రాగో

భాగం-14

– సాధన 

మహిళా సంఘం పనిని అక్కలకు అప్పచెప్పిన కమాండర్ పటేల్ వైపు దృష్టి మళ్ళించిండు.

“ఆఁ! పటేల్ దాదా! అయితే ఇవాళ పోల్వ చేస్తున్నట్టా! వాయిదా వేస్తున్నట్టా” అంటూ ఇక మన పనిలోకి దిగుదామా అన్నట్టు ప్రారంభించాడు.

“ఔ దాదా! ఈ రోజుకు ఆపుకుందామనే అనుకున్నాం. ముసుర్లు ఉండంగానే మడికట్టు పూర్తి చేయాలనుకున్నం. రైతులు తొందరపడుతున్నారు. కానీ, పనులు కూడ సరిగా నడుస్తలేవు. మీరు రానేవస్తిరి. తెగాల్సిన పంచాయితీలు కూడ ఉండె. అందుకని పోల్వ చేసే వచ్చినం” అంటూ ఓపిగ్గానే మీటింగ్ చేయాలన్నట్టు గుక్క తిప్పుకోకుండా చెప్పాడు పటేల్.

“మంచిదే దాదా! అలాగే చేద్దాం. అయితే పోల్వలూ – పద్దతులు అంటూ పనులు మానుకొని పండుగలు చేసుకుంటే మనకెలా నడుస్తుంది? ఏ ఆచారాలైనా, ఏ పద్దతులైనా మన సౌలతులు బట్టి చూసుకోవాలి గాని ఎప్పుడో పెద్దలు చేశారు కదా అని మొండిగ పట్టుక కూచుంటే మనకే లుక్సాన్ అవుతది. మరి మనం మీటింగ్ చెప్పుకుందామా” అంటూ దూరంగా యువకులకు పాటలు నేర్పుతున్న గాండోను కేకేశాడు.

“గాండో దాదా! మీ పాటలైపోతే డోలు దాద వాళ్ళను తీసుకొని ఇటు వస్తావా! ఈ మీటింగ్ షురూ చేద్దాం” అంటూ ఊరి సంఘం వాళ్ళందరిని రమ్మన్నాడు.

మిగిలిన దళ సభ్యులు, సంఘ ముఖ్యులు కూడా వచ్చి కమాండర్ పక్కన కూచోగానే జనం అందరు సర్దుకోని హుషారైనారు.

రుషి తన వాచి చూసుకుంటూ సంఘం సెక్రటీ డోలువైపు చూసి, “పది అయింది దాదా. మొదలు పెట్టండి” అన్నాడు. బాజీ దగ్గర వంద రూపాయలు వసూలు చేసిన పంచాయితి గూర్చి చిటికెలో చెపుతూ డోలు “బాజీ దాదా, సంగతేదో నువ్వే చెప్పితె కాదా” అన్నాడు.

“ఇంగో దాదా” అంటూ బాజీ గొంతు సవరించుకున్నాడు.

“తాగినోడే కట్టుకున్నడు తాళ్ళ పన్ను అన్నట్టు ఆ రిమ్మలో ఒళ్ళు తెలియక వాగినందుకు నాకు మంచి శాస్తే అయ్యింది. కానీ ఊళ్ళె ఇందరున్నరు. ఆదుకునే అన్నలున్నరు. న్యాయం విచారం చెయ్యాలి. తాగుతే ఎన్ని అనుకోం! అన్ని పట్టుకుంటామా! పైసలకాడికి వచ్చేసరికి జారినమాట పట్టుకోని ఈ ముసలోడు పర్దేశిగాడు విడువకుండా పట్టుకున్నడు. దొరికిందే చాలని తిమ్మిని బమ్మిని చేసే పెద్ద మనుషులు ముక్కుపిండి నూరు రూపాయలు నాతో కక్కిచ్చిండ్రు. తల తాకట్టు పెట్టి దండుగ నింపినప్పటి నుండి కల్లు పుట్టకుండా అయ్యింది. ఈ అప్పు ఎప్పుడు తీరాలి? నా ఉసురు ఎవరికి తలగాలి! తేలు మంత్రం రానోడు పాము పుట్టలో వేలు పెట్టినట్టు బుద్ది గడ్డితిని నేను లల్లి ఊసు ఎత్తుడు తప్పే. నా పైసలు నాకు ఇప్పిస్తే అప్పు తీర్చుకుంటాను. ఇగ ఎవల జోలికి పోను. కిరియ” (ఒట్టు) అని ఇక ఏడుపే తక్కువన్నట్లు అందరిని ఒసారి కలయచూసి తల దించుకున్నాడు.

