ఒక భార్గవి – కొన్ని రాగాలు -18

రాగాల సిగలోన సిరిమల్లి- శివరంజని

-భార్గవి

శివం అంటే శుభప్రదమైన ,పవిత్రమైన అని అర్థమట.శివ రంజని అంటే పవిత్రంగా శుభప్రదంగా రంజింపచేసేది అనుకుంటున్నా.

శివరంజని రాగం వింటుంటే మనసంతా ఒకరకమైన వేదన,ఆర్తీ కమ్ముకుంటుంది.ఎక్కువగా విషాదాన్నీ,దుఃఖాన్నీ ,భక్తినీ ,కరుణ నీ చేరవేసే రాగం .

 ఒక మంచి సంగీత దర్శకుని బాణీలో ,చక్కటి గాయకుల నోట  ఈ రాగం వింటుంటే హృదయంలోని ఉదాసీనత వేళ్లతో సహా పెకలించుకుని దుఃఖపు కెరళ్లు వర్షిస్తాయి కళ్లు.

మధ్యరాత్రిలో పాడదగిన రాగంగా పరిగణిస్తారు.ఆరోహణ అవరోహణలలో అయిదే స్వరాలుంటాయి —సరిగ పదస

సదపగరిస

అందుకే పెంటటోనిక్ స్కేల్ కి చెందింది అంటారు.కర్ణాటక సంగీతంలో దీనిని 22 వ మేళకర్త అయిన ఖరహర ప్రియ నుండీ జన్యరాగం గా భావిస్తారు.హిందుస్థానీలో కాఫీ థాట్ కి చెందిన రాగం అంటారు.

ఆల్ ఇండియా రేడియోలో పొద్దున్నే వినపడే సిగ్నేచర్ ట్యూన్ వినపడేది ఈ రాగంలోనే!

కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులు అని పిలిచే త్యాగరాజు,శ్యామశాస్త్రి,ముత్తుస్వామి దీక్షతర్ ఈ రాగంలో కృతులేవీ చేసినట్టు కనపడలేదు.

చాలా రాగమాలికల్లో  శివరంజని ఖండికలు వినపడతాయి .యం.యస్ సుబ్బలక్ష్మి “కురై ఓండ్రు మిల్లై” అని మొదలయ్యే రాగమాలిక శివరంజని రాగం తోనే మొదలవుతుంది.

సినిమా పాటల విషయాని కొస్తే హిందీ,తెలుగు సినిమాలలో చాలా పాటలకి ఈ రాగం ఆధారం

తెలుగు సినిమాల్లో ఈ శివరంజని రాగంలో అత్యంత అందంగా మనసును కదిలించేలా.బాణీలు కట్టిన సంగీత దర్శకులలో రమేష్ నాయుడు పేరే మొదట చెప్పాలి.

ఆయన “తూర్పూ-పడమర” సినిమాలో”శివరంజనీ నవరాగిణీ”అని బాలు పాడిన పాటకి కట్టిన బాణీ అత్యుత్తమమైనది.సి.నా.రె రచనకి పూర్తి న్యాయం జరిగింది.

అసలు ఈ సినిమా “అపూర్వ రాగంగళ్ “అనే అరవ సినిమాకి రీమేక్ .ఆ అరవ సినిమాకి సంగీతం సమకూర్చిన యం.యస్ .విశ్వనాథన్ ,మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు కనిపెట్టిన కేవలంమూడే స్వరాలతో కూడిన “మహతి” అనే రాగంలో “అతిశయ రాగం ఆనంద రాగం” అని జేసుదాస్ చేత పాడించారు.తెలుగులో అదే పాటను యథాతథంగా తీసుకుందామన్న నిర్మాత దర్శకులను రమేష్ నాయుడు  ఒప్పించి ఈ “శివరంజనీ”పాటకు బాణీ కట్టి విజయవంతం చేశారు.

నేను మొట్టమొదట ఈ పాట విన్నప్పుడు కదిలిపోయాను “ఏవిటీ ఈ పాట ఇంత గొప్పగా వుంది మనసును పట్టి కుదిపేస్తోంది”అనుకున్నా,పాట వింటుండగానే నాకు తెలియకుండానే కళ్లల్లో నీళ్లూరి పోయాయి.

ఈ పాట సూపర్ హిట్టయ్యాక -“శివరంజని” అనే పేరుతోనే సినిమా తీసిన దాసరి నారాయణ రావు ,అదే రాగంలో కోరి “అభినవ తారవో నా అభిమాన తారవో -అనే పాట చేయించుకున్నారు రమేష్ నాయుడు చేత.

