నా జీవన యానంలో- రెండవభాగం- 27

‘సంధ్యా సమస్యలు ‘  కథానేపధ్యం

-కె.వరలక్ష్మి

నా ఫ్రెండ్స్ ఇద్దరిళ్ళలో విడివిడిగా జరిగిన సంఘటనలివి. 1992లో ‘రచన’ కోసం కథ రాయాల్సివచ్చినప్పుడు ఈ రెండు డిఫరెంట్ సంఘటనల్నీ ఒకే చోట కూర్చి రాస్తే ఎలా ఉంటుంది అనిపించి రాసిన చిన్న కథానిక ఇది. అప్పటికి మా పిల్లలింక హైస్కూల్లో చదువుకుంటున్నారు. కాని, నాకు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో ఈ కథ చదివిన చాలామంది ఇది మా ఇంట్లో జరిగిన కథ అన్నట్టు మాట్లాడుతూండేవారు.

జీవిత సంధ్యాకాలంలో పిల్లల్లో ఇలాంటి సమస్యలొస్తే… వాళ్ళవాళ్ళ సంస్కారాన్ని బట్టి పరిష్కరించుకుంటారు. అందుకే కథ మాత్రం చెప్పి పరిష్కారాన్ని పాఠకులకే వదిలేసాను. తండ్రి లేకపోయినా, తండ్రి ఉండీ లేనట్టెనా పిల్లలు తల్లినే విమర్శిస్తారు. అప్పుడా తల్లి మనసు ఎలా గాయపడి విలవిలలాడుతుంది. చెప్పకనే చెప్పిన కథ ఇది.

” సంధ్యా సమస్యలు “

“అమ్మా! నేనో మాట చెప్పనా” అంది మా పెద్దమ్మా యి శ్యామలి.

ఏవిటన్నట్టు తలెత్తి చూసాను. అదెందుకో సంశయిస్తోంది. ఏదో చెప్పాలనుకుంటూ చెప్పలేకపోతోంది. వ్రాస్తున్న కలాన్ని పుస్తకం మీద పెట్టి కుర్చీని పక్కకి జరుపుకుని దానివైపు తిరిగి కూర్చున్నాను. “అలా కూర్చో” అన్నాను సోఫా చూపించి.

టేబుల్ లేంప్ వెలుగుతప్ప, గదంతా చీకటిగా ఉంది. చెయ్యి చాపి ట్యూబ్ లైట్ స్విచ్ వెయ్యబోయాను. “ఆ… ఆ.వద్దు” అంది కంగారుగా శ్యామలి. “ఇలాగే బావుంది” అంది సంజాయిషీ చెపుతున్నట్టు.

ఈ రోజిది ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఆడపిల్లలిద్దరూ చిన్న పిల్లలుగా ఉండగా డబ్బుమీది పేరాశతో మరో పెళ్ళి చేసుకుని మా నుంచి దూరమయ్యాడు వీళ్ళ తండ్రి. పెద్దల నెదిరించి గుళ్ళో పెళ్ళిచేసుకున్న నేను సాక్ష్యాధారాలు చూపలేక నిస్సహాయంగా ఉండిపోయాను. వీళ్ళని పెంచడమే నా జీవిత పరమావధి అనుకున్నాను. బాల్యంలో పిల్లలుగా ఏం చూసానో, ఊహ తెలిసినప్పటినుంచీ స్నేహితుల్లాగే ట్రీట్ చేస్తున్నాను. వాళ్ళ ఇష్టాలే నా ఇష్టాలు చేసుకున్నాను. వాళ్ళు కోరుకున్న చదువులే చదివించాను. చిన్నది సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఎప్పుడో లోన్ తీసుకుని కట్టించిన ఇంటి అప్పు మొన్ననే తీరింది. ప్రస్తుతం నిరుద్యోగులైన ఇంజనీర్లలో శ్యామిలి ఒకత్తి. ఆ ఫీలింగ్ రాకూడదని అతి స్మూత్ గా వ్యవహరిస్తాను దీన్తో.

“అమ్మా.?”

“చెప్పమ్మా”

“మరీ.. వాళ్ళడిగిన కట్నం ఇచ్చేస్తేనే బావుంటుంది కదా”

ఉలిక్కిపడ్డాను నేను. నన్ను నేనే సంబాళించుకుంటూ “శ్యామలీ వాళ్ళడిగిందెంతో తెలుసా, లక్షరూపాయలు” అన్నాను.