క్షణం ఎవరూ మాట్లాడకపోయేసరికి సంఘం అధ్యక్షుడు లెబుడు అందుకున్నాడు.

“గీ దండగలు, గుంజులాటలు లేకుండా ఊరంతా కట్టుగుండాలని అన్నలు చెప్పబట్టిరి. మేము చెప్పబడిమి. అయినా మీ దందా మీదే అన్నట్లు వినరైతిరి. ఇగ ఏం చేసుడోమరి. ఈ ముసలోని దగ్గరి నుండి దండుగ వసూలు చేసి ఆ ముసలోనికి ఇప్పిచ్చి బైటకు కింద ఇంత మిగిలించి కల్లుతాగి బొత్తలు నింపితిరి. ఇగేం లేదు. తాగిన డబ్బులు పెద్దలు కట్టండి. మిగిలినవి జూరు కాకగాడు పర్దేశి ఇయ్యాలె. లావరిస్ బాజీ లల్లి ముందు ముక్కు నేల రాయాలి. మల్లోసారి ఇటువంటి జగడాలు చేసుకుంటే మాత్రం మంచిది గాదు” అంటూ లెబుడు కోపంగా ముగించాడు.

“ఇంగో గట్లనే చెయ్యాలి వీళ్ళకు” అని కొందరంటే, “ఈ పెద్దలు దండగ తిరిగి కడుతారా” అని అనుమానం లోపల ఉన్నా “కట్టాలి మరి” అని మరికొందరు “గిట్లయితేనే మళ్ళీ జోలికి రారు” అని ఎవరో – ఇలా తలా ఓ మాట ఆ గుంపులో నుండి అనేశారు. మొత్తంపై ఆ పొడి మాటలు సారాంశంలో లెబుడు చెప్పిందానికి “ఇంగో” అన్నట్టే ఉన్నాయి.

‘గైకు! గైకు” (కొద్దిగా… కొద్దిగ) అంటూ రుషి కలిగించుకునేసరికి ఆ కలకలం ఆగింది. “లెబుడు దాదా చెప్పింది ఏమనుకుంటున్నారు దాదా” అని రుషి జనంవైపు చూశాడు.

నిశ్శబ్దం.

“అట్ల చేస్తేనే మంచిదని మాకున్నది. కానీ, ఈ తాగి బొత్తలు నింపినోళ్ళు మళ్ళీ డబ్బులు కట్టాలంటే అది కానిమాట. అట్లా గాకుండా ఇసొంటి లంగ పంచాయితీలు మళ్ళీ చేయం. తప్పయింది. ఖర్మకాలి ఎవడన్నా వచ్చినా అండ్ల వేలు పెట్టమని ఈ పెద్దలు ఇంతమందిలో చేసిందేదో తప్పయిందనాలి. ఇక బాజీ ముక్కు భూమికి రాసుడు. పర్దేశీ డబ్బులిచ్చుడు అమలు చేయాలి. ఇంతకు మించి దీంట్లో ఏం లేదు” అని రుషి ముగించేసరికి అందరూ తృప్తిగా “ఇంగో” అన్నారు. పెద్ద మనుషులు లోలోపలే ‘ఇదే మంచితోవ’ అనుకున్నారు.