దాసరి గారే తీసిన -“మేఘసందేశం “అనే సినిమా అనేక మంది ప్రశంసలందుకుంది .అందులో పాటలన్నీ చాలా బాగుంటాయి ,హిట్టయ్యాయి కూడా.”ఆకాశ దేశాన ఆషాఢమాసాన” అని జేసుదాస్ పాడే పాటకి బాణీ కట్టడానికి ,రమేష్ నాయుడు  శివరంజని రాగాన్ని యెన్నుకోవడానికి కారణం బహుశా ఆరాగంలో పలికే ఆర్తీ,విరహమూ అనుకుంటా.

అక్కినేని నాగేశ్వర రావు నటించిన “దేవదాసు” యెంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు,ఈ నాటికీ “దేవదాసు” తిరుగులేని నటనకీ, సంగీతానికీ  మంచి ఉదాహరణ .అందులో “అంతా భ్రాంతి యేనా జీవితానా వెలుగింతేనా “అని కె.రాణి పాడే పాటలో నైరాశ్యం యెంత బాగా పలికిందో ,సంగీత దర్శకుడు సి.ఆర్ సుబ్బురామన్ ఈ రాగాన్ని అందుకే యెన్నుకుని వుండవచ్చు.

సంగీత దర్శకుడుగా ఘంటసాల వెంకటేశ్వర రావు కొన్ని ప్రయోగాలు కూడా చేయడం విశేషం,సాధారణంగా విషాదాన్ని సూచించడానికి వాడే శివరంజని రాగంలో హుషారొలికించే పాట చేయడం ఆయనకే సాధ్యం–కావాలంటే చూడండి “బందిపోటు” సినిమాలో ఆయనే పాడిన “వగలరాణివి నీవే సొగసు కాడను నేనే” అనే పాట శివరంజనిలోనే వున్నా యెంత హుషారుగా వుంటుందో!

మళ్లీ ఆయన చేసిన “లవకుశ” లోని “శ్రీరాముని చరితమునూ తెలిపెదమమ్మా”, చిరంజీవులు సినిమా లోని “కనుపాప కరవైన కనులెందుకో” యెంతో విషాదాన్ని ఒలికిస్తాయి విచిత్రంగా లేదూ!

రమేష్ నాయుడు తర్వాత శివరంజని రాగంలో ఎక్కువ పాటలు ఛేసిన దర్శకుడు కె.వి.మహదేవన్ .

ఆయనకు యెంతో పేరు తీసుకొచ్చి ఆయన పేరునే “మామ మహదేవన్ “గా మార్చిన పాట “మంచి మనసులు “లోని “మామా మామా మామా యేమే యేమే భామ”కి ఈ రాగమే ఆధారం.ఇదే పాట ఈ సినిమాకి మాతృక అయిన “కుంకుమం” లో కూడా వుంది,అందుకే తమిళులు కూడా ఆయన్ను “మామ” అంటారు.

“అంతస్తులు ” సినిమాలో “నినువీడని నీడను నేనే” అని పి.సుశీల పాడిన పాటంటే చిన్నప్పుడు నేను భయపడి చచ్చేదాన్ని ,ఇంత భయపెట్టిన పాట ఇంకోటి లేదు ,ఈ పాటకి కూడా కె.వి.మహదేవనే దర్శకుడు.

“సిరివెన్నెల” సినిమాలో “ఈ గాలి ఈ నేల” అని బాలూ నోట ఆహ్లాదంగా సాగే పాటకి కూడా శివరంజనే ఆధారం అంటే ఆశ్చర్యంగా లేదూ! సంగీతం మహదేవన్ 

“త్రిశూలం” -సినిమాలో –“పెళ్లంటే పందిళ్లు” అని సాగే ఈ పాటకు కూడా అదే రాగం ఆధారం,సంగీత దర్శకుడు కూడా “మామ మహదేవనే”

.”అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచు వోలె” అనే అందమైన పాటను రాసింది “రసరాజు” గారు “అసెంబ్లీ రౌడీ”కోసం దానికి  అంతే అందమైన బాణీ కట్టింది మామ మహదేవన్ ,దాన్ని అతి రమ్యంగా పాడింది జేసుదాస్ ,చిత్ర

“మామయ్య అన్న పిలుపు ” –అనే పాట “ముద్దుల మామయ్య ” సినిమాలో బాలు,సుశీల,శైలజ పాడింది ,రచన వెన్నెలకంటి,—శివరంజని లో చక్కటి ట్యూన్ కట్టింది  మాత్రం మహదేవనే 

