మా కథ 

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

చివరికి ఆ బ్రెజిలియన్ స్త్రీ నాతో “సరేనమ్మా – నువు చాల కష్టకాలంలోనే ఉన్నావని నాకు తెలుసు. నువ్వింత నాయకత్వానికి వచ్చావంటే మీ జనం నీలో ఏదో గొప్పతనం చూసి ఉంటారు. నువు తల్లిగా మాత్రమే ఆలోచిస్తే సరిపోదు. నాయకురాలిగా కూడా ఆలోచించాలి. ప్రస్తుతం అది చాల ముఖ్యం. నువు నీ పిల్లలకు, నీ కుటుంబానికి మాత్రమే జవాబు దారీ కాదు. నువు ఒక ఆశయానికి జవాబుదారీవి. అది నీ కామ్రేడ్ల ఆశయం, నీ ప్రజల ఆశయం….. నువు ప్రస్తుతం ఆలోచించవలసింది అదీ…” అంది.

“నిజమే కానీ… వాళ్లు నా పిల్లల్ని చంపేస్తే? నా పిల్లలు అక్కడ దిక్కులేని చావు చస్తే…”

“అక్కా – వాళ్ళే గనుక చచ్చిపోతే, చం పేయబడితే వాళ్ల మరణాలకు ప్రతీకారం తీర్చుకోవడానికైనా నువు బతికి ఉండాలి.” ఆమె ఇక ఈ ఒక్క మాట మాత్రం అని మరేమీ మాట్లాడకుండా తాను ఉండే వైపుకు వెళ్ళిపోయింది. నాతో మరొక్క మాట కూడా మాట్లాడలేదు.

నేనారోజు మధ్యాహ్నమంతా ఏడుస్తూ భయంకరమైన నిరాశతో గడిపాను. నేను మూడింటి వరకు అలాగే కన్నీళ్లతో కరుగుతూ కూచున్నాను. అప్పుడు తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ఆ తలుపులు అంత పెద్దగా తెరుచుకోవడం అదే మొదటిసారి. తలుపులు తెరుచుకోగానే నేను గుర్తించింది. గాఢమైన అత్తరు వాసన. ఎవరో బాగా అలంకరించుకొని వస్తున్నారని అర్థమైంది. బ్రహ్మాండంగా ముస్తాబైన ముగ్గురు స్త్రీలు తమ హ్యాండ్ బ్యాగు ఊపుకుంటూ లోపలికొచ్చారు. వాళ్లవెంట మైనర్స్ కౌన్సిల్ గురించి నాతో మాట్లాడిన ఏజెంట్ కూడా ఉన్నాడు. ఆ ఏజెంట్ నాకు వాళ్ళను పరిచయం చేశాడు. ఒకావిడ మైనర్స్ కౌన్సిల్ అధ్యక్షురాలట, మరొకావిడ కార్యదర్శి అట.

“మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది” అంటూ వాళ్లు నాకు మైనర్స్ కౌన్సిల్ గురించి చెప్పడం మొదలెట్టారు. ‘మైనర్స్ కౌన్సిల్’ శిశువుల కోసం పోరాడుతుందనీ, శిశువులు అన్యాయానికి బలయిపోకుండా కాపాడుతుందనీ, వాళ్ళు దోపిడీకి గురికాకుండా రక్షిస్తుందనీ, అలాంటివే మరెన్నో విషయాలు చెప్పారు. ఇవన్నీ చెప్పి, వాళ్ళు నా పిల్లల్ని చూసిన సంగతి కూడా చెప్పారు.

“ఎంత ఘోరం! ఎంత అమానుషం! ఎంత భయంకరం…!” అని నాకు సానుభూతి తెలిపి “పసిపిల్లల్ని అంత కష్ట పెట్టడానికి వాళ్లకు చేతులెట్లా వచ్చాయో?! ఎంత అన్యాయం..! చూడమ్మా మేం ఇప్పుడు నువు నీ పిల్లల్ని నిజంగా మైనర్స్ కౌన్సిల్ కు అప్పజెప్పుదామనుకుంటున్నావా తెలుసుకోవడానికే వచ్చాం. నీ పిల్లల బాగోగులు మేం పట్టించుకోవాలంటే నువు మాకొక కాగితం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కాగితం ఉంటేనే వాళ్ళ బాధ్యత మేం తీసుకుని వాళ్ళను ఆస్పత్రికి తీసుకెళ్ళగలం. వాళ్ళు ఇప్పటికే జబ్బుపడి ఉన్నారు. ఇంకా ఆలస్యంచేస్తే వాళ్ళు చచ్చిపోవచ్చు కూడా” అన్నారు.