అంతసేపు ముళ్ళమీద కూచున్నట్టున్న కనుకో తల్లి రుషి ‘అయిపోయింద’నడం తోనే గబుక్కున బొడ్లో నుండి పైసల సంచి తీసి అతని చేతిలో పెట్టింది. దాంట్లో నుండి ఆ నోట్లను వెలికి తీసి చూశాడు రుషి. నాలుగు యాభై రూపాయల నోట్లు, ఐదు ఇరవై నోట్లు, అవి ఖచ్చితంగా మడతల్లోనే చెదలు తిని ఉన్నాయి. అవి చూస్తూనే పక్కన కూచున్న సంఘం సెక్రట్రీ వైపు చూసి “ఇవి బ్యాంకులో మారుతయి దాదా షావుకారికిచ్చి మార్చి తెమ్మంటే సరిపోతుంది” అంటూ ఇందులో చెప్పాల్సిందేమి లేదని తేల్చేశాడు.

డోలు ఆ నోట్లు మడతబెడుతూంటే ఎదురుగా నిల్చున్న కనుకో ఆకాశం వైపు చేతులెత్తి దండం పెట్టింది.

“హమ్మయ్యా! ఇగ అన్నం తిందాం పదండి దాదా!” అంటూ లెబుడు తొందర చేశాడు.

అందరూ చేతులు కడుక్కోవడానికి కదుల్తూంటే, ఇక ఆలస్యం చేయకూడదన్నట్టు సన్నో కరపత్రాలను రుషి చేతిలో పెట్టాడు. వాటిని జేబులో కుక్కి రుషి తిండివైపు నడుస్తూ “రండక్కలూ. భోజనాలు చేసి, తర్వాత మీటింగ్ పూర్తి చేద్దురుగాని” అంటూ అక్కల్ని కేకేశాడు.

అన్నల సంఘం నుండి ఇద్దరు, అక్కల తరఫున ఇద్దరు, బాలల తరఫున ఇద్దరు అన్నం జమ చేసుకవచ్చారు. వాళ్ళు తెచ్చిన అన్నం, కూర, అంబలి, నీళ్ళల్ల కడిగిన విస్తర్లందిస్తూ అందరికీ వడ్డించడం మొదలెట్టారు.

ఇల్లిల్లు తిరిగి అన్నం వసూలు చేయాలంటే వీరందరికి మొదట సిగ్గే. కొన్ని గ్రామాల్లో చొరవతో తట్ట, బుట్టందుకొని అన్నలే అడుక్కోవడంతో ఇప్పుడు సంగం వారిలో ఆ జంకు పోయింది. మరికొన్ని సందర్భాల్లో ‘అడుక్కొస్తేనే తింటాం, లేకపోతే తినం’ అని మొండికేసి అలవాటు చేయించిన ఘటనలు లేకపోలేదు. అతిథులకు మగాళ్ళు విడిగా వంటచేసి పెట్టడమే ఆదివాసీల మర్యాద. మొదట్లో దళం పట్ల కూడ ఆ ధోరణే అవలంభించారు. ‘అలా వేరుగా చేస్తే తినం’ అని పట్టుబట్టడంతో గత్యంతరం లేక జనాలు ఇంటివద్ద వండుకున్న తిండిలో నుండే జమ చేయడం, అలా అన్ని ఇళ్ళల్లో అడగడం నేర్చుకున్నారు. ఇంతకు ముందు గ్రామాల్లో రకరకాల పద్దతులు అమలవుతుండేవి. కొన్ని గ్రామాల్లో అన్నలొస్తే ఊరి చౌకిదారు (ఉమ్మడి సేవకుడు) ఇంటికి ఇన్ని అని బియ్యం, ఇతర పప్పు సామాను వసూలు చేసి వండి పెట్టేవాడు. మరికొన్ని గ్రామాల్లో ముందుగానే కొన్ని బియ్యం జమచేసి ఉంచి దళం వచ్చిననాడు కోస్కీర్ (సర్కార్ మనుషులు)కు వంటచేసి పెట్టినట్టే వండించి పెట్టేవారు. మరికొన్ని గ్రామాల్లో దళం రాగానే ఊళ్ళోని దుకాణం నుంచి ఆ పూటకు అవసరమైన సరుకులు ఊరి పేరు మీద కొని వంట చేసి పెట్టేవారు. షావుకారి బాకీ తల కొంత వాటా వేసుకొని చెల్లించే వారు. ఇలా రకరకాల పద్దతులుండేవి. ప్రజల తిండి తింటే వారికి మరింత దగ్గరవుతామనీ, వారి సాధకబాధకాలు బాగా తెలిసి వస్తాయనీ, అలాగే నిర్బంధం పెరిగిన రోజున ఒకే దగ్గర నాలుగు కిలోల బియ్యం వండుకొని రావడం కన్నా ఏ ఇంటి తల్లి ఆ ఇంటిమూట నెత్తిన పెట్టుకొని వస్తే ఏ పేచీ లేకుండా ఉంటుందని కూడా ఆలోచించి జనం వండుకున్నదే ప్రతి ఇంటి నుంచి జమ చేసుకురావాలనీ, దళం పట్టుపట్టి అలవాటు చేసింది.

