విజయవాటిక-1

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

నాంది

 ఆంధ్రదేశమును శాతవాహనులు పరిపాలించిన తదనంతరం పాలించిన రాజవంశీయులలో విష్ణుకుండినలు ముఖ్యులు. వీరి పాలన మహోజ్జ్వల చరిత్ర. వీరి చరిత్ర వినయముతో, సమ్యక్ప్రజాపాలనతో కూడి అనుపానమైనది. నేటి తెలంగాణా నుండి వీరి పాలన మొదలైయ్యింది. 
వీరు మునుపు చిన్న జమిందారులుగా ఉన్నా, తదనంతరం రాజ్యాలు జయించి వీరి వంశ పరిపాలనను మొదలుపెట్టారు. ఆనాటి బలమైన రాజ వంశీయులతో సంబంధ భాందవ్యాలు నెరపి పూర్తి దక్షిణాపథాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. 
కొడిగట్టిన వైదికధర్మాన్ని పునరుద్ధరణ చేశారు. ఎన్నో దానధర్మాలు చేసి, వేదధర్మాన్ని పునః ప్రతిష్ఠించారు. అశ్వమేథ, వాజపేయ యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోయారు. 
11 తామ్ర, రెండు శిలా శాసనాలతో తమ  జయయాత్రను ప్రకటించారు. దాదాపు మూడు వందల సంవత్సరాలు(క్రీ.శ.358 నుండి 624) పరిపాలించి ధర్మం నిలిపారు. ప్రజారంజక పరిపాలకులుగా పేరు తెచ్చుకున్నారు. విద్యను వ్యాప్తి చేసారు. సంస్కృతం పోషించారు. విదేశీయులతో వర్తకము చేశారు. నాణ్యాలు ముద్రించారు. శైవ దేవాలయాలను విరివిగా కట్టించారు. కళలను పోషించారు. ఆంధ్రదేశములోని గుహాలయాలు వీరు నిర్మించినవే. 
బ్రాహ్మణ రాజ వంశీయులైన విష్ణుకుండినలలో రెండవ మాధవ వర్మ పాలన స్వర్ణయుగంగా పేరుపొందింది. ఈయనకు ఇద్దరు భార్యలు. ఈయన చిన్నభార్య వాకాటక రాణి. విశాల వాకాట సామ్రజ్యము మాధవవర్మ ఏలుబడిలోకి రావటానికి కారణము ఈమెతో వివాహమే. 
ఆయన తదనంతరం పట్టపురాణి కుమారుడైన దేవవర్మ రాజ్యానికి వచ్చాడు. అతను ప్రమాదవశాత్తూ రెండేళ్ళలో మరణించాడు. తదనంతరం దేవవర్మ కుమారుడు మాధవవర్మ ।।। రాజ్యానికి వచ్చాడు. 
ఇతను బలవంతుడు. ఇతను విజయవాటిక (బెజవాడ) రాజధానిగా పరిపాలన సాగించాడు. ఇతని ఏలుబడిలో విష్ణుకుండిన చరిత్ర మలుపు తిరిగినది. రెండవమాధవవర్మకు,చిన్నభార్య వాకాటక మహారాణి కలిగిన కుమారుడు విక్రమేంద్రవర్మ. ఈయన రాజ్యానికి యువరాజు. మాధవవర్మ||| , విక్రమేంద్రవర్మల సంబంధ  బాంధవ్యాలు ఎంతో ముఖ్యమైనవి. చరిత్రలో వీరి మధ్య నడిచిన కథ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. అదే ఈ నవలకు ముఖ్య భూమిక.