చిత్ర నిర్మాత మురారి  గారికి మహదేవన్ అంటే విపరీతమైన ప్రేమా ఇష్టమూనూ ,అందుకే ఆయన చిత్రాలలో చాలావాటికి మహదేవనే సంగీత దర్శకుడు –“జానకి రాముడు”  చిత్రంలోని “నా గొంతు శృతి లోన” అని బాలూ ,చిత్రలు పాడిన ఈ పాటకి శివరంజని రాగంలో యెంత అందమైన వరస కట్టారో చూడండీ మహదేవన్ ,ఈ పాటలన్నీ చూస్తుంటే అర్థమవడంలా మహదేవన్ కి ఈ రాగం అంటే యెంత ఇష్టమో, కారణం బహుశా ఈ రాగంతో ఒక బలమైన ఫీలింగ్ కలగ జేసి,సన్నివేశానికొక గాఢత తీసుకురావచ్చనే ఉద్దేశం అయి వుండ వచ్చు.

తెలుగు చిత్రసీమలో అత్యధిక సంఖ్యలో పాటలు చేసిన సంగీత దర్శకుడు “చక్రవర్తి” అనబడు కొమ్మినేని అప్పారావు .ఆయన “పచ్చని కాపురం ” చిత్రంలో ఈ రాగం ఆధారంగా జేసుదాసు,జానకి లతో పాడించిన “వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా” అనే పాట చాలా బాగుంటుంది.

ఇసైజ్ఞాని గా పేరొందిన ఇళయరాజా “జగదేక వీరుడు -అతిలోక సుందరి” కి చేసిన ప్రతిపాటా హిట్టే ,అయితే అందులో “అబ్బ నీతీయని దెబ్బ” అని వేటూరి కలం నుండీ జారిన గీతానికి ఈయన కట్టిన వరస ప్రేక్షకులను ఉర్రూతలూగించింది,దానికి ఆధారం యేమిటనుకున్నారూ శివరంజనీయే

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన “గీతాంజలి” లో పాటలు మాత్రం తక్కువా? ప్రతిపాటా ఆణిముత్యమే కదా,వాటిలో “ఓ ప్రియా ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా” పాట వింటుంటే ఇళయ రాజా శివరంజనిని  యెంత అందంగా పలికించాడూ అనిపించక మానదు.

ఇంకో పాట ఈ రాగంలో ఇళయ రాజా చేసింది “”అరే యేమయిందీ ఒక మనసుకి రెక్కలొచ్చి యెక్కడికో యెగిరింది” —“ఆరాధన” అనే సినిమా లోది, పాడింది బాలూ,జానకి 

అదీ ఇళయరాజా చేతిలో పలికిన శివరంజని సంగతి

కీరవాణి గారు “అన్నమయ్య “సినిమాకి చేసిన సంగీతం అత్యున్నతమైంది, అందులో “అంతర్యామీ అలసితి సొలసితి “అనే పాట హృదయాన్ని పిండి వేస్తుంది,శివరంజని రాగం తీరే అంత ,సరిగా పలికిస్తే మనసు కరిగి నీరవుతుంది.

ఆయనే ఇదే రాగంలో స్టూడెంట్ నంబర్ వన్ కి చేసిన “ఏమెట్టి చేశాడే ఆబ్రహ్మ ” అనే పాట ,”ఈ అబ్బాయి చాలా మంచోడు “అనే సినిమాలో సునీత,కల్యాణి మాలిక్ లు పాడిన “చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయనీ” అనే పాట కూడా శివరంజని లో చేసిన చక్కని పాటలు.

సత్యం సంగీత దర్శకత్వంలో శివరంజని ఆధారంగా చేసిన రెండు పాటలు చాలా బాగుంటాయి ,అవి “తోట రాముడు” లో బాలు, సుశీల పాడిన “ఓ బంగరు రంగుల చిలకా” అనే పాట,”ఆంధ్ర కేసరి ” సినిమాలో బాలూనే పాడిన “వేదంలా ఘోషించే గోదావరి ,అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి”అనే పాట,అయితే ఈ రెండో పాట ఒక రాగమాలిక

ఇంకా “మజ్ను” సినిమా కోసం లక్ష్మీకాంత్ ప్యారేలాల్ చేసిన “ఇది తొలిరాత్రి కదలని రాత్రి ,నీవునాకు నేను నీకు చెప్పుకున్న కథలరాత్రి” అనే అద్భుతమైన పాటకు కూడా శివరంజనే ఆధారం 

మణిశర్మ–“అందమైన ఆడబొమ్మ”—“సమర సింహారెడ్డి”—-ఉదిత్ నారాయణ,సుజాత

యస్ .హనుమంతరావు—-“ఆరాధన”—-మహ్మద్ రఫీ,జానకి—–“నా మదినిన్ను పిలిచింది గానమై వేణు గానమై” ఇవన్నీ శివరంజని ఆధారంగా చేసినవే.