“అవును, ఈ రోజుల్లో ఇంజనీర్లకి నాలుగైదు లక్షలిస్తున్నారట తెలుసా?”

శ్యామలి గొంతులో ఇందాకటి సంశయం లేదు.

“అలా అని అతను చెప్పాడా?”

”ఎవరు చెపితే ఏం, ఉన్న మాటేకదా!”

“ఈ మాత్రానికి దీనికి ‘ప్రేమపెళ్ళి ‘ అని పేరుపెట్టుకోవడం ఎందుకు?”

“ప్రేమించడం అంటే నష్టపోవడమా నీ దృష్టిలో?”

బాణంలా గుచ్చుకుందీమాట నాకు.

“లాభ నష్టాల బేరీజులెందుకులే, ఇదేదో బిజినెలా”

“నువ్వంత సెన్సిటివ్ గా మాట్లాడితే నేనేం చెయ్యలేను. పరాయింటికి వెళ్తున్నప్పుడు నా లైఫ్ కంటూ ఓ సెక్యూరిటీ కావాలి కదా!?”

“నీ చదువు నీకు సెక్యూరిటీ కాదా?”

“ఉద్యోగం చెయ్యడానికి వాళ్ళాప్పుకోవడం లేదు కదా!”

“అయితే, ఆడపిల్లలు కట్నాలిచ్చే తీరాలంటావ్, అవునా?” నా గొంతులోంచి ఉబికి రాబోతున్న ఎగతాళిలాంటి భావాన్నేదో అతి ప్రయత్నం మీద వెనక్కి నెట్టేసాను. –

”నే నొక్కదాన్నే అనడం లేదు. ఈ రోజు లోకమంతా అలానే ఉంది.”

ఇది నేను పెంచిన ఆడపిల్లేనా? నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న నా బిడ్డేనా? దీని చదువు దీనికి నేర్పిన నాగరికత ఇదేనా?

అమ్మగా నామీద ఒకింత సానుభూతి లేదా? ఎంత కఠినంగా మాట్లాడుతోందీ? కుర్చీ అంచుల్ని గట్టిగా పట్టుకుని నన్ను నేను నిభాయించుకున్నాను.

“అలాగే చేద్దాంలే, నువ్వెళ్ళిపడుకో” అన్నాను గొంతు పెకిలించుకుని.

ఆకాశం చుక్కల చీరకట్టుకున్న అమావాస్య రాత్రి. గదిలో ఉక్కని భరించలేక వాకిట్లో వాల్చిన మంచం మీద నడుం వాల్చాను. దూరంగా ఎక్కణ్ణుంచో గులాం ఆలీ గొంతు మార్దవంగా గాలిలో తేలితేలి వస్తోంది. ఒంటరిగా నిలబడిన కొబ్బరిచెట్టు చీకట్లో జుట్టు విరబోసుకున్న అనాధలా ఉంది.

శ్యామలి తర్వాత అద్దె ఇంట్లోకి మారక తప్పనిసరైంది. ఈ పరిసరాలకి ఇంకా పూర్తిగా అలవాటు పడక కొంత ఇరుకు ఫీలవుతున్నాం .

లోపల గదిలో పేను కింద కుర్చుని రాజీవి ఏదో చదువుకుంటోంది. పరీక్షలైపోయినా దాని బిజీ తగ్గలేదు. అర్ధరాత్రి వరకూ ఏదో రాస్తూ, చదువుతూ ఉంటుంది.

వారం క్రితం నాకో లెక్చరర్ పట్టాభి చెప్పింది విన్నప్పట్నుంచీ నా గుండె గొంతుకలోనే కొట్లాడుతోంది.

ఆ రోజు వస్తూనే దాని పుస్తకాలన్నీ వెతికి చూసాను. ఎలాంటి ఆధారం దొరకలేదు. పట్టాభి చెప్పిన మాట తప్ప మరెలాంటి ఋజువులూ లేవు. ఆ స్నేహితులెవర్నీ ఎప్పుడూ ఇంటికి తీసుకురాలేదు. అలాంటిదేదైనా ఉంటే వంటమనిషి. నాకు చెప్పకుండా ఉండదు. బైట ఎక్కడా నేను దాన్ని ఎవరితోను చూడనూ లేదు.