***

ప్రస్థానం 

    శరదృతువుల కాలము. ప్రాగ్దిశలో భానుడుదయించి కొంత సమయమైనట్లు ఉంది. ఆకాశంలో నీరులేని శరత్కాల మబ్బులు హంసలలా సాగుతున్నాయు. భానుడి అరుణిమను అరువు తెచ్చుకుని కెందాయిరంగు పూసుకున్న కన్యక బుగ్గలలా వున్నాయవి. భావనారాయణునికి  మేలుకొలుపు కు ఇచ్చే హారతిలా అనిపిస్తున్నాయి. శరత్తుకాలము విష్ణువు నిద్రలేచే సమయము కదా మరి. 
దారి ప్రక్కన ఉన్న కొలనులలో నీరు తేరుకుంది. స్వచ్చమైన ఆ నీటిలో వికసించిన పద్మాలు లక్ష్మి నివాసమై మురుస్తున్నాయి. పిట్టలు తమ ఆహారముకై  గూడ్లు వదులుతున్నాయి. ఆకాశంలో మబ్బులతో పోటి పడుతూ ఎగురుతున్నాయి.
హేమంతం రాకపోయినా చెట్ట మధ్య రాత్రంతా నిర్లజ్జగా విహరించిన పొగమంచు ఉదయమే సిగ్గుపడి తప్పకుంటున్న విటుడివలే వదిలిపోతోంది. 

 ముచుకుండా(మూసీ) నది ప్రవాహము అధికంగానే ఉంది. అంతకు క్రితం ఋుతువులో పడిన వానలకు నది పూర్తిగా నిండింది. ఆ నది గట్టున తీరు తీరునా విస్తరించి ఉన్న ఇంద్రపాల ఘటికాపురిలో వేదఘోష సుమధురంగా వినవస్తోంది.  రామలింగేశ్వరుని దేవాలయం నుంచి రుద్రం నమకం లయబద్ధంగా వినవస్తుంటే అక్కడి ప్రకృతి కూడా తపమాచరిస్తోంది. 

ఆ రహదారంతా వ్యాపించిన మర్రి, వేప, రాగి చెట్లు వేద ఘోష్ఠిని దర్శిస్తున్నాయి.  
ఆ  సమయాన ఆ విశాలమైన రహదారిపై ఒక అశ్వం వేగంగా వస్తోంది. అది ఇంద్రఘటికాపురి ఆవరణ లోకి వచ్చేసరికే వేగం నెమ్మదించింది. అశ్వికుడు గుర్రం మెడ మీద చిన్నగా తట్టాడు. యజమాని మనసెరిగి ఆ గుర్రం కుదిరినంత నెమ్మదిగా అడుగులు వెయ్యటం మొదలెట్టింది.
ఆ దారంట అలా వారు ఒక అర మైలు వెళ్ళిన తరువాత వారికి బారులుగా నిర్మించిన పర్ణశాలలు కనిపించాయి. కొన్ని విశాలమైనవి, కొన్ని యాగశాలలు, కొన్ని భోజన వసతుల కోసము, కొన్ని శిక్షణ తరగతులు. ఆ మధ్యన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుని దేవాలయం. దేవాలయ ఉత్తర ద్వారం ముచుకుండా నది వైపుకు ఉంది. 
వాటికి కొద్దిగా ఆవలకు వెడితే దూరంగా చిన్న పర్ణశాల చుట్టూ పూల మొక్కల నడుమ కనిపించింది. 
అది అన్నింటికి కొద్దిగా దూరంగా ఉంది. ఆ ఘటికాపురిలో వాతావరం ఆహ్లదకరంగా ఉంది. 

ఎంతో సురక్షితమైనదనిపించినదో మరి లేడి పిల్లలు అటు ఇటు పరిగెడుతూ, కుందేటి పిల్లలు పొదలలో దాకుంటూ కణ్వమౌని ఆశ్రమాన్ని తలపిస్తున్నట్లాగా ఉంది. ఎన్నో రకాలు ఫల వృక్షాలతో, పక్వానికొచ్చిన పళ్లతో మధురమైన సువాసనలు వ్యాపించి ఉన్నాయి. 
అశ్వికుడు గుర్రం దిగి గుర్రాని చెట్ల వద్ద నిలిపి చిన్న పర్ణశాల సమీపించాడు. ఆ పర్ణశాల ముందర ఒక చిన్న పిల్లవాడు కూర్చొని పన్నాలు వల్లె వేస్తున్నాడు. 
అశ్వికుడు ఆ బాలకుని సమీపించి 

“బాలకా! గురుదేవులు లోపల ఉన్నారా?” అని ప్రశ్నించాడు. 
ఆ పిల్లవాడు తల యెత్తి అశ్వికుని చూస్తూ “నా పేరు బాలకా కాదు ముకుందుడు. వారు అనుష్టానంలో ఉన్నారు. ఇంకో గంట పడుతుంది. ఏమైనా కావాలంటే అందించటానికి నాకు మాత్రమే అనుజ్ఞ ఉంది” అన్నాడు కొద్దిగా అతిశయంతో. గురుదేవులు తనను మాత్రమే పిలుస్తాడని అతని గొంతులో  కొంత గర్వం తొణికిసలాడుతోంది. 

