్తులలో  ఇంకిపోయాయి. అది మానవ సంబంధాలలో వైరుధ్యాలకు, ఘర్షణలకు కారణం అయింది. అదే బలిపీఠం నవల ఇతివృత్తానికి అంతఃసూత్రం . ఒక స్త్రీగా తనకూ కొన్ని కోరికలు ఉన్నాయని పునర్వివాహా నిర్ణయానికి రావటం వరకు , అత్తమామలను ధిక్కరించి భాస్కర్ ను పెళ్లాడటం వరకు అరుణ తన భవిష్యత్తు కోసం గతం తో యుద్ధం చేసి విజయం సాధించినట్లే. కానీ గతానికి సంబంధించిన అగ్రవర్ణ దురహంకారాన్ని వదులుకోకపోవటం వల్ల అరుణ తన దాంపత్య జీవితాన్ని దుర్భరం చేసుకొన్నది. కులాన్ని గుర్తు చేసి ప్రతిదానికీ కులాన్నే కారణంగా వేలెత్తి చూపే అత్తమామలు , వాళ్ళ ద్వారా వాళ్ళ వెనుక ఉన్న సమాజం గురించిన ఆలోచన అరుణ లోని అగ్రవర్ణ అహంకారాన్ని రెచ్చగొట్టే శక్తులు. భాస్కర్ అక్క సీతమ్మ పట్ల , ఆమె కొడుకు గోపీ పట్ల అరుణ ప్రవర్తనను నిర్దేశించింది వాళ్ళ కులమే. సీతమ్మ ను వదినా అని వరసపెట్టి పిలవటానికి , కూతురికి అత్త అని చెప్పటానికి, సీతమ్మ కొడుకు తన కూతురికి వరసైనవాడు అని అంగీకరించటానికి ,సీతమ్మ చేతివంట తినటానికి , సీతమ్మ గానీ ఆమె కొడుకు గానీ తిన్న పళ్లాలను కడగటానికి, భర్త వైపు బంధువులను ఆదరించ టానికి అన్నిటికీ అవరోధంగా నిలిచింది అరుణ లోని బ్రాహ్మణ కుల దురహంకారమే. అగ్రవర్ణాల ఆధిక్యత కింది కులాల న్యూనత పరస్పర సంబంధమైనవి. అది అంత ప్రధానాంశం కాకపోయినా ఈ నవలలో దానిని గురించిన సూచన కూతురి రంగు విషయంలో అరుణ తో జరిగిన సంభాషణ సందర్భంలో  భాస్కర్ ఆలోచనల రూపంలో  వ్యక్తం కావటం గమనించవచ్చు. 

అరుణ భాస్కర్ ల కులాంతర వివాహ జీవిత వైఫల్యాన్ని చూపిస్తూనే రంగనాయకమ్మ ఈ నవలలో అగ్రవర్ణ అహంకారాన్ని వదులుకొనే కొద్దీ , ఒకరి కులాచార వ్యవహారాల పట్ల , ఆహారపు టలవాట్ల పట్ల మరొకరు సహనాన్ని అలవరచుకొనే కొద్దీ , జీవితంలో అభివృద్ధికి , అభ్యు దయానికి అవసరమైన మార్పుల కు సంసిద్ధం అయ్యే కొద్దీ అలాంటి వివాహాలు సాఫల్యం చెందుతాయని అరుణ చెల్లెలు అమల జేమ్స్ ను పెళ్ళాడి నిర్మించుకున్న  కుటుంబ  జీవితం ద్వారా నిరూపించింది. వేషభాషలను , జీవిత విధానాన్ని సమతలం చేసే  చదువులు , ఉద్యోగాలు , ఆర్ధిక సౌష్టవం వంటివి కులాల వల్ల మనుషుల మధ్య లేచే అగడ్తలను  పూడుస్తాయన్న అవగాహన కూడా ఈ నవలెతివృత్త గమనంలో భాగమైంది. ‘తీవ్రమైన సాంఘిక విప్లవానికి సంస్కార హృదయాలు అత్యవసరమైనవి’ ( ద్వితీయ ముద్రణ ‘మనవి’ మాటలు) అన్నది రంగనాయకమ్మ  అభిప్రాయం.  