ఒక గంజులో అన్నం, మరో గంజులో కూర, సర్వ (బిందె)లో అంబలి జమచేసి తెచ్చారు. సెంట్రలు పోను 11 మంది విస్తర్ల ముందు కూచున్నారు. రేఖగాటో (అన్నం) పెడుతుంటే, రైతు సంఘం మాసు కూర వడ్డిస్తున్నాడు. బాల సంఘం పొరిమ నీళ్ళందిస్తున్నాడు. తిళ్ళు కొనసాగుతున్నాయి. మలేరియా మందు చల్లే మేస్త్రీ దళాన్ని కలుస్తానంటే మూడు గంటలకు రమ్మన్నానని మాసు రుషికి చెవులో కబురు చెప్పాడు.

“అలాగే. దళం వద్దకు నేరుగా ఎవర్నీ తీసుకరాకూడదు దాదా! ఇవాళ రేపు పోలీసులు తీరైన వేషాల్లో తిరుగుతున్నారు. జాగ్రత్తగుండాలి. మరోసారి మమ్మల్ని అడగకుండ టైం ఇవ్వకూడదు దాదా” అంటూ రుషి తింటున్న అన్నంలో చెడిపోయిన గబ్బు బుక్క బుక్కకు ఎక్కువ గావడం గమనించాడు. ఎవరో తల్లి రాత్రి మిగిలిన అన్నం వేసినట్టుంది. ఎంత వేసిందో గానీ మొత్తంగా అన్నం అంతా చెడిపోయిన వాసన వస్తుంది. తింటూనే అందరి ముఖాలు చూడసాగాడు. గిరిజ మినహా మిగతావారందరూ శుభ్రంగా కానిస్తున్నారు. ‘ఎంతయినా మిమ్మల్ని అందుకోవడం కష్టమే’ అని మనసులోనే ఆదివాసులను ప్రశంసిస్తూ తినసాగాడు. జమ చేసేపుడు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పాలనుకొని మళ్ళీ ‘ఇపుడు కాదులే’ అని వాయిదా వేసుకున్నాడు. జావ పరిస్థితి కూడ అందుకు భిన్నంగా లేదు. పులిసి పోయిన వాసనొస్తుంది. బలిమికి తన దొప్పలోనిది ఖాళీ చేశాడు. తెచ్చిన ప్రతిదీ ఇప్పపూలు, గుడాలతో సహా అన్నీ ఎవరిపాళ్ళు వాళ్ళు తినేస్తున్నారు.

