నెత్తురివ్వు ఊపిరవ్వు

-విజయ “అరళి”

కాయపు కుండలో
తొణికిసలాడే జీవజలం
నెత్తురు!!

కటిక నలుపు, స్పటిక తెలుపు
పసిమి రంగు మిసిమి ఛాయల
తోలు తిత్తులన్నింటిలో
ఎరుపు రంగు నెత్తురు!!

కులం లేదు మతం లేదు
జాతి భేదమసలే లేదు
రాజు లేదు పేద లేదు
బతికించేదొకటే నెత్తురు!!

నువ్వెంత, నేనింత
వాడెంత, వీడెంత
హెచ్చుతగ్గుల ఎచ్చుల్లో
ఉరుకులాడే నెత్తురు!!

అన్యాయం, అక్రమాలు
పగలు, ప్రతీకారాలు
తెగనరికే తన్నులాటల
తెగ పారే నెత్తురు!!

ఉరుకు పరుగు జీవితాల
ఒళ్ళు తెలియని వేగాల
లిప్తపాటు ప్రమాదాల్లో
ఒలికిపోయే నెత్తురు!!

పసివాళ్లకు, ముసలోళ్ళకు
తలసేమియా రోగులకు
ఆపరేషన్ల అవసరాలకు
అత్యవసరమీ నెత్తురు!!

ఫ్యాక్టరీ ల్లో తయారవదు
ప్రత్యామ్నాయమసలే లేదు
మన నాడుల పరుగులెత్తేదే
మనగలిగే నెత్తురు!!

ఒక్కసారి నీ నెత్తురివ్వు
ఎరుపు, తెలుపు కణాల
ప్లాస్మా, ప్లేట్లెట్స్ లాగా
నలుగురికి ఊపిరవ్వు!!

ఒక్కసారి నెత్తురివ్వు
వికశించే బతుకునివ్వు
ఒక్కసారి నెత్తురివ్వు
ఊపిరూదే బలమవ్వు!!

ఒక్కసారి నెత్తురివ్వు
గుండె మళ్ళీ కదలనివ్వు
ఒక్కసారి నెత్తురివ్వు
బతుకు మళ్ళీ మెదలనివ్వు!!
 

*****

Please follow and like us:

3 thoughts on “నెత్తురివ్వు ఊపిరవ్వు(కవిత)-విజయ “అరళి””

  1. I liked the first half where you used blood as a symbol for social commentary. Ala social commentary ne continue cheste bagundedi. Second half lo Blood donation pai raasinandu valla poem focus divert ayinattanipinchindi

Leave a Reply

Your email address will not be published.