   2

1965, 66 సంవత్సరాలలో వచ్చిన నవలలు స్త్రీ , చదువుకున్న కమల. స్త్రీ ఆంధ్రప్రభ వార్తాపత్రికలోను, చదువుకున్న కమల జ్యోతి మాసపత్రికలోనూ సీరియళ్ళుగా ప్రచురించబడ్డాయి. 1966 లో రెండూ పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి. 

కుటుంబం లో మనుషులమధ్య ఉండవలసినవి అధికార అధీన సంబంధాలు కావనీ , ప్రేమతోటి , అవగాహనతోటి మెరుగెక్కించుకొనవలసిన ప్రజాస్వామిక సంబంధాలని నిరూపించే ఇతివృత్తం  స్త్రీ నవల లో ఉంది. తల్లిదండ్రులతో తమ ఆలోచనలను , అభిప్రాయాలను పంచుకోగలిగిన చనువు పిల్లలకు, పిల్లల అభిప్రాయాలను విని అర్ధం చేసుకోగలిగిన సహనం తల్లిదండ్రులకు ఉంటే ఆ  కుటుంబం ఎన్ని సంఘర్షణలకు లోనైనా ఆరోగ్యకరమైనదని ఈశ్వరసోమయాజి కుటుంబాన్ని చూపి తెలియచెప్పింది రంగనాయకమ్మ. సంప్రదాయ  బ్రాహ్మణ కుటుంబమే అయినా ఈశ్వర సోమయాజికి ఆయన భార్యకు కొడుకుకు , కూతుళ్ళకు, కోడలికి మధ్య ఉన్న సంబంధాలు పరస్పర ప్రేమతో  , సహనంతో ఆర్ద్రంగానే ఉంటాయి. కూతురు పద్మజ ఇంట్లో తల్లిదండ్రులతో నైనా , అన్నతోనైనా స్వేఛ్ఛగా మాట్లాడగలదు. ఇంట్లోనైనా , బయట అయినా ఏ మొహమాటలూ లేకుండా అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలదు. విమర్శ ద్వారా ఆలోచనావిధాన్ని సరైన దారికి మళ్లించి జీవితాన్ని మరింత సౌఖ్యంగా మలచుకొనవచ్చని నమ్మి ప్రవర్తిస్తుంటుంది. స్త్రీ పురుష వివక్ష కారణంగా స్త్రీలు అవకాశాలకు పరాయీకరింపబడటం అంగీకరించలేదు. చదువుకొనటానికి , ఇష్టమైన వృత్తిని చేపట్టటానికి, జీవన సహచరులను స్వయంగా ఎంపిక చేసుకొనటానికి నిర్ణయాధికారం స్త్రీలకే ఉండాలని భావిస్తుంది. ఆ దిశగానే ఆమె ఆచరణ ఉంటుంది. ఎవరి జీవితాన్ని వాళ్ళు స్వంత బాధ్యత మీద నిర్మించుకొనటం స్త్రీకి ఆదర్శం గా చేసి చూపటం 1965 నాటికి ఒక విప్లవమే.  