ఇంకా యెన్నో పాటలున్నాయి అన్నీ చెప్పుకోవడం సాధ్య పడదు ,అయితే కొన్ని హిందీ పాటలు కూడా చూద్దాం

హిందీ చిత్ర సీమలో శంకర్ జైకిషన్ ద్వయానికి శివరంజని రాగ ప్రియులని పేరు,వరసగా వారు చేసిన పాటలు చూడండి మీకే అర్థమవుతుంది.

.”సూరజ్ ” లో లోకప్రియంగా మహ్మద్ రఫీ పాడిన పాట “బహారో ఫూల్ బర్సావో మేరా మెహబూబ్ ఆయాహై”

. “మేరా  నామ్ జోకర్ ” లో ముఖేష్ హృద్యంగా పాడిన “జానే కహా గయే వో దిన్ “

.”బ్రహ్మచారి” –మహ్మద్ రఫీ– “దిల్ కె ఝరోకే మె తుఝ్ కో బిటాకర్ “

కల్యాణ్ జీ ఆనంద్ జీ లు కూడా ఈ రాగంలో మంచి హిట్ పాటలు చేశారు అవి

.”జబ్ జబ్ ఫూల్ ఖిలే “– మహ్మద్ రఫీ—

“పరదేశీయోం సే న అఖియా మిలాన”

.”ముకద్దర్ కా సికందర్ “—-కిశోర్ కుమార్  అద్భుతంగా పాడిన—–“ఓ సాథీరే తెరె బీనా భీ క్యా జీనా”—ఇదే పాట తెలుగులో -“ఓ జాబిలీ వెన్నెలా కాశం “అని చేశారు.

కిషోరే ఆర్ .డి. బర్మన్ దర్శకత్వంలో పాడిన “మెరే నయనా సావన్ భాదోం ఫిర్ భీ మెరా మన్ ప్యాసా”అనే పాట శివరంజని రాగాన్ని అత్యున్నతంగా  వుపయోగించుకున్న పాట .ఇదే పాట లతా కూడా పాడినప్పటికీ కిషోర్ దే బాగున్నట్టుంటుంది నాకు.

.హేమంత్ కుమార్ అద్భుతమైన గాయకుడే కాదు అసమాన సంగీత దర్శకుడు కూడా ,”బీస్ సాల్ బాద్ “సినిమా కోసం  ఆయన లతాచేత పాడించిన “కహీ దీప్ జలే కహిదిల్ ” అనే పాట శివరంజనికి  చిరునామా ,అన్నట్టు మన తెలుగు సినిమా “అంతస్తులు “లోని “నిను వీడని నీడను నేనే”  ఈ పాటకి కాపీ అంటారు.

చివరగా ఒక అపురూపమైన పాటను గురించి చెప్పి ముగిస్తాను.”న కిసీకి ఆంఖ్ క నూర్ హూ” అని మహ్మద్ రఫీ పాడిన పాట వింటుంటే హృదయాలే కాదు రాళ్లు కూడా కరుగుతాయని పిస్తుంది.రచన –ముజ్తర్ ఖైరాబాదీ

చిత్రం—“లాల్ ఖిల్లా”

సంగీత దర్శకుడు—-యస్ .యన్ .త్రిపాఠి.

*****

Please follow and like us:

One thought on “ఒక భార్గవి – కొన్ని రాగాలు -18 రాగాల సిగలోన సిరిమల్లి- శివరంజని”

  1. కొన్ని నిమిషాల పాటు , కాలం అలా time machine లో వెనకు పయనించి ….
    మధుర గీతాల పల్లకిలో మత్తు ఎక్కించే పరిమళాల లో , తేలి యాడే అనుభూతుల పుష్పగుచ్చం చేత పట్టించి …. అలా అలా …..
    పయనించి వచ్చేలా చేశారు . ధన్య వాదాలు

Leave a Reply

Your email address will not be published.