షర్మిలాం “తరంగం”

-షర్మిల కోనేరు 

దేముడైన రాముడు 

అందాల రాముడు ! ఇనకులాద్రి సోముడు ఎందువలన దేముడు !!

ఈ పాట నాకు ఎందుకో ఇష్టం .

అమ్మో ! ఈ మధ్య కాలంలో రాముడిని తలవాలన్నా భయమేస్తోంది !

నా మీద ఏం హిందూత్వ ముద్ర పడుతుందోనని .

రామాయణ విషవృక్షం పదో తరగతిలోనే చదివేశానంటే నేను అంతభక్తురాలిని కాదని అర్ధమేగా !

పూజలు చెయ్యను గానీ దేముడ్ని నమ్ముతాను.

రాముడైనా జీసస్ అయినా దేముడు అనే ఒక శక్తి మాత్రం  వుందనుకుంటాను.

ఒక్కోసారి ముందు దేన్నో తన్నుకుని పడబోతే ఎవరో పడిపోకుండాపట్టుకుని ఆపినట్టనిపిస్తుంది . 

మన బుర్ర ఎంత గొప్పదంటే మన సర్వ అవయవాలని హెచ్చరించిరాబోయే ప్రమాదాన్ని ఆపుతుంది .

కానీ అన్నమయ్య వంటి భక్తుడు “పొడగంటిమయ్యా నిన్నుపురుషోత్తమా ! అనే కీర్తనలో 

మమ్ము తావై రక్షించే ధరణీ ధరా !! ” అని సాక్షాత్తూ ఆ వెంకటేశుడేమనం నిల్చున్న ఆ తావు తానై కాపాడుతాడని నమ్ముతాడు .

మన మెదడో … దేముడో …ఏదో శక్తి మనం గోతిలో పడకుండాకాపాడిందనేది నిజం !

అది దేముడే అని నమ్మి మనకి నిరంతరం ఒక శక్తి ఆలంబనగానిలుస్తుందని అనుకోవడమే ఒక నమ్మకం,

నమ్మకం మూఢత్వంగా మారనంత వరకూ ఇబ్బంది లేదు .

కానీ నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారడం అది విపరీతాలకు దారితీయడం తప్పదు.

అందుకే శాస్త్రీయంగా ఆలోచించడం శ్రేయస్కరం.

ఇంతకీ రాముడి గురించి చెప్పాను కదా !

నాయనమ్మ పక్కలో పడుకున్నప్పుడు చెప్పిన 

రామాయణం నుంచి బాపూ తీసిన సీతాకల్యాణం వరకూ చూపించినప్రభావమేమో మరి !రాముడు గుండెల్లో వద్దన్నా కొలువయ్యాడు.

పడుకునేటప్పుడు శ్రద్ధాకి నాతో కధ చెప్పించుకునే అలవాటు.

ఎన్నని కధలు చెప్పను…

మొన్నోరోజు శబరి తాను ఎంగిలి చేసిన పళ్ళను రాముడికి పెట్టిన కధచెప్పాను .

ఒక ముదుసలి కొరికి ఇచ్చిన పళ్ళను అసహ్యించుకోకుండా అందులోప్రేమనే  చూసి వాటిని ఆరగించాడు రాముడు !

ఆ ప్రేమతత్వమే రాముడనే మనిషిని దేముడ్ని చేసిందేమోఅనిపించింది ఆ కధ విశ్లేషించుకుంటే …

గురువుల పట్ల వినయం , పితృ  వాక్పరిపాలన , అన్నదమ్ములతో  సఖ్యత, మంచి స్నేహం వల్ల పొందగలిగే లాభాలు ఇవన్నీ రాముడికధలుగా చెప్పొచ్చేమో అనిపించింది.

కానీ సీతని అడవుల పాల్జేసిన కధ చెప్తే మాత్రం రాముడ్నైనాదేముడినైనా శ్రద్ధా క్షమించదు!

ఇక్కడ కొందరు పిల్లలు వాళ్ళ తాత, నాన్నమ్మలతో కూడాఅంటీముట్టనట్టు వుండడం గమనించాను.

అమెరికాలోనే పుట్టి పెరిగిన నా మనవరాలికి శబరి అనే ముదుసలివడలిన చేతుల్లోని ఎంగిలి పళ్ళను ఆరగించి ఆమె తల నిమిరినదీమతల్లిని చేసిన రాముడి కధ చెప్పడం అవసరమే  అనిపించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.