గతం నిర్వచించి వదిలిన స్త్రీల నమూనాలను బద్దలు చేస్తూ కొత్త నమూనాలను మూసపోస్తూ స్త్రీకి సంబంధించిన సాధికార సుందరమైన భవిష్యత్తును నిర్మించే ప్రయత్నం స్త్రీ నవలలో కనబడుతుంది. తన ఆలోచనలకు, ఆకాంక్షలకు, తన జీవితం మీద తన అధికారానికి ప్రాధాన్యతనిచ్చి సంప్రదాయ కౌటుంబిక సామాజిక చట్రాలను అధిగమించి మనసుకు నచ్చినవాడు మరొక మతం వాడైనా సందేహం ఏమీ లేకుండా పెళ్లాడిన పద్మజ, తల్లిదండ్రులకు ఆమోదయోగ్యమూ , హర్షణీయమూ అయిన పద్ధతిలో జీవించాలనుకొని తనను తాను సిద్ధం చేసుకొని  తనకు నచ్చిన యువకుడి కులం వేరు కావటం వల్ల సాధ్యపడని పెళ్లి గురించిన చింతనతో ఆత్మహత్యకు తలపడిన పద్మజ చెల్లెలు సుజాత, కూతురి సుఖఃమూ సంతోషమూ , భవిష్యత్తు కన్నా సంప్రదాయానికి కట్టుబడటం గొప్పదేమీ కాదని గ్రహించి కులపరిధులను దాటటానికి సుముఖత వ్యక్తం చేసిన కామేశ్వరమ్మ వీళ్ళందరూ ఏదో ఒక స్థాయిలో గతానికి , భవిష్యత్తుకు మధ్య జరిగిన సంఘర్షణలో నలిగినవాళ్ళే. గతానికి లొంగక పోవటం , భవిష్యత్తుకు అభిముఖంగా  ఒక అడుగు ముందుకు వేయటం వీళ్లందరిలోనూ ఉంది. అన్నిటికంటే విశేషం ఈ నవలలో పద్మజ తండ్రి ఈశ్వరసోమయాజి సంప్రదాయ కుటుంబానికి యజమానిగా అధికార స్థానంలో ఉన్నవాడే అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఏదో ఒక మేరకు ఆ అధికారాన్ని వదులుకొనటానికి సిద్ధపడుతుండటం. పద్మజ కోరిన చదువులు చెప్పించటం వరకు ఒక ఎత్తు అయితే ఆమె ఒక ఆంగ్లో ఇండియన్ ను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకొంటున్నాను అని చెప్పినప్పుడు ఆహ్వానించి తాను పూనుకొని ఆ పెళ్లి చేయలేనన్నాడే కానీ నువ్వు చేసుకోవద్దు అని శాసించలేదు. ఎట్లా చేసుకొంటావో చూస్తాను అని బెదిరించలేదు. ఈశ్వర సోమయాజిలాగా , కామేశ్వరమ్మ లాగా మానవ సంబంధాలకు, ప్రేమకు ప్రాధాన్యత నిచ్చి కర్కశమైన సంప్రదాయాన్ని, గతానుగతికమైన సామాజిక విలువలను ధిక్కరించే సంస్కరాలు మనుషులు అభివృద్ధి చేసుకొనే కొద్దీ సమాజం మంచికి మారే అవకాశం ఉందని సూచించింది రానగనాయకమ్మ . 

డబ్బు ఎంత ఉన్నా తమకు  కావలసిందేమిటో స్పష్టంగా తెలిసి చెప్పగల,సాధించుకోగల చొరవ కొరవడితే మగవాడికైనా జీవితం దుఃఖ భాజనమే. తన జీవితంపై తాను నిర్ణయాధికారం తీసుకోలేని వాళ్ళు తాము బాధపడటమే కాకతమ చుట్టూ  ఉన్నవాళ్ళ జీవితాలను కూడా  హింసకు లోను చేస్తారు. రఘు బాబు తన పెళ్లి గురించి తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదనలేక ప్రేమించిన పార్వతిని వదులుకున్నాడు. పెళ్లాడిన సుశీల కు చేరువ కాలేకపోయాడు. ఆమె మనోవేదనకు, చివరకు మరణానికి కారకుడు అయ్యాడు. చివరకు ఇంటికి పట్టని వాడయ్యాడు. ప్రేమ వైఫల్యాన్ని జీవిత వైఫల్యంగా భావించి క్రుంగి పోకుండా చిన్నవాళ్ళైన తోబుట్టువులను వృద్ధిలోకి   తీసుకురావటానికి   ఉద్యోగం చేస్తూ బాధ్యతతో నిలబడిన వ్యక్తి పార్వతి. పద్మజకు స్నేహితురాలు. తీరా మితిమీరిన తమ్మడి స్వార్ధం, చెల్లెలి అవగాహనా రాహిత్యం , పెత్తనపు మమకారం ఆమెను ఒంటరిని చేసి వదలటం విషాదం. ఒక కుటుంబం స్వేచ్ఛాయుత వాతావరణంలో , ఒకరినొకరు విన గలిగి, ఒకరి సౌఖ్యం కోసం మరొకరు ఆలోచించగల సంస్కారాల మధ్యనే సజీవమూ , నిత్య చైతన్య సంయుతమూ అవుతుందన్న రంగనాయకమ్మ  అవగాహన స్త్రీ నవలలో కనబడుతుంది. 