అశ్వికుడు చిరునవ్వుతో “సంతోషం ముకుందా! మరి మా రాక వారికి తెలియపర్చాలి నీవు!” అన్నాడు కొద్దిగా బ్రతిమిలాడే ధోరణిలో. 

“మీరు ఎదురుచూడవలసినదే. వారు పిలిచేదాకా నేనైనా వెళ్ళను మరి!” అన్నాడు 

“పిలిచినప్పుడే వారికి తెలియపర్చు నాయనా. నీకు కాస్త పుణ్యముంటుంది…” అంటూ వస్తున్న నవ్వును దాచుకున్నాడు అశ్వికుడు. 
అతను చాలా దూరం నుంచి ప్రయాణం చేశాడని మట్టి కొట్టుకున్న బట్టలు చెబుతున్నాయి. మొఖంలో అలసట ఉన్నా కళ్ళు చురుకుగా ఉన్నాయి. 

“సరే. ఎవరని చెప్పాలి అశ్వికా?” అడిగాడు బాలకుడు బేరానికొచ్చి. 

“శ్రీ పర్వతస్వామి దాసుడు’ కారుడు దర్శనము వాంచిస్తున్నాడని చెప్పమ్మా!” చెప్పాడు అతను. 

ఆ పిల్లవాడు లోపలికెళ్ళాడు. కొద్ది సేపటికి బయటకొచ్చి, “మీరు స్నానపాదాలు ముగించికు రమ్మని గురుదేవుల ఆజ్ఞ. రండి నాతో…” అంటూ కనపడుతున్న ఆ గుడిసెల వైపు నడిచాడు. 

అక్కడ చాలా మంది గుంపులు గుంపులుగా వేదాలు వల్లిస్తున్నారు. 
రామలింగేశ్వస్వామికి అభిషేకం అయినట్లుంది. గంటలు హారతులు వినపడుతున్నాయి. 
“శ్రీ మంగళం…శివాయ మంగళం… మంగళం.. ఓం నమఃశివాయ గురవే మంగళం…” అంటూ పంచాక్షరీ మంత్రముతో అనుసంధాన పరిచిన మంగళం మిన్నుముట్టుతోంది. 

ఎదురుగా కనపడుతున్న వాళ్ళలో ఒకరిని పిలిచి 

“గురుదేవుల ఆజ్ఞ. అతిథికి కావలసినవి చూడమని” అంటూ అప్పగించి ముకుందుడు తుర్రున గురుదేవుల పర్ణశాల వైపుకు పరుగెత్తాడు. 

ఆ వచ్చినతను అశ్వికుని తీసుకొని ఒక పర్ణశాల వైపు నడిచాడు.
ఆ పర్ణశాల ముచుకుండా నది వడ్డునే ఉంది. 

“అయ్యా! మీరు ఇక్కడ మీ స్నానము కానిచ్చి దేవళం వైపుకు రండి. పర్ణశాలలో పండ్లు ఉన్నవి. మీరు ఆహారముగా స్వీకరించవచ్చు. మీ అశ్వము కూడా ఇక్కడ క్షేమంగా ఉంటుంది. మీకేమైనా కావాలంటే ఒక్కసారి ఎలుగెత్తి “కేశవా!” అని పిలవండి. మీ ముందు ఉంటాను. అంత వరకు సెలవు మరి!” అంటూ వచ్చిన దారిన వెనకకు నడిచాడు. 

అశ్వికుడు గుర్రాన్ని నీటి వద్దకు తీసుకుపోయాడు. అతడు గుర్రాన్ని అమిత ప్రేమగా చూసుకుంటాడు. 