“సరే- నేనది రాసిస్తాను” అన్నాను.

“మంచిది – మనం ఈవిడ కోసం ఉత్తరం రాసి పెడదాం. పాపం! కష్టంలో ఉన్నప్పుడు మనం ఆవిడకు ఈ మాత్రం సాయం చెయ్యాలి కదూ!” అని ఆవిడ మరొకావిడతో అంది. ఆ ఇంకో స్త్రీ తన నోట్ బుక్ కోసం వెతికింది. “ఇక్కడో ఉత్తరం నమూనా ఉంది. ఇది సరిపోతుందో చూడండమ్మా” అని అది చదివి వినిపించింది.

ఆ ఉత్తరంలో ‘దొమితిలా బారియోస్ ద చుంగారా అనబడే నేను, గ్రామం సైగ్లో – 20, వయసు నలభై ఏళ్ళు, పెళ్ళయింది, పూర్తిగా స్పృహలోనే ఉండి రాసి ఇచ్చిన విషయమేమంటే నేను స్వచ్ఛందంగా జైల్లో ఉన్న నా పిల్లల బాధ్యతను మైనర్స్ కౌన్సిలకు అప్పగిస్తున్నాను. నేను విడుదలయ్యేవరకుగానీ, మరి నా బతుకు దెరువుకు ఏవైనా ఏర్పాట్లు చేసుకునే వరకుగానీ నా బిడ్డల బాగోగులు చూడవలసిందిగా మైనర్స్ కౌన్సిల్ ను కోరుతున్నాను’ అని ఉంది.

“ఇక్కడ సంతకం పెట్టమ్మా” అని అధ్యక్షురాలు అంది. “సరే” అని నేను అంటుండగానే “ఇలాంటి ముఖ్యమైన కాగితం మీద సంతకం చేసేటప్పుడు, దాన్ని సరైన పెద్ద అధికారుల దగ్గర నమోదు చేయించడం అవసరమనుకుంటాను. ఈ విషయం ఒక ప్రత్యేకమైన కాగితం మీద రాసి, స్టాంపులు అతికించి లాయర్ ముందు నమోదు చేయాలనుకుంటాను” అని మరొకావిడ అంది.

“ఆహాఁ అలాగా, మనం ఆ కాగితం కూడా తెచ్చామనుకుంటానే! ఏదీ బయటికి తియ్యి” అని అధ్యక్షురాలు అంది. ఆ మరొకావిడ తన చేతి సంచిలో ఎంతో సేపు గాలించి “అయ్యయ్యో! తొందరలో నేనా కాగితం తీసుకురావడమే మరచిపోయాను. మరి ఇప్పుడేం చేద్దాం?” అని కొంచెం ఆలోచించి “ఒక పని చేద్దాం ఆవిడ ఏ కాగితం మీద సంతకం చేసినా ఫరవాలేదనుకుంటాను. మిగతా పనులు మనం తర్వాత చూసుకోవచ్చు”అంది. అప్పుడు అధ్యక్షురాలు ఏజెంట్ ను ఒక కాగితం తెచ్చి పెట్టమని అడిగింది.

ఆ ఏజెంట్ వెంటనే పరుగెత్తుకెళ్ళి ఓ పెద్ద కాగితమే పట్టుకొచ్చాడు. అయితే అది డిఐసి ముద్రవేసి ఉన్న అధికారపత్రం. అది చూసి నేను “వీల్లేదు నేను ఈ కాగితం మీదనైతే సంతకం చేయను. దాని మీద డిఐసి ముద్ర ఉంది కదా! పోనీ, ఆ పై ముద్ర వరకూ చింపేసి కిందరాస్తే సంతకం చేస్తాను” అన్నాను.

వెంటనే ఆ ఏజెంటు “ఆ కాగితం చింపుతావా అమ్మయ్యో! ఆ ఒక్కటి తేవడమే ఎంత కష్టమయిందనుకున్నావు! చింపేటప్పుడు నువ్వది చెడగొట్టావంటే ఆ ఒక్కటీ పనికి రాకుండా పోతుంది” అన్నాడు.