స్నేహితురాలు పద్మకు తన సంసార సమస్యలతో  ఉత్తరం వ్రాయటానికి కూర్చున్న కమల  ఏడేళ్ల తన కాపురాన్ని సింహావలోకనం చేసుకొంటున్నట్లుగా  చదువుకున్నకమల  నవల  కథనం సాగుతుంది. అన్నయ్య కొట్టాడే అన్న ఫిర్యాదుతో కూతురు రావటంతో ఆ ఉత్తరం పూర్తి చేయకుండానే లేస్తుంది కమల. ఆరాత్రి మామగారు మనుమరాలి చావును కోరుతూ మాట్లాడిన మాటలు విన్నాక సహనం నశించి ఆ పిల్లను తీసుకొని బయటకు వెళ్లిపోవటానికి నిర్ణయించుకొనటంతో నవలలో కథ  క్లైమాక్స్ కు చేరింది. ఆమె ఒక్కతీ ఆడపిల్లతో మాత్రమే కాదు ఇద్దరు మగపిల్లలతో సహా ఆమె తో తాను వేరు కాపురం పెట్టటం ఒక్కటే పరిష్కారం అని మధుమూర్తి నిర్ణయించుకొనటంతో నవల ముగుస్తుంది. ఈ నవల గుమ్మడి వెంకటేశ్వర రావుకు అంకితం చేయబడింది. 

కుటుంబంలో అధికారం,ఆధిక్యత అనేవి భర్తల లోనే కాక భర్త తరఫు బంధువులందరిలోనూ కేంద్రీకృతమై భార్య స్థానంలో ఉన్న స్త్రీ మీద పెత్తనం గా వ్యక్తమవుతూ ఉంటాయి. పేకమేడలు నవలలో భాను భర్త ఆధిక్య అధికారాల కింద నలిగి నశించటం వస్తువైతే ఈ నవలలో కమల భర్త అధికార ఆధిపత్యాల బరువు తన మీద  లేకపోయినా అనుక్షణం అవమానకరంగా, అసహ్యకరంగా వెల్లడి అవుతున్న అత్తమామల అధికారం తోను, అజ్ఞాన దురహంకారాలతోను అది  తప్పు అని వాళ్ళను సరిదిద్దే ప్రయత్నం చేయటానికి  జంకుతూ ఎప్పుడూ ఏదో చెప్పి  తప్పించుకొంటూ కాలం వెళ్లబుచ్చే  భర్త వైఖరి తోనూ నిత్యం ఘర్షిస్తూ  రాటుతేలి ఒక పరిధిలో  విజయం సాధించటం చదువుకున్న కమల నవలకు వస్తువు.

కమలకు విశేషణం చదువుకొనటం. భాను కూడా చదువుకున్నదే. కానీ ఆ చదువు ఆమెకు ధిక్కారాన్ని, బతికే ధైర్యాన్ని ఇయ్యలేదు. కానీ కమలకు చదువు అనుకున్నది బయటకు అనగలిగిన చొరవను, భర్తతో ఏదైనా ఏ మొహమాటం లేకుండా మాట్లాడగలిగిన చనువును,    అభిప్రాయాలను ఏర్పరచుకొనగలిగిన వ్యక్తం చేయగల వివేకాన్నిఇచ్చింది. ఆడవాళ్ళు చదువుకొంటే తన విజ్ఞానాన్ని మస్తిష్కంలో దాచి ఉంచుకోదని , దాని అవసరాన్ని ప్రతీ అనుభవంలోనూ రంగరించుకొని దాని ప్రభావాన్ని జీవితం మీద ప్రతిఫలింపచేసుకొంటుంది అంటుంది  రంగనాయకమ్మ ఈ నవలలో అదే సమయంలో మగవాడు విద్యను జీవితానికి అన్వయించుకోడు అని కూడా అంటుంది. మధుమూర్తి కమల కన్నా ఎక్కువ డిగ్రీలు సంపాదించినవాడే అయినా భార్య విజ్ఞానానికి సన్నిహితంగా రాలేకపోయాడని అతనితో నిశ్చింతగా కాలం గడపలేని స్థితికి రావటం వల్లనే అతనిని వదిలి వెళ్లిపోవటానికి నిర్ణయించుకొన్నది. ఉద్యోగం సంపాదించుకొని తాను బ్రతకాలని ఆడపిల్ల అని హీనం చేయబడుతున్న కూతురిని తీసుకొని వెళ్లి బ్రతికించుకొనాలని అనుకోగలిగింది. 