దాని పేర వలుక. 

“వలుకా! కావలసినంత నీరు త్రాగు. ఆ పచ్చిక తిను. నీకు ఈ పూట విశ్రాంతి. ఆనక మనము తిరిగి ప్రయాణించ వలసి ఉంటుంది…” అన్నాడు. 

దానికర్థమయ్యింది యజమాని మాట. తల ఊపి నీరు త్రాగటం మొదలెట్టింది. 
అతనూ నీటి లోకి దిగి తనివితీరా స్నానమాడి ఒడ్డుకు వచ్చి బట్టలు చుట్టుకున్నాడు. గుర్రాన్ని తీసుకుని తనకిచ్చిన పర్ణశాల వద్ద ఒక చెట్టుకు కట్టి లోనికి నడిచాడు. స్నానము తరువాత అలసటగా అనిపించింది. అక్కడ ఉన్న కదళీఫలం తిని నీరు త్రాగాడు. దేవళం వైపు నడిచాడు. 
స్ఫురద్రూపి అయిన ఆ యువకుడు ఎత్తుగా ఉండి నడకలో రాజసంతో కూడి ఉన్నాడు. చురుకైన కన్నులు సూటి ముక్కు. చామనచాయ. పాతిక వత్సరాలవాడు. కండలు తిరిగిన శరీరముతో, నడుముకు కత్తితో చూడగానే ఎవరో మారు వేషపు రాజకుమారులా ఉన్నాడు. 

రామలింగేశ్వరాలయంలో ప్రవేశించి భక్తితో ఈశ్వరునికి నమస్కరించాడు. నుదట విభూది ధరించి అర్చకస్వామి ఇచ్చిన తీర్థం గ్రహించి నెమ్మదిగా గురుదేవుల పర్ణశాల వైపుగా నడిచాడు. 
అతనికి అంతకు పూర్వము ఉన్న ముకుందుడు కనపడలేదు. పర్ణశాల వద్దకు నడిచి నిలబడ్డాడు. 
ఇంతలో లోపల నుంచి గురుదేవులు బయటకు వస్తూ కనపడ్డారు. 

 “విష్ణుకుండిన రాజపీఠ భృత్యుడు, శ్రీపర్వతస్వామి దాసుడు, గురుదేవులు బ్రహ్మశ్రీ పరమేశ్వరశాస్త్రుల శిష్యపరమాణువు  శ్రీకరుడు వందనములు సమర్పిస్తున్నాడు!” అంటూ పూర్తి దండ ప్రణామమాచరించాడు. 

“రా!రా ! శ్రీకరా! నీ కోసము పిలుపంపాలని బయలుదేరాను…” అన్నారు గురుదేవులు ఆదరంగా.

“గురుదేవా ధన్యోస్మి!” అంటూ శ్రీకరుడు ఆయనతోపాటు లోపలికి నడిచాడు. 

***

ఆనాటి కాలములో విద్యాలయాలలో వేదం, ఉపనిషత్తుల బోధ దేశమంతటా విరివిరిగా సాగేది. వేదానికి, వైదిక ధర్మానికి అగ్రతాంబూలం లభించేది. విద్యాలయాలను దేశమంతటా నెలకొల్పారు రాజులు. వాటిని ఘటికలని, ఘటికాపురి అని పిలిచేవారు. ఘటికాపురి స్వయంసంప్రత్తి కలిగి ఉండేది. 

వేదగోష్ఠితో తెలుగునేల పులకరించిపోయేది.  కీసరము(కీసరగుట్టు), . శ్రీపర్వతం(శ్రీశైల), త్రికూటము(కొట్టప్పకొండ), అమరావతి, విజయవాటికలో మహాదేవునికి ఉత్సవాలు సురలోకానికి మించి జరిగేవి. తెలుగునేల పులకరించిపోయేది 

ఇంద్రఘటికాపురికి పరమేశ్వరశాస్త్రి మహామహోపాధ్యాయులు. 

