ఆమె కవితలు

-పాలపర్తి ఇంద్రాణి

  1.  

ఆమె ఉల్లాసాన్ని
ఉడుపులుగా
ధరించి వచ్చింది
వారు ఆమెను
బాధించలేక పోయారు

ఆమె వైరాగ్యాన్ని
చేత పట్టుకు వచ్చింది
వారు ఆమెను
బంధించలేక పోయారు.

ఆమె వినయాన్ని
వెంట పెట్టుకు వచ్చింది
వారు ఆమెను
వేధించలేక పోయారు.

ఆమె జీవితాన్ని
తపస్సుగా మార్చుకుంది
వారు మూతులు
తిప్పుతూ
తొలగిపోయారు.

2. 

నేను 
వివేకము 
విచక్షణ ఉన్న

ఈశ్వర సృష్టిత
ప్రాణిని
అని ప్రకటించావు
నువ్వు
 
అది విని
టింకర వంకర
నాగుపాములు
నంగిరి నంగిరి
వానపాములు
హిహ్హిహీ
అని నవ్వి
 
హింగిరి హింగిరిగా
నీ వెంట పడ్డాయి
అప్పుడు నువ్వు
వంటిట్లో దూరి
చెంచాల వెనుక
మిల్లి గరిటెల వెనుక
దాక్కున్నావు
 
నీ అమ్మ
అమ్మమ్మ
వాళ్ళ అమ్మ
అందరూ అక్కడే
నక్కి ఉండడం చూసి
ఆశ్చర్య పడ్డావు
 
అంతలో,
నువ్వు ఎక్కడ
దాక్కున్నావో
కనిపెట్టేసిన
నాగు పాములు
వాన పాములు
వాళ్ళందరినీ
పొగిడినట్టే
నిన్నూ
వంటింటి కుందేలు
అని వేనోళ్ళ పొగిడాయి.
 
3.

కామాన్ని జయించలేని వాడు

క్రోథాన్ని జయించలేని వాడు
లోభాన్ని జయించలేని వాడు
 
స్త్రీని చూడగానే,
హిహ్హీ,ఆడది!
అని నవ్వారు.
 
ఏది అవసరమో
అదే వినడం అన్న
విద్య నేర్చిన
ఆ మోహనమూర్తి
 
క్షణమైనా
వెనుతిరగక,
వెలుగు విత్తనాలను
భూమి గర్భంలో
ఒక్కటొక్కటిగా
పాతి పెడుతూ
స్వర్గం వైపుకు
సాగిపోయింది
ఆమె

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.