అంతస్తు  తక్కువ మనిషిగా చూస్తూ అత్తమామలు  కోడల్ది అని ఈసడింపుగా  మాట్లాడటం, ఒసే , ఏమే అని అమర్యాదగా సంబోధించటం దగ్గర నుండి మొదలుపెట్టి నిత్యం చేసే ఇంటి పనుల మీద ఏం తప్పులు చేస్తుందో అన్నట్లుగా అనుక్షణం హెచ్చరికలు చేస్తూ చిరాకు పెట్టటం, ముందూ వెనుకలు చూడక చేసే వంటలు వడ్డనలు, అప్పులు , అనవసరపు ఖర్చులు, అతిధి మర్యాదలు, కుటుంబ నిర్వహణలో , ఆర్ధిక విషయాలలో గానీ తన అభిప్రాయాలకు చోటు లేకపోవటం,  కన్న పిల్లల పెంపకంలో కూడా తన ఆలోచనలకు , ఆదర్శాలకు విలువలేకపోవటం  వంటివి కమల ను క్షోభకు గురిచేసిన అంశాలు. తల్లిదండ్రులను సవరించ సాహసించలేని , భార్య ఆలోచనలు, అభిప్రాయాలూ సరైనవి అని తెలుస్తున్నా సమర్ధించలేని సంప్రదాయ  ఆదర్శ కొడుకు నమూనా లో ఇమిడి పోయిన భర్త ప్రవర్తన దానికి తోడైంది. పెళ్లయి ఎన్నేళ్లయినా , పిల్లల తల్లి అయినా అత్తింటి కుటుంబంలో ఎప్పటికీ పరాయిదిగా మిగిలిపోతున్న స్త్రీల దుర్భరత కమలాడి కూడా . 

“పెళ్లి అంటే వధూవరులు ఇద్దరే. కానీ వాళ్లిద్దరూ కుటుంబంలో అందరిమధ్యా ఉంటూ అందరి అభిమానాలు, అధికారాలూ అనుభవిస్తూ జీవితమంతా కొన్ని హద్దుల మధ్య బంధించబడే ఉంటారు”అని కమలకు తెలుసు. మధుమూర్తిని ఇష్టపడి పెళ్లిచేసుకొని అతని కుటుంబంలోకి ప్రవేశించిన కమల ఒక మేరకు ఆ అధికారాన్నిఆమోదించినట్లే అయితే ఆ అధికారం శృతిమించి అడుగడుగునా తన వివేకాన్ని హేళన చేస్తూ, ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే పెత్తనాల అసమానతల కుటుంబ శిధిలాల కింద తన వ్యక్తిత్వం నలిగి నాశనం అవకుండా ఉండటానికి   కమల పడిన పెనుగులాట తక్కువది కాదు. చదువు సంస్కారా లతో వివేకవంతులైన భార్యాభర్తల ఇద్దరి అభిప్రాయాలకు, ఆదర్శాలకు, ఆశలకు స్థానంగా వేరొకరి ప్రమేయం, నిర్దేశనలు, నిఘా లేని నూతన కుటుంబాన్ని నిర్మించుకొనటం కమల  ఆకాంక్ష అయింది. ఆ ఆకాంక్షా సాధనలో  భర్త  ఆమెతో కలిసివచ్చేవాడుగా కొత్త వివేకాన్ని పొందటం చూస్తాం.  

    ( ఇంకా ఉంది)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.