పట్టాభి ఏమన్నాడూ. “యశోద గారూ! ఆ పార్టీ, ఆ ఇజం యువతని చాలా తొందరగా ఆకట్టుకుంటాయి. మీ అమ్మాయి ఇప్పుడిప్పుడే దాన్లో అడుగుపెడుతున్నట్టు తెలిసింది. జాగ్రత్త పడండి” అని కదూ!

అడుగుల చప్పుడైంది, రాజీవి వస్తున్నట్టుంది. మంచం పక్కకొచ్చి నిలబడి “అమ్మా, ఇంకా నిద్రపోలేదా?” అంది.

నేను అట్నుంచి ఇటు తిరిగాను.

“మంచినీళ్ళు తెచ్చాను, తాగుతావా?”

“వద్దులే, అలా స్టూలుమీద పెట్టు” అన్నాను.

జగ్గు, గ్లాసు స్టూలు మీద పెట్టి వెళ్ళబోతోంది.

”రాజీ!”

“ఏమ్మా”

“ఇట్రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో” లేచి కూర్చుని, జరిగిచోటిచ్చాను.

“ఏంటమ్మా?”

“నీ పరీక్షలైపోయాయికదా, నా కొలీగ్ ఒకాయనకి తెలిసి మంచి సంబంధం ఏదో ఉందట. వాళ్ళని రమ్మని రాయనా?”

రాజీవి మౌనంగా ఉండిపోయింది.

“అబ్బాయి డాక్టరట. మంచి పొజీషన్లో ఉన్నాడట.”

“నా పెళ్ళికేం తొందరొచ్చిందమ్మా. మొన్ననే కదా అక్కయ్య పెళ్ళిచేసి పంపించావ్?” రాజీవి గొంతులో సన్నని విసుగు.

“అదే, నీకూ చేసేస్తే నా బాధ్యత తీరుతుంది. పోనీ, నీ దృష్టిలో ఎవరైనా ఉంటే చెప్పు. ఆ అబ్బాయినే మాట్లాడదాం”

“ఛ అలాంటిదేం లేదు. అయినా, పెళ్ళి తప్ప మరో టార్గెట్ లేదామ్మా జీవితానికి?”

“అలా అంటే ఎలా?, మనిసికి తోడూ నీడా అవసరం కదా, పెళ్ళి తప్పనిసరైనప్పుడు ఎప్పుడు చేసుకుంటే ఏం? నేను రిటైరైతే చెయ్యగలనో లేదో. ఇల్లమ్మిన డబ్బు మరో లక్ష మిగిలింది బేంకులో. అదిచ్చేసి, నిన్నో అయ్య చేతిలో పెట్టేస్తే..”

“అమ్మా” అరిచింది రాజీవి. “నేనేమైనా బొమ్మనా నన్నెవరిచేతిలోనే పెట్టెయ్యడానికి? తిరిగి కట్నం ఒకటిస్తావా? కట్నం తీసుకునే వాణ్ణి నేనసలు పెళ్ళి చేసుకోను”

“వాళ్ళకివ్వద్దులే, పోనీ నీకు సెక్యూరిటీగా ఉంటుంది. నీ పేరుతో బేంకులో వేస్తాను’

“అలా అయితే పెళ్ళి ప్రసక్తి లేకుండానే వెయ్యి. డబ్బు పుచ్చుకుని మరీ నన్నుద్దరించేటట్టు పోజు పెట్టే ఓ మగాడికి నన్ను నేను అర్పించుకోవడం నాకిష్టం లేదు. అసలు మగపురుగులంటేనే నాకిష్టం లేదు. అప్పట్లో ఆ మగాడికి నువ్వు ప్రేమ – పెళ్ళి అంటూ బలహీనంగా లొంగిపోకుండా ఉంటే” గొంతులో ఆవేశాన్ని నింపుకుని ఇంకా ఏదో మాట్లాడుతోంది రాజీ.

ఈ పిల్లల్ని కని, పెంచిన తల్లిగా ఇద్దరి దృష్టిలో నేను తప్పు చేసినట్లేనా?

నన్నేదో నీరసం ఆవహించినట్టె వెనక్కి వాలిపోయాను.

ఇప్పటి ఈ యువతని ఎలా అర్ధం చేసుకోవాలి? జీవిత సంధ్యాకాలంలో ఈ సమస్యలనెలా పరిష్కరించాలి?

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.