వారు స్వయంగా మహేశ్వర అంశగా పేరు. ఎనుబై ఏళ్ళ మహానుభావుడు. దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉండి నుదుట విబూధిరేకలతో, శరీరము మీద ధరించిన విబూధితో, మెడలో రుద్రాక్షలతో, స్ఫటికమాలతో ప్రకాశవంతమైన తేజోమూర్తి. సంసారమంటని బ్రహ్మచారి. జీవితాన్ని వేదాధ్యయనానికి అంకితంచేసిన వేదమూర్తి. ఉపనిషత్తులు, తర్కము, మీమాంస, వ్యాకరణము, ఛందస్సు ఆయనకు కరతలామకము. జ్యోతిష్యములో ఆయనను మించినవారులేరు. ముఖము చూసే వారు వచ్చిన వారి త్రికాలాలు చెప్పగలరు. ఆయుర్వేదములో అపర ధన్వంతరి. వారి చేయి తగిలితే ఎటువంటి రోగమైనా తిరిగి రాదని ఘనత వహించారు. ఆ ఘటికావనిలో వారి ప్రత్యేక మూలికల వనం కూడా ఉన్నది. మహారాజు మాధవర్మ మొదలు ఎందరో ఆయన వద్ద శిష్యరికం చేసినవారే.

లోపలికి వచ్చిన గురుదేవులు, శ్రీకరుడు  అక్కడి తుంగ చాపలమీద కూర్చున్నారు. 

“ఎక్కడ్నుంచి రాక కారా?” అడిగారు గురుదేవులు . శ్రీకరవర్మ కురుచ నామము ‘కారుడు’.

“శ్రీపర్వత స్వామిని సేవించి ఇటు వస్తున్నా గురుదేవా!” చెప్పాడు కారుడు.

కారుడు మాధవవర్మ అంతరంగికుడు. ప్రధాన గుఢాచారి. దేశములో జరిగేవి ఏపూటకాపూట సమీకరిస్తూ ఉంటాడు. అనుమానము వస్తే తనే స్వయంగా వెళ్ళి చూసుకుంటాడు. గురుదేవులకు ఆ సంగతి తెలుసు. 

“నీ శ్రీపర్వత యాత్రలో విశేషమేమిటో?” అన్నారు గురువుగారు.

“మహారాజు అనుంగు పుత్రుడు మహాదేవవర్మ శ్రీపర్వత స్వామి దర్శనం వాంఛించాడు. నేను వారితో వెళ్ళి తిరిగి వస్తూ మీ దర్శనము కోరి ఇటు వచ్చాను గురుదేవా!” అన్నాడు వినయంగా. 

“ పల్లవుల బెడద తగ్గినదని నీ ఉద్దేశ్యమా?” 

“ప్రస్తుతానికి అది లేదనే నా అభిప్రాయము…” అన్నాడు కారుడు. 

“అయినా మన జాగ్రత్తలో మనముండాలి. సదా అప్రమత్తంగా ఉండాలి!” హెచ్చరికగా చెప్పారు గురుదేవులు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

17 thoughts on “విజయవాటిక-1 (చారిత్రాత్మక నవల) (ఈ నెల నుండి ప్రారంభం)”

    1. Thanks for the feedback Ramki. Keeping reading till end. I appreciate your time and feedback. It will sure for encourage me to write more.

  1. మొదలు పెట్టటమే చాలా బాగా మొదలుపెట్టావు . చారిత్రిక రచనలు రాయటం కత్తి మీద సాము లాంటిదే .అసలు చరిత్రను మార్చకుండా కదని నడిపించడంలో చాలా నేర్పుని ప్రదర్శిస్తావు అని ఆసిస్తూ
    సత్య లక్ష్మి

    1. అత్తా అనేక ధన్యవాదాలు. చదవటమే కాక దీని గురించి ఇక్కడ కామెంటులో నీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినందుకు. ❤️❤️

  2. చాలా మంచి ప్రయత్నం సంధ్యగారూ. నాకు చారిత్రిక నవలలు ఇష్టం. అటు చరిత్రా ఇటు నాటకీయతా కూడా ఉంటాయి. రచయితల సృజనాత్మకత ఈ వాస్తవకథలలో కనిపించాలి. చాలా శ్రమతో కూడుకున్న పని. మీకృషికి అభినందనలు.
    ఎప్పుడో తీరిగ్గా చదువుతాను.