“గిరిజక్కా అక్కలు సంఘం పెట్టుకున్నరా” అంటూ తర్వాత పని ప్లాను చేసుకోడానికన్నట్టు వాకబు చేశాడు రుషి.

భోజనం ముగించి లేవబోతున్న గిరిజ “ఆఁ! అయినట్టే. మళ్ళీ ఇపుడు కూచోబెట్టి ముఖ్యుల్ని ఎంచుకోవాలి. పంచాయితీలు అయిపోతే మీరు కూడ వస్తే మంచిది” అంటూ లేపి చేయి కడుక్కోనుపోయింది గిరిజ.

“మీరు ప్రారంభించండక్కా మేము వస్తాం” అంటూ తిండి ముగించాడు రుషి.

గిరిజ వచ్చేసరికి మేన కప్లో కూచున్న జైని చుట్టు నలుగురు పిల్లలు, ఆరేడుగురు యువతులు చేరి పుస్తకాల్లో బొమ్మలు చూస్తూ ముచ్చట్లు పెడుతున్నారు. ఏ కొద్ది టైం దొరికినా, చెల్లెండను తమ్ముళ్ళను చుట్టు వేసుకొని పుస్తకాల్లో బొమ్మలు, తూటాలు, తుపాకీ చూపెడుతూ, ఎన్నో ముచ్చట్లు చెబుతూ ఆ ప్రపంచంలో మునిగిపోయే జైనిని చూసి గిరిజ ఎపుడూ ‘పిల్లల కోడి’ అంటుంది. ఆ రోజు ఆ ఊరి ఇర్సిని దగ్గర కూచోబెట్టుకొని అక్షరాలు దిద్దిస్తుంది జైని.

వాళ్ళకు కొద్ది దూరంలో కూచొని ముచ్చట్లు చేస్తున్న అమ్మలక్కల్లో నుండి మెంతక్క గిరిజను చూడగానే లేచివచ్చి చేయి కలిపింది.

“ఎట్లుందక్కా ఇపుడు. మందు ఏమైనా పనిచేసిందా” – గిరిజ.

“ఔనక్కా. గోలీలు పని చేసినయ్. గట్టిమాని కొద్దిగా నల్లబడేసరికి తగ్గిందని గోలీలు ఆపిన, మళ్ళీ షురువైంది. మళ్ళీ తింటున్న మందులు. జెరనయమే” అంటూ మెంతక్క గట్టిగా బిగించి కట్టిన చీరను రొండి నుండి జరుపుతూ చూపింది.

“అదే అక్కా. ఏ మందైనా పూర్తిగా వాడాలి. లేకుంటే పని చేయవు. మందులు వాడితేనే సరిపోదు. ఈ చీరకట్టు కూడ వదలుగా లేకపోతే చెమట, పుండ్ల సొన రెండూ కలసి మళ్ళీ ఎక్కువవుతుంది” అంటూ జాగ్రత్తలు హెచ్చరించింది గిరిజ.

చాటుగా నిలబడ్డ అక్కలను చూపిస్తూ “మన మీటింగ్ కు వచ్చినపుడు అందరు కలసి కూచుంటే సరిపోతుంది కదా” అంది.

“నిజమే అక్కా. మాడియాల్లో పట్టింపు లెక్కువ కదా! మీరున్నరు కదా అని ఇవాళ అందరి మధ్యకు వస్తే రేపు మా దాదలు బాధపడతరు” అంటూ బహిష్టు రోజుల్లో మగాడి కంట్లో పడకూడదనే ఆచారం తప్పక పాటించాలన్నట్టు జవాబు చెప్పింది.

గిరిజ రాగానే ఇర్పి కొంచెం పక్కకు జరిగి చోటిచ్చింది. “ఆ అక్కలను పిలవలేదా జైని – వాళ్ళు మీటింగ్ లోకి రారా” అంటూ జైని పక్కన కూచుంది గిరిజ.