నేనిక మొండిగా “నేను మాత్రం డిఐసి ముద్ర ఉన్న కాగితం మీద ఏమీ రాయను. అసలు నేను తెల్ల కాగితం మీద సంతకం చెయ్యను” అన్నాను.

“మరి మనదగ్గర వేరే కాగితాలు లేవు గదా!.. ఇప్పుడు లోపలికి రావడమే ఎంత కష్టమైందో తెలుసునా? ఇప్పుడిక సమస్యలు ఇంకా పెంచకు. ఒక్కసారి ఆలోచించు. నీ పిల్లలు ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళను కాపాడవలసిన అవసరం లేదా?”

అలా వాళ్లెన్ని మాటలో చెప్పారు. ఎంతగానో ఒత్తిడి చేశారు.

నేనిక ఒకే ఒక్క మాట చెప్పాను “చెయ్యను”.

“సరే, పోనీ, ముద్ర ఉన్న వైపు కాక పోతే వెనుక వై పైనా చెయ్యి.”

నాకు విపరీతంగా భయం వేసింది. నేను ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయాను. నేనెంత అయోమయంలో పడ్డానో చెప్పలేను. ఏమైనా సలహా చెపుతుందో సైగ చేస్తుందోనని నాతో పాటు ఉన్న బ్రెజిలియన్ యువతి వైపు చూశాను. అవతల వాళ్ళేమో నా మీద విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారు. బలవంత పెడుతున్నారు. నేను ఎలాంటి మన:స్థితిలో పడిపోయానంటే ఎవరో ఒకరు నా వాళ్ళు ‘చెయ్యి’ అనో ‘చెయ్యకు’ అనో శాసించాలని చూశాను. అందుకే ఆ యువతి వైపు చూస్తే ఆమె ఒక పత్రిక మొఖానికి అడ్డుగా పెట్టుకొని కూచుంది. నాకు తన ముఖం కనబడనివ్వలేదు. అది ఎంత భయంకర క్షణం! నేనేమీ నిర్ణయించుకోలేక పోయాను.

అవతల ఆ స్త్రీలేమో “తొందరగా చెప్పమ్మా! మాకు ఎక్కువ సమయం లేదు” అంటున్నారు.

బైటి నుంచి ఏజెంట్ “సమయం అయిపోయింది. తొందరగా కానివ్వండి” అంటున్నాడు.

నాలో నేను “ఓరి దేవుడా! ఏం చేతును? ఏం చేయాలి? ఏం చేశాను నేను” అనుకుంటున్నాను.

ఆ రోజుల్లో నాకు మత పరమైన భావాలు ఎక్కువగా ఉండేవి. ఆ భావాలతోనే నేను అప్పటి పరిస్థితిని టకటకా అంచనా వేసుకున్నాను. “నేనెవరినైనా చంపానా? లేదే! చంపిన వాళ్ళను ఎదిరించాను. ఇతరులను చంపడం దైవనీతికీ, న్యాయానికీ, ధర్మానికి వ్యతిరేకం గనుక నేను వాళ్ళను ఎదిరించాను. అలాగే వాళ్ళు గనుక ఇప్పుడు నా పిల్లల్ని చంపేస్తే తమ అంతరాత్మ ద్వారా వాళ్లెన్నడో ఒక నాటికి పరిహారం చెల్లించాల్సే ఉంటుంది. నేను ఇప్పుడు ఆ తెల్ల కాగితం మీద చేసే సంతకం ఎంత మంది అమాయక ప్రజల్ని కష్టాల బరి మీద నిలబెట్ట బోతుందో? సంతకం చేయకపోవడమే మంచిది” అనుకున్నాను.

“చూడండి! నా పిల్లలు నా ఆస్తి. ప్రభుత్వపు ఆస్తి కాదు. ఒక వేళ ప్రభుత్వం నా పిల్లల్ని మీరనే ఆ నేలమాళిగలోనే మాడ్చి చంపేస్తే చంపెయ్యనివ్వండి. అది వాళ్ళ పాపాల్ని మరింతగా పెంచుతుంది. దానితో నాకు ఏ పాపమూ అంటుకోదు. ఎందుకంటే వాళ్ళ చావుల విషయంలో నేను చేసిన తప్పేమీ లేదు” అన్నాను.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.