    1. మాలతిగారు వందనములు. ధైర్యము చేసి మొదలుపెట్టాను. కథను మొదలుపెట్టాక అదే నడిపిస్తున్నది. చరిత్ర ఉన్నది ఎటు నడవాలో చూపుతూ. ఈ ప్రయత్నము సఫలీకృతమవటానికి మీ వంటి పూజ్యల దీవెనలు నాకు అవసరము.

  3. విజయ వాటిక చారిత్రక నవల ఎత్తుగడ బాగుంది. విష్ణుకుండినుల గురించి ఇంత మటుకు నవలలు చదవలేదు.ఈ చారిత్రక నేపధ్యం ఉన్న నవలలో నేను చదివిన వాటిలో ఇది మొదటిది. రచనా విధానం చదివించేలా ఉంది . నాటి కాలాన్ని ప్రతిబింబించేలా వర్ణించిన విధానం బాగుంది. తర్వాత భాగాలు కూడా ఇదే విధంగా ఉత్కంఠ కలిగించేవిగా వుంటాయని అనుకుంటున్నా.

    1. నాకు బలము బలగము మీరందరూ. అదే ధైర్యముతో మొదలెట్టాను.

    1. కృతజ్ఞతలు. మీ పేరు కూడా పెడితే మరింత బావుంటుంది.

  4. I am reading historical series for the first time. “Naandi” gave a brief background of the story, which helped reader to understand the time period of the story. Lineage hierarchy explains the development, their nature and the relationship between the characters. This section prepares reader to dive into the story, it is like the prelude for a song.
    The story starts in “Prasthanam”. The beginning is like a movie showing the current scenario before the actual characters enter. The description and analogy takes the reader to that place. The reader can visualize and becomes a character in the story. Now the screenplay begins, characters enter.
    The language is refreshing. It reminds childhood days, who ever took Telugu or Sanskrit as a subject, will remember their teachers as well.
    Mention of the current name, for example,
    — vijayavatika is now called bejawada
    — muchukunda is now called musi nadi
    helps reader to relates to understand geography where the current story could have happened.
    Overall, the story, language used, description is refreshing.

    I am looking forward for next part.

    1. Thats so detail message. Inam so greatful for the encouragement you are giving. This will surefor helps me to write future episodes with more enthusiasm. Appreciate your time dear

  5. విష్ణు కుండినుల నాటి పాలన అప్పటి విశేషములు ఆసక్తి కరముగా మొదలుపెట్టారు. తెలుసుకోతగిన చారిత్రక నేపథ్యం.. తరువాతి భాగాలకొరకు కుతూహలంగా ఉంది. అభినందనలు.

    1. కృతజ్ఞతలు. మీ పేరు కూడా పెడితే మరింత సంతోషము. ముందు ముందు భాగాలకు మీ స్పందన తెలియపరుస్తారని ఆశిస్తాను.

  6. చారిత్రక నవలలు రాయడం అత్యంత సంక్లిష్టమైన సాహితీ ప్రక్రియ. తెలుగు లో నా మిత్రుడు, పూజ్యుడు అయిన ముదిగొండ వారు తప్పితే ఎవరూ లేరు. ఆమాట కోస్తే ఉత్తర దేశం లో ఉన్న చాలా మంది చరిత్ర కారులు సత్యాన్ని తప్పుదోవ పట్టించిన వారే. ఇలాంటి విపత్కర పరిస్థితులలో మరుగున పడిన సత్యాలను బయటికి తీస్తూ, చారిత్రక నవల రావడం అనేది గొప్ప మలుపు. అందుకు సంధ్య గారు పూనుకోవడం అనేది గొప్ప ఆనందదాయకమైన విషయం. వీరికి నా అభినందనలు.

    1. నమస్కారము. మీరు చూపిన ఆసక్తితో ఎంతో ఉత్సాహము కలిగి ముందుభాగాలను ఆసక్తితో రాయగలను. మీ సమయానికి ధన్యవాదములు. కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published.