“చెప్పి చూశానక్కా. దాదలందరు ఉన్నా కూడ మీటింగ్ వరకు రావటమే కొంత మార్పు. మరీ ఇపుడే బలవంత పెట్టొద్దని నేను ఊరుకున్నా” నంటూ ఆచారాలు, రివాజుల విషయంలో బలవంతం చేయటం, తొందరపాటుతో వ్యవహరించటం మంచిది గాదని కమాండర్ తరచూ చెబుతూండే విషయాలను గుర్తుకు తెచ్చుకుంటున్నట్లు, ఆ విషయం ఇక వదిలేయ్ అన్నట్టు మాట్లాడింది జైని.

గిరిజ చూపులు ఇర్పి ముఖంపై పడ్డాయి.

ఇర్పి చాలా అందంగా ఉంటుంది. తెల్లని ఛాయ, నల్లని వెంట్రుకలు కాకపోతే ఆ కురులు కురచ. ముచ్చటైన పలువరుస, చిరునవ్వు ముఖం. ఆ మొగంపై ఐదు పచ్చబొట్లు. గద్వకు ఒకటి, కణతల్లో రెండు, మరొకటి చెంపకు, మరోటి నుదిటి మీద బొట్టులా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ‘ఆ పచ్చబొట్లే లేకుంటేనా!! అనుకున్న గిరిజ ఆ గుంపులో కూచున్న వయసుబడ్డ స్త్రీలతో పోల్చుకుంటే ఒంటినిండా ఆ పచ్చబొట్లు, మెడలు వంగిపోయేలా ఆ పూసల హారాల కంటే ఈనాటి ఈ పడుచువాళ్ళు చాలా మెరుగేలే అనిపించింది.

“ఇర్పక్కా! పచ్చబొట్టు కలెబడిందేమక్కా” గిరిజ పలకరించింది.

ఇర్పి జవాబు చెప్పలేక తలవంచుకుంది. జైని కూడ తన చెంప తడుము కోసాగింది.

“గిరిజక్కా ఇది కూడా అనే బాపతు. ఈ పచ్చబొట్టు తీసేసుకోవాలనుకుంటే అవి నల్లబొట్లుగా తయారవుతున్నాయి.” అంటూ తన చెంపనున్న మచ్చ చూయించింది.

“ఈ బొట్లు చెరుపుకోవాలని ఏం చిట్కాలు చేస్తున్నరు తల్లీ” అంటూ విసుక్కుంది గిరిజ.

“సోడావుప్పు, సున్నమూ, నల్లజీడీ తప్ప ఇంకేముంది తల్లీ. అయినా నీలాటి కూతురే ఉంటే మాకీ బాధలే ఉండవు కదా!” అంటూ నవ్వుతూనే అంటించింది జైని. తల్లిలాంటి పిలుపులు నచ్చవని ఎంత చెప్పినా గిరిజకు అలవాటు ప్రకారం నోరు జారుతూనే ఉంటుంది.

“చూడు ఇర్పక్కా! ఒక బొట్టు బదులు మరో మచ్చ చేసుకున్నావ్. ఇలా ఆతృతపడి ముఖం పుండు చేసుకోవడం మంచిది గాదు. మీ తల్లుల్లా మీ ఒంటినిండా పచ్చబొట్లు, హారాలు ఉండడం లేదు కదా. మీరంతా ఇవాళ సంఘాల్లోకి వస్తే రేపు మీ పిల్లలకు పచ్చబొట్లు, వాతలు అసలే ఉండకపోవచ్చు. ఓపిగ్గా ఉండాలి తప్ప, నాజూకు కోసం ఇలా ఒళ్ళు పొక్కిచ్చుకుంటే ఏం లాభం?”

“నాజూకు కాదు గిరిజక్కా, దాని విచారం దూసురామంత” (వేరే ఉంది) అంటూ కిసుక్కుమంది జైని.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.